March 28, 2023

దేవీ భాగవతం – 6

5 వ స్కంధము, 17వ కథ
శుంభ నిశుంభ వృత్తాంతము

దేవీ భగవతి యొక్క చరిత్రలు అతి ఉత్తమములు. ఆ కథలు సకల ప్రాణులకు సుఖమున యిచ్చెడివి. సకల పాపములు రూపుమాపును.
పూర్వము శుంభుడు, నిశుంభుడు అను దానవ అన్నదమ్ములు ఉండెడివారు. మహాబలశాలురు. వారు బ్రహ్మను గూర్చి తపమును చేసి పది సంవత్సరములు యోగసాధనా నిరతులైరి. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకోమనగా వారు అమరమునకై అర్ధించిరి. ఎవరి చేతను చావు లేకుండా ఉండాలని కోరగా బ్రహ్మదేవుడు అది అసాధ్యమని, ఈ ప్రపంచమున పుట్టిన ప్రతి ప్రాణి మరణించుట తథ్యము కావున వేరొక విధముగా కోరమని చెప్పగా వారు దానవులు, దేవతలు, పక్షులు, జంతువులు ఈ విధముగా ఎవరి వలన వారి ప్రాణములకు ముప్పు లేకుండా ఉండాలని, కేవలం స్త్రీవలన మాకు ఏ భయము లేదు కావున ఏ స్త్రీచేతనైనను మాకు మరణము కల్గు వరమిమ్మనిరి. స్త్రీలు అబలలని, శక్తిహీనులని వారి అభిప్రాయము, బ్రహ్మ అట్లే అని వరమొసగి వెళ్ళిపోయెను.
యిక శుంభనిశుంభుల ఆగడాలకి అంతే లేకుండెను. మిక్కిలి అహంకారముతో విర్రవీగుచూ వారు లోకమున ఎవరికీ లెఖ్ఖచేయక చెలరేగుచుండిరి. చివరకు దేవతలపై దండెత్తి స్వర్గాధిపత్యమునకై యుద్ధము చేసిరి. ఇంద్రుని జయించి, ఐరావతమును, వజ్రాయుధమును, కల్పవృక్షమును, అమృతమును అనేక స్వర్గ సుఖములన్నింటినీ లాగుకొనిరి. యధేచ్ఛగా అమృతమును తాగుచుంటిరి. శుక్రాచార్యుడు వారికి గురువు. ఎందరో దానవులు, దేవతలు వారికి దాసులైరి.
చండముండులను సోదరులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడను మహా బలవంతులు అతనికి సేవచేయుచు సేనాపతులుగా ఉండిరి. శుంభుడు ఇంద్రపదవి చేజిక్కించుకుని వాడి పేరుతోనే హవనములు చేయించుచు విర్రవీగసాగెను. నందనవనం అతని వశమాయెను. కుబేరుని కూడా జయించెను. సూర్య చంద్రులు, యముడు, అతని అధికారమును అంగీకరించక తప్పలేదు.
దేవతలు పర్వత గుహలలోనూ, అడవులలోను తలలు దాచుకొనిరి. వారి తేజస్సు క్షీణించెను. ప్రారబ్ధము వలన వారెక్కడనూ సుఖముగ ఉండలేకపోయిరి. కాలగతి వలన ధనవంతుడు కూడా భిక్షకుడగును. పండితులు అజ్ఞానులగుదురు. బలవంతులు శక్తిహీనులగుదురు. ధీరులు పిరికివారగుదురు. కాలమహిమను ఎదిరించలేక వెయ్యి సంవత్సరములు శుంభుని పరిపాలనకు వారు తలవొగ్గిరి. తుదకు వారంతా వారి గురువైన బృహస్పతిని కలిసి తరుణోపాయము చెప్పమని అడుగగా, బృహస్పతి వారిని అనునయించి, యిదంతా కాలప్రభావమని బోధించి, భగవతి అంబికను ప్రార్థించమనగా దేవతలందరూ హిమాలయ పర్వత సమీపమునకు వెళ్ళి మాయా బీజమును హృదయమున ధారణచేసి దేవిని ఆరాధించిరి.
ఇస్తోత్రమంత్రములను పఠించుచు అందరిలోనూ విరాజమానjైు వున్న దేవీ మా కార్యములను సంపన్నము చేయగల మహాశక్తివని, క్షమ, దయ, వివక్ష, స్మృతి, ధృతి, బుద్ధి, జర, తుష్టి, పుష్టి, కాంతి, శాంతి, సువిద్య, సులక్ష్మి, గతి, కీర్తి, అన్నీ నీవే అని సాష్టాంగపడిరి. ఓ సనాతనీ, మమ్ము కరుణించు అని అనేక విధముల స్తుతించిరి. భగవతి ప్రకటితమయ్యెను. ఆమె సమస్త శుభలక్షణములతో సుశోభితjైు ఉండెను. జగత్తును మోహింప జేయు గొప్ప మోహినీ రూపముతో వెలుగుచుండెను. ఆ జగజ్జనని దేవతలను కరుణించి వారి రాకకు కారణమడుగగా దేవతలందరూ ఆమె శరణు కోరిరి. శుంభ, నిశుంభుల ఆగడాలను వినిపించిరి. పూర్వము మహిషాసుర వధానంతరము ఎప్పుడైన ఆపద వచ్చినా నన్ను ధ్యానింపుమని అమ్మా! నీవు సెలవిచ్చితివి. కావున మేము మిమ్ములను శరణు జొచ్చితిమని వారందరూ సాగిలపడి దేవి చరణములకు మరల మరల నమములిడిరి. ఆ దానవుల వలన మాకు కలిగిన పీడను వదిలించి మమ్ము కావుము అని దీనముగా ప్రార్థించిరి.
వారిట్లు స్తుతించగా ఆ దేవి విగ్రహంనుండి మరొక రూపము ప్రకటితమయ్యెను. దేవీ పార్వతినుండి జగదంబ సాకారరూపయిన ప్రకటితురాలయ్యెను.
ఆ దేవిని అందరూ ‘‘కౌశికి’’ అని పిలిచిరి. పార్వతి శరీరము కృశించి నల్లనాయెను. అందువలన ఆమెను ‘కాళి’ అని పిలిచిరి. ఆమె మిగుల భయంకరముగానుండెను. కాళరాత్రి అను నామము కూడా గలదు.
జగత్తును మోహింపజేయు గానము వారి నోటినుండి వెలువడగా అందరూ ఆశ్చర్యపడుచుండిరి. చండముండులు ఈ విషయము శుంభనిశుంభులకు తెలియజేసిరి. వారు వెంటనే ఆ స్త్రీని యిక్కడకు తెమ్మని చండముండులను పంపగా వారనేక విధములుగా ఆ స్త్రీలతో సంభాషణము చేసిరి. దేవి ఎవరైతే తనతో యుద్ధము చేసి, వీరత్వమును చూపి గెలిచెదరో వారిని యిష్టపడెదనని చెప్పెను. కాని వారు యుద్ధమునకు అంగీకరించలేదు. శుంభుని ఆజ్ఞతో వారు ఆ జగదంబికతో పోరు సలిపి తుదకు మరణించిరి. ధూమ్రలోచనుడు మహావీరుడు. ఆతడును దేవి ఖడ్గమునకు బలి అయ్యెను. రక్తబీజుడు అనేక విధములుగా యుద్ధము చేయుచూ తన రక్తము చిందినచోట మరల ఎంతోమంది దానవులు పుట్టునట్లు చేసెను. అపుడు దేవి కాళితో ఆ రక్తబీజుని రక్తము పడినపుడు దానిని ఒక్క చుక్క కూడా పృధివిపై పడకుండా నాకివేయమని చెప్పగా, కాళి రూపమున ఉన్న దేవి ఆ రక్తబీజుని తలను ఖండిరచి, ఆ రక్తము భూమిపై పడకుండా నాకివేసినది. అతడి కాళ్ళు, చేతులు ఖండిరపబడెను. మహాకాళి రక్తబీజుని చివరకు నిర్వీర్యము చేసినది.
నిశుంభుడు కూడా అట్లే భద్రకాళితో పోరుసలిపి ఎదిరించెను. కాని సింహారూఢjైున మాయామోహిని ధాటికి ఆగలేక చివరకు ప్రాణములు విడిచెను.
అఖరుకు శుంభుడు యుద్ధభూమి చేరి భగవతి జగదంబికను చూచి ఆమె మోహినిరూపము నుండి కళ్ళు తిప్పలేక ఈ రూపములో నీవు సుకుమారిగా వుంటివి. భీకరరూపమున ఉండిన నేను నీతో పోరు సలిపెదనని చెప్పగా మూర్ఖుడా నీవు భద్రకాళీ చాముండితోనే పోరుసలుపుము నేను వీక్షించెదనని దేవి పలికెను.
శుంభునితో భద్రకాళి స్వయముగా తలపడెను. గదా ప్రహారము చేసెను. శుంభుని బంగారు రధమును కాళి ముక్కముక్కలు చేసెను. శుంభుడు పాదచారిjైు కాళిని సమీపించి గదా ప్రహారము చేసెను. దేవి తన కరవాలముతో వాడి కుడిభుజమును నరికెను. తరువాత ఎడమ భుజమును, ఆ పిమ్మట కాళ్ళను నరికి వేసెను. మహాభయంకర నినాదము వాడు చేయుచుండగా భద్రకాళి వాని శిరస్సును తన కరవాలముతో ఖండిరచెను. అప్పుడు వాని ప్రాణములు వాని శరీరమునుండి వెళ్ళిపోయెను.
శుంభ నిశుంభుల మరణములను కనులారా చూసిన దేవతలు జయజయ నినాదములు చేసిరి. భగవతి చండికను, కాళికను స్తుతించసాగిరి. శుద్ధ వాయువులు వీచసాగెను. అంతటా వెలుగులు వ్యాపించెను. అందరూ భగవతి జగదంబికకు ప్రణమిల్లిరి. మిగిలిన దానవులందరూ పాతాళమునకు వెళ్ళిపోయిరి. భూమండలమునున్న జనులంతా ఈ ఉపాఖ్యానమును చెప్పుకోసాగిరి. భగవతి కృపతో పుత్రహీనులు పుత్రవంతులైరి. నిర్ధనులు ధనవంతులైరి. ఈ గాధలు విన్నవారందరీ సకలసుఖములను పొందిరి. శత్రుభయము లేకుండెను. శ్రవణము చేసినవారికి ముక్తి కలిగెను. శుంభ నిశుంభుల కథ సమాప్తం.

5 వ స్కంధము, 18వ కథ
మహామాయ వృత్తాంతము

కృష్ణద్వైపాయనుడు (వ్యాసమహర్షి) జనమేజయుని కోరిక మేరకు చాలా అసక్తికరమైన భగవతీదేవి జగదంబ యొక్క మహాత్మ్యమును గూర్చి ఈ కథను చెబుతూ యిట్లు వివరించెను.
అతి ప్రాచీన కాలమున స్వారోచిష మన్వంతరమున సురథుడను రాజుండెను. చాలా మంచి ఉదార స్వభావుడు. సత్యవాది. కర్మనిష్ఠి. ఎవరితోనూ శత్రుత్వము లేదతడికి. ఒకసారి కొందరు పర్వతనివాసులగు మ్లేచ్ఛులతో అతడికి అకారణముగా పోరువచ్చెను. అతడి మంత్రులు, సేనాపతులు శత్రు పక్షము చేరడంతో సురధుడు ఓడిపోయెను. నీచబుద్ధి కలిగిన వారిని నమ్మరాదు. లోభిjైున వాడు తల్లిదండ్రులను, స్నేహితులని కూడా చూడరు. అతడు ఇలా ఆలోచించి గుర్రమునెక్కి ఒంటరిగా అడవిలోనికి చాలా దూరము ప్రయాణము చేసి సుమేథుడను గొప్ప మునిని కలిసి, అతనికి సాష్టాంగ ప్రణామము చేయగా, ‘‘నీకు మంచికలుగునని’’ సుమేథుడు దీవించెను. తదుపరి, ఆ ముని వివరములు అడుగగా రాజు తనవిషయములన్నీ వివరించి అతనిని శరణుజొచ్చెను. అప్పుడు రాజా మీరు ఇక్కడ నిర్భయముగా జీవితమును గడపవచ్చునని సుమేధుడు భరోసా నిచ్చెను. పిమ్మట సురథుడు అతని ఆశ్రమమున తలదాచుకొనెను.
వేదపఠనము చేయు శిష్యులు, పలు పక్షులు, మృగములతో ఆ ఆశ్రమము సురధునికి చాలా ఆనందం కలిగించింది.
అతడొకరోజు ఒంటరిగా ఆశ్రమములో కూర్చుని తన కుటుంబము గూర్చి చింతించుచుండెను. ఈలోగా ఒక వైశ్యుడు అక్కడికి వచ్చెను. అతడు రాజుని గూర్చి తెలుసుకొనెను. తనను గూర్చి ఇలా చెప్పెను. తన పేరు సమాధి యని, తాను సత్యము తప్ప వేరొకటి పలుకనని, ధర్మముపైనే తన దృష్టి కలదని, తన భార్య, పుత్రులు తనను పిసినారి యని వ్యవహరించుచున్నారని యింటి నుండి వెళ్ళగొట్టిరి అని తెలిపెను. వారిరువురు కొంత సేపు ఒకరి కథ మరొకరు తెలుసుకొని శాంతులైరి. వైశ్యుడు కూడా అక్కడే నివసించసాగెను.
యిరువురు వారిమనసులోని దుఃఖమునకు విచారించి ఋషి పాదములపై పడిరి. తరుణోపాయము చూపించమని వేడుకొన్నారు. స్వామీ, ఎంత వద్దనుకున్ననూ మాకు మా భార్యా పుత్రులు, మిత్రుల ఆలోచనలు మారుట లేదు, అని శోకించిరి. సుమేధుడు శోకమోహములు పోయెడి ఉత్తమ జ్ఞానమును ఉపదేశించెను.
సకలజీవులను బంధమోహముల్లో పడవేసేది మహామాయ. సకల జనులు, దేవతలు, జంతువులు మాయకు అధీనులే! రజో, తమో గుణములచే ప్రేరేపింపబడి ప్రాణులు ఈ మహామాయలో చిక్కుదురు. ఆ మాయ అనాది. ఆమెకు జన్మలేదు. ఆ మాయ లేనిచో జీవి చైతన్యరహితుడేను. సురులు, మనుషులు తమ దుఃఖములు నశించుటకు ఆమెను శరణువేడెదరు. ఆ జగదంబ కృపవల్లనే దేవతలకు శక్తులు లభించెను. ఆమె అధీనము నందే సర్వమూ ఉన్నది. అందుచే ఆమెను ఆరాధించు విషయమును మీకు నేను తెలిపెదను. విధిపూర్వకముగా శుచిస్నాతులై రండి. హవనము ఎట్లు చేయవలెనో చెప్పెదను అని వారిరువురకు హోమము చేయుటకు, నవరాత్రి వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. సంతానం లేనివారు, రాజ్యభ్రష్టులు, విద్యార్థులు, యిలా ఎవరు ఈ నవరాత్రవ్రతమును చేసినా తప్పక మంచి ఫలములు లభించునని తెలిపెను. వారు మిక్కిలి సంతోషించి, భక్తితో అతనికి నమస్కరించిరి. వారి అంతఃకరణము పవిత్రమైనది. ఈర్ష్యాద్వేషములు పోయినవి. గంగవలె పవిత్రులైరి.
సుమేధుడు వారికి నవాక్షర బీజమంత్రమును ఉపదేశించెను. శాంతచిత్తులై తపస్సునొనరించుటకు వారు సిద్ధపడిరి. ఒక మాసము గడిచిన పిదప వారి సంకల్పవికల్పములు పోయాయి. మరో సంవత్సరం తపం చేసిరి. అప్పుడు ఫలమును మాత్రమే ఆహారముగా తీసుకొనసాగిరి. ఆ పిమ్మట ఎండిన ఆకులు తింటూ మరోఏడాది. ఇంద్రియములను వశపరచుకొని జప, ధ్యానములందు నిమగ్నమైరి. మరో రెండేళ్ళ తరువాత వారికి జగదంబ దర్శనభాగ్యమ్ము కలిగినది. స్వప్నమున దర్శించుకోగలిగిరి. వారు జలమును కూడా విడిచి తపముచేసిరి. మూడువత్సరముల తరువాత దేవి ప్రత్యక్ష దర్శనము కాకపోతే శరీరములు వదిలిపెట్టాలని అనుకొన్నారు. చివరకు దేవిని దర్శింపగలిగిరి.
వారి మనసులో గల కోరికను దేవి గ్రహించి రాజునకు పదివేల సం. వరకు భూమండలమును పాలించమని, తదుపరి నీవు శాంతించి సూర్యుని వద్ద జన్మించి మనువు పదవిని పొందెదవని దీవించెను.
వైశ్యుడడిగిన విధముగా అతనిక జ్ఞానమొసగెను. తరువాత రాజు ఋషికి ప్రణామము చేసి తన రాజ్యమును తిరిగి పొంది తన పరివారమును కలిసి పృధివిని పాలించెను. వైశ్యుడు కూడా పరమజ్ఞానిjైు వైరాగ్యము కలిగి ప్రాపంచిక బంధముల నుండి ముక్తుడై జ్ఞానమయ జీవితం గడుపుతూ భగవతి చరిత్రలను జనులకు వివరిస్తూ, గానము చేయుచూ తీర్థయాత్రలను చేసెను. దేవి ఆరాధన వలన సురధునకు, సమాధికి సముచిత పదములు లభించెను. ఈ ఉత్తమ ప్రసంగమును వినుట్లన జనులకు సాంసారిక సుఖములు ప్రాప్తించును. జ్ఞాన మోక్షములు లభించును. ఏమియు సంశయము లేదు.

ఆరవ స్కంధము, 19వ కథ
వృత్రాసురుని కథ

పూర్వము వృత్రాసురుడను పరాక్రమవంతుడైన అసురుడుండెను. ఇంద్రుడతనిని వధించెను. అతడు బ్రహ్మవంశమున జన్మించుటచే అతడిని చంపిన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాపము తగులుకొనెను. ఇంద్రుడు కపటముతో నీటి నురుగు ద్వారా అతనిని చంపెను. ఈ గాధ చాలా ప్రాచీనమైనది. వృత్రాసురుడొక్కడేకాని యిరువురు ఎట్లు వధించిరి అని జనమేజయుడు అడుగగా ఈ కథ ‘‘బహృచ బ్రాహ్మణమునందు, పురాణ ప్రసిద్ధమై యున్నదని వ్యాసుడిట్లు వృత్రాసురుని వృత్తాంతమును జనమేజయునికి వివరించెను.
‘‘త్వష్ట’’ యను ప్రజాపతి గొప్ప తపస్వి దేవతలలో ప్రముఖుడు. దేవకార్యములన్నీ అతడే నిర్వర్తించేవాడు. కార్యకుశలుడు. బ్రాహ్మణులంటే అమిత గౌరవం.
త్వష్టకు విశ్వరూపుడు అనే ఒక కుమారుడుండెను. వాడికి మూడుతలలు. అతడు ఆకర్షితుడుగా ఉండి శోభిల్లేవాడు. వేరువేరు కార్యములను ఒకేసారి చేసేవాడు. వేదములు చదవడం, సురాపానం చేయడం సకల దిక్కులను చూస్తుండేవాడు. గొప్ప తపము నాచరించెను. ధర్మనిష్టగలవాడు. అగ్ని వేసవిలో పంచాగ్నుల మధ్య తపస్సు చేసేవాడు. హేమంతంలో చల్లని నీటిలో తపము చేసేవాడు. నిరాహారిగా ఉంటూ ఇంద్రియముల నియంత్రించి ఘోరతపమాచరిస్తూ ఉండే వాడు. కాని అతని బుద్ధి యందు కొంత మాలిన్యము ఉండెను.
అతని తపము ఇంద్రునికి దుఃఖము కలిగించెను. తన ఇంద్రపదవిని అతడు పరిగ్రహించునేమో అని తలచి రాత్రింబవళ్ళు నిద్రకరువైంది. విశ్వరూపుని శక్తి అధికమయ్యెను.
శత్రువు శక్తి వృద్ధి అగుట చూసి ఇంద్రుడు అనేక ఉపాయములు పన్నెను. అప్సరసలను పంపి తపోభంగము చేయమనెను. వారి నృత్యములతో, అందముతో, హావభావములతో, శృంగార చేష్టలతో అతని దృష్టి మరలించుటకు ప్రయత్నించేరు. కాని ఇంద్రియ విజయడు అగుటచేత వారి ప్రయత్నములు విఫలములయ్యెను. ఓటమితో ఇంద్రుని చేరిరి. ‘‘తపః ప్రభావమున అగ్ని వలె అతని తేజమున్నది. మా ప్రయత్నములు విఫలమయ్యెను. సౌభాగ్యవశము అతని శాపమునకు గురికాలేదు అని వారు ఇంద్రునితో విన్నవించుకున్నారు.
ఇంద్రుడు ఐరావతము నెక్కి విశ్వరూపుని సమీపించెను. అతడు ధ్యానమగ్నుడై ఉండెను. తన వజ్రాయుధముతో అతని శిరస్సును ఖండిరచెను. పర్వత శిఖరమువలె ముని నిర్జీవిjైు పడెను. అక్కడి మునిజనులు ఇంద్రుని బ్రహ్మ హత్యా పాతకము తగులునని దూషించిరి.
ఇంద్రుని వజ్రాయుధము తగిలినను ముని జీవించుచున్నట్లే కనబడసాగెను. అపార తేజముతో వెల్గుచుండెను. ఇంద్రుడు తక్షకుడను సర్పరాజును పిలిచి అతని భుజములు శిరస్సు ఖండిరచమని ఆజ్ఞాపించెను. తక్షకుడు తానా కర్మ చేయనని అది పరమ నీచమని చెప్పెను. ఈ నీచకర్మ చేసిన నాకు లాభమేమి అని అడుగగా అప్పటినుండి యజ్ఞముల యందు శాశ్వతముగా భాగమునివ్వవలెనని ఇంద్రుడు నిశ్చయించెనని చెప్పెను. మానవులు బలులు ఇచ్చెదరని, అవి తక్షకునికి చెందునని ఇంద్రుడు సెలవిచ్చెను.
లోభముతో తక్షకుడు యింద్రుని ఆజ్ఞతో ధృఢమైన గండ్రగొడ్డలిని తీసుకుని త్రిశిరుని మూడు తలలు ఖండిరచెను. ఆ తలలు భూమిమీద పడగానే వాటినుండి వేలకొలదీ పక్షులు జన్మించెను. ముని ముఖమునుండి పావురములు, తిత్తిర పక్షులు, గోరువంకలు, వేరువేరుగా ఆవిర్భవించెను. సోమరసము పానము చేయు ముఖమునుండి పావురములు, నలుదిక్కుల చూసే ముఖమునుండి తిత్తిర పక్షులు, మధువు త్రాగు ముఖమునుండి గోరువంకలు ఉత్పన్నమాయెను. పక్షులు అన్నీ ఆకాశమునకు ఎగిరిపోయెను.
యజ్ఞఫలము దక్కునని తక్షకుడు సంతోషించెను. శత్రువు మరణించెనని ఇంద్రుడు సంతోషించెను. బ్రహ్మహత్యాఫలమునకు ఆతడు చింతించలేదు. కాని తన కుమారుని మరణమునకు త్వష్ట అమిత విచారము పొందెను. నా కుమారుని చంపినవానిపై నేను ప్రతీకారం తీర్చుకుందునని ప్రతిన బూనెను. అతనిని చంపుటకు మరల పుత్రుని కంటాను అని త్వష్ట అధర్వణ వేదమంత్రములను ఉచ్ఛరించుచు అగ్నిలో హవనము చేసెను. అతనిలో కోపము రగిలెను. ఎనిమిది రాత్రులు యజ్ఞము చేసెను.
ఆ అగ్ని నుండి ఒక పురుషుడు ప్రకటితమయ్యెను. మహా తేజస్సుతో అగ్నివలె నుండెను. అతడు త్వష్టను చూడసాగెను. అప్పుడు త్వష్ట ‘‘బాలుడా! నీవు ఇంద్రుని శత్రువువి. నా తపః ప్రభావముతో శక్తివంతుడవు కమ్ము’’ అనెను.
ఆ పురుషుడు అగ్నితేజముతో మిక్కిలి పెద్దగా పెరగసాగెను. పర్వతమువలె పెరగసాగెను.
తండ్రీ మీరెందుకు కలతపడుతున్నారు. తండ్రి దుఃఖమును తీర్చువాడే పుత్రుడు కదా. సముద్రమును త్రాగవలెనా, కొండలు పిండిచేయమందురా అని అతడు గర్జించెను.
నాయనా నీవు ‘‘వృత్రుడని జగత్తులో ప్రసిద్ధుడవగుదువు. ఆపదనుండి రక్షించేవాడవు, నీ సోదరుని ఇంద్రుడు వధించెను. ఆ ఇంద్రుడు మహాపాపి. బ్రహ్మఘాతకుడు, ’’ అని చెప్పి శీఘ్రగమనము గలది మరియు సమర్ధవంతమైన ఒకరథమును ఆతనికొసగెను. అతడు ఇంద్రునిపైకి యుద్ధమునకు సిద్ధపడెను. ఆ భయంకరాకారుని గూర్చి ఇంద్రుని దూతలు ఇంద్రునకు వివరించిరి. అదే సమయమున అనేక అపశకునములు ఎదురయ్యెను. కాకులు, గ్రద్దలు, డేగలు ఇళ్ళలోకి జొరబడు చుండెను. జంతువుల కళ్ళనుండి నీరు కారెను. మహోత్పాతములు జరుగుచుండెను. నక్కలు ఇళ్ళముందు తిరుగాడసాగెను. ఇంద్రుడు బృహస్పతిని పిలిచి తరుణోపాయము అడిగెను.
నీవు నీచకర్మను చేశావు. సకలదేవతలూ కలిసినా ఆ అసురుని చంపలేరు అని పలికెను. మునులు, దేవతలు ఇళ్లను వదిలి పారిపోయిరి.
వసువులు, అశ్వనీకుమారులు, భగుడు, వాయువు, ఆదిత్యులు, ఇంద్రుడు వారి వారి వాహనములపై బయలుదేరిరి. యుద్ధము ప్రారంభమయ్యెను. దేవతలు పరాజితులైరి. త్వష్ట సంతోషించెను.
అతడు తన సుతునకు తపస్సుయొక్క ప్రాముఖ్యమును వివరించెను. తపమువలన లక్ష్మి లభించగలదని, బుద్ధి, బలము చేకూరునని, విజయము కల్గునని చెప్పెను. బ్రహ్మ తూర్చి తపము చేయుమని చెప్పెను. గంధమాదన పర్వత సమీపమున వృత్రాసురుడు ఘోరతపము మొదలిడెను. ఇంద్రుని ఆజ్ఞతో దేవతలు తపోభంగమునకు పూనుకొనిరి. కాని ఫలితము దక్కలేదు. వంద ఏళ్ళు తపమొనరించగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యెను. వరము కోరుకోమనెను. ఆతడు బ్రహ్మకు ప్రణమిల్లి ఇట్లు వరమడిగెను. ‘‘లోహముతో గాని, కఱ్ఱతోగాని, తయారైన, ఎండిన, తడిసిన శస్త్రాస్త్రములతోను మరణము రారాదు, ’’ అని అడుగగా బ్రహ్మ అటులనే అని వరమొసగెను. తండ్రికి తన వరము గురించి తెలిపి వృత్రాసురుడు మరల ఇంద్రునిపై యుద్ధము ప్రకటించెను. భయంకర యుద్ధము దేవదానవుల మధ్య జరిగెను. అతడు క్రోధాగ్నితో ఇంద్రుని కవచమును వస్త్రములను తీసి ఇంద్రుని నోటిలో వేసుకొనెను.
దేవతలందరు బృహస్పతి అ అనుమతితో ఇంద్రుని విడిపించుటకు శత్రుసంహారమొనరించు ఆవులింతను సృష్టించిరి. వృత్రాసురుడు నోరుతెరిచి ఆవులించెను. ఇదే అదనుగా యింద్రుడు సూక్ష్మరూపములో బయటకు వచ్చెను. అప్పటినుండి లోకములో ఆవులింతలు వచ్చెను. మరి పదివేల సంవత్సరములు పోరుసలిపిరి. ఇంద్రుడు పారిపోయెను. దేవతలు పారిపోయిరి. స్వర్గాధిపత్యమును వృత్రాసురుడు దక్కించుకొనెను. స్వర్గసుఖాలన్నీ అతని అధీనము లోనికి వచ్చినవి. పారిజాత వృక్షము, ఐరావతము, ఉచ్ఛైశ్రవము, కామధేనువు, నందనవనం అన్నీ వానికి లభించాయి. దేవతలకు యజ్ఞభాగములు అందలేదు. ఇంద్రునితో సహా అందరూ కైలాస పర్వతమునకు వెళ్ళిపోయిరి. అందరూ శంకరుని శరణు వేడిరి. బ్రహ్మతో సహా అందరూ విష్ణువుకడకు వెళ్ళిరి.
ఆ శ్రీహరి వారి మొరవిని ఒక ఉపాయము తెలిపెను. బ్రహ్మ వరముచే అతడు పెట్రేగిపోతున్నాడు. ఏదైనా ప్రలోభముచే అతడు ఓడును. అందుచే అందరూ వెళ్ళి అతనికి యింద్రునితో మైత్రిని కలిగించండి. మంగళకారిణి jైున భగవతిని ఆరాధించండి. ఆ మాత కృపవలన సిద్ధికలుగునని, మధుకైటభులను వధించుటకు ముందు తాను కూడా ఆ పరాశక్తిని ఆరాధించానని విష్ణువు చెప్పెను.
అమ్మా! మాకు ప్రసన్నురాలవు కమ్ము మమ్ము రక్షింపుము అని అనేక విధముల స్తోత్రములతీ దేవతలంతా దేవిని ప్రార్ధించిరి. దేవి ప్రత్యక్షమై మనోహర రూపములో వారి ఎదుట నిలిచెను. చతుర్భుజములతో, సకలాభరణములతో, చక్కని స్వరముతో, ఘల్లు ఘల్లు శబ్దములతో ఆమె కనబడెను. అట్టి సుందరమైన రూపిjైున అంబికను చూసి వారు ప్రణామాలిడిరి. వారికి విజయము కల్గునని ఆమె అంతర్థానమయ్యెను.
దేవతలు కపటముతో వృత్రాసురుని చేరి ప్రియమైన మాటలను చెప్పసాగిరి. సామనీతిని ఉపయోగించిరి. అతనితో సంధి తమకు సమ్మతమనిరి. ఎండి, తడిసిన అస్త్రములతో, రాళ్ళతో, వజ్రములతో, పగటి, రాత్రులలో, దేవతలలో గూడి ఇంద్రుడు తనను చంపరాదని నియమముతో వృత్రాసురుడు ఇంద్రునితో సంధికి ఒప్పుకొనెను. వారిరువురు కలిసి తిరుగుచుండిరి. సముద్రతీరమున యధేచ్ఛగా తిరుగసాగిరి. త్వష్ట అనేక మారులు పుత్రుని హెచ్చరించెను. ఇంద్రుడు కపటి యని, పూర్వవైరి యని చెప్పెను. కాని వృత్రాసురుడు తండ్రి మాటలను లెక్కచేయలేదు.
ఒక సంధ్యవేళ వృత్రాసురుడు సముద్రతీరమున నుండెను. రాత్రి పగలు కాదు, సముద్రము మీద నురుగు ఉండెను. అది ఎండినది, తడిసినది కాదు. శస్త్రము కాదు. ఆ నురుగును ఇంద్రుడు చేతిలోకి తీసుకుని పరాశక్తి భగవతిని ప్రార్ధించెను. ఆ శక్తి ఆ నురుగులో ప్రవేశించెను. వజ్రమునందు విష్ణువు ప్రవేశించెను. ఆ వజ్రము నురుగుతో కప్పబడెను. యింద్రుడు నురుగుతో ఉన్న ఆ వజ్రాయుధము వృత్రాసురునిపై విసిరెను. అతనిని ఆ వజ్రాయుధం ఖండిరచెను. వాడు నేలగూలెను.
దేవతలు, ఇంద్రుడు ఆనందమునకు అంతేలేదు. అనేక విధముల స్తోత్రములతో వారు దేవిని ప్రార్ధించిరి. ప్రణతులిడిరి. పద్మరాగ మణులతో భగవతి మూర్తిని నిర్మించిరి. తమ దివ్య భవనముల యందు ప్రతిష్టించిరి. త్రిసంధ్యలలో ఆరాధించిరి. అప్పటినుండి ఆ శ్రీదేవి దేవతలకు దేవత అయ్యెను. అందరూ ఉత్సవాలు చేసుకొనిరి. ఇట్లు వృత్రాసురుని సంహరించుట ఇంద్రునికి సులభమయ్యెను. ఆ దేవి ఇంద్రుని ద్వారా అతనిని వధింపజూచెను. అందువలన ఇంద్రుడు ఆ దానవుని చంపెనని అందురు.
వృత్రాసురుని వధ సమాప్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2021
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031