May 25, 2024

సాఫ్ట్‌వేర్ కథలు – 3. . . . దద్దోజనం

రచన: కంభంపాటి రవీంద్ర

 

మొట్టమొదటిసారిగా మా గోపాల్ అంటే భలే ఒళ్ళు మండింది ఆ రోజు ! వాడూ,  నేనూ రెండేళ్లుగా ఈ ఎడింబరో లో ఒకే ఫ్లాట్ లో కలిసి ఉంటున్నా,  ఎప్పుడూ మా మధ్య గొడవ పడాల్సినంత విషయాలేవీ జరగలేదు.

కానీ ఆ రోజు మటుకు భలే కోపం వచ్చేసింది.  ఎల్లుండి క్రిస్మస్ అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆఫీసుకి శెలవు. . .  హాయిగా ఇంట్లో కూచుందాం అనుకుంటూంటే,  ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి లంచ్ చేస్తూంటే, చెప్పేడు గోపాల్ గాడు ‘ఇవాళ రాత్రి సురేష్ వాళ్ళ ఫామిలీ ని మనింటికి డిన్నర్ కి పిలిచేను ‘

‘ఇవాళ రాత్రా?’

‘అవును. . . సారీ. . .  నిన్న సాయంత్రం బాడ్మింటన్ ఆడుతూంటే అడిగేడు,  ‘మీ ఇంటికి డిన్నర్ కి ఎప్పుడు పిలుస్తావు?’, ‘రేపు వచ్చేయండి ‘ అని చెప్పేను ‘

‘మనం పిలిస్తే వాడు డిన్నర్ కి రావాలి కానీ,  నన్ను ఎప్పుడు పిలుస్తారు అని వాడు అడగడమేంటి?’ చిరాగ్గా అన్నాను

‘అందరూ ఒకేలాగా ఉండరు కదరా. . .  సారీ. . .  కానీ. . .  ఈ ఒక్కసారికీ ‘ అన్నాడు గోపాల్

‘రేపెలాగూ హాలిడే కదా అని ఇవాళ కుక్ చెయ్యకుండా రిలాక్సయ్యి, బయట నుంచి ఏమైనా తెప్పించుకోవచ్చు అనుకున్నాను. . .  నువ్వేమో ఇలా ఫిటింగ్ పెట్టేవు ‘ అన్నాను

వాడికి వంట రాదు,  రోజూ ఇంట్లో వంట నా డ్యూటీ. . .  మిగతా ఇంటి పనులు వాడు చేస్తాడు.

సరే ఇంక గొడవ సాగతీయడం ఇష్టం లేక,  ‘ఎంత మంది వస్తారు?’ అని అడిగేను,  ‘సురేష్, అతని వైఫ్. . . ఇద్దరే ‘

గెస్టులెక్కువ లేరు. . .  పోన్లే అదో రిలీఫ్. . .  అనుకున్నా !

 

*****

 

ఇంటికి వెళ్ళేక,  గబగబా కుకింగ్ మొదలెట్టేసేను.  చపాతీలు,  కూర,  వెజిటబుల్ రైస్,  డబల్ కా మీఠా.  గోపాల్ ఫ్లాట్ ని నీట్ గా సర్దేసేడు.

ఈ సురేష్ అనేవాడు కొత్తగా ఎడింబరో వచ్చేడని తెలుసు గానీ ఎప్పుడూ కలవలేదు.

‘ఏ ఊరు ఈ సురేష్ వాళ్ళది?’ గోపాల్ ని అడిగేను

‘తణుకు దగ్గర. . .  పెరవలి అనుకుంటా’

ఇంతలో డోర్ బెల్ రింగ్ అయ్యింది.  గోపాల్ వెళ్ళి తలుపు తీసి,  ‘మీ జాకెట్స్ ఈ క్లోసెట్ లో పెట్టుకోండి ‘ అని క్లోసెట్ లో ఉన్న హాంగర్లు చూపించేడు

‘హౌ అర్ యు ఫోక్స్?’ అంటూ లోపలికి వచ్చేడు సురేష్

‘ఫైన్. . .  లోపలికి రండి ‘ అంటూ ఆహ్వానించేను

‘ష్యూర్. . . డూడ్ ‘ అంటూ లోపలికొచ్చేడు సురేష్,  అతని భార్య తలవంచుకుని ఉంది

‘బై ది వే. . . షీ ఈజ్ మై వైఫ్. . . కాత్యాయని ‘ అంటూ తన భార్య ని పరిచయం చేసేడు

”నమస్తే. . . .  బావున్నారా?’ అన్నాను

ఆ అమ్మాయి కూడా నమస్తే చెప్పి. . .  మౌనంగా కూచుంది.

ఇంతలో సురేష్ అందుకుని, ‘డోంట్ మైండ్. . .  షీ ఈజ్ పూర్ ఇన్ ఇంగ్లీష్. . .  విలెజ్ టైప్స్. . . ఇన్ ఫాక్ట్ దద్దోజనం టైపు’ అన్నాడు.

వీడెవడ్రా బాబూ, ఆ అమ్మాయిని పాపం ఇలా గాలి తీసేస్తున్నాడు అనుకుని,  ‘మాది కోనసీమే. . .  మీ ఆయన అంటే ఎడింబరో లో పుట్టి పెరిగేడు కాబట్టి ఇంగ్లిష్ గానీ. . .  మనం మనం తెలుగులో మాట్లాడుకోవచ్చండి ‘ అన్నాను నవ్వుతూ

‘గుడ్ జోక్. . బట్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ ‘ అని,  ‘వాట్ డిడ్ యు కుక్ ఫర్ అస్?’ అని డైనింగ్ టేబుల్ వేపు వెళ్ళేడు సురేష్.

కాత్యాయని ఏం మాట్లాడకుండా కామ్ గా వడ్డించుకుని తింటూ కూచుంది.

ఉన్నంత సేపూ తనకి వచ్చిన కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించీ,  తన ప్రాజెక్ట్ లో అందరూ తననెంత పొగుడుతారో చెప్పుకుంటూపోయేడు సురేష్

వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పేడు గోపాల్,  ‘సారీరా బాబూ. . .  నా మూలంగా అనవసరంగా వీడికి దొరికిపోయేవు ‘

ఈ డిన్నర్ జరిగి వారం రోజులైనా కూడా ఆ అమ్మాయి కాత్యాయని నా ఆలోచనల్లోంచి పోలేదు.  పాపం తను ఇలాంటి వాడికి ఎలా దొరికిపోయిందో. . .  అనుకునేవాడిని !

ఒకరోజు గోపాల్ ‘ఈ సురేష్ గాడు తన వైఫ్ ని దద్దోజనం అంటూ ఏడిపిస్తాడు గానీ,  ఆ అమ్మాయి ఆంధ్రా యూనివర్సిటీ లో మ్యాథమెటిక్స్ లో ఎమ్మెస్సీ చేసిందట తెలుసా? అయినా పాపం వాడి మాటలన్నీ పడుతూ కామ్ గా ఉంది ‘ అంటూ జాలిపడ్డాడు

‘ఏమో. . .  ఆ అమ్మాయి మనసులో ఏముందో మరి. . చూద్దాం ‘ అన్నాను.

ఆర్నెల్ల తర్వాత తన ప్రాజెక్ట్ అయిపోయిందని,  సురేష్, కాత్యాయని ఇండియా వెళ్ళిపోయేరు.

నాకు ఆ సురేష్ అసలు నచ్చలేదేమో,  వాళ్ళ కాంటాక్ట్ అలా తెగిపోయింది.

*****

మూడేళ్లు గడిచేయి,  నేను కూడా ఇండియా వచ్చేసేను.  హైదరాబాద్ ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు తెలిసింది,  పెర్ఫార్మన్స్ బాగోలేదని సురేష్ ఉద్యోగం తీసేసేరని ! ఈ కోపం తో తన భార్య ని ఇంకెంతలా కాల్చుకు తింటున్నాడో అనుకున్నాను.

అటు మా గోపాల్ గాడికి పెళ్లి కుదిరింది.  చిక్కడపల్లి లో ఏదో కల్యాణ మండపం లో పెళ్లి.  చాలా గ్రాండ్ గా జరిగింది.  రోడ్లన్నీ ఇరుకేమో,  పార్కింగ్ దొరక్క,  రెండు వీధుల అవతల కార్ పార్క్ చేయాల్సి వచ్చింది.

నడుచుకుంటూ వెళ్తూంటే దూరంగా వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది.  ఓసారి దణ్ణం పెట్టుకుని వద్దాం అని లోపలికెళ్ళి దర్శనం చేసుకుని వస్తూంటే,  ‘ప్రసాదం తీసుకో బాబూ’,  అంటూ చిన్న దొన్నెలో దద్దోజనం పెట్టేరు.  ఆ ప్రసాదం చూడగానే కాత్యాయని గుర్తొచ్చింది !

ప్రసాదం తినేసి,  గుడి బయటికి వచ్చి,  చెప్పులేసుకుంటూంటే,  ‘హే. . .  హవ్వార్యూ మాన్?’ అంటూ పలకరింపు. . .  ఎవరా అని చూసేసరికి సురేష్,  పక్కనే కాత్యాయని !

‘బావున్నారా?’ అన్నాను

ఆ అమ్మాయి మౌనంగా తలూపింది

‘యు నో. .  ఐ లాస్ట్ మై జాబ్. . .  బట్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ నారాయణా కాలేజ్. . . షీ టీచెస్ మాథెమాటిక్స్ ఫర్ ఐఐటీ కోచింగ్ అండ్ ఐ యామ్ రిలాక్సింగ్ ఎట్ హోమ్’ అంటూ సురేష్ చెప్పుకుపోతున్నాడు

‘అవును. .  ఇప్పటికే చాలా కష్టపడ్డావు మరి ‘ అన్నాను. . .  శ్లేష అర్ధం కాక సురేష్ ‘ట్రూ. . . వెరీ ట్రూ ‘ అంటూంటే,  కాత్యాయని మొహంలో ఓ నవ్వు మెరిసినట్టనిపించింది !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *