March 19, 2024

సూర్యోదయం

రచన : యం. ధరిత్రీ దేవి

పార్కులో హుషారుగా నడుస్తున్న వాడల్లా ఠక్కున ఆగిపోయారు రాఘవ రావు గారు, కాస్త దూరంలో ఓ సిమెంటు బెంచీ మీద కూర్చున్న దయానంద్ గారిని చూసి. మెల్లిగా అటువైపు అడుగులు వేశారాయన. దాదాపు కొన్ని నెలలయి ఉంటుంది ఆయన్ని చూసి. మనిషి బాగా నీరసించిపోయారు. ముఖంలో ఏదో చెప్పలేని దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.
రాఘవరావు గారు, దయానంద్ గారు ఇద్దరూ కాలేజీ ప్రిన్సిపాల్స్ గా చేసి రెణ్ణెళ్ల తేడాతో పదవీ విరమణ చేశారు. దయానంద్ గారు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కు తన ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ తో పాటు తెలిసిన వాళ్ళందర్నీ పిలిచారు. కానీ వారి నుండి పెద్దగా స్పందన అయితే కానరాలేదు. ఆ తర్వాత రెన్నెళ్లకు రాఘవరావు గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. బాగా దగ్గరి వాళ్లకు మాత్రమే ఆ విషయం తెలియజేసినా, ఆయనను ఎరిగినవారంతా ఆహ్వానించక పోయినా రావడం ఆ రోజు పెద్ద విశేషం! దయానంద్ గారు కూడా రాఘవరావు గారి పిలుపునందుకొని హాజరయ్యారు. ఆ రోజు ఆయన రావడానికి కారణం, వారిద్దరూ లెక్చరర్స్ గా ఉన్నప్పటి నుండీ ఒకరినొకరు బాగా తెలిసి ఉండడం ఒకటైతే, రాఘవరావు సహృదయత మరో కారణం. కానీ, తీరా వచ్చాక దయానంద్ గారు, ” వచ్చి పొరపాటు చేశానా ” అని తీవ్రంగా మధన పడసాగారు.
ఆ సమయంలో అతనికి తనకు జరిగిన సాదాసీదా సన్మానం గుర్తుకు రావడమే అందుకు కారణం. బంధు మిత్రులు, తోటి సహచరులు, విద్యార్థుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతుందనుకున్న అతని ఆశ అది కాస్తా పేలవంగా జరగడంతో అడియాశే అయింది. కాలేజీ వాళ్ళు ఏదో మొక్కుబడిగా కార్యక్రమం అయిందనిపించారంతే!
ఇప్పుడు రాఘవరావు గారి పదవీ విరమణ సన్మానం చూస్తూ ఉంటే రెండు కళ్లూ సరిపోవనిపించింది. వచ్చిన వాళ్లంతా ఆయనతో తమకున్న అనుబంధం, అనుభవాలూ చెప్తూ అందరి ముందూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య అత్యంత వైభవంగా జరుగుతూ పోతోంది ఆయన సన్మాన కార్యక్రమం. పూల దండలు ఓ పక్క గుట్టలుగా పడిపోయాయి. శాలువాలు, కానుకలు మరో పక్క!
చివర్లో దంపతులు ఇద్దరూ అందరికీ చిరునవ్వుతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దయానంద్ గారికి ఇదంతా చూస్తూ ఉంటే లోపల ఏదో తెలియని గుబులు ఆవరించింది. రాఘవరావు మీద అసూయ అని కాదుగానీ, ఎందుకో అతని మనసంతా బాధతో నిండిపోయింది. కార్యక్రమం అవగానే రాఘవరావు గారితో కరచాలనం చేసి సెలవు పుచ్చుకున్నాడు.
అది మొదలు అడపా దడపా ఇద్దరూ కలుసుకుంటున్నా పెద్దగా మాట్లాడుకున్నది లేదు. సాధారణంగా ఇద్దరూ సాయంత్రం వాకింగ్ సమయంలో కలుస్తుంటారు. దయానంద్ గారు అలాంటప్పుడు ఓ విషయం బాగా గమనించారు. వారికి ఎదురుపడిన వాళ్లలో చాలామంది, ముఖ్యంగా ఆయన సహోద్యోగులు రాఘవరావు గారితో ఎంతో మర్యాదగా, మరింత ఆప్యాయతగా మాట్లాడేవారు. అందులో వింతేమీ లేక పోయినా దయానంద్ గారికి ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే తను ప్రిన్సిపాల్ గా చేసినప్పుడు తన వద్ద పనిచేసిన అధ్యాపకులు కూడా రాఘవరావు గారితోనే ఎంతో చనువుగా మాట్లాడడం! దయానంద్ గారిని ఏదో అలా ఓసారి పలకరింపుగా చూడ్డమే గానీ పెద్దగా పట్టించుకోకపోవడం! అదే అతనికి కించిత్ బాధగా అనిపించేది. కారణమేమిటో బోధపడేది కాదతనికి!
అలా అలా రెండేళ్ళు గడిచిపోయాయి. యధాలాపంగా ఈరోజు ఇద్దరూ కలుసుకున్నారు. దయానంద్ గారి పక్కనే కూర్చుంటూ ఆయన భుజం మీద చేయి వేసి, నెమ్మదిగా అడిగారు రాఘవరావు గారు,
“దయానంద్ గారూ, కొద్దిరోజులుగా అడగాలి అనుకుంటూ ఆగిపోతున్నాను. మీరెందుకో దేనికో లోలోపల బాధపడుతున్నట్లుగా నాకనిపిస్తోంది. అభ్యంతరం లేకపోతే నాతో పంచుకోగలరా.”
ఎంతోఅనునయంగా అడిగిన ఆ తీరుకు దయానంద్ గారి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. బలవంతంగా ఆపుకుంటూ పెదవి విప్పారు.
“రాఘవరావు గారూ, బాగా ఒంటరినైపోయానండీ, ఉద్యోగం చేస్తున్నన్నాళ్లూ ఆ బిజీ లైఫ్ లో ఏమీ తెలీలేదు. రిటైరయ్యాక ఏమిటో అంతా శూన్యంగా అనిపిస్తోంది. ఒక్కసారిగా మాట్లాడేవారే కరువైపోయారు అంటే నమ్మండి. అప్పుడు సలాంలు కొట్టిన వారంతా ఏమయ్యారు? ఇప్పుడు, కనీసం అటెండర్ గా చేసిన వాడు కూడా చూసీ చూడనట్టు జారుకుంటున్నాడు. లోపం ఎక్కడుందో తెలియడం లేదు.”
బాధ గొంతుకు అడ్డం పడి ఆయన మాటలు ఆగిపోయాయి. రాఘవరావు గారికి ఒక్కసారిగా సమస్య పూర్తిగా అర్థమైపోయింది. ఓ నిమిషం పాటు ఆయన చెయ్యి నొక్కుతూ ఉండిపోయారాయన. తర్వాత మెల్లిగా పెదవి విప్పారు.
“దయానంద్ గారు! మీ బాధకు అర్థం ఉంది. కానీ, కఠినంగా అనిపించినా అందులో మీ పాత్ర కూడా చాలా ఉంది.”
తలెత్తి చూశారు దయానంద్ గారు. తల పంకిస్తూ,
“అవును, చెబితే నమ్మబుద్ధి కాదు గానీ, మీరే కాదు చాలామంది ఉన్నత పదవులు నిర్వహించిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడు తమ క్రింది ఉద్యోగుల పట్ల చూపిన అధికార దర్పమే దానికి ప్రధాన కారణం అంటే మీరు నమ్ముతారా? కూర్చున్న కుర్చీ శాశ్వతం కాదనీ, ఆ అధికారం, హోదా, దర్జా– ఇవన్నీ పదవీ విరమణ వరకేననీ గ్రహింపు లేక అవసరానికి మించిన ఆధిపత్యం చూపిస్తుంటారు. ఇంకా మితిమీరి పెత్తనం చలాయిస్తుంటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి దయానంద్ గారూ, మీరేమైనా మీ సబార్డినేట్స్ పట్ల ఆ విధంగా ప్రవర్తించేవారా?.. ”
నెమ్మదిగానే అయినా, సూటిగా అడిగారు రాఘవరావు గారు. ఆ మాటలతో ఉన్నట్టుండి దయానంద్ గారి లో కదలిక మొదలైంది. తాను ప్రిన్సిపాల్ గా చేసిన పది సంవత్సరాల కాలంలో తన క్రింది ఉద్యోగుల పట్ల తన దురుసు ప్రవర్తన, అజమాయిషీ, వాళ్లను చిన్న బుచ్చుతూ మాట్లాడ్డం, అటెండర్ లను తన సొంత సేవకుల్లా చూడ్డం.ఇవన్నీ సినిమా రీళ్ళలా తిరిగాయి అతని మస్తిష్కంలో. అందరికీ తన పట్ల ఓ విధమైన ఏహ్యభావం! వాళ్ళంతా భయంతోనే గానీ, గౌరవంతో ఎన్నడూ సహకరించని వైనం! అతని కళ్ళముందు కదిలాయి. అతని హావభావాలు గమనించిన రాఘవరావు గారు,
“మన ప్రవర్తన ఎదుటివారికి బాధ కలిగించకూడదు దయానంద్ గారు. ఎలాంటి దుడుకు స్వభావం గలవారైనా సరే మన మంచి స్వభావం వల్ల మన దారికి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అది గ్రహించుకుని అందర్నీ ఒక్క తాటి మీదకు తెచ్చుకునేలా అధికారి చాకచక్యం చూపించాలి. ఎవరి పట్ల ఎలా మసలుకోవాలో ఆలోచించే పరిజ్ఞానం చాలా అవసరం కూడా. ఇదంతా మీకు తెలియదని కాదు, కొందరైతే తమ స్థాయి ఎక్కడ తగ్గుతుందోనన్న శంకతో సబార్డినేట్స్ కు చనువివ్వరు. అహం అడ్డొస్తుంది కూడా.”
ఆయన చెబుతున్నదంతా అక్షరాలా నిజం అని తన స్వభావం బాగా తెలిసిన దయానంద్ గారికి తేలిగ్గానే తెలిసి వచ్చింది. కుర్చీ శాశ్వతమనుకొని అహంభావం తలకెక్కించుకున్న తన నైజం మీదా తొలిసారి ఏవగింపు కలిగిందతనికి.
“మరో విషయం వింతగా అనిపిస్తుంది ఇది వింటే, నమ్మబుద్ధి కూడా కాదు. ఉద్యోగ జీవితంలోనే కాదు, సొంత కుటుంబంలో కూడా కొందరు ఇలాగే ఉంటుంటారు. కోడళ్ల తో చనువుగా మాట్లాడితే తన విలువ ఎక్కడ తగ్గిపోతుందో అనుకుంటూ గాంభీర్యాన్ని పాటించే మామగార్లు ఉంటారు! అంతెందుకు? భార్య విషయంలో కూడా ఇలాగే ఉండే భర్తల్ని నేను చూశాను.”
ఆయన చెప్పుకుంటూ పోతున్నారు.
“ఈ రోజు బాగున్నాం కదాని ఆధిపత్యం చెలాయిస్తే, రేపు వయసుడిగి పోయాక వాళ్లతోనే అన్ని సేవలూ చేయించుకోవాల్సిన దుర్గతి పడుతుందన్న దూరాలోచన లేక పోవడం ఇలాంటి వాళ్లు చేసే తప్పిదం. అది ప్రత్యక్ష నరకమే కాదా?.”
ఉలిక్కిపడ్డారు దయానంద్ గారు. తాను తన ఇద్దరు కోడళ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో క్షణకాలం మదిలో మెదిలిందాయనకి. మనవలు, మనవరాళ్ళు కూడా తన వద్దకు చనువుగా రాకపోవడం తలపుకొచ్చింది. అవును మరి! ఎన్నడైనా వాళ్లను ప్రేమగా దగ్గరకు తీసుకుని కబుర్లాడి ఉంటేగా! అంతెందుకు! కన్న కొడుకులు కూడా అత్యవసరమైతే తప్ప తనతో నాలుగు మాటలు మాట్లాడి ఎరుగరు! అందుకే ఇంట్లో పది మందిలో ఉన్నా ఒంటరి అయిన భావన అతన్ని వెంటాడుతోంది ఈమధ్య!
ఎక్కడికో వెళ్లిపోయిన ఆయన్ని తడుతూ,
“సరే, అవన్నీ ఇప్పుడు అనవసరం అనుకో, ఏదో గడిచిపోయింది. మనస్తాపం కాస్తయినా తగ్గాలంటే ఒకటి చెప్పగలను. గతంలో మీతో ఒకరిద్దరయినా సఖ్యంగా, సన్నిహితంగా ఉండే ఉంటారు. అలాగే బంధువుల్లో కూడా. వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారు మాట్లాడనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అనుకోవద్దు. మనమే ఒకడుగు ముందుకేస్తే పోలా! ఇది చెప్పడం చాలా ఈజీ. కానీ, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా! ఏ ఒక్కరు స్పందించినా మంచిదే.అలా అలా.అలాగే ఇంట్లో వాళ్లతో, మనవళ్ళు, మనవరాళ్లతో సన్నిహితంగా మెలుగు. కొద్దిరోజుల్లోనే మార్పు గ్రహిస్తావు. ఈ నిర్లిప్తత, నైరాశ్యం దూరం కాగలవు. సరే.ఇవేవీ కుదరవంటావా. ఏదో ఒక వ్యాపకం మీకు ఇష్టమైనది మొదలు పెట్టండి.ఎవరితోనూ పనిలేకుండా సమయం గడిచిపోతుంది.”
ఆయన చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఏమంటావు, అన్నట్లుగా చూశారు రాఘవ రావు గారు. అతని మాటల ప్రభావమో ఏమో, చిత్రంగా దయానంద్ గారి వదనం మబ్బులు విడిన ఆకాశంలా అయిపోయింది. ప్రసన్నంగా చూస్తూ,
“తప్పకుండా.ఒక్కమాట.ఎవరిదాకానో ఎందుకు, ప్రతీ రోజూ అయిదు నిముషాలు మీతో గడిపితే చాలనిపిస్తోంది. సంతోషానికి చిరునామా మీరు. అయినా, మీ సలహా కూడా తప్పకుండా పాటిస్తాను. ”
అతనిలో ఏదో కొత్త ఉత్సాహం! గంట క్రితం అతన్నావరించియున్న నైరాశ్యం అతనిలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించలేదు రాఘవరావు గారికి!
“మంచిది. మాటల్లో పడి టైమ్ మరిచిపోయాము, ఇక లేద్దామా” అంటూ లేచారాయన. ఇద్దరూ కలిసి గేటు వైపు దారి తీశారు. చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. కానీ దయానంద్ గారు మాత్రం అప్పుడే సూర్యోదయం అయినట్లు అనుభూతి పొంది హుషారుగా ముందుకు కదిలారు.

*****************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *