May 19, 2024

పరవశానికి పాత(ర) కథలు – 1 – గూడు విడిచిన గుండె

రచన: డాక్టర్ కె.వివేకానందమూర్తి (U.K)

ఇది కథో, వ్యథో కచ్చితంగా చెప్పలేను. లండన్ హీత్రో ఎయిర్ పోర్ట్ ఎప్పటిలాగే ఎంతో బిజీగా వుంది. పెద్ద పెద్ద అద్దాలకు అవతల రన్ వే మీద అనుక్షణం యెగిరి, వాలే విమానాలతో, గుంపులు గుంపులుగా సేద దీర్చుకుంటున్న జంబో జెట్లతో జటాయువుల సంతలా వుంది.
మా అవిడా, పిల్లలు ఇండియా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. వాళ్లకి కనిపించదని తెలిసినా చెయ్యూపి నేను ఒంటరిగా యింటికి కదిలాను. కదిలో కార్లోంచి ఆకాశం కేసి చూశాను. సాయంత్రపు సూరీడు చల్లగా ఫేడవుతున్నాడు. వినీలాకాశం విస్కీ రంగులోకి మారుతుంది. ఇందాక చూసిన పెద్ద విమానాలు పైకెగిరి పోతూ పిచ్చుకల్లా అనిపిస్తున్నాయి. ఇంకో దేశంలో వాలే దాకా వాటికి ఆకాశమంత స్వేచ్ఛ. నాకు చిన్నప్పట్నించీ యెగిరే పక్షుల్ని చూడ్డం యెంతో యిష్టం. అందుకే యెగిరే విమానాలు కూడా యిష్టం. అవి స్వేచ్ఛకు ప్రతీకల్లా కనిపిస్తాయి.
ఇంటికొచ్చాక మా ఆవిడ చెప్పిన పనులు గుర్తు చేసుకున్నాను. తను తిరిగి వచ్చేలోగా యింటికి హీటింగ్ సిస్టమ్ మార్పించమని చెప్పింది. ఈ చలి దేశంలో తిండి లేక పోయినా బ్రతకవచ్చు గానీ వెచ్చదనం లేకుండా బ్రతకలేం. మర్నాడే ఇంజనీర్తో మాట్లాడి వారం లోపునే హీటింగ్ సిస్టమ్ మార్పించాను. ఇప్పడు యిల్లు వెచ్చగా అమ్మ వొడి అంత బాగుంది.
హీటింగ్ బోయిలర్ మార్చినప్పుడు యింటి ముందు భాగంలో చూరు కింద వున్న స్టీమ్ గొట్టాన్ని తొలగించారు. అలా చేయడం వల్ల చూరు కింద గోడలో నాలుగంగుళాల కన్నం పడింది. ఆ కన్నం పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇక్కడంతా ఎవరికి వారు వారి పని మాత్రమే చేస్తారు. గుండె డాక్టరు చెయ్యి ముట్టుకోడు. చెయ్యి డాక్టరు గుండె ఆగిపోయినా పట్టించుకోడు. శవం చేతికి కట్టు కట్టేసి తన పని తను చేసుకుపోతాడు.
సరే, చూరు కింద కన్నం చిన్నదే కదా, నేనే కాస్త సిమెంట్ తో కప్పేసి కవర్ చేసేద్దామను కున్నాను. సరిగ్గా ఆ చూరు కిందే నా కారు గ్యారాజ్ ముందు పార్కింగ్ ఏరియా ఉంది. నేను రోజూ నా కారు పార్కింగ్ ఏరియాలోనే వదిలేస్తాను.
ఒక రోజు కారు పార్క్ చేసి పైకి చూశాను. ఎక్కడి నుంచో ఒక మైనా పిట్ట ఎగురుతూ వచ్చి, చూరు కింద కన్నం వున్న గోడ వెలితిలోకి దూరింది. తర్వాత రెండు మూడు సార్లు మైనా రాక పోకలు చూశాను. తను అక్కడ తనకో చిన్నగూడు కట్టుకుందని అర్థమైంది. మా ఇంటి ఫ్రంట్ గోడలో కన్నం ఆ మైనా కొత్త ఇంటికి యిప్పుడు సింహద్వారం. హాయిగా తన కొత్త యింటికి మైనా వస్తూ పోతూ ఉంటే యిప్పడు ఆ వెలితిని నేనెలా పూడ్చగలను.
రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు యింటి ముందు లాన్ లో కూర్చుని పేపరు చదువుకుంటూ పైకి చూశాను. మైనా యిప్పుడు చిన్న చిన్న ఆహారం ముక్కుకి కరుచుకుని తీసుకొచ్చి యింకా యెగరడం రాని తన పిల్ల మైనాలు మూడింటికీ తినిపిస్తోంది. అవి తలలు సాగదీసుకుని అడపాదడపా చిన్నచిన్న శబ్ధాలు చేస్తూ బైటికి తొంగి చూస్తున్నాయి.
నా మనసు కుదురుగా లేదు. ఆ కన్నం పూడ్చి మైనా కొత్తగూటిని సమాధి చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం మొదలైంది నాలో. నా స్నేహితుడు శివరావుని అడిగాను. ‘శివ! శివ!’ అన్నాడు. ‘అడిగింది నీ పేరు కాదు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పు’ అనడిగాను. తను చెప్పాడు. ‘ఈ దేశంలో పక్షి గూడు పెట్టుకున్నాక ఆ గూడు పీకి పక్షిని తరిమేయడం చట్టరీత్యా నేరం. పక్షి పరిరక్షక సంఘం వారు నిన్ను చికెన్ ఫ్రై చేసుకుని తినేస్తారు’ అని వార్నింగిచ్చాడు.
‘అయితే మరి వాళ్లే క్రిస్ మస్ కి టర్కీ కోడిని చంపి యెందుకు తింటారు? అని అడిగాను.
‘చంపకుండా తినడం కుదరదు గనుక’ అన్నాడు.
‘అది కాదు నా వుద్దేశం. చంపి తినడం యింకా పెద్ద హింస కదా? అనడిగాను.
‘క్రిస్ మస్ కి టర్కీ తినడం చట్ట విరుద్ధం కాదు. అంచేత వాళ్లనే అడుగు -నిజంగా అడిగావు గనుక – నిన్ను టర్కీలా తినేస్తారు’ అని మళ్లీ వార్నింగిచ్చాడు. తెల్లవాడి మనసు అర్థం గాక నేను తెల్లబోయాను.
ఏమైతేనేం, శివరావు చెప్పిన సలహా మేరకు, మా యింటి గోడ కన్న పూడ్చే ప్రయత్నం ప్రస్తుతానికి విరమించుకున్నాను. నాకసలే పక్షులంటే యిష్టం, ప్రేమ. మైనా గూడు కూల్చేసి, గోడ కప్పేసి, మైనాని, ముద్దొచ్చే మైనా పిల్లల్నిబైటికి విసిరేసి నేను బావుకునేదేవిటీ – క్రూరత్వం అనిపించింది.
ఆ తర్వాత మైనా కనిపించినప్పుడల్లా ‘హాయ్’ అని పలకరించడం మొదలెట్టాను. మైనా నన్నేం పట్టించుకునేది కాదు. తన గూడు, తన పిల్లలు తన బిజీ తనది. అయినా నేను ‘హాయ్’ అనడం మానలేదు.
ఇలా ఉండగా నేను పాత కారు ట్రబులిస్తుంటే మార్చి కొత్త కారు తీసుకున్నాను. కొత్త కారు ధగా ధగా మెరిసిపోతూ ఉంది. ఒక రోజు కారెక్కబోతూ చూశాను. మైనాగారు గూడు కింద పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారు మీద రెట్టలు విసర్జించి కొత్త కారును చెత్త కారులా తయారు చేశారు. నాకు చాలా కోపం వచ్చింది.
మైనా పిల్లలు పెరిగి ఎగురనేర్చారు. క్రమంగా రోజూ కారు మీద మైనా రెట్టలు కడుక్కోవడం ఒక రొటీన్ లా తయారయి విసిగిపోయాను. ఇక లాభం లేదనుకున్నాను. ఏమైనా, మైనా గూడు పెట్టుకున్న గోడ కన్నం పూడ్చెయ్యాలనుకున్నాను.
కావల్సిన సామాన్లు రెడీ చేసుకుని ఒక రోజు పనికి సెలవు పెట్టాను. అవాళ మైనా, పిల్లలు గూట్లోంచి బైటికి వెళ్లగానే కన్నం సిమ్మెంట్ తో కప్పేద్దామనుకున్నాను. కానీ మనసులో ఒక పక్క బాధగా అనిపిస్తూనే వుంది. లాన్ లో సామాన్లు పెట్టుకుని ఈజీ ఛైర్లో అనీజీగా కూర్చుని కాపు వేశాను. పేపరు చదువుకుంటూ మధ్యమధ్యలో గూడు ఉన్న గోడ కన్నం వేపు చూస్తున్నాను. ప్రతి రోజూ ఉదయమే గూడు విడిచే పిట్టలు యివాళ యింకా తెమల్లేదేవిటా అనుకుంటున్నాను.
చివరికి లంచ్ టైమ్ దాటుతుంటే మైనా, మైనా వెనుక పిల్లలు కేరింతలతో గూడు విడిచి బైటికి ఎగిరాయి. అలా యెగురుతూ, యెగురుతూ ఆకాశంలో కనిపించనంత దూరంలో కలిసిపోయాయి. అలాగే అవి ఎగిరిన ఆకాశ మార్గం వైపు తదేకంగా చూస్తూ వుండి పోయాను. నాకు తెలుసు. ఇప్పుడు లేచి, నేననుకున్న కార్యక్రమం పూర్తి చేయాలి. మైనా యిల్లు పీకి నా స్వార్థానికి నేను పందిరి వేసుకోవాలి. కానీ మనస్సు వెనక్కి లాగుతోంది. ఎందుకో గూడు కప్పి మైనా కుటుంబాన్ని నిర్వాసుల్ని చెయ్యకూడదన్న ఆలోచన నెమ్మదిగా గూడు కట్టుకుంటోంది. కాసేపు గోడలో గూటివేపు, కాసేపు ఆకాశం వైపు శూన్యంగా చూడసాగాను. అప్పుడే నా మైనాను నేను మిస్సయి పోతున్నట్టుగా వుంది. గోడకున్న కన్నం పూడ్చటం నా తరం కాలేదు. నా మనస్సు రాజీ పడటం లేదు. ఇక లాభం లేదని కన్నం కప్పేసే కసాయి పనికి స్వస్తి చెప్పాను.
ఒక్కటే అనుకున్నాను. మైనా, పిల్లలు తిరిగి వచ్చి ఎప్పటిలాగే కేరింతలు కొడుతూ, కూస్తూ మా యింటి గోడ గూట్లో కలకాలం హాయిగా కాపురం వుండాలని.
మైనా, పిల్లలు మళ్లీ తిరిగి రాలేదు. చాలా రోజులు, రోజూ ఫ్రంట్ గార్డెన్ లో కూర్చుని యెదురు చూశాను.
మైనా యెంతకీ తిరిగి రాలేదు. నా మనోభావాలు తనకి తెలిసినట్టుగా, తెలియక నన్ను యిబ్బంది పెట్టినందుకు బాధ పడినట్టుగా – యెందుకో మరి తిరిగి రాలేదు.
అవాళ గార్డెన్లో కూర్చున్న నేను మైనా కోసం బాగా బెంగెట్టేసుకున్నాను. కాసేపట్లో పెద్ద వర్షం వచ్చింది – నాతో పాటు అవునంటూ ప్రకృతి యేడుస్తున్నట్టు.
మైనా, పిల్లలు మరి తిరిగిరాలేదు. ఆ రోజు అలా యెగురతూ వెళ్లిపోవడమే, వెళ్లిపోవడం. నా మనసులో వెలితిలా మా యింటి గోడలో వెలితి అలాగే వుండిపోయింది.
తర్వాత యెప్పుడో నా స్నేహితుడు శివరావు మా యింటికొచ్చినప్పుడు గోడ వైపు చూసి, ‘అయితే కన్నం ఖాళీగానే వదిలేశావన్నమాట’ అన్నాడు.
రేపు మా ఆవిడ, పిల్లలు ఇండియా నుంచి తిరిగి వస్తారు.
నాకేం తేడాగా అనిపించడం లేదు.

3 thoughts on “పరవశానికి పాత(ర) కథలు – 1 – గూడు విడిచిన గుండె

  1. Vivekananda గారి కథల్లో నేను చదివిన తోలి కథ. మళ్లీ మననం చేసుకున్నాను. Thank you for this feature Jyothi గారు and వివేకానంద మూర్తి గారు. ప్రతీ నెలా ఉత్తమ కథలను చదివే అవకాశం కల్పించారు ❤️

    1. Thank you Kiran Vibhaavari garu for your kind response and Jyothi garu for her gesture. [just for your information, this story was first published in Navya weekly Deepaavali special issue 2009.].With regards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *