May 25, 2024

బంధం

రచన: రాజ్యలక్ష్మి బి

క్లాసులో పిల్లలకు టెస్ట్ పెట్టి కూర్చున్నదన్న మాటే కానీ రాజ్యం మనసులో అంతా గందరగోళం!బడికి వస్తుంటే యింటి దగ్గర అమ్మ చెప్పిన మాటలు పదే పదే చెవిలో రింగుమంటున్నాయి. రేపు తనను చూడడానికి పెళ్లివారొస్తున్నారు కనుక బడికి సెలవు పెట్టమంది. కానీ రాజ్యానికి పెళ్లిచూపులంటే మహా కంపరం. ఒకసారి తలెత్తి పిల్లలందరినీ చూసింది. అందరూ తలొంచుకుని శ్రద్హగా వ్రాస్తున్నారు. అందరూ అమ్మాయిలే. అరవిరిసిన లేత గులాబీల్లాగా స్వచ్ఛంగా మెరుస్తున్నారు. భవిష్యత్తులో వీళ్లు యెన్ని పెళ్లిచూపులు యెదుర్కొవాలో, అనుకుంటూ రాజ్యం వాళ్లను సానుభూతితో చూసింది.

రాజ్యానికి రెండేళ్ల క్రిందటి తన మొదటి పెళ్లిచూపులు గుర్తుకొచ్చింది. అప్పటి తన అమాయకత్వాన్ని యిప్పుడు తల్చుకుంటే తన మీద తనకే కోపం వేస్తుంది. తను గొప్ప అందగత్తె కాకపోయినా చూడడానికి బాగుంటుంది. తీర్చి దిద్దిన అంగసౌష్ఠవం చురుకైన కళ్లు, సన్నని మల్లెమొగ్గలాంటి ముక్కు! ఉపాధ్యాయినిగా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నది. పెళ్లి చూపుల్లో అతనికి తను నచ్చుతుంది. అతను కూడా అందంగా ఠీవిగా వున్నాడు. బ్యాంకులో వుద్యోగం. తనకు అతను నచ్చాడు. అతనికి తను నచ్చాలని మనసారా కోరుకుంది. అతను తనతో మాట్లాడాడు. ఆ మాటల్లో ఒకటి మాత్రం బాగా గుర్తుంది తనకు. “రాజ్యం, మీరు నాకు నచ్చారు, నేనూ మీకు నచ్చానని మీ కళ్లు చెప్తున్నాయి. మిగిలిన విషయాలు పెద్దవాళ్లు మాట్లాడుకుంటారు” అన్నాడు. రాజ్యానికి అతని మాటలు వెన్నెల్లో సన్నజాజి పరిమళంగా హృదయాన్ని పరవశింపచేసింది. స్వప్నజగత్తులో అందమైన కలలు కన్నది.
అమ్మ నాన్నతో మాట్లాడడం విన్నది, “పెళ్లిచూపులు జరిగాయి, మన రాజ్యం వాళ్లకు నచ్చింది, దీనికీ అతను నచ్చాడు, కానీ వాళ్లు ఎంతలో వున్నారో యేమో, కట్నం యెంతడుగుతారో”అమ్మ మాటలు రాజ్యానికి సూదుల్లా గుచ్చుకున్నాయి.
నాలుగు రోజుల తర్వాత పెళ్లివాళ్ళు నాన్నగారిని రమ్మన్నారు. నాన్న తన స్నేహితుడు సీతాపతిని తోడు తీసుకుని వెళ్లారు. సాయంత్రం దిగులుగా తిరిగి వచ్చారు. అప్పుడు రాజ్యం లోపల వుంది.
“ఏమండీ పెళ్లివాళ్లేమన్నారు ?” అమ్మ అడిగింది.
“ఏం చెప్పను సీతా! వాళ్లు అయిదు లక్షలు కట్నంగా అడుగుతున్నారు, లాంఛనాలు కూడా భారీగా కావాలిట. నేను రెండు లక్షలు యివ్వగలనని చెప్పాను. వాళ్లు ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి అక్కడే వున్నాడు, అన్నీ వింటూ కూడా ఏం మాట్లాడలేదు. మనకు యింకా యిద్దరు మగపిల్లలున్నారు, వాళ్ల చదువులున్నాయి. మనం వాళ్లతో తూగలేం, రాజ్యానికి నువ్వే నెమ్మదిగా నచ్చచెప్పు”అంటున్న నాన్న మాటలు రాజ్యం విన్నది.
రాజ్యం స్వప్నసౌధం కూలింది. అందమైన కలలు చెదిరాయి. వరకట్న పిశాచి తన్ను చూసి నవ్వుతున్నట్ట నిపించింది. అమ్మా నాన్నా తన వల్ల దిగులు పడటం బాధనిపించింది. ఇప్పుడు తనేవాళ్లకు ధైర్యం చెప్పాలి. అతను తనకు నచ్చాడు నిజమే కానీ అతనికి డబ్బే ప్రధానం అయితే తనకు అతను అనవసరం!
ఆ రాత్రి భోజనాలప్పుడు తండ్రిని చూసింది రాజ్యం. ఆయన యేదో తప్పు చేసిన వాడిలాగా తలదించుకుని అన్నం మెతుకులు కెలుకుతున్నారు. రాజ్యం అది చూసి తట్టుకోలేకపోయింది.
“నాన్నా! యేదో తప్పు చేసినట్టు మీరెందుకు బాధపడుతున్నారు ? డబ్బుకే ప్రాధాన్యమిచ్చేవాళ్లను గురించి మనమెందుకు బాధపడాలి ? మనమెందుకు ఆలోచించాలి ? వదిలెయ్యండి! నేను యిష్టపడింది నిజమే కానీ అతని అంతరంగం తెలిసాక కూడా అతనే కావాలి అనే మూర్ఖురాలిని కాదు. నాన్నా! నాదో విన్నపం. కట్నం కోరే పెళ్ళికొడుకు, పెళ్లిచూపులు నాకొద్దు. పెళ్లే జీవితపరమార్ధం కాదు.” అంటూ తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పింది రాజ్యం.
వెంటనే అమ్మ నాన్నతో “ఇదేమి చోద్యమండీ” అనడం రాజ్యం విన్నది. ”అవును సీతా అభిమానం కల యే ఆడపిల్లయినా రాజ్యంలాగానే ఆలోచిస్తుంది. వదిలెయ్యి ఆ విషయం” నాన్న అమ్మను మందలించారు. రాజ్యానికి కొంత వూరట కలిగింది.
రెండు సంవత్సరాల సమయంలో వచ్చిన సంబంధాలలో ఒకరిద్దరికి తను నచ్చిన వాళ్లు పరోక్షంగా కట్నం కావాలని అడిగించడం తెలిసి రాజ్యం నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఇప్పుడు రాజ్యానికి బడి, పిల్లలూ, పాఠాలు యిదే తన ప్రపంచం! పెళ్లిగురించి ఆలోచించడం పూర్తిగా మానేసింది. .
బడి గంట వినపడి వులిక్కిపడుతూ వర్తమానంలోకి వచ్చింది రాజ్యం. క్లాసులోనించి బయటకు వచ్చింది. మళ్లీ అమ్మ మాటలు “పెళ్ళికొడుకు పేరు రామచంద్రం, మన వూళ్లోనే కరెంట్ ఆఫీసులో పని చేస్తాడు. అమ్మాయి నచ్చాలి అంతే” మళ్లీ చెవిలో రింగుమన్నాయి. రాజ్యం అలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఒక లీవ్ లెటర్ యిచ్చేసి బడి బయటకు వచ్చింది.
కరెంట్ ఆఫీసు బయట ఆవరణలో చెట్టుకింద నించుంది. లంచ్ సమయం అవడం వల్ల అందరూ బయటకు వస్తున్నారు. ఒకతను హుందాగా ఠీవిగా రాజ్యం వైపు చూస్తూ వచ్చాడు. బహుశా తన ఫోటో చూసి వుంటాడు అనుకుంది రాజ్యం. .
“నమస్తే” అంటూ రాజ్యాన్ని చూసాడు.
“మీరు రామచంద్రంగారు కదూ “అన్నది రాజ్యం.
“అవునండీ “అన్నాడు అతను.
“రేపు మీరు జానకీరామయ్యగారి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు కదా! నేనే ఆ అమ్మాయిని, మీతో మాట్లాడాలి” నిర్భయంగా అన్నది రాజ్యం.
“నేను గుర్తుపట్టానండి, మీ ఫోటో చూసాను, చెప్పండి” అంటూ రాజ్యం ముందు చేతులు కట్టుకుని నవ్వుతూ నించున్నాడు.
“మరేం లేదండీ, మీరు కానీ మీ వాళ్లు కానీ కట్నకానుకలు ఆశించేవారైతే దయచేసి పెళ్లి చూపులకు రాకండి, నా జీవితాన్ని అలాంటివారితో పంచుకోలేను. నేను నచ్చి, మేము కట్నం యిచ్చుకోలేక నా వాళ్ల బాధ నేను చూడలేను. నా అభిప్రాయాలను మార్చుకోలేను. అందుకే మిమ్మల్ని కలిసి స్వయం గా చెప్పాలని వచ్చాను.” అంటూ అక్కడినించి వెళ్ళబోయింది.
“ఆగండి రాజ్యంగారు! మీ అభిప్రాయాలు చెప్పారు, నేను విన్నాను. మరి నా అభిప్రాయాలు కూడా మీరు వినాలిగా. ముందుగా మీకు నా అభినందనలు. ధైర్యంగా, ఖచ్చితంగా మీ మనసులోని మాట చెప్పారు. మీ యీ స్వభావం నాకు నచ్చింది. జీవనం, జీవితం చాలా అమూల్యమైనవి. నా భార్య నా జీవనంలో, నా జీవితంలో నా సహచరి. నన్ను తన కంటిపాపలో నిలుపుకోవాలి నేను తనని నా హృదయంలో నిలుపుకోవాలి. నా ఇల్లాలుగా నా యింటివెలుగుగా వుండాలి. నాకు కట్నం కాదు. కావాల్సింది నన్ను అర్ధం చేసుకుని నాకు కష్టసుఖాల్లో తోడునీడగా వుండే అమ్మాయి కావాలి, యిప్పుడు చెప్పండి రాజ్యంగారు, రేపు నేను పెళ్లిచూపులకు రమ్మంటారా!వద్దంటారా ?” అన్నాడు రామచంద్రం.
అతని మాటలు, అతని అభిప్రాయాలు రాజ్యానికి నచ్చాయి “రేపటి కోసం యిప్పటినించే యెదురు చూస్తూ వుంటాను” అంటూ నవ్వుతూ అతనికి నమస్కరించింది.
రామచంద్రం ఆఫీసులోకి, రాజ్యం యింటికి వెళ్లిపోయారు.
పెద్దల అంగీకారంతో యిద్దరికీ పెళ్లి జరిగింది. రెండు జీవితాల మధ్య కట్నం అనే పిశాచి ప్రవేశించకపోతే దంపతుల మధ్య కలతలుండవు. మానసిక ప్రశాంతత వుంటుంది.

1 thought on “బంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *