March 29, 2024

వెంటాడే కథలు -5 , మాయా మకరి!

పునరుల్లేఖనం : చంద్రప్రతాప్ కంతేటి

నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

-చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు

మొదలియార్ గారు కోయంబత్తూర్ నుంచి వారణాసికి సకుటుంబంగా ప్రయాణం పెట్టుకున్నారు. కోయంబత్తూర్ లోని ఆగర్భ శ్రీమంతులలో ఒకరైన మొదలియార్, తన భార్య, కొడుకు, కోడలు, మరో బంధువే కాక సేవలందించడానికి ఇద్దరు సేవకులను కూడా వెంట తీసుకుని యాత్రకు బయలుదేరారు.
రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ చల్లగా హాయిగా సేద తీరుస్తోంది.
సేవకులు ఆరగా ఆరగా కాఫీలు, టీలు, పళ్ల రసాలతో పాటూ చిరుతిళ్ళు అందిస్తూ క్షణం తీరుబడి లేకుండా మొదలియార్ కుటుంబీకుల సేవలో తరిస్తున్నారు.
ప్రయాణం సాఫీగా సాగిపోతోంది.
కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు శ్రీలక్ష్మికి తమ గురించి తమ కుటుంబ మర్యాదలు, సంప్రదాయాలు, దర్జాలు, దానధర్మగుణాలు వగైరాలన్నీ ఊకదంపుడుగా ఏకరవు పెడుతూనే ఉన్నారు మొదలియార్.
రైలు బయలుదేరిన మరు నిముషం నుంచి మొదలైన ఈ ఆత్మస్తుతి, స్వీయ ఘనత, తన తెగువతో సాధారణ మధ్య తరగతి కుటుంబం కోట్లకు ఎలా పడగలెత్తింది.. పూసగుచ్చినట్టు వినిపిస్తూనే ఉన్నారాయన.
విరామం లేని ఈ స్వోత్కర్షను మిగిలిన వారంతా చిరునవ్వులు ముఖాలకు పూసుకుని ఎలాగో భరిస్తున్నారు.
కొత్త పెళ్లాంతో మాట్లాడుకోవడానికి మొదలియార్ కొడుక్కి అసలు సమయం దొరికితేగా?
కోడలి పరిస్థితీ అదే! కానీ చెప్పలేని నిస్సహాయ స్థితి!
”కాస్త ఆపుతారా? నేనో క్షణం రెప్పవాల్చుతా” అంటూ మొదలియార్ భార్య అలివేలు విసుక్కుంటూ ఆయన మాటలకు బ్రేక్ వేసి ఎదుటి బెర్తులో నడుం వాల్చింది.
ఆయనగారు భార్యను ఎగతాళిగా చూస్తూ ”నీకు పనేముంది? ఎంతసేపూ పడకే గదా? అయినా నేను చెబుతున్నది నా కోడలికి” అన్నారు చిరుకోపంగా.
”అంకుల్ బాత్ రూంకి వెళ్లి వస్తా. ” అంటూ భర్తకు సైగచేసి లేచింది కోడలు శ్రీలక్ష్మి.
ఆమె వెనుకే నడిచాడు కొడుకు మురుగన్!
మొదలియార్ నోరు మూతపడింది..
సీటుకు చేరబడి కొడుకు కోడలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. వయసుతోపాటు ఆయనకు ఈ అతి భాషణ ప్రియత్వం అనే దురలవాటు అలవడింది. ఎంతసేపూ స్టేటస్, రిచ్ లుక్, హై క్లాస్ అంటూ అందరినీ ఊదర గొట్టేస్తుంటాడు. పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మొదలియార్ రకరకాల వ్యాపారాలు చేసి చివరికి నగల వ్యాపారంలో స్థిరపడ్డాడు. కాలంతో పాటూ అదృష్టం కూడా కలిసి రావడంలో అనతికాలంలోనే ఆయన కోట్లకు పడగలెత్తాడు. తన ఘనత చాటుకోవాలని ఆయన తరచూ తాపత్రయ పడుతుంటాడు.
ఎలాగైతేనేం? రెండురోజుల తర్వాత వారణాసిలో దిగింది మొదలియార్ కుటుంబం.
కాశీలో అతి ఖరీదైన హోటల్లో గదులు బుక్ చేసుకుని అక్కడికి చేరుకున్నారు. గంగానది వ్యూ కనబడేలా గదులు ఎంపిక చేసుకున్నారు.
యువ దంపతులకు ఒక గది, మొదలియార్ దంపతులకు ఒక గది, దూరపు బంధువు మరియు సేవకులకు కలిపి ఒక గది ఏర్పాటు చేశారు హోటల్ వాళ్ళు.
పదివేళ్ళకు ఖరీదైన రాళ్లు పొదిగిన ఉంగరాలతో మెడలో జర్రిపోతు అంత వజ్ర వైఢూర్యాలు తాపడం చేసిన గొలుసులతో మొదలియార్ గారు, ఇంచుమించు అదే స్థాయి ఆభరణాలతో దిగిన వారి కుటుంబ సభ్యుల్ని చూసి హోటల్ వాళ్ళ కళ్ళు చెదిరిపోయాయి. సాక్షాత్తూ కుబేరుడే తమ హోటల్ ను పావనం చేశాడా అనుకున్నారు. అందుకే ‘జీ హుజూర్’ అంటూ సేవలందించడానికి మూడు గదుల దగ్గరా ఒక్కో మనిషిని నియమించింది యాజమాన్యం.
మొదలియార్ ఆజ్ఞ మేరకు కాశీ పట్నంలో గొప్ప పండితుడైన కైలాసనాథ భట్ట సిద్ధాంతిని పిలిపించి ఆయన ముందు నిలబెట్టింది హోటల్ యాజమాన్యం.
ఆయనతోపాటు వారి శిష్యులు హరిహరనాథ భట్ట, ఈశ్వర భట్ట కూడా వేంచేశారు. తొలుత గంగా పూజ, పితృ తర్పణాలు, అనంతరం కాశీ విశ్వనాథుడి దర్శనం వంటివి మంత్ర పూర్వకంగా జరిపిస్తామని విన్నవించాడు కైలాస నాథ భట్ట. అందుకు కావాల్సిన సరంజామా తదితర ఏర్పాట్లు తమ శిష్య ద్వయం చూస్తారని భరోసా ఇచ్చాడు.
వాళ్ళు అడిగిన అడ్వాన్స్ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపాడు మొదలియార్.

* * *

నిర్మానుష్యంగా ఉన్న ఘాట్ దగ్గరకు మర్నాడు ఉదయం టాక్సీలో చేరుకుంది మొదలియార్ కుటుంబం.
వారిని చూసి నవ్వుతూ ఎదురు వచ్చాడు కైలాసనాథ భట్ట.
”శుభోదయం మొదలియార్ గారూ! సాధారణంగా మీలాంటి వి వి ఐ పి లను మాత్రమే ఈ ఘాటుకు తీసుకువస్తాం. గంగమ్మ ఇక్కడ కలుషిత రహితంగా ప్రవహిస్తుంది.. అలగా జనాల గోల మచ్చుకు కూడా కానరాదు..” అంటూ పూజకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు కైలాసనాథ భట్ట. శిష్యులు ఆయనకు సహకరిస్తున్నారు.
మొదలియార్ కుటుంబానికి ఆ చోటు బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. గంగాజలం కూడా చాలా తేటగా ఉంది.
మొదలియార్ దంపతులను కూర్చోమని పూజతంతు పూర్తిచేసి ఇద్దరినీ సాలంకృత వస్త్రాభరణ సహితంగా నదిలో దిగి మూడు మునకలు వేసి రమ్మన్నాడు భట్ట. గంగమ్మ మన ఒంటిమీద ఆభరణాలను స్పృశిస్తే బతికున్నంత కాలం లక్ష్మీ కటాక్షమే అని కూడా వారికి చెప్పాడు.
”మెట్లు దిగేవేళ జాగ్రత్త కేవలం భుజాల లోతు వరకూ మాత్రమే వెళ్ళండి. అక్కడ కట్టిన ఇనుప గొలుసులు ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దు” అని ఆ దంపతులకు సలహా ఇచ్చి శిష్యులను వారికి సాయంగా పంపాడు.
ఎలాగైతేనేం? మొదలియార్ దంపతులు మూడు మునకలు వేసి ఒడ్డుకు చేరారు.
ఈసారి యువ జంట పూజకు కూర్చుంది.
శ్రీలక్ష్మి అందంతో ఆభరణాల మిలమిలలు పోటీపడుతున్నాయి.
మురుగనే కుందనపు బొమ్మలా వజ్రవైఢూర్యాలతో మెరిసిపోతున్న తన భార్య అందచందాలను చూసి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు.
శిష్యులదీ అదే పరిస్థితి. వారి దృష్టి మంత్రాల మీద కన్నా ఆ జవ్వని అందచందాల మీదికే పరుగులు తీస్తోంది. మనసును కట్టడి చేయడం వారికి అతి కష్టంగా ఉంది.
కైలాస భట్ట ఎలాగైతేనేం పూజలో తుది అంకానికి చేరుకున్నాడు.
యువ జంటను కూడా గంగలో మూడు మునకలు వేసి రమ్మని చెప్పాడు. వృద్ధ జంటకు చెప్పినట్టే వీరికి కూడా పలు జాగ్రత్తలు చెప్పాడు. శిష్యులను తోడు పంపబోతే స్త్రీ సహజ సిగ్గు బిడియంతో కోడలు, సాధారణంగా యువకులకు ఉండే తెగువతో మురుగన్ అక్కర్లేదన్నారు.
శ్రీలక్ష్మి, మురుగన్ ఇద్దరూ భుజాలలోతు దాకా వెళ్లి ముక్కు మూసుకుని మూడు మునకలు వేశారు.
మురుగన్ మూడో మునక వేసి పైకి లేచాడు కానీ..
శ్రీలక్ష్మి లేవలేదు.
మురుగన్ కు భయం వేసింది.
కైలాసనాథ భట్టతో కబుర్లాడుతున్న తండ్రిని గట్టిగా కేకేశాడు కొడుకు.
అప్పుడందరూ నది వంక చూశారు.
మురుగన్ పిచ్చిన పట్టినవాడల్లే ఏడుస్తూ నీళ్లలో మునుగుతూ తేలుతూ భార్యను వెదుకుతున్నాడు.
శిష్యులు ఇద్దరూ ఆందోళనతో నదిలో దూకారు.
మొదలియార్ చేష్టలుడిగి బొమ్మలా నిల్చుండి పోయాడు.
అలివేలు శోకానికి అంతులేదు.
ఆ కన్నీళ్లతో గంగమ్మ వరద మరింత పెరుగుతుందా అన్నంతగా ఉంది ఆమె రోదన.
కైలాస భట్ట శిష్యులు నిట్టూరుస్తూ ఉత్తిచేతులతో ఒడ్డుకు చేరారు.
మురుగన్ మాత్రం పిచ్చెక్కినవాడల్లే నదిలోనే నిలిచి చేతులతో నీళ్లను ఇష్టం వచ్చినట్టు కొడుతూ తిడుతూ రోదిస్తున్నాడు. వెలికి రమ్మంటే రావడం లేదు.. ”లక్ష్మి.. లక్ష్మీ ” అంటూ వెక్కుతున్నాడు. అతని కన్నీరు గంగలో కలిసి మరింత వడిగా ప్రవహిస్తోంది.
భట్ట శిష్యులను – మొదలియార్ వచ్చిన టాక్సీలో వెళ్లి పోలీసులను, గజ ఈతగాళ్లను తోడ్కురమ్మని ఆదేశించాడు.
వాళ్ళు అటు వెళ్ళగానే-
నదిలో ఒక పడవ వస్తూ కనిపించింది. పడవవాణ్ని ఒడ్డుకు పిల్చాడు భట్ట.
శ్రీలక్మి మాయమైన సంగతి అతడికి చెప్పాడు.
”ఈ ఏరియాలో రెండు మొసళ్ళు తిరుగుతున్నాయి సామీ.. మొన్న మా పడవవాళ్ళు చెప్పుకుంటుంటే ఇన్నాను” అన్నాడతను నదీ ప్రవాహం వంక విచారంగా చూస్తూ.
ఆ మాటలు వినడంతోనే మొదలియార్ దంపతుల గుండె జారింది.
కోడలితో పాటు కొడుకును కూడా కోల్పోతామేమోనని బేజారెత్తిపోయారు.
భట్ట, పడవవాడి సాయంతో మురుగన్ను ఎలాగోలా బలవంతంగా ఒడ్డుకు లాక్కొచ్చి కూలేశాడు.
తల్లి తండ్రి కొడుకు ముగ్గురూ ఒకళ్ళను పట్టుకుని ఒకళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసులు, ఈతగాళ్లు వచ్చి నది మొత్తం గాలించారు. కనీసం శ్రీలక్ష్మి మృతదేహం కూడా కనబడలేదు.
”ఇక్కడ నది వడి బాగుంది. శవం దిగువకు వేగంగా కొట్టుకుపోయి ఉండొచ్చు.. రెండు మూడు రోజుల్లో ఏ చెట్టుకో తగులుకుని బయట పడుతుంది” అన్నారు పోలీసులు.
ఈతగాళ్లు కూడా అదే అన్నారు.
తమకు రావాల్సిన పైసలు తీసుకుని వాళ్ళు వెళ్లిపోయారు.
ఆ వెనుకే భట్ట, వారి శిష్య బృందం నిష్క్రమించింది.
పుట్టెడు దుఃఖంతో కొండంత ఆవేదనతో ముగ్గురూ హోటల్ కు చేరారు.
ఉదయమంతా కళకళలాడిన ముఖాలు వాడిపోయాయి.
ఎవరిని పలకరించబోయినా ఉప్పెనలా దుఃఖం పొంగుకొస్తోంది. ఎవరికి వారు తమ గదుల్లో అచేతనంగా మంచాలపై పడున్నారు.
అంతా పెనువిషాదం.. అందరికీ మునిగిపోయిన శ్రీలక్ష్మి కళకళలాడే ముఖమే కళ్ళ ముందు కదలాడుతూ దుఃఖ స్థాయిని పెంచుతోంది. హోటల్ సిబ్బంది, యాజమాన్యం కూడా వారి పరిస్థితికి చాలా బాధ పడ్డారు.
అయితే ఎవ్వరు మాత్రం ఎం చేయగలరు?

* * *

రాత్రి 11 గంటలు !
అలల్ని చీల్చుకుంటూ గంగానదిలో నెమ్మదిగా ఒక పడవ ప్రయాణిస్తోంది. అందులో లాంతరు పెట్టుకుని తలపై ముసుగు కప్పుకుని ఒక ఆకారం కూర్చొని ఉంది. ఆకాశంలో చంద్రుడు మందంగా వెన్నెల కురిపిస్తున్నాడు.
దూరంగా ఒక చిన్న దీపం మినుకు మినుకు మంటూ వెలుగుతూ కనిపిస్తోంది.
మెల్లగా ఆ సమీపానికి చేరింది పడవ.
పడవ దిగి ఇసుకలో ఓ ఫర్లాంగు దూరం నడిచి ఓ గుడిసెని చేరింది ముసుగు కప్పుకున్న ఆకారం..
చిన్న కిరసనాయిలు బుడ్డి దీపం.. ఆ గుడిసెలో కారుచీకటిని తరమడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది ..
గుడిసెలో ఓ నులక మంచం.. దానిపై ఓ ఆడ ఆకారం!
గుడిసె ముందు తాపీగా చుట్ట తాగుతున్నాడు ఓ ఫహిల్వాన్ లాంటి మనిషి.
గుడిసెలో మరో మనిషి ఎవరో మంచం వద్ద తచ్చాడుతున్నాడు.
ముసుగు ఆకారం దగ్గరకు రాగానే –
”రండి రండి పండాజీ. ” అంటూ లేచి ఆహ్వానించాడు పహిల్వాన్.
”ఏం రాంసింగ్. పనంతా సజావుగానే జరిగిందా?” అడిగాడు ముసుగు తీసిన అతను.
అతనెవరో కాదు కైలాసనాథ భట్ట!
”.. సబ్ ఠీక్ హై” అన్నాడు రాంసింగ్.
ఇద్దరూ గుడిసెలోకి వెళ్లారు.
అక్కడ రాక్షసుడిని పోలిన భైరవ ఉన్నాడు. ఒంటి కన్ను, ఎత్తు పళ్ళు, కండలు తిరిగిన భారీ శరీరం..
”నమస్తే పండిట్ జీ” అన్నాడతను వికారంగా నవ్వుతూ.
”సబ్ ఠీక్ హైనా భైరవ్?” అన్నాడు భట్ట చిరునవ్వుతో.
”బహుత్ బహుత్ ఖుష్ హై సాబ్” అంటూ మంచం వైపు చూశాడతను.
అతని కళ్ళలో క్రూరత్వం మోహం జమిలిగా తాండవించడం చూసి మనసులోనే అసహ్యించుకున్నాడు భట్ట.
మంచం మీద శ్రీలక్ష్మి నగ్నశరీరం..
పుత్తడి బొమ్మలాంటి ఆ యువతి దేహం కమిలిపోయింది. ఒళ్ళంతా రక్కుళ్ళు, కొరుకుళ్లు..
భట్టకు ఆమెను అలా చూసేసరికి బాధ కలిగింది..
”కనీసం ఏదైనా లుంగీనో, చీరనో కప్పొచ్చు గదా? ప్రాణం లేని శరీరానికి కూడా మర్యాద ఇవ్వాలయ్యా” అన్నాడు కాస్త కోపంగా.
”ఏడున్నాయి సామీ.. లుంగీలు చీరలు? నీళ్ల కింద నుంచి కాళ్ళు పట్టుకుని ఈయమ్మిని ఈడ్చుకు వస్తుంటే బట్టలన్నీ కొట్టుకుపోయాయి. ఈడకొచ్చేసరికి పానమే పోయింది.. ఇంకా నయం నగలు కొట్టుకు పోలా?” అన్నాడు భైరవ ఇకిలిస్తూ.
”సరే మీరెలాగయినా చావండి.. నా వాటా నగలు నాకివ్వండి నే పోవాల” అన్నాడు భట్ట కాస్త అసహనంగా.
”అట్నే సామీ” అంటూ మూడు తులాల గొలుసు తెచ్చి భట్ట చేతిలో పడేసి ”పో సామీ” అన్నాడు భైరవ.
తన చేతిలో పడేసిన గొలుసు చూసి రగిలిపోయాడు భట్ట.
“ఏం తమాషాలు చేస్తున్నారా మీరిద్దరూ?” అరిచాడు.
”తమాషా ఏముంది సామీ? నీ వాటా అడిగినవ్ ఇస్తిని” అన్నాడు భైరవ నెమ్మదిగా.
”స్నానానికి దిగే ముందు ఆ పిల్ల ఒంటిమీద నూరు తులాల బంగారం ఉన్నది. నాకు బాగా తెలుసు.. అందులో యాభై తులాల బంగారం నాకు రావాలి.. మర్యాదగా తీసివ్వండి” గట్టిగా అన్నాడు భట్ట.
”నిజమే సామీ. ఏ పనిలో అయినా కట్టాన్ని బట్టి వాటాలుంటాయి.. ఇందుట్లో నీ కట్టం ఏంటి సామీ? ఒడ్డున కూర్చుని పుసపుసా మంత్రాలు చదవడమే గదా?” అన్నాడు భైరవ వ్యంగ్యంగా.
”హోటల్ కు వెళ్లి వాళ్ళను తీసుకుని వచ్చి, ఏకాంతంగా ఉన్న స్నానాల రేవులో మనం అనుకున్న కాడ నిలబెట్టి, పూజలు చేయించి ఇంత చేస్తే నా కష్టం ఏంటని అడుగుతున్నావా?” గొంతు పెంచాడు భట్ట.
”నిజమే సామీ. అది నీ కట్టమే! మరి అందాకా నీటి అడుగున నక్కి, ఎవరికీ అనుమానం రాకుండా మైలు దూరం ఈయమ్మి కాళ్లు పట్టుకుని నీటి వాలుకు ఎదురు లాక్కురావడం కట్టం కాదా సామీ?.. ఎరా రాంసింగ్ మనది కట్టం గాదా? ఒక్క అయ్యోరిదే కట్టమా?” రాంసింగ్ ను వాదులాటలోకి లాగాడు భైరవ.
”రంభలాంటి పిల్ల. చివరికి చచ్చిన దాని మానాన్నికూడా దోచుకున్నావు గదరా నికృష్టుడా?”
”బతికున్న మడిసికన్నా శవంతో సెక్సు నా కిట్టం సామీ. కావాలంటే నువ్వూ ఓ పట్టు పట్టు.. ఎవరొద్దన్నారు?” ఎగతాళిగా అన్నాడు భైరవ.
కోపంతో మండిపోవడంతో భట్ట నోటినుంచి మాటలు వెంటనే వెలికి రాలేదు.
”అవును సామీ మీరు రేవులో మధ్యాన్నం దాకానే ఉండినారు. మరి మేమో రేత్రి ఈ లంక మీద గుడిసె ఏసుకుని సలిలో కూసున్నాం. తెల్లారాక ఈ పనంతా చేసినాం.. మళ్ళా రేత్రి అయింది. అయినా ఈడ్నే ఉన్నాం.. మా కట్టం ఎక్కువే గదా? అందులో మేమిద్దరం.. మాయి రెండు వాటాలు” అన్నాడు రాంసింగ్.
భైరవ కాస్త గట్టిగా బెదిరించినట్టు అన్నాడు.
”పంతులోరూ.. ఆఖరి మాట సెబుతున్నా.. మర్యాదగా నీకిచ్చింది తీసుకుపో.. లేకుంటే నేను మంచోణ్ని కాను”
భట్ట కూడా తగ్గదలచుకోలేదు.
”అలాగా సరే కానీ.. రేపే పోలీస్ స్టేషన్ కు పోయి నీ అఘాయిత్యాల గురించి కంప్లైంట్ చేస్తాను. నాకు శిక్ష పడ్డా సరే.. నిన్ను వదలను” అంటూ చివాలున లేచి తనొచ్చిన పడవ వైపు విసురుగా నడక సాగించాడు.
అంతలో అనూహ్యంగా రాంసింగ్ అతనిని వెనుకనుంచి వడిసి పట్టుకున్నాడు.
భట్ట చేతిలోని దుప్పటిని విసురుగా లాగి తాడులా చుట్టి దానితోనే అతని మెడకు ఉరిబిగించాడు భైరవ. విలవిలా కాసేపు కొట్టుకున్న భట్ట ప్రాణాలు కాసేపట్లోనే అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
భట్ట దేహాన్ని భైరవ, శ్రీలక్ష్మి శవాన్ని రాంసింగ్ భుజాలమీద వేసుకుని తీరాన్నే నడుచుకుంటూ రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడ నదిలో ‘నిమజ్జనం’ చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు.
రెండు మూడు రోజుల తర్వాత ఉబ్బిపోయి గుర్తుపట్ట లేకుండా చేపలు కొరికేసి కుళ్ళిన రెండు దేహాలు నదీ పరివాహక ప్రాంతంలో తేలాయి. ఇది మొసళ్ల పనే అని అందరూ అనుకున్నారు.
ఆ తర్వాత నుంచి ఆ రేవు వైపు ఎవరూ దాదాపు కన్నెత్తి కూడా చూడలేదు.

-:0000:-

నా విశ్లేషణ: నాకు గుర్తున్నంత వరకూ ఇది ఒక తమిళ కథ. సాధారణంగా పుణ్య క్షేత్రాలకు సంబంధించి జనం నాణానికి ఒక వైపే చూస్తారు. వాటికి రెండో వైపు చీకటి కోణమూ లేకపోలేదు. ఆ కోణాన్ని స్పృశిస్తూ రాసిన కథ ఇది. ఇలాంటి ఘటనలకు కారణం కేవలం ఈ కథలో చూపించిన మనుషులు ఒక్కరే కాదు. మొదలియార్ లాంటి వ్యక్తులు కూడా! తన వైభవాన్ని చాటుకోవాలనే తపనే అతని కుటుంబానికి పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ కథ సుమారు పాతిక ముఫై ఏళ్ల నాటిది. అప్పుడే ఈ ‘వైభవ ప్రదర్శనా కండూతి’ ఈ తీరులో ఉంటే ఇప్పుడు అది వేయి రెట్లు మనుషుల్లో పెరిగింది. ఈ కండూతి మంచివాణ్ణి కూడా చెడ్డ మార్గం వైపు నడిపించడానికి చోదకం అవుతుంది. అప్పటి వరకూ చెడ్డ ఆలోచనలు రాని వ్యక్తులలో కూడా విచక్షణ కోల్పోయే పరిస్థితి కల్పిస్తుంది. అదలా ఉంచితే భైరవకు ఆడది కావాలి.. అది శవమైనా పర్వాలేదు.. అతని ఆనందానికి లోటుండదు. ఆ రెంటితోపాటూ డబ్బూ కావాలి. భట్ట, రాంసింగ్ లకు డబ్బులు కావాలి. అవి ఏ మార్గంలో వచ్చినా ఫికర్లేదు. ఎవరికి ప్రాణహాని కలిగినా బాధలేదు. దైవ సన్నిధిలో ఉన్నవాడినైనా శవం సన్నిధిలో ఉన్నవాడినైనా నేడు డబ్బే నడిపిస్తుంది. ఇక పైన కూడా నడిపిస్తుంది.
డబ్బే సమాజ చోదకశక్తిగా మనుగడ సాగించినంత కాలం ఇలాంటి అరాచకాలు సాగుతూనే ఉంటాయి.

-చంద్ర ప్రతాప్ కంతేటి
24-01-2022

28 thoughts on “వెంటాడే కథలు -5 , మాయా మకరి!

  1. కథ మామూలుగానే ఉన్న కథ చెప్పిన తర్వాత మీరు విశ్లేషించిన తీరు బావుంది.పాత్రల లక్షణాలను ముఖ్యంగా మొదలియర్ గురించి ఆరంభంలో చెప్పింది బావుంది.

  2. కాశీ నగర నేపథ్యంలో వచ్చిన కధ ఇదే మొదటి సారి చదవడం. కాకపోతే కధను కేవలం ‘సినిమా ఫక్కీలో’నడిపించారు. కాశీ లో జరిగే మోసాలు చాలా కాలంగా వింటూ న్నాము. కధను కొసమెరుపుతో రచయిత ముగింపు ఇస్తారు అని ఉహించుకున్నాను. కానీ విషాదాంతం భాధకరం. కొన్ని చోట్ల వర్ణన లు అనవసరంగా ఉన్నాయి. అభ్యంతరకరంగాను ఉన్నాయి.

  3. చంద్రప్రతాప్ గారు మాలిక అంతర్జాల మాసపత్రికలో నడుపుతున్న శీర్షిక “వెంటాడే కథలు” లో వచ్చిన ఐదవ కథ “మాయా మకరి”. సుమారుగా పాతిక ముఫై ఏళ్ల క్రితం చదివిన కథని పునరుల్లేఖనంలో మనం మూడు బాగాల్లో చదువుతాం. ప్రతి బాగం చివరికచ్చేసరికి మంచి సినిమాని ఇంటర్వెల్ కి ముందు చూపే సస్పెన్స్ కథనంలో కనపడి ఇంకేం జరగబోతుందో అన్న ఉత్సుకతని పాఠకుల్లో కలగచేస్తుంది. నాకైతే ఈ పునరుల్లేఖించిన కథని చదువుతుంటే సాదత్ హాసన్ మంటో రాసిన కొన్ని కథలు గుర్తుకొచ్చాయి. ఆయన కథలు కొన్ని ఊహించని రీతిలో మలుపుతిరిగి పాఠకుణ్ణి షాక్ చేస్తాయి. మాయా మకరి కూడా ఇలాగే ఉంది. శ్రీ లక్ష్మి సహజ అందాలు, ఆ అందాల్ని మరింతపెంచే నగలు మనుషుల్లో ఎలాటి అలజడులు రేపి అతి క్రూరతిక్రూరమైన పైశాచిక పనులుచేయించాయో ఒక్క సారే పాఠకుడికి హై వోల్టేజ్ షాక్ ఇస్తుంది. అందుకే ఈ కథ చంద్రప్రతాప్ గారిని వెంటాడినట్టుగా పాఠకుల్ని వెంటాడుతూనే ఉంటుంది.

    నాకు పునరుల్లేఖనంలో నచ్చిన మరో విషయం పాత్రల పేర్లు. మూడు రకాల పేర్లు చదువుతాం. తమిళనాడుకు చెందినవి, ఉత్తర భారత దేశానికి చెందినవి: తీర్తయాత్రలకి వచ్చిన తమిళ సంస్కృతికి చెందినవి (మొదలియార్, అళివేలు, శ్రీ లక్ష్మి, మురుగన్), కాశీలో పూజలు చేసే పండితులవి (కైలాసనాత భట్ట, హరినాథ భట్ట, ఈశ్వర భట్ట), అక్కడే నేరాలే వృత్తిగా మలచుకొన్న ఇద్దరు (రాంసింగ్, భైరవ్) మనుషులవి. కథల్ని రాస్తున్నపుడు పెర్లని పెట్టడం రచయితలకి ఒక సవాలు. అందులో మూడు భిన్న రకాల పేర్లని పెట్టడం కథకి నిండుతనం వచ్చింది. ఇతరులు ఈ పాటికే స్పందించినట్టుగా, ఇది ఒర్జినల్ కథ రాసినట్టుగా అనిపిస్తుంది. చంద్రప్రతాప్ గారు ప్రస్తావించిన “వైభవ ప్రదర్శనా కండూతి” మన చుట్టూతా బాగా పెరిగిపోతుంది. రచయిత విశ్లేషణలో రాసినట్టుగా “ఇలాంటి ఘటనలకు కారణం కేవలం ఈ కథలో చూపించిన మనుషులు ఒక్కరే కాదు. మొదలియార్ లాంటి వ్యక్తులు కూడా! తన వైభవాన్ని చాటుకోవాలనే తపనే అతని కుటుంబానికి పెను విషాదాన్ని మిగిల్చింది.” ఈ సంస్కృతి ఎంతవరకు పోతుందో, ఎలా మనల్నిముందుముందు ప్రభావితం చేస్తుందో చూస్తూ వెలదాం.
    ఇకపోతే తీర్థప్రదేశాలవద్ద మోసాలు ఎప్పుడే జరిగేవే! వైవిధ్యభరిత మోసాలు. కథ చదువుతుంటే నాకు ‘ఇంద్ర’ సినిమా అనుకొంటాను – అది గురుతుకొచ్చింది. అందులో పూజకోసం వాడిన అవునే పదేపదే కొత్తగా అమ్ముతూ పూజలు చేయించేవారినుండి డబ్బుల్ని దోచుకొంటారు. మాయా మకరిలో కూడా అలాటి అమాయకపు వాసనలు కనబడతాయి.
    నాకు ఈ పునరుల్లేఖన ప్రక్రియ బాగా నచ్చింది. ఇది ఇతర రచయితలనీ, పాఠకులని ప్రేరేపిస్తుందని నాకనిపిస్తుంది. అంటే ముందుముందు మంచి కథల్ని చదివే రోజులొస్తున్నాయన్నమాటే!
    టి. సంపత్ కుమార్, నిర్మల్.

    1. సంపత్ కుమార్ గారు మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది. వివరంగా
      అన్నీ చర్చించారు. దాంతో సమగ్రత సమకూరింది. ధన్య వాదాలు.

    2. చంద్ర ప్రతాప్ గారికి ధన్యవాదాలు. ఓ చక్కటి తమిళ కథను మన అందరికీ అందించారు.
      కథ బాగుంది, ప్రధానంగా సార్ విశ్లేషణ చాలా బాగుంది.
      దక్షిణ భారతదేశానికి చెందిన బ్రాహ్మణ పండితులలో నేరప్రవృత్తి చాలా అరుదుగా ఉంటుంది.
      అయితే ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిలో నేరప్రవృత్తి అధికంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి .
      యూపీలో ఉన్న అన్ని సామాజిక వర్గాల లో మాదిరిగానే ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం లో కూడా రౌడీలు ,గూండాలు, క్రిమినల్స్ అధికంగా ఉన్నట్టు విమర్శలు ఉన్నాయి.

      దక్షిణ భారతదేశం లోని బ్రాహ్మణ పండితులు కిల్లి నమలడానికి, పొగ
      తాగడానికి జంకుతారు.
      మద్యం జోలికి అయితే పోనీ పోరు.

      “కాశీ “లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో దురలవాట్లకు బానిసలైన వారు ప్రత్యేక ఆధ్యాత్మిక పూజలు నిర్వహించడం అక్కడ సర్వ సాధారణం.
      ఇది గత 20 ఏళ్ల క్రితమే నేను ప్రత్యక్షంగా గమనించాను. భక్తుల బలహీనతలని ,సెంటిమెంట్లను అక్కడి కొందరు బ్రాహ్మణ పూజారులు ఆసరా చేసుకుని దోచుకుంటారు.

      1. ధన్య వాదాలు రామ్కుమార్ .. మంచి విశ్లేషణ చేసేవు. ధన్యవాదాలు

    1. ధన్యవాదాలు సింహప్రసాద్ గారు. వందలాది కథలు నవలలు రాసిన మీ మెప్పు ప్రపంచ కప్పుతో సమానం

    1. బుచ్చిరాజు గారు నమస్కారం. కథపై మీ స్పందన చాలా బాగుంది ధన్యవాదాలు.
      మీరు ఎలా ఉన్నారు కులాసానా ?

  4. సర్.. కథ…ఆద్యంతం చదివించేలా ఉంది. ఇది re construction లా లేదు. మీరే స్వయంగా రాసినట్లు ఉంది.

  5. కథ అసాంతం చదివించేలా ఉండటమే కాకుండా, కసమెరుపు విషయంతో హృదయం కదిలేటట్టు ఉంది…ఏది ఏమైనా గుర్తుండిపోయే మంచి కథ

    1. చాలా బాగా రాశారు కృష్ణారావు గారు ధన్యవాదాలు

  6. Ammo chaduvuthunte chala bhayamesindi kani idi chadivina tarvatha kontha mandi ina jagratta padataru
    Story rayatam bavundi Sir

  7. కధ చాలా బాగుంది.
    ఎంతోమందికి ఉపయోగ పడుతుంది.

    కధనం చాలా బాగుంది, కధ లోని పాత్రలు కళ్ళేదురే ఉన్నట్టు అనిపించింది.

    ఒక యాక్షన్ సినిమా చూసినట్టు అనిపించింది.

    ఈ కధ ఎంతో మందికి కనువిప్పు అవుతుంది, కాపాడుతుంది.

    రచయితకు అభినందనలు…… వందనాలు

    1. రాకేష్ గారు చాలా బాగా రాశారు వివరంగా రాశారు మీకు విశేష కృతజ్ఞతలు

  8. ఈ కథ నిజ సంఘటన ఆధారంగా వ్రాసినట్లు అనిపించింది. చదివిన తర్వాత చాలా బాధ కలిగింది. నిజంగానే మనిషిని, మనసుని వెంటాడే కథ.

  9. ఇది నిజ సంఘటన ఆధారంగా వ్రాసినట్లు అనిపించింది. చదివిన తర్వాత చాలా బాధేసింది.

  10. కధ కదనం రెండు బావున్నాయి…ఇడి నిజంగా జరిగిన సంఘటన లా ఉంది…యిటువంటి సంఘటనలు నార్త్ లో అక్కడక్కడా జరుగుతాయని విన్నాను..! CP గారి విశ్లేషణ చాలా బావుంది…

Leave a Reply to Simhaprasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *