February 27, 2024

అమ్మమ్మ – 32

రచన: గిరిజ పీసపాటి

“నేను కూడా ఈ పూట వెళ్ళను పాపా! నా మనసేం బాగోలేదు” అన్న తల్లితో “నువ్వు మనసు బాగోలేదని మానెయ్యడానికి నీది మామూలు ఉద్యోగం కాదమ్మా! నిన్ను నమ్మి కుష్ట (కృష్ణ) మామ అప్పజెప్పిన బాధ్యత. నువ్వు వెళ్ళకపోతే ఎలా?” అంటూ తల్లిని బలవంతంగా షాప్ కి పంపింది.
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన నాగ “నాన్నకి కేరియర్ పంపావా!?” అనడిగింది వసంతను. “తమ్ముడు తిని, ఇప్పుడే తీసుకెళ్ళాడు. నువ్వు కూడా తినేసి కాసేపు నడుం వాల్చు” అంది వసంత.
కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి భోజనానికి కూర్చుంటూ “కరెంటు ఎన్నింటికి వచ్చింది?” అనడిగింది. “మధ్యాహ్నం పన్నెండు గంటలకు” అంది వసంత.
పేలవంగా నవ్వి “వెంటనే వచ్చి ఉంటే ఇంత రభస జరిగేది కాదు కదా!” అంది.
ఉదయం ఇంట్లో చీకటిగా ఉండడంతో గమనించలేదు గానీ ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో తల్లి ముఖాన్ని పరీక్షగా చూసిన వసంత “అదేంటి? కన్నంతా అలా వాచిపోయింది?” అనడిగింది ఆందోళనగా.
“ఏముంది? ఉదయం మీ నాన్న ఇచ్చిన బహుమతి” అంది చిన్నగా నవ్వుతూ.
అదే సమయానికి “నేను లోపలికి రావచ్చా” అన్న గొంతు వినబడి గుమ్మం వైపు తలతిప్పి చూస్తే అక్కడ ఎదురింటి అన్నపూర్ణ గారు నిలబడి ఉన్నారు.
ఆవిడ ఎందుకొచ్చారో అర్ధమైన నాగ “ఏమీ లేదొదినగారూ! ఏదో కొంచెం చికాకుకులో…” అంటూ చెప్పబోతుండగానే ఆవిడ మధ్యలోనే అందుకుని “మనం ఉంటున్నది పెద్ద బంగళా కాదు వదిన గారూ!”
“కరెంటు కూడా లేకపోవడంతో మీ సంభాషణ అంతా మేము వింటూనే ఉన్నాం. అయినా కరెంటు పోతే మీరు మాత్రం ఎలా ఇస్త్రీ చేస్తారు? అసలు బంగారపు బొమ్మలా ఉండే మీలాంటి భార్యని కొట్టడానికి ఆయనకు చేతులెలా వచ్చాయో!”
“ఇంకా నయం. దెబ్బ కాస్త కింద తగిలి ఉంటే కన్ను పోవాల్సింది. పిల్లలు కూడా ఇప్పటివరకు భోజనం చెయ్యలేదు. మీరంతా ముందు భోజనం చెయ్యండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. అవి మనసులో పెట్టుకుని తిండి మానేస్తే ఎలా!?” అంటూ మందలించారు.
ఎప్పుడూ గుమ్మం దగ్గర మాట్లాడుకోవడమే తప్ప లోపలికి రాని ఆవిడ వచ్చి అంతలా చెప్తుండేసరికి ముగ్గురూ భోజనం చేయసాగారు.
అసలు అన్నపూర్ణ ఆంటీ ముఖం చూస్తేనే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. పచ్చని పసిమి రంగుతో, లావుగా ఉండే అన్నపూర్ణ ఆంటీ ముఖం మీద చెరగని చిరునవ్వు, మృదువైన ఆవిడ మాటలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఏనాడూ ఆవిడ ముఖంలో కోపం చూసి ఎరగం. ఆవిడని చూస్తే ఒక దేవతా మూర్తిని చూసినట్టుంటుంది.
ఇంతలో తండ్రికి కేరేజీ తీసుకెళ్ళిన నాని తిరిగి ఇంటికి వచ్చాడు. “ఏరా! నాన్నకి కోపం తగ్గిందా? నీతో బాగా మాట్లాడారా? భోజనం చేసారా?” అంటూ ఆత్రంగా ప్రశ్న మీద ప్రశ్న వేసింది నాగ.
“నాన్న అసలు స్కూల్ కే రాలేదటమ్మా!” అన్నాడు ముఖం వేలాడేసుకుని నాని.
“స్కూల్ కి వెళ్ళకపోవడమేంటి?” అంది నాగ గాభరాగా.
“అక్కడ టీచర్స్ ని, మిగిలిన స్టాఫ్ ని కూడా అడిగానమ్మా! ఎవరూ చూడలేదన్నారు” అన్నాడు నాని.
“ఉదయం ఎక్కడికి వెళిపోయావురా? ఆయనతో పాటు నువ్వూ తిన్నగా స్కూల్ కి వెళ్ళుంటే బాగుండేది కదా! ఆయన ఎప్పుడూ విశాలాంధ్ర బుక్ హౌస్ దగ్గర ఫ్రెండ్స్ ని కలుస్తారు కదా! అక్కడ చూసావా?” అడిగింది వసంత.
“నేనొచ్చే దారే కదక్కా. అక్కడా చూసాను. అక్కడెవరూ లేరు” అన్నాడు. దాంతో భోజనం చెయ్యలేక ముగ్గురూ చెయ్యి కడిగేసుకుని లేచారు. కళ్ళంట నీళ్ళు తిరుగుతుండగా “ఎక్కడికి వెళ్ళుంటారు?” అంది నాగ చిన్నగా.
“మగాళ్ళు కదా వదిన గారూ! ఏదో మనసు బాగోక కాస్త రోడ్లన్నీ తిరిగి సాయంత్రానికల్లా వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. వసంతా అమ్మని జాగ్రత్తగా చూసుకో” అంటూ‌ ధైర్యం చెప్పి తమ ఇంట్లోకి వెళిపోయారు ఆంటీ.
సాయంత్రం అయినా పెదబాబు రాలేదు. రాత్రి పన్నెండు గంటలు దాటినా రాలేదు. తెల్లవార్లూ తల్లీ, పిల్లలు చిన్న చప్పుడైనా పెదబాబు వచ్చాడేమోనని చూస్తున్నారు. ఆయన రానేలేదు.
మూడు రోజులు గడిచాయి. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియక తిండి, నీరు లేక నీరసించిపోసాగారు. అంత బాధలోనూ కాస్త ధైర్యాన్ని ఇస్తున్న మనుషులు అన్నపూర్ణ గారు, వీరిచే షాప్ పెట్టించిన బంధువు కృష్ణమూర్తి గారు మాత్రమే.
ఒకరోజు వీరి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి గారితో “నువ్వొకసారి మన ఊరు వెళ్ళి, ఈయన అక్కడున్నారేమో చూసిరా అన్నయ్య. ఈయన అక్కడ ఉంటే మంచిదే. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే ‌మామయ్య గారికి విషయం చెప్పు. ఆయనకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది”
“అంతేకాక ఆయనకు ప్రతీ ఊరిలోనూ శిష్యులు, అభిమానులు ఉన్నారు. వారికెవరికైనా ఈయన జాడ తెలిస్తే ఆయనకు తెలియజేస్తారు. అలాగైనా మీ బావ గురించి తెలుస్తుంది” అంది నాగ దుఃఖభారంతో.
“సరే చెల్లీ! నేను రేపే వెళ్తాను. పెద్దాయనకు జాగ్రత్తగా చెప్పాల్సిన విధంగా చెప్పి చూస్తాను. నువ్వు దిగులు పడకు” అని చెప్పి మర్నాడే రాముడువలస వెళ్ళి తిరిగి వచ్చాడాయాన.
ఆయన ఊరు వెళ్ళినందున తప్పనిసరి పరిస్థితుల్లో షాపుకు వెళ్ళింది నాగ. షాప్ కి వచ్చిన కృష్ణమూర్తి ని చూస్తూనే “ఈయన అక్కడే ఉన్నారా అన్నయ్యా!?” అడిగింది ఆత్రంగా.
“లేడు చెల్లీ. మీ మామగారికి విషయం చెప్పాను. వినగానే అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. వాడుట్టి అమాయకుడనీ, మీరే వాడిని బాధలు పెట్టి ఉంటారనీ, అందుకే వాడు ఇల్లు వదిలిపెట్టి వెళిపోయాడని నిన్ను, పిల్లల్ని బాగా తిడుతున్నాడు”
“వాడి జాడ తెలిస్తే సరే. ఒకవేళ మీ బాధ పడలేక ఆత్మహత్యకైనా పాల్పడి ఉంటే మిమ్మల్ని బతకనివ్వనని శపధం చేసాడు. ఎందుకైనా మంచిది. మీ అమ్మగారికి విషయం తెలియజేసి, ఆవిడని రమ్మని చెప్పు” అన్నాడాయన.
“ఈ వయసులో అమ్మని బాధ పెట్టడం ఎందుకన్నయ్యా. రేపే పిల్లలని తీసుకుని రాముడువలస వెళ్ళి అత్తయ్యగారికి, మామయ్యగారికి అసలు విషయం చెప్తాను. మహా అయితే నాలుగు తిడతారు. పడతాము. అంతే కాని‌ ఉరి వేసి చంపెయ్యరు కదా!” అంది.
“కొంపతీసి అంత పనీ చేసేవు సుమా! ఆయన చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు, పిల్లలు ఇప్పుడు ఆయనకు ఎదురు పడకపోవడమే మంచిది. తీరా మీరు అక్కడికి వెళ్ళాక మీ ఆయనకి కోపం తగ్గి ఇంటికి వస్తే, తాళం వేసి ఉన్న ఇంటిని చూసి మళ్ళీ కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోయినా వెళిపోతాడు”
“మీ మంచి కోసమే చెప్తున్నాను. ఆపైన నీ ఇష్టం. ఆలోచించుకో” అన్న ఆయన మాటలతో ఆలోచనలో పడింది నాగ.
ఇంటికొచ్చి వసంతతో విషయం చెప్పింది.
వసంత కూడా “నిజమేనమ్మా! ఇప్పుడు తాతకి ఎదురుపడితే ఆయన అనే మాటలు పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఇల్లొదిలి వెళిపోయేంత కష్టం ఏమొచ్చిందీయనకి. చేసిందంతా ఆయన చేసి, మనమేం చేసామని మనల్ని మాటలు అనిపిస్తున్నారు?” అంది కోపంగా.
వసంత కోపం సంగతి తెలిసిందే కనుక మరేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నాగ. నాని చిన్నవాడు, గిరిజ అమాయకురాలు. వాళ్ళిద్దరిదీ ప్రేక్షక పాత్రే అయిందా క్షణాన.
జరిగిన విషయాలేవీ తల్లికి తెలియజేయలేదు నాగ. తల్లి దగ్గర నుండి ఉత్తారాలు వస్తున్నా అందరం బాగానే ఉన్నామంటూ సమాధానం ఇవ్వసాగింది. షాప్ లో వర్కింగ్ పార్ట్నర్ గా వస్తున్న జీతంలో ఇంటద్దెకు పోగా తినడానికే సరిపోవట్లేదు.
దాంతో వసంత మందుల కోసం మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా అమ్మయ్యాల్సి వచ్చింది. ఇలా ఎన్నాళ్ళు?

—– సశేషం —–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *