March 30, 2023

వెంటాడే కథలు – 3 .. పెళ్లి విందు

రచన: చంద్రప్రతాప్ కంతేటి

వెంటాడే కథలు!
నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!
-చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు

*************************************************************************************

బిభూతి భూషణ్ ఇంటి ప్రాంగణమంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో కళకళలాడుతోంది. పెళ్లి విందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అమ్మాయిలూ అబ్బాయిలూ ఎవరి మోహంలో చూసినా ఆనందోత్సాహాలు.. నవ్వుల పువ్వుల కేరింతలు..వెక్కిరింతలు.. హాసాలు, పరిహాసాలూ! ఖరీదైన రంగురంగుల దుస్తుల్లో పెళ్ళివారూ అతిథులు పెళ్లింటిని హరివిల్లులా మార్చేశారు. ఎటుచూసినా పచ్చని తోరణాలు, ఆసనాలు, అలంకరణలూ చూపు తిప్పుకోనివ్వడం లేదు.

బిభూతి భూషణ్ దంపతులకు క్షణం తీరికలేదు.
వారి ఏకైక కుమార్తె జ్యోత్స్నాదేవి పెళ్లివిందు మరి!
పై అంతస్తులో ఉండే ఇంద్రాణి హడావిడికి అంతే లేకుండా ఉంది.
బిభూతి గారికి ఆమె ఏకైక చెల్లెలు.
ఆరేళ్ళ క్రితం ఇలాగే అంగరంగ వైభవంగా తోబుట్టువుకు వివాహం జరిపించి చెల్లెలిని, బావగారు సుజిత్ ను తమ మేడపైన వాటాలో ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు బిభూతి భూషణ్.
ఆయనకు చెల్లెలంటే ప్రాణం..
ఆమెకు అన్నగారంటే పంచప్రాణాలు!
ఆడపడుచును, ఆమె భర్తను కాలు కందకుండా చూచుకునే దొడ్డ ఇల్లాలు బిభూతి గారి భార్య.
విందుకు వస్తున్న అతిధులను, బంధువులనూ సాదరంగా లోనికి ఆహ్వానిస్తూ ముఖద్వారం దగ్గర తీరిక లేకుండా ఉన్న బిభూతి దంపతులు విందు జరిగే పందిట్లో కలకలం విని కంగారు పడిపోయారు. ఏం ప్రమాదం వాటిల్లిందోనని వణికిపోయారు. కేకలు, అరుపులు.. మనుషులు పరుగెడుతున్న సవ్వడులు వారి మనసులో అలజడి రేపాయి.
ఎవరో ”హమ్మో అయ్యో ..” అని సన్నగా రోదించడం వినిపిస్తోంది.
ఒకవైపు నుంచి బిభూతి దంపతులు, మరోవైపు నుంచి ఇంద్రాణి వడివడిగా ఆ వైపు పరుగెత్తారు.
అక్కడి దృశ్యం చూసి ముగ్గురూ నివ్వెరపోయారు.
పెద్దపెద్ద పళ్ళాల్లో వడ్డనకు సిద్ధంగా సేవకులు ఉంచిన రసమలై నేలపాలైంది. ఇతర మిఠాయిల పరిస్థితీ అదే!
చపాతీలు, రుమాలీ రోటీలు చెల్లా చెదరుగా పడి ఉన్నాయి.
కూరలు, కుర్మాలు, పాయసాలు, పులుసులు ఉన్న పాత్రలను దొర్లించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు సుజిత్!
భార్య ఇంద్రాణిని, బావగారినీ చూసి వెకిలిగా నవ్వాడు.
అతిథులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
సుజిత్ ను ఎవరు ఏమనగలరు?
స్వయానా బిభూతి గారి బావ, ఇంటి ఆడపడుచు ఇంద్రాణి భర్త!
అక్కడి పరిస్థితి చూసి ఇంద్రాణి కళ్ళు తిరిగి కుర్చీలో కూలబడింది.
ఎంతో బందోబస్తు చేసి వచ్చినా తన భర్త కిందకు ఎలా వచ్చాడు?
ఎవరైనా పైకి వెళ్లి తలుపు గొళ్ళెం తీశారా? లేక కిందకు వచ్చే హడావిడిలో తనే గొళ్ళెం వేయడం మరచిందా?
కానీ ఆ క్షణంలో బిభూతిగారు తన ప్రవర్తనకు విరుద్ధంగా అగ్నిహోత్రావధానులే అయ్యారు.
వడివడిగా సుజిత్ వైపు అడుగులు వేసి ఆ చెంపా ఈ చెంపా వాయించేశారు. ఏడుస్తున్నా ఊరుకోలేదు.. వంగదీసి వీపు మీద బలమంతా ఉపయోగించి పిడిగుద్దులు గుద్దారు..
అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన ఇంద్రాణి గబగబా అన్న దగ్గరకు పరుగెత్తి సుజిత్ కు అడ్డంగా నిలబడింది. భర్త మీద దెబ్బ పడకుండా కాచుకుంది.
బిభూతి భార్య కూడా తన భర్తను దూరంగా లాక్కుపోయింది.
తన కూతురి పెళ్ళిలో తనకింత అవమానం జరగడం తట్టుకోలేక పోయారు బిభూతి.
ఆయన కోపం ఇంకా చల్లారలేదు కాబోలు..
సుజిత్‌ను మేడ ఎక్కిస్తున్న ఇంద్రాణిని పక్కకు నెట్టి మరో రెండు గుద్దులు గుద్దారు. తర్వాత అతని చేతులు పట్టుకుని బరబరా లాక్కెళ్లి ఇంద్రాణి గదిలో కూలేశారు.
ఆ రభసలో సుజిత్ గోడకు చేరబడ్డాడు.
”కిందకు వచ్చావంటే నరికి పోగులు పెడతా” అని సుజిత్‌ను హెచ్చరించి కిందకు దిగుతున్న బిభూతిని చూసి మొహం తిప్పుకుంది ఇంద్రాణి.
చెల్లెలి ఆగ్రహాన్ని, మనసును పట్టించుకునే మానసిక స్థితిలో లేరు బిభూతి.
ఇంద్రాణి తన వాటా లోపలికి వెళ్లి పెద్ద శబ్దం అయ్యేలా తలుపు బిడాయించుకుంది. గడియ వేసిన శబ్దం కూడా గట్టిగా వినిపించింది.
పానకంలో పుడకలా జరిగిన ఈ గందరగోళానికి ఇరువైపుల పెళ్ళివారు, బంధుమిత్రులు, అతిథులు కాసేపు మూడీగా మారిపోయారు. అరగంట ముందున్న హుషారు వాతావరణం స్థానే ఒకరకమైన స్తబ్దత, నిరుత్సాహం అక్కడ నెలకొంది.
బిభూతికి తలకొట్టేసినట్టుంది.
తన ముద్దుల కుమార్తె పెళ్ళిలోనే ఇలాంటి సంఘటన జరగడం విపరీతంగా బాధించింది. ఇంద్రాణి మరికొంత జాగ్రత్త వహించాల్సింది.. తలుపు బయట గొళ్ళెం పెట్టకుండా తనెందుకు కిందకు దిగినట్టు?
అవును నిజమే తనే ఆమెను తొందర పెట్టాడు..
‘మేనకోడలి ముస్తాబు వగైరాలు నువ్వు చూసుకోవా ఇందూ? త్వరగా తెముల్చుకుని రావచ్చు గదా? ఎంతసేపు సర్దుతూ కూర్చుంటావు.. వియ్యాలవారంతా వచ్చేస్తున్నారు’ అని ఉదయం నుంచి నాలుగుసార్లు తనే పైకి వెళ్లి చెల్లిని పిల్చాడు.
‘నిజమే పిలిచాడు.. అయితే భర్త విషయం తను పట్టించుకోనవసరం లేదా? అతను అందరిలాంటి వాడు కాదని తెలిసిందే గదా? తలుపు గొళ్ళెం పెట్టి రావద్దూ’
అందరితో పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు గానీ మనసు ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారైంది.
జ్యోత్స్న భర్త అత్తమామలు ఏమనుకున్నారో.. ఆడబిడ్డలు ఏమనుకుంటున్నారో..
విందు మొదలైంది.
బంధుమిత్రులు కూడా చెవులు కొరుక్కుంటున్నారు..
”బంగారు బొమ్మలాంటి చెల్లెలికి ఒక ముదనష్టపు సంబంధం చేశాడు.. తన కూతురికేమో చక్కని సంబంధం చేసుకుంటున్నాడు”
”బిభూతి చెల్లెలికి అన్యాయం జరిగిన మాట నిజమే. కానీ అతను కావాలని చేసింది కాదు. మధ్యవర్తుల మాట నమ్మి బొక్కబోర్లా పడ్డాడు. ఇప్పుడు ఇంద్రాణి నరకం అనుభవించాల్సి వస్తోంది. ఇవ్వాళ ఏకంగా తన భర్తను అన్న గొడ్డును బాదినట్టు బాదుతున్నా నోరెత్తలేని పరిస్థితి. ఆమెకు ఎంత అవమానం?”
అరగంటలో ఒక పంక్తి లేచింది.
తర్వాత పంక్తిలో- బిభూతి కుటుంబ సభ్యులు కూడా కూర్చున్నారు.
ఇంద్రాణిని భోజనానికి పిలవమని సేవకుడిని పంపారు బిభూతి.
ఆమె తలుపు తీయడం లేదని ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు సేవకుడు.
బిభూతికి చిరాకు పుట్టింది.
‘తను తొందరపడ్డాడు కానీ అది ఎందుకో తెలియనంత అమాయకురాలా తన చెల్లెలు? అనుకోకుండా ఇలాంటివి జరుగుతుంటాయి. అంత మాత్రానే చెల్లెలు పట్టుదలకు పోవాలా?’ మనసులో అనుకుని తన భార్యను పంపాడు.
వదినగారికి తాను ససేమిరా రానని చెప్పి పంపేసింది మరదలు.
ఆమె ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది.
భోజనాలు కావించి పందిట్లో బాతాఖానీలో మునిగితేలుతున్న బంధుమిత్రుల చెవినబడింది ఈ వార్త!
వాళ్లకు చర్చించుకోవడానికి ఓ మంచి టాపిక్ దొరికింది.
కొందరు బిభూతి పక్షం వహించారు.
ఇంకొందరు ఇంద్రాణిని సమర్ధించారు.
”అంత అవమానం జరిగాక ఆ పిల్ల ఎందుకు కిందకు వస్తుంది?”
”అన్నగారికి జరిగింది అవమానం కాదా? తను ఆ మాత్రం అర్థం చేసుకోలేదా.. చదువుకున్న పిల్లేనాయె”
”ఎంత చదువుకుంటే మాత్రం కట్టుకున్న మొగుణ్ణి అన్నగారు గొడ్డులా బాదడం ఏ ఇల్లాలు సహిస్తుంది? అయినా ఆ అన్నకు తెలియదా తన బావగారి మానసిక పరిస్థితి? తెలిసుండీ రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది?”
”తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి చెల్లెని కన్నకూతురిలా పెంచుకున్నాడు బిభూతి. ఆ సంగతి మనందరికీ తెలుసు..అది మరచిపోతే ఎలా ?”
అయితే చెవులు కొరుక్కోవడమే తప్ప ఎవరూ గట్టిగా రాద్ధాంతాలు చేయలేదు.
తనంత తనే లేచి బిభూతి ఇంద్రాణిని పిలవడానికి వెళ్ళాడు.
అతనిలో పితృవాత్సల్యం పొంగిపొర్లుతోంది. మరోవైపు పశ్చాతాప భావన కూడా కాల్చేస్తోంది.
”ఇందూ.. నువ్వు లేకుండా మేమెప్పుడైనా భోజనం చేశామా? నువ్వు తిని, బావగారికి ఇంత తీసుకుని వద్దుగాని..లేచి రామ్మా.. ఈ అన్నయ్య చేసింది తప్పే ఒప్పుకుంటాను”
లోపలినుండి సమాధానం లేదు.
”అమ్మా నేను తప్పే చేశాను.. ఇవ్వాళ నన్నేదో దయ్యం పూనింది.. అనవసరంగా బావగారిని కొట్టాను. దానికి సిగ్గుపడుతున్నానమ్మా. కావాలంటే మీ ఇద్దరి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెబుతానమ్మా.. ఇక్కడ కాదు.. కింద పందిరిలోనే అందరి సమక్షంలోనే చెబుతానమ్మా. ఈ అన్నను క్షమించి తలుపు తీయమ్మా.. మా అమ్మకదూ.. నా మాట వినవూ” దుఃఖంతో ఆయన కంఠం రుద్ధమైంది.
”అన్నయ్యా నీ తప్పేంలేదు. తప్పంతా మాదే ! నువ్వే మా ఇద్దరినీ క్షమించాలి.. వెళ్లి భోజనం చెయ్యి.. ఇప్పటికే ఆలస్యం అయింది.. నా కోసం చూడొద్దు..” ఇంద్రాణి తలుపు తీయకుండానే జవాబు చెప్పింది అన్నగారికి.
అన్నగారు పరిపరి విధాలుగా అర్ధించినా ప్రయోజనం లేకపోయింది.
తర్వాత మేనకోడలు జ్యోత్స్న వచ్చింది.
ఇందూ, జ్యోత్స్నలు మేనత్త మేనకోడలే కాదు.
మంచి స్నేహితులు కూడా. ఇద్దరినీ రెండు కళ్లలా చూసుకున్నారు బిభూతి దంపతులు.
మేనకోడలు ఎంతసేపు పిలిచినా ఇంద్రాణి తలుపు తీయలేదు..
చివరికి ఏడ్చినా ఆమె హృదయం కరగలేదు.
అన్యమనస్కంగానే అందరి భోజనాలూ అయ్యాయి ఒక్క ఇంద్రాణి దంపతులు తప్ప!
బంధు మిత్రులందరూ వెళ్లిపోయారు.
మగపెళ్ళివారు కూడా సెలవు పుచ్చుకున్నారు.
పెళ్లిపందిరి ఖాళీ అయింది.
సేవకులు సామాన్లు సర్దుకుంటున్నారు.
పొద్దువాలింది.
మరోసారి ప్రయత్నిద్దామని బిభూతి దంపతులు మేడ మీది ఇంద్రాణి వాటాకు వెళ్లారు.
తలుపు కొట్టగానే తెరుచుకుంది.
ఇంద్రాణి జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా కనిపించింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి.
ఆమెను ఆ స్థితిలో చూసి అన్నగారి మనసు కరిగిపోయింది.
”ఏంటమ్మా ఈ వాలకం. ఈ అన్నయ్య మీద ఇంత అలక న్యాయమేనా..?” అంటూ మంచం వైపు చూసిన బిభూతిగారికి బావ సుజిత్ కనబడలేదు.
ఆశ్చర్యంగా పక్కకు చూశారు.
మధ్యాన్నం గదిలోకి తను నెట్టినప్పుడు గోడకు ఎలా చేరబడి ఉన్నాడో అలాగే అక్కడే ఉన్నాడు..
గోడమీద, అతని చొక్కా మీద, అక్కడి నేల మీద చిక్కని రక్తం పేరుకుని ఉంది..
ఆయనకేదో అర్థం అయ్యీ కానట్టుంది.
పిచ్చి చూపులు చూస్తున్నాడు.
అంతలో ఒక్క ఉదుటున ఇంద్రాణి అన్నను కౌగిలించుకుని భోరున ఏడ్చింది.
వదినగారు శిలాప్రతిమలాగే నిలబడిపోయింది.
”పెళ్లి ఉత్సాహంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే తలుపు తీయలేదన్నయ్యా” అంటున్న చెల్లెలి మొహంలోకి చూడలేకపోయారు బిభూతి.
”ఎప్పుడు జరిగింది?” నూతిలోనుంచి వచ్చినట్టున్నాయి ఆయన మాటలు..
”పొద్దున్న నువ్వు గదిలోకి తోసినప్పుడే తల గోడకు బలంగా తగిలింది కాబోలు. అప్పుడే వెళ్ళిపోయాడు..” వెక్కుతూ ఆమె అంటున్న మాటలు ఆ అన్నగారి గుండెల్నిచిత్రవధ చేశాయి.

-:000:-

నా విశ్లేషణ:

నాకు గుర్తున్నంతవరకు ఈ కథ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి గారిది. జ్ఞానపీఠ గ్రహీత అయిన ఆమె కలం నుంచి అద్భుతమైన రచనలు ఎన్నో వెలువడ్డాయి. కథ పేరు మర్చిపోయాను గానీ విషయం ఆసాంతం గుర్తుంది. మానవీయ కోణంలో సాగిన చక్కని ఇతివృత్తం. సంభాషణలు సహజంగా సాగాయి. ఈ కథలో పాఠకులకు తెలియాల్సిన కొన్ని విషయాల్ని రచయిత్రి గుంపులో గోవిందయ్యలతో చెప్పించడం ఆమె రచనా వైచిత్రికి నిదర్శనం. ఇందులో కొన్ని అవాంఛిత ఘటనలే తప్ప ప్రతినాయకులు ఎవ్వరూ లేకపోవడం కూడా గమనార్హం.
1909 జనవరి 8న జన్మించిన ఆశాపూర్ణాదేవి 1976లో భారత ప్రభుత్వం ఇచ్చే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని, జ్ఞానపీఠ్ అవార్డును, పొందారు. వారు తన 86 ఏళ్ల వయసులో 1995 జులై 13న పరమపదించారు.

17 thoughts on “వెంటాడే కథలు – 3 .. పెళ్లి విందు

 1. కథ చదివిన తరువాత ఒక్కసారి గుండెలో ఏదో బాధ….నిజంగానే కథ ఈ అనుభూతిని మిగిల్చింది…కె.వి.కృష్ణారావు

 2. కథ చాలా బాగుంది.ఆసాంతం నన్ను చదివించింది.మంచికథ చదివాననిపించింది.రచయితకు నా అభినందనలు.

 3. Eee katha ki inka matalu levu okesari sukha santhoshalanu ventane dukkhanni kallaku kattinatlu choopinchina rachayithaku

 4. Abbbbaaaa!!!!
  Em twist sir…..!!!
  Pelli(Aanandam), Maranam(Sokam) are two sides of the same coin…
  Ani enta chakkaga chepparu(author as well as you) sir….!!!

  1. థాంక్యూ రమణి.
   దటీజ్ ఆశాపూర్ణాదేవి.
   వారి కథకు నేను అక్షరాలు సమకూర్చాను. దయచేసి మిత్రులందరికీ దీన్ని షేర్ చేయాలి. నాకే కాదు మీ అందరికీ కూడా ఇది ‘వెంటాడే కథ’ కావాలి.

 5. మీలాంటి పెద్దలు ఇంత చక్కగా రాశాక ఇక చెప్పేదేముంది ఇవి నాకు ఆశీస్సులు

  1. నా వరకు .. సంపాదకులు మన తప్పు లు..
   దిద్దే గురుతుల్యులు.

   వయసు దేముంది సార్!

   ముఖే ముఖే సరస్వతి అన్నది మంచి సంపాదకుల గురించి నా అభిప్రాయం..

   రచయిత వ్రాసినది తులానాత్మకంగా
   బేరీజు వేసేది.. మార్కులు వేసేది ఈ గురువులే..కదా..

 6. మీరు మెచ్చిన కథ..
  నాకు నచ్చకుండా ఎలా..

  కథ ముగింపు ఇలా దారుణంగా వుంటుందని ఊహించాను.

  ఊహించినదే జరిగింది.

  తలచినదే జరిగితే దైవం ఎందులకు?
  జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.

  చెల్లెలు .. అన్నా ఇద్దరూ విధి చేతిలో మోసగింప
  బద్దవారే..

  RK Narayan guide నవలలో..
  చివర .. వదిలేశాడు.

  అలా.. ఇంద్రాణి భర్త మరణాన్ని పాఠకుల ఛాయిస్ కి వదిలేస్తే బాగుండేది.

  ముగింపు ..బాధాకరం..అతి బాధాకరం..

 7. మనసంతా బాధాతప్తంగా అయిపొయింది. ఎంత గొప్ప కథను పరిచయం చేశారు సర్. Thank you so much

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2021
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031