March 19, 2024

తాత్పర్యం – దుఃఖలిపి

రచన: రామా చంద్రమౌళి

రాత్రి. ఒంటిగంట దాటిఉంటుందా. ?. . అనుకున్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ నరహరి.
అప్పుడతను. తన పోలీస్ స్టేషన్లో. తన ప్రత్యేక గదిలో. సోఫాలో. వెనక్కివాలి. నెత్తిపైనున్న టోపీని ముఖంపైకి లాక్కుని. కప్పుకుని. కళ్ళు మూసుకుని. ఒకరకమైన జ్వలితజాగ్రదావస్థలో ఉన్నాడు. మనసు. ఆత్మ. కణకణలాడుతున్న నిప్పుకణికలా ఉన్నాయి. శరీరం గడ్దకట్టిన మంచుగడ్డలా ఉంది.
మంచుగడ్డలో. నిప్పు కణిక. నిప్పుకణిక పైన. చుట్టూ. ఆవరించి. కప్పేసి. కబళించి. మంచుకడ్డ. మంచు పొరా. తెరా కాదు. గడ్డ. గడ్డే. ఉంటుందా అలా. జరుగుతుందా అలా. జరుగుతుంది. జరుగుతుంది. ఒక్క మనిషి విషయంగానే జరుగుతుంది. అంతర్యుద్ధంలో మనిషి కూరుకుపోయినప్పుడు. సకల కాలుష్యాలతో మలినమైన శరీరాన్ని భౌతిక లౌల్యాలన్నీ ఆక్రమించి భ్రష్టుపట్టించిన తర్వాత ఒట్టి అవశేష సదృశంగా మారిన శరీరం నిజంగా ఒట్టి మంచుగడ్డే. కాని లోపల ఆత్మ. తనప్రక్కకు ఏ మలినమైనా చేరగానే వెనువెంటనే దహించివేసి మనిషిని నిలదీసి ప్రశ్నించి. శుభ్రించే ఆత్మ. ఆత్మ ఎప్పుడూ నిప్పే. ఆరిపోని నిప్పు. నిరంతర దహనకారి. నిప్పు. నిప్పు. తనలోపల అజ్ఞాతంగా దాక్కుని. అనుక్షణం కాల్చేసే నిప్పు.
శరీరం. ఆత్మ. ఒకదానితో ఒకటి. ఒకదానిలో ఒకటి. అనుసంధానమై. అనుబంధమై. టు ఇన్ వన్. వన్ విత్ ఇన్విజిబుల్ టు.
టోపీలో ఉన్న ముఖంతో. కళ్ళు తెరిచాడు నరహరి. ఏమీ కనబడ్లేదు. నల్లగా ఒట్టి చీకటి. నెత్తి నూనె. మాసిపోయిన జుట్టు. చెమట. కలెగలిసిన ఒకరకమైన జిడ్డు. గత్తు వాసన. తన జీవితంవలెనే.
పోలీస్ స్టేషన్ ఆ క్షణం పాముల పుట్టలా అతినిశ్శబ్దంగా ఉంది. శీతాకాలం కావడంవల్ల చలిచలిగా. తేమతేమగా. ఎవరో మంత్రిస్తే. ఆవరించినట్టు అంతా మత్తుగా ఉంది. మొత్తం స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్. గార్డ్స్. లాకప్ లోని అనిర్ధారిత నేరస్తులు. అందరూ కలిసి ఓ పదిహేను మందుంటారేమో. కాని. రోజంతా చిటపటలాడుతున్న చిదుగుల మంటలా ఉండే పోలీస్ స్టేషన్. అప్పుడా క్షణం ఆరిపోయిన కుంపటి ఒట్టి బూడిదను మిగుల్చుకున్నట్టు స్తబ్దుగా ఉంది. గాలినిండా తుపాకుల వాసన. కరుకుదనం వాసన. అస్సలే కనబడని అమానవీయ మృగ వాసన. వెరసి. గాలంతా హింస వాసన.
ఎందుకో చటుక్కున తను వెనుకట చదువుకున్న తన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. మెటలర్జీ ల్యాబ్. ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ జ్ఞాపకమొచ్చాడు. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్లక్కూడా మెటలర్జీ. లోహశాస్త్రం చాలా లోతుగానే ఉండేది సిలబస్ లో. లోహ పరివర్తన. లోహ ధర్మాలూ. ప్రవర్తన. లక్షణాలూ. వీటిగురించి చెబుతూ. ఒకనాడు. లోహాల ప్రవర్తనను మార్చడానికి ఉపయోగించే ‘ అగ్ని చికిత్స ‘ గురించి చెప్పాడు ప్రొఫెసర్ సూర్యప్రకాశ్. హీట్ ట్రీట్మెంట్. చాలా ముఖ్యమైన. మనిషి జీవితానికి అన్వయించగలిగే ఎన్నో సామ్యాలున్న ఒకానొక చికిత్స అది. ఆరోజు ఏమిచేశాడంటే. ,
మెటలర్జికల్ ఫర్నేస్. బట్టీలో. తామందరిముందే. రెండు మైల్డ్ స్టీల్. మెత్తని ఇనుప నమూనా కడ్డీలను తీసుకుని. రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మెషిన్ తో. వాటి కాఠిన్యాన్ని. అంటే హార్డ్ నెస్ నంబర్ ను పరీక్షించి నమోదు చేసుకున్నాం. అది సి 78. గా ఉంది. తర్వాత రెండింటినీ ఫర్నెస్ లో సందిగ్ధ ఉష్ణోగ్రత. క్రిటికల్ టెంపరేచర్. 923 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ స్థాయికి వేడిచేసి. రెండింటినీ ఒకేసారి బయటికి తీసి. ఒక దాన్ని అదే ల్యాబ్ గదిలో. ఓ మూలకున్న ఇనుప టేబుల్ పై ఒక కొసపై అలా గాలిలో వదిలేసి. అంటే ఊర్కే గాలిలో అతి సహజంగా. దానంతట అదే చల్లబడి గది ఉష్ణోగ్రతకు చేరేందుకు. వదిలేసి. ఎర్రగా ధగధగలాడ్తున్న మరో ఇనుపముక్కనుమాత్రం. చటుక్కున బయట ఉన్న చల్లని నీటితొట్టెలో ముంచాం. సుయ్. సుయ్. మనే శబ్దంతో. ఆ ఇనుపముక్క అకస్మాత్తుగా చల్లబడి. క్షణాల్లో గది ఉష్ణోగ్రతకు చేరి. మామూలైపోయింది. అటు టేబుల్ పై ఉన్న ముక్కమాత్రం రెండుగంటల తర్వాత చల్లబడింది సహజంగా.
అప్పుడు రెండింటినీ మళ్ళీ వాటి హార్డ్ నెస్ నంబర్ కనుక్కుని పరీక్షిస్తే. గాలిలో చల్లబడ్డ ఇనుపముక్క మెత్తబడి మృదుత్వాన్ని పొందింది. దాన్నే ‘ అనెలింగ్ ‘ అంటాము. రెండవది. దేన్నైతే అకస్మాత్తుగా చల్లబర్చామో. అంటే ‘క్వెంచ్ ‘ చేశామో అదిమాత్రం మొదటిదానికి వ్యతిరేకంగా చాలా కఠినమై బండబారిపోయింది. అదే హార్డెనింగ్ ప్రోసెస్. పదార్థమదే. కాని దానిపై ఉష్ణం రూపంలో నిర్వహించబడ్డ చికిత్స వల్ల. దాని మూల లక్షణాలన్నీ మారిపోయాయి.
మనుషులుకూడా అంతేనా. జన్మతః మనుషులందరూ. శుద్ధ ఇనుమువలెనే. ఒకేరకమైన ఉమ్మడి లక్షణాలను. అంటే వాని డి ఎన్ ఎ స్వరూపాన్నిబట్టి. సంక్రమించే ప్రవర్తనను కలిగిఉంటాడా. వాడిపై. వయస్సుతోపాటూ రోజురోజుకూ ప్రభావితమయ్యే కాలుష్యాలన్నీ. మనిషిని. కల్తీమనిషిగా. అనైతికవాదిగా. నీతిహీనునిగా. నేరస్తునిగా. అరాచకవాదిగా. లంచగొండిగా. దోపిడీదారుగా మారుస్తాయా. మనిషిపై సామాజిక స్థితిగతులే ఒక చికిత్సగా పనిచేస్తాయా.
మళ్ళీ అదే దృశ్యం జ్ఞాపకమొచ్చింది నరహరికి.
ఆమె. పూర్తిగా. ఇరవై ఐదేళ్ళుకూడా నిండని. ఆ అమ్మాయి. తెల్లగా. లేతగా. అమాయకంగా. స్వచ్ఛంగా. కలువపువ్వా. తుడిచిన అద్దమా. గొంతునులిమి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో బుల్లెట్ను పేల్చితే శరీరం పికిలిపోయి. ప్రాణాలను విడిచిన తెల్లకుందేలా. ఎర్రగా
రక్తం. అందులో. తెల్లగా చచ్చిన కుందేలు. కడుపు చిరిగి. పేగులు బయటపడి. శరీరం ఛిద్రమై. చేతులు విరిగి. మెలికలు తిరిగి. కాళ్ళలోకి తుపాకీ గుళ్ళు చొచ్చుకుపోయి. నుజ్జునుజ్జై. కాని. ముఖమొక్కటే. అలాగే. నీటిపై తేలుతున్న అప్పుడే వికసించిన కలువపువ్వువలె. నిర్మలంగా. ప్రశాంతంగా. ప్రశ్నిస్తూ. ప్రతిఘటిస్తూ. ,
‘ ఏడబుట్టె. ఏడకొచ్చె
ఏడకొచ్చి ఏడచచ్చె. ఏ తల్లి కన్నబిడ్డలోళి. చెమ్మకేళీల హోళి ‘
పాట. ఎవరూ పాడనిపాట. మౌనంగా. నిశ్శబ్దంగా. వినబడే పాట. కళ్ళుమూసుకుంటే. గుండెలకొండల్లో ఒక ప్రళయగీతమై విస్ఫోటించే పాట. ,
గాజు కళ్ళవి. అప్పటిదాకా సూర్యకిరణాల్లా వెలుగులను నింపుకుని వికసించిన కళ్ళు. ఇప్పుడు కరెంట్ పోయినతర్వాత ఆరిపోయిన బల్బ్ వలె. జీవి. నిర్జీవి. వస్తువుంది. కాని కాంతిలేదు. మనిషుంది. కాని ప్రాణంలేదు.
ప్రక్కన ఒక తుపాకీ. పాయింట్ త్రీ. రైఫిల్. ఎప్పటిదో. తాతలనాటి మోడల్. రి-లోడబుల్. గన్. వ్చ్.
మనుషులు. వాళ్ళే. కాని ఆలోచనలు వేరు. శరీరమదే. కాని చింతన వేరు. చదువు అదే. కాని లక్ష్యాలూ. గమ్యాలూ వేరు. కళ్ళు అవే. కాని. చూపు వేరు. దృష్టి వేరు.
ఈ దృష్టి భేదమేమిటి. ?
చుట్టూ కొండలు. దట్టమైన అడవి. లోయలు. ముళ్ళకంపలు. కాలి బాటలు. బురద దారులు. కఠోరమైన. నడక.
ఎందుకు. ఆమెకూడా. ఐ ఐ టి లో. ఎం టెక్ పూర్తి చేసి. గోల్డ్ మెడల్ తో బయటికొచ్చిన అమ్మాయి. హాయిగా ఏ అమెరికాకో అమ్ముడుపోయి. ఆడి కార్లలో తిరుగుతూ. హాయిగా డాలర్ల నిషాలో మునిగి. స్వప్నాల్లో తేలిపోవచ్చుగదా. ,
ఈ వైవిధ్యమైన చింతన ఏమిటి. ఎందుకు.
సడెన్ గా భయంకరమైన కేకలు వినిపించినట్టనిపించి. ఉలిక్కిపడి. ముఖంపై కప్పుకున్న ఖాకీ రంగు టోపీని చటుక్కున చేతితో తొలగించుకుంటూనే. కళ్ళు తెరిచాడు నరహరి.
ఏ శబ్దమూ లేదు. అంతా ప్రశాంతమే. పోలీస్ స్టేషనంతా. పాముల పడగలనీడలోని చిత్తడినేలవలె.
బయట దూరంగా. గేట్ దగ్గర . బద్రునాయక్. సెంట్రీ డ్యూటీలో. ఒక శిలావిగ్రహంవలె. కనిపిస్తున్నాడు. నీడలా.
నీడలు. నీడలు. కదిలే నీడలు. వేటాడే నీడలు. ధ్వంసించే నీడలు. విస్ఫోటించే నీడలు.
‘ సూర్యుడెవరు. ? అని ప్రశ్న.
వెలుతురునూ. ప్రకాశాన్నీ ఇచ్చేవాడు. అని జవాబు.
కాని. సూర్యుడంటే. నీడలను ప్రదానం చేసేవాడు. అని మరో జవాబు.
ఈ గ్లాసు సగం ఖాళీగా ఉంది అని ఒకడంటే. ఈ గ్లాసు సగం నిండి ఉంది. అని ఇంకొకడు
వస్తువదే. కాని దృష్టి వేరా. ?
సమాజమదే. కాని దాన్ని వీక్షిస్తున్న చూపు వేరా. ?
జీవితమదే. కాని జీవిస్తున్న తరీఖా వేరా. ? ‘
నరహరి రెండు రోజులనుండి ఇంటికి పోలేదు. నిన్న రాత్రి హైదరాబాద్ డి జి పి పేషీనుండి వచ్చిన ఒక అర్జంట్ కాల్ మీద హడావిడిగా. హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వచ్చిన వచ్చుడు. ఇక ఒకటే పరుగు. ‘ యాక్షన్స్ ‘. తుపాకులు. ప్రేలుళ్ళు. వేట. లాకప్ లు. అజ్ఞాత విచారణలు. పోలీస్ భాషలో. ప్రశ్నలు. గోళ్ళలోకి సూదులు గుచ్చడాలు. తలక్రిందల వ్రేలాడతీతలు. ఎర్రగా కాల్చిన కర్రుతో కాల్చడాలు. అరుపులు. కేకలు. బీభత్సం. హింస. శారీరక హింస. మానసిక హింస. భయంకరమైన విచ్ఛేదన. . ఊహించలేని అతి కౄరమైన దాడి. నిస్సహాయమైన వ్యక్తిపై అధికారిక దాడి. పైశాచిక ఆక్రమణ. రక్త చాపల్యం. హింసా చాపల్యం. లోలోపల ప్రతి మనిషిలోనూ అజ్ఞాతంగా దాగిఉండే హింసాకాంక్షను తీర్చుకునే పాశవిక దాడి.
నిన్న రాత్రంతా. వర్షం. భీకరమైన వర్షం. అసలు శీతాకాలంలో. అంత వర్షం పడడం తనెప్పుడూ చూడలేదు. ఏదో ప్రత్యేక సందర్భంలో వలె. కుండపోతగా ఒకటే ఎడతెగని వర్షం. ఆ అమ్మాయిని స్పెషల్ కోంబింగ్ స్క్వాడ్ రాత్రి పదకొండు గంటలకు తన పోలీస్ స్టేషన్ కు. విచారణ నిమిత్తమని తీసుకొచ్చిన. పదకొండు గంటలకు మొదలైన వర్షం. విచారణ పేరుతో జరిగిన అతిఘోర హింస తర్వాత. ఆ అమ్మాయిని ఒక పదిమంది ప్రత్యేక శిక్షణ పొందిన స్పెషల్ స్క్వాడ్ వెంటతీసుకుని. తనుకూడా బయలుదేరుతూండాగా. వర్షమే. ఆకాశం దుఃఖిస్తున్నదా. ఆకాశం ఆమెపై జరుగుతున్న పైశాచిక దాడికి విలపిస్తూ భూనభోంతరాళాలను ఏకంచేస్తూ కన్నీళ్ళను కారుస్తున్నదా. అన్నట్టు. వర్షం.
ఈ అతిరహస్య. ఖైదీల విచారణ సెల్ తన పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఆ విషయం తనతో పనిచేసే చాలామంది సామాన్య పోలీస్ లకు అసలు తెలియనే తెలియదు. భూ గృహమది. మధ్య హాల్ లోనుండి. లోపలికి. మెట్లు. లోపల చీకటి. అంతా రాతి కట్టడం. గుహ. ఎప్పుడో నిజాం కాలంనాడు కట్టించిన ఇంటర్రాగేషన్ సెల్ అది. దాంట్లో అంతా దుఃఖ ఘోష. కన్నీళ్ళ వాసన. దశాబ్దాలనాటి వందల వేలమంది హతుల ఆత్మల నిశ్శబ్ద వేదనా ప్రతిఫలనలు. ఆక్రందనలు. ఆక్రోశాలు. రోదనలు. వెరసి. ‘ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలం ‘ అది. ఉదయించని భాస్కరులెప్పుడొస్తారో.
నరహరికి. ఎదుట. తన టేబుల్ పై. తన ‘బెరెట్టా’ పిస్టల్ కనబడింది. ధగ ధగ మెరుస్తూ. చుట్టచుట్టుకుని పడుకున్న పాములా. తను సర్వీస్ లో. సబ్ ఇన్స్ పెక్టర్ గా చేరినప్పుడు. పన్నెండేళ్ళక్రితం ప్రభుత్వమిచ్చింది. పిస్టల్ చేయగలిగింది. కేవలం హింస ఒక్కటే. భయపెట్టడం. భయపడడం. ఈ రెండే తన జీవితమంతా తన అనుభవంలోకొచ్చిన అతి దుర్మార్గ విషయాలు. పోలీసన్నవాడు. ఎదుగుతున్నకొద్దీ. తన కిందివాళ్ళనూ. ప్రజలనూ భయపెట్టడం. పైవాళ్ళదగ్గర బూట్లు నాకేంత నీచంగా భయపడడం. హృదయాన్ని చంపుకుని.
మొట్టమొదటినాడు. ఈ కొత్త పిస్టల్ ను తీసుకొచ్చుకున్న నాటి రాత్రి. జ్ఞాపకమొచ్చింది నరహరికి.
లోపల ఏదో ములముల. దాన్ని ఉపయోగించాలన్న దుగ్ధతో కూడిన గులగుల. కాల్చాలి. దేన్నైనా. ఎవరినన్నా. బుద్దితీర బుల్లెట్ తో కాల్చి చంపాలి. హింసించాలన్న బలమైన కోరిక. చిన్న పిల్లవాడి చేతికి ఒక పెన్నిస్తే. దానితో. కాగితం మీదనో. బండ మీదనో. ఎక్కడో ఒక దానిమీద ఫరఫరా గీకి ఆనందించాలన్న తహతహ. దాహం. దురద. పిల్లవాడికి ఒక బొద్దింకనిస్తే. చీపురుపుల్లతో దాన్ని గుచ్చి గుచ్చి చంపాలన్న అజ్ఞాత మృగ తత్వం. తూనీగనిస్తే. రెక్కలను చించి. తోకకు దారం కట్టి. ఎగరేస్తూ మజా ఉడాయిస్తూ చివరికి దాన్ని హింసిస్తూ చంపాలన్న అప్రత్యక్ష వాంఛ. హింసా చాపల్యం.
మనిషి తత్వంలో వచ్చే మార్పు ఎప్పుడూ క్రమానుగతంగా సంభవిస్తుందా. నిజానికి తను చేస్తున్న ఈ ఉద్యోగం తను కావాలని ఇష్టపడి ఎంచుకుని చేస్తున్నది కాదు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువును రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి ఒక ప్రీమియర్ ఇన్స్ టిట్యూట్ నుండి పూర్తిచేసిన తను ఏదైనా ఒక భారీ పరిశ్రమలో చాలెంజింగ్ ఉద్యోగం చేస్తూ పైకెదగాలని కలలుకన్నాడు. కాని. అలా జరుగలేదు. బీదరికం. తండ్రి చనిపోవడం. కుటుంబ భారం పైబడడం. ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు. ఏ ఆసరా దొరికితే. దాన్నే పట్టుకుని బయటపడ్డరీతిలో. చటుక్కున ఈ ఎస్సై ఉద్యోగం నోటిఫికషన్ రావడం. అప్ప్లై చేస్తే. భగవంతుడిచ్చిన భారీ విగ్రహం. సహజంగానే ఉన్న తెలివితేటలు. సమయజ్ఞత. చొచ్చుకుపోయే తత్వం. ఈ దేశంలో రాజ్యాంగమిచ్చిన కుల రిజర్వేషన్. అన్నీ కలిసి మొత్తం మీద. డైరెక్ట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా అపాయింట్ మెంట్.
ఇక వచ్చింది పెనుమార్పు తనలో. తనకు తెలియకుండానే. నిజానికి ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే అర్థమైన విషయమేమిటంటే. కొత్తగా ఉద్యోగంలో చేరేనాటికి చాలామంది స్వచ్ఛంగా. నీతివంతంగానే ఉంటారు. ఐతే, కాలం గడుస్తున్నకొద్దీ. తన తోటి ఉద్యోగులు చేస్తున్న అక్రమాలూ. సంపాదన మార్గాలూ. మెలకువలూ. మెలికలుపెట్టి మనుషుల బలహీనతలనుండి డబ్బు గుంజే దారులూ. అన్నీ క్రమక్రమంగా తెలుస్తూ. చేయిని లోపలిదాకా చొప్పించడం నేర్చుకుని. ఇక విజృంభణ. నోట్లను కుప్పలుగా ఊడ్చుకోవడం. ఇంకా ఇంకా. దోపిడి. ఇక్కడ. ఈ దేశంలో అవినీతి ఒక జీవన విధానమైన. విషసంస్కృతి. విస్తరిస్తూ. విస్తరిస్తూ,
అలవాటైపోయింది. మొదటిసారి ఎస్సై యూనిఫాం వేసుకుని పొలీస్ స్టేషన్ లో అడుగుపెట్టగానే. హెడ్ కానిస్టేబుల్ ద్వారా కొంత. తనపైనున్న సి ఐ ద్వారా కొంత. తమ జ్యూరిస్ డిక్షన్ లోని ఆదాయ వనరులూ. సంపాదనా మార్గాలూ. రహస్య కేంద్రాలూ. అన్ని దారులూ విప్పుకుని ఎదుట పరుచుకుంటూ. ఒకరకమైన కవ్వింత. పై అధికారి డబ్బును తెచ్చివ్వమని బలవంతం. కిందివాళ్ళు తనకు కొంత ఇప్పించి తద్వారా తాము కొంత బావుకోవాలని నిరంతర ప్రయత్నం. అవినీతి ఒక పెట్రోల్ మంట. దావానలంలా వ్యాపిస్తుంది. ఒక్కసారి చేయి చాపామంటే. ఇక ఊబిలోకి కూరుకుపోతున్నట్టు లెఖ్ఖ. లంచమిచ్చేవాడు క్రమక్రమంగా నెత్తికెక్కి. నృత్యం చేస్తాడు అజమాయిషీ చేస్తూ. కాగా చుట్టూ రకరకాల మనుషులు. మంచి చెడూ. తెగింపు. చొరవ. దేనికైనా రెడీ అనే ఆడా మగా. చేయి చాపితే అందే సెక్స్. చేయి వంకరపెదితే విపరీతమైన డబ్బు. చిత్రమేమిటంటే. ప్రతిరోజూ ఒక నిత్య నూతనమైన కేస్ లు. వింత సంఘటనలు. ప్రేమలు. విడిపోవడాలు. కొట్లాటలు. దాడులు. నీకిదిస్తే. నాకదిస్తావా బేరసారాలు. వేశ్యా గృహాలు. పేకాట క్లబ్బులు. పైకి దేవునిలా కనిపించేవాడు. లోపల అతి వికృతంగా దర్శనమిస్తూ. అంతా ఒక మాయ. ఒక భ్రమ. ఒక భ్రాంతి. అధికారం మనిషికి పిచ్చెక్కిస్తూ తిరిగి వెనక్కిచూడవివ్వకుండా వ్యామోహంలోకి తరుముతుంది.
అప్పుడు తన మొదటి నెల జీతం పదిహేను వేలు. లంచాలు ముప్పై రెండు వేలు. తర్వాత జీతం అదే పదిహేనువేలు. పైపై ఆదాయం నలభై వేలు. ఒక కొత్త అందమైన స్త్రీ పరిచయం. ఇంట్లో అందమైన, అనుకూలవతియైన భార్య ఉండగా మరో బజారు రూపవతిమీదికి మనసు మళ్ళింత. ఆరు నెలల్లో రెండవ సెటప్.
జారిపోతున్నాను. పడిపోతున్నాను. అథః పాతాళానికి కూరుకుపోతున్నానని తెలుస్తున్నా. కోలుకోవాలని కోరుకోలేని బలహీనతలు. ట్రాన్స్ ఫర్లు. మళ్ళీ కొత్త పచ్చని గడ్డి భూమి. మళ్ళీ మేత. కొత్త సంబంధాలు. కొత్త స్త్రీలు. కొత్త సెక్స్. కొత్త పరిచయాలు. అంతా గివ్ అండ్ టేక్. వ్యవహారాలు.
ఐదేళ్ళు కాగానే ప్రమోషన్. ఇన్స్పెక్టర్. మళ్ళీ కొత్త చోటు. ఇక కుటుంబం అక్కడే కరీం నగర్ లో. ఇద్దరు పిల్లలు. భార్యకు నగలు. చీరలు. ఇల్లు. కుక్కలు. బ్యాంక్ బ్యాలన్స్ లు. రక్షణకు ఓ కానిస్టేబుల్. విస్తృతమైన డిపార్ట్ మెంట్ సంబంధాలు. డీలింగ్స్ అన్నింటికీ. ప్రతి రాత్రీ పార్టీలు. మందు. తర్వాత మగువ. విందులు. పొందులు.
ఐతే. మొత్తమ్మీద ఓ రెండు సంవత్సరాలక్రితంనుండి. ఏదో ఒక రకమైన అపరాధభావన. లోపల ఏదో చెదలువంటి విధ్వంసక జీవులు కుప్పలు కుప్పలుగా చేరి. లోలోపలే తనను తినేస్తున్నట్టు. రోజు రోజూకూ తను ఖాళీగా. బోలుగా. శిథిలమైపోతున్నట్టు. చివరికి అసలు తన అస్తిత్వాన్నే కోల్పోతున్నట్టు. దుఃఖం. నిశ్శబ్ద దుఃఖం. మౌన దుఃఖం. భరించలేని. ఏ భాషకూ అందని. లొంగని. గాఢ దుఃఖం.
దుఃఖానికి ఒక రూపమూ. భాషా. వ్యక్తీకరణకు ఒక అభివ్యక్తీ. దుఃఖ లిపీ ఉంటాయా.
మళ్ళీ. ఆ అమ్మాయి జ్ఞాపకమొచ్చింది. . నిన్న రాత్రంతా. ఈ తన పోలీస్ స్టేషన్ లోని ఇంటరాగేషన్ గదిలో. ,
పేరు. పేరేమిటి. ఆ. ఆ. నిర్మల. నిర్మల. నిర్మలమైన ముఖం. నిర్మలమైన హృదయం. నిర్మలమైన మాట. నిర్మలమైన ఆలోచనలు.
ఎంత హింసో. పాపం బిడ్డపై. ఒక్క కుందేలు పిల్లపై వంద రేచుకుక్కలు దాడిచేసి మూకుమ్మడిగా కరిచినట్టు.
‘ఇంతకూ ఆ అమ్మాయి చేసిన పాపం. చేసిన ద్రోహం ఏమిటి. ‘
ఆలోచించడం. ఈ దేశం గురించి. కుళ్ళిపోతున్న ఈ సమాజం గురించీ. ఇక్కడి సర్వాన్నీ ఎక్కడో ఎవరికో ఎవరో తాకట్టు పెడుతున్న పాలకుల గురించీ. ఆలోచించడం.
‘ప్రజలను ఆలోచించనీయకూడదు. ఆలోచనాపరులెప్పటికైనా పాలకులకు శతృవులుగా మారి అధికార పీఠాలను కూలదోస్తారు వాళ్ళు. నిర్మూలించాలి. కూకటివ్రేళ్ళతోసహా ఆలోచించేవాళ్ళను పెకిలించివేసి ధ్వంసించాలి ‘
ఆలోచించడమే ఆమె చేసిన తప్పు.
రాత్రి. ఒక జీపులో నిర్మలను పది గంటలకు తన స్టేషన్ కు ముగ్గురు కోంబింగ్ స్క్వాడ్ డి ఎస్ పి లు తీసుకు రాగానే. లాకప్. మొదట. ఇంకో గంటలో. హైదరాబాద్ నుండి. ఓ ఎనిమిదిమంది బృందం. ఉన్నతస్థాయి. ఆక్టోపస్. బ్లాక్ యూనిఫాం.
లోపలికి తీసుకుపోయి. చేతులను వ్రేలాడదీసి బంధించి. ,
ఇద్దరుముగ్గురు తప్ప అందరూ కొత్తే. బయటివాళ్ళే. తనొక్కడే స్థానికుడు. ఒక గంట తర్వాత తన జిల్లా ఎస్ పి వచ్చాడు. ఆ ఒక్క గంటలోనే. అంతా ఐపోయింది.
” చెప్పు. మీ దళ నాయకుడెవ్వడు. మీ హై కమాండ్ ఉనికి ఎక్కడ. నీది ఏ ఊరు. ఐ ఐ టి చదివి నీకిదేమి దారే . లంజా. ఏ అమెరికాకో వెళ్ళి హాయిగా బతుకొచ్చుగదా. ” వంటి కోటి ప్రశ్నలు.
అందులో కొందరి చరిత్రలు తెలుసు తనకు. అందరూ దొంగలే. అందరిపైనా అవినీతి ఆరోపణలు బోలెడు. చీకటి ముఠాలతో ఏవేవో సంబంధాలు.
ఏ ఒక్కదానికీ ఆ బిడ్డ జవాబు చెప్పలేదు. నానా హింస. తెల్లని పాల కడ్డీలవంటి చేతి వ్రేళ్ళ గోళ్ళ లోకి. గుండు సూదులు కసుక్కున గుచ్చుతూంటే. విలవిల్లాడిపోయి. గిలగిలా తన్నుకుని
” అమ్మామ్మామ్మా. ” అని భూమి బ్రద్దలయ్యే కేక.
“దీని తండ్రి టీచరట. తల్లికూడా టీచరేనట. బుద్దిలేదు లంజా కొడుకులకు. పిల్లలకివే బోధిస్తున్నారా. ”
అలా అంటున్న పోలీసాఫీసర్ బిడ్డలిద్దరూ అమెరికాలో సెటిలై. హాయిగా. ,
ఒకడు చేతిలోని కర్రతో. కాళ్ళపై. అరి చేతులపై. చెప్పలేని ప్రైవేట్ ప్రాంతాలపై. దాడి. అందరి కళ్ళలో కసి. హింసించి పొందే పైశాచిక ఆనందం తాలూకు నవ్వులు. హాస్యాలు.
” ఏం . ఎంకౌంటర్ స్పెషలిస్ట్. ఏం చేద్దాం దీన్ని. ”
” లేజావ్ సాలీకో. కహీ అందర్ లేజాకే ఫారెస్ట్ మే ఖతం కరో. హం దేఖ్ లేంగే బాద్మే. ”
దెబ్బలు తినీ తినీ. సొమ్మసిల్లి. స్పృహ కోల్పోయి. అపస్మారకంగా. ,
ఆ క్షణం కూడా ఎంత దుఃఖమో. తనలో. ఎన్ని దహించుకుపోతున్న అడవులో లోపల. కాని ఏమిచేయగలిగాడు తను. వ్చ్. ఏమీ లేదు. ఒట్టి నిస్సహాయత. పై అధికారులకింద ఒక చిన్న పోలీస్ ఒక కుక్క. అంతే.
ఒక అరగంటలో. ఐదారు ఇన్నొవాల్లో ఇరవై మంది సాయుధ బృందం. అంతా నిశ్శబ్దం. ఒక్క యువతిని చంపేందుకు ఇంతమంది సామూహిక వ్యూహాత్మక కుట్ర.
ఆ క్షణమే తనకు తన ఎనిమిదేళ్ల కూతురు శృతి జ్ఞాపకమొచ్చింది. నిర్మలమైన ముఖం. శృతి. నిర్మల. ఇద్దరూ తెల్లగా. వెన్నెల బొమ్మలవలె.
బొమ్మలు పగులగొట్టబడ్తాయి. ముక్కలు చేయబడ్తాయి. ధ్వంసించబడ్తాయి.
తెల్లవారగట్ల నాలుగ్గంటలకు. వరుసగా. ఆరు వెహికిల్స్. లోపల స్పృహలేని నిర్మలను ఒక మాంసం ముద్దలా లోపలకు త్రోసి. బయల్దేరి. అతి వేగంగా దూసుకుపోయి. ,
తెలుసు తనకు తర్వాత ఏమౌతుందో.
‘ ప్రాతః సమయ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి ‘ అని వార్త.
పది గంటలప్పుడు. తను వెళ్ళాడు. జిల్లా అధికారులతో కలిసి. అప్పటికి అసలు స్క్వాడ్ వెళ్ళిపోయింది. ఎంకౌంటర్ అని చెప్పబడ్తున్న చోట. యుద్ధవాతావరణం. అంతా చిందరవందర.
కడుపులోకి ఐదారు బుల్లెట్లు దూసుకుపోయి. నిర్మల ముఖం చితికి. భరించలేని. వికృతి.
ఎందుకో తట్టుకోలేని దుఃఖం ముంచుకొస్తూ. ,
స్కిప్. స్కిప్ ఫ్రం దట్ ప్లేస్. ‘ఊండలేను. ఉండలేనక్కడ. ‘
పోలీస్ స్టేషన్ కు రాగానే. మరొక్క వార్త. నగరంలోని అరవై ఏడేళ్ళ మేధావి. పూర్వ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్. మానవ హక్కుల పరిరక్షకుడు. కరప్షన్ ఫ్రీ ఇండియా అధినేత. మొన్నటికి మొన్న ఏడు వందల కోట్ల రూపాయల ఇనుప ఖనిజ స్కాం గురించి కీలక పత్రాలతో సహా హైకోర్ట్ కు సమర్పించి రాష్ట్ర మంత్రినొకన్ని కటకటాల వెనక్కి పంపిన నిష్కల్మష నాయకుడు. అరవింద్ సామల. ను పదిగంటలకు. ఒంటరిగా నివసిస్తున్న ఆయన ఇంటికి. కొరియర్ బాయ్స్ గా మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు యువకులు. పిస్టల్ తో. ముఖంపై సూటిగా కాల్చి చంపి. ,
హింస. హింస. నిర్మలమైన మనసుతో. ఈ సమాజాన్ని శుభ్రం చేద్దామని ఉద్యమిస్తున్న నిష్కల్మష వ్యక్తులపై దాడి. హింస. ప్రతీకార హత్యలు. విశృంఖలత.
వెంటనే అక్కడికి పరుగు.
అరవింద్ సామల కూడా. తెల్లగా. కలువ పువ్వులా. సున్నితంగా గాజుబొమ్మలా.
“అరవై రెండు బుక్స్ రాశాడు సార్. ఎంత విలువైనవో. పాపం. ఈ దేశం. ” ఇంకా ఏమో అంటున్నాదు ఎవరో వృద్ధుడు తను పంచనామాకు వెళ్ళినప్పుడు. చటుక్కున తను తలెత్తి చూస్తే. డెబ్భై ఏళ్ళుంటాయేమో. స్వచ్ఛంగా మనిషి. నిర్మలంగా ముఖం. ఏ కల్మషమూ లేదు.
ఎదురుగా ముఖమంతా రక్తపు ముద్దై. అరవింద్ శవం. ,
‘ఏం పాపం చేశాడితడు ‘ అని ప్రశ్న. ఆత్మ వేస్తోంది.
వ్చ్. జవాబు లేదు.
ఒంటిపై ఖాకీ బట్టలు. సిగ్గు. సిగ్గు.
రాత్రి నిర్మల. అరచిన దుఃఖ భరితమైన అరుపులు. ఆక్రందనలు. ఏడ్పులు.
ప్రొద్దున బహిరంగ హత్య. ఒక మేధావిది.
ఐనా తనలో. నిన్నటినుండి. ఎందుకీ అవ్యక్త దుఃఖం. ఈ హంతకుల కుటుంబం లో ఒకడినైన తనలో. తనకే అర్థంకాని. ఈ పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్త కాంక్ష. ఏమిటిది.
లోపల భయంకరమైన అలజడి. కల్లోలం. తుఫాను.
మొన్నీమధ్య చదినిన ఫ్రాయిడ్ శిష్యుడు ఎరిక్ ఫ్రాం రాసిన ‘ట్రామిక్ బిహేవియర్ ‘. గురించి స్ఫురణ. ,
సున్నితమైన మనస్సుతో. మనిషి తనకు నచ్చని కార్యాలను జీవితకాలమంతా చేస్తూ పోతున్నకొద్దీ. ఒక గాయపడిన అవయవంతో పని చేస్తూంటే. లేక ఒక విరిగిన చేయితోనో. లేక కాలుతోనో. మొండిగా అలాగే పనిచేస్తూ పోతూంటే. ఎలాగైతే ఆ గాయం ఇంకా ఇంకా ముదిరి మృత్యుపర్యంత హానిని కలిగిస్తుందో. పరస్పర విరుద్ధ తత్వాలతో. వైరుధ్య అంతరంగంతో మనిషి ఒక మానసిక ‘ ట్రామా ‘ ను. లేక అఘాతాన్ని పొంది ఆ స్థితిని విస్మరిస్తూ కొనసాగుతాడో. ఆ వ్యక్తిలో. ఊహాతీతమైన రెప్రెషన్. దమనం తెలియకుండానే పెరిగి పెరిగి. భయంకరమైన ప్రవర్తనా విచ్ఛిన్నతకు కారకమౌతుంది. స్ప్లిట్. యునైట్. అగైన్ స్ప్లిట్. రీ యునైట్. అగైన్ స్ప్లిట్.
చివరికి. ఒక పెను తుఫాను. పెను కల్లోలం. పెను బీభత్సం. సంభవించి. ,
నరహరి ఉలిక్కిపడి. తీక్షణంగా చూశాడు చుట్టూ. ,
ఎదురుగా గడియారంలో. రెండూ ఇరవై నిముషాలు. టిక్. టిక్. టిక్. ముల్లు నడుస్తూనే ఉంది.
ఇటు ప్రక్క లాకప్ గది. నిన్న రాత్రి. నిర్మల. దాంట్లో. అరచి. ఏడ్చి. చిదుమబడి. శరీరం చితికి. నుజ్జునుజ్జై.
అడవిలో. రక్తసిక్త శరీరం. చిద్రమై. ,
ఈ రోజు. అరవింద్ సామల. సమాజాన్ని ప్రశ్నిస్తున్న పాపానికి. ముఖం చితికిపోయి. ,
తనచుట్టూ. అవినీతి. రక్షకులు తాము. ఎవరికి.
నిర్మల. ఐ ఐ టి. గోల్డ్ మెడల్. అరవింద్ సామల. యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి. ,
రెండు ముఖాలు. చితికి. రక్తాలోడ్తూ. ,
నరహరి. సూటిగా చూస్తున్నాడు. తన ఎదురుగా ఉన్న గేట్ దిక్కు. అక్కడంతా తెల్లగా మంచు తెర. బద్రూనాయక్ సెంట్రీ డ్యూటీలో ఉండాలి. కాని,
కనిపించట్లేదు. అంతా మసక మసక.
రెండు ముఖాలు. రక్తసిక్తమై. నిర్మల. తెల్లగా. మంచువలె. ప్రక్కనే. అరవింద్ సామల. ముఖం చితికి. రక్తసిక్తమై. తెల్లగా. మంచువలె.
రక్తంకూడా. మంచువలె. తెల్లగా. వెన్నెలవలె. నిర్మలంగా. స్వచ్ఛంగా. ఉంటుందా. ?
నరహరి. మెల్లగా వంగి. టేబుల్ పై ఉన్న తన బెరెట్టా రెవాల్వర్ ను చేతిలోకి తీసుకున్నాడు.
“ధన్” మని చప్పుడు. ఒకే ఒక తూటా ప్రేలి. ,
బయటినుండి. బద్రూనాయక్. లోపలికి తొంగి చూచి పరుగెత్తుకొచ్చాడు మెరుపులా. చేతిలో రైఫిల్ తో.
ఎదురుగా. నరహరి. సర్కిల్ ఇన్ స్పెక్టర్. కణతల్లో కాల్చుకుని. అంతా రక్తపు మడుగు. ఎర్రగా-

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *