May 24, 2022

కలహాంతరిత.

రచన: పంతుల ధనలక్ష్మి

గోపీ ఆఫీసునుండి ఇంటికి వచ్చేడు.
ఆ రోజు బస్సు ల వాళ్ళు ఆటోవాళ్ళు ఏదో ఏక్సిడెంట్ విషయంలో కొట్టుకుని పంతం తో ఇరువురూ స్ట్రైక్ చేసి తిరగటం మానేశారు.
పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరేడు. ఉసూరుమని కూర్చుని
“రాధా! కొంచెం కాఫీ ఇస్తావా?’ అని అడిగేడు.
“ఎందుకివ్వనూ? అదేదో ఎప్పుడూ ఇవ్వనట్టు! ఆ!” అంది.
“ఇవాళ సినిమా ప్రోగ్రాం అన్నారు?” దీర్ఘం తీసింది రాధ.
ఓ చూపు చూసి ఊరుకున్నాడు.
“ఇవాళ హోటలుకి తీసికెళ్తానన్నారూ?” అన్నది.
మళ్ళీ గోపి మౌనం.
“ఏమిటీ! నేను ఏమి మాట్లాడినా అలా ముద్దపప్పులా ఊరుకుంటారేం? అవునులెండి! చిన్నప్పటి నుంచి మీకు
అదే యిష్టమని పప్పే పెట్టి పెంచారటగా?”
మళ్ళీ మౌనం గోపి. చిన్న నవ్వు.
కాస్సేపటికి కాఫీ తెచ్చింది. ఠక్ మని శబ్దం చేస్తూ పెట్టింది. నోరు కాల్లేదు. వేడిగానే తాగేడు.
“హమ్మయ్య! కాఫీ ఇచ్చింది” అనుకున్నాడు.
స్నానానికి వెళ్ళి తువ్వాలు చుట్టుకొని ఇంకో తువ్వాలు బాల్కనీలో ఆరేస్తున్నాడు.
ఎదురింట్లో కొత్తగా దిగేరు. మెళ్ళో ఏమీలేదు ఆ అమ్మాయికి. బట్టలు
ఆరేస్తోంది వాళ్ళ బాల్కనీలో.
రాధా అది చూసి “ఓహోహో! ఏం వయ్యారం! ఈ టైములో రోజూ మీరు తువ్వాలు ఆరెయ్యడం, ఆవిడగారు బట్టలు ఆరెయ్యడం!!”బావుంది వరస!” అంది వెటకారంగా.
ఆ అమ్మాయి కి వినిపించింది.
“ఏమీ లేకుండా ఎందుకలా వేధించుకు తింటారో?” అన్నది ఆ అమ్మాయి.
“ప్రతీదీ వెక్కిరింత, వేళాకోళమే! పెళ్ళయ్యాక ఒక్కోరోజు కూడా గోల చెయ్యకుండా లేదు. పోనీ పెద్ద కారణాలు లేవు. పెద్దవాళ్ళకు చెబుదామంటే ఆ మాత్రం పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేవా?” అంటారని భయం.
ఆ మధ్య సినిమాకి వెళ్ళేము. తనకి జమున అంటే ఇష్టం.
” శ్రీకృష్ణ తులాభారం” సినిమా.
ఇద్దరమ్మాయిలు వచ్చేరు. ఇవతలి పక్క భార్యాభర్తలు . వాళ్ళ పక్క నలుగురు మగవాళ్ళు. అతను అటు కూచుని భార్యని రాధ పక్కని కూర్చోపెట్టాడు.
ఆ ఇద్దరమ్మాయిలు గోపీ పక్కన కూర్చున్నారు. వాళ్ళని సీటు మారమని చెప్పింది. ” మేము మారము” అని చెప్పేసారు.
అస్తమానూ నన్ను ఆ అమ్మాయిల్నీ చూడటమే. పాప్కార్న్ కొనుక్కొచ్చి తింటూ వాళ్ళమీద పడేయటం, ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళు కుర్చీ మీద చెయ్యి పెట్టుకుంటే అంటించడం సారీ అనటం చేసింది.
సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తంతే గట్టిగా నవ్వి చప్పట్లు కొట్టి హాలంతా వినపడినట్టు అరిచింది.
వాళ్ళు చిరాకుపడి మధ్యలో వెళ్ళిపోయారు.
శుభం కార్డు పడ్డాక “హోటలు కెళ్దామండీ” అంది
“మసాలా దోశ తింటానండీ” అంది.
“కాఫీ మీరు నేను సాసర్లో తాగుదాం”అంది.
” బాగుండదు , అందరూ చస్తున్నారు” అన్నాడు.
“ఏం మనం మొగుడు పెళ్ళాలమేగా?” అంది.
చేసేదిలేక సాసర్లో ఇద్దరూ తాగేశారు.
రాధా చాలా అందంగా వుంటుంది.
ఇష్టపడి చేసుకున్నాడు.
పెళ్ళిలో బిందెలో ఉంగరాలు తీసేటప్పుడు తనకి ఉంగరం దొరకలేదని కోపంగా మొహం పెడితే ” నీ మొహం
కోపంలో చాలా బావుందివోయ్”! అన్నాను.
అదే నా పొరపాటు. అనుకున్నాడు గోపి.
“ఎప్పుడూ రుసరుస. కోపం”అనుకున్నాడు గోపి.
దూరంగా బొంబాయి హెడ్డాఫీసుకి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.
వెళుతూ ” ఇల్లు దొరికేక తీసికెళ్తానన్నాడు.”
ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు.
చీరలు, ఇష్టమైన బహుమతులు పంపుతున్నాడు. నెలలు గడుస్తున్నాయి.
“తన భర్త ఎంత మంచివాడో! తన భర్త ఎవరి వల్లో నో పడిపోతాడని ఎప్పుడూ భయపెట్టడానికి దెబ్బలాడేది! ప్చ్! ఇప్పుడెలా? తానే భయపడే స్థితి!” అని భోరుమని ఏడుస్తోంది.
అంతా తానే చేసుకుని అతను వెళ్ళిపోయాక ఏడుస్తోంది
“శృంగార నాయిక కలహాంతరితలా”!
కావ్యమయితే అంతే. కానీ మనం కలిపేద్దాం పోనీ బాధ పడుతోంది కదా!
తలుపు చప్పుడైంది. ఎదురుగా గోపీ.

శుభం!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *