March 19, 2024

తాత్పర్యం – దృష్టిని బట్టి దృశ్యం

 

రచన – రామా చంద్రమౌళి

 

 

“నాన్నా వీనికేదైనా మంచి పేరు సూచించండి” అంది డాక్టర్ దుర్గ. అప్పుడు నగరంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త. .  దుర్గ భర్త నీలకంఠం కూడా అక్కడే ఉన్నాడు ప్రక్కన. అదొక అతిపెద్ద కార్పొరేట్ దవాఖాన. దుర్గ తండ్రి వెంకటశేషయ్య దుర్గవైపూ. .  అల్లుడు నీలకంఠం వైపూ నిరామయంగా చూచి అన్నాడు “ఊర్కే ఏదో మర్యాదకోసం అడిగి. .  నేనేదో చెప్పగానే విని. .  పెదవి విరిచి. .  మళ్ళీ మీకు నచ్చిన పేరేదో మీరు పెట్టుకుంటే అది నన్నవమానించినట్టవుతుంది. .  నేను చెప్పను”అని.

“ఫరవాలేదు. .  చెప్పండి నాన్నా. .  మీరు చెప్పిన పేరే పెడదాం వీడికి” అంది దుర్గ భర్తవైపుకూడా చూస్తూ.

వెంకటశేషయ్య వెంటనే అన్నాడు. .  “ఐతే. .  వీని పేరు హనుమ ” అని.

అందరూ ఆశ్చర్యపోయారు. .  అది. .  పాతగానే అనిపిస్తూ. .  కొత్తగా కూడా. .  గంభీరంగా. .  గొప్పగా. ,

హనుమ. .  హనుమ. .  అలా ఖరారైపోయింది. .  ఆ పేరు ఆ శిశువుకు.

తర్వాత. .  యధావిధిగానే నీలకంఠం వెళ్ళిపోయాడు. .  తన అతి విశాల వ్యాపార సామ్రాజ్యంలోకి. అతని దృష్టిలో మనిషి జీవితం అతి చిన్నది. విలువైంది. .  మనిషికి భగవంతుడిచ్చిన వరం. ఒక్కసారే లభించే మహదావకాశం. కాబట్టి ఒక్క క్షణంకూడా వృధా చేయకుందా జీవితాన్ని కసిగా జీవించాలి. కసిగా అనుకున్నదాన్ని సాధించాలి. లక్ష్యాలనూ,  గమ్యాలనూ చేరి విజయాలను స్వంతం చేసుకోవాలి. .  అతని దృష్టిలో జీవితమంటేనే వ్యాపారం. .  లేదా వ్యాపారమే జీవితం.  అందుకే. .  ఎన్నో రంగాల్లోకి ప్రవేశం. .  రకరకాల విస్తరణలు. .  విద్య. .  వైద్య. .  నిర్మాణ. .  భూ క్రయవిక్రయ. .  కాంట్రాక్ట్. .  పెట్రోలియం. .  ఎగుమతులు. .  దిగుమతులు. .  ఎన్నో. .  కళ్ళు మూసుకుంటే. .  దిమ్మ తిరిగిపోయే లావాదేవీలు. .  అంతా కోట్ల రూపాయల్లో బేరం.

“బాగుంది మామగారూ. .  మంచి పేరు. .  ఈ క్షణం నుండి. .  వీడు హనుమ. .  వినూత్నమైన పేరు. .  థాంక్స్” అని లేచాడు నీలకంఠం. లేచి బయటున్న ఆడి క్యూ ఫవ్ కారెక్కి వెళ్ళిపోయాడు. .  తైవాన్ కు. .  ఒక అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు. ఆరువందల ఇరవై కోట్ల డీల్ అది. తర్వాత కొద్ది నిముషాలకే దాక్టర్ దుర్గ. .  నగరంలో ప్రఖ్యాత గైనకాలజిస్ట్. .  ఐన తనే ఒక తల్లై. .  తండ్రివంక చూస్తూ. .  ఒక నాల్గురోజుల్లో. .  నేను హాస్పిటల్ పనుల్లోకి వెళ్ళిపోవాలి నాన్నా. .  వీని. .  ఈ హనుమ పాలన. .  పోషణ. .  అన్నీ మీరూ అమ్మే చూచుకోవాలి. చూస్తున్నారుగదా. .  మీ అల్లుడుగారు ఈ క్షణమిక్కడ. .  మరుక్షణమెక్కడో. .  ఏ దేశంలోనో. .  ఒక రకంగా నేనూ అంతే. .  ఒక విజిటింగ్ ప్రొఫెసర్ గా. .  ఐదు కార్పొరేట్ హాస్పిటల్లలో విజిటిం డాక్టర్ గా. .  హూ. .  ఈ జీవితమింతే. .  మీరే ఇప్పుడు వీడికి తల్లీ తండ్రీ. .  తాతయ్య. .  అమ్మమ్మ. .  అన్నీ. “అంది.

డాక్టర్ దుర్గ అంటున్నదంతా సత్యమేనని తెలుసు వెంకటశేషయ్యకు.

నవ్వాడాయన. .  ముసిముసిగా. .  గంభీరంగా. .  లోతుగాకూడా.

నవ్వి. .  “మనిషి అంతిమంగా. .  తనకు ఏమికావాలో తెలుసుకుంటూనే. .  ఏది వద్దో. .  ఏది కూడదో కూడా తెలుసుకోవాలి తల్లీ ” అన్నాడు.

ఆ క్షణం డాక్టర్ దుర్గ చాలా నిస్సహాయంగా. .  దీనంగా తండ్రివంక చూచింది.

సరిగ్గా అప్పుడే ఆమె ప్రక్కలో అప్పటిదాకా నిద్రిస్తున్న హనుమ కళ్ళు తెరిచి తన తాతయ్య వంక నిర్మలంగా చూస్తూ చిన్నగా నవ్వాడు. .  బోసినోరుతో.

 

*  *   *

 

తల్లిదండ్రుల్లాగ పిల్లలు తయారౌతారనేది ఒక భ్రమ అని బలంగా నమ్ముతాడు ఆదిశేషయ్య. మనిషిని మనుషులే కావలసిన రీతిలో నిర్మించవచ్చనికూడా అతను చాలా గట్టిగా విశ్వసిస్తాడు. అందుకు పిల్లలు పెంచబడ్డ జీవన,  సామాజిక వాతావరణం,  పెంచుతున్న వ్యక్తులు జీవించే పద్ధతి,  వాళ్ళు పాటించే మానవీయ విలువలు,  సమాజంపట్ల వాళ్ళు ఆచరించే నైతిక ప్రవర్తన. .  ఇవీ పిల్లలను చాలా ప్రభావితం చేస్తాయని ఆయన నిశ్చితాభిప్రాయం.

హనుమ పెరిగింది సరిగ్గా ఆదిశేషయ్య భావజాలం నుండి. .  అందువల్ల అతను పాల చెరువులో కలువపువ్వులా వికసించాడు. మనిషి నిర్మలం. .  మనసు నిర్మలం. .  హృదయం నిర్మలం. ఆలోచనలు పారదర్శకమైన సెలయేటి నీటిలా ఇంకా పారదర్శకం.

“తాతయ్యా. .  అంతిమంగా మనిషికి ఏం కావాలి” అని ప్రశ్న.

“ఇప్పటిదాకా నీకర్థమైనంతవరకు. .  ఈ ప్రశ్నకు జవాబు నువ్వే చెప్పు హనుమా ”

“నిజానికి మనిషికి ఏమీ వద్దు ” అని జవాబు.

“కరెక్ట్. .  ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశుల్లో ఏవికూడా ఫలానా ఏదైనా కావాలని ఆశించదు. .  ఒక్క బ్రతకడానికి అనివార్యమైన ఆహారం తప్పితే. ఆ ఆహారాన్ని కూడా తనకు కావలసినంతే సంపాదించుకుని ఇక ఆహారాన్వేషణను విరమించుకుంటాయి ఏ జీవైనా. ఆహారాన్నీ. .  ఇతర సౌకర్యవంతమైన సౌకర్యాలనూ. .  సంపదనూ మనిషిలా దోచుకోవడం. .  దాచుకోవడం అస్సలే చేయవు. సాధ్యమైనంతవరకు జీవితంలో తన ఇతర సహ జీవుల దగ్గర రహస్యాన్నిగానీ,  దాపరికాన్ని గానీ ఏ జీవీ పాటించవు. బహిరంగంగా. .  రహస్యరహితంగా జీవించడం ప్రకృతి నేర్పే ఒక పాఠం. .  .  ” చెప్పుకుపోతున్నాడు తాతయ్య.

అలా. .  అక్కడ పుట్టిన మొలక హనుమ.

కొంతకాలానికి. .  హనుమ పదవ తరగతిలో ఉండగా ” ఇక నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర ఉండడం మంచిదేమో హనుమా” అని తాతయ్య అన్నప్పుడు. .  ఒక వారం వెళ్ళి నగరంలో ఉండి. .  అంతా డబ్బు కంపుతో నిండిపోయిన ఆ వాతావరణంలో ఇముడలేక. .  తల్లిపక్షి దగ్గరకు శిశుపక్షి పరుగెత్తుకొచ్చినట్టు. .  తిరిగొచ్చి. ,

” మాటలకందని అయిష్టతేదో నన్నక్కడ ఉండనివ్వడంలేదు తాతయ్యా. .  ” అని. .  ఒక ఖాళీ ముఖం. .  అర్థింపుగా.

తను అమ్మా నాన్న దగ్గర గడిపిన నాల్గు రోజుల్లో తండ్రి ఇంట్లో ఉన్నది ఒక్కరోజు. తనతో మాట్లాడగలిగింది కేవలం ఒక గంట. మిగతా టైమంతా. .  నౌకర్లు. ,  . నాన్న అసిస్టెంట్స్. .  ,  ఎగ్జిక్యూటివ్స్. .  ఇక అమ్మ. .  ఆమెకు నిరంతరం హాస్పిటల్స్ నుండి కాల్స్. .  ఆపరేషన్స్. .  విజిట్స్. .  గెస్ట్ లెక్చర్స్. .  వెరసి లక్షలకులక్షలు డబ్బు. .  అఖండమైన ఇన్ ఫ్లో. వాళ్ళుంటున్న భవనం ఒక రాజప్రాసాదం. మొత్తం పది బెడ్ రూం లు.  ఒక బెంజ్ కారునిచ్చి నగరం చుట్టూ. .  సముద్ర తీరం అంతా. .  చుట్టించి. ,

తర్వాత. .  ఇంటర్. .  ఎంట్రన్స్ పరీక్షలు.

“మనిషిని పరిపూర్ణుణ్ణి చేయగలిగేది కేవలం పుస్తకాలే నాన్నా. .  ఇప్పుడు నువ్వు చదువుతున్న ఈ పాఠ్య పుస్తకాలు నీకు జీవితానికి శాస్త్రీయమైన పునాది నిస్తాయి. తర్వాత ఒక నిర్దుష్టమైన అభిరుచితో మనంతట మనం ఎంచుకుని చదివే పుస్తకాలు అసలు ఈ జీవితం ఏమిటో నీకు బోధపరుస్తాయి. పుస్తకమే శాశ్వతమైన నేస్తం. .  ”

తర్వాత అమ్మమ్మ చనిపోయింది. .  కరెంట్ బల్బ్ లో ఫిలమెంట్ రాలిపోయినట్టు.

తాతయ్య. .  ఎండిపోయిన సముద్రంలా మిగిలిపోయాడు. మనిషి మరో మనిషి సాంగత్యంతో,  సాహచర్యంతో ఎంత సమున్నతుడుగా బ్రతకగలడో అమ్మమ్మ మరణం బోధపర్చింది.

తర్వాత ఇంజనీరింగ్. .  ఐ ఐ టి. .  స్పేస్ సైన్స్. .  రోదసీ శాస్త్రం.

అంతరిక్షం గురించిన అవగాహన.

తర్వాత ఎం టెక్. .  లోతులకు. .  లోలోతులకు. .  శూన్యం గురించి. .  ఖాళీ గురించి. .  ఏమీ లేకపోవడం గురించి. .  అంతరిక్షగం శాంతి. .  ఓషదయః శాంతి గురించి. .  విస్ఫోటనాలగురించి. .  విచ్ఛేదనాల గురించి. .  గ్రహాల గురించి. .  గ్రహాంతర గతుల గురించి. .  సవ్య అపసవ్య భ్రమణాల గురించి. .  అసలీ గమనాలూ. .  భ్రమణాలూ. .  ఆత్మ . .  పరి భ్రమణాలూ ఎవరివల్ల. .  ఎందుకు. .  ఎలా సంభవిస్తున్నాయో. .  మూలాల అన్వేషణ. .  అధ్యయనం.

ముందంతా అగమ్య నైరూప్య చిత్రం .

అమెరికా. .  కాలిఫోర్నియా లో పి హెచ్ డి. .  పోస్ట్ డాక్టోరల్ స్టడీస్. అంతు చిక్కదు. .  మొదలు దొరకదు. ఆది మధ్యాంతాలలో. .  ఒక ఊయల . .  డోలనమే డోలనం. ,

ఉన్నట్టుండి. .  తాతయ్య మరణం.

శరీరముండి. .  లోపల ప్రాణం లేనట్టు. .  ఒక రిక్తత. రైలు పట్టాలపైకి ఎక్కించి. .  ఇక వెళ్లిపో అని . .  దిశ. .  మార్గదర్శనం.

ఒక. .  విమోహ వ్యామోహంలో వ్యాప్తమై సంస్పందిస్తున్న దశలో. .  మళ్ళీ ఇండియా. .  ఆర్య భూమి. .  పుణ్య భూమి. .  ఆది సంస్కృతులు ఉద్భవించిన వేద భూమి. .  భారతదేశంకు. ,

తిరుగు ప్రయాణం. .  ఎక్కడికెళ్ళినా. .  మళ్ళీ మళ్ళీ అక్కడికే ఐన వర్తుల ప్రయాణం.

ఇప్పుడెక్కడికి. .  అని ప్రశ్న.

అమ్మా. .  నాన్న. .  మిగిలింది వీళ్ళిద్దరే.  గంధం చెట్టు అంతరించిపోయింది.  నామమాత్ర పరిమళం మిగిలి. .  ఎన్నాళ్ళుంటుది. .  గాలిలో.

 

*  *  *

 

నిన్నంతా తమ స్వంత చార్టర్డ్ ఫ్లైట్ లో. .  ప్రయాణం. .  ఊర్కే. .  అలా. .  సముద్రాలపైనుండి. .  అడవుల పైనుండి. .  నగరాల అత్యాధునిక అందాల మెరుపుల పైనుండి. ,

నీలకంఠం. .  అరవై ఆరు. డాక్టర్ దుర్గ అరవై నాల్గు.

‘ సూర్యుడుదయించడనుకోవడం నిరాశ.

ఉదయించిన సూర్యుడు అస్తమించడనుకోవడం దురాశ ‘

ఇప్పుడిక ఉదయాస్తమయాల ధ్యాస. .  మీమాంస.

అప్పుడు. .  ఆ క్షణం. .  బంగాళాఖాతం లో. .  తీరానికి. .  పది కిలోమీటర్ల లోపల. .  తమ స్వంత మెకనైజ్డ్ పడవలో. .  ముగ్గురే కూర్చుని ఉన్నారు.

నీలకంఠం. .  దుర్గ. .  హనుమ. ఆ ట్రిప్ ను నీలకంఠం దంపతులిద్దరూ కావాలని రూపొందించి ఏర్పాటు చేశారు. .  ఎందుకో వాళ్ళిద్దరికీ. .  తమ చేతిలోనుండి దారం జారిపోతూ. .  ఇక గాలిపటం తెగిపోతుందేమోనన్న భయం. .  బాధ. ,

” చూడు హనుమా. .  నేనూ అమ్మా. .  జీవితమంతా కష్టపడి. .  నీకోసం ఒక అభేధ్య సామ్రాజ్యాన్ని నిర్మించాం. మొత్తం మన ఆస్తి విలువ ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయల పైమాటే. సకల సంపదలూ నీకోసం పరుచుకుని ఎదురు చూస్తున్నాయి రా రామ్మని. నిజానికి. .  నేను ఒక సాధారణ కూలి కడుపున పుట్టి. .  కష్టపడి. .  తెలివితేటలతో. .  వ్యూహాత్మకంగా జీవిస్తూ. .  కసితో సంపాదించానీ సంపదను. అమ్మకూడా అంతే. చూశావుకదా. .  తాతయ్య ఒక మామూలు స్కూల్ టీచర్. అమ్మ తన ప్రతిభా విశేషాలతో. .  ఒక ప్రఖ్యాత డాక్టర్ గా. .  .  ” చెప్పుకుపోతున్నాడు నీలకంఠం.

పడవ దూసుకుపోతోంది. .  బుల్లెట్ లా. ఒడ్డుదిక్కు. అప్పటికే ఓ గంట దాటింది ప్రయాణం.

నాన్న అర్థమౌతున్నాడు. అమ్మ హృదయం కూడా అర్థమౌతోంది.

” చాలా కష్టపడ్డాం. .  హీరో ననిపించుకున్నా. .  మీ అమ్మకూడా. .  ఒక సమర్థురాలిగా. .  ” ఇంకా చెబుతున్నాడు.

హనుమ వింటున్నాడు శ్రద్ధగా. .  ఉన్నతిని సాధించడం గురించిన విపుళీకరణ. .  ఇద్దరిదీ. వాళ్ల సంపదలకు వారసునిగా ఇంకా ఇంకా ఈ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాలి అని. .  భవిష్యత్ వ్యూహాలు.

పడవ తీరాన్ని. .  తమ స్వంత బీచ్ కు. .  చేరిన తర్వాత. ,

నాల్గంతస్తుల విశ్రాంతి గృహం. .  తమదే . ” సీ వ్యూ”.

రాత్రి పదిదాటిందాకా రేపటి వాళ్ల కలల గురించిన ఉపన్యాసాలు.

ఒకటే సారాంశం. .  ” నేను ఎదిగి హీరోనయ్యాను. .  నువ్వుకూడా. .  ఒక హీరోవి ఐ నిన్ను నువ్వు నిరూపించుకోవాలి ” అని.

బాగా రాత్రి పొద్దుపోయిన తర్వాత. .  నిద్ర అందరినీ ఆవహించిన తర్వాత. ,

ఉదయం. ,

సముద్రంలోనుండి. .  స్నానించిన సూర్యుడు. .  తలెత్తుకుని. .  ఉదయిస్తూండగా,

నీలకంఠం. .  కొడుకు హనుమ పడక గది. .  వద్దకు వచ్చి. .  బాల్కనీలో కూర్చుని ముచ్చటిద్దామనుకుని. .  లోపలికి చూస్తూ,

హనుమ లేడు పడకపై. ఖాళీ బెడ్.

అటు ఇటూ చూశాడు.  కనిపించలేదు. .  చుట్టూ వెదికాడు కళ్ళతో. .  బాత్ రూంలో. .  ఇంకా. ,

తళతళా మెరిసే టేబుల్ పై ఒక కాగితం కనిపించింది. .  చదవడం మొదలెట్టాడు నీలకంఠం.

 

 నాన్నా,

 ఏమీ లేని స్థితినుండి నువ్వు స్వయంగా ఎదగడం వల్ల నీకు నువ్వు హీరోగా అనిపిస్తున్నావు.

 నేనుకూడా ఒక హీరోగా ఎదగాలంటే ముందు నేను ఏమీ లేని ఒక మామూలు మనిషిగా మారాలికదా.

 ఆ క్రమంలో. .  నేను ఒక హీరోగా ఎదగడానికి. .  మీకు చెందిన సకల ఆస్తులనూ వదిలి. .  ఒంటరిగా జీవితంలోకి ప్రవేశిస్తున్నాను. తప్పక ఒక హీరోనై మళ్ళీ మీకు కనిపిస్తా. కాకుంటే మరో దిశలో. .  డబ్బు ఒక్కటే మనిషి ఉన్నతికి కొలమానం కాదు. విసృతమైన జీవితాన్ని నేను దర్శిస్తున్న కోణం వేరు. దయచేసి నాకోసం ఎవరూ వెదుకొద్దు.

       – హనుమ

 

 

నీలకంఠం తలెత్తాడు కళ్ళనిండా నీళ్ళతో. ఎదురుగా సముద్రం కనబడట్లేదు. .  ఒట్టి భీకరమైన సముద్ర ఘోష వినబడ్తోంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *