April 16, 2024

ఇదీ పరిష్కారం !

రచన: ముక్కమల్ల ధరిత్రీ దేవి

” సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్? ”
లాంగ్ బెల్ అయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ ఉన్న దుర్గకు క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల వాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అట్నుంచి కదల్లేదు.
” ఏమిటి సౌమ్యా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్? ఆర్ యు ఓకే? ” తనే లోనికెళ్లి సౌమ్య భుజం మీద చేయి వేసి కుదిపింది దుర్గ.
లేచి నిలబడి, బ్యాగ్ తగిలించుకుంటూ, “ఆ, ఓకే పద” అంటూ కదిలింది సౌమ్య.
కానీ దుర్గకు ఎందుకో సౌమ్య మామూలుగా లేదనిపించింది. బాగా ఏడ్చినట్లు మొహమంతా అదోలా ఉంది. మరీ బలవంతం చేస్తే బాగోదని దుర్గ తనతో కలిసి బయటకు దారి తీసింది.
అదో గవర్నమెంటు బాలికల జూనియర్ కళాశాల. రెండంతస్తుల పాత భవనం. అందులో దుర్గ, సౌమ్య సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. దుర్గ హెచ్. ఈ. సి గ్రూప్, సౌమ్య బైపీసీ గ్రూపు. ఇద్దరూ ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని రోజులుగా సౌమ్య మూడీగా ఉండడం దుర్గ గమనిస్తూనే ఉంది. సౌమ్య స్వతహాగా చాలా నెమ్మదైన అమ్మాయి. ఎక్కువగా మాట్లాడదు. కానీ చదువులో చురుగ్గా ఉంటూ క్లాస్ లో మొదటి ఐదుగురిలో ఒకదానిగా ఉంటూ ఉంటుంది. దుర్గ స్వభావం పూర్తిగా విరుద్ధం. అందరితో గలగలా మాట్లాడుతూ, అల్లరి కూడా బాగానే చేస్తుంటుంది.
” ఏమిటో, సౌమ్య ఇలా ఉండడం నాకు బొత్తిగా నచ్చడం లేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమో ఏమో? ” లోలోపల అనుకుంది దుర్గ.

** ** ** **

వారం గడిచింది. సంవత్సరాంత పరీక్షలకు ముందు జరిగే ప్రిపరేషన్ పరీక్షలకు టైం టేబుల్ ఇచ్చారు. చివరి సంవత్సరం, పైగా పబ్లిక్ ఎగ్జామ్స్. అందువల్ల లెక్చరర్స్ అంతా స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేయడంలో నిమగ్న మయ్యారు. ఉదయం సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులంటూ, స్టడీ అవర్స్ అంటూ తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారంతా.
ఆ రోజు శనివారం. సోమవారం నుండే పరీక్షలు మొదలు. క్లాసులన్నీ అయిపోయి, అమ్మాయిలంతా బిలబిల మంటూ క్లాసుల్లోంచి బయటపడ్డారు. తన క్లాస్ లోంచి ముందుగా బయటికి వచ్చిన దుర్గ సౌమ్య కోసం చూస్తూ నిలబడింది.
కాసేపటికి వచ్చిన సౌమ్య, “దుర్గా, నువ్వు వెళ్ళవే, నేను అర్జెంటుగా టాయిలెట్స్ కి వెళ్లాలి ”
” సరేలే, బయట వెయిట్ చేస్తా, త్వరగా వచ్చేయ్” అంటూ వెళ్లబోయి,
“అదేంటి సౌమ్యా! పైకి వెళ్తున్నావ్? ఇక్కడే ఉన్నాయిగా టాయిలెట్స్?” అంటూ అప్ స్టెయిర్స్ వేపు వెళుతున్న సౌమ్యను ప్రశ్నించింది దుర్గ.
“ఇక్కడ వాటర్ రావడం లేదులే దుర్గా” అంటూ పైకి దారి తీసింది సౌమ్య.
” అలాగా” అన్న దుర్గకు వెంటనే గుర్తొచ్చి ” అదేంటీ, ఇందాకే నేను వెళ్లొచ్చాను, బాగా వస్తున్నాయే నీళ్లు!”
అనుకుంటూ వెనుదిరగబోయిన ఆ పిల్లకు ఠక్కున ఏదో స్ఫురించి, మళ్లీ తిరిగి చూసింది. అప్పటికే పైకి వెళ్ళిపోయింది సౌమ్య. గుండె ఆగినంత పనయింది దుర్గకు. వెంటనే అప్ స్టెయిర్స్ వేపు పరిగెత్తింది. సౌమ్య బిల్డింగ్ టెర్రస్ మీద చివరికి గబగబా నడుస్తూ పోతోంది.
మరుక్షణంలో దూకేసేదే. శక్తినంతా కూడదీసుకుని దుర్గ పరుగున వెళ్లి ఒక్క ఉదుటన సౌమ్యను చేయి పట్టి లాగేసింది. ఊహించని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కిందపడిపోయింది సౌమ్య. అయినా వెంటనే లేచి, దుర్గ చేయి విడిపించుకొని ముందుకురకడానికి ప్రయత్నించింది.
కానీ దుర్గ రెండు చేతులతో గట్టిగా సౌమ్యను వాటేసుకుని ” బుద్ధుందా నీకు ఏమిటీ పని? ”
” దుర్గా, నన్ను వదిలేయ్ ప్లీజ్”
” అసలేం జరిగింది? ముందు నాకు చెప్తావా లేదా? ”
దుర్గను వాటేసుకుని బోరున ఏడ్చేసింది సౌమ్య. ఆమె వీపు మీద తడుతూ ఓదార్పుగా,
” ఊరుకో సౌమ్యా, ముందు ఇక్కడ నుండి పద, ఎవరైనా ఇక్కడ మనల్ని చూస్తే బాగోదు” అంటూ చేయి పట్టుకొని కిందికి తీసుకెళ్లింది సౌమ్యను. అక్కడ ఎదురుగా వాచ్ మాన్ !
” ఏంటమ్మా, ఏం చేస్తున్నారిక్కడ? బెల్ అయిపోయి ఎంత సేపు అయింది వెళ్ళండి ఇక్కడి నుంచి” అంటూ అరిచాడు.
” వెళ్తున్నామన్నా బుక్స్ కనిపించకపోతే వెతుక్కుంటున్నాము” అంటూ సౌమ్యతో పాటు దుర్గ బయటపడింది.
పది నిమిషాల తర్వాత ఎవరూ లేని చోటు చూసుకుని ఓ చెట్టు కింద నిలబడ్డారిద్దరూ.
ఏడుస్తూ సౌమ్య చెప్పిన విషయం వినేసరికి దుర్గ తల తిరిగిపోయింది.
చాలా రోజులుగా సౌమ్య ముభావంగా ఉంటూ సరిగా మాట్లాడకపోవడం, పరీక్షల్లో మార్కులు కూడా తగ్గడం వీటన్నింటికీ కారణం ఇదన్నమాట !
రాధాకృష్ణ ఆ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ఇదే సంవత్సరం మొదట్లో వేరే కాలేజ్ నుండి వచ్చి జాయినయాడు. పాఠాలు బాగానే చెప్తాడు. ఎక్కువగా మాట్లాడడు ఎవరితో. డీసెంట్ గా కనిపిస్తాడు. అంతా మంచివాడు అనుకునే ఈ అధ్యాపకుడి నైజం ఇదా !
” ఫిజిక్స్ సార్ ను చూస్తేనే భయమేస్తోంది దుర్గా. మొదటి రెండు నెలలూ బాగానే ఉండేవాడు. కానీ మెల్లిగా అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది నాకు. కూర్చుని రాసుకుంటుంటే వెనుక వీపు మీద చేయి వేయడం, భుజం మీద చేతులు వేసి మీదకు వంగి ఏదో డౌట్ క్లియర్ చేస్తున్నట్లు మాట్లాడడం మొదట్లో ఏదో పెద్దవాడులే అనుకుని పట్టించుకోకూడదనుకున్నా. కానీ రానురానూ ఆ చేష్టలు ఎక్కువై పోయాయి. పక్కన ఎవరైనా చూస్తే ఏమను కుంటారోనన్న భయం నన్ను మరీ బాధించసాగింది”
సౌమ్య చెప్తుంటే విస్తుబోయి వింటూ నిలబడిపోయింది దుర్గ.
కన్నీళ్లు తుడుచుకుంటూ కొనసాగించింది సౌమ్య.
“నేను గమనించాను, నాతో మాత్రమే అలా ప్రవర్తిస్తున్న సంగతి. మిగతావాళ్లంతా సార్ తో నవ్వుకుంటూ బాగా మాట్లాడుతుంటారు. ఎందుకు నాతోనే ఎందుకలా చేస్తున్నాడు? నాకే ఎందుకిలా జరుగుతోంది? ” ఏడుపు ఆపుకోలేక దుర్గ భుజం మీద తల వాల్చేసింది.
” ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఈ కొద్ది రోజులు ఎలాగోలా భరిద్దామనుకున్నా. నిన్న ఫిజిక్స్ క్లాస్ అయ్యాక బయటికొస్తుంటే నన్ను దగ్గరికి రమ్మన్నాడు.
” ఏమిటీ, మార్కులు ఇంత తక్కువగా వచ్చాయి? అర్థం కావటం లేదా లెసన్స్? రేపు ప్రాక్టికల్స్ అయ్యాక కాసేపు ఉండి పో ఏవైనా డౌట్స్ క్లియర్ చేస్తాను” అన్నాడు. మౌనంగా తలూపి వచ్చేశా. ఈ రోజు ల్యాబ్ నుండి త్వరగా బయట పడదామని వచ్చేస్తున్నా అంతా బయటికెళ్ళిపోయారు. ఈలోపే వెనకగా వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని”
ఆపై మాటలు రాక వెక్కివెక్కి ఏడవసాగింది సౌమ్య. తనని ఎలా ఓదార్చాలో తెలియక దుర్గ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని అనునయించసాగింది. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.
” సౌమ్యా, వాడలా చేస్తుంటే ఇన్నాళ్ళుగా భరించడం పొరపాటు. ఇంకా చావాలనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు ఇక చాలు, ఏం చేయాలో నేనాలోచిస్తాను కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయనని మాటివ్వాలి” చేయి చాపింది దుర్గ.
” లేదులే దుర్గా, ఏదో భరించలేక ఆ క్షణంలో అలా చేశాను గానీ ఇప్పుడు అనిపిస్తోంది నాకూ, అదెంత పొరపాటో ప్రామిస్! ఇక ఎప్పటికీ అలా చేయను”దుర్గ చేతిలో చేయి వేసింది సౌమ్య.

** ** ** **

మర్నాడు లంచ్ బ్రేక్ లో దుర్గ ఆలోచన ప్రకారం ఇద్దరూ వెళ్లి ఇంగ్లీష్ మేడం సాధన గారిని కలిశారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది దుర్గ.
” వ్వాట్! రాధాకృష్ణ సర్ ఇలా చేస్తున్నాడా ! అన్ బిలీవబుల్ ! చూడ్డానికి ఎంతో మర్యాదస్తుడిలా కనిపిస్తాడే!”
అంటూ సౌమ్య కేసి తిరిగి.
“ఇలా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సమస్య చెప్పుకోవాలి. అలాకాక చచ్చిపోదామనుకుంటే ఎలా? తప్పు చేసింది అతనైతే శిక్ష నీవు వేసుకుంటావా? అప్పుడు నీకుగా నీవే అతనిని ‘సేఫర్ జోన్ ‘ లోకి పంపినట్లు కాదా? అలా మరికొందరు అమ్మాయిల్ని అతను టార్గెట్ చేయడా? ” సున్నితంగానే మందలించింది సౌమ్యను.
” పోతే, నీతోనే ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడన్నావు కదా. నెమ్మదిగా, కూల్ గా ఉండేవాళ్ళు ఏమీ అనలేరనీ, ఎవరితోనూ చెప్పుకోలేరనీ ఇలాంటి వాళ్ళ ధైర్యం. అది నువ్వు బాగానే నిరూపించావు. కానీ, దుర్గ పసిగట్టడం చాలా మంచిదయింది. సరే దీని గురించి ఆలోచిస్తాను మీరు క్లాస్ కి వెళ్ళండి” అంటూ ఇద్దర్నీ పంపించేసింది.

** ** ** **

మరుసటి రోజు —
సాధన చెప్పిందంతా విన్న ప్రిన్సిపల్ సుదేష్ణాదేవి కోపానికి అంతులేకపోయింది. కానీ అంతలోనే ఇది సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం అన్న విచక్షణతో, వెంటనే మరో ఇద్దరు లేడీ లెక్చరర్స్ ని, సివిక్స్ లెక్చరర్ శివశంకర్ ను కూడా పిలిపించి వాళ్ళతో కూడా సంప్రదించి, ఆ నలుగురికీ కొన్ని పనులు అప్పగించి పంపించేసి, ఆలోచనలో పడింది.
తను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో దగ్గరి బంధువు ఒకతను ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన భుజాలపై చేతులు వేయడం, బుగ్గల్ని సాగదీయడంలాంటి పనులు చేసేవాడు. రెండు మూడుసార్లు చూసి, కంపరంగా అనిపించి ఇంట్లో అమ్మతో చెప్పేసింది. యధాలాపంగా ఓ రోజు ఇంటికి వచ్చిన అతన్ని పట్టుకుని అమ్మ చెడామడా దులిపేసింది. అంతే, అతను మళ్ళీ ఇంటి గడప తొక్కితే ఒట్టు ! ఆ రోజు నుండీ అతనికీ, ఇంటికి సంబంధం పూర్తిగా తెగిపోయింది. అదంతా ఓసారి గుర్తొచ్చి, అలాంటి ప్రబుద్ధులు, వికృత చేష్టల మృగాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటారన్నమాట ! అనుకుంది సుధేష్ణాదేవి.

** ** ** **

రెండు రోజుల వ్యవధి తీసుకుని, పని పూర్తి చేసుకుని నలుగురు లెక్చరర్ లూ వచ్చి కూర్చున్నారు ప్రిన్సిపల్ ఎదురుగా. వాళ్లు చెప్పిన సమాచారం వినగానే సుదేష్ణాదేవి కాసేపు నిర్వికారంగా అయిపోయింది. ఇంతవరకూ సౌమ్య ఒక్కతే బాధితురాలు అనుకుంటున్నారు. కానీ, సైన్సు గ్రూపులవారందరినీ కూర్చోబెట్టి, అనునయంగా వారిని ప్రశ్నించేసరికి ధైర్యం వచ్చి నోరు తెరిచారట. మొత్తంమీద బైపీసీ లో ముగ్గురు, ఎంపీసీ లో మరో ఇద్దరు ఇలాంటి చేదు అనుభవాలే తామూ ఎదుర్కొంటున్నట్లు బయటపడ్డారు. చెబితే అంతా తమను అదోలా చూస్తారని, ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పించేస్తారని భయపడి మిన్నకుండిపోయామని వాళ్లనగానే విస్తుబోవడం లెక్చరర్ ల వంతయిందిట !. ఇంకా బయటపడని వాళ్లూ ఉండే ఉంటారని చెప్పారు వాళ్ళు.
కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ లలిత ఎంక్వయిరీలో అతని వ్యక్తిగత సమాచారం కొంతవరకు తెలిసింది. నలభై దాటిన రాధాకృష్ణ అనే ఈ అధ్యాపకునికి పెళ్లయింది. భార్య గృహిణి. పెద్దగా చదువుకోలేదు. ఇద్దరు కొడుకులు హైస్కూల్లో చదువుతున్నారు.
తర్వాత శివశంకర్ గతంలో రాధాకృష్ణ పనిచేసిన కాలేజి నుండి సేకరించిన సమాచారం తెలిపాడు.
ఆ కాలేజీ కో ఎడ్యుకేషన్. అక్కడ కూడా అమ్మాయిల నుండి ఇలాంటి ఆరోపణలు ప్రిన్సిపాల్ కు అందాయి. బ్రతిమాలి బామాలి పై అధికారుల దాకా పోకుండా చేసుకున్నాడు. అందుకే రెండేళ్ల గడువు దాటగానే ఎలాగోలా ట్రాన్సఫర్ పెట్టుకుని ఇక్కడికొచ్చి పడ్డాడు.
కానీ కుక్క తోక వంకర పోయేది కాదు కదా! అలాగే ఇతని నైజమూ మారలేదన్నమాట !అనుకుంది సుధేష్ణాదేవి.
” ఇక ఉపేక్షించడంలో అర్థం లేదు” స్థిరంగా నిశ్చయించుకున్నారామె.
గంట తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి వాళ్ళను పంపించేసి, అటెండర్ తో చెప్పి రాధాకృష్ణను పిలిపించింది. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా సూటిగానే విషయంలోకి వెళ్ళారామె.
“మీ ప్రవర్తన వల్ల స్టూడెంట్స్ ఎంత మానసిక వ్యధకు లోనవుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతోందా? గురువు తండ్రితో సమానమంటారు. మీ ఈ ప్రవర్తనకు మీ సంజాయిషీ ఏమిటి? ”
“మేడం వాళ్ళు చిన్నపిల్లలు. నన్నపార్థం చేసుకున్నారు. నేనలాంటి వాణ్ణి కాదు ఏదో చిన్నవాళ్లని చనువు కొద్దీ చేయి పట్టుకుంటే అలా వక్రీకరిస్తే ఎలా మేడం? ”
దిగ్గున లేచింది సుధేష్ణాదేవి.
“ఆపండి సీనియర్ ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలండీ వాళ్ళు ఏది గుడ్ టచ్చో, ఏది బాడ్ టచ్చో తెలీని పసిపాపల వయసా వాళ్ళది? నీ చేష్టల వల్ల ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది, తెలుసా నీకు? ”
“సారీ మేడం, క్షమించండి” తల దించుకున్నాడతను.
” సారీతో సమసిపోయే సమస్య కాదిది ఇక మీరు వెళ్ళవచ్చు” అంటూ కూర్చుండిపోయారామె.

** ** **

మరుదినమే స్టాఫ్ మీటింగ్ పెట్టి విషయం చర్చలో పెట్టారు. అందరి అభిప్రాయం విన్నాక, అందరి సమ్మతితో ఓ నిర్ణయం తీసుకుని ఎవరు ఏం చేయాలో చెప్పి పంపించేశారు.
మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా, సైన్స్ స్టూడెంట్స్ రాధాకృష్ణ సర్ మీద కంప్లైంట్ రాసి ఈ సార్ మాకొద్దు అంటూ అంతా సంతకాలు చేశారు.
తానూ ప్రిన్సిపాల్ గా మరో కంప్లైంట్ రాసి ఆ రోజే పై అధికారులకు పంపించేశారు సుధేష్ణాదేవిగారు.
వారం రోజుల్లో ఎంక్వయిరీ కమిటీ వచ్చి విచారించింది. అంతా నిజమేనని తేల్చి రిపోర్ట్ రాసుకుని వెళ్లారు. మరో వారం రోజుల్లో రాధాకృష్ణకు దూరప్రాంతంలో మారుమూలనున్న ఓ బాలుర జూనియర్ కాలేజీకి బదిలీ జరిగిపోయింది.

** ** ** **

ఆ రోజు అసెంబ్లీ హాలులో స్టాఫ్, స్టూడెంట్స్ తోపాటు, పేరెంట్స్ నూ సమావేశపరిచి, అందర్నీ ఉద్దేశిస్తూ ప్రసంగించారు సుధేష్ణాదేవిగారు.
“ఇలాంటి సంఘటనలు కాలేజీలో జరగడం చాలా బాధాకరం. కానీ, ఒక్క విషయం అందరం ఆలోచించాలి. సమస్యలు ఎలాంటివైనా సరే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి వల్లనైనా రావచ్చు. అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ పిరికిగా భయపడకూడదు. తనకు తానుగా పరిష్కరించుకోలేనప్పుడు పక్కవారి సాయం తీసుకోవటంలో తప్పులేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. తప్పు నీదేనని మందలించడం, చదువు మానిపించడం పరిష్కారం కానే కాదు. వాళ్లకు ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టాలి. అమ్మాయిలందరికీ మరోసారి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి సమస్య ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీలో మీరే కుమిలిపోకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలి. ఈ సందర్భంగా దుర్గ అనే స్టూడెంట్ ను నేను మనసారా అభినందిస్తున్నాను.
స్నేహితురాలి మనస్థితిని గమనించిన ఆ అమ్మాయి వయసుకు మించిన పరిణతి చూపించి సౌమ్యనే గాక మరెందర్నో ఈ సమస్య నుండి బయట పడేయగల్గింది. ఆ అమ్మాయికి నా మనఃపూర్వక అభినందనలు. ఇంకా స్టూడెంట్స్ తమ వ్యక్తిగత సమస్యల్ని తనతో పంచుకునేలా వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్న సాధన మేడం గారినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను”
హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

** ** ** **

” థాంక్యూ వెరీమచ్ దుర్గా! నీ మేలెప్పటికీ మరచిపోలేను. నన్నో పెద్ద ఉపద్రవం నుండి బయట పడేశావు” బయట కొస్తూ దుర్గ చేతులు పట్టుకుంటూ ఆర్ద్రంగా అంది సౌమ్య.
” ఛ! ఊరుకోవే, సరేగానీ, ఇప్పటికైనా పిరికితనం వదులుకుంటావా లేదా? ”
” ఇంకానా, నీలా పదిమందికి ధైర్యం చెప్పే శక్తి వచ్చింది తెలుసా? ”
ఇద్దరూ గలగలా నవ్వుకుంటూ గేటు దాటి ముందుకు కదిలారు.
————————-

సమాప్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *