February 5, 2023

శ్రీ గణేశ చరిత్ర (అష్టోత్తర శత కందములు)

రచన: నాగమంజరి గుమ్మా

1.

స్మరియించెద గణనాధుని*
స్మరియించెద విఘ్నపతిని మానసమందున్*
స్మరియించెద నీశ సుతుని*
స్మరియించెద గౌరి తనయు శత కందములన్*
భావం: గణములకు అధిపతి యైన గణేశుని స్మరిస్తాను. విఘ్నములకు అధిపతి అయిన విఘ్నేశుని మనసులో స్మరిస్తాను. ఈశ్వరుని కుమారుడైన వినాయకుని స్మరిస్తాను. గౌరీదేవి కుమారుడైనటువంటి బొజ్జ గణపతిని నూట ఎనిమిది కంద పద్యములలో స్మరించుకుంటాను.

2.

గణనాథుని నుతియించితి*
నణువును నే విద్య జూప నంబిక పుత్రా*
గణపయ్య నన్ను గావుము*
కణమును నే భక్తివరుల గణుతింపంగా*
భావం: గణనాధుని పొగిడితిని. కానీ విద్యలో నేను అణువంత చిన్నదాన్నే… అందుచేత చక్కని పదాలు నాకు రాలేదయ్యా అంబిక కుమారుడవైన గణేసుడా… అయ్యా గణపతి… నన్ను కాస్త కరుణించుము… పోనీ భక్తి ఏమైనా ఎక్కువ ఉందా అంటే నీ భక్తులలో నేనొక చిన్న కణాన్ని. కాబట్టి నిన్ను కీర్తించడానికి తగిన భాషాపటిమను ఇవ్వమని మాత్రమే నిన్ను కోరుచున్నాను.

3.
ఇష్టదైవ ప్రార్ధన

వెతికితి గురువుల చాటున*
వెతికితి పొత్తముల లోన విద్దెల కొరకై*
వెతికిన నను దయజూసెను*
మతికిని మరి సుద్దులిచ్చె మారుతి యనగా*
ఏదైనా పద్యమో, కావ్యమో, గ్రంథమో రాయాలంటే తగినంత పదసంపద, విషయం ఉండాలి. దానికొఱకు నేను గురువులను అడిగాను. ఎన్నో పుస్తకాలలో వెతికాను. ఇన్ని చేసినా స్థిరమైన బుద్ధి నిచ్చి కుదురుగా కూర్చుని రాయాలనే ఉత్సాహాన్ని నింపింది ఆ హనుమడే (మారుతి మా అమ్మగారి పేరు కూడా)

4.
వంశ వర్ణన

అగుపించెడి దైవమ్ములు*
తగురీతిగ సన్నుతింతు తలిదండ్రులకున్*
పగడము ముత్తెములాగున*
పొగిడెద గుమ్మాల వారి పుత్రిక నంచున్*
భావం: కనిపించే దైవములు తల్లిదండ్రులు. పగడము , ముత్యములా కలిసిపోయి, నన్ను తీర్చిదిద్దిన నాన్న శ్రీ గుమ్మా సత్యనారాయణ, అమ్మ శ్రీమతి హనుమ కామేశ్వరి (మారుతి) లను ఈ సందర్భంగా తలచుకొనుచున్నాను.

5.
పుత్రిక గుమ్మావారికి*
పుత్రుడు పట్రాయుడింట పుణ్యము దీరన్*
గోత్రము భరద్వాజ క
ళత్రముగా నీకమరెను లక్ష్మీ పుత్రా*
గుమ్మా వారి అమ్మాయి అయినా, చేసిన పుణ్యాల ఫలముగా భరద్వాజ గోత్రం, పట్రాయుడు వారి అబ్బాయి , శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీ నారాయణరావు గార్ల కుమారుడైన కాశీ విశ్వనాథానికి భార్యగా వచ్చింది.
(ఏదైనా కృతి రాసినపుడు, దైవ ప్రార్ధన, వంశ వర్ణన, గురుస్తుతి మొదలైనవి తొలి పద్యాలలో వచ్చునను పూర్వాచారమును అనుసరించితిని.)

6.

ప్రాణసఖుని ప్రోత్సాహము
నాణెపు పద్దెములు రాయ నలువము గల్గెన్
త్రాణము చాలకునికి యా
వీణాపాణి కరుణించి విద్దెల నొసగెన్
భావం: భర్త ప్రోత్సాహముతో పద్యములు వ్రాయుటలో నైపుణ్యము కలిగినది. నా శక్తి చాలనపుడు ఆ సరస్వతీ దేవి దయవలన తగిన విద్య లభించింది.

7.
కథా ప్రారంభం

శ్రీ విఘ్నేశ మహిమలన్*
నే వినుతింతును పురాణ నేపథ్యమునన్*
నా విద్యయు చాలకునికి*
కోవిదులో దారిజూప కోరిక తీరెన్*
వివిధ పురాణాలను చదివి శ్రీగణేశ అవతార రహస్యం, ఇతర విశేషాలను గ్రహించి శ్రీగణేశ చరిత్ర రచించడానికి పూనుకున్నాను. అనుమానములు కలిగిన చోట, నా శక్తి చాలని చోట విద్వాంసుల సహాయం తీసుకొనుటచే *శ్రీగణేశ చరిత్ర* రాయాలనే నా కోరిక తీరింది.

8.

శ్రీ విఘ్నేశ పురాణము
నావిఘ్నముల నెడబార్చి నాణెపు విద్యన్
చేవలతి చేసి నాచే
భావావిష్కరణ చేసె భాగ్యము మీరన్
శ్రీ గణేశ పురాణము రాద్దామని సంకల్పించినది మొదలు, కలిగిన విఘ్నములన్ని ఎట్టకేలకు తొలగిపోయెను. నా భావాలను ప్రకటించగలిగిన భాషా పటిమను, విషయాన్ని నాకు దక్కేలా చేసింది ఈ శ్రీగణేశ పురాణం.

9.

శాంభవి తానము లాడగ
సంబారమ్ముల నిడుకొని సఖులును రాగా
అంబకు మైమరపు గలుగ
డింభకు రూపమును జేసి డెందము కదిమెన్
భావం: శంభుని భార్యయైన పార్వతి శాంభవి… పార్వతీదేవి స్నానానికి బయలుదేరింది. స్నానానికి కావలసిన సరంజామా అంతా తీసుకుని, చెలికత్తెలు వెంటవచ్చారు. ఇంతలో ఏ మైమరపు కలిగిందో, ఒక చిన్న బాలుని రూపమును తయారుచేసి, గుండెలకు హత్తుకున్నది.

(ఇక్కడ పూర్వగాథ ఒకటి కాస్త చెప్పాలి. గజాసురుడు అనే రాక్షసుడు శివ భక్తుడు. శివుని ప్రాణలింగాన్ని తన పొట్టలో దాచిపెట్టుకున్నాడు. కైలాసంలో శివుడు లేక చిన్నబోయింది. నంది తో సహా ముక్కోటి దేవతలు గజాసురుని దగ్గరకు వెళ్లారు. ఒక నాట్య పరివారంగా తమను తాము పరిచయం చేసుకున్నారు. శివుని స్తోత్రాలను అభినయించగా నాట్య ప్రియుడైన శివుడు గజాసురుని పొట్ట చీల్చుకుని బయటపడ్డాడు. “నీ శిరస్సు పూజలందుకోవాలని, నీ చర్మము తాను ధరిస్తానని వరములు ఇచ్చాడు శివుడు. ప్రాణాలు వదలడానికి సిద్ధంగా, ఉత్తర తలాపి గా పడుకున్నాడు గజాసురుడు. శివుడు వస్తున్న వార్త పార్వతికి చేరింది. చాలా రోజుల తర్వాత భర్త ఇంటికి వస్తున్న కారణంగా అలంకరించుకుని భర్త ఎదుట పడాలని పార్వతీదేవి భావించింది. స్నానానికి నలుగు పెట్టుకుంటూ, తన భావి సాంసారిక జీవనాన్ని ఉహించిందేమో… ఆ మైమరపులో నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను తయారుచేసింది.)

10.

నలుగున చేసిన బొమ్మకు
చెలువుగ ప్రాణమును పోసి చెంపలు పుణికెన్
నెలతకు నెమ్మిక రాగా
వలసిన ఉండ్రాళ్ళ నిచ్చి వాకిటనుంచెన్
భావం: నలుగుపిండితో చేసిన బొమ్మకు ఎంతో ఇష్టంగా ప్రాణం పోసింది. ముద్దు వచ్చే బాలుని చెంపలు నిమిరి, ప్రేమగా ఉండ్రాళ్ళనిచ్చి, వాకిట్లో కాపలాగా కూర్చోపెట్టింది.
(తల్లి కడుపు చూస్తుందని సామెత. బిడ్డను సృజించగానే కడుపునింపడానికి ఉండ్రాళ్ళు ఇచ్చి తినమంది. పల్లెల్లో సాధారణంగా జరిగే విషయం ఏమిటంటే, పనిచేస్తూ ఉంటే కాళ్లకు అడ్డం పడే పిల్లల్ని, తినడానికి ఏదో ఒకటి ఇచ్చి, వీధి గుమ్మంలో కూర్చోపెడతారు. లోపలికి ఏవి రాకుండా చూసుకో… అని. ఆ పిల్లవాడు ఒక కఱ్ఱపుల్లనో, చీపురుపుల్ల నో పట్టుకుని ఆ ఇంటికి తానే రక్షకుడైనట్లు భావిస్తూ ఉంటాడు. ఇక్కడ పార్వతీదేవి చేసింది కూడా అదే. )

11.

పార్వతి యనుంగు పుత్రుని
సర్వకరుడు సంహరించె సంగరమందున్
పర్వతసుత యాగ్రహమున
సర్వజనులను శపియింప శంకరుడాపెన్
భావం: ఎంతో కాలం తర్వాత ఇంటికి వచ్చాడు శివుడు. కానీ ద్వారంలో ఉన్న బాలుడు అమ్మ లోనికి ఎవరిని వెళ్ళనివ్వద్దన్నదని అడ్డగించాడు. ఇద్దరికి కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. సాధారణాంశంగా తీసుకుంటే చిన్న బాలుడు తనను అడ్డగించడమేమిటని శివుడు పక్కకు లాగి పడేయడంతో గాయపడిన బాలుడు మృతిచెందాడు. విశేషాంశంగా తీసుకుంటే, అమ్మ దయ పొందిన బాలుడు శివుని అడ్డగించి యుద్ధం కూడా చేసాడు. చిన్న బాలునితో యుద్ధం ఏమిటని విసిగిన శివుడు శూలం ప్రయోగించాడు. ఫలితం బాలుని తల ఎగిరిపడింది. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతీదేవి హృదయం పగిలింది. వచ్చిందెవరు, చేసిందెవరు.. పట్టించుకోలేదు. పుత్రునికి కష్టం కలిగితే ఏ తల్లి అయినా ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించింది. తనకొడుకుకు కష్టం కలిగింది కాబట్టి, లోకానికంతటికీ కష్టం రావాలని శపించబోయింది. కానీ ఆగ్రహంతో ఉన్న పార్వతీదేవి ని శాంతింపజేశాడు

12.

వలదు కలవరము శోకము
కలనైనను తలపలేదు కాఠిన్యతయున్
సులువుగ నీ సుతునిచ్చెద
కలల ఫలమె నీకు నాకు కాళిక వింటే
భావం: అయ్యో! ఇంత తీవ్రంగా జరుగుతుంది అనుకోలేదు పార్వతీ, బాధ భయాలు వద్దు. ఈ బిడ్డ నీకు నాకు కూడా కలల ఫలమే. బతికిస్తాను. నీ ఉగ్రరూపం చాలించు, నా మాట విను అని నచ్చచెప్పాడు శివుడు

13.

గర్వనిహతుడై యసురుడు
ఉర్విని ఉత్తర తలాపి నొరిగెను గజమై
ఖర్వము కాదుత్తమమిది
పర్వున శిరముత్తరింప పరిహృతి చేసెన్
భావం: గర్వము కోల్పోయిన అసురుడొకడు గజ రూపంలో ఉత్తరంగా తలపెట్టి భూమిపై పడి ఉన్నాడు. ఇదేమి తక్కువ పనికాదు. ఉత్తమమైనదే. పరుగెత్తికెళ్లి, ఆ తలా తీసుకురమ్మని పరిహారం సూచించాడు శివుడు
(గజాసురుని తల. ఖర్వము = అధమము, పరిహృతి= పరిహారం)

14.

తెండు శిరసు త్వరితముగన్
రండు దివిజులార సత్వరగతి, నుమా పు
త్రుండు నిహతుడయ్యెను పిలు
వుండు భిషగ్వరుల బంధువుల హరిభవులన్
భావం: త్వరగా ఆ గజాసురుని శిరస్సు తీసుకురండి (తన గణాలను ఆదేశించాడు శివుడు) దేవతలరా త్వరగా రండి. ఉమాపుత్రుడు నిర్జీవుడయ్యాడు (చంపబడ్డాడు). వైద్యులను , బంధువులను, అశ్వినీదేవతలను అందరినీ పిలవండి అని ఆదేశాలిచ్చాడు శివుడు.

15.

చేరిరి విరించి శారద
చేరిరి హరి సురలు భార్య, చేడెల తోడన్
చేరిరి నారద, యములును
చేరిరి సురపతియు గురుడు చెలువము మీరన్
భావం: శివుని పిలుపు అందగానే బ్రహ్మ, సరస్వతి వచ్చారు. విష్ణువు, ఇతర దేవతలు తమతమ భార్యలతోను, ఇతర స్త్రీల తోను వచ్చారు. నారదుడు, యముడు వచ్చారు, ఇంద్రుడు, బృహస్పతి ఇలా అందరూ వచ్చారు.

16.

గజశిరసు నుంచెను శివుడు
గజాననుడు ప్రాణమంది కన్నులు తెరిచెన్
అజముఖుడు దీవెనలిడగ
నిజసుతు రూపము గని ఉమ నీవాకమయెన్
భావం: శివుడు ఆ ఏనుగు శిరస్సును బాలుని శరీరానికి అమర్చాడు. ఏనుగు తల కలిగిన ఆ బాలుడు నిద్రనుండి లేచినట్లు, ప్రాణము పొంది కన్నులు తెరిచాడు. దక్షుడు (పార్వతీదేవి పూర్వ జన్మలో సతీదేవి, దక్షుని కుమార్తె. దక్షుడు నవబ్రహ్మలలో ఒకడు) గజముఖునికి దీవెనలిచ్చాడు. తన కుమారుని రూపాన్ని చూసిన పార్వతీదేవికి బాధపడాలో, పునర్జీవితుడైనందుకు ఆనందించాలో తెలియని పరిస్థితి కలిగింది.

అజముఖుడు: మేకతల కలిగినవాడు, దక్షుడు
నీవాకము: అర్ధోత్కర్ష హేతువైన జనామోదం. మంచి జరుగుతుంది అంటే అందరికీ నచ్చకున్నా ఒప్పుకోవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *