March 19, 2024

వేదకర్త “జమదగ్నిమహర్షి”

రచన: శ్యామ సుందరరావు

భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి వివాహము చేసుకోవాలనే తలంపుతో కుశ వంశానికి చెందిన గాది మహారాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు సత్యవతిని ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు రాజు. నున్నటి శరీరము, నల్లటి చెవులు ఉండే వెయ్యి ఆశ్వాలను ఇమ్మని కోరతాడు. అప్పుడు ఋచీకుడు వరుణుని ప్రార్ధించి వెయ్యి అశ్వాలను పొంది గాది మహారాజుకు ఇచ్చి సత్యవతిని పెళ్లాడుతాడు. వివాహము చేసుకున్నాక సత్యవతి తనకు ,తన తల్లికి పుత్ర సంతానాన్ని ప్రసాదించమని భర్త అయినా ఋచీకుని కోరుతుంది ఋచీకుడు యాగము చేసి విప్ర(బ్రాహ్మణ) మంత్ర పూతం అయిన హవిస్సును, రాజ మంత్రపూతం (రాకుమారుడిని ప్రసాదించే) హవిస్సును తయారుచేసి స్నానానికి వెళతాడు ఈ విషయము తెలియని సత్యవతి విప్రమంత్రపూతమైన హవిస్సును తల్లికి ఇచ్చి రాజమంత్ర పూతమైన హవిస్సును తాను తీసుకుంటుంది. భర్త ద్వారా విషయము తెలుసుకొని తనకు సాత్వికుడైన విప్రకుమారుడు కావాలని భర్తను ప్రాధేయపడుతుంది. ఋచీకుడు కొడుకు సాత్వికుడు అయినప్పటికీ మనుమడు క్షత్రియ లక్షణాలతో ఉగ్రుడవుతాడు అని చెపుతాడు
ఆ విధముగా ఋచీకునికి సత్యవతికి జన్మించిన సాత్వీకుడు జమదగ్ని. గాది మహారాజుకు పుట్టినవాడే విశ్వామిత్రుడు. జమదగ్ని రేణుక దంపతులకు జన్మించిన చిన్నకొడుకే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు. రేణుకను వివాహము చేసుకున్న జమదగ్ని ఒకనాడు నర్మదాతీరమున విహరిస్తున్నప్పుడు సూర్యుడు గమనించి “నీవు వేదకర్తవీ. అన్ని తెలిసిన బ్రాహ్మణుడివి పగటి పూట భార్యతో ఈ విధముగా సంచరించటం ఉచితము కాదు” అని అంటాడు. అది విన్న జమదగ్ని సూర్యుని మాటలు లెక్కచేయకుండా ఆగ్రహించి సూర్యుని నీవు రాహువు చేత మ్రింగఁబడి తేజస్సును కోల్పోతావు అని శపిస్తాడు. ప్రతిగా సూర్యుడు కూడా జమదగ్నిని నీవు క్షత్రియునిచే అవమానింపబడి మరణము సంభవిస్తుంది అని శపిస్తాడు. కశ్యపుని వలన వీరిద్దరి తగవు తెలుసుకొని బ్రహ్మ వచ్చి ఇద్దరినీ శాంతింపజేస్తాడు. వారి ఇద్దరి శాపాలు వారికి మంచినే చేస్తాయి అని ఇరువురిని ఆశీర్వదించి వెళతాడు.
జమదగ్ని తన తపోశక్తితో హోమ ధేనువును పొందాడు. ఈ ధేనువు(ఆవు) కోరినవి అన్ని ఇవ్వగల ధేనువు. ఒకసారి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని వేయి చేతులు పొందిన, మహా వీరుడు హైహయ వంశస్తుడైన కార్తవీర్యార్జునుడు వేటకు వచ్చి అలసి జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. జమదగ్ని మహర్షి రాజుకు, అయన పరివారానికి షడ్రషోపేతమైన విందును ఏర్పాటు చేస్తే, కార్తవీర్యార్జునుడు అశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యము అని అడుగుతాడు. అప్పుడు జమదగ్ని దీని అంతటికి కారణము కోరిన కోరికలు తీర్చే కామధేనువు సంతానానికి చెందిన గోవు అని చెపుతాడు. వెంటనే రాజు ఆ గోవును తనకు ఇమ్మని అడుగుతాడు. జమదగ్ని నిరాకరించగా కార్తవీర్యార్జునుడు బలవంతముగా ఆ గోవును తీసుకుపోతాడు.

ఆశ్రమానికి వచ్చిన పరుశురాముడు విషయము తెలుసుకొని, కార్తవీర్యార్జుని రాజ్యమైన మాహిష్మతికి వెళ్లి, యుద్ధము చేసి, ఆ రాజు వెయ్యి చేతులను, తలలను తన పరుశుతో నరికి, తను చేసిన పని తండ్రి జమదగ్నికి చెపుతాడు. తండ్రి పరుశురాముడిని మందలించి యుద్దాలు చేయటము మునుల పని కాదు, రాజును చంపిన పాప పరిహారార్ధముగా ఒక ఏడాది పాటు పుణ్యక్షేత్రాలను దర్శించి రమ్మని చెపుతాడు. పుణ్యక్షేత్రాల దర్శనము అనంతరము ఆశ్రమానికి చేరిన కొంతకాలానికి ఒకసారి రేణుక నీటికి చెరువుకు వెళ్లి అక్కడ గంధర్వుల జలక్రీడలను చూస్తూ తిరిగి రావటము ఆలస్యము చేస్తుంది. పరపురుషులను చూడటము వలన ఆవిడ పాతివ్రత్యాన్ని భంగము కలిగింది, ఈ విషయాన్నీ గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి, కొడుకులను పిలిచి తల్లి రేణుకను వధించమని ఆజ్ఞాపిస్తాడు. కానీ కుమారులు ఎవ్వరు ముందుకు రారు. ఆ సమయములో పితృ వాక్య పరిపాలన కోసము పరుశురాముడు తల్లిని, సోదరులను సంహరిస్తాడు. తన మాట ప్రకారము తల్లిని సోదరులను చంపిన పరుశురాముడిని ఏదైనా వరము కోరుకోమంటాడు. అప్పుడు పరుశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమని కోరతాడు. ఆ విధముగా పరుశురాముడు తల్లిని సోదరులని తిరిగి బ్రతికించుకుంటాడు.
జమదగ్ని మహర్షి పితృకార్యము కోసము ఆవుపాలను ఉంచితే, కోపదేవత జమదగ్నిని పరీక్షించటానికి ఆ పాలను నేలపాలు చేస్తుంది అయినప్పటికీ జమదగ్ని ఆగ్రహించకుండా ఉంటాడు ఇది చూసిన కోపదేవత “మీ భృగు వంశస్తులకు కోపము ఎక్కువ కదా ఆ విషయము పరీక్షించటానికి ఈ పని చేసాను నన్ను క్షమించండి” అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ పితృదేవతలు పితృ కార్య నిర్వహణలో అలక్ష్యము వహించినందుకు జమదగ్నిని ముంగివై పుడతావని శపిస్తారు. ఈ తప్పు తానూ తెలిసి చేసిన తప్పు కాదని తన్ను క్షమించి శాప విముక్తి చేయమని జమదగ్ని పితృదేవతలను ప్రాధేయపడతాడు. అప్పుడు వారు శాంతించి ధర్మరాజు అశ్వమేధ యాగము చేసిన తరువాత శాప విమోచనము కలుగుతుంది అని, ఆ తరువాత జన్మ రాహిత్యము లభిస్తుంది అని వరము కూడా ఇస్తారు. అందుచేత జమదగ్నికి మరో జన్మ అంటూ ఉండదు.
పశురాముడు లేని సమయము చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి అయన తల నరికి మాహిష్మతి రాజ్యానికి తీసుకుపోతారు. పరుశురాముని తల్లి భర్త శవము పై పడి 21 సార్లు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంది. ఇది చూసిన పరుశురాముడు ఆగ్రహముతో మాహిష్మతి రాజ్యానికి పోయి కార్తవీర్యార్జుని కుమారులను చంపి, జమదగ్ని తల తెచ్చి మొండానికి అతికించి తండ్రిని బ్రతికించుకుంటాడు. అంతటితో ఊరుకోక మొత్తము క్షత్రియ జాతిపై ఉన్న ఆగ్రహముతో క్షత్రియులపై 21 సార్లు దండెత్తి, క్షత్రియ వంశాలను చంపి శ్యమంతక పంచకమనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తముతో నింపి తల్లిదండ్రులకు తర్పణములు అర్పిస్తాడు. ఆ సమయములో దశరధుడు లాంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాక్కొని ప్రాణాలను కాపాడుకుంటారు. ఆ విధముగా క్షత్రియులను నిర్మూలించానని భావించిన పరుశురాముడు భూమినంతటిని కశ్యపునికి దానమిచ్చి తానూ తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *