April 23, 2024

సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి:

రచన: రమా శాండిల్య

నిజామాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ‘సారంగపూర్ ‘ అనే ఒక గ్రామంలో వందల సంవత్సరాల క్రితం నుంచీ, చిన్న కొండ మీద ఉన్న దేవాలయమే ఈ సారంగపూర్ ఆంజనేయస్వామి దేవాలయం.

ఈ దేవాలయం వెనుక చాలా చరిత్ర ఉన్నది. భారతదేశ చరిత్రలో సమర్థ రామదాసు యొక్క పాత్ర చాలా ఉన్నదని చరిత్ర చెబుతున్నది. ఈ సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి ఛత్రపతి శివాజీ కూడా దర్శించుకునేవాడట.

‘ఛత్రపతి శివాజీ’ హిందూసామ్రాజ్యాన్ని స్థాపించడానికి అతని గురువైన ‘సమర్థ రామదాసు’ ముఖ్య కారణమని చెబుతారు.

ఈ సమర్థ రామదాసు 16 వ శతాబ్దపు వాడు. మహారాష్ర్టలోని ఒక గ్రామంలోని బ్రాహ్మణుల ఇంట చిన్న కొడుకుగా పుట్టాడట. అతని పేరు ‘నారాయణ’ అని పెట్టారట. ఆ పిల్లవాడు ఎప్పుడూ అందరి పిల్లలతో కలవకుండా ఒక్కడే నిశ్శబ్దముగా ఆలోచిస్తూ ఉండేవాడట.

తల్లి చిన్న పిల్లవాడిని, “నారాయణా! ఏం చేస్తున్నావు?” అని అడిగేదట. దానికి సమాధానంగా, నారాయణ, “విశ్వాన్ని గురించి ఆలోచిస్తున్నానమ్మా!” అని తల్లికి బదులు చెప్పేవాడట. అంత చిన్న వయసునుంచే ఎప్పుడూ ఆత్మ జ్ఞానం గురించిన సాధనలు చేస్తూ, బోధిస్తూ ఉండేవాడట. ఆ బోధనలకు ప్రేరేపితుడైన శివాజీ పూర్తిగా గురువు గారి మాటలను నమ్మి, సమర్థ రామదాసును గురువుగా స్వీకరించాడట. గురువు మాటను జవదాటేవాడే కాదట. శివాజీ విజయం వెనుక ముఖ్యంగా తల్లి, గురువుల పాత్ర అధికంగా ఉండేదని చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు. .

అనేక సంకట పరిస్థితులలో అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో సమర్థ రామదాసు కృషి చాలా ఉన్నదట. జాతిని చైతన్య పరచటంలో ఆ దాసబోధనల వలన శివాజీ ప్రేరేపితుడై హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడట.

‘సమర్థరామదాసు,’ తాను బోధనలు చేస్తూ… అనేక స్థలాలలో ఆంజనేయ స్వామి, దేవాలయాలు కట్టాడుట. అలా కట్టిన మొట్టమొదటి గుడి ఈ ‘సారంగపూర్ ఆంజనేయస్వామి దేవాలయం.’ ఈ దేవాలయంలో గర్భగుడిలోని మూలవిరాట్ తాను స్వయంభువుగా వెలసినా, స్వామి విగ్రహానికి స్వయంగా అతనే, కళ్ళు, ముఖపు ఆకారం చిత్రించాడట. గుడిమొత్తం సింధూరవర్ణంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. రామస్తంభము, నవ గ్రహాలు ఉంటాయి. రామస్తంభములో రామకోటి రాసిన పుస్తకాలను అప్పట్లో అక్కడి ఆ స్తంభాలలో వేసారట.

అతి పురాతనమైన ఆ విగ్రహ శోభ ఒకసారి దర్శించుకుంటే, పదే పదే చూడాలనిపిస్తూనే ఉంటుంది. సింధూర వర్ణంలో మనవైపే చూస్తున్నట్లుండే ఆ కరుణ పూరితమైన కనులు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. చిన్న కొండ మీద కొలువైన ఆ స్వామిని చూస్తుంటే ఎప్పటికీ రావాలనిపించదు.

ఒకసారి తెలియకుండా, అనుకోకుండా… గురు శ్రీ సమర్థ రామదాసు తిథి రోజు వెళ్ళాము. అక్కడ జరుగుతున్న ఆ ఉత్సవం గురించి వర్ణించడానికి పదాలే లేవు. పసుపు పచ్చని వస్త్రాలతో ఉన్న జనం హనుమత్ భక్తులతో నిండిపోయి ఉంది ఆ కొండంతా. పసుపు రాశులు పోసినట్లు భక్తజన సందోహంతో నిండిపోయి ఉన్నది. వారు చేసే రామనామ సంకీర్తనంతో ఆ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. అలాగే పారాయణలు చేస్తూ ఒకప్రక్కన కొంతమంది భక్తులున్నారు. మరొక ప్రక్కన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ మరికొంతమంది. యాగం చేస్తూ కొంతమంది. ఆ వాతావరణంలో ఒక అలౌకికమైన స్థితిని పొందాము. అవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్రశాంతత మనసుని చుట్టేసిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ, మరొకసారి మొత్తం కొండమీద డ్రైవర్ తో కలిసి ఐదుగురమే వెళ్ళాము. ఎవరూ లేని ఆ వాతావరణంలో కూడా అదే తాదాత్మ్యత, అదే ప్రశాంతత.

మా చిన్నప్పటి నుంచీ హనుమాన్ చాలీసా చదవటం అలవాటు. సారంగపూర్ ఆంజనేయుడిని చూస్తుంటే చాలీసా లోని అక్షర రూపంగా చూసిన ఆ స్వామి, ఇక్కడ కొలువైనట్లే అనిపిస్తాడు.

గుడి చుట్టూ ఆశ్రమపీఠాధిపతుల సమాధులుంటాయి. గుడి ఎత్తయిన చిన్న గుట్టమీద ఉంటుంది. గుడి వెనుక పెద్ద రావిచెట్టు కొండకు నీడనిస్తున్నట్లుంటుంది. పూర్తిగా కొండపైకి ఆలయ శిఖరం ఉంటుంది. ఇక్కడ గుడిపైన, గుడిలోకి వెడుతుంటే… సహజంగా… ఆ గుడిలోని మూల విగ్రహము యొక్క నమూనా ఉంటుంది కదా! కానీ ఈ గుడిలో, వైకుంఠంలో ఆనంతుడిమీద శయనించిన విష్ణుమూర్తి, ముగ్గురు దేవేరులతో పాలకడలిలో ఉన్న విగ్రహాలుంటాయి. ఇక్కడి ప్రాముఖ్యత ఇది.

ఆంజనేయస్వామి మూలవిరాట్ ఉండే గర్భగుడి చిన్న కొండ గుహలో ఉంటుంది. స్వామి సంజీవపర్వతం ఎత్తుకుని ఎగురుతూ మనవైపు చూస్తున్నట్లే ఉంటుంది. ఈ ఆలయంలో ఒకసారి ప్రవేశిస్తే మనను ఆరోగ్యంగా ఉండేటట్లు ఆయనే చూసుకుంటాడట. కానీ, మనం చూసిన ఆ రూపాన్ని మనసున నిలుపుకుని, ఆ నామం మనసులో జపించుకుంటూ ఉండాలట ఈ ఆంజనేయస్వామికి ‘దాసాంజనేయుడు’ అనే పేరుందట. ‘శ్రీరామచంద్రమూర్తి’ తన సకల పరివారముతో అక్కడే కొలువై ఉంటాడట. అందుకే, ఇక్కడి ఆంజనేయుడు ‘రామదాసుడట.’

ఇది ఛత్రపతి శివాజీ కాలంలో, సమర్థ రామదాసు స్వయంగా కట్టిన గుడి. అప్పట్లో నిరంతరం రామనామంతో మారు మ్రోగేదట. అక్కడి గోడమీద స్వామివారి మంత్రం వ్రాసి ఉంటుంది.

‘మనోజవం మారుతతుల్యవేగం! జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం!
వాతాత్మజం వానరయూధ ముఖ్యం!
శ్రీరామ దూతం శిరాసానమామి!’

అనే, ఆ పై శ్లోకాన్ని లిఖించారు. నా వరకూ నాకు నిజంగానే ఈ శ్లోకాన్ని జపిస్తే ఆ దాసాంజనేయుడే వచ్చినట్లనిపిస్తుంటుంది. నేను, తరచూ వెళ్లే ఆలయాల్లో ఒక ఆలయం ఇది.

ఈ దేవాలయం, తెలంగాణాకు, మహారాష్ట్రకు హద్దుల్లో ఉంటుంది. అందుకే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మహారాష్ట్ర వారివి ఎక్కువగా కనిపిస్తాయి.

ఇక్కడ శివాజీ జన్మదినం, సమర్థ రామదాసు జన్మదినమున చైత్ర బహుళ నవమి, పరమపదించిన దినమైన మాఘ శుద్ధ నవమి… రోజులలో ఉత్సవాలను నిర్వహిస్తారు… అప్పుడు అన్నదానాలు, భజనలూ ఉంటాయి.

తప్పక చూడవలసిన క్షేత్రం. ఈ ఆంజనేయస్వామి గుడి పురాతనమైన చరిత్ర కలిగినది. మనసుకు శాంతినిస్తుంది దర్శించిన ప్రతీసారీ!!

సర్వేజనా సుఖినోభవంతు🙏

2 thoughts on “సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *