April 19, 2024

సాఫ్ట్‌వేర్ కథలు – 4.. పులుసులో కరివేపాకు

రచన: కంభంపాటి రవీంద్ర

 

 

ఆ రోజు ఆఫీస్ చాలా హడావిడిగా ఉంది.  యూరోప్ నుంచి ఎవరో క్లయింట్ వస్తున్నాడట.  ప్రాజెక్టు మేనేజర్ కి ఒకటే కంగారు,  టెన్షన్.  ఆ రోజు మీటింగులు ఎలా జరుగుతాయో,  వాటిని క్లయింట్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో,  తమ టీం గురించి ఏం కామెంట్లు చేస్తాడో.. బుర్ర నిండా రకరకాల ప్రశ్నలు !

ఇవన్నీ ఓ పక్క.. ఇంకో వైపు..  తమ గురించి క్లయింట్ తమ మేనేజ్‌మెంట్‌కి ఎలాంటి ఫీడ్బాక్ ఇస్తాడో..  వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనో టెన్షనొకటి !

క్లయింట్ వచ్చే టైం దగ్గిరపడుతూంది.  అతడిని ఆహ్వానించడానికి కంపెనీ సీనియర్ మానేజ్మెంట్ తరఫున కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లాబీలోకి వచ్చేరు.

ప్రాజెక్టు మేనేజర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళి,  ఆ రోజు అజెండా ఏమిటో వివరించేడు.  అంతా విన్న ఆయన ‘‘బాగానే ఉంది..  ఆ క్లయింట్ స్పెషల్ గా ఫీలయ్యేలా ఉండాలి..  ఎగ్జామ్పుల్..  మన రెండు కంపెనీల పార్టనర్ షిప్ గుర్తుగా అతని చేత..  మన కంపెనీ లాన్లో ఓ మొక్క పాతిస్తే ఎలా ఉంటుంది?” అన్నాడు

‘‘చాలా బావుంటుంది సర్” అన్నాడు ప్రాజెక్ట్ మేనేజర్ ఉత్సాహంగా

‘‘బావుంటుంది అనడం కాదు..  ఆ మొక్క ఏర్పాట్లు చూడు” అన్నాడు మొహం తిప్పుకుంటూ

గబగబ కంపెనీ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి విషయం చెప్పేడు.  “ఓ మొక్క,  ఆ క్లయింట్ పాతినట్టుగా ఓ చిన్న బోర్డు కావాల”న్నాడు.  ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలా,  ముందే చెప్పొచ్చుగా అని వాళ్ళు కోప్పడితే,  బతిమాలి మరీ ఒప్పించేడు.

‘‘సరే..  ఓ గంటన్నరలో ఏర్పాటు చేస్తాం..  అప్పుడు పిలవండి క్లయింట్ ని..  మొక్క పాతడానికి” అని వాళ్ళు ఫోన్ పెట్టేసేరు.

‘‘మొక్క ఏర్పాటు చేసేను సర్..  మీరు పదకొండున్నరకి లాన్‌లోకి వస్తే చాలు” అంటూ ఆ వైస్ ప్రెసిడెంట్ గారికి ఉత్సాహంగా చెప్పేడు !

‘‘సరే.. త్వరగా కానీ..  మధ్యాహ్నం మళ్ళీ నాకు ఇంకో క్లయింట్ విజిట్ ఉంది..” అన్నాడాయన ముభావంగా

దూరంగా క్లయింట్ వస్తున్న కార్ కనిపించింది.

ఫ్లవర్ బొకేలు రెడీగా ఉన్నాయా లేవా అని ఇంకోసారి చెక్ చేసుకున్నాడా ప్రాజెక్ట్ మేనేజర్.  అతని టీమ్ లోని ఇద్దరు అమ్మాయిలు నీట్ గా బొకేలు పట్టుకుని దూరంగా కనిపించేరు.  క్లయింట్ వస్తున్నాడు,  దగ్గరికి రండని సైగ చేసేడు.

వైస్ ప్రెసిడెంట్ కార్ దగ్గరికి వెళ్ళి,  క్లయింట్ ని కంపెనీ లోపలికి ఆహ్వానించేడు.  ఆ ఆడపిల్లలిద్దరూ క్లయింట్ చేతికి బొకే ఇస్తే,  ‘‘వావ్..  నైస్ ఫ్లవర్స్” అంటూ థాంక్స్ చెప్పేడా యురోపియన్ క్లయింట్!

అక్కడున్న అందరినీ పరిచయం చేసేడా ప్రాజెక్ట్ మేనేజర్.  షేక్ హ్యాండిచ్చి నవ్వుతూ పలకరించేక,  వైస్ ప్రెసిడెంట్ ఆ రోజు అజెండా అతనికి వివరించి,  ఇంకొక్క స్పెషల్ కూడా ఉంది..  ‘‘మన రెండు కంపెనీల పార్టనర్ షిప్ గుర్తుగా,  మీరో మొక్క నాటాలి.  ప్రత్యేకంగా ఆర్డర్ చేసి మరీ తెప్పించేం” అంటూ ప్రాజెక్ట్ మేనేజర్ వైపు క్రీగంట చూస్తే,  అవునవునంటూ తలూపేడతను.

ఇండియా లోని తన టీం ని ప్రత్యక్షంగా కలిసిన క్లయింట్,  తనకి ఇక్కడ చిత్రంగా కనిపించిన విషయాలు చెబుతూ,  రోడ్డు మీద ఎన్ని గేదెలు చూసేడో చెప్పేసరికి,  పడీపడీ నవ్వేరా ఆ ఇండియా టీం మెంబర్లందరూ

ఇంతలో పదకొండున్నర అవుతూందంటూ,  ఆ ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ ని లాన్లోకి తీసుకెళ్తే,  వెనక్కాలే అతని టీం అంతా ఫాలో అయ్యింది.

లాన్‌లోకి వెళ్ళేసరికి,  వైస్ ప్రెసిడెంట్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నాడు.  ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ అతను,  అప్పటికే మొక్కని గొప్పులోకి పాతి ఉంచేడు,  ఆ మొక్క యొక్క ప్రాశస్త్యం వివరించేడు.  మలేషియా నుంచి మీకోసం ప్రత్యేకంగా తెప్పించేమనీ,  ఖరీదు రూపాయల్లో అయితే పదిహేను వేలూ,  డాలర్లలో 2 రెండొందలూ ఉంటుందని చెప్పేసరికి,  అబ్బురపడిన ఆ యురోపియన్,  ఆ మొక్కకి ఉత్సాహంగా నీళ్లు పోసేడు.  మన రెండు కంపెనీల భాగస్వామ్యానికి గుర్తుగా అంటూ,  ఆ మొక్క ముందు ఓ చిన్న బోర్డు పెట్టేరు!

అందరూ ఫోటోలు దిగేరు,  ఇంక తను చెయ్యాల్సిన పని అయిపోయిందని వైస్ ప్రెసిడెంట్ గారు క్లయింట్ కి ఓసారి విష్ చేసి,  వెళ్ళిపోయేడు.  ప్రాజెక్ట్ మేనేజర్ ఆ క్లయింట్ ని తమ ఫ్లోర్ కి తీసుకెళ్లి,  తమ ప్రాజెక్ట్ తాలూకా ప్రెజెంటేషన్ ఇచ్చి,  ప్రాజెక్ట్ విశేషాలు చెప్పేడు.

మధ్యాహ్నం టీం తో కలిసి లంచ్ చేసిన ఆ క్లయింట్,  మళ్ళీ తమ ప్రాజెక్ట్ ఫ్లోర్ అంతా కలతిరిగేసి,  టీం తో ఫోటోలు తీసుకుని,  ఇంక బయల్దేరతాను,  అనగానే,  ప్రాజెక్ట్ మేనేజర్ “ఇంకో అయిదు నిమిషాల్లో మీ కార్ రెడీగా ఉంటుందని”  ఆ క్లయింట్ కి చెప్పి,  కంపెనీ తరఫున ఓ చిన్న మెమెంటో బహుమతిగా ఇచ్చేడు.

ఆ చార్మినార్ బొమ్మని చూసి మురిసిపోయిన క్లయింట్  తెగ థాంక్స్ చెప్పి  బయల్దేరేడు.

టీం అంతా వీడ్కోలు చెప్పడానికి ఆ కార్ దాకా వచ్చేరు.  తనకిచ్చిన బొకేలు, గిఫ్ట్ జాగ్రత్తగా కార్లో పెట్టుకున్న క్లయింట్,  కారెక్కబోతూ ఒక్కసారి ఆగి ప్రాజెక్ట్ మేనేజర్ ని పిలిచేడు.

‘‘ఏంటని?” అడిగితే,  ‘‘ఇలా ఓ మొక్క పాతడం నా జీవితంలో ఇదే ఫస్టు టైము..  కొంచెం ఆ మొక్క దగ్గిర నాకు సింగిల్ గా ఓ ఫోటో తీసిపెడతావా?” అని అడిగితే,  ‘‘హోస్ ఇంతేనా.. అదెంత భాగ్యం ‘‘ అంటూ లాన్‌లోని మొక్క దగ్గిరకి తీసికెళ్ళేడు.

మొక్క దగ్గర కులాసాగా నుంచున్న క్లయింట్ కి ఫోటో తీస్తున్న ప్రాజెక్ట్ మేనేజరికి,  సడన్గా క్లయింట్ మొహంలో రంగులు మారడం కనిపించింది.  మాట్లాడకుండా విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయేడతను..  ఏమైందా అని అతని వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళిన ప్రాజెక్ట్ మేనేజర్,  ఆ మొక్క ముందు,  మధ్యాహ్నం వచ్చిన వేరే క్లయింట్ తాలూకా కంపెనీ బోర్డు ఉండడం గమనించలేదు !

1 thought on “సాఫ్ట్‌వేర్ కథలు – 4.. పులుసులో కరివేపాకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *