May 18, 2024

ధృతి – 9

రచన: మణికుమారి గోవిందరాజుల

బద్దకంగా కళ్ళు విప్పింది ధృతి. అప్పటికే లేచి ఆడుకుంటున్న ఆర్తి కార్తి కేకలతో మెలకువ వచ్చిందే కాని, లేవబుద్ది కావడం లేదు. బెడ్ కి పక్కనే ఉన్న కిటికీలో నుండి బయటికి చూసింది. కింద గార్డెన్ లో శివ పిల్లలు బాల్ ఆట ఆడుకుంటున్నారు. ఇంట్లో ఎంత లేపినా లేవని ఆర్తీ కార్తీ, ఇక్కడికి వస్తే మటుకు సూర్యోదయం కాకముందే లేస్తారు. శివతో ఆడుకోవటం వాళ్ళకు చాలా ఇష్టం. ఆ చెట్లల్లో పడి ఉరకటం, పక్కనే ఉన్న ఏటి పాయలోకి వెళ్ళి ఈత కొట్టి రావటం, చెట్లకు కాసిన జామకాయలు కోసుకోవటం మరీ మరీ ఇష్టం. బాదం కాయలు కొట్టి పప్పులు తినటం అంటే ఇంకా ఇష్టం.
ఆడుకుంటున్న వాళ్ళను చూస్తుంటే మనసంతా తృప్తిగా అయింది. “హే! డియర్స్…” కిటికిలో నుండి బయటికి చూస్తూ పిలిచింది.
“అక్కా! వచ్చేయ్ కిందకి. ఇంకా ఏటికి వెళ్ళలేదు. నీ కోసం ఆగాము” అక్కని చూసి చేతులూపుతూ పిలిచారు.
“ఓకే. . వస్తున్నా. . ఒక ఫైవ్ మినిట్స్” గబగబా లేచి ఫాస్ట్ గా పళ్ళు తోముకుని నైట్ డ్రెస్ మార్చుకుని రయ్యిన వంట గదిలోకి వచ్చింది.
“రా. . . రా… నీ కోసమే చూస్తున్నాను. నీకు ఇష్టమని నీ కోసం రాగి మాల్ట్ చేసాను” ఆప్యాయంగా పిలిచింది బామ్మ.
అదే స్పీడ్ తో వెనక్కి తిరిగింది. “బామ్మా మేము ఏటికి వెళ్తున్నాము. అది చెప్దామనే వచ్చాను”
“నీ ఇల్లు బంగారం కానూ. ఒక్క నిముషం ఆగి ఇది తాగేసి వెళ్ళవే” వెనకాలే వచ్చింది బామ్మ. “అయినా కిందటి తడవలాగా కాదులే. ఇప్పుడు మంచిగా చేసానే” వెంటపడింది.
“లేదు బామ్మా! చెల్లీ వాళ్ళు చూస్తున్నారు. మేమెళ్ళివచ్చాక తాగుతాలే” వెనక్కి చూడకుండానే చెప్పి వాకిట్లోకి పరుగుతీసింది.
తూనీగలాగా పరుగులు తీస్తున్న మనవరాలిని అపురూపంగా చూసుకుని లోపలికి వెళ్ళింది బామ్మ.
కారు తెస్తానని శివ అంటే వద్దని నడుచుకుంటూ బయలుదేరారు. అప్పట్లో దూరంగా అనిపించిన ఏరు, ఇప్పుడు ఇళ్ళ మధ్యలో నుండి వెళ్తుంటే దగ్గరయినట్లుగా ఉన్నది. ఆ ఊరిని చుట్టుకున్నట్లుగా వెళ్తుంది మునేరు. ఇప్పుడు ఊరు ఏటికి రెండుపక్కలా విస్తరించింది. తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే జవాబులు చెప్తూ వెళ్లసాగారు. “రంగనాయకమ్మగారి మంచితనం, ఆప్యాయత వీళ్ళల్లో కూడా ఉన్నది. దిష్టి తగిలేను. ఇంటికెళ్ళి దిష్టి తీయించరా శివా” ఆప్యాయంగా వాళ్ళు ఇస్తున్న సలహాను చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు సాగింది. అప్పటికే పరుగులు పెడుతూ వెళ్ళిన ఆర్తీ కార్తీ నీళ్లల్లో దిగేసారు. వెంట శివ ఉండి వాళ్లను లోపలికి వెళ్ళకుండా చూస్తున్నాడు. ఒడ్డున కూర్చుని వాళ్ళ ఆనందాన్ని చూస్తూ వాళ్ళను ఎంకరేజ్ చెయ్యసాగింది.
“ఇంక వచ్చేయండి. బామ్మ అరుస్తుంది. కరణంగారింటికి వెళ్ళే టైం అయింది” గట్టిగా అరిచి చెప్పింది.
“అక్కా! ప్లీజ్ ఒక్క అయిదు నిమిషాలు”
“ఇప్పటికి అలాంటి అయిదు నిమిషాలు అరవై అయ్యాయి. వచ్చేయండి. నేను వెళ్తున్నాను” కోపంగా అన్నట్లుగా అని వెనక్కి తిరిగింది.
అప్పుడే ఏటిని చూట్టానికి కొంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు. వాళ్ళల్లో నిన్నటి రోజున హోటల్ సెవెన్ లో కలిసిన అమ్మాయి కూడా ఉన్నది. ఆ అమ్మాయితో పాటు ఉన్న పెద్దవాళ్ళల్లో ఒకామెను ఎక్కడో చూసినట్లుందే అనుకున్నది.
కూతురుతో వెళ్తున్న స్వాతి ధృతిని గుర్తుపట్టింది. భర్త ఆ అమ్మాయి గురించి మెచ్చుకున్న విధానం గుర్తొచ్చి అహం దెబ్బ తిన్నది. అందుకే పలకరించేదేమిటిలే… అని ముందుకెళ్ళిపోయింది. ధృతికి సడన్ గా గుర్తొచ్చింది ఆమె కాలేజీ ఫౌండర్ శేఖరం గారి భార్య అని. వెంటనే వెనక్కి తిరిగి గబ గబా వెళ్ళి “నమస్తే మేడం. నా పేరు ధృతి. మనం కాలేజీలో కలుసుకున్నాము” తనని తాను పరిచయం చేసుకున్నది.
“మంచిది…” చెయ్యూపి ముందుకు వెళ్ళిపోయింది. చిన్నబోయింది ధృతి వదనం. ఇంతలో అక్కకి నిజంగానే కోపం వచ్చిందనుకుని నీళ్ళల్లో నుండి బయటకు వచ్చారు ఆర్తీ కార్తీ. వాళ్ళ వెనకాలే శివ కూడ వచ్చాడు. జరిగిన సంఘటన మర్చిపోయి వాళ్ళతో పాటు ఇంటికొచ్చింది. చిన్నబోయిన ధృతిని శివ గమనించాడు కాని అది సమయం కాదు అని అడగలేదు.
ఇంటికి వచ్చేసరికి బామ్మ రడీ అయి వీళ్లకోసం ఎదురు చూస్తున్నది. “ఏమర్రా తొందరగా తయారవ్వండి. మళ్లీ మనం ఆలస్యం చేస్తే బాగుండదు. అన్నట్లు అందరూ కాసిని పాలు తాగి బయలుదేరండి. అక్కడ సరిగ్గా తినకపోయినా పర్లేదు” చెప్తుండగానే సంజమ్మ ముగ్గురికి పాలు పట్టుకొచ్చింది.
“ఛీ! యాక్… పాలెంటీ? నాకొద్దు” వెళ్ళి బామ్మ ఒళ్లో చేరింది ఆర్తి. ధృతి ఎన్నిసార్లిచ్చినా పాలు తాగుతుంది. కార్తికి ఇస్తే తాగేస్తాడు. ఆర్తికి పాలంటే గిట్టదు . కాకపోతే కాసేపు బుజ్జగిస్తే తాగుతుంది. ఆ సంగతి తెలుసు కాబట్టి ధృతి చెల్లిని కాసేపు బుజ్జగించి పాలు తాగించింది. ఆ తర్వాత ముగ్గురూ రడీ అవడానికి గదుల్లోకి వెళ్లారు.
“”బామ్మా! మేము రడీ…” పరిగెత్తుకుంటూ వచ్చారు ఆర్తీ కార్తీ. ఆర్తి పట్టు లంగా జాకెట్ వేసుకుని, కార్తి కుర్తా పైజామా వేసుకుని ముచ్చటగా ఉన్నారు.
ఇద్దర్నీ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నది. ఈలోపు శివ కూడా రడీ అయ్యి వచ్చాడు. “రథసారధి” రడీ అంటూ.
“మీ అక్కని పిలువురా” చెప్పింది కార్తితో.
“బామ్మా! మనం వెళ్ళి రావొచ్చు అక్క వచ్చేసరికి” కిసుక్కున నవ్వింది ఆర్తి.
“ఏంటే? ఏమంటున్నావు నన్ను?” వచ్చి చెల్లెలి చెవి పట్టుకున్నది ధృతి.
“అయ్యో! అక్కా నేనేమీ అనలేదు నిన్ను. ఇప్పుడప్పుడే రావు అన్నాను అంతే” అక్క చేతిలోనుండి చెవిని విడిపించుకుంటూ నవ్వింది ఆర్తి.
“యూ నాటీ” చెల్లి తలమీద చిన్నగా తట్టి కావిలించుకుంది.
లతలూ పూవులూ ఎంబ్రాయిడరీ చేసిన లేత గులాబీ రంగు సిల్కు లంగా అదే రంగు జాకెట్టు కొద్ది డార్క్ పింక్ ఓణీ…. గులాబీ పువ్వులా ఉన్నది ధృతి. చిన్న క్లిప్ పెట్టి వదిలిన జుట్టు వీపంతా పరుచుకున్నది. సన్నటి చైన్ అయినా కూడా తెల్లటి శంఖంలాంటి మెడను చుట్టుకుని గర్వంగా చూస్తున్నది. రెండు చేతులకు డైమండ్ గాజులు సింపుల్ కాని హుందాగా కనపడుతున్నది. కాంతులీనుతున్న వదనంతో “బామ్మా! ఇక బయలుదేరుదామా?” అడుగుతున్న మనవరాలిని కళ్ల నిండుగా చూసుకుని “పదరా కార్ తియ్యి” ఉయ్యాల బల్ల మీద నుండి కిందకి దిగుతూ శివతో చెప్పింది.
“రండి! రండి… అమ్మా! మీ కోసమే ఎదురు చూస్తున్నాము” గౌరవంగా ఆహ్వానించారు విశ్వం దంపతులు. “రమా! నువ్వెళ్లి టిఫిన్ల ఏర్పాటు చూడు” భార్యకు చెప్పి “పిల్లలూ రండి. లోపల మీకు ఇష్టమైనవి తినండి” పిల్లలతో చెప్పి “అమ్మా! పెళ్ళివాళ్ళు ఇంకో గంటలో వస్తారు. మనం అప్పటికల్లా ఇవన్నీ ముగించుకుని తయారుగా ఉందాము. మీరలా పక్కన కూర్చుని అన్నీ పర్యవేక్షించండి చాలు” బామ్మతో వినయంగా చెప్పాడు.
“బాగున్నాయయ్యా ఏర్పాట్లు. అన్నీ తెలిసినవాడివి. నీకు చెప్పేది ఏముంటుంది చెప్పు? ఏదో నా మీద అభిమానంతో అంటున్నావు కాని” టిఫిన్ తిని చేతులు కడుక్కుంటూ అన్నది బామ్మ.
“పెళ్ళివాళ్ళు బయలుదేరారట” ఇంతలో ఎవరో వచ్చి చెప్పారు.
“అవునా పది నిమిషాలు కూడా పట్టదు వాళ్ళు రావడానికి. అరేయ్ కాశీ… నీళ్ళు పెట్టావా? ఏమే… రమా రా బయటకెళ్దాము” హడావుడి పడిపోతూ భార్యను పిల్చాడు కరణం
“ఏమయ్యా! కంగారు పడకు విశ్వం… అన్నీ మంచిగా జరుగుతాయి. నిదానించు”
“ఏమో అమ్మా! ఇంట్లో మొదటి శుభకార్యం. పైనుండి బాగా గొప్పవాళ్ళ సంబంధం. మర్యాదలను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయం. అందుకే కంగారుగా ఉన్నది”
“గొప్పవాళ్ళంటున్నావు కదా? వాళ్ల ఆలోచనలు, ఆదర్శాలు కూడా గొప్పగానే ఉంటాయి. అందుకే ఇక్కడిదాకా వచ్చారు కంగారు వద్దు. హాయిగా చెయ్యి” అనునయంగా చెప్పింది.
“థాంక్స్ అమ్మా! వాళ్లందరినీ లోపలికి తీసుకొస్తాము” చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విశ్వం.
ఆర్తీ, కార్తీ వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లలతో ఆడుకుంటున్నారు. ధృతి పెళ్ళికూతురు దగ్గర కూర్చుంది. ఆ అమ్మాయి పేరు కల్యాణి. ధృతి ఈడు పిల్లే. ధృతి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆ అమ్మాయే కంపెనీ. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. చక్కని చుక్క. ఎక్కడో చూసారట. వాళ్ళే కబురు చేసారు, అందుకే వెంటనే ఒప్పేసుకున్నారు. కల్యాణి కూడా ఇంకా చదువుకోవాలని ఉందని మాట వరసకు అన్నదే కాని పెద్దగా వ్యతిరేకత చూపలేదు. ఆ అమ్మాయికి అలంకరణ మీద ఆసక్తి ఎక్కువ. మంచి సందడి పిల్ల. చక్కగా గలగలా మాట్లాడుతున్నది.
“కల్యాణీ… చదువుకోకుండా అప్పుడే పెళ్ళేమిటే?” తల్లో పూలు సవరిస్తూ అడిగింది.
“ధృతీ!. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా? నాకా పెద్ద గోల్స్ ఏమీ లేవు. కాదనటానికి కూడా కారణాలు లేవు. నీ కంటే ఏదో గోల్ ఉండే ఉంటుంది. అందుకే ఇప్పుడే పెళ్ళేంటి అంటున్నావు. అయినా . నేను అతనితో మాట్లాడాను. పెళ్ళయ్యాక బ్యూటీ కోర్స్ చేస్తానంటే ఒప్పుకున్నారు”
తల ఊపింది ధృతి. నిజమే ఆడపిల్లకు ఒక ఖచ్చితమైన గోల్ ఉండి నేను ఏమైనా సరే చదువుకుని తీరతాను అంటే తప్ప, మామూలుగా అయితే ఈడొస్తునే మంచి సంబంధం అనుకుంటే కనుక పెళ్ళి వేపే మొగ్గుతారు. లేదా తల్లితండ్రులకు తమ పిల్ల మంచిగా చదువుకుని తీరాలి అన్న కోరిక చాలా బలంగా అన్నా ఉండాలి. లేకపోతే …
కల్యాణిని చూసింది. మొహం సంతోషంతో వెలుగుతున్నది. బహుశా పూర్తి ఇష్టంతోనే చేసుకుంటున్నదేమొ…
“ఏంటే? అలా చూస్తున్నావు? బాగుందా నాకు ఈ డ్రెస్?”
“అదే చూస్తున్నాను. ఎంత అందంగా ఉన్నావో ఈ డ్రెస్ లో! అప్సరసలా ఉన్నావు” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నది.
ఇంతలో బయట హడావుడి వినపడింది. గుమ్మం దగ్గరకెళ్ళి బయటకు తొంగి చూసింది. అప్పటికే అందరూ వచ్చి లోపల కూర్చున్నారు. బ్రహ్మగారొచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్వం తమ అన్నదమ్ములను, బామ్మను పెళ్ళివాళ్ళకు పరిచయం చేస్తున్నాడు. ఉత్సాహంగా బయటికి రాబోయింది.
అందరికీ కాఫీలు, జ్యూస్ లు అందించే పనిలో బిజీగా ఉన్నది రమ. పనమ్మాయి ట్రేలో పట్టుకుని అందిస్తుంటే తాను మర్యాదగా ఒక్కొక్కరికి అందిస్తున్నది. ఇంతలో కిందనున్న కార్పెట్ తట్టుకుని కింద పడబోయి నిలదొక్కుకున్నదే కాని ట్రేని ఆపలేకపోయింది పనమ్మాయి. ట్రేలో ఉన్న కప్పులు గ్లాసులూ ట్రేలోనే దొర్లినా, కొద్దిగా చిందిన కాఫీ ఆ పక్కనే కూర్చున్న దాక్షాయణి మీద పడింది. అప్పటివరకూ ఏదో నవ్వుతూ మాట్లాడుతున్న దాక్షాయణి, కాఫీ మీద పడగానే, “చూసుకోనక్కరలేదా? యూ బ్రూట్…” అని అరుస్తూ లేచింది. అప్పటికే బిక్క చచ్చిపోయిన పనమ్మాయి ఆ అమ్మాయి అరుపులకు భయపడి ట్రే వదిలేసింది. దాంతో ట్రేలో వన్నీ కిందకు దొర్లి పూజా సామాగ్రి మీద పడ్డాయి. ఒక్క క్షణం అందరూ నిశ్ఛేష్టులై ఉండిపోయారు.
“మమ్మీ నేను వెళ్తున్నాను. అత్తయ్యా నీ ఇష్టం. ఈ పల్లెటూరి సంబంధం వద్దని చెప్తూనే ఉన్నాను. చూడు ఎలాంటి మర్యాద చేసారో?” గట్టిగా అరుస్తూ విస విసా వెళ్ళబోయింది దాక్షాయణి.
అప్పుడే తెలివిలోకి వచ్చిన విశ్వం “అయ్యో! అలా వెళ్ళిపోకమ్మా… ఎంత పది నిమిషాల్లో అంతా సర్దుకుంటుంది. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు. అమ్మా ధృతీ! అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి మన కల్యాణివి కొత్త బట్టలున్నాయి అవి ఇవ్వమ్మా” అంటూ హడావుడీ పడుతూ ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేసాడు.
ఒక్క ఊపుతో ఆ చెయ్యి విదిలించుకున్నది దాక్షాయణి.
“ఏంటీ? మీ అమ్మాయి బట్టలు నేను కట్టుకోవాలా? ఇవెంత ఖరీదైనవో మీకు తెలుసా?”
“నేను అలాంటివే కొత్తవి కొనిస్తాను అమ్మా…మా అమ్మ కదా… వచ్చి కూర్చో అమ్మా”
“అయిందేదో అయింది. మీరన్నా చెప్పండమ్మా అమ్మాయిని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోమని” నెమ్మదిగా, అనునయంగా చెప్పింది బామ్మ.
లోపలి నుండి అదంతా చూస్తున్న ధృతి పెళ్ళికొడుకో, వాళ్ళ అమ్మో… లేదా దాక్షాయణి తల్లో ఆ పిల్లను వారిస్తారేమో అని చూస్తున్నది.
చెల్లెలికి పెళ్ళి చేసి బావగారికి మంచి హోదా కల్పించినది శేఖరమే. ఆ కృతజ్ఞతతో వాళ్ళేమీ మాట్లాడలేక పోతున్నారు. స్వాతికి తెలుసు ఇప్పుడేం అన్నా పెద్ద రగడ చేస్తుంది కూతురు అని. ఆమెకీ నచ్చడం లేదు కూతురి ప్రవర్తన. కాని చేసేదేమీ లేక మిన్నకున్నది. ధృతికి చాలా కోపం వచ్చింది ఏదో అందామని అనుకుని కూడా బామ్మ సైగతో ఆగిపోయింది. వాళ్ళెవరూ ఏమీ మాట్లడకపోయేసరికి బామ్మ లేచి దాక్షాయణిని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా చాలా సేపు నచ్చచెప్పింది.
మొత్తం మీద ఒక అరగంట భీష్మించుకుని , అందరితో బతిమాలించుకుని కొద్దిగా తగ్గింది. ఆ తర్వాత అన్నీ చక చకా అయ్యాయి. తాంబూలాలు తీసుకుని పెళ్ళివాళ్ళు వెళ్ళాక హమ్మయ్య అని కూర్చున్నాడు విశ్వం.
“థాంక్స్ అమ్మా! ఇవాళ మీరుండబట్టి గండం గడిచింది. అందుకే మీరుంటే నాకు ధైర్యం ” అలసినట్లుగా కూర్చుంటూ అన్నాడు విశ్వం
“అంకుల్ ఇప్పుడే ఇంత గొడవ చేసింది. రేపు పెళ్ళిలో ఇంకెంత గొడవ చేస్తారో. ఆ పెద్దాళ్ళేంటీ? ఆ అమ్మాయికి ఒక్కటి తగిలించి నోర్మూయించక అలా కూర్చున్నారు? ఇక వాళ్ళదేమి పెద్దరికం?” కోపంగా అన్నది ధృతి.
“తప్పదమ్మా! ఆడపిల్లను కన్నాక ఇలాంటి అవమానాలకు సిద్ధపడే ఉండాలి. ఏళ్ళ తరబడి అలానే ఉంటున్నాము” నిట్టూర్చాడు.
“అదే ఎందుకుండాలి? పొరబాటున పడింది. దానికింత రాద్ధాంతం చేయాలా? ఒక నిముషం కూర్చుంటే అన్నీ సర్దుకుంటాయి. ఆ మాత్రం చెప్పలేరా వాళ్ళు?” అసహనంగా కోపంగా ఉన్నది ధృతికి.
“అమ్మా! ధృతీ ఆడపిల్ల తల్లితండ్రులంటేనే మగపిల్లాడి వాళ్ళకు లొంగి ఉండాలనేది కన్యాశుల్కం అప్పుడూ ఉన్నది. . వరకట్నం అప్పుడూ ఉన్నది. ఇక అవతలివాళ్ళు గొప్పింటివాళ్ళయితే వాళ్ల అహంకారానికి కూడా తలొగ్గాలి. రేపు నీకు ఏ ఉన్నవాళ్ల సంబంధమో వచ్చిందనుకో పిల్ల సుఖపడుతుందని ఇస్తారు. అప్పుడు మీ అమ్మావాళ్ళయినా అంతే. అయినా ఇవన్నీ చర్చలతో తేలే విషయాలు కావు. మనుషుల్లో మార్పు సహజంగా రావాలి. ఇప్పుడు ఇంకా నయం. మా తరంలో మరీ ఇబ్బందులు పడ్డాము… విశ్వం చాలా అలసిపోయావు. కాస్త రెస్ట్ తీసుకో. మేము బయలుదేరుతాము” చెప్పి లేచింది బామ్మ.
వాకిలి వరకూ వచ్చి సాగనంపారు విశ్వం దంపతులు.
“నేను చచ్చినా ఆస్తి ఉన్నవాళ్ల అబ్బాయిని చేసుకోను బామ్మా” అప్పటివరకూ వాళ్ళు మాట్లాడినదంతా మనసులో పెట్టుకున్న ఆర్తి కారెక్కగానే తన అభిప్రాయం చెప్పింది. అందరూ ఒక్కసారిగా నవ్వేసారు.
“భడవకానా… నోర్ముయ్యవే” మనవరాలి నెత్తి మీద తట్టింది బామ్మ నవ్వుతూ.
“లేనింటి పిల్లను కోడలిగా తెచ్చుకోవాలి. కలిగిన ఇంటికి కూతుర్ని ఇవ్వాలి అని వెనకటి రోజుల్లో అనుకునేవారు. లేనింటి పిల్ల అయితే ఒద్దికగా ఉంటుందనీ, ఉన్న వాళ్ల ఇంటికి కూతుర్ని ఇస్తే మాటి మాటికీ ఏమీ పెట్టే పనుండదని అప్పటి వాళ్ళ నమ్మకం. నిజానికి కూడా పెరిగిన వాతావరణం అయితేనేమీ, చదువు లేకపోవడం వల్ల అయితేనేమీ పుట్టింటి ఆసరా ఉండదు అనుకోవడం వల్ల అయితేనేమి ఆర్ధిక స్వాతంత్రం లేకపోవడం వల్ల అయితేనేమి… అత్తింటికి వెళ్ళిన ఆడపిల్ల అణిగి మణిగే ఉండేది. అప్పుడప్పుడు ఒక మాట అనుకున్నా అత్తాకోడళ్ళ మధ్య కనెక్షన్స్ బానే ఉండేవి. అయితే ఇప్పటి తరం ఆడపిల్లలు కూడా బాగా చదువుకుని మగపిల్లలతో సమానంగా సంపాదిస్తున్నారు. మాటంటే పడని ఆత్మాభిమానం ఇప్పటి ఆడపిల్లల సొత్తు. అందుకని ఇప్పుడు పరిస్థితి కొంత మారిన మాట వాస్తవమైనా ఇప్పుడు ఇంకో రకమైన ఈగోలతో అవస్త పడుతున్నారు అత్తాకోడళ్ళు” ఇంట్లో జరిగిన సంభాషణకు కొనసాగింపుగా అని క్లుప్తంగా అన్నది బామ్మ.
“మా మంచి బామ్మ” బామ్మ చుట్టూ చేతులేసి చెంప మీద ముద్దు పెట్టుకున్నది. తల్లికీ, బామ్మకీ ఎన్నడూ ఘర్షణ చూడని ధృతి. “అయినా బామ్మా ఆ పిల్ల తల్లికి కూడా చాలా పొగరు. పలకరిస్తే మంచిగా మాట్లాడను కూడా లేదు” చిరాగ్గా అన్నది.
“అందుకా తల్లీ… ఇందాక ఏటి దగ్గర చిన్నబోయావు. నిన్ను పలకరించక వాళ్ళే నష్టబోతారు” అనునయించాడు శివ.
“చూసావ్…. ” అని నవ్వేసింది ధృతి.
“ధృతీ. . . రేపు వెళ్ళొచ్చు . . ఇంత రాత్రి వేళ మంచిది కాదు” ఇంటి దగ్గరకొస్తూనే డిక్లేర్ చేసింది బామ్మ.
“ఏ…ఏ…” గంతులేసారు పిల్లలు. వాళ్ళకు అప్పుడే వెళ్ళాలని లేదు.
ఆ రాత్రి అన్నాలు తిని పడుకున్నాక ఆలోచనలో పడింది ధృతి. పొద్దుటినుండి విశ్వం పడుతున్న ఆందోళన వాళ్ళకు మర్యాదలు చేసేప్పుడు ఒక రకమైన కంగారు ఆ అమ్మాయిని అతి దీనంగా బ్రతిమలాడ్డం… ఇవన్నీ గుర్తొస్తుంటే మనసంతా దిగులుగా అయింది. ‘రేపు తనకు పెళ్ళయితే తండ్రి కూడా అలా తగ్గి ఉండాలా?’ అని. ఇంత వరకు ధృతికి ఇటువంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. తండ్రి తనకు ఆడా మగా డిస్క్రిమినేషన్ ఎప్పుడూ చూపించలేదు. కానీ హఠాత్తుగా గుర్తొచ్చింది… కిశోర్ సంబంధం రాగానే తనను ఒప్పించటానికి తల్లీ తండ్రి చేసిన ప్రయత్నం. తాను ఒప్పుకోవడం ఒప్పుకోక పోవడం అది వేరే సంగతి. కానీ తల్లీ తండ్రీ ఆశపడ్దారుగా మంచి సంబంధం… ఒప్పుకుంటే బాగుండు అని. . రేపు అలాంటిదే ఇంకోటేదన్నా వస్తే…? కల్యాణి అన్న మాటలు గుర్తొచ్చాయి. “కాదనడానికి కారణాలు కనపడలేదు. నీ కంటే గోల్ ఉన్నది.”
‘నాకేమన్నా గోల్ ఉన్నదా? ఎప్పుడు కుదిరితే అప్పుడు పెళ్ళి చేసుకోవడానికి తాను తయారుగా ఉన్నదా? తనకు తాను ప్రశ్నించుకున్నది. ఏముంది బీటెక్ పూర్తవుతూనే మూడు ఆప్షన్స్ ఉంటాయి ఆడపిల్లకు. ఉద్యోగము, రాకుంటే పై చదువు, , లేదంటే పెళ్ళి. అప్పుడు తాను ఏదో ఒకటి నిర్ణయించుకోవలసిన సమయం వస్తుంది. సో… తాను పై చదువు చదవడం ఫస్ట్ ప్రైయారిటీ. అదర్ దాన్ ఎమ్మెస్ వేరే ఏమి చేయొచ్చు? ఐఏఎస్, ఐపీఎస్ పోనీలే అవన్నీ ఇంకో ఏడాదయ్యాక చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న గోల్ బాగా చదివి మంచి జాబ్ వచ్చేవరకు పెళ్ళి ప్రసక్తి రానివ్వకూడదు. అలాగే ఎంత గొప్ప సంబంధం అన్నా రానీ ఆఖరికి టాటా బిర్లాలా ముని మనమడొచ్చి చేసుకుంటానన్నా ఒప్పుకోకూడదు. ఎట్టి పరిస్తితుల్లో నాన్నను తగ్గనివ్వకూడదు’ గట్టిగా నిర్ణయించుకుని ప్రశాంతంగా నిద్రపోయింది.

************

ఇంకా వుంది…

1 thought on “ధృతి – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *