March 29, 2024

పరిహారం..

రచన: షామీరు జానకీదేవి

రమణి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, ఒక గ్రామీణ శాఖలో పని చేస్తున్నది. ఆ బ్రాంచి అంతకు ముందు పట్టణానికి దూరంగా వుండేది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సహయకారిగా వుంటుందని ఈ బ్రాంచిని ఆ ప్రాంతంలో ప్రారంభించారు బ్యాంకధికారులు. నక్సల్స్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న ప్రాంతమది. ఎన్నో ఒడుదుడుకులతో అక్కడ బ్రాంచి మేనేజర్లుగా పనిచేసిన వాళ్ళు తమ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని, ఏదో విధంగా, రూరల్ సర్వీస్ (రెండు సంవత్సరాలు అతి కష్టంగా) పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఇలా ఇక్కడే వుంటే బ్రాంచి ఎదుగుదల వుండదని, బ్యాంక్ ఉన్నతాధికారులు బిజినెస్ను దృష్టిలో పెట్టుకుని, సదరు బ్రాంచిని దగ్గరలో వున్న పట్టణానికి మార్చారు. ఆ వూరి మెయిన్ రోడ్డులో అన్ని హంగులతో అందరికీ అందుబాటులో వుండే విధంగా వ్యాపార సమయాన్ని సర్దుబాటు చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 11.30 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు. ఆదివారం పని దినం. అదే అక్కడి వినియోగదారులకు ఒక వరమయింది. సోమవారం ఒక్కపూట. అంటే ఆ రోజుల్లో బ్యాంక్ శనివారం ఒక్క పూటే ఉండేది. అలాగే సోమవారం ఒక్క పూటన్నమాట. మంగళవారం సెలవు.
ఇలాంటి బ్రాంచికి, కొత్తగా ప్రమోషన్ తీసుకుని ఆఫీసరు అవతారమెత్తి వచ్చింది రమణి. భర్త శేఖర్ కు, పిల్లలకు ఆదివారం శలవు. తనకేమో అదివారం మరియు సోమవారం విపరీతంగా పని వుంటుంది. పైగా తను అక్కౌంటెంటు కూడా. ఇటు రెమిటెన్స్ పని, అటు రొటీన్ పనితో క్షణం తీరిక వుండదు. సోమవారం రెమిటెన్స్ పంపాలని అందరికంటే ముందుగా వెళ్ళేది రమణి. ఆమె భర్త, పిల్లలు వెళ్ళిపోయిన తరువాత, తన టైమ్ వేస్ట్ చేయకుండా త్వరగా బ్యాంకుకు వెళ్తుంది. గ్రామీణ ప్రాంతం నుంచి మార్చడం వలన చాలా మంది రైతులు, గ్రూపులవాళ్ళు ఆ ప్రాంతం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వస్తారు. సర్వీస్ చేయాలనే తపన ఎక్కువగా వున్న రమణి, వారికి చాతనయినంత వరకు సేవ చేస్తూనే వుంటుంది. ఆ బ్రాంచి హెడ్ కాషియర్ వచ్చేలోపు రిసీట్స్ తీసుకుని, తన దగ్గర వుంచి, ఆమె రాగానే ఇస్తుంది. కొంత మంది గోల్డ్ లోన్ కొరకు ఎండన పడి వస్తారు. గోల్డ్ లోన్ ఇవ్వాలంటే అంతా రమణి చేతిలో పనే. కానీ పని ఎక్కువయితే హెడ్ కాషియర్ కు పని వత్తిడి పెరిగిందని, బాధ పడుతూ వుంటుంది. రమణికేమో ఎంతో దూరం నుంచి, అవసారార్థం వచ్చిన గ్రామీణులను చూస్తే పాపమనిపిస్తుంది. నో అని చెప్పలేదు ఎవ్వరికి. అలాంటి సందర్భాలలో వారికిద్దరికీ చాలా సార్లు వాదన జరిగుతుంది. మొదట్లో ఆ బ్రాంచి మేనేజరు తననే సపోర్ట్ చేసేవాడు. తర్వాత్తరువాత అతను పట్టించుకోవడం మానేసాడు.
ఇలా ఎన్నో రకాల అనుభవాలతో, పని వత్తిడితో ప్రతిరోజు, రమణికి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలయ్యేది. రమణి భర్త శేఖర్ ఆఫీసు నుండి వచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. వాళ్ళను ట్యూషన్ కు పంపించి సాయంత్రం అన్నం వండి, తను టైమ్ పాస్ చేసేందుకు టి వి చూస్తూ వుంటాడు. పిల్లలు తిరిగి వచ్చిన తరువాత వాళ్ళకు అన్నం తినిపించి, రమణి కోసం బ్యాంకుకు వెళ్ళటం పరిపాటి.
అలా గడుస్తున్నాయి రోజులు. ఒకనాడు సాయంత్రం శేఖర్ టి వి చూస్తూ కూర్చున్నాడు. ఇంట్లో ఒక్కరే వున్నాడు. అసలే ఎండాకాలం. వాళ్ళు వుంటున్న ప్రాంతంలో వేడి బాగా ఎక్కువ. తలుపులు తీసుకుని కూర్చున్నాడు. సడన్ గా ఆయనకు టి వి స్టాండ్ క్రింద ట్యూబ్ లైట్ కాంతి పడి వెలుగుతున్న రెండు కళ్ళు కనిపించాయి. పరీక్షగా చూడగా అక్కడ టి వి క్రింద ఒక త్రాచు పాము చుట్ట చుట్టుకుని వుంది. ఎంతసేపయిందో అలా వుండి. ఇంకేముంది. అతను ఒక్కసారిగా పరుగెత్తినట్లుగా బయటకు వచ్చి తలుపు పెట్టాడు. అప్పుడు రాత్రి 8 గంటలయి వుంటుంది. వాళ్ళ చుట్టుపక్కలవాళ్ళు “ఏంటి సార్” అంటూ గుమికూడారు.
శేఖర్ కు వెంటనే మాట రాలేదు. ప్రక్కనే వున్న రమణి తమ్ముడు, అమ్మ, నాన్న అందరూ వచ్చారు. ఆ వూర్లో చాలా రోజులుగా వుంటుండబట్టి తమకు కొంత పలుకుబడి వుంది. ఆ పరిస్థితుల్లో విషయం తెలుసుకుని, చుట్టు మూగిన వాళ్లలో ఒకతను పెద్దకర్రను తీసుకుని వచ్చాడు. అతనితో పాటు మరో ఇద్దరు లోపలికి వెళ్ళారు. చాలా ఒడుపుగా పాము బయటకు పోకుండా పట్టుకుని చంపివేసారు. గోధుమ రంగులో చాలా పొడవుగా వున్న త్రాచుపాము. కర్ర మీద వ్రేలాడతీసుకుంటూ బయటకు తెచ్చారు. అందరూ తలా ఒక సలహా ఇచ్చారు. పాముని కాల్చాలని ఒకరు, దాని నోట్లో రాగి పైస పెట్టాలని ఒకరు. ఇలా రకరకాలుగా చెప్పారు. రమణి వాళ్ళ అమ్మ కూడా అదే మంచిదని వాళ్ళు చెప్పినట్లుగా దాని నోట్లో ఒక రాగి పైస పెట్టి కాల్పించారు.
ఇదంతా జరిగిన తర్వాత పిల్లలు ట్యూషన్ నుంచి తిరిగి వచ్చారు. రమణి బ్యాంకు నుండి వచ్చింది. ఇంట్లోకి పాము రావడమేమిటి?. పరిహారమేమిటో తెలియదు. ఏదో అనర్థం జరిగిందని అనిపించింది. అందరూ భయాన్నిగుండెల్లో నింపుకుని ఆ రోజు గడిపారు.
మర్నాడు బ్యాంకుకు వెళ్ళిన రమణికి, తెలిసిన ఒక పూజారిగారు డబ్బులు తన ఖాతాలో జమ చేయడానికి వచ్చారు. ఆయన బ్యాంకుకు ఎప్పుడు వచ్చినా, రాగానే రమణి వద్దకు వచ్చి క్షేమసమాచారాలు అడుగుతారు. ఆయనతో జరిగిన సంఘటన వివరించి, రమణి తన బాధ నంతా వ్యక్తం చేసింది.
దానికాయన “అయ్యో! సర్పదోషం అమ్మా. పామును అలా చంపకూడదు” అంటూ రమణి భయాన్ని ఇంకా పెంచాడు..
మనసాగక ఆయన్ని “మరి దీనికి పరిహారం చెప్పండి గురువుగారు”. అన్యధా శరణం నాస్తి అనుకుంటూ అడిగింది రమణి.
“ఒక వెండి సర్పాన్ని చేయించి, పాలతో అభిషేకం చేసి ఎవరికయినా దానం ఇవ్వండి.” అంటూ సూచించారు.
“వేరే ఎక్కడికో ఎందుకు? మీ గుడికే వస్తాము. ఆ కార్యక్రమం చేయించండి.” అని అన్నది. ‘సరే’ అన్నారాయన.
అలా ఒక మంచిరోజున వెండి సర్పం రూపు, పాలను తీసుకుని గుడికి వెళ్ళారు భార్యాభర్తలు. ఆయన చెప్పినట్లుగా దోషనివారణ పూజ పూర్తి చేసుకుని ‘మమ’ అనుకుంటూ ఇంటికి వచ్చారు.
ఇలాంటి నమ్మకాలు ఆ రోజుల్లో ఎక్కువ. ముఖ్యంగా పల్లెటూరులో వుండటం మూలంగా వాళ్ళకు అటువంటివి ఎక్కువ. కానీ ఈ రోజుల్లో కూడా అవే ఆలోచనలు. మీడియా బాగా ఎక్కువ కాబట్టి ఇలాంటివి ఇప్పుడు కూడా ఎక్కువయినాయి.
దేశం దినదిన ప్రవర్థమానం చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఇటువంటివి ఏమిటి అని అనిపిస్తోంది. కానీ మన నమ్మకాలను త్రోసిపుచ్చలేము. అలాని వదలలేము. అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాము. చాలా చానల్లో చాలా మంది, తమ తమ మిడిమిడి జ్ఞానంతో, వీటిని తమకు అనుకూలంగా చేసుకుని అమాయకపు ప్రజలను మోసం చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు. దేవాలయాలు, పర్యాటకాలు. ప్రపంచీకరణ. ఇలాంటి నమ్మకాలని ఎక్కువ చేస్తున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *