April 20, 2024

చంద్రోదయం – 24

రచన: మన్నెం శారద

శేఖర్ కిందపడి మెలికలు తిరిగిపోతున్నాడు.
సారథి అతన్ని పట్టుకోలేకపోతున్నాడు. శేఖర్ నోటినుండి నురగ వస్తోంది.
వసుధ సుహాసిని శేఖర్ చేతులు గట్టిగా అదిమి పట్టుకున్నారు.
స్వాతి మ్రాన్స్పడిపోతున్నట్లు చూసింది.
ఆమెకేం చేయాల్సింది. . ఏం జరుగుతున్నదీ అర్ధం కాలేదు.
ఆమె గుండె బలహీనంగా కొట్టుకొంటోంది.
సారథి కేక వేసేసరికి క్రిందనించి నలుగురు యువకులు వచ్చారు. అందరూ శేఖర్‌ని అదిమిపట్టి క్రిందకు దింపి రిక్షాలో హాస్పిటల్‌కి తీసికెళ్ళేరు.
అంతవరకూ నవ్వుకొంటున్న ఇల్లు ఒక్కసారి కళావిహీనమపోయింది.
స్వాతి కుప్పలా కూలబడిపోయింది. ఆడపిల్లలంతా ఒక్కసారి బావురుమన్నారు.
ఆ ఏడుపులకి సారథి తల్లి లేచొచ్చింది కంగారుగా.
శంకరంగారికి మెలకువ ఒచ్చేసింది. “యేం జరిగింది? ఏ, జరిగింది?” ఆయన నిస్సాహాయంగా గొణుక్కుంటున్నట్లు అడుగుతున్నారు.
ఆయనకు జవాబు చెప్పేవారే లేరు.
సావిత్రమ్మ స్వాతి తలని ఒడిలోకి తీసుకుని నీళ్లు చిలకరించి విసురుతోంది.
“పాపం. కుర్రాడు ఆరోగ్యవంతుడే. ఫిట్సొచ్చేయి మరి” అని చెబుతోంది జానకమ్మ.
అందరూ తలోరకంగా చెప్పుకుంటున్నారు.
మరో రెండుగంటలకి కూడా వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేసేరు.
సారథి హాస్పిటల్లో వున్నాడని చెప్పేరు వాళ్ళు.
“మరేం ఫర్వాలేదు. ఫిట్సే కదా. . అవే తగ్గుతాయి. అంతలా బెంబేలు పడనవసరం లేదు.!” అంటోంది జానకమ్మ.
స్వాతి స్పృహలోకి వచ్చింది. ఆమె నీరసంగా లేచి బేలగా గోడకి చేరబడి కూర్చొంది.
“తెల్లవారి తీసుకొచ్చేస్తారు. పెద్ద జబ్బేం కాదు. నువ్వలా డీలా పడిపోకూడదు” అంటూ ధైర్యం చెబుతోంది సావిత్రమ్మ.
ఆదపిల్లలు చాపలు పరుచుకుని పడుకున్నారు. కానీ ఎవరికీ కంటిపైన కునుకులేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్లు, ఎవరి భయాల్లో వాళ్లుండగానే తూరుపు తెల్లబడింది.
స్వాతికి ధైర్యమొచ్చింది ఆ వెలుగుని చూడగానే.
అప్పటిదాకా కూర్చున్న జానకమ్మ క్రిందకి వెళ్లింది. సావిత్రమ్మ కాఫీ పెట్టడానికి లేస్తూ బాల్కనీలోంచి కన్పిస్తోన్న రోడ్డువైపు చూసింది.
దూరంగా తెల్లని ఆంబులెన్సు ఇంటివేపుకు వస్తోంది.
ఆమెకి అదోలా అన్పించింది.
నీరయిపొతున్న గుండెని చిక్కబట్టుకుని అలాగే చూస్తూ నిలబడింది.
ఆంబులెన్స్ వచ్చి క్వార్టరు ముందు ఆగింది. క్వార్టర్స్ లోని జనం తొంగి చూస్తుంటే సారథి ముందుగా కిందకి దిగేడు.
పీక్కుపోయిన ముఖంతో, జ్యోతుల్లా ఎర్రబడ్డ కళ్లతో వున్న కొడుకుని చూడగానే ఆమె జీవం లేనట్లయిపోయింది.
ఆమె భయపడ్డట్లుగానే శేఖర్ శరీరాన్ని మరో ఇద్దరి సాయంతో పైకి తీసికొచ్చాడు సారథి.
హాల్లో అతన్ని పడుకోబెడుతుంటే “ఏలా వున్నారు?” అంటూ కంగారుగా వచ్చి అడిగింది స్వాతి.
అతను నిద్రపోతున్నట్లున్నాడు.
స్వాతి మరోసారి అడిగింది “ఎలా వుంది? ఏమయిందాయనకు?”
సారథి ముఖం తిప్పుకున్నాడు. ఆమెని చూడ్డానికతనికి ధైర్యం చాలటంలేదు.
స్వాతి అనుమానంగా సారథి తల్లివైపు చూసింది.
ఆ చూపులకి అంతసేపూ నిగ్రహించుకొన్న దుఃఖం కట్టలు త్రెంచుకుని బయటికురికింది ఆవిడ గుండెల్లోంచి.
“ఇంకెక్కడి శేఖరే తల్లి” అందావిడ స్వాతిని గట్టిగా కౌగలించుకుని. స్వాతి నిలువు గుడ్లేసి చూసింది. ఆ వెంటనే ఆమె చేతుల్లోంచి జారిపోయింది.
అప్పటికే జనం బాగా మూగిపోయేరు.
ఎవరో డాక్టర్ని తీసుకురావడానికి పరిగెత్తారు.
సారథి స్నేహితుడి తలదగ్గరగా కూర్చున్నాడు.
“పాపం! టేటనస్! రాత్రికి రాత్రి ఫిట్సొచ్చి పోయేడు” ఎవరో ఎవరికో చెబుతున్నారు.
అంతటా నిట్టూర్పులు.
డాక్టరు వచ్చేలోపునే స్వాతి స్పృహలోకి వచ్చింది.
ఒక్క వూపున వెళ్లి శేఖర్ గుండెలపై వాలిపోయింది.
ఆ దృశ్యం చూడలేక సారథి లేచి బయటికెళ్లి నిలబడ్డాడు దిగాలుగా. “నువ్వలా నిలబడితే ఎలా? జరగాల్సినవి చూడు” సారథి తల్లి మాటలకి పేలవంగా చూసేడు. అతని ప్రాణం పోతున్నట్లుగా వుంది.
“ఆ అబ్బాయి పట్టుదలతో తల్లిదండ్రులతో తెగతెంపులు చేస్కున్నాడట. ఇప్పుడయినా టెలిగ్రాం ఇవ్వండి” ఎవరో అంటుంటే సారథి నిగ్రహించుకుని ఫోన్ నంబర్ తీసుకుని బయటకెల్లేడు.

*****

ఎవరికి వారు తమలోని ఆనందాన్నీ, ఉత్సాహాన్ని పీల్చి పిప్పిచేసిన మనుషుల్లా వున్నారు. శంకరంగారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా వుంది.
శాంతమ్మగారు కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆ తల్లి దుఃఖాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు.
సారథికి స్వాతిని చూస్తే భయంగా వుంది. ఆమెకు ఎదురుపడడానికి కూడా సాహసించలేకపోతున్నాడు.
స్వాతి అందరూ అనుకున్నట్లు అదేపనిగా వెక్కెక్కి ఏడ్వటం లేదు. ఆమె మెదడు దెబ్బతిన్న మనిషిలా వుంది.
ఆ చూపులు ఎటో శూన్యంలో తచ్చాడుతున్నాయి.
ఎన్నిసార్లు పిలిచినా పిచ్చిదానిలా చూడ్డం తప్ప పలుకదు.
పిల్లవాడి సంగతి కూడా పట్టనట్టే వుంటోంది. నానీని వసుధ, సుహాసినీనే చూస్తున్నారు.
సారథి శెలవు పొడిగించేడూ.
ఆ రోజు గంగాధరంగారు అనుకోని విధంగా అడిగేరు.
“నానీని మాకు ఇవ్వండి. ”
“అంటే ?. . . “అడిగేడు సారథి.
“ఆ అమ్మాయి నష్టజాతకురాలు. మావాడు మాకెలానూ కాకుండా పోయేడు. వీడిలో వాణ్ని చూసుకుంటూ బ్రతుకుతాం. మా ఆస్థికింక వారసుడు వీడేగా!”
సారథి జవాబు చెప్పేంతలోనే స్వాతి విసురుగా వరండాలో కొచ్చింది.
“అవును. నేను నష్టజాతకురాలినే. నా వల్లనే మీ కొడుకు పోయేడు. ఒప్పుకుంటాను. కాని నాకు పుట్టిన వీడు అదృష్టజాతకుడెలా అవుతాడు? వాడిని తీసికెళ్లడానికి నేను ఒప్పుకోను” అంది ఆవేశంగా.
సారథి స్వాతిని వారించేడు.
“చూడండి. నా బాబుని కూడా నాక్కాకుండా తీసికెళతారంట. వీళ్లకెక్కడిదా హక్కు. ఆయన వుండగా ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదు. ఇప్పుడు మనుమడు కావాలంట.” స్వాతి ఏడుస్తూ అంది.
శాంతమ్మ మెల్లిగా మంచమ్మీద నుండి లేచొచ్చింది.
ఆవిడ ఈ పదిరోజులకే కృంగిపోయి వృద్ధాప్యం మీద పడ్డదానిలా వంగిపోయింది.
ఆవిడ గంగాధరం వైపు తీవ్రంగా చూస్తూ, “మీరు పంతాల పేరుతో నన్నూ, నా కొడుకుని బ్రతికుండగానే విడదీసేరు. ఒక్కసారి వాణ్ని చూస్తానని ఎన్నిసార్లు మీ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడేను. ఒక్కసారన్నా మీ హృదయం కరిగిందా? వాడి దగ్గర కెళితే తిరిగి యింటిగడప త్రొక్కొద్దని ఖండితంగా చెప్పేరే. చివరికి. . . చివరికి. . వాడి శవాన్ని చూసే దురదృష్టాన్నే కల్గించేరు. నేను వాణ్ని నవమాసాలు మోసి కన్నాను. ఎన్నో రాత్రులు నిద్ర మానుకుని, లాలించి, పాలించేను. అల్లారుముద్దుగా అహర్నిశలూ కష్టపడి పెంచేను. ఇంత చేసినా నా కొడుకుని చూసేందుకు మీనుంచి అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది. ఎవరు రాసేరండి యీ ధర్మాలు. ఎందుకు నేను మిమ్మల్ని ఖాతరు చేసేనో, ఎందుకు మీ మాటని కాదనలేకపోయేనో నాకే తెలియదు. మీరు నా మీద చూపించిన అధికారం చాలు. భర్తపోయిన ఆ పిల్లకు బిడ్డం దూరం చెయ్యాలన్న నికృష్టపు ఆలోచన ఎలా వచ్చిందండి మీకు. అందరికీ మీలానే డబ్బు పిచ్చి వుంటుందనుకొన్నారా? అందరూ మీలానే డబ్బు కోసం కన్న సంతానాన్ని దూరం చేసుకునే కఠినహృదయులు ఉంటారనుకున్నారా?” అంది ఆవేశంగా.
గంగాధరం గారితో పాటు మిగిలిన అందరూ కూడా ఆమెవైపు వింతగా చూసేరు.
గంగాధరంగారు ఏమనుకున్నారో తెలియదుగాని, తిరిగి యింకేమీ మాట్లాడలేదు.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *