March 19, 2024

మోదుగ పూలు – 6

రచన: సంధ్య యల్లాప్రగడ

 

వివేక్ మరుసటి రోజంతా స్కూల్లో చాలా బిజీగా ఉన్నాడు.  అతనికి ఆ సాయంత్రం ఆరింటికి సమయం చిక్కింది.

ఆ టైంలో చంద్రన్న తాతాను అడిగాడు వివేక్‌ “ప్రసాదరావు సార్‌ చెప్పిన ఆ రిసెర్చుచేసేటాయన వచ్చాడా తాతా?” అంటూ.

“లేదు సార్ ఏడు కొట్టంగ వస్తనన్నాడు!” బదులిచ్చాడు తాత.

అతని కోసము వెయిట్‌ చేస్తూ బయట జండా పోల్ అరుగు దగ్గర కూర్చున్నాడు.

అతనికి తన ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది.  “నేను చాలా హడావిడి పడుతున్నానా?” నాయన ఇవ్వన్నీ దాచటానికి ఏదో బలమైన కారణము ఉండి ఉంటుంది.  అదేమిటో? అసలు తన గుర్తింపును మనిషి ఏ పరిస్థితులలో దాచుకుంటాడు? మాములు వారికి ఆదివాసీలకు తేడా వుందా?” ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మల్లగుల్లాలవుతూ ఉండగా గేటు చప్పుడైయింది.

అటు చూస్తే ఒక యువకుడు లోపలికి వస్తున్నాడు.  జీన్స్ వేసుకొని ఎర్రచొక్కా వేసుకున్నాడు.  మాములు యూనివర్సిటిలో కనపడే తన మిత్రుల వలెనే ఉన్నాడు కాని ప్రత్యేకముగా లేడు.

అతనికి ఎదురెళ్ళాడు వివేక్.

దగ్గరకు వెళ్ళి “హలో సార్!” అన్నాడు.

అతను షేక్‌హ్యాండు ఇస్తూ “నా పేరు రామసామి.  రాము అని పిలవండి చాలు.  నేను ఆంత్రోపాలజీలో రిసెర్చు చేస్తున్నాను.  నన్ను కలవాలని చెప్పారట.  తాత వచ్చి చెప్పిపోయాడు…” అన్నాడతను.

“నేను వివేక్‌.  కొత్తగా తెలుగు టీచరుగా వచ్చాను.  నాకు కొన్ని విషయాలు ఇన్ఫో కావాలి.  మీకన్నీ తెలిసి ఉంటాయని ప్రసాదరావు సార్‌ చెప్పారు!” అన్నాడు వివేక్‌.

“అవునా.  చెప్పండి ఏం విషయము?” అన్నాడతను ఆ అరుగు మీద కూర్చుంటూ.

“ఇక్కడే కూర్చుంటారా? నా రూమ్‌కు పోదామా?” అన్నాడు వివేక్‌ చుట్టూ చూస్తూ.

“మీ రూమ్కు పోదాం ఆ పిల్లలు డిస్ట్రబవుతారు మనము మాట్లాడుకుంటుంటే…” అన్నాడు అక్కడే చుట్టూ కూర్చొని చదువుకుంటున్న పిల్లలను చూస్తూ.

“సరే పద…” అంటూ తన గది వైపు నడిచాడు వివేక్.

లోపలికెళ్ళి కూర్చున్నాక రెండు కప్పులలో టీ పోసుకొని వచ్చాడు వివేక్‌.  ఒక కప్పు రాము‌కు ఇచ్చి తను ఎదురుగా బల్ల మీద కూర్చున్నాడు.

 

ఉపోద్ఘాతంగా “నేను ఎమ్‌.ఏ చేసి వచ్చాను.  రీసెర్చు చేద్దామన్న ప్లాను ఉంది.  రెండేళ్ళ పని చేసిన అనుభవం ఉండాలి కదా.  అందుకే ఇక్కడ పనికొచ్చాను.  మంచి స్కూలు ఇది…” అన్నాడు

“అవునా!” అంటూ తల ఊపాడు రాము టీ సిప్ చేస్తూ.

“నేను గిరిజనుడిని.  కాని నాకు గిరిజనుల గురించి మా పెద్దల గురించి ఏ విషయం తెలియదు.  మా నాయన ఎందుకో ఏ విషయం చెప్పలేదు.  ఎందుకు చెప్పలేదో నాకర్థం కాలేదు.  అసలు వీరికో సొంత భాష ఉందని కూడా తెలీదు.” సిగ్గుపడుతూ చెప్పాడు వివేక్.

ఏం మాట్లాడలేదు రాము.  చూస్తూ కూర్చున్నాడు.

“నాకు గిరిజనుల గురించి డిటైల్స్ తెలుసుకోవాలని ఉంది.  దానిని బట్టి నా రూట్సు నేను పట్టుకోగలనేమో.  దానికి నీ హెల్పు కావాలి!” అన్నాడు ఆర్థింపుగా.

“చెప్పు ఏం హెల్పు కావాలి?”

“నాకు గిరిజనుల గురించి డిటైల్సు, వారి సంస్కృతి,  భాష తెలుసుకోవాలని ఉంది.  నేను నేర్చుకోదలిచాను…” చెప్పాడు వివేక్ పట్టుదలగా.

“అలాగే.  నా రిసెర్చు టాపిక్ కూడా అదే.  నీకు తప్పక చెబుతాను.  అసలు నిన్ను గిరిజనుడనేవారా? ఆదివాసి అనా?” అడిగాడు రాము.

“ట్రైబల్‌” అని అన్నాడు వివేక్.

“నీవు ఇంగ్లీషు మీడియమా?”

“కాదు ప్రభుత్వ పాఠశాలే!”

“సరే నీకు అసలు ఆదివాసికి గిరిజనులకు తేడా ఏముందో తెలుసా?” అడిగాడు రాము.

“తెలియదు…” చెప్పాడు వివేక్‌.

“ఆదివాసీలనే గిరిజనులు,  కొండజాతి వారు అంటారు.  నార్తులో ఆదివాసి అంటారు.  కొండలపై ఉండేవారిని గిరిజనులు.  కొండజాతీ అన్నారు.  అసలు ఈ దేశములో మొదట ఉన్నవారు ఆదివాసీయని ఒక థియరీ కూడా ఉంది…” అన్నాడు రాము.

“అంటే? ద్రావిడ్లు ఆదివాసీ ఒకరేనా? ఎక్కడుంది ఈ థియరీ?”

“ఇది ఎక్కడా రాసి లేదు.  ద్రావిళ్ళు కన్నా మొదట ఉన్న జాతి వీరని నమ్మకం.  ఆర్యులు వచ్చి ద్రావిళ్ళను దక్షణాదికి తోలేసారట.  అప్పడు వాళ్ళు దక్షిణ దేశం వచ్చారని,  ఇక్కడ అంతకు పూర్వమున్న వారిని అడవులలోకి తోలేసారని ఒక సిద్ధాంతం.  ఇది నీకు ఎక్కడా రాసి దొరకదు.  కాని అడవులలో ముసలాళ్ళని అడిగితే ఇదే చెబుతారు”…

“ఇది చాలా కొత్త విషయము కదూ!”

“అవును అందుకే వీరిని ఆదివాసీ అన్నారు.  ఆది అంటే మొట్టమొదటి అని కదా అర్థం” అన్నాడు రాము.

(ఈ సిద్ధాంతము – వీ. ఎన్‌. వీ. కే.  శాస్త్రి ఆదివాసి ఆత్మగానములో ఊటంకించబడింది)

ఎంత పూర్వులు మన పెద్దలు అన్న ఆలోచన కలిగి వివేక్‌ మనసులో ఆదివాసులంటే ఒక గౌరవం కలిగింది.

“మనము ఏ రాష్ట్రంలో చూసినా,  ఆ రాష్ట్రంలో మూలలో అడవులలో ఎవరికీ అందక కనపడక ఉంటారు మన గిరిజనులు.  ఆదివాసులలో ఎన్నో తెగలు ఉన్నాయి.  సవర,  జాతాపు,  కోయ,  కొండరెడ్డి,  గోండు,  కొలాం,  చెంచులు,  యానాది,  ఎరుకలు.

గోండులు తమను హిడింబ సంతానంగా తలుస్తారు.  హిడింబ దేవాలయం కూడా ఉంది హిమాచల్‌ప్రదేశ్‌లో.  భీమ,  హిడింబ వివాహం చేస్తారు నేటికి.  నీకు తెలిసే ఉంటుంది రామాయణం రాసిన వాల్మికీ భిల్లుడు.  రామాయణంలో నీకు చాలా ఆదివాసుల గురించి ప్రస్థావనముంటుంది కదా” అన్నాడు రాము.

“అవునా? ఎక్కడ?” ఆలోచనగా వివేక్‌

“రాముని దర్శనానికై ఎదురుచూస్తూ పడిగాపులు పడి,  రాముని చూసిన ఆనందంలో తన ఎంగిలి పండ్లనిచ్చిన తినిపించిన శబరి సవర జాతి స్త్రీ.  రాముని ఏరు దాటించిన గుహుడు సంథాల్ తెగ గిరిజనుడు.  ఏకలవ్యుడు కూడా భిల్లు తెగకు చెందినవాడు.  వీరంతా ఆదివాసులే. అడివిలో రామునికి తోడు నీడగా ఉండి ఆయన పిలిచినప్పుడు పలకటానికి సిద్ధంగా ఉన్నవారంతా ఆదివాసులే కదా.  ఇంకా రాముడు,  సీతతో కలిసిన కథలెన్నో ఉన్నాయి మన గిరిజనులలో” చెప్పుకుపోతున్నాడు రాము…

“సీత గురించి కథలేమిటి?” ప్రశ్నించాడు ఉత్సాహముగా వివేక్.

“మన గిరిజనులు చాలా రకాలు ఉన్నారు.  మనమైతే ఈ ఆదిలాబాదు అడువుల వైపు ఉన్నాం.  నీవు శ్రీకాకుళం వైపు వెడితే ఒరిస్సా వైపు మరో తెగ కనపడుతుంది.  వీరిని రినో ఆదివాసిలంటారు.  వీరు బయటకు రారు.  వీరిని బోండులని కూడా అంటారు.  ప్రతి గురువారం వీరి సంత జరిగుతుంది. ”

“నీవు చూశావా ఆ సంత?” అడిగాడు వివేక్‌

“ఆ ఒకసారి వెళ్ళాను.  వాళ్ళతో మాట్లాడి నా రిసేర్చుకు మెటిరీయల్ తెచ్చుకోవటానికి!” చెప్పాడు రాము.

“వారితో సీత మాత ఎలా కలిసింది?” అడిగాడు వివేక్‌.

“అదే చెబుతున్నా… వనవాస సమయంలో సీత రీనో ప్రజలు నివాసమున్న ప్రాంతంలో నగ్నంగా ఒక సరస్సులో స్నానం చేశారని,  అప్పుడు రీనో మహిళలు ఆమెను చూసి నవ్వారని,  ఆమె ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉండేలా శాపం పెట్టారని స్థానికులు నమ్ముతుంటారు.

ఆ మహిళలు సీతను ప్రాధేయపడగా,  ఆమె తన చీరలోంచి చిన్న వస్త్రం చించి ఆ మహిళలకు ఇచ్చారని వారు అంటారు. అప్పట్నుంచి రీనో తెగ మహిళలు అందరూ గుండు చేయించుకోవడంతోపాటు పూసలతో శరీరాన్ని కప్పుకొంటున్నారు.

వీళ్ళు ఫోటోలు అసలు దిగరు.  ఫొటో రూపంలో తమ ఆత్మ నుంచి కొంత భాగం వెళ్లిపోతుందని వీరి విశ్వాసం.  అందుకే తమతో ఫొటో దిగాలని పర్యాటకులు కోరితే వీరు డబ్బులు అడుగుతారు.  ఈ డబ్బుతో సంతలో జీలుగకల్లు కొనుక్కొని తాగి విశ్రాంతి తీసుకుంటారు.  ఇలా చేస్తే తాము కోల్పోయిన శక్తి తిరిగి వస్తుందని వీరి భావన.  రీనో మహిళలైనా,  పురుషులైనా ఆయుధాలు ధరిస్తారు. యుక్త వయసు రాగానే మహిళలు గుండు చేయించుకుంటారు.  గుండు కనిపించకుండా పూసలదండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు. ఒళ్లంతా పూసలదండలు ధరించి కేవలం నడుం వద్ద ‘రింగ్ డా’ అనే పట్టీ ధరిస్తారు.  మెడ చుట్టూ అల్యూమినియం,  వెండితో చేసిన రింగులను పెట్టుకుంటారు.  చేతుల నిండా లోహపు గాజులను వేసుకుంటారు…” వివరించాడు రాము.

“వీరి సంస్కృతి అంతా ఒక్కలాగే ఉంటుందా? అందరి పద్దతులు ఒక్కటేనా? తేడా ఎలా తెలుసుకోవటం?” అడిగాడు వివేక్… ‘నేను ఏ తెగో’ అని మనస్సులో అనుకుంటూ.

“చాలా తేడాలుంటాయి.  కట్టును బట్టి”

“కట్టు అంటే?”

“కట్టు అంటే గ్రూపు అనుకో.  ఒక్కో గ్రూపు లేదా సమూహానికి ఒకో భాష.  పద్ధతులు కొద్దిగా తేడాతో ఉంటుంది.  మనది జిల్లాల బట్టి తేడా కూడా ఉంది భాషలో.  ఇక్కడ గొండు,  కొలామి మాట్లాడుతారు కదా,  అదే కొత్తగూడెం వైపు గోండులు కోయ మాట్లాడుతారు.  అందుకే అందరికీ కామన్ లాంగ్వేజ్ లేదు.  తెలుగే మాట్లాడాలి.  అందుకే మదర్‌టంగులో చదవమంటే,  మనకు డెవలప్‌మెంటు మన జన్మలో రాదు.  వీళ్ళు,  తెలుగు నేర్చుకు,  ఇంగ్లీషుకు వచ్చే సరికే జన్మ సరిపోదు.  మనకు డెవలప్‌మెంటు రావాలంటే ఇంగ్లీష్ మీడియమ్‌లో చదువు నేర్పాలి అని నా అభిప్రాయం.  అప్పుడు మన పిల్లలకి ఉండే ఇన్‌ఫిరియారిటీ పోతుంది” అన్నాడు రాము.

ఇలా మాట్లాడుకుంటుండగా తలుపు చప్పుడైయింది.  తీస్తే ఎదురుగా మధు.

“ఏంటి భోజనానికి రావా?” అంటూ లోపలికొచ్చాడు.

రాముని చూసి షేక్‌హ్యాండు ఇస్తూ “ఎప్పుడొచ్చావు రాము?” అంటూ అడిగాడు.

“నే వచ్చి వారమయింది సార్.  నెల రోజులుంటా.  చెల్లి పెళ్ళి అనుకుంటున్నారు” చెప్పాడు నవ్వుతూ.

“అవునా.  అయితే మాకు త్వరలో విందుకు పిలుపు ఉంది.  సరే కానీ ఇప్పుడు మాతో భోజనము చేస్తావా?” అడిగాడు.

వివేక్ కూడా సేమ్ క్వషన్ అన్నట్లుగా చూశాడు.

“లేదు సార్. మళ్ళీ వస్తా.  ఇంట్లో అమ్మావాళ్ళు చూస్తూ ఉంటారు. వివేక్‌ సార్ నేను రేపు కలుస్తా” అన్నాడు వివేక్‌తో.

సరేనంటుండగా ముగ్గురు క్రిందికి వచ్చారు.

రాము వెళ్ళిపోయాడు.  మధు,  వివేక్‌ డైనింగు హాలు వైపు నడుస్తుండగా,  మధు చెప్పాడు “రాము చాలా తెలివైన వాడు.  మంచి నాలెడ్జు ఉంది.  నీకు తప్పక హెల్పు చేస్తాడు!”.

తల ఊపాడు వివేక్.  ‘రేపు తప్పక కలవాలి మళ్ళీ’ అనుకున్నాడు మనస్సులో.

ఇంకా వుంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *