April 20, 2024

మనసులు మురిపిస్తా

రచన: గుండ్లపల్లి రాజేంద్రపసాద్

వెలుగునై
ప్రసరిస్తా
వదనాలను
ప్రకాశింపజేస్తా

గాలినై
వ్యాపిస్తా
సువాసనలను
విరజిమ్ముతా

పువ్వునై
వికసిస్తా
పరవశాన్ని
పంచిపెడతా

పాటనై
రాగము తీయిస్తా
ఆటనై
నాట్యము చేయిస్తా

పలుకులనై
కులికిస్తా
తేనెలను
చిందిస్తా

చిరునవ్వునై
చెంపలకెక్కుతా
అమృతాన్నై
అధరాలలోకూర్చుంటా

కలనై
కల్పనలిస్తా
కలమై
కాగితాలపై రాయిస్తా

అక్షరాలనై
అల్లుకుంటా
పదములై
ప్రవహిస్తా

ఊహనై
ఊరిస్తా
భావమునై
భ్రమలు కలిగిస్తా

అందమునై
అలరిస్తా
అంతరంగంలో
ఆవాసముంటా

కవితనై
కవ్విస్తా
మనసులను
మురిపిస్తా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *