March 29, 2024

అమ్మమ్మ – 33

రచన: గిరిజ పీసపాటి

పరిస్థితులు ఇలా ఉండగానే పెద్ద పండుగ అని పిల్చుకునే ముచ్చటైన మూడురోజుల పండుగ వచ్చింది. భోగీ పండుగ రోజు ఉదయాన్నే ‘ఢిల్లీ’ అని అందరూ పిలుచుకునే ‘లక్ష్మణరావు’ అనే అబ్బాయి వేరేవాళ్ళ ద్వారా పెదబాబు ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే విషయం తెలిసి వీళ్ళింటికి వచ్చాడు.
నాగ వాళ్ళు వైజాగ్ లో కాపురం పెట్టిన కొత్తల్లో చెంగల్రావు పేటలో వీళ్ళు అద్దెకుండే ఇంట్లోనే మరో వాటాలో అద్దెకుండేవారు ఢిల్లీ వాళ్ళు.
ఢిల్లీ అమ్మానాన్నలను నాగ ‘పిన్ని, బాబాయ్’ అని పిలిచేది. దాంతో ఢిల్లీ నాగను ‘అక్కా’ అని పెదబాబుని ‘బావా’ అని పిలుస్తూ, ఎక్కువ సమయం వీళ్ళ ఇంట్లోనే ఉండేవాడు.
వీళ్ళు సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా కూడా వెళ్తూ ఇంట్లో మనిషిలా ఉండేవాడు. నాగ ఏది వండినా “నాకూ పెట్టక్కా” అని అడిగి మరీ తినేవాడు. దాంతో తోడబుట్టిన అన్నదమ్ములు లేని నాగ కూడా ఢిల్లీ ని సొంత తమ్ముడిలాగే చూసుకునేది. ఢిల్లీకి అక్క, అన్నయ్య ఉన్నా వాళ్ళు ఢిల్లీ లాగా చనువుగా రారు.
పెదబాబు పనిచేసే స్కూల్ లోనే టెన్త్ వరకు చదువుకున్నాడు ఢిల్లీ. ఆ తరువాత చదువు అబ్బక, ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుని, ఆ పని చేసుకుని కొంత సంపాదించుకుంటున్నాడు. అప్పుడప్పుడూ వీళ్ళింటికి వస్తూ పోతూ ఉంటాడు.
నాగ ద్వారా ఆరోజు జరిగిన విషయాన్ని తెలుసుకుని చాలా బాధ పడి “అసలు కుష్టన్నయ్య నీకు నిజమే చెప్పాడని నమ్మకం ఏంటక్కా? పెదబావకి ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేదు. బావ ఖచ్చితంగా రాముడువలస లోనే ఉండి ఉంటాడు. మామ (పీసపాటి తాత) లేడని చెప్పమని ఉంటారు. అందుకే నీకు బావ అక్కడ లేడని చెప్పాడు కుష్టన్నయ్య” అన్నాడు.
ఆ మాట విన్న వసంత కలుగజేసుకుని “నిజమేనమ్మా! తాత ఏం చెప్పమంటే కుష్టమామ అదే చెప్తారు. ఆయనను కాదనే ధైర్యం ఈయనకు లేదు. ఢిల్లీ మామ చెప్పిందే నిజమనిపిస్తోంది నాకు కూడా” అంది.
వీళ్ళిద్దరి మాటలూ విని ఆలోచనలో పడిన నాగ లోపలి గదిలోకి వెళ్ళి ఐదు నిముషాలో తిరిగొచ్చి “తమ్మూ! నాకోసం నువ్వొక పని చేస్తావా!” అంది ఢిల్లీతో.
“ఏంటో చెప్పక్కా. తప్పకుండా చేస్తాను” అన్నాడు ఢిల్లీ నమ్మకంగా.
“నువ్వొకసారి రాముడువలస వెళ్ళొస్తావా? కుష్టన్నయ్య వాళ్ళకి బంధువు కనుక పెద్దాయన మీద గౌరవంతో నాకు అబద్ధం చెప్పి ఉండొచ్చు. కానీ నీకా అవసరం లేదు కదా!” అంది.
“వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదక్కా. కానీ…” అని ఇంకా ఏదో అనబోతున్న ఢిల్లీ చేతిలో ఛార్జీలకు సరిపడా డబ్బు ఉంచి “నాకు తెలుసురా. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఆలోచించే మనిషివి కాదని. వీలు చూసుకుని వెళ్ళు” అంది.
“రేపు ఉదయమే వెళ్తానక్కా. రాగానే నీకు ఏ విషయం చెప్తాను” అన్నాడు వెళ్ళడానికి లేస్తూ.
“పండుగ రోజు ఇంట్లో ఉండకపోతే పిన్ని, బాబాయి నొచ్చుకుంటారేమోరా. పండుగ అయ్యాక వెళ్ళు” అంది నాగ.
“నువ్వింత కష్టంలో ఉంటే అమ్మా నాన్న మాత్రం కాదని ఎలా అంటారక్కా. రేపు ఉదయాన్నే వెళ్ళి రాత్రికల్లా వచ్చి నీకే విషయం చెప్తానక్కా. నువ్వు ధైర్యంగా ఉండు” అని వెళిపోయాడు.
వెళ్ళిన మర్నాటి రాత్రి తొమ్మది గంటల సమయంలో తిరిగి వచ్చిన ఢిల్లీకి ఎదురెళుతూ “రా మామా! ఊరెళ్ళి వచ్చావా” అనడిగింది వసంత.
“ఇప్పుడే బస్సు దిగి డైరెక్టుగా ఇక్కడికే వస్తున్నాను. అమ్మేదీ?” అడిగాడు వసంతని.
ఇంతలో ఢిల్లీ గొంతు వినబడి లోపలి గదిలోంచి వచ్చిన నాగ, వసంతతో “ముందు మామకి మంచినిళ్ళు ఇవ్వు వసంతా!” అని ఢిల్లీ మంచినీళ్ళు తాగేవరకు ఆగింది.
మంచినీళ్ళు తాగేక “నీకు చెప్పినట్లే ఉదయం ఫస్ట్ బస్సుకి బయలుదేరి వెళ్ళానక్కా. బావ అక్కడ లేడు. మామ చాలా కోపంగా ఉన్నాడు. బావ ఎవరికో శ్రీకాకుళం రైలు పట్టాల దగ్గర కనబడ్డాడట”
‘ఆత్మహత్య చేసుకోవడానికి కాకపోతే వాడు రైలు పట్టాల దగ్గర ఎందుకు కనబడ్డాడు? వాడిని వెతకడానికి మనుషులను పంపించాను. వాడు ప్రాణాలతో దొరికాడా సరే! లేకపోతే మీ అక్క అంతు చూస్తానని చెప్పు. నిన్ను పంపించింది ఎవరో నాకు తెలియదనుకున్నావా?”
‘ఇంత జరిగితే అదొచ్చి ఒక్క మాటైనా నాకు చెప్పొద్దా? అదక్కడ ఊళ్ళేలుతూ బిజీగా ఉందా? నిన్నెందుకు పంపింది? అసలెలా బతుకుదామనుకుంటోంది? అది, దాని ఆడపిల్లలు బిజినెస్ పెట్టి సంపాదించుకుంటారా?’ అని నానా మాటలూ అన్నాడక్కా” అన్న ఢిల్లీ మాటలకు తల్లి, పిల్లలు నిశ్చేష్టులై ఉండిపోయారు.
ముందుగా తెప్పరిల్లిన నాగ “నేను కుష్టన్నయ్యతో చెప్తూనే ఉన్నానురా! కానీ వెళ్ళొద్దని అన్నయ్య నన్ను ఆపేసాడు. అసలు అన్నయ్య మాట విని ఆగిపోయి తప్పు చేసాను. రేపే పిల్లల్ని తీసుకుని బయలుదేరతాను” అంది నాగ ఏడుస్తూ.
“నిజంగా ఆ రోజే వెళ్ళి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదక్కా! ఇప్పుడు బావ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నాడనే నమ్మకంతో ఉన్నారు మామ. ఇప్పుడు వెళ్ళావంటే నిన్ను, పిల్లల్ని ఏం చేస్తాడోనని భయంగా ఉంది.”
“ఇక్కడైతే పట్నం కనుక ఆయన మీ జోలికి రారు. ఆ ఊరిలో ఆయనేం చేసినా అడిగేవాళ్ళు కూడా లేరు. ఆలోచించు” అని నాని వంక తిరిగి “పుట్టిన రోజు శుభాకాంక్షలు రా మామా” అన్నాడు నానితో.
“థాంక్యూ మామా!” అని బదులిచ్చిన నానితో “నీ పుట్టిన రోజని మీ పెద్దక్క నీకిష్టమైన బొబ్బట్లు చేసే ఉంటుందే! అన్నీ నువ్వే తినేసావా లేక నాకో రెండైనా ఉంచావా!” అన్నాడు చనువుగా.
నాని సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. దాంతో “పాపా! వీడేం మాట్లాడడం లేదంటే మొత్తం తినేసే ఉంటాడు. సరేలే నాకు ప్రాప్తం లేదనుకుంటాను” అన్నాడు వసంతతో.
వసంత కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ముఖం పక్కకి తిప్పుకుంది. లౌక్యం తెలియని గిరిజ ఏడుస్తూ ” నిన్నటి నుండి మేమసలు వంటే చేసుకోలేదు మామా!” అనేసింది.
“అదేమిటి? పండుగ, పైగా నాని పుట్టిన రోజు. ఏమీ వండుకోకపోవడమేమిటక్కా?” అన్నాడు ఢిల్లీ నాగని మందలిస్తున్నట్లు.
“నిన్నటి నుండి మీ బావ గుర్తొస్తున్నారురా! ఆయన ఉన్నన్నాళ్ళూ అందరం పండుగకి రెండు రోజుల ముందే రాముడువలస వెళ్ళేవాళ్ళం. మీ చిన్న బావ కుటుంబం, చిన్న, ఆనంద్ అందరూ వచ్చేవారు. అందరం కలిసి సరదాగా పండుగ శలవులు గడిపి వచ్చేవాళ్ళం”.
“ఈ సంవత్సరం మీ బావ మాతో లేరు. అసలాయన జాడే తెలియడం లేదు. నిన్నటి నుండి ఇదే బాధలో ఉన్నాం. దాంతో పొయ్యిలో పిల్లి లేవలేదు. ఈరోజు నవ్వొచ్చి, ఆయన ఊర్లోనే ఉన్నారంటావని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. చివరికి అదీ కొండెక్కింది. అయినా మాకు ఆకలి తెలియట్లేదురా” అంది ఏడుస్తూ.
“ఛఛ. బావ వెళ్లిపోయినంత మాత్రాన మీరు తిండి మానేస్తే ఎలా అక్కా?” అంటూ “పాపా! లేచి అన్నం వండు. కనీసం మజ్జిగ అన్నాలైనా తినండి. పండుగ పూట పస్తు ఉండకూడదు” అని వసంతకి చెప్పి, మళ్ళీ నాగతో “ఇప్పటికే ఆలస్యం అయిందక్కా. నేను వెళ్ళొస్తాను” అని వెళ్లిపోయాడు.
“చేయని తప్పుకు ఈ శిక్ష ఏమిటి భగవంతుడా! అసలాయన ఆత్మహత్య చేసుకున్నారంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఎక్కడున్నారో? అసలు తింటున్నారో లేదో” అంటూ ఏడవసాగింది నాగ. తల్లిని ఓదారుస్తూ తాము కూడా ఏడవసాగారు పిల్లలు ముగ్గురూ.
ఆ మర్నాడు కూడా ఇంట్లో వంట లేదు. కానీ అన్నపూర్ణమ్మ గారు వీరిని చూసి బాధపడి, ఇంట్లో వండుకున్న చేగొడిలు, జంతికలు, గారెలు, పెరుగు గారెలు తెచ్చి ఇచ్చి, వీళ్ళు తినం అన్నా వినకుండా బలవంతంగా తినిపించి గానీ వెళ్ళలేదు.
పెదబాబు జాడ తెలియక, అసలు బతికున్నాడో లేదోననే బెంగతో, కళ తప్పిన ముఖాలతో, బతికున్న శవాల్లా తయారయ్యారు తల్లీ, పిల్లలు.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *