May 24, 2022

తీరిన కోరిక..

రచన: షమీర్ జానకీదేవి

కీర్తనకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకో తెలియదు. తన క్లాస్మేట్ రమ్య, తను ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇరుగు పొరుగున వుండేవారు. తనకు తమ పెద్ద మామయ్యంటే చాలా భయం. ఆయనను చూడగానే అందరు కనపడకుండా ప్రక్కకు వెళ్ళేవాళ్ళు. ఒక రోజు ఆ మామయ్య బయటికి వెళ్ళిన తర్వాత కీర్తన, రమ్య ఇద్దరు కలిసి సైకిల్ తెప్పించుకుని ప్రాక్టీస్ చేయాలని అనుకున్నారు. వారికి దగ్గరగా ఇంకొక తెలిసిన అమ్మాయి ఉండేది. తను కొంచెం ఫ్రీగా బయటకు వెళ్ళేది. వాళ్ళ పెద్దలు బయటకు పోకూడదు, తిరగకూడదు అంటూ ఆంక్షలు పెట్టేవాళ్ళు. కనీసం రెండు జడలు కూడా వేసుకునిచ్చేవారు కాదు. అందుకని పెద్దవాళ్ళకు తెలవకుండా, ఆ తెలిసిన అమ్మాయి ద్వారా సైకిల్ తెప్పించుకునేవారు.
అలా ఆ రోజు ఇద్దరు ఆమెతో సైకిల్ అద్దెకు తెప్పించుకున్నారు. గంటకు పావలానో, అర్థరూపాయో వుండేది.. అనుకున్న ప్రకారం, మామయ్య బయటికి వెళ్ళిన తర్వాత తమ స్నేహితురాలు సైకిల్ తిసుకుని వచ్చింది. ఆమెకు కూడా సైకిల్ తొక్కటం రాదు. అక్కడికి దగ్గరే కాబట్టి సైకిల్ నడిపించుకుంటూ తీసుకొచ్చింది. కాసేపు సైకిల్ చుట్టూ తిరిగారు. తన ప్రెండుకు కొన్ని మెళకువలు తెలుసు. అవి ఆమె చెపుతుంటే, కీర్తన, రమ్య తమకు దొరికిన వరంలాగా, క్లాసులో పాఠాల్లాగా విన్నారు. ఇద్దరు ఒకటి, రెండు సార్లు నడిపారు.
ఇంతలో మామయ్య వస్తున్నట్లుగా తెలిసింది. ఆయన ఎప్పుడూ మంది మార్బలంతో, తెల్లటి బట్టలు వేసుకుని, మన ఘంటసాలగారిలాగా పంచెలో ఉండేవారు. ఎవరినైనా శాసించే స్వరం. ఆయన అంటే అందరికీ భయమే. ఆయనకు ఇంట్లో ఒక చెక్క బీరువా ఉండేది. అందులో అనేక ప్రముఖుల పుస్తకాలు, విశ్వనాథవారి ‘వేయి పడగలు’, అడవి బాపిరాజు గారి ‘గోన గన్నారెడ్డి’, ఇంకా శరత్, చలం గారలు వ్రాసిన పుస్తకాలు అనేకం ఉండేవి. ఆ బీరువాలో అన్ని వస్తువులు చక్కగా, నీట్ గా అమర్చి ఉంచేవాడు. కొంచెం చెదరినా గుర్తించేవాడు. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇక ఆయన బయటి నుంచి ఇంటికి రాగానే ఎప్పుడూ నేరుగా లోపలికి వచ్చేవారు కాదు. ఇంటి ముందున్న బావి దగ్గర కాళ్ళు చేతులు కడుగుకొని లోనికి వచ్చేవారు. ఆ రోజుల్లో స్నానాలు బావి దగ్గరే చేసేవారు. పనివాళ్ళు నీళ్ళు తోడి పోస్తుంటే స్నానం చేసేవాళ్ళు. ఆయన తన జేబులో ఉన్న డబ్బులు (అప్పుడు చిల్లర పైసలెక్కువగా ఉండేవి), ఇతర వస్తువులు కూడా నీళ్ళతో కడిగేవారు. అవి ప్రస్తుత పరిస్థితులలో మనకు బాగా సరిపోతాయి.
కరోనా ఇలాంటివి గుర్తు చేసి మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తోంది. ఆయన వస్తున్నాడని తెలియగానే సైకిల్ వదిలేసి ఇద్దరూ ఎవరింట్లోకి వాళ్ళూ వెళ్ళిపోయారు.. ఆ రోజు అదృష్టం బాగుండి, మామయ్య చూడలేదు. సైకిల్ తెచ్చిన ఫ్రెండ్ మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకుంది.
అలా సైకిల్ నేర్చుకోవాలనే కోరిక కిర్తనకు ఉత్తరోత్తర కాలంలో, తుంగలో తొక్కినట్లుగా మరుగున పడిపోయింది. కానీ ఆ కొరిక మాత్రము, తనలో వటవృక్షంలా పెరిగింది. ‘మనసుంటే మార్గముంటది’ అని ఒక పాటలో విన్నది. అవసరం మనిషిని అన్ని నేర్చుకునేలా చేస్తుందేమో అని అనుకున్నది కీర్తన..
కీర్తనకు రెండో అమ్మాయి పుట్టినప్పుడు దగ్గరలొ వున్న బ్యాంకులో పని చేసేది. అందరి కంటే ముందుగా వెళ్ళడం, అన్ని టాలీ చేసుకుని ఇంటికి రావడం ఇదీ తన దిన చర్య. ఇంటికి దగ్గరగా ఉంటుందని తనే అక్కడికి ట్రాన్స్ఫర్ చెయించుకున్నది. అక్కడ కొచ్చిన తర్వాత ఇంకొక సమస్య. అక్కడ బస్సులు అంత ఫ్రీక్వెంట్ గా ఉండేవి కావు. ఆటోలు తక్కువే. నడకకు ఎక్కువా బస్ ప్రయాణానికి తక్కువా అన్నట్లుగా ఉండేది కీర్తనకు. అంతకు ముందు చేసిన బ్రాంచికు శ్రీవారితో స్కూటర్ మీద వెళ్ళేది. కన్వేయన్స్ గురించి అంత బెంగ ఉండేది కాదు. ఈ బ్రాంచికి వచ్చిన తర్వాత ఈ సమస్య మొదలయింది. ఉద్యోగం చేసే వాళ్ళకు డ్రైవింగ్ రావాలి. సొంత వెహికిల్ ఉండాలి అనుకునేది. తరువాత కాలంలో పిల్లలు ముగురూ చక్కగా, స్వంతంగా డ్రైవ్ చేసుకునే స్థాయి కెదిగారు. అది తనకు తీరిన కలలా అనుకునేది.. రోజు అలా రోడ్ మీద నిల్చోవడం, అందరూ సానుభూతి చూపటం, తనకు నచ్చేది కాదు. చాలా సమయం ఇలా బస్ కోసం నిల్చుని ఎదురుచూడటం (కూర్చోవడానికి కూడా అనుకూలంగా ఉండేది కాదు) కొంచెం ఇబ్బందిగా వుండేది. పోరాటం నుండే విజయం వస్తుంది అనటానికి, ఇక్కడ తన అనుభవం చాలా ఉపయోగ పడింది. మెటర్నిటి లీవులో వున్నప్పుడు, రెండో అమ్మాయి పుట్టిన తరువాత ఒక నెల మాత్రమే రెస్ట్ తీసుకున్నది. అంతే.
తరువాత మాటల సందర్భంలో తను లూనా తీసుకోవాలనుకుంటున్నట్లు శ్ర్రీవారితో చెప్పింది. అందుకు ఆయన ముందుగా సైకిల్ నేర్చుకుంటేనే బ్యాలన్సింగ్ వస్తుందని చెప్పి ఇంకొక పని ఎక్కువ చేసారు. ఈ వయసులో సైకిల్ తొక్కటం, అందులో బయట రోడ్ మీద ఎలా అనుకున్నది. అమ్మవాళ్ళ ఇంటి ఆవరణ చాలా పెద్దది. ఇక్కడే నేర్చుకో చాలు, కొంచెం నీకు హాండిల్ చేయటం వస్తే చాలు, లూనాను ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. శ్రీవారి ఉచిత సలహ.
ఒక శుభ ముహూర్తాన సైకిల్ అద్దెకు తెప్పించుకుని సైకిల్ నేర్చుకోవటం మొదలుపెట్టింది. ‘చీరలో ఉంటావు. ఎలా’ అన్నారు శ్రీవారు. అది కూడా ఒక సమస్యే. “పర్వాలేదు, నేను ఇలాగే నేర్చుకుంటాను” అని తీరబోతున్నతన కలను తలుచుకుంటూ మొదలు పెట్టింది. లోపలి నుంచి అమ్మ కేకలు. “అసలే బాలింతరాలివి, వంటి పచ్చి కూడా ఇంకా ఆర లేదు. ఏదన్నా జరిగితే పేగు జారుతుంది” అంటూ వెనుకకు లాగే ప్రయత్నం చేసింది. ఒక కోరిక తీరాలంటే దాని కోసం ఎంతైనా శ్రమ పడాలి. అలా ఆవరణలో, శ్రీవారి సహయంతో సైకిల్ తొక్కటం దిగ్విజయంగా నేర్చుకుంది. ఒక వారంలో వచ్చేసింది తనకు. అక్కినేనిగారి లాగా ‘ఎదిగే వయసు కాకుండా, స్పందించే మనసుతో’ సాధించాను అనుకున్నది కీర్తన.
ఇక ఆ తరువాత రు.5000/- పెట్టి కొత్త లూనా కొన్నది.. అందరూ వద్దంటున్నా. పర్వా లేదు. నాకు క్రొత్తదే కావాలని. ఇది మొండితనమో లేక ఆత్మ విశ్వాసమో తెలియదు. ముందు కొన్ని రోజులు తెలిసిన వారి TVS చాంప్ మీద గ్రౌండ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేసింది.

ఎప్పూడూ వెనుక కూర్చునే తనకు అలా కొత్త లూనాపై వెళుతుంటే, ఆ ఆనందం అనిర్వచనీయం. మెటర్నిటీ లీవు తరువాత లూనా మీద బాంకుకు వెళ్ళడం. ఇంటి నుండి 10 నిమిషాలు మాత్రమే. ఇద్దరు అమ్మాయిలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దేవుడు అలా ప్రసాదించాడని అనుకున్నది కీర్తన.
కొన్ని రోజులు అలా లూనా మీద వెళుతుంటే, శ్రీవారు స్కూటర్ మీద వెనుక వచ్చారు, ముందు జాగ్రత్తగా. కానీ ఒక్క రోజు కూడా చిన్న సమస్య కూడా రాకుండా నడిపింది.. బ్యాంక్ దగ్గర్లోనే పిల్లల చదువుకున్న స్కూల్ ఉండేది. అప్పుడప్పుడు పెద్దమ్మాయి స్కూల్ నుండి కీర్తన దగ్గరకు వచ్చేది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళు.. తను వెనుక కూర్చుని “మమ్మీ చూడు, అందరూ ఎలా చూస్తున్నారో. ఇక్కడ ఎవరైనా ఆడవాళ్ళు లూనా నడుపుతున్నారా?’ అంటూ ముఖమంతా ఎలానో పెట్టుకుని వచ్చేది. పాత కాలం రోజులు, అమ్మమ్మ ఇన్ఫ్లూయన్స్ తన మీద ఎక్కువగా ఉండేది. కీర్తనకు టైమ్ చాలా సేవ్ అయ్యేది. ఆ రోజుల్లో, ఆ ఏరియాలో, ప్రత్యేకంగా, ‘లూనా’ నడిపిన వనితగా అందరికి స్ఫూర్తి నిచ్చింది తను. ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలంటే, రాణించాలంటే ఇలాంటి ఎన్నో అనుభవాలు చవి చూడాలి. తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *