April 23, 2024

చంద్రోదయం – 26

రచన: మన్నెం శారద

మరుసటిరోజే వాళ్ళు వెళ్ళిపోయేరు.

గతంలోని నీడలని తప్పించుకోలేక సారథి రెండు నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నాడు.

*****

స్వాతి చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా వుంది. తన మనసులో వున్న భయాన్ని సారథి ముందుంచింది. తనని అనుక్షణం పట్టి వేధిస్తున్న మోహన్ విషయం అతనికి నిర్భయంగా చెప్పేయగలిగింది.
సారథి తనని అపార్థం చేసుకోలేదు.
స్వాతికి అకస్మాత్తుగా దిగులేసింది. మనసు విప్పి అంతా చెప్పినా తననింకా దూరంగానే వుంచు తున్నాడు సారథి. పరాయిదానిగానే భావిస్తున్నాడింకానూ.
గత పదిరోజులుగా తను అతనికి అన్ని విధాలుగా దగ్గర కావాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. అతని కనుసన్నలలో పదాలని, అతని ప్రేమని చూరగొని, అతని కౌగిలిలో యిమిడిపోయి, ఇన్నాళ్ల వెతలని, ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్తోంది.
కానీ సారథి యిదేం పట్టనట్లు యాంత్రికంగానే ప్రవర్తిస్తున్నాడు.
తననిట్ల అతని మనసు విరిగిపోయిందా? లేక కేవలం అతని స్నేహితుడిపట్ల వున్న అభిమానాన్ని, భక్తిని, కృతజ్ఞతని చాటుకొవటానికి, ఒంటరితనంతో కుమిలిపోతూన్న తనని జాలితో ఆదుకోటానికి మాత్రమే వివాహం చేసుకున్నాడా?
కాదు. ఖచ్చితంగా ఇది తన లోపమే! తనే అతన్ని తన భయాలతోనూ, జంకుతోనూ, లేనిపోని పిరికి వ్యూహాలతో దూరం చేసుకుంది. ఇద్దరి మధ్యన దూరం పెరగడానికి కారణం తనే.
ఒకప్పుడు తనని ప్రేమించిన వ్యక్తి, ఆరాధించిన వ్యక్తి తనకోసం అలానే ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి, ఈ రోజున తను అన్నివిధాలా అందుబాటులో వున్నా యిలా దూరంగా వుంచుతున్నాడంటే.. కేవలం తన లోపమే.
ఈ లోపాన్ని తనే సవరించుకోవాలి.
అతన్ని తనే తన దారికి తిప్పుకోవాలి.
తనీ ఒంటరి జీవితాన్నింక భరించలేదు.
స్వాతికి అకస్మాత్తుగా ఓ వింత వూహ వచ్చింది. “అవును, అలా చేస్తే?…” స్వాతి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది.
ఆ వెంటనే ఉత్సాహంగా బీరువా తీసి అడుగు అరలో వున్న చీర బయటికి తీసింది.
ఆ చీర మీద బ్లౌజు కుట్టించుకోలేదు. జాకెట్లలో దానికి మాచ్ అయ్యేది ఎన్నుకొంది.
చీర మడతలు విప్పి పరీక్షగా చూసింది స్వాతి.
నీలాకాశం రంగు చీర మీద తారల్లాంటి చుక్కలు. ‘ఫర్వాలేదు. సారథికి మంచి టేస్తే వుందీ’ అని నవ్వుకొంది స్వాతి.
‘ఈ చీర నానీ పుట్టినరోజున ఎంత ప్రళయం సృష్టించింది. తిరిగి ఈ చీరే తమ యిద్దరి మధ్యా ప్రణయం సృష్టించగలిగితే..’ స్వాతి ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొంది. చాలా రోజుల తర్వాత మనసుకి నచ్చిన విధంగా తయారయింది.
ఆ చీర కట్టుకొని అద్దంలోకి చూసుకుంటే, శేఖర్‌తో గడిపిన తొలిరోజులు గుర్తొచ్చేయి స్వాతికి.
ఎక్కడో సన్నగా ముల్లు గుచ్చుకున్నట్లు బాధ.
శేఖర్ తనని ఎంతో అపురూపంగా చూసేవాడు. గలగలా కబుర్లు చెప్పేవాడు. అతని సాంగత్యంలో తన జీవితం యెంతో హాయిగా సాగిపోయింది.
కానీ… విధి తనని చిన్న చూపు చూసింది.
తన జీవితాన్ని కాటేసింది.
ఎన్నో అనుకోని మలుపులు తిరిగిపోయింది తన బ్రతుకు. ఇంకముందేం జరగనుందో.
స్వాతి నిట్టూర్చి అద్దం ముందునుండి లేచి బాల్కనీలోకొచ్చి నిలబడింది.
నానీ క్రింద పనిపిల్లతో దొంగాట ఆడుతున్నాడు.
దూరంగా రోడ్డు మీదనుండి వడివడిగా వస్తోన్న సారథిని చూడగానే స్వాతి గుండె దడదడలాడింది.
తననిలా చూసి ఏ విధంగా భావిస్తాడో, అతను తెచ్చిన చీర ఇన్నాళ్లకయినా కట్టుకొన్నందుకు చూసి సంతోషిస్తాడా? తన మనోభావాలని పసిగట్టి తనని దగ్గరకి తీసుకుంటాడా.?
స్వాతి ఆలోచనలనుండి తేరుకొనేలోపునే సారథి మెట్లెక్కేసేడు.
“స్వాతీ! అర్జంటుగా నావి రెండు జతల బట్టలు సూట్‌కేసులో సర్దు” అన్నాడు బాత్రూంలోకి వెళ్ళిపోతూ.
స్వాతి మ్రాన్స్పడి చూసింది.
“ఇదేమిటి? తనేమనుకుంది. ఏం జరగబోతుంది?’ స్వాతి కళ్లలో నీళ్లు తిరిగేయి.
సారథి టవల్‌తో ముఖం తుడుచుకుంటూ యింకా అక్కడే నిలబడ్డ స్వాతిని ఆశ్చర్యంగా చూసేడు. “ఇంకా అలాగే నిలబడ్డావా? నాకవతల బస్సు టైమైపోతోంది!: అన్నాడు.
స్వాతి నీరసంగా వంటగదిలోకి వెళ్లింది.
ఆమెకు దుఃఖం ముంచుకొస్తుంది. తను నిజంగా నష్టజాతకురాలే. తన మామగారు తననలా సంభోదించినందుకు ఆ రోజు ఎంతో బాధపడింది. కానీ ఆ మాట అనేకసార్లు తన జీవితంలో నిరూపించబడింది.
తను తెచ్చిన చీర కట్టుకొంటే సారథి మురిసిపోతాడని, తన కలలన్నీ ఈ రోజు నిజం కాబోతున్నాయని, ఎండి బీటలు వారిన తన హృదయంపై అనురాగపు జల్లు కురవబోతోందని, ఆ ప్రేమ వాహినిలో తడిసి తన బ్రతుకు ధన్యమవ్వబోతోందని.. ఎన్నో ఆశలు! మరెన్నో వూహలు.
స్వాతి నిరుత్సాహంగా కాఫీ కలిపి తీసుకెళ్లింది గదిలోకి. సారథి సూట్‌కేసులో బట్టలు సర్దుకుంటున్నాడు.
“ఈ ప్రయాణం తప్పదా?” స్వాతి కప్పు అందిస్తూ మెల్లగా అడిగింది.
సారథి తప్పదన్నట్లు తలాడించేడు.
“కేంపా?” అడిగింది స్వాతి.
“కాదు.. అమ్మ అర్జంటుగా రమ్మని టెలిగ్రాం ఇచ్చింది.”
“అంటే.. ఎవరికయినా బాగుండలేదేమో!” ఆమె కళ్లు భయంతో రెపరెపలాడేయి.
“అదేం కాదనుకుంటా. నువ్వు అనవసరంగా కంగారుపడకు”సారథి ధైర్యం చెబుతున్నట్లుగా అని సూట్‌కేసుని అందుకున్నాడు.
స్వాతి మౌనంగా నిలబడిపోయింది.
“నాని జాగ్రత్త! నేను సాధ్యమైనంత తొందరగానే వచ్చేస్తాను” సారథి స్వాతిని హెచ్చరించి వెళ్లిపోయాడు.
కనుదూరమౌతున్న అతన్నే గమనిస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది స్వాతి. నిరాశ నిందిన ఆమె హృదయం గత జ్ఞాపకాల పుటలను తిప్పింది మరోసారి.

శేఖర్ మరణం తర్వాత స్వాతి బ్రతుకు స్తంభించిపోయినట్లయింది.
ఆమెకు ఏడుపు కూడా రావటం లేదు.
ఎన్నిసార్లో చచ్చిపోవాలన్నంత ఉద్వేగం కలిగేది ఆమెకి. కాని ఓ పక్క జబ్బు పడి మంచం మీద వున్న తండ్రి, ఇంకోపక్క ఒక దారంటూ ఏర్పడని చెల్లెళ్లు, లోకాన్ని అప్పుడే కళ్లు విప్పి చూస్తోన్న చిన్నారి కొడుకు.. ఆమెని తెగించనివ్వలేదు.
ఆ గుండె బరువు ఎవరికీ తెలియనిది.
ఆ నైరాశ్యం ఎవరూ వూహించలేనిది.
స్వాతి ఎన్నాల్లో మంచానికి అంటుకుని మూగగా రోదించేది.
కష్టాలు తోడుగానే వస్తాయన్నది నిరూపిస్తూ ఆ రోజు సరిగ్గా శేఖర్ పోయిన పదిహేను రోజులకే శంకరం మాష్టారు కన్నుమూసేరు.
అప్పటికి మూడురోజుల క్రితమే ఆయనకు మాట పోయింది. అల్లుడు పోయేడన్న బాధ ఆయన్నింక కోలుకునే విధంగా చేయలేదు. డాక్టర్లు పెదవి విరిచేసేరు. ఆయన ఎవరికీ ఏమీ చెప్పుకోలేనట్లు అవిరామంగా కన్నీళ్లు కార్చేరు.
కన్న సంతానానికి ఆఖరి మాటగా ఏమీ చెప్పుకోలేక కళ్లతోనే చూస్తూ అలాగే ప్రాణం వదిలేసేరు.
శేఖర్ పోయినందుకు అలమటించిన ఆ కుటుంబ సభ్యులు శంకరంగారి మరణంతో మరింత కృంగిపోయేరు.
సారథికి ఆ శక్తి, ధైర్యం ఎక్కడనుండి వచ్చేయో ఎవరికీ అర్థం కానిది. శేఖర్ పోయినందుకు అతను మనిషి కాలేదన్న విషయాన్ని తారుమారు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడు. తన చేతులమీదుగానే శేఖర్ అంత్యక్రియలు జరిపించేడు.
ఆ చేతులతోనే శంకరంగారికి దినవారాలు కూడా చేసేడు. శేఖర్ ఆఫీసు విషయాలు కూడ అతనే కనుక్కొని స్వాతికి ఫామిలీ బెనిఫిట్ ఫండ్ పదివేలు అందేలా చేసేడు.
“స్వాతీ! నీకు ఉద్యోగం వచ్చింది” అన్నాడొకరోజు స్వాతి దగ్గరగా స్టూలు మీద కూర్చుంటూ సారథి.
స్వాతి నిర్లిప్తంగా చూసింది.

ఇంకా వుంది..

1 thought on “చంద్రోదయం – 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *