June 24, 2024

నారాయణుని సేవలో…

రచన: మధుపత్ర శైలజ

ఎప్పటినుండో లలితమ్మగారు బదరీనాధుణ్ణి చూడాలని కలలు కంటున్నారు. భర్త జీవించిన కాలంలో ఒక్కసారన్నా వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ పరిస్థితులు అనుకూల పడలేదు. “రామలక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులుండగా నీకేం బాధ తల్లీ! నీవు తప్పకుండా ఆ వైకుంఠవాసుని చూసి తీరతావు” అని బంధువులంతా అంటూండేవారు. అదిగో ఆమె కోరిక తీరబోయే రోజు రానే వచ్చింది.
కొడుకులిద్దరు బాంక్ ఉద్యోగస్తులు కావటంతో ముందుగా ఆ యాత్రకు కావలసిన ప్రయాణ సౌకర్యాలన్నిటిని సమకూర్చుకున్నారు.
ఏడుపదులు దాటిన అమ్మను తీసుకువెళ్ళటానికి వాళ్ళ కుటుంబ వైద్యుని సలహాను తీసుకుందామని డాక్టర్గారిని సంప్రదిస్తే వారి ప్రయత్నానికి ఆయన చాలా సంతోషించి, చినజీయర్స్వామివారితో ఆయనకున్న పరిచయాన్ని ఉపయోగించి, హరిద్వార్ నుండి యాత్రకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసారు. కొడుకులిద్దరు భార్యాసమేతులై లలితమ్మ గారిని వెంటబెట్టుకుని యాత్రకు బయలుదేరారు.
విమానంలో దేశరాజధానికి చేరి, అదేరోజు రాత్రికి రైలులో హరిద్వార్కు చేరిందా కుటుంబం. అక్కడ అప్పటికే సిధ్ధంగా వున్న శ్రీశర్మగారు వారితో, “ముందుగా హరిద్వార్, హృషికేశ్, కేదార్నాథ్ల మీదుగా బదరీనాథ్కు వెళ్దాం” అని చెప్పారు.
హిమవన్నగాల సౌందర్యాలను, పరవళ్ళు తొక్కుతూ శివుని తాండవనృత్యానికి లయబధంగా సంగీతాన్ని సమకూరుస్తున్నదా అన్నట్లుగా శబ్దాలతో ప్రవహించే తీష్టానది సోయగాలను ఆస్వాదిస్తూ కేదారేశ్వరుని సన్నిధిలో మైమరచిపోయి బదరీనాథ్కు బయలుదేరారు లలితమ్మ కుటుంబ సభ్యులు.
బదరీనాథ్ భారతదేశంలోని వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది. కలియుగ వైకుంఠంగా వాసికెక్కింది. కేదార్ నుండి బయలుదేరిన లలితమ్మగారి కారు, మధ్యలో జరిగిన కొండ చరియలు విరిగిపడుతున్న ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసి, తప్పించుకుని, ఓ ప్రక్కన అలకనంద ఉరుకుల సంగీత తరంగాలను, మరో ప్రక్కన మంచుశిఖరాలపై ప్రతిబింబిస్తున్న సూర్య భగవానుని బంగరువెలుగుల మెరుపులతో కారులోని వారిని భయపెడుతూ, ఆశ్చర్యపరుస్తూ, మనసులకు ఆహ్లాదాన్నందిస్తూ అనుకున్న సమయానికి బదరీనాథ్కు చేరింది.
స్థలపురాణాన్ని కంఠతాపట్టిన లలితమ్మగారు త్రోవ పొడుగునా బదరీనాధుని గొప్పదనాన్ని మైమరచి వివరిస్తూంటే కోడళ్ళకైతే ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుందామా? అనిపించింది.
పురాణకథనాల ప్రకారం ఈ బదరికాశ్రమం నరనారాయణులు తపస్సు చేసుకున్న పవిత్రధామం. ఇక్కడకు దగ్గరలోని మనా కొండలలోని ఓ గుహలో వ్యాసభగవానులు ప్రవచిస్తూండగా సాక్షాత్తు వినాయకుడే వ్యాసభారతాన్ని రాసాడని ప్రతీతి.
బదరీనాథుడు సంవత్సరంలో ఆరునెలలు మానవుల సేవలను, మిగిలిన కాలంలో దేవతల సేవలను అందుకుంటాడు. విజయదశమి రోజున అఖండజ్యోతితో స్వామివారికి హారతులనిచ్చి గుడిని మూసివేస్తారు. ఈ సమయంలో స్వామివారు జ్యోషీమఠ్ అనే ప్రాంతంలో విడిది చేస్తారు.
తిరిగి అక్షయ తృతీయనాడు నారాయణుడు బదరీనాథ్లో ప్రవేశిస్తాడు. విశేషమేమిటంటే ఆలయం మూసివేసేటప్పుడు వెలిగించిన అఖండజ్యోతి తిరిగి ఆలయం తెరిచేవరకూ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అంతటి మహిమాన్వితమైన గుడి బదరీనాథ్. ఆలయం తెరిచే మొదటిరోజున ఆ జ్యోతిని దర్శించుకునే భక్తుల మనోభావాలు చెప్పనలవికానివి.
ముందుగా చేసుకున్న ఏర్పాట్లతో చినజీయర్స్వామివారి ఆశ్రమంలో వీరికి రెండు గదులను కేటాయించారు. అక్కడ వుండే శ్రీధర్స్వామి తదితరులు యాత్రీకులను సాక్షాత్ ‘నారాయణ’ స్వరూపులుగా భావించి ఎంతో ఆదరణతో, ఆప్యాయతతోనూ సకల సదుపాయాలను అందించి, “అతిధిదేవోభవ” అన్న ఆర్యోక్తికి నిర్వచనమే వీరు అన్న చందాన సేవలను నిర్వహిస్తున్నారు.
లలితమ్మగారి కుటుంబసభ్యులకు అదే విధమైన ఆదరణతో అక్కడ ఏమేమి ప్రదేశాలను ఏ సమయానికి చూడాలో వివరంగా చెప్పారు శ్రీధర్స్వామి.
అంత శ్రమచేసి ప్రయాణంచేసి వచ్చినా, లలితమ్మగారు ధూళిదర్శనంకోసం గుడికి బయలుదేరారు. ఎగువనున్న కొండసానువులలో పెంచిన వివిధరకాల పుష్పాలతోనూ, తులసిమాలలతోనూ అలంకరించబడిన బదరీనాధుడు ఆరోజు యాత్రీకుల చూపు మరలనివ్వటం లేదు. లలితమ్మగారికి అక్కడినుండి కదలాలనిపించలేదు. తన్మయత్వంతో మేను మరచిపోయారు. జీవితాన చూస్తానో, చూడలేకపోతానో అనుకున్న కల సాకారమై ఎదుట నిలచిన అపూర్వ క్షణాలవి.
వదలలేక వదలలేక స్వామి సన్నిధానం నుండి బయటకు వచ్చి అలకనంద దగ్గరకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మకపాలంలో మరుసటిరోజు తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించటానికి ఏర్పాటు చేసుకున్నారు కొడుకులిద్దరు. అలకనంద పరవళ్ళతో పారుతున్న నీటిని చూస్తూ ఆనందడోలికలలో తేలిపోయారు అందరు.
తిరిగి ఆశ్రమానికి వచ్చి శ్రీధర్స్వామి సహకారంతో మరుసటి రోజు లలితమ్మగారికోసం ఓ పిట్టుభాయిని మాట్లాడుకున్నారు. అతని వయస్సు 16 నుండి 18 సంవత్సరాలలోపు ఉంటుంది. వీపుపై వెదురుతో చేసిన బుట్టను ఉంచుకొని యాత్రికులను ఆ బుట్టలో కూర్చుండచేసి కావలసిన చోటుకు తీసుకుపోవటం అతని దినచర్య. ఆ రాత్రికి ఆశ్రమం వారు చేసిన ఏర్పాట్లతో చలి తెలియక నిద్రపోయారంతా.
తెల్లవారుఝామున శ్రీధర్స్వామి వచ్చి అందరిని నిద్రలేపి “నరనారాయణ పర్వతాలపై పడుతున్న సూర్యకిరణాలని చూడండి. ముందుగా వెన్నెల వెలుగులో వెండి రంగులోను, సూర్యకాంతి పడగానే బంగారు రంగులోను కనిపించే ఆ దృశ్యం నయనానందకరం” అని చెప్పారు. ఒక అరగంటలో ఆ సూర్యనారాయణుని దివ్య మంగళ కిరణాలతో మెరిసే బహు బ్రహ్మమయమైన ఆ బంగారు శిఖరాలను పరమాద్భుతంగా వీక్షించి, కెమేరాలలో బంధించారా స్వప్నంలాంటి నిజాన్ని.
ఆ సుందర క్షణాలను మదిలో దాచుకుని స్నానాదికాలు ముగించుకు వచ్చేసరికి ఆశ్రమం వారు వేడి వేడి అల్పాహారం, తేనీరు ఇచ్చారు.
క్రమశిక్షణకు మారురూపుగా, చెప్పిన సమయానికంటే ముందుగానే పిట్టూభాయి మా గది దగ్గరకు వచ్చి “మాతాజీ నమస్కార్! ఆయియే! అంటూ లలితమ్మగారి ముందు వంగి వెనుకనున్న బుట్టలో ఆమెను కూర్చోపెట్టుకుని తాళ్ళతో పిట్టూను తన భుజాలకు కట్టుకుని చకచకా అడుగులు వేస్తున్నాడు. అతనిని అనుసరించారు మిగిలిన వారు.
“చదువుకునే వయస్సులో ఈ పనులెందుకు చేస్తున్నావు?” అని అడిగిన పెద్దకోడలి ప్రశ్నకు, “ఇది కూడా చదువులో భాగమేనమ్మా! గుడి తెరచి ఉంచే ఆరునెలలు పగలంతా ఇలా యాత్రికులకు సేవచేసి వాళ్ళిచ్చే డబ్బులో సగభాగం తండ్రికిచ్చి మిగిలిన దానిని ఆశ్రమంలో అన్నసమర్పణకు ఇస్తాను.
ఇంతకన్న గొప్ప చదువులేమీ లేవని ఒకసారి “చినజీయర్స్వామి” వచ్చినప్పుడు చెప్పారు. “నీ తల్లిదండ్రులు నీకు ఆ దేవుని పేరు “బదరి” అని పెట్టినందులకు నీవు ఎంతో దూరం నుండి వచ్చే భగవద్భక్తులకు మంచిగా సేవ చెయ్యి” అని చెప్పారు. అప్పటి నుండి ఈ సేవలో ఉన్నాను,
ఈ మాతాజీకు అలుపులేకుండా అన్ని చోట్లకు తిప్పుతాను అన్నాడతను. ఊరూపేరూ తెలియదు. మేమతన్ని చూసిందిప్పుడే . గుడిలోపల నారాయణుడుంటే గుడివెలుపల ఈ నరుణ్ణి (అర్జునుణ్ణి) చూస్తున్నామనిపించింది అందరికి.
ఈలోపుగానే మేము మౌనస్వామి ఆశ్రమానికి చేరుకున్నాము. చిన్నప్పుడు ఏడేళ్ళ వయస్సులో తల్లిదండ్రులతో బదరీనాథుని చూడటానికి వచ్చిన ఈ మౌనస్వామికి తిరిగి ఇంటికి వెళ్ళలనిపించలేదట. ఎందరో పెద్దలు చెప్పినా వినలేదు. ఓ కొండ గుహలో ఉండి ధ్యానంలో 30 వసంతాలు గడిపారు. బదరికాశ్రమం ఆయనను అంతగా ప్రభావితం చేసింది. అంతకాలం ఎవరితోనూ మాట్లాడకపోవటంతో ఆయనను మౌనస్వామిగానే పిలుస్తున్నారు.
మారుతున్న కాలంలో మౌనస్వామికి శిష్యులేర్పడి ఆశ్రమం కట్టించి ఇచ్చారు. చుట్టు మంచు కొండలు, ఓప్రక్కన బదరీనాథుడు, మరో ప్రక్క ఆ దేవదేవుని సేవలో తరించే స్వామీజీలు. ఆశ్రమ వాతావరణమే ఒక దివ్యానుభూతికి లోను చేసింది.
స్వామిని దర్శించి బయటకు రాగానే పిట్టుభాయి “సదా మీ సేవలో” అన్నట్లుగా నిలుచున్నాడు. అతని సేవకు కదలిపోయిన లలితమ్మగారు “ఇతనికి అడిగినదానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వాలిరా!” అని పెద్దబ్బాయితో అన్నారు.
మౌనస్వామి ఆశ్రమం నుండి బయలుదేరి బ్రహ్మకపాలానికి చేరుకున్నారు. పిట్టూభాయి లలితమ్మగారిని అక్కడ దించి, “నేను బయట కూర్చుంటాను. మీరు మీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తరువాత మిమ్మల్ని మరల గుడి దగ్గరకు తీసుకుపోతాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.
అక్కడున్న ‘తప్తకుండ్’లో వేడినీటి స్నానం ఓ అనుభూతి. చుట్టూ మంచుకొండలుంటే, ఆ కుండ్లో మాత్రం నీరు వేడిగా ఉండటం భగవంతుని లీలగాక మరేమిటి? బ్రహ్మకపాలంలో నాన్నగారికి తర్పణాలను వదిలి బయటకు వచ్చేసరికి వెన్నెల వెలుగులు చిందే పున్నమి చంద్రునిలా కనిపించే పిట్టూభాయి అంతులేని దుఃఖంతో ఎదురయ్యాడు.
“ఏమయ్యింది?” అని కంగారుగా అడిగారు లలితమ్మగారు.
“మీరు రావడానికి ఇంకా సమయం పడుతుందని, ఆకలేసి ఏదైనా తిందామని వెడితే, నా పిట్టూను ఎవరో దొంగిలించారు. పిట్టూ లేకుండా రేపటినుండి నా సేవ ఎలా?” అని ఏడుస్తున్నాడు.
“మరొకటి కొనుక్కుందువుగాని. దానికి అయ్యే ఖర్చు మేమిస్తాం. బాధపడకు” అన్నాడు పెద్దబ్బాయి.
అంత ఏడుపుతోను ఎక్కిళ్ళమధ్య మాట్లాడుతూ, “పిట్టూను మా ఇంటిదగ్గర అల్లుకోవలసిందేనండి. బయట దొరకవు. అందుకే ఇలా కొందరు దొంగిలిస్తూ వుంటారు” అంటూ పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.
“మీ నాన్నగారికి మేం సర్ది చెపుతాంలే నిన్ను తిట్టకుండా” అన్నాడు పెద్దబ్బాయి.
“నాన్న ఏమి తిట్టరండి. నా మనసులోని ఆ బదరీనారాయణుడే తన భక్తులకు సేవ చేయట్లేదని నన్ను తిడతాడు” అంటూ వెక్కుతున్నాడు. మేమివ్వవలసినదానికన్నా ఎక్కువమొత్తం ఇచ్చి అతనిని అనునయించి పంపించాం.
ఇప్పటికి ఈ సంఘటన జరిగి దాదాపుగా పదేళ్ళు దాటినా ఆ పిట్టూభాయి చెప్పిన మాటలు, చేతలు నిత్యనూతనంగా కళ్ళలో మెదులుతూ “మాధవ సేవకంటే మానవ సేవ ఎంత గొప్పదో” వివరిస్తున్నాయి మాకందరికి.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *