April 24, 2024

సాఫ్ట్‌వేర్ కధలు – తిరగమోత

రచన: కంభంపాటి రవీంద్ర

ఏంటో మూడేళ్ళ నుంచీ అదే కంపెనీలో పనిచేస్తున్నా, ఆ రోజు మటుకు రామరాజుకి చాలా కొత్తగా ఉంది. అసలు ఇంతకాలం తను పనిచేసింది ఈ కంపెనీ లోనేనా అనిపించింది కూడా.
అంత వింతగా ఉందా ప్రాజెక్ట్ వాతావరణం అతనికి ! టీంలో అందరూ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే భయపడి చస్తున్నారు. ఫ్లోర్ లో ఎక్కడా ఓ నవ్వు లేదు, టీమ్ అందరూ కాస్త గట్టిగా మాట్లాడ్డానికే భయపడిపోతున్నారు.
ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే ముందు, ఇద్దరు ముగ్గురు స్నేహితులు చెప్పేరు. “కొంచెం జాగ్రత్త. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ హేమతో పని చెయ్యడం అంటే అంత ఈజీకాదు. ఆవిడకి మనిషి మీద ఒక ఇంప్రెషన్ పడిందంటే, అంత ఈజీగా పోదు. అదే మనసులో పెట్టుకుని పీక్కుతింటుంది.”. తనెలాగూ కష్టపడి పని చేస్తాడు. అలాంటిది తనకి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు, అనుకుని ధైర్యంగా ఆవిడ ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నాడు.
రామరాజు వెళ్ళి, హేమని పరిచయం చేసుకున్నాడు. అసలు తనేం మాట్లాడిందీ ఆవిడ పట్టించుకోలేదు, “వెళ్ళి రఘుని కలువు. ఏం చెయ్యాలో చెబుతాడు” అందావిడ కంప్యూటర్ లోంచి తలెత్తకుండా.
రఘు అనే ఆ ప్రాజెక్ట్ లీడర్ ని కలిస్తే, ప్రాజెక్ట్ గురించి రెండు లైన్లు చెప్పి, “క్లయింట్ నుంచి నీ మీద ఏ కంప్లైంట్ రాకూడదు. టైం కి కోడ్ డెలివర్ చెయ్యాలి” అనేసి నువ్వెళ్లొచ్చు అన్నట్టు చూసేడు.
రామరాజు తన కంప్యూటర్ దగ్గిర కూచున్నాక, పక్క సీట్లో ఉన్న శైలజ చెప్పింది, “కొంతకాలం పడుతుంది ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. చాలా చిన్న ఏజ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యేననే గర్వం హేమకి. అందుకే టీం మెంబర్స్ ని లైట్ తీసుకుంటుంది”.
పదిన్నర అవుతూంటే కాఫీ తాగుదామని లేచేడు. అలా ఫ్లోర్ దాటి కాంటీన్ వేపు వెళ్ళే దారిలో హేమ ఎదురుపడింది.
“ఏంటి? అప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నావా ?” అడిగింది.
“క్యాంటీన్ కి. కాఫీ తాగుదామని” తడబడుతూ చెప్పేడు.
ఓసారి ఎగాదిగా చూసి వెళ్లిపోయిందావిడ!
ప్రాజెక్ట్ లో చేరిన మూడో రోజున, టీం మీటింగ్ జరిగింది. అందరూ కూచున్నారు, రఘు ప్రాజెక్ట్ స్టేటస్ చెప్పడం మొదలెట్టేడు. అతన్ని ఆగమని సైగ చేసి, “రామరాజు వచ్చేడా ? లేక కాఫీ తాగడానికి క్యాంటీన్ కి వెళ్లేడా ?” చుట్టూ చూస్తూ అడిగింది హేమ.
ఒకరిద్దరు మెల్లగా నవ్వేరు, రామరాజు చెప్పేడు, “నేను మీటింగ్ లోనే ఉన్నాను.”
హేమ పట్టించుకోకుండా, ఇంకో ఇద్దరు టీం మెంబర్స్ మీద సెటైర్లేసి, ప్రాజెక్ట్ రివ్యూలోకి దిగింది.
రోజులు గడుస్తున్నాయి, దాదాపు రోజూ ఇదే తంతు. ఏదో పాయింట్ పట్టుకుని, టీమ్ మీద ఎగరడం, ఏ పాయింటూ దొరక్కపోతే, ఏదో పాత విషయం పట్టుకుని వేళాకోళం చెయ్యడం! ప్రాజెక్ట్ టైం ప్రకారం నడుస్తూంది, క్లయింట్ దగ్గర మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి, ఎవరూ హేమ ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయేవారు.
రోజులు గడుస్తున్నాయి.
ఓ రోజు రామరాజు శుభలేఖలు పట్టుకుని వచ్చేడు. టీమ్ లీడర్ రఘు దగ్గరికి వెళ్ళి, కార్డ్ ఇచ్చి చెప్పేడు, “పెళ్ళి కుదిరింది. రెండు వారాల శెలవు, కావాలి.”
“నాకేం తెలీదు. వెళ్ళి మేడమ్ దగ్గర పర్మిషన్ తీసుకో” అని రఘు చేతులు దులిపేసుకున్నాడు.
హేమ కొంచెం ఖాళీగా ఉన్న టైం చూసుకుని వెళ్ళి, తన పెళ్ళి కార్డు ఇచ్చి చెప్పేడు రామరాజు, “వచ్చే నెల నా పెళ్ళి. నాకు రెండు వారాలు లీవ్ కావాలి.”
“ఏమిటి. నీక్కూడా పెళ్ళా? పాపం ఎవరా అమ్మాయి?” అందా హేమ కార్డు వేపు చూస్తూ.
రామరాజు మాట్లాడలేదు.
“రెండు వారాలు కుదరదు. మూడు రోజులు ఇస్తాను. అంతకన్నా కుదరదు” నిష్కర్షగా చెప్పింది హేమ.
“మరీ మూడు రోజులంటే కష్టం. ప్లీజ్. కనీసం పదిరోజులైనా కావాలి” రిక్వెస్ట్ చేసేడు రామరాజు.
“కుదరదు. అంతకన్నా కష్టమైతే పెళ్ళి మానెయ్యి. లేదూ. పెళ్ళే కావాలి అనుకుంటే ఉద్యోగం మానెయ్” అంది హేమ ఆ పెళ్ళి కార్డుని డెస్క్ మీద పడేసి!
చేసేదేం లేక, “థ్యాంక్ యూ మేడం” అనేసి వెళ్ళిపోయేడు రామరాజు.
పెళ్ళైన వెంటనే రాలేకపోయినా, ఏమైతే అయిందిలే అని వారం రోజులు శెలవు తీసుకుని ఆఫీసుకి వచ్చేడు రామరాజు.
తన డెస్క్ దగ్గర కూచుని, లాగిన్ అవుదామంటే కుదర్లేదు. ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చిందా అని చూస్తూంటే, పక్కనుంచి వెళ్తున్న రఘు వచ్చేడు. “ఓహ్. వచ్చేవా. ఇంక ఆఫీస్ కి రావనుకుని, నీ యాక్సెస్ తీయించేసేరు” అంటూ వెళ్ళిపోయేడు.
వెళ్ళి హేమని కలుద్దామనుకుంటే, ఆవిడ పట్టించుకోకుండా, “చాలా బిజీ, ఇప్పుడు కాదు” అనేసింది.
ఆ రోజంతా అలా ఖాళీగా కూచున్నాడు, ప్రాజెక్ట్ లో మిగతా టీం మెంబర్స్ ముందు అలా ఖాళీగా కూచోడం చాలా నామోషీగా అనిపించింది.
తర్వాత రెండు రోజులూ కూడా అదే తంతు. ఆ తర్వాత రోజు వెళ్ళి హేమ డెస్క్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు, కాస్సేపు నుంచున్న తర్వాత ఆవిడ అంది, “నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు అర్ధమైంది కదా. టెంపొరరీ గా నీకు యాక్సెస్ ఇప్పిస్తాను. అపాలజీ లెటర్ రాసి మెయిల్ చెయ్యి, నేను కన్విన్స్ అయితే, నిన్ను మళ్ళీ ప్రాజెక్ట్ లోకి తీసుకుంటాను”
సరేనని, రామరాజు వెళ్ళి రాసి, మళ్ళీ హేమ దగ్గరికి వచ్చి నుంచున్నాడు.
“పంపేవా?”
“పంపేను.”
హేమ తన మెయిల్ చూసుకుంది. “ఇదేమిటి? అపాలజీ రాయమంటే, రిజిగ్నేషన్ ఇచ్చేవు?”
రామరాజు మాట్లాడలేదు.
“ఇక్కడి నుంచి బయటకి వెళ్తే, నీకు ఉద్యోగం దొరుకుతుందనుకున్నావా ?. నీ రిలీవింగ్ లెటర్లో బ్యాడ్ ఫీడ్బాక్ ఇచ్చేనంటే, ఈ దేశం లోని ఏ ఐటీ కంపెనీలోనీ నీకు ఉద్యోగం దొరకదు.”
రామరాజు మాట్లాడలేదు.
“సరే. నీ ఖర్మ. నీ రిజిగ్నేషన్ ప్రాసెస్ చెయ్యమని హెచ్చార్ కి చెబుతాను”
రామరాజు వెళ్ళిపోయేడు.
హేమ తన మాట మీద నిలబడి, రామరాజు కి చాలా చెత్త ఫీడ్బాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఏ కంపెనీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు.

*****

కొన్నేళ్ళకి హేమకి ప్రమోషన్ వచ్చి, కంపెనీలో సీనియర్ మేనేజర్ అయ్యింది.
సిటీబ్యాంక్ వాళ్ళతో పెద్ద కాంట్రాక్ట్, నువ్వు వెళ్ళి మాట్లాడితే తప్ప కుదరదు. అంటూ కంపెనీవాళ్ళు పంపిస్తే, సింగపూర్ వెళ్ళింది. సిటీబ్యాంక్ లో ఆ కాంట్రాక్టు తాలూకు ఛీఫ్ ఆర్కిటెక్ట్ తో డిస్కషన్ చాలా బాగా అయ్యింది. కాకపోతే ఒకటే కండిషన్ పెట్టాడతను. ఈ ప్రాజెక్ట్ జరిగినంతకాలం దాని బాధ్యత పూర్తిగా హేమదే, హేమ అతనికి డైరెక్ట్ గా రిపోర్ట్ చెయ్యాలి !
సరేనని ముభావంగా ఒప్పుకున్న హేమ ఇండియా వచ్చిన వెంటనే, వాళ్ళాయనతో చెప్పింది, “ఒకప్పుడు నా కింద పని చేసిన ఆ రామరాజుకి నేను రిపోర్ట్ చెయ్యలేను. ఈ ఉద్యోగానికి రేపే రిజైన్ చేసేస్తాను.”

*****

1 thought on “సాఫ్ట్‌వేర్ కధలు – తిరగమోత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *