March 31, 2023

చంద్రోదయం – 23

రచన: మన్నెం శారద

 

 

 

సారథికి నిద్ర పట్టలేదు.

అతనికి ప్రతీక్షణం శేఖర్‌తో తాను గడిపిన రోజులు గుర్తుకొచ్చి బాధని కలిగిస్తున్నాయి.

సారథి వెన్నులోంచి జరజరా ఏదో ప్రాకినంతవరకు ఆ భయంకరమైన గతాన్ని తలచుకోవడం  యిష్టం లేనట్లు ప్రక్కకి తిరిగి కళ్లు మూసుకున్నాడు.

అయినా మెదడు ప్రసారం చేసే ఆ గతకాలపు భయంకర దృశ్యాల్ని అతడు చూడక తప్పలేదు.

ఆ సాయంత్రం..

శేఖర్, సారథి టి.బి. హాస్పిటల్ పక్కన సింహాచలం రోడ్డులో నడుస్తున్నారు.

“అమ్మ, నాన్న లెటర్స్ వ్రాస్తున్నారా?” సారథి అకస్మాత్తుగా అడిగేడు.

శేఖర్ విచిత్రంగా చూసేడు మిత్రుడివైపు.

“అలా ఎందుకనుకున్నావ్?”

“పెద్దవాళ్లు కదూ. కోపానికి బిగుసుకున్నా కొడుకుపై ప్రేమ పోతుందంటావా?”

“నిజమే! వాళ్లు అన్నింటిలోనూ పెద్దవాళ్ళే. వాళ్ళకి ఎంత అస్థి వుందో. అంతకు మించిన కోపం కూడా వుంది. దాన్ని మించిన అహం వుంది. అలాంటివాళ్ళు కొడుకు మీద ప్రేమతో వీటన్నింటినీ చంపుకుంటారా?” అతని మాటల్లో చెప్పలేని ఆవేదన ప్రస్ఫుటమవుతోంది.

సారథి అనునయంగా అన్నాడు “పోనీ వాళ్లు ఎంత కాదన్నా నీ తల్లిదండ్రులేగా. నువ్వే ఓ లెటర్ రాసి చూడలేకపోయావా?”

“ఏవని రాయమంటావ్? నేనిప్పుడేం రాసినా వాళ్లు నన్నపార్ధం చేసుకుంటారు. ఓ దరిద్రురాల్ని కట్టుకున్నాడు. దరిద్రం పట్టి డబ్బు అవసరం చేత యిలా తిరిగి బంధం పెట్టుకోవాలని చూస్తున్నాడని చులకనగా అంచనా వేయరూ!”

“చ! అలా ఎందుకనుకుంటారురా?నువ్వేం పరాయివాడివా? వాళ్లు వాళ్ల మాట వినలేదనే పట్టుదల కొద్దీ అలా పట్టనట్లున్నారు. కానీ లోపల ఎంతగా కుమిలిపోతున్నారో”

శేఖర్ సారథి మాటలకి సాలోచనగా అన్నాడు.”కావొచ్చు. కాని నేనేం కాని పని చేసేనని అంత పంతం. నాకన్నా వాళ్లకి ఆస్థే ముఖ్యమయినప్పుడు నేనెందుకు ప్రాకులాడాలి. ఒకవేళ నేను ప్రేమకొద్ది ప్రాకులాడినా వాళ్లు నన్ను సరిగ్గా అర్ధం చేసుకుంటారని యెక్కడుంది. స్వాతిని తమ యింటి కోడలిగా భావించి ఆప్యాయంగా ఆదరించిన్నాడే నేను కూడా వాళ్ల కొడుకుగా వాళ్ల యింటి గడప త్రొక్కగలను”

సారథి యింకేం మాట్లాడలేకపోయాడు.

స్వాతిపట్ల అతనికున్న ప్రేమాభిమానాలు చూసి సారథికి ఎంతగానో సంతోషం కలిగింది.

“తాను స్వాతిని ఎంతగానో ప్రేమించేడు. నిజానికి స్వాతిని తను చేసుకున్నా యింతకంటే బాగా చూసేవాడు కాదేమో!” అనుకున్నాడు మనసులో.

ఇద్దరూ కొబ్బరిచెట్ల నీడలో పొలంగట్టుపై కూర్చున్నారు.

ఉన్నట్టుంది సారథి అడిగేడు “బైక్ ఏం చేసేవ్?”

శేఖర్ ఓ క్షణం మాట్లాడలేనట్లు చూసి “అమ్మేసేను” అన్నాడు.

“ఎందుకని?” సారథి సూటిగా అడిగేడు.

“దానికీ మధ్య దాహం ఎక్కువయింది. పెట్రోలు యెంత పోసినా త్రాగేస్తోంది. అందుకని అమ్మేయాల్సొచ్చింది”

సారథి నిశితంగా అతని ముఖంలోకి గ్రుచ్చి చూస్తూ, “ఇదంతా నిజమని నమ్మమంటావు!” అన్నాడు.

శేఖర్ మాట్లాడలేదు. అతని ముఖంలో నీలినీడలు చూసి సారథి అర్ధమయిందన్నట్లుగా తల పంకించేడు.

“మనది అపూర్వమైన స్నేహమని భావించేను. కాని నీకు అన్నివిధాలా చాలా దూరంలో వున్నానని ఇప్పుడే అర్ధం అవుతోంది” సారథి నిష్టూరంగా అంటుంటే శేఖర్ గాభరాగా చూశాడు.

“అలా అందుకనుకుంటున్నావ్?”

“అనుకోకుండా ఎలా వుండగలను. డబ్బుకోసం నువ్వెంత యిబ్బంది పడుతున్నావో నాకు అర్ధం కాలేదనుకుంటున్నావా? ఇంత కష్టపడుతున్నప్పుడయినా, నీ ప్రాణంలో ప్రాణాన్ని కాకున్నా నీ ఉప్పు తిని గొప్పవాడయిన ఓ స్నేహితుడున్నాడని వాడిని అడగొచ్చని ఎందుకనుకోలేకపోయావ్? అంటే నాలాంటి వాడి దగ్గర అడిగి తీసుకోటం నీకు చిన్నతనమనిపించింది కదూ!” సారథి రోషంగా అన్నాడు.

శేఖర్ ఆప్యాయంగా సారథి భుజం నొక్కి “నువ్వు నన్నపార్ధం చేసుకుంటున్నావు. నేను మరీ అంత దీనావస్థలో లేను. నిజమే. నామీద ఒక్కసారే ఎన్నో బాధ్యతలు పడ్డాయి. వాటన్నింటినీ నాకున్నదానితోనే సర్దుబాటు చేసుకోవటం నేర్చుకోవాలని అనుకున్నాను. ఓ పక్క శంకరం మాష్టారు జబ్బు, మరో పక్క స్వాతి డెలివరీ, ఇంకోపక్క హౌస్ ఎలాట్మెంటు, నాకు కాస్త వూపిరాడని మాట నిజమే.

బైక్ నాకు చదువుకునే నాటినుంచి వుంది. దాని అవసరం నాకు తెలియదు. మాకు ఎన్నో కార్లు వున్నా నాకు సరదాగా దీనిమీద తిరగటమే పెద్ద హాబీ. అలా నేను దాని అవసరం సంగతి ఆలోచించకుండానే అలవాటు పడిపోయేను. అప్పుడు నా సంపాదనతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి కాదు నాది. ఇప్పటి పరిస్థితులు వేరు. నా ఖర్చుకి, నా సంపాదనకి లంగరు కుదరకపోతే నలుగురూ నవ్వుతారు. నేను అందరిముందూ అసమర్ధుడిగా నిలబడాల్సొస్తుంది. అందుకే ఓ నెల బైక్ మీద నేను పెడుతున్న ఖర్చు లెక్క వేసి చూసేను. అది నన్ను మోస్తున్నట్లే మోస్తూ  ఆర్ధికంగా అగాధంలోకి తోసేస్తున్నదని తెలిసి ఆశ్చర్యపోయేను. పైగా ఇల్లు చాలా అవసరం. అది వుంటే తిన్నా తినకపొయినా మనల్ని అడిగేవాడుండడు. నిజానికి ఈ ఊరేం అంత పెద్దదని. ఆఫీసు రెండు ఫర్లాంగుల దూరం కూడా లేదు. నడక ఆరోగ్యానికి మంచిది కూడా. అందుకే యివన్నీ ఆలోచించి దాన్ని డిస్పోజ్ చేసేసేను. ఇందులో నీపట్ల ద్రోహంగా నేను చేసిందేమిటో చెప్పు” అన్నాడు నవ్వుతూ.

సారథి స్నేహితుడి కళ్లలోకి ఆరాధనగా చూసి “ఇంత బరువూ నువ్వొక్కడివే మోయకపోతే, కనీసం స్నేహితుడిగా నాకూ కొంచం బాధ్యత అప్పగించకూడదూ!” అన్నాదు బాధగా.

శేఖర్ నవ్వేసేడు.

“అలాంటి రోజు వస్తే నాకు నువ్వుగాక మరెవ్వరున్నారని. నేను చెప్పకుండానే నన్ను ఆదుకుని నాపట్ల నీకున్న ప్రేమని నిరూపించుకుందువుగాని!” అన్నాడు.

చీకటి పడింది.

ఇద్దరూ తిరిగి వూరివైపు నడక సాగించేరు.

స్వాతి చంటిపిల్లాణ్ణి వుయ్యాల్లో వేసి వూపుతోంది. స్వాతి చెల్లెళ్లు వసుధ, జ్యోతి, సుహాసినితో హాల్లో కూర్చుని చదువుల సంగతి మాట్లాడుకుంటున్నారు.

వసుధ ఇంటర్మీడియట్ ఫస్టుక్లాసులో పాసయ్యింది. ఆ అమ్మాయికి మెడిసిన్ చెయ్యాలని ప్రగాఢమైన కోరిక. కాని ఆర్ధికమైన పరిస్థితులు ఆమెకు విరుద్ధంగా వుండి ఆమె కోరికను మొదట్లోనే త్రుంచేస్తున్నాయి.

“నన్ను మా అన్నయ్య మెడిసినే చదివిస్తాడట!” అంది గర్వంగా సుహాసిని. వసుధ ముఖం చిన్నబోయింది. “అలా గట్టిగా నిలబడే అండ తమకెవరున్నారు. ఇప్పటికే శేఖర్ బావకి తమ కుటుంబం ఎంతగానో రుణపడి వున్నారు. ఇంకా తన చదువు బాధత ఎక్కడ నెత్తిన పెట్టగలము!”

“ఏమిటి ఆలోచిస్తున్నారు తీవ్రంగా?” సారథి నవ్వుతూ లోపలికొచ్చేడు.

“పాపం వసుధకి మెడిసిన్ చదవాలని వుందట” అంది జాలిగా సుహాసిని.

“దానికంత ఆలోచన దేనికి? చదువు!” అన్నాడు సారథి.

ఆ అమ్మాయి అతనివంక అదోలా చూసి తల దించుకుంది.

సారథికి అర్ధమైంది. తనలా తొందరపడి మాట్లాడి వుండకూడదనుకున్నాడు.

“ముందు అప్లయి చేయి, ఎంట్రన్సు అంటూ ఒకటుంది కదూ!” అన్నాడు నవ్వుతూ.

“తీరా సీటొస్తే…?” కడిగింది జ్యోతి.

“చదివేయటమే!”

“మెడిసిన్ చాలా కాస్ట్లీ చదువట కదండీ!” సందేహం వెలిబుచ్చింది ఆశగా వసుధ.

“అది అపోహ మాత్రమే. నీకు మంచి మార్కులు వస్తే స్కాలర్షిప్ వస్తుంది. జాగ్రత్తగా వుంటే దానితోనే మానేజ్ చేసుకోవచ్చు.”

ఆ అమ్మాయి కళ్లు సంతోషంతో రెపరెపలాడేయి. శేఖర్ రావటంతో ఆ సంభాషణ అంతటితో ముగిసింది. శేఖర్ వచ్చీ రాగానే శంకరంగారి గదిలోకెళ్లి ఆయన్ని పరామర్శించి, పళ్లు, హార్లిక్సు సావిత్రమ్మ చేతికందించేడు.

క్రొత్త యింట్లోకి రాగానే శేఖర్ శంకరంగారి కుటుంబాన్ని తమ యింటికి తీసుకొచ్చేడు.

శంకరంగారి పరిస్థితి మెరుగయిందంటూ ఏమీ లేదు. ఆయనకి అన్నీ మంచం మీదే జరిగిపోతున్నాయి.

సారథి తల్లి సావిత్రమ్మ ఆయనకి యెంతగానో సేవ చేస్తోంది. శేఖర్ భోంచేసి హాల్లొకి రావటంతో వసుధ, జ్యోతి, సుహాసిని మెల్లిగా అక్కగారి గదిలోకి జారుకున్నారు.

“మీ బావగార్ని చూసి ఎందుకలా భయపడిపోతారు?” అంటూ నవ్వింది స్వాతి.

“భయం కాదు.. గౌరవం” కొంటెగా అంది జ్యోతి.

“అబ్బా… నీకే!” వెక్కిరించింది వసుధ.

“నాకే!” అంది జ్యోతి భయం నటిస్తూ.

“అవును. అందుకే బావటు వెళ్లగానే, బావ యెలా నడిచేది, మాట్లాడేది యిమిటేట్ చేసి నవ్వుతావు” అంది వసుధ.

“నిజంగానా?” ఆశ్చర్యంగ అడిగింది స్వాతి.

“నిజమేమిటి? అది వెక్కిరించని మగపురుషుడు యీ బజార్లో లేడు. అందుకే టెంత్ మళ్లీ తప్పింది.”

“అలా చదువుకీ దానికీ ముడిపెట్టకు. ఇమిటేషన్ అంటే తమాషానా! అది గొప్ప ఆర్టు! నువ్వు చెయ్యి చూద్దాం!” రోషంగా అడిగింది జ్యోతి.

“నేను కూడా ఒప్పుకుంటాను గాని ఏదీ, ఒకసారి మీ బావగారిలా నడు చూద్దాం!” అంది స్వాతి ఉత్సాహంగా.

“అమ్మో! నువ్వు మళ్ళీ బావకు చెప్పేస్తావ్. ఆయన నాకింక స్కూలు ఫీజు కట్టరు.”

“కట్టకపోతే నీకే మంచిదికదా. ఇంచక్కా చదువు బాధ తప్పిపోతుంది” అంది సుహాసిని నవ్వుతూ.

“అదీ నిజమే అనుకో. కాని యింట్లో యేం తోస్తుంది, బోర్. కాస్త చదువు వంకతో అలా నాల్గు వీధులు తిరిగి కాలేజీ కెల్తే కాలక్షేపం కదూ!” అంది జ్యోతి కళ్లు తిప్పుతూ.

“అది సరేలే. బావగారి నడక చూయించు” అంది స్వాతి కంగారుపెడుతూ.

జ్యోతి లేచి నిలబడింది. శేఖర్‌లా బైక్‌కి తాళం వేసి ఒక పక్కకి తల ఒరిగించి విజిల్ వేస్తూ గబగబా నడిచింది.

వసుధ, సుహాసిని ఉత్సాహంగా చప్పట్లు కొట్టేరు.

స్వాతి గట్టిగా నవ్వేస్తుంది.

సరిగ్గా అప్పుడే బయట గురకలాంటి చప్పుడు. కుర్చీ పడిపోయిన శబ్దం.

“ఏవిటది?” అంది స్వాతి కంగారుగా.

వసుధ, సుహసిని, జ్యోతి హాల్లోకి పరిగెత్తారు.

వాళ్లు వెళ్లినవాళ్లు తిరిగి రాలేదు.

స్వాతి ఆందోళనగా తండ్రి గదిలోకి వెళ్లి చూసింది. ఆయన నిద్రపోతున్నారు. పక్కనే చాపమీద సావిత్రమ్మ కూడా మంచి నిద్రలో వుంది.

స్వాతి ‘హమ్మయ్యా!’ అనుకొంది.

తండ్రి ఏ క్షణం ఏమౌతాడోనని ఆమెకు ప్రతి క్షణమూ ఆందోళనే. ఆమె అలా అనుకుంటూ హాల్లోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి బిగుసుకుపోయింది..

 

 

ఇంకా వుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2021
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031