April 24, 2024

కాశీలోని రహస్య ద్వాదశ ఆదిత్యుల మందిరాలు

రచన: నాగలక్ష్మి కర్రా

ప్రత్యక్ష నారాయణునిగా పూజింపబడే సూర్యునికి మన దేశంలో ఒక్క ‘అరసవల్లి’ తప్ప ఎక్కడా గుడి లేదు అని మనం ఎప్పుడూ అంటూ వింటూ ఉంటాం, కాని కాశీనగరంలో ద్వాదశ, అవును అచ్చంగా పన్నెండు సూర్య మందిరాలు ఉన్నాయని (నమ్మబుద్ది కావటం లేదు కదా? కాని ఇది నిజంగా నిజం) మొదటిమారు విన్నప్పుడు నాకూ నమ్మబుద్ది కాలేదు. వాటిని చూస్తున్నప్పుడు పొందిన శక్తి, కలిగిన అనుభూతి వర్ణనాతీతం, అందుకే కాశీ వెళ్లే ప్రతీవారు ఈ ప్రదేశాలను సందర్శించుకొని సకారాత్మక శక్తిని పొందాలని ఈ పత్రిక ద్వారా ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను.

ఈ ద్వాదశాదిత్య మందిరాలు ఎక్కడవున్నాయి, వీటికి ప్రమాణాలు ఎక్కడ దొరుకుతాయి అని కాశీలో పండితులని అడిగితే వారు కాశీ ఖండం గురించి చెప్పేరు. వీటిని రహస్య మందిరాలని ఎందుకంటారంటే ఈ మందిరాలకి వెళ్లడం అంత సులువు కాదు, కాశీలో ఉన్నవాళ్లు కూడా ఈ పన్నెండు మందిరాల గురించి చెప్పలేరు, విశ్వేశ్వరుని మందిరం దగ్గర ఉన్న ‘ద్రౌపదాధిత్య’ ని కనిపెట్టడానికి రెండు రోజులు పట్టింది. మొత్తం 12 చూడడానికి మాకు మూడురోజులు పట్టింది. లోలార్కాదిత్యుని విగ్రహం ముందు సంతానేశ్వర మందిరంలోది చూసుకున్నాం. అసలు విగ్రహం అదికాదని తరవాత తెలిసింది. అసలు విగ్రహాన్ని చూడడానికి మళ్లా వెళ్లవలసి వచ్చింది.

కవిసార్వభౌముడుగా పేరుపొందిన శ్రీనాధుడు స్కందపురాణంలోని కాశీఖండాన్ని తెనిగించేరు, ఇందులో కాశీ క్షేత్రమహిమ, కాశీలో ఉన్న తీర్థాలు వాటి విశిష్టతలను, కాశీయాత్ర ఫలితాలను వివరించేరు.

కాశీ నగరం ముక్కోటి దేవతల నివాసమని, భూలోక స్వర్గమని కూడా అంటారు. కాశీఖండంలో కాశీలో ఉన్న అన్ని దేవీదేవతల గురించిన వివరణ ఉంది. ద్వాదశాదిత్యులని వెతుకుతూ వెళ్లిన మాకు ఆయా ప్రదేశాలలో ఉన్న కోవెలలు చిన్నవైనా ఉండడం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలిగించేయి.

వారణాశి వెళ్లడానికి అన్ని ముఖ్య పట్టణాలనుంచి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి.
ఇక వసతుల విషయానికి వస్తే వారణాశిలో ఉచిత వసతులనుంచి అయిదు నక్షత్రాల వసతులవరకు ఉన్నాయి, పగలు భోజనం, రాత్రి ఫలహారం అన్నపూర్ణ సత్రంలోనే కాక చాలా చోట్ల ఉచితంగా యాత్రీకులకు అందుబాటులో ఉన్నాయి. మడి పట్టింపు ఉన్నవారికి రాజాఘాట్ దగ్గరవున్న ‘కరివెన’ వారి సత్రం ఉంది. ఇవికాక రకరకాల పదార్ధాలు అందించే చాలా హోటల్స్ ఉన్నాయి.
ఇక ప్రస్తుత కథలోకి వస్తే కాలభైరవుని ఆలయానికి వెళ్తున్నప్పుడు ఆటోడ్రైవరుని ద్వాదశాదిత్యుల మందిరాలకి తీసుకువెళ్లమని అడిగితే అతను మరో ఆటోడ్రైవరు సెల్ నంబరు ఇచ్చేడు, అతను ద్వాదశాదిత్యులను చూపిస్తానని చెప్పగా మరునాడు పొద్దున్నే 7 గంటలకి ఆదిత్యుల దర్శనానికి బయలుదేరేం, ఆ రోజు మాఘపాదివారం కావడం మా అదృష్టం.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి, తొమ్మిది సూర్యమందిరాలను ఆటోలో వెళ్లి దర్శించుకోవచ్చు, మూడు మాత్రం ఆటోలో వెళ్లినా చాలా దూరం నడవాలి. కొన్ని మందిరాలు సూర్యమందిరం అని అంటే స్థానికులు చెప్పలేరు, అందుచేత కనుక్కోవడం చాలా కష్టం, ఆ సందులలో దారి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే.

ఆదిత్యుడు అంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అని మన పురాణాలలో వివరించేరు, విదేశాలకు చెందిన పరిశోధకులు ఈ మందిరాలపై అధ్యయనం చేసి నిజంగా ఈ మందిరాలలో ‘కాస్మిక్ ఎనర్జీ’ఉందని దానివల్ల చాలా చర్మరోగాలు నయమౌతాయని కనుగొన్నారు.

ఒక్కోమందిరం పేరు, స్థలపురాణం, ఎలా వెళ్లాలో క్రిందన వివరిస్తాను.

1) యమాదిత్యుడు:

కార్తీకమాసంలో యముడు తన సహోదరి యమునతో కాశీనగరంలో ప్రతీరోజూ గంగాస్నానం చేసుకొని సూర్యుని ఆరాధించుకొని ఆదిత్యుని ప్రసన్నుని చేసుకున్నాడట. ఆదిత్యుడు యమునిని ఏదైనా వరం కోరుకోమనగా యముడు కలికాలంలో ఇక్కడ సూర్యుని దర్శించుకొని పూజలు చేసుకున్న వారికి యమబాధలు లేకుండా చెయ్యాలని, వారి పితృలోక బంధువులకు యమలోకమునుండి విముక్తిని ప్రసాదించమని కోరాడట. యముని నిస్వార్థ కోరికను మెచ్చి సూర్యుడు యమునకు వరాన్ని ప్రసాదించేడు.

యమాదిత్యుడు ‘సింథియ ఘాట్‘ నుండి మెట్లెక్కి ‘సంకటా దేవి’ మందిరానికి వెళుతూ వుంటే బజారు కి దగ్గరగా మెట్ల దగ్గర ఉంటుందీ కోవెల. క్రింద రాతి పలక మీద సూర్యుని విగ్రహం పైన రెండు శిలింగాలు ఉంటాయి. స్థల పురాణం రాసి వున్న బోర్డ్, రెండు ఎర్ర ఝండాలు ఉంటాయి . ఈ శివలింగాలను యముడు ప్రతిష్టించేడని అంటారు.
కోవెలలాంటిది ఏమీ ఉండదు, మన పూజ మనమే చేసుకోవాలి, పూజారులలాంటి వారెవరూ ఉండరు.
కార్తీకమాసం, మంగళవారం, చతుర్ధశి భరణి నక్షత్రం కలసిన రోజున ఇక్కడచేసే పూజలు విశేష ఫలాన్నిస్తాయని అంటారు. ఇక్కడ ఇచ్చే తర్పణాలవల్ల యమలోకంలో యమబాధలు పడతున్న పితృదేవతలు యమలోకం నుండి విముక్తి పొంది స్వర్గలోకం చేరుతారని కాశీఖండంలో వివరించబడింది.

2) వృద్ధాదిత్యుడు:


ఒకప్పుడు కాశీనగరంలో ఓ వృద్ధుడు సూర్యుని కొరకై తపస్సు చేయగా, ఆదిత్యుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వృధ్దుని వరం కోరుకోమని అడుగగా, ఆ వృధ్దుడు తాను తాపసిగా ఉండాలనుకుంటున్నట్లు దానికి కావలసిన శక్తిని ప్రసాదించవలసినదిగా కోరుతాడు. ప్రసన్నుడైన ఆదిత్యుడు వృధ్దునకు శక్తి నిచ్చేడట, వృధ్దుని కటాక్షించిన ప్రదేశంలో ఆదిత్యుడు వృధ్దాదిత్యునిగా పూజింపబడసాగేడు. వృధ్దాదిత్యుని పూజించుకున్న వారికి ఆదిత్యుడు శక్తిని ప్రసాదిస్తాడని కాశీఖండంలో వివరించబడింది.
విశాలాక్షి కోవెల దగ్గర నుంచి నడుచుకుంటూ లోపలకి వెళ్లాలి. అక్కడ ఓ పెద్ద ఆంజనేయుని విగ్రహం వీధిలోకి కనబడేటట్లుగా ఓ మందిరం ఉంటుంది, దానికి ఎదురుగా రోడ్డుమీదకి ఉన్న గోడకి ఉంటుంది. పక్కగా ఉన్న మెట్ల మీద నుంచి గది లోపలకి వెళితే అక్కడ శివలింగం పక్కగా చిన్న వృధ్దాదిత్యుని విగ్రహం ఉంటాయి, ఇక్కడ కూడా కోవెల ముయ్యటం లాంటివి లేవు. పూజారి ప్రొద్దుట, సాయంసమయాలలో ధూపదీపారాధన చేసి వెళ్లిపోతారు కాబట్టి ఈ మందిరంలో కూడా మన పూజలు మనమే చేసుకోవాలి.

3) విమలాదిత్యుడు:

విమలుడు అనే కొండరాజు కుష్టువ్యాధిగ్రస్థుడై తనవారికి తన దుస్థితిని చూపలేక కాశీనగరానికి వచ్చి ఆరోగ్య ప్రధాత అయిన సూర్యుని పూజ, అర్చన మొదలయిన వాటితో సేవిస్తూ ఉంటాడు, కొంతకాలానికి సూర్యునకు అతనిపై దయ కలిగి ప్రత్యక్షమై విమలునకు కుష్ఠువ్యాధి నయం చేస్తాడు. విమలుడు సూర్యుని పూజించిన ప్రదేశంలోనే సూర్యుడు స్వయంభువుగా ఉద్భవించేడు. ఈ ద్వాదశాదిత్యులు స్వయంభువులే. విమలుని కొరకు ఉద్భవించేడు కాబట్టి విమలాదిత్యునిగా పిలువబడసాగేడు. ఈ ఆదిత్యునకు పూజలు చేసుకుంటే కుష్టువ్యాధి నయమౌతుందని కాశీఖండంలో వివరించబడింది.
ఈ మందిరం గురించి చాలామంది ఆటో వాళ్లకి తెలుసు. జంగంబాడికి పక్కనున్న సందులోంచి వెళితే ముందుగా ఎర్రరంగులో ఉన్న చిన్న మందిరం వస్తుంది. దాని పక్కనున్న చిన్న గదిలో విమలాదిత్యుని విగ్రహం వుంటుంది. ఇక్కడ కూడా మన పూజలు మనమే చేసుకోవాలి. కోవెల రోజంతా తెరిచే ఉంటుంది.

4) సాంబాదిత్య:

ఒకనాడు నారదముని ద్వారకాపురి విష్ణు మానసపుత్రులను చూడడానికి వస్తాడు. విష్ణుమానసపుత్రులు నారదమునికి అనేకవిధాల సేవలు చేస్తారు కాని వారిలో ఆఖరివాడైన సాంబుడు విష్ణుమూర్తి ధ్యానంలో ఉండి నారదమునికి చేసిన సేవలు అన్యమనస్కంగా చేస్తాడు. అందుకు కోపించిన నారదుడు శ్రీకృష్ణునకు సాంబుడు స్త్రీలోలుడై తన విధులను విస్మరిస్తున్నాడని చెప్తాడు. సర్వంతర్యామియైన భగవంతుడు నారదుని మాటలను పట్టించుకోడు. నారదుడు సాంబునిపై పగతీర్చుకోడానికి తగు సమయంకోసం వేచి ఉంటాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంత మందిరంలో ఉండగా ద్వారకకు వచ్చి సాంబుని శ్రీకృష్ణుని పిలువవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు, ముని ఆజ్ఞ పాలించకపోతే ముని శాపం ఇస్తాడు. శ్రీకృష్ణుని ఏకాంతానికి భంగం కలిగిస్తే శ్రీకృష్ణుని శాపానికి గురి కావలసి వస్తుంది. ఎలా అయినా శాపం తప్పదని గ్రహించిన సాంబుడు శ్రీకృష్ణుని ఏకాంత మందిరానికి వెళ్లి నారదుని రాక ఎరుక పరుస్తాడు, శ్రీకృష్ణుడు ఏకాంతాన్ని భంగం చేసినందుకు కోపించి సాంబుడు కుష్టువ్యాధి గ్రస్తుడు కావాలని శపిస్తాడు. తర్వాత జరిగిన దాంట్లో సాంబుని తప్పులేదని తెలిసిన శ్రీకృష్ణుడు, సాంబునకు కాశీనగరంలో ఆదిత్యునికై తపస్సు చేసుకొని అతని అనుగ్రహం వల్ల కుష్టువ్యాధి నివారణ పొందమని తెలియజేస్తాడు.
సాంబుడు కాశీ నగరానికి వచ్చి అక్కడ ఒక కుండాన్ని తవ్వి అందులో రోజూ స్నానం చేసుకొని సూర్యునికై తపస్సు చేసుకొని కుష్టురోగ విముక్తుడవుతాడు.
కలియుగంలో ఈ కుండంలో స్నానం చేసుకొని ఆదిత్యుని పూజించుకుంటే దీర్ఘకాలిక రోగాలనుంచి విముక్తి పొందుతారు అని ఆదిత్యుడు సాంబునకు వరమిచ్చేడు.
ఈ కుండాన్ని సూరజ్ కుండ్ అని అంటారు. ఈ మందిరం ప్రొద్దుట 6-30 గంటలనుంచి 1 గంటవరకు తిరిగి సాయంత్రం 7 నుంచి 9 వరకు తెరచి వుంచుతారు. మాఘమాసంలో ఆదివారాలు, మాఘమాసంలో ఆదివారంనాడు నవమి తిథి కలిసిన రోజు ఇక్కడ విశేషపూజలు జరుగుతాయి.
ఈ మందిరానికి వెళ్లదల్చుకున్నవారు సూరజ్ కుండ్ మందిరం అంటే ఎవరైనా చూపిస్తారు.
ప్రతీ ఆదిత్యుని కోవెలలోనూ ప్రధాన దైవంగా శివుడు ఉండడం విశేషం.

5) ఉత్తరార్కాదిత్య:

కాశీఖండం లోని 47 వ అధ్యాయంలో ఉత్తరార్కాదిత్యుని గురించిన వర్ణన ఉంది. కాశీనగరంలో ప్రియవర్తుడు అనే బ్రాహ్మణుడు తన భార్యయైన శుభవ్రదతో నివసిస్తూ ఉండేవాడు. దంపతులిద్దరూ హైంధవ సాంప్రదాయాలను పాటిస్తూ ఉండేవారు. వారికి మూలానక్షత్రం ఒకటోపాదం, జాతకచక్రంలో అయిదోగడిలో గురుసంయోగం గల సమయంలో రూపవతియైన పుత్రిక జన్మిస్తుంది. ఆమెకు సుకన్య అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకొని వేదవిద్యలు నేర్పిస్తారు.
సుకన్య జాతకదోషం తెలిసిన ప్రియవర్తుడు, అతని భార్య బెంగ పెట్టుకోగా సుకన్య వారిని ఓదార్చి దైవధ్యానంలో గడపసాగింది. కూతురుకి వివాహయోగం లేదనే బెంగతో ప్రియవర్తుడు, అతని భార్య మరణిస్తారు. మగపిల్లలు లేని వారికి సుకన్య అంత్యక్రియలు చేసి, పిండప్రదానం గావించి, సూర్యుని ఉత్తరార్కునిగా ఆరాధించసాగింది. ఆ ఆరాధననే తపస్సుగా చేసుకొని ఎన్నో కష్టాలకోర్చి తపస్సు చేయసాగింది. ఆమెతో పాటుగా ఓ మేక కూడా సుకన్య చేసినట్లుగానే అక్కడవున్న కుండంలో స్నానం చేసుకొని, ఆమె పక్కనే ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చొనేది. సుకన్య ఆహారం తీసుకున్నప్పుడే, మేక కూడా ఆహారం తీసుకొనేది. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఓనాడు పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గాన పయనిస్తూ ఉపవాసదీక్షతో కృశించిపోయిన సుకన్యను చూసి, ఆమెపై దయకలిగి ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మనగా సుకన్య తనకు కోరికలేవీ లేవని, కాని నోరులేని మేక తనతో సమానంగా తపస్సు చేసుకుందని ఆ మేకని కరుణించమని కోరుతుంది. పార్వతీ పరమేశ్వరులు సుకన్య నిస్వార్ధ కోరికకు మెచ్చుకొని మేకకు మోక్షమిచ్చి, సుకన్యకు పై జన్మలో కాశీరాజు కూతురుగా పుట్టునట్లు వరమిచ్చి అంతర్ధాన మౌతారు.
సుకన్య సూర్యుని ‘ఉత్తరార్కునిగా’ పూజించింది కాబట్టి ఈ మందిరం ఉత్తరార్కాదిత్య మందిరంగా పిలువబడుతోంది.
సుకన్య , మేక స్నానం చేసిన కుండం ‘బకరియ‘ కుండంగా పిలువబడుతోంది. మేక యొక్క భక్తిని గుర్తుంచు కొనేందుకు అలా వ్యవహరించేవారని అక్కడి వారు చెప్పేరు . పుష్యమాసంలో ‘బకరియ’ కుండంలో స్నానం చేసి ఉత్తరార్కాదిత్యుని పూజించుకుంటే శివానుగ్రహం పొందుతారు.
ఈ మందిరం పగలు 5 గంటలనుండి 12 వరకు తిరిగి సాయంత్రం 5 నుండి పదివరకు తెరచి ఉంటుంది. సాయంత్రం హారతి దర్శనం ఉంటుంది.
ఈ మందిరం సిటీ స్టేషనుకి దగ్గరగా ఉంటుంది , “బకరయ కుండ్ “ అని చెప్తే ఆటోవాళ్లు తీసుకు వెళతారు.

6) మయూఖాదిత్య:

స్కందపూరాణంలోని కాశీఖండం ప్రకారం ఒకమారు సూర్యుడు శివపార్వతులకై తపస్సుచేయాలని సంకల్పించి పంచగంగా సంగమ ( గంగ, యమున, సరస్వతి, ధూతపాప, కిరణ నాడి నదుల సంగమం ) సమీపంలో శివపార్వతులను ప్రతిష్టించుకొని తపస్సు చేసుకోసాగేడు, సూర్యుని తపస్సులోంచి పుట్టిన అగ్ని ముల్లోకాలనూ దహించసాగిందట, ముక్కోటి దేవతలూ శివుని వద్దకు వెళ్లి సూర్యుని తపస్సు ముల్లోకాలనూ దహించివేస్తోందని చెప్పగా శివుడు ఆదిత్యునికి ప్రత్యక్షమయి చూడగా సూర్యుడు ఓ అగ్నిగోళంగా కనిపించేడట. అప్పుడు శివుడు సూర్యుని చేత్తో తాకగా సూర్యుడు చల్లబడి తపస్సు చాలించేడట.
ఈ కోవెలలో సూర్యుని విగ్రహం తేమగా వుంటుంది. ఈ తేమ ఎక్కడనుండి వస్తోందో ఎవరూ కనిపెట్టలేకపోయేరట, మనం చేత్తో తడిమి చూడొచ్చు.
అగ్నిగోళంలా కనిపించేడు కాబట్టి ఇక్కడ సూర్యుని మయూఖాదిత్యుడు అని అంటారు. సూర్యునిచే ప్రతిష్టించబడ్డ శివుని గభశ్థీస్వరుడు అని పార్వతీదేవిని మాంగళ్యగౌరి అని, వినాయకుడిని మంగళ వినాయకుడని అంటారు. ఈ కోవెలలో బ్రహ్మచారిణి, బ్రహ్మేశ్వరుడులను కూడా దర్శించుకోవచ్చు.
ఆదివారం నాడు మయూఖాదిత్యుని దర్శించుకున్నవారికి శరీరం తేజోవంతమౌతుందని కాశీఖండంలో వ్రాయబడింది.
ఈ కోవెలను ఆటోలో వెళితే చాలాదూరం నడవవలసి వస్తుంది, ఆటో దూరలేనంత చిన్న సందులు, అదే బోటుమీదైతే పంచగంగా ఘాట్ లో దిగి మెట్లెక్కి కోవెల చేరుకోవచ్చు.
స్థానికులు ఈ మందిరాన్ని మాంగళ్యగౌరీదేవి మందిరమని అంటారు. అలా మనం అడిగితేనే స్థానికులు చెప్పగలరు, ఈ మందిరానికి దగ్గరగా పంచమాధవులలో ఒకటైన “బిందుమాధవుని “ మందిరం ఉంటుంది . బిందుమాధవుని మందిరంలో రుద్రభైరవుని విగ్రహం మూడువేలసంవత్సరాల పాతది చూడొచ్చు.
ఈ కోవెల పగలు 5 నుంచి 1 గంటవరకు తిరిగి 3 గంటలనుంచి రాత్రి 10 వరకు తెరచివుంటుంది .

7) లోలార్కాదిత్యుడు:

కాశీఖండం ప్రకారం పరమశివుడు ఓనాడు సూర్యుని పిలిచి “కాశీనగరాన్ని పరిపాలిస్తున్న రాజు దివోదాసు ధర్మబద్దంగా పరిపాలన చేస్తున్నాడు, అతను ధర్మం తప్పగానే కాశీ నగరం వల్లకాడవుతుంది. నిర్జనమైన కాశీనగరం నా ఆవాసంగా చేసుకోవాలని నా చిరకాల కోరిక. లోకసాక్షియైన నీకు దివోదాసు గురించి తెలుసుకోడం కష్టం కాదు. దివోదాసు ధర్మం తప్పిన మరుక్షణం నీ వేడి కిరణాలతో కాశీనగరాన్ని భస్మం చేయమని “ చెప్తాడు.
సూర్యుడు రకరకాల మారువేషాలలో కాశీనగరంలో తిరుగుతూ దివోదాసుని గమనిస్తూ వుంటాడు. దివోదాసులో ఎటువంటి లోపం కానరాదు. చాలా కాలం కాశీనగరంలో ఉండడం వల్ల, పవిత్ర కాశీనగరంలో ఉండిపోవాలనే కోరిక సూర్యునిలో కలుగుతుంది. అందుకని సూర్యుడు కాశీనగరంలో ఉండిపోయేడట. లోల అంటే కోరిక. అందుకే ఇక్కడ సూర్యుడు లోలార్కాదిత్యుడుగా పిలువబడసాగేడు.
ఆదివారంనాడు లోలార్క కుండంలో స్నానం చేసుకొని లోలార్కాదిత్యుని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు పోతాయని భక్తుల నమ్మకం. సప్తజన్మల పాప ప్రక్షాళన జరుగుతుంది. భాద్రపద శుక్ల షష్టి, మార్గశిర శుక్ల షష్టి రోజులలో లోలార్కాదిత్యుని కోవెల భక్తులతో నిండిపోతుంది, దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లోలార్కా దిత్యుని పూజించుకొని తమ తమ రుగ్మతలను పోగొట్టుకుంటారు.
లోలార్కాదిత్యుని విగ్రహం లోలార్క కుండం మెట్లమీద కట్టిన చిన్న గూట్లో ఉంటుంది. చాలా మంది సంతానేశ్వర మందిరంలో ఉన్న ఆదిత్యుని విగ్రహన్నే చూస్తారు, లోలార్క కుండంలో ప్రవేశద్వారానికి కుడిచేతి వైపు ఉన్న మెట్లు వైపుగా దిగి క్రిందకి వెళ్తే లోలార్కాదిత్యుని చూడగలుగుతాం. ఈ మందిరం రోజంతా తెరచి వుంటుంది. లోలార్క కుండం గేటుకి తాళం వేసి వుంటుంది, లోపలకి వెళ్లడానికి మనిషికి పదిరూపాయలు తీసుకుంటారు.
లోలార్కాదిత్య కుండం బయటనున్న మందిరం సంతానేశ్వర మందిరం, ఇక్కడ శివుడు సంతానేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ శివునికి సంతానాపేక్షతో జలాభిషేకం చేసిన వారికి ఒక సంవత్సరం లోపున మగసంతానం కలుగుతుందని ఇక్కడ పూజారిగారు చెప్పేరు.

8) ఖఖోల్కాదిత్య:


కశ్యప ప్రజాపతి పత్నిఅయిన వినత ఆమె పుత్రుడైన గరుత్మంతునితో తన సవతి కద్రువకు, ఆమె పుత్రులైన నాగులకు దాస్యం చేయవలసి వస్తుంది. దాస్యవిముక్తికి మార్గం చెప్పమనగా, నాగులు తమకు అమృతం తెచ్చి ఇస్తే వారికి దాస్యవిముక్తి కలిగిస్తామని అంటారు. గరుత్మంతుడు అమృతం కొరకు వెళ్లగా దేవతలు అమృతాన్ని కత్తెర యంత్రంలో విష్ణుమూర్తి ఆధీనంలోఉంచుతారు. గరుత్మంతుడు రెండురోజులు విష్ణమూర్తితో పోరాడగా అతని పోరాటానికి మెచ్చిన విష్ణమూర్తి అతనికి రెండు వరాలనిస్తాడు. గరుత్మంతుడు మొదటికోరికగా అమృతాన్ని, రెండవ కోరికగా విష్ణుమూర్తి వాహనంగా ఉండాలని కోరుకుంటాడు. ఎట్టి పరిస్థితులలోనూ అమృతాన్ని నాగులకు అందించరాదని దేవతలకే ఇవ్వాలని చెప్పి అమృతభాండాన్ని గరుడునికి ఇస్తాడు.
గరుత్మంతుడు అమృతభాండాన్ని ధర్భలపై నుంచి నాగులను పిలచి అమృతభాండాన్ని చూపించి దాస్య విముక్తుడౌతాడు. స్నానం చేసి సుచియై వచ్చి అమృతాన్ని సేవించమంటాడు. నాగులు స్నానంచేసి వచ్చేలోపు అమృతాన్ని తీసుకొని వచ్చి విష్ణుమూర్తికి ఇచ్చివేస్తాడు.
దాస్యవిముక్తురాలైన వినత ఏ జన్మలోని పాప ఫలితమువలనో దాస్యం చేయవలసి వచ్చినదని సూర్యుని కొరకు తపస్సు చేసుకోసాగింది. సూర్యుడు ప్రత్యక్షమై వినతను ఆమె పూర్వజన్మ పాపముల నుంచి విముక్తరాలిని చేసి, వినత పుతృడైన ‘అనూరునుని’ తన రథసారధిగా నియమించుకున్నాడు. వినత ప్రతిష్టించుకున్న ఈశ్వరుని ‘కామేశ్వరుడు’ అని అమ్మవారిని ‘ఇష్టకామేశ్వరి’ గా పూజిస్తున్నారు. కాశీఖండంలో 50 వ అధ్యాయంలో ఖకోల్కా దిత్యుని గురించి వివరించబడింది. ఈ మందిరం దగ్గర ఉన్న ‘పిప్పలతీర్ధం’ గురించి కూడా వివరించబడింది. ఇప్పుడు ఇది ‘పిప్పలకూపం’ గా పిలువబడుతోంది.
ఈ కోవెల ప్రొద్దున్న 5 గంటలనుంచి 12 గంటలవరకు తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటలవరకు తెరచి వుంటుంది. రాత్రి 9-30 గంటలకు శయన హారతి ఇస్తారు.
ఈ మందిరాన్ని ‘మచ్చోదరి’ లేదా ‘బిర్లామందిరం’ దగ్గరవున్న ‘కామేశ్వర మహదేవ’ మందిరం అని చెప్తే ఆటో వాళ్లు తీసుకు వెళతారు.
అమృతభాండాన్ని ఉంచిన ప్రదేశంలో గరుత్మంతుడు శివలింగాన్ని స్థాపించి పూజించేడు. ఇప్పుడు దానినే ‘గరుడేశ్వర లింగం’ గా భక్తులు పూజించుకొంటున్నారు.

9) కేశవాదిత్య:

కేశవాదిత్యుని గురించిన వర్ణన కాశీఖండంలో 51 వ అధ్యాయంలో ఉంది.
ఓ నాడు ఆదిత్యుడు ఆకాశమార్గాన కాశీనగరం మీదుగా ప్రయాణిస్తూ, కేశవుడు శివార్చన చెయ్యడం చూసి క్రిందకు వచ్చి ‘కేశవా ముల్లోకాలకు అధిపతివైన నిన్ను అందరూ పూజించాలి కదా?, అలాంటి నువ్వు శివార్చన చెయ్యడ మేమిటి? నాకు వివరముగా చెప్పుమని’ వేడుకొనగా కేశవుడు ‘ఆదిత్యా కాశీనగరానికి పాలకుడు పరమ శివుడు, కాశీలో పరమశివుడే పరమాత్ముడు, కాశీలో చేసే పూజలన్నీ పరమశివునికే చెందుతాయని’ చెప్తాడు, పరమాత్ముని గురించి తెలియజేసిన కేశవుని గురువుగా అంగీకరించి, ఆదిత్యుడు కూడా శివుని పూజించుకున్నాడట. ఆదిత్యుని పూజలకు ప్రత్యక్షమైన పరమశివుని ఆదిత్యుడు ఇక్కడ భక్తులు చేసుకునే పూజలకు వారిని జన్మజన్మల పాపాల నుండి విముక్తులను చేసి ఉత్తమగతులు ప్రాప్తించేటట్లు చేయమని కోరుతాడు.
మాఘసప్తమి ( రథసప్తమి ) ఆదివారం కలసిన రోజు ఇక్కడ భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడి ‘ పాదోదక ‘ తీర్థంలో స్నానం చేసుకొని కేశవాదిత్యుని దర్శించుకొని జన్మజన్మల పాపాలను పోగొట్టుకొంటారు.
ఈ కోవెలను పడవలో రాజఘాట్ వద్ద దిగి వెళ్లొచ్చు లేదా ఆటోలో కూడా వెళ్లొచ్చు, ఆటోలో అయితే ఓ కిలోమీటరు నడవవలసి వస్తుంది. ఆదికేశవ మందిరం అంటే ఆటోవాళ్లు తీసుకువెళతారు.
ఈ కోవెల ఉదయం 6 నుంచి 12, తిరిగి సాయంత్రం 4 నుంచి 10 వరకు తెరచివుంటుంది.

10) గంగాదిత్య:

ఈ కోవెల నేపాలి పశుపతినాథ్ మందిరం దగ్గర గంగానదికి అభిముఖంగా ఉంటుంది. ఆదిత్యుడు ప్రతీరోజూ గంగాదేవిని దర్శించుకొని పూజించుకుంటాడని, ప్రొద్దుట గంగాస్నానం చేసుకొని ఈ సూర్యభగవానుని దర్శించు కుంటే సూర్యుని కృపవల్ల సర్వరోగాలు నశించి ఆరోగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. చాలామంది భక్తులు ఇక్కడ స్నానంచేసి గంగాదేవిని, సూర్యుని ఆరాధిస్తూ కనిపిస్తూ ఉంటారు.
ఈ కోవెలను దర్శించుకుందాం అనుకొనేవారు నేపాలీ పశుపతినాథ్ మందిరం అని చెప్పాలి. అక్కడకు వెళ్లిన తరువాత గంగాదిత్యుని మందిరం అని చెప్పాలి. చిన్నగూడులా కట్టిన దానిలో గంగాదిత్యుని విగ్రహం ఉంటుంది. జాగ్రత్తగా పశుపతినాథ్ మందిరం దగ్గర అడుగుతూ వెళితే గంగాభిముఖంగా ఉన్న ఈ చిన్న మందిరాన్ని చూడగలం.
ఈ మందిరం రోజంతా తెరిచేవుంటుంది.

11) అరుణాదిత్యుడు:

కశ్యప ప్రజాపతి పత్ని వినత తొందరపాటు వల్ల వికలాంగుడిగా జన్మించిన ‘అనూరుడు’ సూర్యుని కొరకు తపస్సు చేసి ఆదిత్యుని ప్రసన్నుని చేసుకుంటాడు. ఆదిత్యుడు అనురునుని తన రథసారధిగా నియమించుకొంటాడు. అనురునుని తపస్సు వలన సూర్యునికి అరుణుడు అనే పేరు వచ్చింది.
ఈ మందిరం చేరుకోవాలంటే ‘మచ్చోదరి’ వరకు ఆటోలో వెళ్లి అక్కడ త్రిలోచనేశ్వర మందిరం అని అడిగితే స్థానికులు చూపించగలరు.
ఈ మందిరం పగలు 6-30 నుంచి 12 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు తెరచివుంటుంది.
రాత్రి మందిరం మూసేముందర అరుణాదిత్యునికి శయనహారతి ఇస్తారు. అరుణాదిత్యుని పూజించుకున్నవారికి ఆహార ఆరోగ్యాలకు కొరత కలగదని కాశీఖండం లో చెప్పబడింది.

12) ద్రౌపదాదిత్యుడు:


ద్రౌపతి పాండవులతో వనవాసానికి వెళ్లినపుడు వారితో కూడా ఉన్న మునులకు, అతిధి అభ్యాగతులకు ఆథిత్య మివ్వలేకపోతున్నందుకు విచారించి కాశీనగరంలో సూర్యుని ప్రార్ధించగా, సూర్యుడు ద్రౌపతికి అక్షయపాత్రని ప్రసాదిస్తాడు. అక్షయపాత్ర ప్రభావంతో ద్రౌపతి ఋషులకు మునులకు నిరాటంకంగా ఆధిత్యమివ్వగలుగుతుంది.
ద్రౌపతిచే పూజలందుకున్న సూర్యుడు ద్రౌపదాదిత్యగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ద్రౌపదాదిత్యుని పూజించు కున్నవారికి ఏ జన్మలోనూ ఆకలిబాధలుండవని కాశీఖండంలో చెప్పబడింది.
ఈ మందిరానికి ఎలా చేరుకోవాలి అంటే, కాశీవిశ్వేశ్వరుని మందిరం దగ్గర ‘జ్ఞానవాపి’ దగ్గర సందులలో కనుక్కుంటూ వెళ్లాలి. ఒక్క సందు తప్పుతిరిగినా అంతే. అందుకు జ్ఞానవాపి దగ్గరే స్థానికులను ఒకటికి రెండుసార్లు అడుగుతూ వెళితే ఈ మందిరాన్ని చూడగలుగుతాం.
ఈ కోవెల రాత్రి పదివరకు తెరిచే వుంటుంది. పూజారులు పగలు దీపధూపాలు చేసి వెళ్లిపోతారు.

ఈ ద్వాదశ ఆదిత్యమందిరాలు చాలా మహత్తుగలవని విదేశీ పరిశోధకుల పరిశోధనల వలన తెలిసింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా ఈ పరిశోధనలలో సహాయపడుతున్నారు.
కాశీ వెళ్లేవారు సాధారణంగా తొమ్మిది రాత్రులు వుండాలని వెళతారు, మిగతా ముఖ్యమందిరాలతో పాటు ద్వాదశ ఆదిత్య మందిరాలను దర్శించుకొని ఆదిత్యుని కృపతో సర్వరోగాలనుండి జన్మజన్మల పాపాలనుండి ఉపసమనం పొందాలని కోరుకుంటూ శలవు.

2 thoughts on “కాశీలోని రహస్య ద్వాదశ ఆదిత్యుల మందిరాలు

  1. Very nice explanation and presentation of details.
    It will be great if devotees set up a website, collect some funds from the devotees of Adithya and commission a priest cum escort to take people interested in seeing these temples and offering their worship for a small nominal fees.
    I hope that Sri. Yogi Adityanath, CM of UP, may be willing to help in such an effort.

Leave a Reply to Somayajulu Karamchetty Cancel reply

Your email address will not be published. Required fields are marked *