May 26, 2024

లైవ్ లింక్

రచన: ఆర్. లలిత

“ఏమండీ. అందరికీ వాట్స్ ఆప్ లో పెళ్లి కార్డులు పంపించారా ? అడిగింది సుశీల
“ఆ! పంపించడమే కాకుండా, ఫోన్లు చేసి, మరీ పిలిచానే. “అన్నాడు ధర్మారావు.
“మా పెద నాన్న మనవడు ఈ ఊళ్లోనే ఉన్నాట్ట. అతనికి ఫోన్ చేసి, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు, తప్పకుండా రావాలని చెప్పండి.
మా పిన్ని మనవరాలు దాని ఇంటి గృహ ప్రవేశానికి పిలవనే లేదు. నేను మాత్రం అలా చెయ్యను. వాట్స్ ఆప్ లో కార్డు పంపిద్దాము. మళ్లీ తప్పకుండా రండి అని ఫోన్ చేసి, ప్రత్యేకం పిలవక్కర్లేదు. “సుశీల లెక్కలు ధర్మారావు కెప్పటికీ అర్థం కావు.
వాళ్లిద్దరూ పక్క పక్క ఇళ్ళల్లోనే ఉంటారు ఒకళ్ళకొక పిలుపు, ఇంకోళ్లకి ఇంకో పిలుపు బాగుండదే అంటే సుశీల వినదు.
“ఒరేయ్! పెళ్లి లైవ్ టెలికాస్ట్ లింక్ ఇచ్చేసాడా ? కొంతమందికి పంపించాలి. పెళ్లి మండపం ఫైనలైజ్ చేస్తే, బాగుంటుంది. ఇప్పటికి పదిసార్లన్నా ఫోన్ చేసాడు”కొడుకు సోమేశ్వర్ ని అడిగాడు.
“చేద్దాం నాన్నా! వీడియో గ్రాఫర్ పీక మీద కూర్చుని, ఆ లింక్ తెచ్చాను. ఎవరెవరికి పంపించాలో చెప్పు. ” సోమేశ్వర్ అడిగాడు.
“చూద్దాం లే. చెప్తాను. తొందరేముంది ? స్వాతితో నువ్వు, రజని వెళ్ళాలి. నీకు శలవుంటుంది కదా! “ధర్మారావు
అడిగాడు.
“అక్క వెళ్తే, బాగుంటుంది కదా నాన్నా! మగ పెళ్ళి వారేవేవేవో అడిగితే, రజని కి జవాబు చెప్పడం ఏం చాతనవుతుంది ? అక్కయితే కరెక్ట్ గా చెప్తుంది. “అన్నాడు సోమేశ్వర్.
“మా అక్కని, బావగారిని వెళ్ళమందామని అనుకుంటున్నాను.”సుశీల తన అభిప్రాయం చెప్పింది.
“చిన్నవాళ్ళయితే, స్వాతికి ఫ్రీ గా ఉంటుంది. అలా అనే సోమేశ్వర్ కి చెప్పాను. కాదంటే, మీ అక్కే ఎందుకు ? మా చెల్లి, బావ వెళ్తారు.”ధర్మారావు అనగానే, సుశీల మొహం చిన్నబుచ్చుకుంది.
“దాని పిల్లలందరికీ, మనమే వెళ్ళాము. పెద్ద పిల్ల పెళ్లికి, సోమేశ్వర్ పెళ్లికి, మీ చెల్లే వెళ్ళాలని, అత్తగారు మొండిగా కూర్చున్నారు. పోన్లే. స్వాతితోటన్నా మా అక్క వెళ్తుందని అనుకుంటే, మీరిలా అంటున్నారు. ” సుశీల తన మనసు దాచుకోలేదు.
ఇలా పెళ్లి దాకా వాదోపవాదాలు, మార్పులు, చేర్పులు జరుగుతూ ఉన్నా, అందరూ సరదాగానే తీసుకున్నారు.
తండ్రిని ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోయేసరికి, పెళ్లి రేపనగా సోమేశ్వర్ పెళ్లి లైవ్ స్ట్రీమ్ లింక్ వాట్స్ ఆప్ కనెక్షన్స్ అందరికీ ఫార్వర్డ్ చేసేసాడు.
పెద్దకూతురు స్వర్ణ అత్తగారు, మామగారితో కలిసి వచ్చింది. పెద్దల్లుడికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని రాలేకపోతున్నానని ఫోన్ చేసి, చాలా ఫీల్ అయాడు.
సోమేశ్వర్ అత్తగారు, మామగారు రావడమే కాకుండా, పనుల్లో కావలసినంత సాయం చేస్తూ ఉన్నారు.
ప్రాణ స్నేహితుడు సత్యం ఎందుకు రాలేదా అని ధర్మారావు ఒకటి రెండుసార్లు అనుకున్నాడు.
అతనికి వాట్స్ ఆప్ లో కార్డు పంపించి, పెళ్లికూతుర్ని చేయడానికి రెండు రోజులు ముందే రమ్మనమని మరీ మరీ చెప్తే, ఆ టైంకి కుదరకపోవచ్చు కానీ, పెళ్లికి తప్పకుండా వస్తామని చెప్పాడు.
ఆ రోజు తెల్లవారుఝామునే పెళ్లి అయిపోయింది.
తలంబ్రాలు అవగానే, అందరూ నిద్రకి తూలుతుంటే, బ్రహ్మగారు మిగిలిన తంతులన్నీ, తెల్లారి, తొమ్మిదయాక చేయిస్తానని, ఆయన కూడా ఒక మూలకెళ్లి పడుకున్నాడు.
కొంచెం ఖాళీ దొరికిందని, ధర్మారావు ఒక కుర్చీలో కూర్చుని, వాట్స్ ఆప్ ఓపెన్ చేసాడు.
నాలుగయిదు గ్రీటింగ్ మెసేజిలు చదివాక, చిన్ననాటి స్నేహితుడు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ పంచ పద్యాలు పంపించి, ” ఒరేయ్ ధర్మం! నువ్వు పంపించిన పెళ్లి లైవ్ లింక్ అందింది. మేము రావాలని నువ్వు అనుకోవట్లేదని అర్థమై, మా టికెట్స్ కాన్సిల్ చేసుకున్నాము. ” అని కూడా మెసేజ్ చేసాడు. పైకి స్క్రోల్ చేస్తే, పెళ్లి లైవ్ లింక్ కనబడింది.
ధర్మారావు ఎవరిని బ్లేమ్ చెయ్యాలో తెలియక, తల మీద కొట్టుకున్నాడు.

*****

1 thought on “లైవ్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *