April 22, 2024

ముక్తిక్షేత్రంలో ముక్తిక్షేత్రం

‘ముక్తిక్షేత్రంతో ముక్తిక్షేత్రం’

రచన: రమా శాండిల్య

ఈ మధ్య నేను ‘ముక్తిక్షేత్రము’ అనే పుస్తకం నా కాశీయాత్రల గురించి వ్రాసాను. ఆ పుస్తకాన్ని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో ఒక్కసారి పెట్టి రావాలనే సంకల్పం కలిగింది.

నా మనసులోని మాటను గ్రహించినట్లు నా దగ్గర యోగా నేర్చుకుంటున్న నా శిష్యురాలు ఒకరోజు ప్రొద్దున్నే ఫోన్ చేసింది.

“అమ్మా! నాకు కాశీ చూడాలని ఉంది. అది కూడా మీతో కలిసి చూడాలనుకుంటున్నాను. మీకు వీలవుతుందంటే కార్తీకపౌర్ణమికి కాశీలో ఉండేలా ప్లాన్ చేసుకుందాము.” అని చెప్పింది.

నేను, ‘ఇప్పటి పరిస్థితులలో వీలు కాదేమో!’ అన్నాను.

తను నాలుగురోజులు నాతో ఏమీ మాట్లాడ లేదు. ఉన్నట్లుండి ఒకరోజు ఉదయం ఫోన్ లో, “అమ్మా, మీ పుట్టినరోజు కాశీలో సెలబ్రేట్ చేసుకుందాము మనిద్దరమే!” అని  చెప్పింది.

నేను,  “నా పుట్టినరోజు ఎప్పుడు?” అంటే, తాను నవ్వి, “నాకు తెలుసు కార్తీకమాసంలో వచ్చే మొదటి ఏకాదశి!” అని చెప్పి మళ్లీ తానే, “అందుకే ఏకాదశికి అక్కడుండేటట్లు ఎయిర్ టిక్కెట్ బుక్ చేసేసాను.” అంది.

దానికి నేను, “నా పుట్టినరోజు రెండవ ఏకాదశి నాడు. నా పుట్టినరోజు ఈ రోజు కాదు’ అని చెప్పాను.

“అయ్యో, ఎలా మరి?” అంటే దానికి నేను,

అష్టమి నుండీ పౌర్ణమి వరకు విశ్వనాథుడి గుడిలోనూ, కాశీలోనూ చాలా బావుంటుందనీ, అందుకే  విశ్వనాథుడి పిలుపుగా భావించి, కాశీ వెడదామనీ చెప్పాను.

నవంబర్ పన్నెండవ తారీఖున నేను బెంగుళూర్ నుండి, తాను విశాఖనుండి వారణాసికి చేరేటట్లు ప్లాన్ చేసుకున్నాము. అలాగే గది గురించి కూడా అనుకున్నాము. తాను చాలా చిన్నపిల్ల, కనుక ఎప్పుడూ నేనుండేటట్లు చిన్న గది తీసుకుంటే, తనకు కష్టమని ఆలోచించి మంచి గది కోసం ఆన్లైన్ లో దశాశ్వమేధ ఘాట్ లో చూడమని చెప్పాను.  ‘గోల్డెన్ లాడ్జ్’ లో, సెకండ్ ఫ్లోర్ లో ఏడు వందల ఏభై రూపాయలతో రెండు రోజులకు తీసుకున్నాము.

నవంబర్ పన్నెండున ఉదయం  నేను బెంగుళూర్ నుండి విమానంలో, సంధ్య విశాఖపట్నం నుండి బయలుదేరి, వారణాసి ఎయిర్ పోర్టులో కలిసి, అక్కడినుండి కేబ్ మాట్లాడుకుని, కాశీ విశ్వనాథుడి గుడికి వంద మీటర్ల దూరం లోనూ, అన్నపూర్ణ అన్నసత్రానికి పక్కగుమ్మలోనూ ఉన్న గోల్డెన్ లాడ్జికి చేరుకున్నాము.  గదిలో సామానంతా పెట్టేసుకుని, విశ్వనాథుడి గుడికి బయలుదేరి వెళ్ళాము.

వెళ్ళగానే ధూళీపాదంతో అంటే స్నానం, జపం ఏమీ లేకుండా అలాగే ఉన్నవాళ్ళం ఉన్నట్లు దర్శనం చేసుకోడానికి బయలుదేరాము.

మొత్తం దారంతా మారిపోయింది. రెండుసంవత్సరాల క్రితం నేనుచూసిన కాశీకి, ఇప్పుడు నేను చూస్తున్న ఈ కాశీకి అసలు పోలికే లేదు. అంతగా మారింది.

మొదట సాక్షి గణపతిని దర్శించుకుని, నెమ్మదిగా వేలమందిలో  మేమూ ఒకరిగా బయలుదేరాము. కానీ  విశ్వనాథుడిని దర్శించటం చాలా కష్టమైన పని అనిపించి ‘అక్కడే దర్శనం చేయిస్తాను!’ అని వచ్చిన ఒక వృద్ధుడితో ఆయన చేయి పట్టుకుని, శివుని స్పర్శా దర్శనం,  అభిషేకం చేసుకుని అక్కడ ఇచ్చిన హారతి తీసుకుని, ఆ పెద్దాయన చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టి, వెంటనే అన్నపూర్ణమ్మను దర్శించుకున్నాము.

దీపావళి అమావాస్యనుండి అష్టమి వరకు అమ్మవారికి బంగారు ముఖము, బంగారు చీరతో అలంకరిస్తారు.  భిక్షాపాత్రతో ఉన్న  శివుడికి,  చేతిలో ఉన్న గరిటతో అన్నపూర్ణమ్మ వడ్డిస్తున్న దృశ్యం… అక్కడే చాలా సేపు, మమ్మల్ని కదలకుండా పట్టి ఉంచింది.

రాత్రి పది గంటలకు కొంచెం అలసటతో, ఆకలితో గుడి బయటకొచ్చి, ఏదో ఒక సందులో తిరుగుతూ ఒక దోశ బండి మీద దోశ వేస్తుంటే వేడిగా దోశ తిని, రూమ్ కొచ్చి పడుకున్నాము.

రెండవరోజు ఉదయం నాలుగు గంటలకు గంగా ఘాట్లో గంగాస్నానం పూర్తి చేసుకుని ఐదింటికి ‘వారాహి’ అమ్మవారి దగ్గరకు చేరుకున్నాము. మేము వెళ్ళేటప్పటికి చాలా మంది కూర్చున్నారు. కానీ గుడి తలపులు తెరువలేదు.

వెళ్ళాక అంటే ఆరు గంటల వరకూ అమ్మవారికి అభిషేకము, అలంకరణ పూర్తి చేసేసి, హారతికి వచ్చేవారు మనిషికి రెండు వందల రూపాయలు కడితే, లోపలివరకూ పిలుస్తామని చెప్పారు.

సరే అని మేము డబ్బు కట్టి లోపలికి వెళ్ళి కూర్చున్నాము. పదినిమిషాల్లో  అమ్మవారి అలంకరణ పూర్తై హారతి మొదలయింది. అక్కడ అమ్మ, హారతి తప్ప ప్రపంచమంతా కనుమరుగై పోయింది.  అంత అద్భుతమైన హారతి అది.  మనసు నిండిన సంతోషంతో కాలభైరవుడి గుడికి బయలుదేరాము.

 

కాలభైరవుడి గుడిలో కూడా చక్కటి దర్శనం చేసుకుని, గుడిలో ఉన్న భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని, ప్రక్కనే  ఉపాలయాల్లో ఉన్న లక్ష్మీ నారాయణులు, సీతారామచంద్రులు, చక్రలింగేశ్వరుడి దర్శనం చేసుకుని, ప్రక్కనే ఉన్న దండపాణి దర్శనం చేసుకున్నాము.

అక్కడి నుండి కృత్తివాసేశ్వరుడి గుడిలో కూర్చుని ఉన్న స్వామిజీ చెప్పినట్లుగా, స్వామి లింగానికి అభిషేకం చేసుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, కొంచెం దూరంలో ఉన్న మహామృత్యుంజయేశ్వరుడి గుడికి వెళ్ళాము.

అక్కడ  పెద్ద లింగాకారంలో పూర్తిగా పాలు, మారేడు దళాలు, తామర పూవులతో అలంకరింపబడి, సర్వాంగ సుందరంగా ఉన్న స్వామి మని దర్శించి, లోపలి మండపాలలో, ఐదు వందలమంది ఏక కంఠంగా మహామృత్యుంజయ మంత్ర పారాయణ చేస్తుంటే, అక్కడే కాసేపు కూర్చుని పారాయణ వింటూ ఉన్నాము.

అక్కడనుండి గోరక్ష సమితి వారి ఆశ్రమంలో ఉన్న గుళ్ళకు వెళ్ళాము. ఆ పవిత్ర స్థలంలో కాసేపు కూర్చుని అక్కడ రంగురంగు చీరలు కట్టుకున్న గుజరాతీ మహిళలు, అక్కడే ఉన్న శివలింగానికి అభిషేకం, పూజ చేస్తుంటే కూర్చుని చూసాము. అది ఒక మంచి అనుభూతి.

అక్కడి నుండి బడా గణేశుడి ఆలయంలో కూర్చుని, ఆయన దర్శనం చేసుకుని విశాలాక్షి గుడికి బయలుదేరాము.

మేము విశాలాక్షి గుడికి చేరేటప్పటికి, గుడిలో అమ్మవారికి మహాభోగ్ (అంటే మహానైవేద్యం) అవుతోంది. ఆలయమంతా శుభ్రం చేస్తున్నారు. ఉదయం నుంచీ తిరిగి తిరిగి అలసిన మేము, అక్కడే ఒకచోట కూర్చున్నాము. అమ్మవారి భోగమయ్యేసరికి ఒక గంట సమయం పట్టింది. అంతసేపూ లలితసహస్ర పారాయణం, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ కూర్చున్నాను. అలంకరణ, (శ్రీమార్గము అంటారు ఇక్కడ) నైవేద్యము అయ్యాక తెర తీస్తే, అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళూ సరిపోలేదు…  అంత అందంగా ఉంది. హారతి అయ్యాక ప్రసాద వితరణ ఉంది అక్కడే.  అక్కడ హారతులన్నీ  అయ్యాక,  బాగా ఆకలి వేస్తుంటే భోజనానికి అన్నపూర్ణ ఆశ్రమానికి వెళ్ళాము  .

 

అన్నపూర్ణ ఆశ్రమంలో మేము వెళ్ళేటప్పటికి చాలా పెద్ద క్యూ ఉంది. అలాగే లైన్ లో నిలబడి, అరగంట తరువాత భోజనం చేసి ప్రక్కనే ఉన్న మా గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాము.

ఒక గంట విశ్రాంతి తీసుకుని  మళ్లీ గంగా స్నానం, గంగా హారతి చూడటానికి బయలుదేరాము.  మేము గంగానది ఒడ్డుకు వెళ్ళేసరికి పడవ అబ్బాయి, ‘రానూ పోనూ 40 రూపాయలు’ అని పిలుస్తున్నాడు.

పడవలో అప్పటికే పది మంది ఉన్నారు. మేము కూడా కూర్చున్నాక ఇంకో పదిమందిని అంటే ఇరవై  మందిని అవతల ఒడ్డుకు చేర్చాడు. తిరిగి పడవదగ్గరకు రావడానికి అరగంట సమయమిచ్చాడు.

ఉదయం సూర్యోదయం చూస్తూ, సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ స్నానం చేయటం కాశీ గంగానదిలో ప్రత్యేకం… స్నానం చేసి, బట్టలు మార్చుకుని, గంగాహారతికి దశాశ్వమేధ ఘాట్ దగ్గరకొచ్చాము.

ప్రక్కనే ఉన్న శీతల ఘాట్ లో ఉన్న సీతామాతను, కామాఖ్యా అమ్మవారిని, శివశివాని అమ్మవారిని దర్శించి,  గంగాహారతి కోసం ఒకపడవలో 50 రూపాయలిచ్చి కూర్చున్నాము.  గంటన్నరపాటు సాగిన ఆ హారతి ఒక ఆధ్యాత్మికానందాన్ని కలిగించింది. అక్కడి నుంచి నెమ్మదిగా విశ్వనాథుడి గుడివైపు నడిచాము.

మేము వెళ్ళేటప్పటికి గుడి చాలా రద్దీగా ఉంది. నెమ్మదిగా అక్కడున్న సెక్యూరిటీ వారికి మా దగ్గర ఉన్న టిక్కెట్స్ చూపి ఆ రద్దీలోనే  నిలబడ్డాము. రాత్రి 9.15 కి హారతి కోసం అలంకారం మొదలు పెట్టి హారతిచ్చేసరికి 10.30 అయింది. అలంకరించిన ఆ శివలింగం, ‘స్వామి కుటుంబం మతో పాటుగా స్వయంగా కైలాసం నుంచి దిగివచ్చారా!’  అనిపించేంత అందంగా, ఆనందంగా అనిపించింది.  వారు పెట్టిన బియ్యం పరమాన్నం తృప్తిగా తినేసి అన్నపూర్ణమ్మ గుడికి బయలు దేరి వెళ్ళాము.

 

మేము అన్నపూర్ణ గుడికి వెళ్ళేటప్పటికి, ఆమెకు చాలా సింపుల్ గా  లేతరంగు చీరకట్టి, అలంకారం కూడా చాలా తేలికగా చేశారు. అప్పుడు వెళ్లిన వారు 100 రూపాయల టిక్కెట్ తీసుకుంటే, అమ్మవారిని స్పృశించి దణ్ణం పెట్టుకోవచ్చు. తరువాత ఒక నవారు మంచం వేసి, దానిమీద ముఖమల్ పరుపు, దిండ్లు వేసి అలంకరించి, హారతివ్వడం మొదలు పెట్టారు. ఒక ఎనిమిదిమంది పిల్లలు డమరుకం లాంటి వాద్యంతో వాయిస్తూ ఉండగా అమ్మవారికి హారతిచ్చారు.ఆ హారతయ్యాక  రూమ్ కొచ్చి పడుకుంటే ఎటువంటి డిస్ట్రబెన్స్ లేని నిద్ర వచ్చింది.

 

మూడవ రోజు ఉదయం మళ్లీ గంగా స్నానం మణికర్ణికలో చేసి, రూమ్ కి వెళ్లి రెడీ అయ్యాక ఒక ఆటో మాట్లాడుకుని తిలాభాండేశ్వరుని గుడికి వెళ్ళాము. అక్కడి నుండి సంకటమోచన హనుమాన్ గుడి, కాళీ గుడి, తులసి మానస మందిర్, త్రిదేవ్ మందిర్, గవ్వలమ్మ గుడి చూసి రూమ్ కొచ్చి భోజనం చేసి, కొంచెం సేపు రెస్ట్ తీసుకుని చిన్న షాపింగ్ చేసుకుని, ఎయిర్ పోర్ట్ చేరి, విమానంలో తిరిగి బెంగుళూర్ చేరుకున్నాను. ఇలా ఈ సారి నా కాశీయాత్ర చాలా సులువుగా అయింది

 

ఈ సారి నేను చేసిన ఈ నా కాశీ యాత్ర అనేక దర్శనాలు, అయ్యవారికి, అమ్మవారికి చేసే హారతులు, అమ్మవార్లకు, అయ్యవార్లకు చేసే అనేకానేక  అలంకరణలు కళ్ళతో చూసే భాగ్యం కలిగిందంటే అది ఎప్పటి పుణ్యమో అనిపించింది.  ఈ నా ”ముక్తిక్షేత్రము”   అనే ఈ చిన్ని రచనకు మెచ్చి ఇదంతా కాశీక్షేత్రము నాకిచ్చిన కానుకగా, మహద్భాగ్యముగా భావిస్తున్నాను.  అందుకే ముక్తిక్షేత్రంతో ముక్తిక్షేత్రాన్ని మీకు అందించడం జరిగింది.

కాశీ వెళ్లిన వారమెవరమైనా ఒక్కవిషయం గుర్తు పెట్టుకోవాలి. ఇతర యాత్రలలాగే దేవస్థానం వారు నిర్ణయించిన టిక్కెట్లు  ఇక్కడ కూడా ఉంటాయి. అది కాక  గుడిలో హారతి కోసం అప్పటికప్పుడు 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకూ  అక్కడి పూజారులు డిమాండ్ చేస్తారు. దానిని ఇవ్వడానికి వెనుకాడకుండా వారి చేతిలో పెడితే మంచి హారతి చూస్తాము. అలాగే ఇహంలో, పరంలో చేసే పూజల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, మంచి బ్రాహ్మణుని సంప్రదించి చేసుకోవాలి.  కాశీ  అంటే కాశ్మీర్ కాదని ప్రతి క్షణం మనసున గుర్తుపెట్టుకుంటే కాశీ క్షేత్రం అమ్మానాన్నలా, గురువులా చేయి పట్టుకుని  జీవితాన్ని జీవించడం నేర్పిస్తుంది. ఇది నా 19 వ కాశీ యాత్రలో నేను నేర్చుకున్న విషయం.

సర్వేజనా సుఖినో భవంతుః!!

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *