June 14, 2024

దేవీ భాగవతం 8

రచన: స్వరాజ్యలక్ష్మి వోలేటి

6వ స్కంధము, 24వ కథ
బ్రాహ్మణ, క్షత్రియవైరం

ప్రాచీన కాలమున హైహయవంశ క్షత్రియులకు, భృగువంశజులైన బ్రాహ్మణులకు వైరము కలిగినది.
హైహయ వంశమున కార్తవీర్యుడు అను రాజుండెను. అతనికి వేయి భుజములుండెను. అతనిని సహస్రార్జనుడు అని జనులు పిలువసాగిరి. అతడు రెండవ విష్ణువు వలె వెలుగు`చుండెను. ధర్మము గలవాడు. గొప్ప దానబుద్ధి కలవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. అతని వలన రాజు మంత్రదీక్ష తీసుకొనెను. ఆ రాజుకు భగవతి జగదంబ ఇష్టదైవము. ధార్మికుడైన ఆ రాజు దానములు చేయుట యందే గడుపుచుండెను. అనేక యజ్ఞములు చేసి ధనమును ఖర్చుచేసి బ్రాహ్మణులకు దానమొసగుచుండెను. అతడు చేసిన దానములతో బ్రాహ్మణులు మిగుల ధనవంతులైరి. గుఱ్ఱములు, రత్నములు సంపాదించిరి. అపార సంపదలతో వారు కీర్తి పొందిరి. ఇట్లు చాలా కాలము వరకు రాజు భూమిని పాలించి స్వర్గమునకేగెను. ఆతడు చేసిన దానములతో క్షత్రియులు ధనహీనులైరి. అందుచే ఆ క్షత్రియులు బ్రాహ్మణులవద్దకేగి తమతమ కుటుంబ పోషణకు కొంత ధనము యివ్వవలసినదిగా అర్ధించిరి. మా దగ్గర ఏమియు ధనము లేదని బ్రాహ్మణులు తిరస్కరించిరి. అయిననూ క్షత్రియులు అనేక విధముల బ్రాహ్మణులను యాచించుచు ప్రాధేయపడుచుండిరి. కాని బ్రాహ్మణులు వారి వారి ధనములను భూమిలో పాతిపెట్టి ఎక్కడెక్కడికో పారిపోవుచుండిరి. క్షత్రియులు వారిని వెంట తరిమి, వారి యిళ్ళలోనూ, భూమియందు పాతిపెట్టిన ధనములను సొంతము చేసుకుంటూ బ్రాహ్మణులను వెంట తరుముచుండిరి. నిస్సహాయులైన బ్రాహ్మణులు విలపించుచు బ్రతిమలాడుతూ క్షత్రియుల ఆధిపత్యమును చివరకు అంగీకరించి లొంగిపోయిరి.
క్షత్రియులు అహంకారముతో బ్రాహ్మణులను దోచుకుంటూ వారివారి పిల్లలను, స్త్రీలను బాధిస్తూ అనేకవిధముల బాధలకు గురిచేయుచుండిరి. గర్భవతులైన స్త్రీలను కూడా తరుముచూ బాణవర్షములు కురిపించిరి. బ్రాహ్మణులు పర్వత గుహలకు పారిపోయిరి. వారు బ్రాహ్మణులను తరుముతూ భూమండలమంతా వెంటాడుచుండిరి. బాణములతో బాధించుచుండిరి.
అప్పుడు కొందరు ఋషులు, క్షత్రియులు అటువంటి నీచ కర్మ చేయరాదని బ్రాహ్మణులను వదిలిపెట్టవలసిందిగా చెప్పిరి. క్షత్రియులు ఇందులో మా తప్పేమీ లేదు. మేము మా పూర్వీకుల దానధర్మములచే ధనహీనులమైతిమి. మా కుటుంబములు పోషించుకోవలెనని అనుకొంటిమి. కాని వీరు మాకు దానమివ్వక భూములలో పాతిపెట్టి మమ్ములను మిగుల బాధించిరి. బ్రాహ్మణులు వారి సంపదను యజ్ఞయాగములకు, దాన ధర్మములకు ఉపయోగించాలి గాని యిలా దాచిపెట్టరాదు. తీర్థములకు, క్షేత్ర దర్శనములకు ఖర్చుపెట్టాలి. ఈ లోభులైన బ్రాహ్మణులు వారు తినక, దానమివ్వక పరమ నీచులై మమ్ములను బాధించిరి. అందుకే మేము వారిని విడిచిపెట్టము అని బ్రాహ్మణులను సంహరించుట కొనసాగించిరి. లోభము సకల దుఃఖములకు కారణము. ఈ లోభమువలన మానవులు ఒకరికొకరు శత్రవులైరి. కులధర్మము విడిచెదరు. సదాచారములను విడిచి ప్రవర్తింతురు. తల్లి దండ్రులను, సోదరులను, కడకు భార్యాబిడ్డలను కూడా విడిచి పెట్టెదరు ఈ లోభులు. కామ క్రోధ లోభములకు వశులై మానవులు ప్రాణములను పోగొట్టుకొందురు.
బ్రాహ్మణ స్త్రీలు క్షత్రియులచే భయకంపితులై హిమాలయ పర్వతములకు పారిపోయిరి. అక్కడ మట్టితో గౌరీదేవిని చేసి ఆరాధించసాగిరి. దీనముగా అమ్మను ప్రార్థించిరి. వారికి స్వప్నమందు ఆ దేవి సాక్షాత్కరించి భయపడవలదని, ఆ స్త్రీలలో ఒక శ్రేష్ఠమయిన స్త్రీ తొడనుండి బాలుడు ఉద్భవించునని, వానివలన వారు ఉద్ధరింపబడుదురని చెప్పెను.
అందులో ఒక స్త్రీ గర్భము ధరించిఉండెను. క్షత్రియులు అది గమనించి ఆమెను వెంటాడసాగిరి. అమె పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి భయభీతితో ఒకచోట కూలబడిపోయెను. ఆమె ఏడ్వసాగెను. గర్భములో ఉన్న ఆ శిశువు ఆ ఏడుపు వినెను. ఆ స్త్రీ కన్నుల నుండి వస్తున్న అశ్రుధారలను అతడు చూచెను. వెంటనే ఆ స్త్రీ తొడనుండి ఆ బాలుడు బయటకు వచ్చెను. అతడు గొప్ప తేజస్సుతో వెలుగుచుండెను. ఆ బాలుడు స్త్రీని వెంటాడుతున్న క్షత్రియులను కోపంతో చూడగానే వారి నేత్రములు గొప్ప బాధతో మంటలు వచ్చి వారంతా అంధులైపోయినారు.
క్షత్రియ సేనకు ఒక్కసారి ఏమైందో అర్ధము కాక వారు ఘోరముగా దుఃఖించుచు ఆ స్త్రీమూర్తి పాదములపై బడి రక్షించమని వేడుకొనిరి. అందులకామె, దీనికంతకూ కారణము వంద సంవత్సరములనుండి తన గర్భములో పెరిగి సకల విద్యలను నేర్చిన గొప్ప తేజస్వియైన ఆ బాలకుడే కారణమని, వారినందరినీ ఆతనిని శరణువేడమని చెప్పిరి. ఈ పుత్రుడు భగవతి ప్రసాదముగా నాకు లభించెను అని ఆ మహాసాధ్వి క్షత్రియులకు చెప్పగా వారంతా ఆ బాలకుని పాదములపై బడి పలువిధముల ప్రార్ధించిరి. తమ గుడ్డితనము దూరము చేయవలసినదిగా ప్రార్థించిరి. ఆ బాలకుడు కరుణించి వారిని మునుపటివలెనే సుఖముగా కాలము గడపమని వారి వారి ప్రదేశములకు వెళ్ళమని కోరెను.
మరల వారి చూపు వారికి కల్గెను. ఆతడి ఆదేశానుసారము క్షత్రియులు తమగృహములకు మరలిరి. ఆ స్త్రీ కూడా సంతోషించి ఆ దివ్యబాలుని తీసుకుని తన ఆశ్రమమునకు వెళ్ళెను. యిట్లు పూర్వము భృగువంశీయులు క్షత్రియుల వలన అనేక బాధలు అనుభవించిరి.

6వ స్కంధము, 25 వ కథ
హైహయులు
ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఆడు గుఱ్ఱము అవమని శాపమొసగెను. ప్రతిలీల రహస్యమయినది. లక్ష్మీదేవికి మిక్కిలి బాధ కలిగెను. అమె భర్తకు నమస్కరించి, మర్త్యలోకమునకు వెళ్ళిపోయెను. సుపర్ణాక్షమను పేరుగల స్థలములో లక్ష్మీదేవి ఆడు గుఱ్ఱముగా తిరుగసాగెను. దానికి ఉత్తర తీరమందు యమునా, తమసా నదుల సంగమ ప్రదేశముగలదు. ఆ ప్రదేశము సుందర వనములతో అందముగా నుండెను. అచ్చట లక్ష్మి శంకరుని గూర్చి తపమొనరించెను. ఆ పవిత్ర తీర్థమందు లక్ష్మి కఠిన తపము చేసెను. ఒక వెయ్యి దివ్య వత్సరములు లక్ష్మి తపస్సు చేసెను.
ముక్కంటి ప్రసన్నుడై పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యెను. ఆమె తపమొనరించుటకు కారణము తెలుపమని శంకరుడు అడుగగా శాపమును గూర్చి లక్ష్మి వివరించెను. తనకు పుత్రుడు ఉదయించినప్పుడే శాపవిమోచనమని తనపతి చెప్పెనని కూడా చెప్పెను. ఈ గుఱ్ఱము జన్మలో నా పతి విరహమున నాకు సంతానము ఎట్లు కలుగునని లక్ష్మీదేవి విచారించెను.
శివుడు తాను`విష్ణువు ఒకటే యని యుగవైశిష్ట్యము వలన మూర్ఖులు ఈ విషయము తెలుసుకోలేరని చెప్పెను. విష్ణువు తనచే ప్రేరితుడై లక్ష్మిని అశ్వరూపమున తప్పక కలియునని చెప్పి అంతర్ధానమయ్యెను. లక్ష్మీదేవి జగదంబిక చరణములను భక్తితో ఆరాధించెను. పదే పదే శ్రీహరిని స్తుతించుచుండెను.
చిత్రరూపుడనే వాడిని శంకరుడు విష్ణువు వద్దకు పంపెను. ఆ దూత వైకుంఠమునకు వెళ్ళి విష్ణువుతో లక్ష్మీదేవి తపమును గూర్చి వివరించెను. లక్ష్మీదేవిని కరుణించమని శంకరుడు తనతో కబురు పంపెనని చెప్పగా అట్లే అగునని శ్రీహరి అశ్వరూపమును దాల్చి లక్ష్మీదేవి తపమొనరించు ప్రదేశమునకు చేరుకొనెను. వారిరువురు ఒకరిని ఒకరు గ్రహించిరి. లక్ష్మి కనులలో నీరు నిండెను. యమునా తమసా సంగమ స్థానమున లక్ష్మీనారాయణులు కలుసుకొనిరి. అచటనే వారు సుందర బాలునికి జన్మయిచ్చారు. లక్ష్మీదేవి, విష్ణువు మరల వారి వారి రూపములను పొంది వైకుంఠమునకు చేరిరి. లక్ష్మీదేవి తన పుత్రుని వదలి ఉండలేనని దుఃఖించగా విష్ణువు ఆ పుత్రుని అక్కడే పరిత్యజించవలెనని, భూమండలమున యయాతి వంశజుడైన తుర్వసుడను రాజు గలడని అతడికి హరివర్మ అను నామము కలదని, అతడు సంతానము కొరకు వందసంవత్సరములుగా తపము చేయుచున్నాడని ఈ బాలుడు అతని కొరకేనని చెప్పి ఆమెను ఒప్పించెను.
చంపకుడను పేరుగల విద్యాధరుడు, అతని భార్య మదాలస, ఆ ప్రదేశమునకు విహారముకొరకు వచ్చిరి. ఆ బాలకుని గొప్ప తేజస్సును చూచిరి. కామధేనువుతో సమానమైన ఆ బాలుని భార్యాభర్తలిరువురు తమకు శంకరుడు ప్రసాదించిన వరముగా భావించి తమతో తీసుకొని వెళ్ళిరి. వారు అమరావతి వెళ్ళి యింద్రునికి ఈ విషయము చెప్పిరి. ఇంద్రుడు వారికి ఆ బాలుని జన్మ విషయము చెప్పి వాని పేరు హైహయుడు అని, యయాతి వంశజుడైన తుర్వసునికి అతనిని అప్పగించవలెనని, అతడు భూమండలమున ‘‘ఏకవీరుడు’’ అను నామముతో ప్రసిద్ధి గాంచునని చెప్పెను.
లక్ష్మీ శ్రీహరి లిరువురూ హరివర్మ తపసునకు సంతోషించి యమునా తమసా నదీ సంగమ తీర్థమునకు వెళ్ళి తనకు, లక్ష్మికి జన్మించిన పుత్రుని అక్కడ తమ ప్రసాదముగా తీసుకొమ్మని పంపెను. యయాతి నందనుడు విష్ణువు వివరించిన పవిత్ర స్థలమును చేరి అచట బాలుని చూసెను. ఆనందాతిరేకముతో ఆ బాలుని హృదయమునకు హత్తుకొనెను. తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళి మహారాణికి యిచ్చెను. వైభవముగా పుత్రోత్సవము జరిపెను. ఏకవీరుడని నామమిడెను. సంప్రదాయ సంస్కారములన్నీ జరిపి, పెద్దవాడయ్యాక పట్టాభిషిక్తుని గావించి రాజు, రాణి వనములకేగిరి. తరువాత స్వర్గస్తులైరి. రైఖ్యుడనే రాజు కుమార్తె ఏకావళిని కాలకేతువు అను దైత్యుడు అపహరించగా ఆవిషయమును ఆమె చెలికత్తె యశోధరనుండి విన్న ఏకవీరుడు పాతాళలోకముననున్న కాలకేతువుని వధించి ఏకావళిని రక్షించి తండ్రిjైున రైఖ్యుని కడకు ఆమెను పంపెను. ఒక శుభ ముహూర్తమున ఏకవీర, ఏకావళిల వివాహము జరిగెను. వారికి ఒక పుత్రుడు కలిగెను. వాని పేరు కృతవీర్యుడు. ఆ కృతవీర్యుని పుత్రుడే కార్యవీర్యుడు. హైహయ వంశజుడు.

6వ స్కంధము, 26వ కథ
నారద వృత్తాంతము

మోహము అను గుణముచే ఎంత గొప్ప మహాత్ముడైనను లొంగిపోక తప్పదు. నారదముని వృత్తాంతము దీనికి ఉదాహరణము.
బ్రహ్మమానస పుత్రుడు నారదుడు. గొప్ప తపస్వి. ఉదారుడు. శాంతస్వభావి. ఎచటకైనను పోగల సమర్థుడు. సామగాన పండితుడు. విద్వాంసుడు. ఒకసారి వ్యాసముని ఆశ్రమమునకు నారదుడు వచ్చెను.
ఈ మిథ్యాప్రపంచమున ఏదియును తనకు సుఖం కల్గించుట లేదని వ్యాసుడు చెప్పగా నారదుడు తన వృత్తాంతము నిట్లు వివరించెను.
పర్వతుడను మునీంద్రుడు, నారదుడు ఒకసారి భూమండలానికి సంచారానికి వచ్చిరి. వారిరువురు ఒక ప్రతిజ్ఞ చేసుకొనిరి. వారిరువురి మధ్య ఏ విషయమునను దాపరికము, రహస్యము ఉండరాదని, యిరువురు సంజయుడు అను రాజు ఆస్థానమునకు వచ్చిరి. ఆ రాజు వారిరువురిని సత్కరించి అతిథులుగా తన రాజ్యమున వారికి సర్వ సౌకర్యములు కల్గించెను. ఆ రాజు కుమార్తె దమయంతి. మిగుల సౌందర్యవతి. గుణశీలి. శాంతస్వభావి, రాజు ఆ మునుల సహచర్యమునకు సేవకు ఆమెను నియమించెను. ఆమె వారికి కావలసిన సౌకర్యముల విషయములన్నీ చూచెడిది. నారదుని గానమునకు ఆమె ముగ్ధురాలయ్యెను. కొంతకాలము పిదప నారదుడు ఆమెవైపు ఆకర్షితుడయ్యెను. ఈ విషయము గమనించిన పర్వతుడు ఈర్ష్యతో కోపముతో వానరముఖము కమ్మని నారదుని శపించెను. నారదుడును పర్వతుని భూమండలమున సంచరించే వానిగా స్థిరపడుమని తిరిగి శపించెను. పర్వతుడు కోపించి వెళ్ళిపోయెను. ఆ రాజు తన కుమార్తెకు సుందరుడైన రాజకుమారుని కొరకై వెదకు చుండగా దమయంతి తాను నారదుని వివాహము చేసుకొందునని, ఆతని వానర రూపము తనకు ఆటంకము కాదని, నారదుని సామ గానకళ తనకు అపరిమితముగా నచ్చినదని, యిది తన నిశ్చయమని రాజును అంగీకరింపజేసి నారదుని వివాహమాడెను. వారిరువురు అచటనే సంసారము చేయుచుండిరి. నారదునికి తన కోతిముఖము చూచి చాలా దుఃఖము కలిగేది. దమయంతి మాత్రము నారదుని గానమునే అభిమానించుచుండెను. కొంతకాలమునకు పర్వతుడు వచ్చి దమయంతిని చూచి చాలా దుఃఖించి తన శాపమును తిరిగి తీసుకుని నారదుని క్షమించెను. వెంటనే కోతిముఖము పోయి, మామూలుగా నారదుని ముఖము మారిపోయెను. పర్వతుని శాపము కూడా నారదుడు విరమింపజేసి ఆతనిని క్షమించెను. అతడు తిరిగి స్వర్గమునకు వెళ్ళిపోయెను. ఈ జగత్తునందు నివసించు ఏ ప్రాణీ మోహమును స్పృశింపక యుండడు. గొప్ప గొప్ప దేవతలు, ఋషులు, మునులు అందరూ మోహమునకు అధీనులై నిరంతరమూ సంసార మార్గమున పరిభ్రమించుచుందురు. నారదుడు స్వయముగా ఒక స్త్రీని పొందుటకు మోహమున చిక్కుకొనుట మహా దుఃఖము ననుభవించుట దీనిని ఉదాహరణము.

6వ స్కంధము 27 వ కథ
మహామాయలో నారదుడు చిక్కుకొనుట

నారదుడు ఈ కథ కూడా వ్యాసునకు వివరించెను. నిజానికి మాయయొక్క అత్యంత నిగూఢమైన రహస్యమును తెలుసు` కొనుటకు యోగవేత్తలగు మునులు కూడా అసమర్థులు. బ్రహ్మ మొదలు సకల చరాచర వస్తువులును మాయకు అధీనులే.
ఒకసారి నారదుడు తన వీణతో సంగీతమును వాయించుకొంటూ విష్ణువును చూడడానికి వైకుంఠమునకు వెళ్ళెను. శంఖ చక్ర గదా హస్తుడై, శ్యామల వర్ణముతో విష్ణువు వెల్గుచుండెను. పీతాంబరమును ధరించి సర్వవిభూషితుడై వుండెను. మహాలక్ష్మితో ఆ స్వామి క్రీడిరచుచుండెను. నారదుడు రావడం చూచి లక్ష్మి అచటినుండి వెళ్ళిపోయెను. దానితో నారదునక అవమానము కలిగినట్లు భావించెను. తాను ధూర్తుడు కాడు, నీచుడు కాడు, ఒక తపస్వి, ఇంద్రియములను జయించిన వాడు, క్రోధాన్ని జయించిన వాడని నారదునికి అభిమానము మెండు. అదే మాట విష్ణువుతో అన్నాడు కూడా. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో నారదా! స్త్రీకి భర్తదగ్గర తప్పఇంకే పురుషుని వద్ద అట్లు వ్యవహరింప రాదు. స్వాధ్యాయము చేసేవారు, తపస్వులు. ఆహారాదులు నిషేధించిన వారు, ఇంద్రియములు వశమందు ఉన్నవారు కూడా మాయకు లొంగిపోవుదురు. నీవు మాయలు జయించితి నన్నావు కదా. ఎంత గొప్పవాడైనను దీనికి లొంగి ఉందురు. కుతూహలముతో ఆ మాయ స్వరూపమెట్లుండునోఅని దానిని చూడాలని గొప్ప ఆసక్తితో ఉన్నానని విష్ణువుతో పలికెను.
మాయ త్రిగుణాత్మక సర్వజ్ఞురాలని, జయింపరానిదని శ్రీహరి తెలిపెను. గరుడుని పైనెక్కి వారిరువురు వైకుంఠమునుండి బయలుదేరి అనేక పల్లెలు, పట్టణములు, సెలయేళ్ళు, వనములు, గోశాలలు, పుణ్యనదులు దాటుకుంటూ కన్యాకుబ్జము అనే నగరానికి వచ్చిరి. అచట ఒక దివ్య సరోవరముండెను. తామర పుష్పములు, హంసలు, బెగ్గురు పక్షులు, వికసించిన కమలములతో అలరారుచుండెను. సత్పురుషుల చిత్తము వలె, జలము స్వచ్ఛముగా, సుగంధపూరితములై ఉన్నది. నారదుని దానియందు స్నానము చేయమని శ్రీహరి చెప్పగా నారదుడు జుట్టు ముడివేసుకుని జలములో దిగెను. శ్రీహరి ఒడ్డున నుండి చూచుచుండెను. ఒక్క మునక వేయగానే నారదుని పురుషరూపము పోయి స్త్రీగా మారిపోయెను. శ్రీహరి మాయమయ్యెను. వీణకూడా మాయమయ్యెను. నారదుడు అప్పటినుండి స్త్రీ రూపములో తిరుగుచుండెను. పూర్వస్మృతి కూడా లేదు. అజ్ఞానము ఆవరించెను. తన స్త్రీ రూపమును ఆ నీటిలో చూచి నారదుడు అచ్చెరువందెను.
ఇంతలో తాళధ్వజుడనే రాజు తన రథము, గుఱ్ఱములు, ఏనుగుల పరివారముతో అచ్చటికి వచ్చెను. అతడు మన్మధుని వలె వెలుగుచుండెను. అతడు ఆ స్త్రీవివరములు కనుగొనెను. తనను పెండ్లాడమని అర్ధించెను. స్త్రీ రూపములోని నారదుడు సరేననగానే, ఆ రాజు పెద్ద పల్లకి తెప్పించి ఆమెను అందులో కూర్చోబెట్టి తన భవనమునకు తీసుకొనివెళ్ళి, ఉత్తమ ముహూర్తమున అగ్నిసాక్షిగా ఆమెను పెండ్లాడెను. చాలా అనురాగముతో ఆ స్త్రీమని ఆరాధించెను. సౌభాగ్యసుందరి అనే పేరుపెట్టెను. రాచకార్యములు కూడా విడిచి ఆ స్త్రీతో రమించుచుండెను. వారు అనేక చోట్ల విహారములు సల్పిరి.
స్త్రీగా ఉన్న నారదుని వివేకమంతయు పోయెను. 8మంది కుమారులు కల్గిరి. మనవలు, మునిమనవలు కల్గిరి. గొప్ప భోగములతో కాలము గడిచిపోయెను. అప్పుడప్పుడు పిల్లలకు కలిగే రోగాలకు మనసు విచారించుచుండెను. కుటుంబములో కలహములు రేగినపుడు, అపారమైన దుఃఖము కల్గుచుండెను. మోహము వల్ల కల్గిన అహంకారము ఎక్కువయ్యెను. తాను నారదుడినని, భగవంతుడు ఏర్పరచిన మాయలో చిక్కుకున్నానని అతడు గుర్తించలేదు.
శత్రువులు ఆ రాజ్యముపై దండెత్తిరి. యుద్ధములో పుత్రులు, మనుమలు, మునిమనుమలు హతులైరి. యుద్ధభూమిలో మృతులైన తన కుటుంబమును చూచి ఆ స్త్రీ మిగుల దుఃఖించెను. గట్టిగా విలపించుచుండగా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున శ్రీహరి అక్కడికి వచ్చెను.
‘‘అమ్మా! నీవెందుకు ఏడ్చెదవు. భర్త, పుత్రులు అనే మోహమున నీవు మునిగితివి. పరలోకమునకు వెళ్ళిన పుత్రులకు తిలోదకములు ఇవ్వవలెను. వారి ఆత్మశాంతి కొరకు స్నానము చేసి తర్పణము విడుము. యిది ధర్మశాస్త్ర విషయము’’ అని పలికి వృద్ధ బ్రాహ్మణ రూపమున ఉన్న విష్ణువు ఆ స్త్రీ ని ఓదార్చెను. బంధు మిత్రులందరితో రాజుతో ఆమె రాజ్యమునకు వచ్చెను.
పరమపావనమైన పుం అనే తీర్థములో వృద్ధ బ్రాహ్మణ రూపమున ఉన్న శ్రీహరి ఆజ్ఞపై పురుషసంజ్ఞక తీర్థమునందు స్నానమొనరించెను. వెంటనే నారదునికి పూర్వ పురుషాకారము వచ్చెను. విష్ణువు ఒడ్డున వీణతో విరజమానుడై వుండెను. శ్రీహరి దర్శన భాగ్యము కల్గిన తోడనే నారదుని మనసును ఆవరించి యున్న మరపు దూరమయ్యెను. మాయా ప్రభావమున తాను స్త్రీగా మారి యిట్టి దుఃఖములో మాయలో కొట్టుకొంటినని అర్థమయ్యెను. తన భార్య ఏమయ్యెనని తాళధ్వజుడు అశ్చర్యపడుచుండెను. అతడు ఆ స్త్రీకొరకు అనేక విధముల విలపించుచుండెను. దుఃఖములో అతడు మునిగిపోయెను.
‘‘ఓ రాజా! సంయోగము, వియోగము లెట్టివి. వేగముగా ప్రవహించు సంసారరూప సాగరమున మానవులు నౌకలో కూర్చున పథికుల వంటివారు. ఈ స్త్రీ నీకు అప్రయత్నముగా లభించెను. పెక్కుకాలము నీవు సుఖించితివి. వియోగము కూడా అటువంటిదే. శోకము పనికి రాదు. తిరిగి వెళ్ళి రాజ భోగములను అనుభవించుము’’ అని రాజునకు బోధించి శ్రీహరి యిది అంతా మహామాయ యొక్క లీల అని చెప్పి పంపించెను. వైరాగ్యముతో తన పౌత్రులకు రాజ్యమిచ్చి, సంపూర్ణ జ్ఞానమును పొందెను.
అపుడు నారదుడు విష్ణుమాయని తెలుసుకొనెను. అది అంతయు పరాశక్తి మహామాయ అని శ్రీహరి నారదునికి ఆ మాయను తెలుసుకొనుట ఎవరికీ సాధ్యము కాదని తెలిపి తన వైకుంఠమునకు తిరిగి వెళ్ళెను. నారదుడు తన తండ్రియగు బ్రహ్మ కడకు చేరుకొనెను.
ఈ వృత్తాంతమంతయు నారదుడు చెప్పగా వ్యాసమహర్షి విని కురుక్షేత్రమున తన పరివారమంతటిని కోల్పోయి గొప్ప మోహములో పడిన వాడై చింతించుచూ, ఈ నారద వృత్తాంతము తెలుసుకున్నాక, గొప్ప వైరాగ్యము కలిగి సారస్వత కల్ప సమయము గాన ‘‘శ్రీమద్దేవీ భాగవతమను’’ పురాణమును రచించుట ప్రారంభించెను. యిది సకల సందేహములను నివారించును. అనేక ఉపాఖ్యానములో నిండి ఉన్నది. వేద ప్రమాణమైనది.
సచ్చిదానంద స్వరూపిణియైన జగదంబయే ఆ మాయను హరింపగలదు. వేరెవ్వరికి సాధ్యము కాదు. ఆమె తన ప్రకాశము చేత మాయను దూరమొనర్చును. ఆ భగవతి ఉపాసనము చేత సర్వ మాయలు, పాపములు నశించును.
దేవీ భక్తియందు శ్రద్ధగలవారికి, శిష్యులకు, పెద్ద కుమారునికి, గురుభక్తిగల్గిన వారి ఎదుటనే ఈ పురాణమును ప్రవచించవలెను. ఎవరంటే వారికి దీనిని వినిపించరాదు. సకల పురాణవేద సారమిది. భక్తితో దీనిని పఠించవలెను. శ్రవణము చేయవలెను. వారే జ్ఞానులగుదురు. సర్వ సంపదలు కల్గును.

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *