March 19, 2024

వనితా!

రచన: ఉమా పోచంపల్లి గోపరాజు

ప॥
మరుమల్లెల తావిలా
మందారం పూవులా
నీవిలాగే ఇలాగే
ఇంపుగా, సొంపుగా
వికసిస్తూ, విరబూయుమా

1వ చ॥
పదములే పృథివిపైన
మెత్తనైన అడుగులై సాగనీ
పలుకులే రామచిలుక పలుకులై
మాధుర్యములొలకనీ!

2వ చ॥
అడుగులే నడకలలో
నాట్యమయూరిగా
చూపులే శరత్జ్యోత్స్న
కాంతికిరణ చంద్రికయై
కనుపాపలోని కాంతివై

3వ చ॥
ఉరకలతో పరుగులతో
చదువులలో ప్రఖ్యాతివై
ఆటలలో పాటలలో
అభ్యున్నతి నొందుమా

4వ చ॥
జగములనెల్లా జయించు
లోకాలకు మేటివై
మేలొనరెడు నేతవై
సుదీప్తివై సుమనస
సుహృదయస్ఫూర్తివై!
దారి చూపు దీనులకు
ప్రగతి పథం చేరుటకై!

5వ చ॥
సుతవై, ప్రేమతోడ సోదరివై
హసితవై, సుమిత్రవై, ప్రాణమిచ్చు హితవై
ప్రియ సతివై ప్రేమను పంచుమా
ప్రీతితోడ ప్రణయసుధవై

6వ చ॥
నీ అశేష లావణ్య, పటిమ,
మేధస్సును, పంచి ఇచ్చు
మాతృమూర్తివై, అనురాగమూర్తివై
వెలుగుల నింపుమా ఇలను
కోవెలగా నీ పదునారు కళలతో!

1 thought on “వనితా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *