April 19, 2024

కంభంపాటి కథలు – దేవుడికి భయం లేదు

రచన: రవీంద్ర కంభంపాటి

సాయంత్రం నాలుగున్నర అవుతూంది. ఆదిలక్ష్మి ఇంటిపక్కనే ఉన్న సందులోకి తిరిగి, వీధి వైపుకి వచ్చింది. ఇంటి ముందుభాగం అద్దెకిచ్చేసేరేమో, తిన్నగా వీధిలోకి వచ్చే వెసులుబాటు లేదు.
ఆ సందులోంచి బయటికి వచ్చి, వీధిలోకి తిరిగేసరికి బజ్జీల నూనె వాసన నుంచి, కోడిమాంసం, కోడిగుడ్ల వాసన వరకూ రకరకాల వాసనలొచ్చేయి ! వెనక్కి తిరిగి తన ఇంటి వేపు నిరసనగా చూసింది. ఇంటి ముందు శ్రీ సాయి విలాస్ టిఫిన్స్, నూడుల్స్, కర్రీస్ అనో బోర్డు కనిపించింది, ఆ బోర్డు కింద కులాసాగా నుంచుని చుట్ట కాలుస్తూ కుమారబాబు కనిపించేడు.
నువ్వేమీ చెయ్యలేవు అనో వెటకారం నవ్వు కనిపించిందతని మొహంలో! ఆదిలక్ష్మి తలతిప్పుకుని వెళ్ళిపోయింది.
మెల్లగా శ్రీపాద వల్లభస్వామి గుడి వేపు అడుగులెయ్యడం మొదలెట్టింది డెబ్భై మూడేళ్ళ ఆదిలక్ష్మి. ఆ గుడి దగ్గిర మొదలెట్టి, ఊరికి అటువైపున్న కుక్కుటేశ్వర స్వామి గుడి వరకూ దార్లో గుళ్ళన్నిటికీ వెళ్ళడం, ప్రతి గుడిలో ఓ పది నిముషాలు కూచుని, ఆ గుళ్లో ఉన్న దేవుడికో దేవతకో తన కష్టం చెప్పుకోవడం, ఆ తర్వాత మెల్లగా ఎప్పటికో ఆ “శ్రీ సాయి విలాస్ హోటల్” వెనకున్న తన రెండు గదుల ఇంటికి చేరుకుని, పొద్దున్న వండుకున్నదేవైనా మిగిలుంటే తినడం లేకపోతే ఇన్ని నీళ్ళు తాగి పడుకోవడం.. ఆవిడకి ఇదే తంతు రోజూ.
వాళ్ళాయన మేడూరి రామేశ్వర్రావు బతికున్న రోజుల్లో ఇలా గుళ్ళ చుట్టూ తిరిగే అలవాట్లేవీ లేవావిడకి ! ఉన్న సమయం అంతా ఆరు గదుల ఇల్లుని చూసుకోడానికి, సాయంత్రమయ్యేసరికి, ఇంటి ముందున్న చెట్లని, మల్లె తీగల్నీ, పాదుల్నీ సాకడానికి, రాత్రయ్యేసరికి భర్తతో కలిసి అమెరికాలో ఉన్న కొడుకులు, కోడళ్లతో కబుర్లు చెప్పడం, ఆ తర్వాత, భర్తతో కలిసి కాసేపు టీవీ చూసి పడుకోవడం ఇలా సాగిపోయేది.
ఓ రోజు రాత్రి ఈటీవీలో అప్పు చేసి పప్పుకూడు సినిమా చూస్తూంటే, రేలంగి కామెడీకి తెగ నవ్వేసే రామేశ్వర రావు గారు నవ్వడం లేదేంటా అని ఆదిలక్ష్మి పక్కకి తిరిగి చూసేసరికి, అలా ప్రశాంతంగా సోఫాలోనే వెనక్కి వాలిపోయున్నాడాయన.
అమెరికా నుంచి కొడుకులు ఉన్నపళాన వచ్చేసి, తండ్రికి కర్మకాండలు పూర్తి చేసేరు. తల్లిని తమతో అమెరికా వచ్చేయమన్నారు గానీ, అన్నేళ్లు భర్తతో గడిపిన ఆ ఇంటిని వదలబుద్ది కాలేదావిడకి.
మరుసటేడాది తండ్రికి సంవత్సరీకం పెట్టడానికి వచ్చినప్పుడు, పెద్ద కోడలు మాట కదిపింది, ‘ఇంత పెద్ద ఇంటిలో మీరొక్కరూ ఉండడం మీకే మంచిది కాదత్తయ్యా.. ఓ నాలుగ్గదులు ఎవరికైనా అద్దెకి ఇచ్చెయ్యండి.. మీకూ ఓ తోడుంటుంది.. అలాగే మాక్కూడా మిమ్మల్ని చూసుకోడానికి ఇక్కడెవరో ఉన్నారనే ఫీలింగుంటుంది ‘
కొడుకులిద్దరూ ఆలోచన బావుందన్నట్టు తలాడించేరు. చిన్న కోడలు అందుకుంది ‘ఐడియా బావుంది.. కానీ అలా కాకుండా ఇంటి ముందరి నాలుగ్గదులూ, వసారా ఏదైనా హోటల్ వాడికిస్తేనో ?.. అత్తయ్యగారికి మంచి అద్దె వస్తుంది, జనాల సందడితో మీక్కూడా మంచి కాలక్షేపం.. మీక్కూడా ఎప్పుడైనా మీ వంట బోరు కొట్టిందంటే, ఇంచక్కా ఆ హోటల్లో తినేయొచ్చు ‘. ఈ మాటలకి పెద్ద కోడలితో సహా అందరూ మెచ్చుకోలుగా చూసేరు చిన్న కోడలి వైపు !
ఆదిలక్ష్మికి ఈ ఆలోచన నచ్చలేదు.. కానీ వాళ్ళు ఉండే ఈ నాలుగైదు రోజుల్లో ఏ వాదన పెట్టుకో దల్చుకోలేదు. ఏమ్మాట్లాడకుండా ఊరుకుంది. తల్లి మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు కొడుకులిద్దరూ. తెలిసినవాళ్లెవరికో చెబితే, సాయంత్రానికల్లా కుమారబాబు దిగిపోయేడు. “మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న వీధి కదండీ.. ఓ చిన్న హై క్లాస్ వెజిటేరియన్ హోటల్ పెట్టుకుంటానండి.. చివరి రెండు గదులూ అమ్మగారు ఉంచుకోవచ్చండి.. యాభై వేలు అడ్వాంసండి.. నెలకి పదిహేను వేలు అద్దె కన్నా ఇచ్చుకోలేనండి ” అంటూ అన్ని మాటలూ అతనే చెప్పేసేడు. పిఠాపురంలో పదిహేను వేల రూపాయల ఇంటద్దె వస్తూందంటే మాటలా.. భలే బేరం తగిలింది, అంటూ ఆదిలక్ష్మి చేత ఒప్పించేసేరు పిల్లలు.
“అమ్మగారిని కంట కనిపెట్టి ఉండడానికి నేనున్నాననుకోండి బాబూ.. మీరెళ్ళి దర్జాగా అమెరికాలో ఉద్యోగాలు చేసుకోండి.. ఆవిడగోరుని ఇక్కడ హాయిగా మూడో కొడుకు చూసుకుంటున్నాడనుకోండి ” అంటూ భరోసా ఇచ్చేసేడు కుమారబాబు !
అదిగో.. ఆ రోజు నుంచీ మొదలైంది ఆదిలక్ష్మి గారికి నరకంతో సావాసం ! తెల్లవారుఝామున ఐదు గంటలకే, గిన్నెల చప్పుళ్ళూ, వంట పని వాళ్ల అరుపులు, ఆ కాఫీ హోటల్లోంచి పెద్దగా సినిమా పాటలూ.. అన్నిటికంటే పరకాష్ట… ఆవిడకి చెప్పకుండానే, ఇంటి ముందున్న మల్లెపందిరి తీయించేసి చెట్లు కొట్టించేసేడు కుమారబాబు.. హోటల్ ముందు పార్కింగ్ కోసమట !
పిల్లలకి ఆ విషయం చెబితే, ‘అంత అద్దె ఇస్తున్నాడు కదమ్మా.. మనం కూడా అన్నీ పట్టించుకుంటే కుదరదు ‘ అంటూ ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదా పిల్లలిద్దరూ !
ఇలాక్కాదని, ఆ కుమారబాబు దగ్గిరకే వెళ్ళి ‘అయిందేదో అయ్యింది.. ఈ హోటల్ ఖాళీ చేసి, నా ఇల్లు నాకిచ్చెయ్యి బాబూ ‘ అని ఆ ఆదిలక్ష్మిగారు బతిమిలాడితే, ‘భలేవోరండీ.. ఇప్పుడిప్పుడే యాపారం పుంజుకుంటూంది.. ఇప్పుడు ఖాళీ చేసేయ్ అంటే ఎలాగండీ ?.. జరిగేపని కాదండి.. ‘ అంటూ మొహం తిప్పేసుకున్నాడా కుమారబాబు!
‘అలా అనకు బాబూ. ఇప్పటికే.. ఇది నేనూ నా భర్తా యాభై ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లేనా అని అనుమానం వచ్చేంతలా మారిపోయింది.. కావాలంటే.. ఇన్నాళ్లూ నువ్విచ్చిన అద్దె కూడా తిరిగిచ్చేస్తాను.. ఖాళీ చేసేయ్ బాబూ ‘ అని బతిమిలాడింది
‘శుభమా అని.. ఇవాళ సాయంత్రం నుంచీ నూడిల్స్ పాయింట్ కూడా మొదలెడదామని నేననుకుంటూంటే, మీరు ఏటేటో అంటారేంటండీ ?సాయంత్రం మీక్కూడా ఓ ప్లేటు నూడుల్సంపిత్తాను.. టేస్టు చూసి ఎలాగున్నాయో చెప్పండి.. ఉంటానండి ‘ అంటూ హోటల్ లోపలికెళ్లిపోయేడు కుమారబాబు
ఆ నూడుల్స్ పాయింట్ పేరుతో మెల్లగా ఆ సాయి విలాస్ హోటల్లో నాన్ వెజ్ కూడా మొదలెట్టేసేడు కుమారబాబు. ఆ వచ్చే వాసనలతో ఆదిలక్ష్మి గారికి రోజూ కడుపు తిప్పేసేది. పిల్లలకి చెబితే, అతనితో మాట్లాడడానికి ప్రయత్నించేం.. అంటారే తప్ప ఏమీ చెయ్యలేకపోయేరు.
మెల్లగా అద్దె కూడా తనకిష్టం వచ్చినప్పుడు ఇవ్వడం మొదలుపెట్టాడు కుమారబాబు !
ఆ తర్వాతేడాది, ‘డల్లాస్ లోనే ఎవరో పంతులుగారు దొరికేరు, ఈ ఏడాది నుంచీ నాన్నగారికి ఇక్కడే తద్దినం పెట్టేస్తాం.. ప్రతేడాదీ ఇండియా వచ్చే ఖర్చు తప్పింది’ అని పెద్ద కొడుకు అనేసరికి ఏమ్మాట్లాడలేదు ఆదిలక్ష్మి !
పోలీస్ స్టేషన్లో చెబితే సివిల్ గొడవ మేం పట్టించుకునేది కాదనేసేరు.. ఎమ్మార్వో గారిని కలిస్తే, తనదీ కుమారబాబుదీ ఒకే కులం అన్న విషయం గుర్తుకొచ్చి అసలేం పట్టించుకోలేదు.
ఇంక ఇలాక్కాదని, రోజూ ఊళ్ళో ఉన్న ప్రతి గుడికీ వెళ్ళడం, దేవుడికి తన కష్టం చెప్పుకోవడం మొదలెట్టింది ! శ్రీపాద వల్లభ స్వామి గుడి, పైడి తల్లమ్మ గుడి, సాయిబాబా గుడి, సోమేశ్వరస్వామి గుడి, దత్తక్షేత్రం, కుంతీమాధవస్వామి గుడి, పురుహూతికా అమ్మవారు, కుక్కుటేశ్వరుడు.. ఇలా రోజూ వీళ్ళందరూ ఆదిలక్ష్మి కష్టం వినేవారు. మనసుకి కొంత భారం తగ్గి, ఆదిలక్ష్మి తిరిగి ఇంటికి బయల్దేరేది.
ఆరు సంవత్సరాలు గడిచేయి. మెల్లగా ఆదిలక్ష్మిలో ఓపిక నశిస్తూంది.. ఆ రోజు తనని చూసి ఆ కుమారబాబు వెటకారంగా నవ్వడం అస్సలు తట్టుకోలేకపోయింది.. ఆ బాధంతా తన దేవుళ్ళ దగ్గిర వెళ్లబోసుకుంది. ‘అయినా… ఈ లోకమంతా రాక్షసులతో నిండిపోయింది.. మనం కొలిచే కన్నా ఈ లోకంలోని రాక్షసులే ఎక్కువ.. మీరు మటుకు ఏం చేయగలరులెండి.. మీక్కూడా ఆ రాక్షసులంటే భయమనుకుంటాను.. అందుకే.. నా కష్టం మీరు తీర్చలేకపోతున్నారు ‘ అనుకుంటూ ఇంటికి వచ్చేసి పడుకుంది.
మాంఛి నిద్దరట్టేసింది.
పొద్దున్న ఎవరో తలుపులు దబదబ బాదుతూంటే మెలుకువొచ్చింది. తలుపు బయట జనం, పోలీసులూను ! ఆదిలక్ష్మి తలుపు తీసేసరికి, ‘హమ్మయ్య.. ఈవిడ బతికే ఉంది ‘ అన్నారెవరో.
విషయం అర్ధం కాక ఆదిలక్ష్మి వెర్రి చూపులు చూస్తూంటే అంటున్నారెవరో ‘భలే అదృష్టవంతులండీ.. రాత్రి ఉన్నపళంగా.. మీ ఇంటి ముందున్న నాలుగ్గదులూ.. అదే.. సాయి విలాస్ హోటల్ కూలిపోయిందండి.. ఎవరికీ ప్రాణం పోలేదు గానీండి.. కుమారబాబు గారు తన యాపారాన్ని మటుకు వేరే చోట మార్చుకోవల్సిందే !’

————-

6 thoughts on “కంభంపాటి కథలు – దేవుడికి భయం లేదు

  1. అంతలా ఛాలెంజ్ చేస్తే కానీ వినలేదాయన, బావుందండి, మంచి ముగింపు

  2. చాలా బాగుంది రవీంద్ర గారు. ఆదిలక్ష్మి కష్టాలకి దేముడు ఓ పరిష్కారం చూపించాడు. ఇల్లు పోతేపోయింది, మనశ్శాంతి దక్కింది.

  3. మీకథలో ట్విస్ట్ లు భలేఉంటాయండి.ముగింపు కూడా చాలా బాగుంటుంది

  4. చాలా బాగుంది కథ రవీ.‌ పాపం పండగానే దేవుడే చూసుకుంటాడు.

  5. . కలడు కొండను వాడు ఉన్నాడు.
    బాగుంది అండీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *