May 24, 2022

పాపం నీరజ!

రచన: రాజ్యలక్ష్మి బి

నీరజకు యీ మధ్య భర్త రాజారాం పైన అనుమానం వస్తున్నది.
“ఆఫీసు 5 కల్లా అయిపోతుంది కదా? మీరు రాత్రి 11 అయినా ఇంటికి చేరరు? “ఒకరోజు నీరజ భర్తను నిలదీసింది.”
మా ఆఫీసర్ కి నేనంటే నమ్మకం, నమ్మకమైన ఫైళ్లు నాచేత చేయిస్తాడు, అనో “స్నేహితులు పట్టుబట్టి సినిమాకు లాక్కుపోయారు “అనో రోజూ ఏదో ఒక అల్లుతాడు రాజారాం !
ఒక్కొక్కరాత్రి మెలకువ వచ్చి చూస్తే నీరజకు పక్కమీద కనపడడు !
“ఏమండీ “అని ప్రశ్నిస్తే
“ఉక్కపోస్తుంటే ఆలా బయట చల్లగాలిలో నడిచి వస్తే నిద్ర పడుతుందని వెళ్లాను “సమయానుకూలంగా జవాబు వస్తుంది
ఒక రోజు నీరజ ఆయాసంగా మెట్లెక్కడం రాజారాం చూసాడు.
“ఒళ్లు విపరీతంగా పెంచావు ఆ పొట్ట చూడు, ఆయాసం రాక మరేం వస్తుంది “అంటూ నవ్వాడు.
దాంతో నీరజకు భర్త పైన రోజురోజుకు అనుమానం పెరుగుతున్నది.
కొంపదీసి యీయన యే వన్నెల వయ్యారికో చిక్కలేదు కదా తాను లావుగా వున్నానని యేమార్చి తిరగడం లేదు కదా !! నీరజకు సవాలక్ష సందేహాలు !!!!
ఈ మధ్య ఖరీదైన వాచీ కొన్నాడు.
” డబ్బులెక్కడివి “అడిగింది.
“ప్రమోషను వచ్చింది “అన్నాడు.
ఒక్కోసారి ఇంటికే రావడం లేదు
అడిగితే “కాంపుకెళ్లాను “సమాధానం
ఇక లాభం లేదు, ఆ రంగేళీ యెవరో తెలుసుకోవాలి, చూస్తూ కూర్చుంటే కాపురం కొల్లేరవుతుంది అనుకున్నది నీరజ.
ఎలాగయినా అసలు భర్త యెక్కడికి వెళ్తున్నాడు, తెలుసుకోవాలి !
ఒకరోజు కోటుజేబులో వెయ్యిరూపాయల నోట్లకట్ట కనిపించింది. నీరజకు దుఃఖం ఆగలేదు !
కానీ యేడ్చి ఏం సాధిస్తాను అనుకున్నది. బాగా ఆలోచించింది. నేరాలు కూపీ తీసే ఆఫీసుకు వెళ్లి భర్త వివరాలు యిచ్చి అసలు సంగతి కనుక్కోమంది.
వాళ్లు నవ్వుతూ “హత్యలు నేరాలూ కూపీ తీసాం యిలాంటి కేసు మాకు మొదటిది “అన్నారు.
ఆ తర్వాత నీరజ రాజారాం చెప్పేవి నవ్వుతూ వినేది.
వారం రోజులు గడిచాయి. ఒకరోజు రాజారాం బీరువా సొరుగు నీరజ చూసింది. అట్టపెట్టె మెత్తటి శాటిన్ లో మిలమిలా మెరుస్తున కాసులపేరు గొలుసు !యేమైనా యీ గొలుసు ఆ వయ్యారికి దక్కకూడదు అనుకుంటూ నీరజ నగను తన బీరువాలో దాచేసుకుంది.
అప్పుడే రాజారాం వచ్చాడు అక్కడికి. తన బీరువా సొరుగులో నగ కనిపించలేదు.
“నీరజా అట్టపెట్టె తీసావా “ప్రశ్నించాడు
“ఏం పెట్టె “తెలియనట్టు అడిగింది
“కాసులపేరు పెట్టె “అన్నాడు
“మనకెక్కడిది? “అడిగింది
“ఎక్కడిదేమిటే పిచ్చిమొహమా నీ కోసమే కొన్నాను “అన్నాడు రాజారాం.
“కొంటున్నట్టు నాకెందుకు చెప్పలేదు అయినా ఇంత డబ్బెక్కడిది మీకు ? “అంటూ నీరజ నిలదీసింది !
“నీకెందుకు అదంతా! యేది ఆ పెట్టె “విసుక్కుంటూ రాజారాం చికాకుగా చూసాడు.
ఇంతలో తలుపు యెవరో బాగా శబ్దంతో కొడ్తున్న చప్పుడు వినిపించింది.
నీరజ తలుపుతీసి చూస్తే —–పోలీసులు !!!!!!!!విస్తుపోయింది.
వాళ్లు వస్తూనే రాజారం చేతులకు సంకెళ్లు వేసారు. నీరజకు అర్ధం కాలేదు !
ఇల్లంతా సోదా చేసారు. రాజారాం బీరువాలో బట్టల మడతలలో రకరకాల బంగారు కాయిన్లు, రకరకాల పెన్నులు, నోట్లకట్టలు బయటకు తీసారు ! కాసులపేరు గొలుసుకూడా లాక్కున్నారు
“అది నా భార్య గొలుసు, ఆమెది ఆమెకు యిచ్చెయ్యండి “అన్నాడు రాజారాం.
“ఆ సంగతి కోర్టులో తేలుతుంది. యీ నగ కూడా దొంగసొమ్ములో చేర్చాల్సిందే “అన్నారు పోలీసులు.
“దొంగసొమ్మేమిటీ “నీరజ కంగారు కంగారుగా ప్రశ్నించింది. “ఎమ్మా యేమి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు ?
దొంగ గారి భార్య కదా ఘరానాగానే మాట్లాడుతారు “ఒక పోలీసు వేళాకోళంగా అన్నాడు.
“నిజం గా మీకు బహుమానం యిప్పించాలి అమ్మా ! మీ ఆయన యెవరో వన్నెల వయ్యారితో తిరుగుతున్నాడని కూపీ తియ్యమని చెప్పారు కదా, అది మాకు చేరింది. మీ ఆయన బండారం బయటపడింది “అన్నారు పోలీసులు.
నీరజ కుప్పలా కూలిపోయింది.

1 thought on “పాపం నీరజ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *