March 4, 2024

మోదుగపూలు – 7

రచన: సంధ్యా యల్లాప్రగడ

మళ్ళీ రాముని కలవటానికి వెంటనే సమయం చిక్కలేదు వివేక్‌కి. స్కూలు పనుల వలన, పిల్లలకు పరీక్షలు వస్తున్నందునా. అతను ఉట్నూరు వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్లో క్లాసులు అయ్యాక అతనూ మరో టీచరు కలిసి వెళ్ళి స్కూలు పని చూసుకు వచ్చేసరికే చాలా రాత్రి అవటం, ఇలా వరుసగా రెండు రోజులు జరిగింది.
చంద్రయ్య తాత వచ్చి చెప్పాడు “సార్! నీ కోసము రాముడు వచ్చి పోయాడు”. అని
‘అయ్యో!’ అనుకున్నాడు వివేక్.
పని తీరుబాటు అయ్యాక కలుస్తానని కబురు పెట్టాడు.
ఆదివారమంతా కలసి తిరగాలనుకున్నాడు కాని ఆదివారం రాము చెల్లి పెళ్ళిచూపులు. అతను రాలేనని, వివేక్‌ను వాళ్ళింటికి రమ్మని పిలిచాడు.
ఆ రోజు ఉదయమే వివేక్‌ మధ్యంతర పరీక్షలకు పేపరు చేస్తూ కూర్చున్నాడు. పన్నెండు కొట్టినప్పుడు గుర్తుకొచ్చింది. రాము వాళ్ళింటికెళ్ళాలని.
గబగబా తయారై బయటకొచ్చి చూస్తే చంద్రయ్య లేడు. దారి తెలియదు.
‘ఇదేమైనా వింతలోకమా? వెతుక్కుందాములే’ అని ధీమాగా బయలుదేరాడు. బడి దాటి మైలు నడిచి ఊరులో ప్రవేశించాడు. ఎవ్వరూ తెలిసినవారు కనపడటం లేదు. ఒక ప్రక్క సంత మొదలై హడావిడి నడుస్తోంది.
నెమ్మదిగా అలాగే దిక్కులు చూస్తూ నడుస్తుంటే స్కూలు పిల్లలు కొందరు పలకరించారు.
“ఇక్కడ రాము ఇల్లు తెలుసునా ఎక్కడో?” అడిగాడు వాళ్ళని.
“ఆ రోజు మీరు మాట్లాడినారు. ఆ రామేనా” అడిగారు వాళ్ళు.
‘ఓరినీ! వీళ్ళన్నీ గమనిస్తారు’ అనుకుంటూ తల ఊపాడు.
వాళ్ళు దగ్గరుండి ఇల్లు చూపించి వెళ్ళిపోయారు.
వారి ఇల్లు చిన్న గుడిసె. బయట మంచాలు వేసి ఉన్నాయి. దాని మీద కొందరు కూర్చొని ఉన్నారు.
ఇల్లు ఎర్ర మట్టితో అలికారు. దాని మీద తెల్లని సున్నంతో అందమైన చిత్రాలు గీసి ఉన్నాయి. గిరిజనులు ప్రకృతి ఆరాద్యులు. వారి ఇంటి గోడలకు అందమైన చిత్రాలు గీసుకుంటారు. వాటిని ‘ఇడిసింగ్’ అంటారు. అలాంటి బొమ్మలు గీసుకుంటే వారి మీదకు దుష్టశక్తి రాదని, కీడులన్నీ పోతాయని నమ్మకం. ఆ చిత్రాలు రకరకాల గాథలను తెలుపుతాయి. వేట,మృగాలు దగ్గర్నుండి దేవుడి బొమ్మల వరకూ. రాము ఇంటి గోడలకు అందమైన ఆ బొమ్మలు, ఆ ఇంటి చుట్టూ ఉన్న పరిశుభ్రత వివేక్‌ కు చాలా నచ్చింది. చిన్న పెద్దా మొక్కలతో ప్రాంగణము నందనవనంలా ఉంది. ఒక ప్రక్కగా బావి, బావి చుట్టూ బంతి, చామంతి గుత్తులు గుత్తులుగా పూసి ఉన్నాయి. మరో ప్రక్క పెద్ద మద్ది చెట్టు. మరో వైపు మోదుగ చెట్టు. ఆ గుడిసే అసలు చూడటానికి పర్ణశాలలా ఉంది.
ఒక్క క్షణము తను పెరిగిన మురికవాడ, ఇంటి వద్ద ఉన్న మురికి కాలువలు గుర్తుకు వచ్చాయి. మనస్సులో అనుకున్నాడు ‘గిరిజనుడు అడివికి రారాజు. వాళ్ళకి అడివి తల్లి ఓడిలో ఉన్నంత సుఖము మరి ఎక్కడైనా దొరుకుతుందా?’ అని.
రాము, రాము తండ్రి ఎదురు వచ్చి మర్యాద చేసి మంచం మీద కూర్చోబెట్టారు.
“ఎం జరుగుతుంది ఇప్పుడు? చెల్లిని తీసుకొచ్చి కూర్చోబెడతారా?” అడిగాడు వివేక్‌.
“లేదు. చూడు ముందు. తరువాత మాట్లాడుకుందాం” చెప్పాడు రాము.
ఇంకా కొందరు పెద్దలు వచ్చారు. కొందరు అమ్మాయి వైపు, కొందరు అబ్బాయి వైపు సర్దుకున్నారు.
వచ్చినవారు వీరికి తెలిసినట్లే ఉన్నారు. వారు సంభాషణ ఇలా మొదలుపెట్టారు
“ఎవరు మీరు?” అన్నారు రాము, అతని తండ్రి
“మేము అడవుల లోపల వేటాడే వేటగాళ్ళం. మేము కొట్టిన జింక పారిపోయింది. మీ ఇంటికి వచ్చి దాగింది”
“ఇక్కడ అలాంటి జింకలేమీ రాలేదు” చెప్పారు రాము నాన్న.
“మేము జింక రక్తం మరకలు వెంబడించి ఇటుగా వచ్చాం. మీ ఇంటి తలుపు దగ్గర మరకలు చూడండి. మా జింకను మాకివ్వండి” అన్నారు.
“మా ఇంట్లో మేము పెంచిన జింకే ఉన్నది. మీరు కొట్టిన జింక మాకు తెలియదు.” అన్నాడు రాము తండ్రి పట్టుదలగా.
“అవునా! అయితే మీ జింకే అయి వుంటుంది. ఇవ్వండి మాకు. తప్పదు మీకు.”
“మేము ఎంతో ముద్దుగా పెంచాము ఈ జింకను”
“మా చేలు సమృద్ధిగా పంట ఇస్తాయి. మేము బాగా చూసుకుంటాం” అన్నారు అబ్బాయి తరుఫు వారు.
ఇద్దరూ అంగీకరించారు. స్త్రీ ధనమెంతో మాట్లాడుకున్నారు. సంతోషంగా అందరూ ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. వివేక్‌కి ఇదంతా మరో లోకములా ఉంది. చాలా సరదాగా కూడా ఉంది.
తదనంతరం కొందరు స్త్రీలు వచ్చారు.
రంగుల వస్త్రధారాణ, వెండి బిళ్ళలతో, పూసలతో ఉన్న దండలు మెడనిండా ధరించారు. జుట్టు కొప్పు గట్టి పూలు పెట్టారు. వారి ముఖాల పైన చేతుల పైన కొన్ని పచ్చబొట్లు గీతలు చుక్కలతో జామెట్రిక్ డిజైనులో ఉన్నాయి.
వారంతా కలసి పాటలు పాడుతూ గుండ్రముగా తిరగటం మొదలుపెట్టారు. వారు పాడే పాటలలో ముందు వధువు వైపు వంశవృక్షము, పెద్దల వీరగాధలు పాడారు. లయగా ఆడుతూ, పాడుతూ వారి చరిత్ర వివరించారు. అది చూడటానికి చాలా మనోహరంగా అనిపించింది వివేక్‌కు.
వారి పాడిన తరువాత మరికొందరు స్త్రీలు దాదాపు పూర్వపు వారిలాగానే అలంకరించుకొని ఉన్నారు. వారు కూడా ఇలాగే పాటలందుకున్నారు. కాకపోతే ఈ సారి వరుని వంశం, గోత్రం, వారి పెద్దల వీరగాధలున్నాయి. ఇలా ఒక గంట వరకూ పాటలు నృత్యాలు సాగాయి.
(గిరిజనులది మౌకిక సంస్కృతి. వారి భాషకు లిపి ఉండదు. వారి సంప్రదాయాలు, పద్ధతులను వారు పాటల ద్వారా ముందు తరాలకు అందిస్తారు)
ఆ తరువాత భోజనాలు అయ్యాక పెళ్ళి డేటు గురించి చెబుతామని వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ చాలా సంతోషముగా ఇప్పసారా తాగటానికి కూర్చున్నారు.
రాము వివేక్ భుజం మీద చెయివేసి “పద!” అన్నాడు.
వివేక్‌ ఎప్పటినుంచో అణిచిపెట్టుకుంటున్న ప్రశ్నల మూట విప్పాడు.
రాము నవ్వుతూ “నాకు తెలుసు నీకు డౌట్సు పెరిగిపోయి ఉంటాయని” అన్నాడు.
“అవును. నాకు వాళ్ళందరూ మాట్లాడినది ఒక్కటి కూడా అర్థం కాలేదు” అన్నాడు.
“నాకు తెలుసు. నీకు డౌట్సు వచ్చి ఉంటాయని. నీకు దిష్టి అన్న కాన్సెప్టు తెలుసా?” అడిగాడు.
“కొద్దిగా” అన్నాడు.
“గిరిజనులలో ఆ దిష్టి భయం ఎక్కువ. అందుకే ఏ విషయము సూటిగా ప్రస్తావించరు. అది అహంకారమని కూడా నమ్మకము. వాళ్ళు పిల్లను అడగటానికి వచ్చారు. పిల్ల బదులు జింక అన్నారు. అది జింక కాదు జింక కన్నుల చిన్నదని మాకందరికీ తెలుసు” నవ్వాడు రాము.
“కట్నం గొడవలు ఇక్కడ కూడా ఉన్నాయా?” అడిగాడు వివేక్
“పూర్వం లేవు. ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. మనము కూడా మాడ్రన్ అవుతున్నాముగా!” చెప్పాడు రాము.
“కాని వాళ్ళ సంభాషణ చాలా వింతగా బలే ఉందిగా” మళ్ళీ మధ్యహ్నం పెళ్ళి చూపుల విషయము గుర్తు చేసుకుంటూ.
“ఆ అన్నట్లు మీ ఇల్లు కూడా చాలా బావుంది రాము” చెప్పాడు మనఃపూర్తిగా.
“నీకు అడివిలో తాండకు తీసుకుపోవాలి. నీవు మరింతగా ఆశ్చర్యపోతావు. మామిడిపల్లి తాండా అయినా ఇది కొద్దిగా పట్నం వాసనలు పీలుస్తోంది…” అన్నాడు నవ్వుతూ.
“పట్నం వాసనా? బస్సు కూడా లేదు ఈ ఊరికి” నవ్వాడు వివేక్.
“అదీ వస్తుందిలే ఇంకో రెండు మూడేళ్ళలో. ఈ స్కూలు కోసమైనా. ఇది ఈ ప్రాంతములో చాలా పేరున్న పాఠశాల. దీనిలో చేరితే ఇంక తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు ఆలోచించనక్కలేదు. లేకపోతే ఆగమాగమే”
“ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేవా?”
“అహహ. ఉన్నాయి. నీవు మా ఇంటికి వచ్చే దారిలో నీకు పశువుల కొట్టం కనపడిందా?”
“కనపడింది”
“అదే గవర్నమెంటు స్కూలు. ఇదీ ఇక్కడి స్కూళ్ళ పరిస్థితి. ఏదో ఇక్కడ ఈ గురుకులం నడుస్తోంది కాబట్టి సరిపోయింది. ఇది ఈ పోరల అదృష్టం” అన్నాడు రాము.
“తాండాకు ఎప్పుడు పోదాం” మాటమారుస్తూ అడిగాడు వివేక్‌.
“ప్రతి గిరిజన ఊరినీ ‘తాండా’ అనే అంటారు. కానీ మనము కనుక ఈ అడవిలో లోతట్టుకు వెడితే కనపడేవి ఎప్పుడూ కనపడని తాండాలు. నేను కూడా రిసెర్చు కోసమే ఒక్కసారి వెళ్ళాను. అడవులలో ఉండే గిరిజనులు నిజానికి అటవీ శాస్త్రవేత్తలు. వారి భాషకు లిపి ఉండదు. వారికి అడవి పైన ఉన్న అవగాహనకు హద్దూ ఉండదు. వారు మాత్రమే అడవులలో దొరికే చెట్ల ఉపయోగం, ఏ భాగం ఏ జబ్బుకు మందుగా వాడవచ్చు చెప్పగలరు. కానీ ఆ జ్ఞానం లేని నేటి నాగరిక లోకము ఆదివాసులను అనాగరికులుగా ముద్రవేసి వారికి తెలిసిన మిడిమిడి జ్ఞానములోకి లాగాలని చూస్తోంది. మనకు గిరిజన ప్రాంతాలలో కనిపించినంత జీవ వైవిధ్యం మరి ఎక్కడా కనపడదు. మనకు తెలుసు మనము ఎంతగా అడవి మీద ఆధారపడినామో, అడవి కూడా మన మీద ఆధారపడిందని. అడవిలో నేటికి ఈ నాగరికపోకడలకు దూరం స్వయంసంపత్తితో మెసిలే గూడాలు ఉన్నాయి తెలుసా?. వాటిలో గిరిజనులకు తగువులు వస్తే వారి కుల పెద్దలే తీరుస్తారు. ఈ గిరిజనులు పరమ స్వేచ్ఛాజీవులు. వారు ఇప్పటికి కూడా విల్లంబులు బాణాలతో తిరుగుతూ ఉంటారు. మనం వెళ్ళటానికి ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. టైం పడుతుంది. చుద్దాం!అయినా నేను వచ్చే ఆదివారం ఊరు వెడుతున్నా”.
“అదేమి, అప్పుడే పోతున్నావా?”
“చెల్లి పెళ్ళి కుదురుతోందని వచ్చాను. నా రీసెర్చు పని కూడా చాలా ఉంది. నీవేమో సండే తప్ప ఫ్రీ ఉండవు కదా!”
“అవును! సారీ, నీవు కుదిరితే ఉండు. లేదంటే ఎలా కుదిరితే అలా చుద్దాం…”
“సరే పిల్లల హాఫ్ఇయర్లీ అయ్యాక వస్తాను. అంటే ఒక పదిహేను రోజులు. మనము లోపలి గూడేలాకు వెడదాం. అక్కడి వారు బయటివారిని రానివ్వరు. మనం వాళ్ళ పర్మషన్‌తో వెళ్ళాలి, చెప్పాగా! ” అన్నాడు రాము.
“సరే తర్వాత కలుద్దాం” అంటూ వివేక్ సెలవు తీసుకొని తన రూముకు వచ్చేశాడు.
వివేక్‌ స్కూలు, పిల్లల పరీక్షల గొడవలో తలమునకలయ్యేలా ఉన్నాడు. అతనికి స్కూలు, పిల్లలు తప్ప మరో విషయం గుర్తుకు లేకుండా గడిచింది ఆ నెలంతా. పనిలో పడితే కాలం తెలియదు. ఋతువుల మారటం కూడా గమనికలో ఉండదు. ఎండ ముదరటం, చెట్ల ఆకులు ఎండటం కూడా వివేక్ గమనించలేదు. చకచకా సాగుతున్న రోజులతో కాలము వేసవి ప్రవేశించింది.

ఇంకా వుంది..

1 thought on “మోదుగపూలు – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *