March 28, 2024

పరవశానికి పాత(ర) కథలు – 2 , నేను చూసిన నక్షత్రం

రచన: డా. వివేకానందమూర్తి

నాకీ మధ్య హఠాత్తుగా కథలు రాసే యావ తగ్గిపోయి రాయడం మానేశాను. కథ రాయడం మానేయడానికి కథ ఉంది.
నేనెప్పుడు కంచికి వెళ్ళిన కథే మంచి కథ అనుకుంటాను. కథలు ముమ్మరంగా రాసే రోజుల్లో నేనోసారి కంచికి వెళ్లేను. నా కథ లెక్కడేనా కనిపిస్తాయేమోనని కాంచీపురమంతా కళ్లు కంచు కాగాడాల్లా చేసుకుని కాంచేను. కనిపించలేదు. నేను కంచికి చేరినా నా కథలు కంచికి చేరలేదు. అంచేత నేను మంచివి రాయలేదనుకున్నాను. నాకు చాలా బాధేసింది. భయమేసింది. దాంతో కథ వ్రాయడం మానేశాను – అలా వ్రాయక పోవడం వల్ల వూసుపోడం మానేసింది. తోచడం కోసం తోచినప్పుడల్లా సినిమాలు చూడ్డం ప్రారంభించాను. అలా చూడగా చూడగా చూడ్డం ముదిరి పోయి, నన్ను కూడా అలా తెర మీద అందరూ చూస్తే బావుణ్ణనిపించింది. తక్షణం రచయితగా రాయడం మానేసి, తెర మీద నటుడినై రాణించాలనుకున్నాను. ఉత్తర క్షణం లుంగీ కట్టుకుని మద్రాసు పోయే రైలెక్కేశాను.
మద్రాసు నగరం మహత్తరంగా అనిపించింది. కొత్త జీవితం గురించి కొత్త కలలు కంటూ పాండీ బజార్లో బృందావన్ లాడ్జిలో దిగాను. రైలు ప్రయాణం బడలికలో ఆ పగలంతా నిద్రలో టెక్నికలలు కూడా కన్నాను.
సాయంత్రమైంది. రూముకి తాళం వేసి బజార్లోకొచ్చేను. అటూ యిటూ చెట్లతో అశోకుడు పాలించిన రాజ్యంలా పాండీ బజారు కళకళ్ళాడుతోంది. చెట్ల కింద చిన్న తరహా నటులు తెలుగు మాట్లాడుకుంటున్నారు. కాఫీ తాగుదామని వీ.కె రెస్టారెంటులోకి వెళ్లేను. టేబుల్ దగ్గర ఒక్కణ్టి కూర్చుని కాఫీ తాగుతూంటే కప్పు ఖాళీ అయ్యే సమయానికి ఎదుటి సీట్లో కూర్చుంటూ ఎవరో ఒకతను నన్ను పలకరించేడు.
‘‘వేషాలకొచ్చేరా?’’ స్వచ్ఛమైన తెలుగులో స్పాట్ డయగ్నోసిస్ చేసేశాడు.
‘‘కాఫీ’’
‘‘మీరెవరు?’’ అన్నా.
‘‘నన్ను వేలుమణి అంటారు. ఈ ఫీల్డుకి పాతికేళ్లు పాతవాడ్ని. యిక్కడికి రాక మునుపు వెంకటనరసయ్యని. కొత్తలో ఈ వూరు నీళ్లు పడక పేరు మార్చుకున్నాను. ఇప్పడు ఈ బజార్లో ఏ చెట్టు నడిగినా కొమ్మలూపుకుంటూ నా కథ చెప్తుంది.’’ కాఫీ వచ్చింది. ‘‘మరో పట్టు పట్టండి’’ మళ్ళా మరి కాస్త కాఫీ తాగేను.
‘‘పదండి. అలా నడుస్తూ మాట్లాడదాం’’ బిల్లు నా చేతిలో పెట్టేడు.
పాతుకు పోయిన నటుడిలా అనిపించేడు నాకు. కానీ అతని బొమ్మ నేను ఏ చిత్రంలోనూ చూసిన గుర్తు లేదు.
‘‘బీచ్ కి వెళ్దామా?’’ సిగరెట్టు వెలిగించేడు నాకొకటిస్తూ. నేను ముట్టిస్తూంటే పిలిచేడు – ‘‘టాక్సీ ! ’’
టాక్సీ దిగేం. మీటరు చూసి వేలుమణి లెక్క చెప్పేడు. పే చేసేను. రోడ్డు దిగి యిసుకలో నడుస్తూంటే వేలుమణి మాట్లాడడం ప్రారంభించాడు.
‘‘నేను పాతిక సంవత్సరాల క్రితమే నా నట జీవితం ప్రారంభించాను. ఎన్నో రకాల పాత్రలు ధరించాను. మీకు నచ్చిన పాత్ర ఏది? అని చాలా మంది ప్రెస్ మనుషులు చాలా సార్లు అడిగేరు. తల్లిని పిలిచి నువ్వు కన్న పిల్లలందర్లోకి ఎవర్ని ఎక్కువ అభిమానిస్తావని అడిగితే అందుకు ఆ తల్లేం బదులు చెప్పగలదు చెప్పండి? అదుగో ఆ తల్లి లాగే నేనూ తల్లడిల్లి పోయి సమాధానం చెప్పలేక పోయే వాడ్ని. బటానీలు కొనుక్కుందాం’’ అన్నాడు. కొనుక్కున్నాం.
‘‘క్షమించాలి. మీరు ధరించిన పాత్రలేవీ నాకు చూసిన జ్ఞాపకం లేదు.’’ అన్నాను.
వేలుమణి బటానీలు పటపటలాడిస్తూ చెప్పాడు. ‘‘అదుగో – అదే నటన అంటే. ప్రేక్షకుడి దృష్టిలో పాత్ర పాతుకు పోయినప్పుడు నటుడు జ్ఞాపకానికి రాడు. నేను పాత్రల్లో జీవించాను. అందుకే నా పాత్రలు జనానికెంత దగ్గరో నేనంత దూరమయి పోయాను.’’ మేం జనానికి బాగా దూరంగా నడుస్తున్నాం.
‘‘మీ పాత్రలేమిటో చెప్పారు కాదు?’’ అడిగాను.
వస్తున్నా, వస్తున్నా – ఆ మధ్య ‘పిడిలేని కత్తి’ అనే జానపద చిత్రంలో
అంతఃపుర ద్వారపాలకుడిగా నటించి అప్రతిహత నటనా చాతుర్యాన్ని ప్రకటించాను. అందులో మహారాణిగా నటించిన ప్రఖ్యాత నటీమణిని నేనే బయటకి వెళ్ళకుండా శూలం అడ్డుపెట్టాను. చూశారూ !.. ‘మెడతిప్పని వీరుడు’
చిత్రంలో యుద్ధానికి పరుగు తీస్తున్న భటులలో ముందర నిలబడి ‘‘పదండి !’’ అని కేకేసిన వాణ్ని నేనే. అంతేకాదు ‘‘ హిడింబి’’ అనే పౌరాణిక చిత్రంలో డ్యూయల్ రోల్ ఏక్ట్ చేశాను. అంటే రాక్షసుడిగాను, మునిపుంగవుడి గాను నటించాను. ఈ రెండు విభిన్నమైన పాత్రలు, కానీ వాటిని స్టడీ చేసి వాటికి న్యాయం చేకూర్చాను. పాత్రకి న్యాయం చేకూర్చడమంటే ఏమీ లేదు. పాత్రని అర్థం చేసుకు నటించడం, అంటే రాక్షసుడి వేషంలో ఒక మునీశ్వరుణ్ణి బాధించాలనుకోండి. ముందు అతని గడ్డం పట్టుకోవాలా? కొప్పు పట్టుకోవాలా? అనేది ఆలోచించాలి. అలాగే శూలాన్ని రాజుగారికి గుచ్చుకోకుండా ఏ యాంగిల్ లో ఎలా పట్టుకోవాలి? మొదలైనవన్నీ స్టడీ చెయ్యాలి. నేనలా స్టడీ చేసి నటించిన వేషాలన్నీ యాకరువు పెట్టాలంటే హోటలు కట్టేస్తారు. ఎన్నో చిత్రాల్లో పేపర్ బాయ్ గాను, పోస్ట్ మన్ గాను మరియు పోలీసుగాను నటించాను. ఇంకా అనేక సాంఘిక చిత్రాల్లో క్లబ్ డాన్సులు, స్ట్రీట్ డాన్సులు అందరి కంటే ముందు నిలబడి చూసేవాణ్ణి. అప్పుడు నాకిచ్చేది ఒక్క ఫ్రేమే అయినా, అందులోనే నా హావభావ ప్రకటనంతా గుప్పించేసే వాణ్ణి.’’ వేలుమణి నన్ను మాట్లాడనీయలేదు.
‘‘అసలు నేనీ స్టేజీకి రాక పూర్వం డబ్బింగ్ చిత్రాలకి గొంతు ఎరువిచ్చేవాణ్ణి. ఓ సారి నేను గొంతు ఎరువిచ్చిన డబ్బింగు చిత్రాన్ని విడుదలయ్యాక జనం మధ్య కూర్చుని చూశాను. అందులో ఓ సన్నివేశంలో హీరో చెంబు తీసుకొచ్చి యిచ్చేసిం తర్వాత కూడా హీరోయిన్ ‘సఖా! ఆ చెంబు యిలా తీసుకురావూ’ అని అడిగింది. మాటలు కలవలేదు. డబ్బింగ్ చిత్రమంటే గౌరవం పోయింది. దాంతో మరి డబ్బింగ్ చిత్రాల జోలికి పోకూడదనుకున్నాను.’’
పకోడీలు కొనుక్కున్నాం. అవి తింటూ వేలుమణి మళ్లీ మొదలెట్టాడు.
‘‘నేను ఫీల్డులోకి అసలు ఎలా ప్రవేశించానో అడిగారు కాదు. మొదట్లో నేనసలు ఈ రంగంలోకి నిర్మాతగా అడుగు పెట్టాను. ఉన్నతాదర్శాలతో వుత్తమమైన సాంఘిక చిత్రం తియ్యాలని. స్ర్కిప్టు మీద నేనే కూర్చుని, కూర్చుకుని వున్న డబ్బంతా పోగేసి, పోసేసి తీశాను. నేను హీరోగా నటించిన ఏకైక చిత్రం అదొక్కటే. చిత్రం పేరు అవతలి వీధి. డైరెక్టర్ని కూడా నేనే. కథేమిటో తెలుసా? హీరోయిన్ అవతల వీధిలో వున్న హీరోని కలుసుకుందామని బయలుదేరుతుంది. ఆ వీధిని చేరే లోపులో అమె సంఘంలోని మంచీ చెడులను సూచించే ఎన్నో సంఘటనల్నీ, పేదవాళ్ళ కష్టాల్నీ, కుక్కపిల్లల్నీ, కుళ్లు కాలువల్నీ, ఓ తెలుగు సినిమానీ అన్నిటినీ చూస్తుంది. చివరికి ఆమె హీరో యింటి గుమ్మం ఎక్కడంతో కథ సమాప్తమవుతుంది. ట్రాజెడీ లెండి. అంటే – హీరో యింట్లో వుండడు. తలుపు తాళం వేసుకుని ఎక్కడికో పోతాడు. ‘ఏ’ క్లాస్ సెంటర్స్ లో యింటర్వెల్ దాకా ఆడింది. ఆ దెబ్బతో నటుడిగా మారిపోయాను. నేను నటుడిగా తారాపథం అందుకోవాలని రాసి పెట్టినట్టుంది. అదుగో? ఆదర్శ చిత్రం అలా కలిసొచ్చింది.’’
పకోడీలు అయిపోయాయి. బాగా చీకటి పడింది.
‘‘రండి పోదాం’’ వెనక్కి తిరిగేం. ‘‘అన్నట్లు యింత సేపూ మీ గురించి ఏమీ అడగనే లేదు, ఏమైనా రికమండేషన్ లెటర్స్ తెచ్చారా?’’
‘‘లేదు’’
‘‘లేక పోయినా ఫరవాలేదు. నేనున్నానుగా. సాటి నటుల్ని ఆదరించడం మేటి నటుడిగా నా మొదటి విధి. మీకు ఫీచర్స్ వున్నాయి. అంచేత ఫ్యూచర్ వుంటుందనుకుంటున్నాను. కొన్నాళ్ళ పాటు నాతో స్టూడియోల్లో తిరుగుతూ షూటింగ్స్ ఫాలోకండి. నెమ్మదిగా తెలుస్తుంది. రేపు మోహినీలో నాకు షూటింగ్ వుంది. ఇదివరకెన్నడూ ధరించనటువంటి ఒక విభిన్నమైన పాత్ర ధరిస్తున్నాను. పొద్దున మిమ్మల్ని కూడా తీసుకుపోతాను. చూద్దురు గాని.’’
వేలుమణికి గుడ్ నైట్ చెప్పి రూమ్ కి వచ్చే సరికి బాగా రాత్రయింది. నా వేషం గురించి ఆలోచించడం మానేసి వేలుమణి పరిచయం గురించి ఆలోచించాను. ఉదయం ఎనిమిది గంటలకల్లా వీ.కె.రెస్టారెంటు దగ్గరుండమన్నాడు. రెప్పలు బరువెక్కేదాకా రేపు గురించి ఆలోచించాను.
తెల్లారింది.
అనుకున్న ప్రకారం వేలుమణితో మోహినీకి వెళ్ళాను. వేలుమణి నన్ను ఫ్లోర్ లోకి నడవమని మేకప్ కి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితుడు యాదవరెడ్డి కనిపించాడు. పబ్లిసిటీ శాఖకి యిన్ ఛార్జీట. మాటల్లో వేలుమణి నటిస్తున్న చిత్రానికి నిర్మాతల్లో తనూ ఒకడని తెలిసింది. రెడ్డీ, నేనూ కబుర్లు చెప్పుకుంటూ వేలుమణి వేలు పెట్టి చూపించిన ఫ్లోర్ లోకి వెళ్ళాం. ఏదో రైసుమిల్లు ఖాళీ చేసి పెట్టినట్టుంది. లోపలికి అడుగు పెట్టగానే గాడి పొయ్యిలో ప్రవేశించినట్టనిపించింది నాకు. ఉక్కబోత ప్రారంభమైంది. అక్కడేదో అడవిలా సెట్టు వేశారు. కాగితాల్తో తయారు చేసి పెట్టిన రాళ్లు, రప్పలూ కంటికి బరువుగా కనిపిస్తున్నాయి. నరికి తెచ్చిన చెట్ల కొమ్మలు ఆకులన్నీ వాడిపోయి ఫెయిలయిన చిత్రాల నిర్మాతల్లా నిండివున్నాయి. అక్కడా అక్కడా ప్లాస్టిక్ పువ్వులు, తీగలు కూడా అమర్చేరు. స్పాట్ లైట్లు, కెమెరా వగైరాలతో జనం హడావుడిగా ఏవో సర్దుబాట్లు చేసుకొంటున్నారు. ‘మంచి పిడుగులు’ అనే జానపద చిత్రం తాలూకు షూటింగట అది. కాస్సేపటికి రాకుమారుడి వేషంలో హీరో గారు సిగరెట్టు కాల్చుకుంటూ ప్రవేశించారు. ఆయన్ని నేనిదివరకు చాలా చిత్రాల్లో చూసాను. అంచేత చూడగానే గుర్తుపట్ట గలిగాను.
స్టంటు మేష్టర్లు, హీరో, ఒక గొరిల్లా కెమెరా మందుకి చేరారు. స్టంట్ మేష్టర్లు కొట్టుకుంటూ కుమ్ముకుంటూ షాట్ వివరిస్తున్నారు. బాగా ఎండెక్కినట్టుంది. ఉక్కబోత భరించ లేకుండా తయారైంది. ఉన్న రెండు ఫాన్లు ఎంత తిరిగినా గాలి చాలడం లేదు. ఎంత ఫానుకంత గాలి. పీల్చడానికి సరిపోయే గాలి మాత్రమే కదుల్తోంది.
గొరిల్లా యాతన భరించ లేక రెండు చేతుల్తోనూ తల వూడదీసేసుకుంది. ఆశ్చర్యపోయాను – వేలుమణి తల కనబడింది నాకు. నిన్న తను చెప్పిన పాత్ర యిదా అనుకొన్నాను. ఆయాసపడుతూ ముఖం నిండా పట్టిన చెమటల్ని తుడుచుకోబోతుంటే స్టంటు మేష్టరు ‘ఉఁ ఉఁ ! మాస్క్ తగిలించుకో అంటూ వేలుమణిని చేత్తో పొడిచేడు. సగం వూపిరితో సరిపెట్టుకుంటూనే వేలుమణి మాస్క్ తగిలించుకున్నాడు. మాస్క్ తగిలించుకున్న వేలుమణిని చూస్తుంటే మనిషిగా అనుకోడం కష్టంగానే వుంది. అచ్చం గొరిల్లాలాగే కనిపిస్తున్నాడు. స్టంట్ మేష్టారు ‘‘షాట్ రెడీ, లైట్స్ ఆన్…’’ అంటూ నాలుగైదు శబ్ధాలు చేశాడు. హీరో మీదికి, గొరిల్లా మీదికి దీపాలు ఫోకస్ చేశారు. గొరిల్లా నెమ్మదిగా వచ్చి తెలుగు సినిమాలో ప్రేమించుకున్నట్టు హీరోని వెనక నించి వాటేసుకుంది. హీరో ఏమీ కంగారు పడకుండా గొరిల్లా కడుపులో మోచేత్తో గుద్దాడు. ఆ దెబ్బకి వేలుమణి వెనక్కి తూలి పడ్డాడు. ‘‘కట్’’ అన్నారు. వేలుమణి బాధగా కడుపు చేత్తో పట్టుకుని లేవడానికి ప్రయత్నం చేస్తూంటే, స్టంట్ మాష్టరు ‘‘ లే! లే! ’’ అని గదమాయించాడు. అప్పుడు హీరో చిరునవ్వుతో ‘‘దెబ్బ గట్టిగా తగిలిందా బ్రదర్’’ అంటూ వేలుమణిని ఒంటి చేత్తో లేవ దీశాడు. వేలుమణి సఫకేషన్ భరించలేక ఒక్క సారి మాస్క్ తీశాడు. చెమటలు పట్టిన అతని ముఖంలో బాధని నేను చూడ లేక పోయాను. గంట కాలం వేడెక్కింది. అదే షాటు పదే పదే తీస్తున్నారు. వేలుమణి పడే వేదన నేను భరించలేక పోయాను. యాదవరెడ్డితో ‘‘బైటకి పోదాం’’ అన్నాను. ‘‘కాఫీ వచ్చింది. తాగి వెడదాం’’ అన్నాడు.

కాఫీ నేను తాగ లేక పోయాను. అది నా కంటికి మకిలి కాఫీలా కనబడింది. వేలుమణి చెమటలా కూడా కనబడింది. ఫీల్డులోకింకా ప్రవేశించకపోయినా కాఫీ తాగినట్టు బాగానే నటించాను.
ఫ్లోర్ బైటికి వచ్చేసే ముందు ఒక్క సారి వేలుమణి కేసి చూశాను. ఒక చేత్తో మాస్క్ పట్టుకుని జాలిగా నా వేపు చూస్తూ మరో చెయ్యి నీరసంగా వూపేడు. నేను ఆముదం తాగిన చిరునవ్వు నవ్వినట్టు ఒక చిరునవ్వు నవ్వి కదిలేను. నిన్న సాయంత్రమంతా నాతో తిరిగిన వేలుమణికి ఈ వేలుమణి డూప్ లా అనిపించేడు.
‘‘ఎలా వుంది?’’ అన్నాడు యాదవరెడ్డి.
‘‘చాలా హృదయ విదారకంగా వుంది’’ అన్నాను.
‘‘నీది మరీ కుర్రవాడి మనస్తత్వం. గొరిల్లా హీరోని చంపేస్తుందనుకున్నావా? కాదు. హీరో చేతిలో అదే చచ్చిపోతుంది.’’
‘‘అవును, చూశాను’’
‘‘గమ్మత్తేమిటంటే అది గొరిల్లా కాదు’’
‘‘అవును, వేలుమణి’’
‘‘వేలుమణి కాదు, వెంకట సుబ్బయ్యా కాదు. అది సీతామహాలక్ష్మి. మాంచి సెక్స్ డాన్సర్. చనుకట్టు తీరు బాగుంటుంది. సినిమాలో గొరిల్లా చావగానే శాపవిమోచనమై గంధర్వకన్య అవుతుంది. అప్పుడు గంధర్వకన్య వేషంలో సీతామహాలక్ష్మి డాన్సు చేస్తుంది. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వుంటాయి తను పిక్చర్లో వుంటే.’’
యాదవరెడ్డి మాటలు వింటూ ఎంతో సేపు గడిపాను. ‘‘పని మీద వచ్చావా?’’ అని అడిగినప్పుడు, సెలవుల్లో ఏం చెయ్యాలో తోచక సరదాగా మద్రాసులో తిరిగిపోదామని వచ్చేశానని చెప్పాను. ఆ సాయంత్రం రెడ్డి నన్ను హోటల్లో రూము ఖాళీ చేయించి వాడింటికి తీసుకు పోయాడు.
ఫ్లోరులో అసంగతంగా విడిపోడం వల్ల మళ్లీ వేలుమణి, నేనూ కలియడం జరగలేదు. అతని గురించి జాలి పడుతూ ఆలోచించడం తప్ప నాకు అతన్ని మళ్ళా కలిసే ప్రయత్నం చెయ్యాలనిపించలేదు. వేలుమణి కూడా ప్రయత్నించినట్టు లేదు.
వేలుమణిని చూశాక నాకు ‘వేషం’ మీద మోజు తగ్గింది. నాల్గురోజుల పాటు వూళ్లో తిరిగాను.
ఆ మర్నాడు రెడ్డితో పబ్లిసిటీ సెక్షన్ లో కూర్చున్నప్పుడు వేలుమణి పిల్లిలా వచ్చాడు. వంగి నమస్కారం పెట్టాడు. రెడ్డి వేలుమణిని చూడకుండా యాష్ ట్రే కదుపుతూ, నుసి కేసి చూస్తూ ‘‘ఏవఁయ్యా ! ’’ అన్నాడు. నేను వేలుమణి కేసి చూశాను. నాకేసి చూసి యిరకాటంగా నవ్వుతూ
‘‘అబ్బే ! ఏమీ లేదండి’’ అంటూ నసిగాడు.
‘‘ఏమిటయ్యా! పిక్చరంతా పూర్తయ్యాక, నీకు రావలసిందంతా ముందే తీసకున్నావుగా’’
‘‘అది కాదండి. ఈ సారన్నాటైటిల్స్ లో కాస్త నా పేరు రాయించండి సార్’’
రెడ్డి ఫకాలున నవ్వాడు. ‘‘ఓస్ అదా! సర్లే వెళ్ళు.’’
వేలుమణి చిన్న బుచ్చుకుంటూ వెనక్కి తగ్గేడు. నన్ను కూడా నవ్వు కలపమన్నట్టు నాకేసి చూస్తే సగం నవ్వు కష్టంగా నవ్వాను.
ఆ తర్వాత రోజు రెడ్డి నన్ను ఆఫీసులో కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్ళాడు. ఆ సెక్షనంతా తిరుగుతూంటే ఓ టేబుల్ మీద ‘మంచి పిడుగులు’ తాలూకు టైటిల్ షీట్స్ కనిపించాయి. యింకా డైరెక్టరు పేరూ, నిర్మాతల పేర్లూ పూర్తిగా దిద్దలేదు. వెదికి చూస్తే వేలుమణి పేరెక్కడా నాక్కనబడలేదు. నాకు మళ్లీ జాలేసింది. యింకా రెడ్డి రాలేదు. అక్కడ ఈజీ ఛైరొకటి కనిపిస్తే అందులో అనీజీగా వాలి కళ్ళు మూసుకున్నాను.
కళ్లు తెరిచే సరికి వెళ్లి పోతున్న వేలుమణి వెనక భాగం కనబడింది నాకు. యింకా రెడ్డి రాలేదు. ఎందుకో అనుమానం వచ్చి మళ్ళా టైటిల్ షీట్స్ దగ్గరికి వెళ్లేను. పైకి తీసిన షీటు మీద ఉప పాత్రధారుల పేర్ల క్రింద ‘‘గొరిల్లా – వేలుమణి’’ అని కొంకి గీతల్తో రాసుంది. దాంతో ఆ షీటంతా అసహ్యంగా తయారయింది. ఆ సినిమా మొత్తానికి టైటిల్స్ ఒక్కటే బాగుంటాయనుకున్న నాకు, ఆ కాస్త ఆశ కూడా పోయింది. అయినా ఎందుకో వేలుమణి మీద జాలి పడుతున్న నా మనసుకి వుపశమనం కలిగినట్టయింది.
మద్రాసు వదిలి వచ్చే ముందు ‘మంచి పిడుగులు’ ప్రీవ్యూ చూశాను. విచిత్రం. టైటిల్స్ లో వేలుమణి పేరు కనబడలేదు. కుత్తుకలోనే కట్ చేసినట్టున్నారు. వేలుమణి ప్రయత్నం కాస్తా వెర్రి ప్రయత్నమైపోయింది. తెర చాటు బ్రతుకు మరీ కత్తెర చాటు బ్రతుకైపోయింది.
అన్ని చిత్రాల్లోనూ చిన్న పాత్రల్లోనే కనిపించే వేలుమణి చిత్రం ఏమిటంటే యిందులో కనీసం మనిషిగానైనా కనిపించలేదు. అచ్చు మచ్చు అడివిలో తిరిగే గొరిల్లాలాగే వున్నాడు. జంతువై మరణించాడు. నాకు మాత్రం వేలుమణి మరిణించినట్టు వుంది. చివరికి ప్రేక్షకులు వేలుమణిని వేషం వేసిన మనిషి అని కూడా అనుకోరు. ఏ సర్కసు మృగమో అనుకుంటారు. కానీ వేలుమణి కూడా చిత్ర విజయానికి తోడ్పడతాడు. పాపం!.. తాజ్ మహల్ కట్టిన కూలీలాగే తారాపథంలో వేలుమణి కనపడని నక్షత్రంగా వుండిపోతున్నాడు.
ఏమిటో నటుణ్ణి కావాలని మద్రాసు వెళ్ళి వేలుమణి ధర్మమా అని మళ్లీ -కథ వ్రాయడం మానేయడం మానేసి, రచయితనయి పోయాను. నేను మరి కంచికి వెళ్ళను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *