March 28, 2024

దేవీ భాగవతం – 7

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి

6వ స్కంధము 20వ కథ
నహుషుని వృత్తాంతము

వృత్రాసురుని వధ అనంతరము ఇంద్రుడు అమరావతి చేరెను. దేవతలందరు ఇంద్రుని నీచకార్యములు దూషించసాగిరి.
త్వష్ట కుమారుని మరణవార్త విని దుఃఖించెను. కుమారునికి అంత్యక్రియలొనర్చి ‘‘ఇంద్రుడు భయంకర దుఃఖ మనుభవించుగాక! ఇది బ్రహ్మ రేఖ!’’ అని శాపమొసగి సుమేరు శిఖరము మీదకు వెళ్ళి తపమాచరించసాగెను.
ప్రతి ఒక్కరు తాము చేసిన పాప, పుణ్యకార్యములకు తప్పక ఫలమనుభవించెదరు. ఇంద్రుని తేజస్సు క్షీణించసాగెను. దేవతలందరూ అతనిని నిందించుచుండిరి. ఇంద్రద్యుమ్నుడు, యయాతి వంటి వారికి కీర్తి నశించెను. స్వర్గమునుండి వెడలగొట్ట బడిరి. బ్రహ్మ హత్యాపాతకము అతనిని వెన్నంటుచుండెను. ఏమియూ అతనికి సుఖము నిచ్చుట లేదు. అతడు మానస సరోవరము చేరెను. భయశోకములతో శక్తి క్షీణించెను. కమల నాళమున దాగికొనెను. చింతతో దుఃఖపడెను.
ఉపద్రవములు కల్గెను. మేఘములు వర్షించుట లేదు. ధాన్యము పండిరచే శక్తి భూమి కోల్పోయెను. నదులు ఎండినవి. అరాచకము నిండెను. దేవతలు, మునులు సంప్రదించుకొని, నహుషునికి ఇంద్రపదవి అప్పజెప్పిరి. ఆతడు ధర్మాత్ముడేగాని, ఇంద్రపదవి వచ్చాక రాజసవృత్తి ఆరంభమయ్యెను. ఇంద్రుని పత్ని శచీదేవి తనకు సేవ చేయాలని కోరెను.
దేవతలు ఈ విషయమును శచీదేవికి తెలుపగా ఆమె భయముతో బృహస్పతిని శరణు వేడెను. ఈ విషయము తెలిసి నహుషుడు బృహస్పతిని వధించెదనని పల్కసాగెను. దేవతలందరూ అతనికి నయవచనములు చెప్పసాగిరి. కాని అతడు పెడచెవిని పెట్టెను. వారి మాటలను వినలేదు. దేవతలందరూ బృహస్పతి వద్దకు వెళ్ళిరి. అతడు వారికి ఒక ఉపాయము చెప్పెను.
శచీదేవి తన భర్తను ఒకసారి చూచి రావలెనని, భర్త బతికి ఉండగా తాను నహుషుని ఎట్లు చేరెదనని అడగాలని చెప్పగా, ఆమె అట్లే నహుషుని చేరి ఆడిగెను. తన భర్త యగు యింద్రుడు జీవించి ఉన్నాడా లేదా యని నాకు సందేహము కలుగుచున్న దని ఆమె నుడివెను. నహుషుడు అందుకు అంగీకరించెను.
దేవతలందరూ శ్రీహరిని శరణు వేడిరి. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో అని కలత చెందిరి. ఇంద్రుడు, శచీదేవితో కూడి అశ్వమేధయజ్ఞము చేయాలని విష్ణువు చెప్పెను. ఆ యజ్ఞ ప్రభావమున పాపములు నశించి ఆతని పదవి మరల అతనికి లభించగలదని, ఆ యజ్ఞము సల్పి భగవతి జగదంబికను సంతుష్టిని చేయవలెను అని విష్ణువు చెప్పెను.
అపుడు దేవతలు శచీదేవితో సహా అందరూ ఇంద్రుడున్న స్థానమును చేరిరి. యజ్ఞమునకు సర్వము సంసిద్ధము చేయబడెను. యజ్ఞము సుసంపన్నమాయెను. శ్రీహరి అచటికి వచ్చెను. బ్రహ్మ హత్యను విభజించి, వృక్షముల మీద, నదుల మీద, పర్వతముల మీద స్త్రీలమీద విసిరివేసెను. ఇంద్రుడు పరిశుద్ధుడయ్యెను. మంచి సుదినం కోసం నిరీక్షిస్తూ జలమందే ఇంద్రుడు ఉండెను. బృహస్పతి సలహాపై శచీదేవి భగవతి పరాశక్తిని ఆరాధించెను. భోగములన్నిటినీ విడిచెను. దేవి ప్రకటితమయ్యెను. శచీదేవిని మానస సరోవరము వెళ్ళి తన అచలమూర్తి ‘‘విశ్వకామ’’ను పూజింపమనెను. శచీదేవి అట్లే చేసి తన పతిని మరల దర్శించెను. తన రహస్యప్రదేశమును ఆమె ఎట్లు తెలుసుకొనెనో అని ఇంద్రుడు ఆత్రుత పడెను. శచీదేవి సకల విషయములను వివరించెను.
ఇంద్రుని సలహాపై ‘‘మునులచే పల్లకీ మోయించి తనకడకు రమ్మని’’ శచీదేవి నహుషునకు కబురుపంపెను. దానితో ఆ కామాంధుడు అట్లే పల్లకిలో తనను మోసుకొని శచీదేవికడకు తీసుకుని వెళ్ళమని మునులను కోరెను. మునులందరూ అతని వక్రబుద్ధిని ఎరిగి ఉపాయముచే ఆతని కోరికను వ్యతిరేకించవలెనని ఆలోచించిరి.
అగస్త్యుడు గొప్పవాడు. తెలివిగలవాడు. అంగీకరించెను. మునులందరూ పల్లకీ మోయుచుండగా నహుషుడు ‘‘సర్ప, సర్ప’’ అనగా నడువుడు, నడువుడు అని పలుకుచుండెను. అహంకారముతో అగస్త్యముని మస్తకమును తన్నెను. పరమశ్రేష్టుడయిన అగస్త్యుని భార్య లోపాముద్ర. వాతాపి అను రాక్షసుని తెలివిగా భక్షించినవాడు. సముద్రమును ఔపోసన పట్టి తాగినవాడు. అతనిని నహుషుడు కొరడాతో కొట్టి హింసించెను. పదే పదే ‘‘సర్ప, సర్ప’’ అనుచుండెను. అగస్త్యుడు కోపించి, ‘‘ఓరీ నీచుడా! అడవిలో భయంకరమగు సర్పమై, ఆ సర్పయోని యందు అనేక వేల సంవత్సరమలు అపార దుఃఖమనుభవించుము. అడవిలో నుండుము. ధర్ముని అంశతో యుధిష్టిరుడు అను పుణ్యాత్మునితో నీకు కలయిక జరుగును. అతని నుండి వెలువడిన ప్రశ్నలకు సమాధానములు వినిన తరువాత నీవు ముక్తుడవగుదువు.’’
నహుషునకు సర్పరూపము వచ్చెను. స్వర్గమునుండి క్రింద పడెను. బృహస్పతి మరియు దేవతలు అందరూ మానససరోవరము వెళ్ళి, యింద్రుని ఊరడిరచి తిరిగి స్వర్గమునకు ఆహ్వానించిరి. యిట్లు ఇంద్రుడు మరల స్వర్గాధిపత్యమును పొందెను. భగవతి ప్రసాదంబున తమ స్థానమును పొందెను. ఎవరు ఎట్టి కర్మము చేయునో వారట్టి ఫలమును పొందెదరు. యిది అనివార్యము.

7వ స్కంధము 21 వ కథ
భగవతి నామ మహిమ

అధర్మపరాయణులైన మానవులు సంస్కరింపబడుటకు ఎట్టి ఉపాయము గలదని జనమేజయుడు ప్రశ్న వేయగా, వ్యాస మహర్షి ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలను, కర్మ ఫలములను అనుభవించుట, యుగధర్మము వివరించి, అనేక అధర్మ కార్యములను చేసిన మానవులు ఒకే ఒక్క ఉపాయము చేత ముక్తులగుదురని, జగదంబిక నామమును పలుకుటలో ఎంతో మహిమ ఉన్నదని యిట్లు అమ్మవారి మహిమను గూర్చి వివరించ సాగెను.
జగదంబ చరణకమలములను ధ్యానించవలెను. పాపములను భస్మము చేయుటకు భగవతి నామమునందు ఎంత శక్తి కలదో అన్ని పాపములు కూడా లేవు. లీలగా ఎవరి నోటి నుండైనను వివశతతో అమ్మ నామము ఉచ్ఛరించబడినచో, ఆ నామ ప్రభావమున ఏమేమి లభించునో వాటిని తెలుసుకొనుటకు రుద్రాది సర్వదేవతలుకూడా అసమర్థులగుదురు. ఆమె నామమును స్మరించుటయే సర్వపాపములకు ప్రాయశ్చిత్తము. కలిభయముచే భీతి చెందిన మానవులు ఏ పుణ్యక్షేత్రము నందైనను నివసించవలెను. నిరంతరము భగవతి నామమును చింతన చేయవలెను. సర్వప్రాణులు పదార్థముల నుండి విరక్తుడై ఈ ప్రపంచమునుండి ముక్తుడగును. భక్తితో అమ్మకు ప్రణామము చేసిన వారికి సకల పాపములు నశించును. సకల శాస్త్రములలోనూ దీనిని గూర్చి వర్ణించిరి. అజపాజపముగా ప్రసిద్ధి చెందిన గాయత్రీ మంత్రము జగదంబ నామమే. సకల మానవులు దీనిని జపింతురు. కానీ మాయా మోహితులైన కారణమున దీని విశిష్ట మహిమను అర్ధం చేసుకోలేరు. ఇది సాధారణ మంత్రమని జపించువారికి ముక్తి కలుగదు. బ్రాహ్మణుడు తన హృదయమున స్థలమునిడి ఈ మంత్రమును జపించును. కాని మహిమ నెరుగకుండుటచే ఇప్పటివరకు వారు ముక్తులు కానున్నారు. దీనికి మహామాయ ప్రభావ వైశిష్ట్యమే కారణము.

7వ స్కంధము 22 వ కథ
సకల తీర్థ రాజములు, క్షేత్రములు,
నదుల వృత్తాంతము

నదులు:`
నదులలో గంగానది అన్నిటికంటే శ్రేష్ఠమయినది. యమున, సరస్వతి, నర్మద, గండకి, సింధు, గోమతి, తమసా, కావేరీ, చంద్రభాగ, పుణ్య, నేత్రవతి, చర్మన్వతి, సరయూ, తాపీ, సాభ్రామణి నదులు పెద్దవి. చిన్న చిన్న నదులనేకములున్నవి. ఈ నదులలో సముద్రం వరకు చేరు నదులు అధిక పవిత్రములు అని అంగీకరించబడెను. సముద్రమువరకు వెళ్ళని నదులను అల్పపుణ్యములని చెప్పుదురు. సముద్రమును చేరు నదులలో అగాధమైన జలముతో సదా నిండియున్న నదులు అధిక పవిత్రములు. శ్రావణ, భాద్రపదములను ఈ రెండు నదులలో నదులన్నీ రజస్వలలగును. ఎందుకనగా వర్షాకాలమున గ్రామములలో ఉన్న కలుషిత జలములు ప్రవహించి ఆ నీరు ఆ నదులలోకి వెళ్ళును.

క్షేత్రములు:`
పుష్కరము, కురుక్షేత్రము, ధర్మారణ్యము పరమ పవిత్ర క్షేత్రములుగా విలసిల్లినవి. అట్లే మహిమా, ప్రభాస, ప్రయాగ, నైమిశారణ్యము, అర్బుదారణ్యము కూడా చెప్పాలి.
శ్రీశైలము, గంధమాదనము, సుమేరు పర్వతము ` ఇవి పుణ్యమును చేకూర్చు పర్వతములు.
సరోవరములలో మానస సరోవరము సర్వోత్కృష్టముగ చెప్పబడినది. బిందుసరము, అచ్చోదసరము కూడా పరమ పావనమని చెప్పుదురు. ఆత్మచింతనచేయు మునుల యొక్క ఆశ్రమములు ఈ సరోవరముల శోభలను పెంచును. బదరికాశ్రమము అత్యంత పవిత్ర స్థానము. సర్వప్రసిద్ధము. ఈ స్థానమున నరనారాయణులను పేరుగల మునులు కఠోర తపమాచరించిరి. వామనాశ్రమము, శతాయూపాశ్రమము కూడా ప్రసిద్ధమైనవి. ఆ మునులక్కడినుండి తపమాచరించిరి. అందువలన వారి పేర్లతో ఆ స్థలములు ప్రసిద్ధికెక్కెను. యిచట భగవతి మందిరములు నియమముగా దర్శించినచో ఆ తీర్థములు సకల పాపములను పెళ్ళగించి వేయును.

పుణ్యకర్మలు:`
తీర్థములు, తపములు, దానములు, ద్రవ్యశుద్ధి, క్రియా` శుద్ధి, మనస్సుద్ధి వీటిమీదనే ఆధారపడియుండును. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు అన్నియు తపస్సు, వ్రతములు, తీర్థయాత్రలకు ఆటంకమే. అహింస, మనసు పవిత్రముగా నుంచుకొనుట, దొంగతనము చేయకుండుట, ఇంద్రియములు వశమునందుంచుకొనుట అను ప్రవర్తనలు కలిగి ఉండాలి. ధర్మమును పాలించినతో దానివలన సకల తీర్థములు దర్శించిన ఫలమొస్తుంది. నిత్యకర్మలు పరిత్యజించుట, సంసర్గ దోషమువలన తీర్థయాత్ర నిష్ఫలమగును, పాపబంధనములో చిక్కుకొందురు. తీర్థములు దేహసంబంధమైన కల్మషము కడిగివేసి శుభ్రము చేయును. కాని మనోకల్మషములను తొలగించుటకు వాటియందు శక్తియుండదు. చిత్తశుద్ధి, గంగా మొదలైన నదులకంటె అధిక పవిత్రమనవచ్చును. చిత్తశుద్ధిని చేయు తీర్థము ప్రాప్తించుటకు జ్ఞానియైనవాడు సత్సంగము విశేషముగా చేయవలెను. వేదములు, శాస్త్రములు, వ్రతములు, చిత్తశుద్ధి తీర్థము ప్రాప్తించుట మిగుల కష్టం.
వశిష్టుడు బ్రహ్మకుమారుడు. వేదశాస్త్రములను అధ్యయనము చేసినవాడు. గంగా తీరమున ఉండేవాడు. అయినా విశ్వామిత్రునితో వానికి వైరభావముండెను. యిద్దరూ మహా ఋషులే. ఒకరికొకరు పరస్పరము శపించుకొనిరి. భయంకర యుద్ధము జరిగెను. బ్రహ్మ దేవగణములందరితో వచ్చి వారిరువురకు నచ్చజెప్పి వారిని యుద్ధమునుండి విరమింపజేసెను. బ్రహ్మ ఉపదేశప్రభావమున మరల ప్రేమభావముతో నుండిరి. యుద్ధమువలన వారిరువురకీ గొప్ప కష్టములను అనుభవింపవలసి వచ్చెను. శ్రేష్టమైన పురుషుల చిత్తములు కూడా పరిశుద్ధముగా నుండుట కష్టమని దీనివలన ఋజువగుచున్నది. శ్రద్ధకూడా సాత్త్విక, రాజస, తామసములను మూడు విధములు. సత్ఫలము లిచ్చు సాత్త్విక శ్రద్ధ లోకములో దుర్లభము. రాజస, తామసములే అధికముగా ఉండును. దానివలన ఏ ప్రయోజనము లేదు. అందుచే సత్సంగము వేదాంత శ్రవణాది ప్రభావములతో చిత్తమునందలి వాసనలను దూరము చేసుకొని తీర్థములందు నివసించు ఏర్పాట్లు చేసుకొనవలెను. అచటనుండి భగవతి జగదంబను నిరంతరము ఆరాధించవలెను. కలిదోషములలో భయభీతులై భగవతి నామమును సదా స్మరించాలి. ఆ తల్లి చరిత్రలను గానం చేయాలి. అప్పుడే మానవులకు ఈ భయంకర సంసారమనే బంధములనుండి ముక్తి లభించగలదు. జై భవాని.

6వ స్కంధము, 23వ కథ
జనకమహారాజు జన్మ వృత్తాంతము

క్షత్రియులు రాజ్యమేలుట, తాపసులు తపస్సు చేసుకొనుట యనునవి వారివారి ధర్మములు. రాజుల యందు, తాపసుల యందు క్రోధము మితిమీరుచుండెను.
భక్తియందు రాజసము, రాగద్వేషములు, డాంబికము చోటుచేసుకున్నచో అది సర్వనాశనమగును. ఇక్ష్వాకుల వంశములో ‘‘నిమి’’ అనే రాజు ఉండెడివాడు. సుందరుడు, ధర్మజ్ఞుడు, గుణవంతుడు, దానము, ధర్మములు చేయుట అతని నిత్య కృత్యము. ఇక్ష్వాకు వంశములో 12వ వాడు. గౌతమ ముని ఆశ్రమమునకు సమీపములో జయంత పురము అనే చోట ఆ రాజు నివసించుచుండెను. అతనికి బ్రాహ్మణులంటే ప్రీతి, యజ్ఞములంటే ప్రీతి. తన తండ్రి కోరిక ప్రకారము ఒక రాజస యజ్ఞము చేయాలని అనుకున్నాడు. కావలసిన సామగ్రిని సమకూర్చుకొనెను.
భృగువు, అంగీరసుడు, వామదేవుడు, గౌతముడు, వశిష్టుడు, పులస్త్యుడి, ఋచీకుడు, పులహుడు, క్రతువు మొదలైన ఋషులను పిలిచెను.
వశిష్టుని పూజించి యజ్ఞమును చేయదలచితినని, 5 సంవత్సరముల కాలము వరకు ఈ క్రతువు చేయాలని తెలిపెను. అందుకు వశిష్టుడు ‘‘రాజా! ఇంతకు ముందే ఇంద్రుడు తాను కూడా యజ్ఞము చేయదలచి నన్ను ఆహ్వానించెను. అతని క్రతువు పూర్తి అయిన పిమ్మటే నీ యజ్ఞమును ఆరంభించెదను అని మునీంద్రుడు వెళ్ళిపోయెను. వెంటనే నిమి గౌతముని పిలిచి హిమాలయపర్వతముల సమీపమున సముద్రతీరమున అనేక విప్రులను పిలిచి యజ్ఞమొనరించి దానధర్మములను గోవులను యిచ్చి సంతృప్తి పరచెను. 5 సంవత్సరముల తరువాత ఇంద్రుని యజ్ఞము పూర్తికాగానే వశిష్టుడు మరలి వచ్చెను.
కాని ఆ సమయములో చక్రవర్తి నిదురించుచుండెను. భటులు అతనిని లేపలేదు. అందుచే వశిష్టునికి అవమానము జరిగినట్లు అనిపించగా కోపముతో నేటినుండి నీవు దేహరహితుడవు కమ్ము అని శపించెను. ఈ విషయము సేవకులచే విన్న నిమి గురువువద్దకు వచ్చి అనేక విధముల మధురవచనములతో శాంతముగా వశిష్టుడు ఇంద్రయజ్ఞమునకు వెళ్ళుటచే తాను గౌతమునిచే క్రతువు చేయించితినని నుడివెను. సాక్షాత్తు బ్రహ్మ పుత్రులు, ధార్మికులు, బ్రాహ్మణులకు కోపము తగదు, అకారణముగా నాకు శాపము యిచ్చిరి. కావున కోపముతో నిండిన మీ శరీరము శీఘ్రముగా నశించును అని తిరిగి శాపము పెట్టెను.
యిరువురి చిత్తములు వ్యాకులితయ్యెను. వశిష్టుడు బ్రహ్మను చేరి శరణుజొచ్చెను. ఈ శరీరము నష్టమై వేరొక జన్మ ఎత్తవలెను. ఆ జన్మలో కూడా నాకు జ్ఞానము నష్టమవకుండా జ్ఞాపకము ఉండవలెనని బ్రహ్మను ప్రార్థించెను. ‘‘మహాతేజస్సంపన్నులైన మిత్రుడు, వరుణుడు అనే మునుల తేజములో నీవు ప్రవేశింపుము. ప్రశాంతిని పొందుము. సమయము చ్చినపుడు నీవు ప్రకటితమయ్యెదవు.’’ అని దీవించెను. తండ్రికి ప్రదక్షిణ చేసి వరుణుని అశ్రమమునకు వెళ్ళెను. స్థూలశరీరమును వదలి అతడు సూక్ష్మ రూపమున మిత్ర, వరుణుల దేహములో ప్రవేశించెను. అదే సమయమున ఊర్వశి యను సుందరి తన సఖులతో అచటికి రాగా ఆ ఋషులు ఆమెపై మోహము కల్గిన వారై ఆమెపై చిత్తము చలించి ఆమెను వరించుటకు సిద్ధపడిరి. అచటనే ఒక కుండ ఉండెను. ఊర్వశిని చూచిన మిత్రావరుణుల వీర్యము స్ఖలితమై ఆ కుండలో పడెను. దానినుండి అత్యంత సుందరులైన ఇద్దరు మునికుమారులు జన్మించిరి. వారే అగస్త్యుడు, వశిష్ఠుడు. అగస్త్యునికి కుంభసంభవుడని, వశిష్ఠునకు మైత్రావరుణుడని నామము కల్గెను. అగస్త్యునికి బాల్యమునుండే తపస్సునందు ఎనలేని ప్రేమచే అతడు వనములకు వెళ్ళిపోయెను. వశిష్టుడు ఇక్ష్వాకులకు రాజగురువుగా స్థిరపడెను.
నిమి చక్రవర్తి మరల శరీరము లభించలేదు. ముని శాపము ఇచ్చినపుడు రాజు యజ్ఞదీక్షుడై ఉండెను. బ్రాహ్మణులందరూ ధర్మాత్ముడైన నిమిని గూర్చి చింతించిరి. ఇంకా యజ్ఞము పూర్తికాలేదు. యితడు శాపముచే కాలిపోవుచున్నాడు అని తలచి అనేక మంత్రములను వారు చదువసాగిరి. నిమి శరీరమును సురక్షితముగా నుంచిరి. అతని శ్వాస ఆగలేదు. మంత్రశక్తిచేత నిర్వికారమైన ఆత్మ శరీరమునందు ప్రతిష్టితమై యుండెను. బ్రాహ్మణులు పలు రకాల పూలతో, చందనములతో ఆ ఆత్మను పూజించిరి. యజ్ఞము పూర్తి అయిన తరువాత యింద్రాది దేవతలు వచ్చిరి. వారు రాజుచేసిన యజ్ఞమునకు తృప్తులైరి. దేవశరీరము కావలెనా, మానవ శరీరము కావలెనా అని అతనిని కోరిరి. నిమి తనకు జనన మరణములు కల్గే ఈ శరీరముపై కోరికలేదని, సర్వభూతముల (ప్రాణులు) కన్నులపై వాయు రూపమును దాల్చి చరించవలెనని కోరుచున్నాను అని నిమి అడిగెను. అప్పుడు దేవతలు రాజును దేవి అంబిక, జగదంబికను ఆరాధించమని చెప్పిరి. ఆమె కృపవలన అతని కోరిక తీరునని చెప్పిరి. అతడు దివ్య స్తోత్రములద్వారా దేవిని స్తుతించి ప్రార్థించగా ఆ మహామాయ ప్రసన్నురాలై అతని ఎదుట సాక్షాత్కరించెను. సకలజ్ఞానము కల్గునట్లును, సకల ప్రాణుల నేత్రములందు నివశించునట్లు భాగ్యమిమ్మని కోరగా జగదంబ అతని కోరికను మన్నించెను. అతని ప్రారబ్దము పూర్తికాలేదని, అందుచే సకల ప్రాణుల నేత్రములందు వసింపమని, కనురెప్పలు మూయుట తెరచుట వాని ప్రభావమువలన జరుగునని, పక్షులు, పశువులు, మానవులు రెప్పవాల్చెడి వారని అందుకే వారిని ‘‘నిమిషులని’’, దేవతలు అందుకు భిన్నముగా ఉండుటచే వారిని ‘‘అనిమిషులని’’ చెప్పుదురని వరమొసగెను.
దేవి అదృశ్యమైన పిమ్మట మునులందరు సంప్రదించుకొని నష్టమగుచున్న నిమి స్థూల శరీరమును ఆరణితో మధించింరి. అగ్నిని వ్రేల్చి హవనము చేసిరి. ఆరణితో మధించగా నిమివంటి సర్వలక్షణ సంపన్నుడగు ఒక పుత్రుడక్కడ జన్మించెను. ఆరణిని మధించగా ఏర్పడుటచే ‘‘మిథి’’ యని, తన జనకుని దేహము నుండి పుట్టుటవలన ‘‘జనకుడని’’ నిమి దేహము లేనివాడగుటచే అతని కులమునందు ఉద్భవించిన వాడగుటచే ‘‘విదేహులు’’ అని పేర్లుకలిగెను.
యిట్లు నిమి శరీరము నుండి జనకుడు పుట్టెను. అతడు గంగా నదీ తీరమున అందమైన నగరము నిర్మించెను. అది మిథిలా నగరమని ప్రసిద్ధి పొందెను. ఆ వంశమందు పుట్టిన వారందరకూ జనకుడను ఉపాధి లభించెను. వారు పరమ జ్ఞానులు. విదేహులు అని కూడా పిలువబడిరి. శాపవశమున నిమి విదేహుడయ్యెను.

సశేషం

1 thought on “దేవీ భాగవతం – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *