June 19, 2024

వెంటాడే కథలు -6 – గుర్తింపు

నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

-చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు

*************************************************

గుర్తింపు

పునరుల్లేఖనం : చంద్రప్రతాప్ కంతేటి

పారిస్ లోని ఒక రైల్వే స్టేషన్.

మిస్టర్ గ్రాంట్ హడావిడి పడుతూ వచ్చి స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఎక్కి ‘హమ్మయ్య’ అనుకున్నారు. వారి వయసు ఆరు పదులు ఉండొచ్చు. పచ్చగా దబ్బపండులా ఉంటారాయన. వారి సూటు బూటూ దర్పం చూస్తుంటే పెద్ద అధికారి హోదాలో పనిచేసిన వ్యక్తి, గౌరవనీయుడు అనిపిస్తుంది.
తన లగేజీ అంతా సర్దుకున్నాక విశ్రాంతిగా సీటులో ఆసీనులై చుట్టుపక్కల కలయ చూశారు మిస్టర్ గ్రాంట్.
బోగీలో పల్చగా ఉన్నారు జనం.
ఎదురు సీటులో ఒక పెద్దాయన, మంచి నిద్రలో ఉన్నారు. ఆయన కూడా గ్రాంట్ గారి లాగే పెద్ద హోదాలో పని చేసిన మనిషిలా కనిపిస్తున్నారు. పొట్ట మీద సగం చదివిన గుర్తుగా ‘హిస్టరీ అఫ్ ఫ్రాన్స్’ పుస్తకం బోర్లా పడుకుని ఉంది..
వారిని చూసి గ్రాంట్ మొహం మీద చిరు దరహాసం ఓ క్షణం పాటూ వెలిగి మాయమైంది.
తర్వాత నిశ్శబ్దంగా తను వెంట తెచ్చుకున్న దినపత్రిక తెరిచి చదువుకోవడం మొదలెట్టారు.
పేపర్ విప్పిన శబ్దానికి కాబోలు ఎదురు సీటు వ్యక్తి కదిలి చటుక్కున కళ్ళు విప్పారు.
సీటులో సరిగ్గా సర్దుకు కూర్చున్నారు.
ఈ అలికిడికి మిస్టర్ గ్రాంట్ పేపర్ పక్కకు జరిపి చిరునవ్వుతో ”హలో..” అన్నారు.
ఎదురు వ్యక్తి కూడా చిరునవ్వుతో ”హలో.. నేను ఫ్రెడిరిక్..” అంటూ చేయి చాపి కరచాలనం చేశారు.
గ్రాంట్ కూడా నవ్వుతూ తనను తాను వారికి పరిచయం చేసుకున్నారు.
ఇద్దరి మధ్య కాసేపు మౌనం తాండవించింది.
రైలు మాత్రం తన మానాన తాను పరుగందుకుంది.
గ్రాంట్ పేపర్లో తలదూర్చేశారు.
ఫ్రెడ్రిక్ ‘ఫ్రాన్స్ చరిత్ర’లో మునిగిపోయారు.
అప్పుడప్పుడూ ఇద్దరూ పుస్తకం, పేపర్ల నుంచి తల బయటకు తీసి కిటికీలోంచి బయటకు చూసేవారు. కాసేపయ్యాక పరస్పరం పలకరింతగా పెదాలపై చిరునవ్వులు పూయించి మళ్ళీ తమ పఠనంలోకి జారిపోయేవారు.
గడియారంలో ఒక గంట కాలం గిర్రున తిరిగింది.
రైలు ఏదో స్టేషన్లో ఆగింది.
ఆ స్టేషన్ అంతా చాలా సందడిగా ఉంది.
ఫొటోగ్రాఫర్లు, విలేకరులు, జనం అందరూ ఎవరో ఒకావిడ చుట్టూ మూగి అరుస్తున్నారు.
కొందరు ఉత్సాహంతో ఈలలు వేస్తున్నారు.
ఇంకొందరు ఆటోగ్రాఫులకోసం కాబోలు ఆమె ముందుకు డైరీలు ఉన్న చేతులని చాస్తున్నారు.
ఆమె విసుక్కోకుండా ముఖంపై చిరునవ్వు చెదరకుండా అందరికీ ఆటోగ్రాఫులు ఇస్తోంది. నమస్కారాలు చేస్తోంది..
గ్రాంట్ గారు ఆవిడ వంక ప్లాట్ ఫామ్ మీది జనాల వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు.
మధ్యలో ఒకసారి ఫ్రెడ్రిక్ గారి వంక ప్రశ్నార్ధకంగా చూశారు.
ఆయన చిరునవ్వు నవ్వారు.
”జస్ట్ షి ఈజ్ ఏ పాపులర్ టీవీ యాంకర్” అన్నారు తర్వాత గ్రాంట్ కు మాత్రం వినబడేలా.
”ఈజ్ ఇట్? ఒక టీవీ యాంకర్ కి ఇంత హడావిడా? నాన్సెన్స్!” అన్నారు గ్రాంట్ తన అసంతృప్తిని దాచుకోకుండా.
”అవును సార్. ఇవాళ అలాంటి వాళ్లవే రోజులు.. తెరపై తైతక్కలాడే నటీమణులకు ఉన్నంత క్రేజ్ ఒక మినిస్టర్ కు ఉండదు.. మూక జనం” అన్నారు ఫ్రెడ్రిక్ చిరాకుగా.
ఇద్దరూ నేటి పరిస్థితులపై విమర్శలు గుప్పిస్తూ అరగంట సేపు కాలక్షేపం చేశారు.
”ఇప్పటి జనానికి సంస్కృతీ సంప్రదాయాలు తెలియవు” అన్నారు గ్రాంట్.
”సంప్రదాయాల సంగతి అలా ఉంచండి. కనీస విలువలు కూడా తెలియవు” అన్నారు ఫ్రెడ్రిక్.
”మన కాలంలో పెద్దలని ఎంత రెస్పెక్ట్ చేసేవాళ్ళం?”
”అబ్బో దాని గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే అవుతుంది. ఆ రోజులే వేరు ఆ మనుషులే వేరు..”
”కాలేజీ రోజుల్లో కూడా లెక్చరర్లను ఆమడ దూరంలోనే చూసి జడుసుకునే వాళ్ళం”
”అవును. గురు భక్తికి అదే తార్కాణం కదా?”
”ఇప్పుడా విలువలు ఎక్కడ ఉన్నాయి సార్? సాక్షాత్తూ ప్రిన్సిపాల్ ముందే సిగరెట్లు ఊదేస్తారు ఈ కాలపు కుర్రాళ్ళు”
”అమ్మాయిలు మాత్రం తక్కువ తిన్నారా? ఆ యాంకర్ ను చూశాం కదా .. పట్టుమని ఇరవై ఏళ్ళు ఉండవు.. ఆ డ్రెస్సింగ్ చూశారా? ఎంత ప్రొవొకింగ్ గా ఉందో? అంత అవసరం ఉందంటారా?”
”నా డౌట్ అసలు ఈ ఆడపిల్లల్ని ఆ తల్లిదండ్రులు బాధ్యతతో పెంచుతున్నారా అని?”
”వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే”
”మంచి మాట సెలవిచ్చారు అక్షర సత్యం”
మళ్ళీ మిత్రులిద్దరూ పఠనంలో పడిపోయారు.
పది నిముషాల తర్వాత –
ఎదో చెప్పాలన్నట్టు చిన్నగా దగ్గారు ఫ్రెడ్రిక్.
తలెత్తి చూశారు గ్రాంట్.
”నమ్ముతారో లేదో గానీ నేను ఏ నేతనైనా, రచయితనైనా ఒకసారి చూస్తే జీవితాంతం మరచిపోను. మరచిపోలేను. అభిమానులు ఏక సంథాగ్రాహినని అంటారుగానీ నాకు అంత లేదనే నా అభిప్రాయం.. ” ఫ్రెడ్రిక్ కొంచం సేపు ఏమీ మాట్లాడలేదు.
గ్రాంట్ కళ్ళలో మెచ్చుకోలు మెరుపు కనిపించాక మళ్ళీ ప్రారంభించారు ఫ్రెడ్రిక్.
”నేను ఫలానా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చెప్పేవాడిని. నిజానికి సోషియాలిజీ నా అభిమాన సబ్జెక్టు. అదొక్కటే కాదు.. ఫ్రెంచి సాహిత్యం అయితే కొట్టినపిండి..” మళ్ళీ ఆగారాయన.
”గ్రేట్” అంటూ సున్నితంగా చప్పట్లు కొట్టి మరీ అభినందించారు గ్రాంట్.
”ఏ సబ్జెక్టు చెప్పినా దానిలో లీనమై చెప్పేవాడిని. మనం లీనమైతే చాలదు కదా పిల్లవాళ్ళనీ లీనం అయ్యేలా చేసేవాడిని.. అదే నాకు పేరు తెచ్చింది.. బహుశా మా కాలేజీలో నాకు దక్కిన గౌరవ మర్యాదలు ఎవరికీ దక్కలేదనే చెప్పాలి. విద్యార్థినీ విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లు, కాలేజీ సెక్రటరీ, చివరాఖరికి కరస్పాండెంట్ కూడా నేను కాలేజీలోకి రాగానే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించేవారు..”
గ్రాంట్ ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు.
”బోధనాపరంగానే కాదు నా కృషి బహుముఖాలుగా సాగింది. ముఖ్యంగా సాహిత్యపరంగా నేను వెలువరించిన కావ్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని అనేకమంది మిత్రులు అంటూ ఉంటారు. కేవలం పొయెట్రీకే పరిమితం కాలేదు .. షార్ట్ స్టోరీ రైటర్ గా కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాను.. ఇటీవలే కొందరు బ్రిటిష్ ప్రచురణకర్తలు నేను రాసిన ‘పూర్ మాన్స్ సాంగ్ ‘ కావ్యాన్ని ఇంగ్లిష్లోకి తర్జుమా చేస్తామని వచ్చారు..”
”అవునా?” గ్రాంట్ నోరు వెళ్ళబెట్టారు.
”అవును. నేనే ఇంకా నా నిర్ణయం చెప్పలేదు.. ఆలోచించి చెబుతాను అన్నాను.. మీ దగ్గర దాపరికం ఎందుకు గానీ నిజానికి వాళ్ళు నాకు ఇస్తామన్న రాయల్టీ నచ్చలేదు.. చూద్దాం.. ఇంకెవరిదైనా లాభసాటి బేరం వస్తుందేమో? ఏమంటారు?”
”వెరీ గ్రేట్ ఫ్రెడ్రిక్ గారు. యూ ఆర్ రియల్లీ జీనియస్” మనస్ఫూర్తిగా అభినందించారు గ్రాంట్.
”అన్నట్టు మరచిపోయాను మిత్రమా. మొన్న మన ప్రతిష్ఠాత్మక అవార్డు ‘ది ప్రిక్స్ గాన్ కోర్ట్’ గ్రహీతల షార్ట్ లిస్టులో పదో స్తానంలో చోటు చేసుకుంది నా పేరే! అఫ్ కోర్స్ అవార్డు రాలేదనుకోండి.. అక్కడ దాకా వెళ్లడమే గొప్పకదా..?”
”నిజంగా గొప్ప! నెక్స్ట్ టైం బెటర్ లక్.. ఎనీ వే .. మీకు ఫ్రెంచి సాహిత్యం మీదా సాహితీవేత్తల మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది అనిపిస్తోంది” గ్రాంట్ అన్నారు.
”అందుకు మీకు ఇంకా సందేహమా మిత్రమా? నిద్రలో అడిగినా మన సాహితీ వేత్తలు వారి కావ్యాల గురించి చెప్పగలను.. వారి అవార్డుల గురించి చెప్పగలను..” ధీమాగా అన్నారు ఫ్రెడ్రిక్.
”భేష్. రియల్లీ గ్రేట్”
”ఎంత గ్రేట్ అయితే మాత్రం ఏం లాభం లెండి? ఏదో విద్యావంతుల సాహితీవేత్తల సర్కిళ్లలో తప్ప గుర్తించేదెవరు? ఇందాక ఆ యాంకర్ పిల్లను చూశారు గదా? ఆవిడకెంత గుర్తింపు..? ఆటోగ్రాఫులు.. ఫోటోలు..పేపర్ కవరేజీలు” ఫ్రెడ్రిక్ మాటల్లో కొంచం బాధ, ఆవేదనలతో పాటు ఇసుమంత ఈర్ష్య తొంగి చూశాయి.
లగేజీ సర్దుకుంటూ గ్రాంట్ గారు లేచి అన్నారు.
”వచ్చే స్టేషనే నేను దిగాల్సింది. మీ కంపెనీ చాలా ఆనందం కలిగించింది.. ధన్యవాదాలు” వినయంగా అన్నారు.
”వొట్టి ఆనందమేనా? బహుశా ఇవాళ్టి ప్రయాణం మీకు పదికాలాలు చెప్పుకునే మధురస్మృతిగా మిగిలిపోతుంది. నేను కలిశానని మీరు చెబితే మీ ఇంటిల్లిపాదీ పండుగ చేసుకుంటారేమో.. ” కొంచం అతిశయంగా అన్నారు ఫెడ్రిక్ గారు.
”అవునవును.. మీరు చెప్పింది అక్షర సత్యం”
”ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు”
”ఇందాక మీరు చెప్పిన సాహితీ పురస్కారం ‘ది ప్రిక్స్ గాన్ కోర్ట్’ అవార్డు గత ఏడాది గ్రహీతను.. పేరు జెఫర్సన్ గ్రాంట్” అంటూ బోగీ డోర్ వైపు నడిచాడు గ్రాంట్.
నిలువు గుడ్లు వేసుకుని చూస్తుండిపోయాడు ఫ్రెడ్రిక్.
తర్వాత సిగ్గుతో ఆయన ముఖం వాలిపోయింది.

-:0000:-

నా విశ్లేషణ:

ఈ కథ పోకడ, ముగింపు చూస్తుంటే కచ్చితంగా మహా కథకుడు మొపాసా కథే అనిపిస్తోంది. మనుషుల మనస్తత్వాలను చిత్రిక పట్టడంలో ఆయన దిట్ట. దీని వస్తువు సమకాలీన సమాజానికే కాదు ముందు యుగాలకూ సరికొత్తగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎవర్ గ్రీన్. ఎందుకంటే మనిషి తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా ఏడుస్తూనే ఉంటాడు. ఇక సాహితీవేత్త అయితే చెప్పే పనేలేదు. ‘పరనింద .. స్వోత్కర్ష’ పుష్కలం. ‘ఆ నటిని గుర్తించారు.’ ‘ఈ కవిని గుర్తించారు. వాడు డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కున్నాడు..’ ‘వీడు మరేదో కాని పని చేసి అవార్డు దక్కించుకున్నాడు’ అని ఏడుస్తూనే ఉంటారు. తనకు అవార్డు వస్తే మాత్రం ప్రతిభ కొలమానంగా వచ్చిందని చాటింపు వేసుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి వారికి కొదవలేదు. ఇలాంటి వారిని మీరు ఇప్పటికే ఎందరినో చూసి కూడా ఉంటారు.
సాహిత్య రంగంలో తనను తాను దిగ్గజంగా అభివర్ణించుకునే ఫ్రెడ్రిక్ – గత ఏడాది ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతను అన్ని గంటల ప్రయాణంలో కూడా గుర్తుపట్టలేకపోవడం మొపాసా మార్కు చురక!

12 thoughts on “వెంటాడే కథలు -6 – గుర్తింపు

 1. మంచి కథను పరిచయం చేసారు ప్రతాప్ గారు. మనిషికి తన గురించి మాత్రమే ఆలోచిస్తూ, తనను తాను సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ గా భావించుకోవడం సహజం. తన గొప్పతనాన్ని గుర్తించగల మనిషి తనలోని సాధారణత్వాన్ని మాత్రం తనలోని ఇంకో మనిషిగా చూడటం, ప్రత్యేకత కూడా సాధారణం అనుకోలేకపోవడం వంటి వాటి గురించి ఆలోచింపజేసేలా ఉన్న మంచి కథను పరిచయం చేసారు.

 2. అవును సార్ మనకు వస్తే ఒకలాగా వేరే వాళ్ళకొస్తే ఇంకొకలాగ … ఇది సగటు సాహితీవేత్తల మానసిక స్థితి!

 3. ….
  Em goppa cheppukunnadu sir!!!
  Highly paradoxical!!
  Literature mida pattu undannadu…
  recent ga award andukunna vari peru telidannadu!!
  Dambikam, Eershya, Gurtimpu ledane Ukrosham…..bhale chupincharu matallo….!!
  Excellent twist and excellent reflection of human psychology

  1. అవును తల్లి… అందుకే ఇన్ని దశాబ్దాలు దాటినా గొప్ప రచయితల కథలు ఎప్పటికీ సమకాలీనంగానె ఉంటాయి. భవిష్యత్తులోనూ అలాగే నిలబడిపోతాయి.

 4. ఇటువంటి అనుభవమే నాకు జరిగింది.తానా వారు బాలల కథల నవల పోటీ పెట్టినపుడు,నా నవల బహుమతికి ఎంపిక అయింది.అప్పుడొక రచయిత వాట్స్ ఆప్లో తనకు బహుమతి రాలేదని పైరవీలు చేసిన వారికి వచ్చిందని వాపోయాడు.
  అటువంటిది ఏమీ లేదని చెప్పడానికి నాకు తల నొప్పి వచ్చింది.
  పైకథ ఆద్యంతం చదివించి ఒక అనుభూతి మిగిల్చింది.

  1. అవును సార్ మనకు వస్తే ఒకలాగా వేరే వాళ్ళకొస్తే ఇంకొకలాగ … ఇది సగటు సాహితీవేత్తల మానసిక స్థితి!

  2. అవును సార్ మనకు వస్తే ఒకలాగా వేరే వాళ్ళకొస్తే ఇంకొకలాగ … ఇది సగటు సాహితీవేత్తల మానసిక స్థితి!

 5. వాస్తవ చిత్రీకరణ సర్…. ఈ లాంటి వాళ్లే ఎక్కువ సమాజంలో…. బావుంది సర్

  1. అవును బాబూజీ… వాస్తవిక చిత్రణ! భూగోళం మీద మనిషి అనేవాడు జీవించివున్నంతవరకు వాడి బుద్ధి ఇలాగే ఉంటుంది. గొప్ప రచయితలు మాత్రమే ఇలాంటి కథలు రాయగలుగుతారు

  1. ధన్య వాదాలు గారు. ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *