May 25, 2024

అష్టవిధ నాయికల కథలు – వాసకసజ్జిక.

రచన: ధనలక్ష్మి పంతుల

రఘురామ్ ఊరెళ్ళి వారం దాటింది. ఇంకా రాలేదు. ఇందాక ఫోను చేసాడు. “రాత్రి ఎనిమిది అవుతుంది” అని.
అంటే వంట చేసి వుంచాలి. ఎప్పుడు భోంచేసారో!?” ఆనుకుని ” అమ్మో ! సాయంత్రం నాలుగయ్యింది” ఆనుకొని
గబగబా మొదలెట్టింది వంట.
రఘురామ్ కి కుక్కరులో వండితే ఇష్టం వుండదు. అందుకే కోలగా దుక్కగా ఉన్న ఇత్తడి గిన్నె ( బూసిగిన్ని) అనేవాళ్ళు. అందులో బియ్యం కడిగి అత్తెసరుకి పెట్టింది. సిమ్ లో పెడితే నెమ్మదిగా ఉడికి చాలా సేపు వేడిగా వుంటుంది.
రఘురామ్ కి ప్రతీరోజూ రోటి పచ్చడి వుండాలి. అందుకే మూకుడు కాలేసి నూనె చుక్కలు రెండంటే రెండే వేసి
కొంచెం మినప్పప్పు, శెనగపప్పు, ఎండుమిరపకాయలు ఓ మూడు, చిటికెడు ఇంగువ, చిన్న జీలకర్ర వేసి మెరుగులా వేయించి పక్కకు తీసిపెట్టింది. ఆ మూకుట్లోనే టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం రెండు పిక్కలు చింతపండును నూనె వేసి వేయించింది.
స్టౌ గట్టుమీద చిన్న రాతి రోలులో అవన్నీ వేసి కచ్చాపచ్చాగా దంచి పోపువేసింది. మిక్సీలో వేసి రుబ్బితే మంచి వాసన రాదు అంటాడు. అతనికిష్టమని రోట్లోనే చేస్తుంది.
కొంచెం పోపు మజ్జిగ, వంకాయ మెంతికారం కూర చేసింది. ఇదికూడా అంతే. కూరమసాలా అప్పటికప్పుడు వేయించి ఆ చిన్నరోట్లో దంచి వెయ్యాలి. తాజాగా వుంటే ఇష్టంగా తింటాడు అనుకుంది.
అమ్మో! సాయంకాలం ఆరున్నర.
గబగబ ఇల్లు సర్దాలి. ఎక్కడివక్కడ అద్దంలా సద్దాలి ఇల్లు. కర్టన్లు దుమ్ము ధూళి లేకుండా వుండాలి. వచ్చేసరికల్లా వంటిల్లు, భోజనానికి టేబిలు, ప్లేట్లు అన్నీ తుడిచి పెట్టాలి. బట్టలు ఆరేసినవి చాలా నీట్ గా, కొన్ని ఇస్త్రీ చేసి, మిగిలినవి అలమార్లో సద్దాలి. బాల్కనీలో కుండీలో మొక్కలు చెత్తా చెదారం లేకుండా వుండాలి.
అతని కిష్ట మైనవన్నీ తలుచుకుంటూ కూనిరాగాలు తీస్తూ సద్దుతోంది. ఫ్లవర్
వాజులు తుడిచినవే మళ్ళీ మళ్ళీ తుడుస్తూ కొత్తగా పూసిన పూలు వాటిల్లో పెట్టింది. టీపాయ్ మీద ఒక ఇత్తడి డిజైను వున్న బేసిన్ లో గులాబీ రెక్కలు మధ్యలో ఓ మూడు మల్లెపూలు వేసి నీరు పోసి పెట్టింది.
బెడ్ రూమ్ లో అతనికి ఇష్టమైన బెడ్ షీట్ మంచంమీద వేసింది. చివరలు మడిచి లోపలికి దోపింది. వేళ్ళాడితే
రఘుకి ఇష్టంవుండదు. తలగడలు గలీబులు మార్చి అందంగా అమర్చింది.
సోఫాలోకూడ చిన్న చిన్న పిల్లోలు అందమైన ఆకారంలో సద్దింది.
గుమ్మానికి కర్టన్ మార్చింది. ఇలా ఎన్ని చేసినా ఏదో వొకటి కనిపిస్తోంది సద్దడానికి.
గబగబా స్నానం చేసి అతనికి నచ్చిన చీర కట్టుకుని జడలో చిన్న సన్నజాజి పూలదండ పెట్టుకొని, తాను ఎవ్వరికీ కనపడకుండా తనకి మాత్రం గేట్లోంచి వచ్చే భర్త కనపడేటట్లు గా హాల్లో ఒక పక్కకు కూర్చుని, మళ్ళీ టీ. వీ కవరు బాగులేదని ఇంకోటిమార్చింది.
ఫ్రిజ్ దగ్గరికెళ్ళి తలుపు తెరచి చూసింది. తన రఘుకి పాలపేకెట్టు తప్ప ఇంకేమీ ఉంచడం ఇష్టం వుండదు.
ఎవ్వరైనా అతిథులు కోసం చల్లటి నీళ్లు కావాలంటే ఇవ్వడానికి అంతే!
రైల్లో వస్తున్న రఘురామ్ కి తెలుగు సాహిత్యం అంటే ఇష్టం. కావ్యనాయికల గురించి చదువుతున్నాడు.
రైలు ఆగింది. స్టేషన్ వచ్చేసింది అనుకొని సూట్ కేస్ తో కిందికి దిగి పార్క్ చేసిన స్కూటర్ పై ఇంటికి వచ్చి, ” సూపర్”
అని మెచ్చుకున్నాడు.
“ఓయ్” వాసకసజ్జికా” అని పిలిచాడు.
“ఆవిడెవరు” అడిగింది కంగారుగా.
“కంగారుపడకు! నా శ్రీమతి నువ్వేనోయ్!” అన్నాడు రఘురామ్.
“నువ్వేకాదు. నీలా భర్తలని అర్థం చేసుకొని ఇష్టంతో ఇల్లు సర్ధుకుని అన్నీ చేసిపెట్టి ఎదురు చూసే భార్యలంతా
” వాసక సజ్జికలే”. అన్నాడు.

తరువాత మరో కథానాయికతో కలుద్దాం.

శుభం. !!!!

1 thought on “అష్టవిధ నాయికల కథలు – వాసకసజ్జిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *