April 20, 2024

తాత్పర్యం – దుఃఖం సుఖంకంటే సుఖమా. ?

రచన:- రామా చంద్రమౌళి

ఆమె సుభద్రేనా. ?
మనసు పదే పదే తరచి తరచి వెదుకుతోంది. జ్ఞాపకాన్ని. రెండు నిముషాలక్రితం గబగబా మెట్లెక్కుతూ ఎ. టి. ఎం. లోకి వస్తున్నప్పుడు కనబడ్డ ఆమె రూపురేఖలను మరోసారి మననం చేసుకుంటూ.
దాదాపు నలభై సంవత్సరాల క్రితం కనుమరుగైన సుభద్ర. మళ్ళీ అనూహ్యంగా. ఇప్పుడు ఇలా కనబడే అవకాశం ఉందా.
ఒకవేళ ఆమె సుభద్రే ఐతే. ఇన్నాళ్ళు ఎక్కడుందో. ఎక్కడో ఉంటే ఇప్పుడెందుకొచ్చిందో. వస్తే. ,
సుభద్ర. సుభద్ర. . మనసు ఒక్కో జ్ఞాపకపు పొరను ఛేదించుకుంటూ వెనక్కి. ఇంకా వెనక్కి. లోలోతులకు. ,
అప్రయత్నంగానే గాజు తలుపుల్లోంచి వెనక్కి, రోడ్డు ప్రక్కన పార్క్ చేసి ఉన్న నా కారు దిక్కు చూశాను మళ్ళీ. ఫుట్ పాత్ ప్రక్కనే నిలబడి ఉంది అలాగే. తలపైనుండి చీర కొంగు. ముఖం కనబడ్డం లేదు. అటు వేపు కారు దిక్కు తిరిగి ఉందామె.
ప్రాసెస్ ఐపోయి ఎ. టి. ఎం. మెషీన్ బర్ ర్ ర్ మని చప్పుడు చేసి నోట్లను బయటికి నెట్టింది చీలికలోనుండి. వెంటనే ఏదో మూతబడిన ధ్వని. ప్రక్కనున్న విండోనుండి చప్పున బయటికి తన్నుకొచ్చిన స్లిప్.
అప్రయత్నంగానే నోట్లను లెక్కపెట్టుకుంటూ ,
ఇరవ ఒక్క ఐదువందల రూపాయల నోట్లు. ఐదు వందరూపాయల నోట్లు.
జేబులో పెట్టుకుంటూ, ఆతురతగా వెనక్కి తిరిగి. మళ్ళీ కారుదిక్కు చూపు.
అక్కడే ఉందామె.
కొంచెం చీకటి చిక్కబడ్డది. వీధి లైట్లు వేసినట్టున్నారు అప్పుడే. పల్చగా తెల్లని కాంతి రోడ్డుపై పర్చుకుంటూ,
అసలా రోజు తెలంగాణా బంద్. పొద్దంతా దుకాణాలన్నీ మూసేయబడే ఉన్నాయి. సాయంత్రం ఆరవుతూండగా అక్కడొకటి అక్కడొకటి దుకాణాలు తెరుచుకుంటూ ,
కరూర్ వైశ్యా బ్యాంక్ ఎ. టి. ఎం. నుండి బయటికొచ్చి నిర్మలా కాంప్లెక్స్ లాంజ్ లో నిలబడి. పరిశీలనగా, స్పష్టంగా నా కారు దిక్కూ, నేను సుభద్రగా భావిస్తున్న ఆ మనిషి దిక్కూ నిలకడగా చూస్తూ,
శీతాకాలం. జనవరి నెల. పొద్దంతా దట్టంగా మబ్బుపట్టిన ఆకాశం. ఇక సూర్యుడస్తమించగానే చలి. ఆకాశం అన్ని అంచుల నుండీ చలి ఒక జలవలె ముంచుకొస్తున్నట్టు. చల్లగా గాలి విస్తరణ. ఒళ్ళు వణుకుతున్నట్టు జలదరింత. జేబుల్లోకి చేతులు వెళ్ళిపోయేయి అప్రయత్నంగానే. సన్నని పొగమంచు కూడా గాలిలో తేలివస్తున్నట్టు పల్చని తెర పరిసరాలనిండా.
సుభద్ర జ్ఞాపకం అప్పుడే అంటుకున్న కాగడాలా మెదడు లోపల ఎక్కడో మండుతూ. ,
వెళ్ళిపోయాను నలభై సంవత్సరాల వెనక్కి.
ఏదో తెలియని భారం హృదయం నిండా. తుఫాను. గాలివాన. బీభత్సం. లోపల.
ఒక్క క్షణంలో మనిషి ఎంత ఉద్విగ్నుడు కాగలడు. అని నాకు నేనే నమ్మలేని విచిత్రానుభూతి.
మెట్లు దిగి. టకటకా కారు దగ్గరికి నడిచి. రిమోట్తో డోర్స్ తెరిచి. డ్రైవింగ్ సీట్లోకి జారుతూ చటుక్కున తలెత్తి చూశాను.
అమె. సుభద్రే. సందేహం లేదు. నా వైపే రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తోంది.
ఒక్క లిప్తకాలంలో గమనించాను. ఆమె చూపులనిండా సముద్రమంత తహతహ. తపన. వ్యాకులత. దుఃఖం. దయ. దైన్యం.
ఆమె నిస్సహాయంగా గాలిలో తేలిపోతున్న కాగితపు ముక్కలా ఉంది.
సన్నగా, పీలగా, కళ్ళు పీక్కుపోయి, చలికి ఏదో ఓ చవకరకం తువ్వాలును చుట్టుకుంది భుజాల చుట్టూ. నెత్తిపైనుండి కొంగు.
చూద్దామని కావాలనే కారును స్టార్ట్ చేశాను.
ఇక ఆమె తట్టుకోలేకపోయినట్టు చలించిపోతూ “రమణా. “అంది ఉద్వేగంగా, సన్నగా.
ఆమె గొంతు వినగానే నాలో అకస్మాత్తుగా ఒక పెట్రోల్ బావి అంటుకున్నట్టు గుప్పున ఉద్విగ్నత ఎగిసెగిసిపడ్తూ,
*****
“సుభద్రా. “అన్నాను నాకు తెలియకుండానే కారు దిగుతూ.
“రమణా బాగున్నావా. “ఇంకేదో అనబోయి ఆగి. తడబడుతూ.
సుభద్ర. ఈ క్షణం. ఇక్కడ. ఇన్నేండ్లు. నలభై సంవత్సరాల తర్వాత. అనూహ్యంగా,
“సుభద్రా. నువ్వేనా. ఎక్కడున్నావిన్నాళ్ళు. ఏమైపోయావు. ఎలాఉన్నావు. ఎప్పుడొచ్చావు వరంగల్లు. ఎక్కడున్నావిప్పుడు. ఇప్పుడిక్కడ. ఎలా. ” మాటలు తడబడుతూ, విరిగిపోతూ, అతుకుతూ. తెగుతూ మంట అంటుకుంటున్న వత్తిలా,
సుభద్రకూడా అంతే. కళ్ళనిండా అదే ఉత్సుకత, అదే ఆశ్చర్యమూ ఆనందంతో నిండిన వెలుగు. మనిషి కంపించిపొతోంది.
“రమణా! బాగున్నావా. ఇలా నడుచుకుంటూ వెళ్తూ అనుకోకుండా నిన్ను చూచి పోల్చుకుని, నువ్వే అని గుర్తుపట్టి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నిన్ను చూడగల్గుతున్నందుకు పొంగిపోతూ.” చెప్పుకుపోతూనే ఉంది గడగడా. చిన్నపిల్లలా ఆవేశపడిపోతూ. తలమునకలైపోతూ.
నాకూ అంతే. నరాల్లోనుండి విద్యుత్తులా ఏదో మెరుపు జరజరా ప్రాకిపోతూ,
“రా సుభద్రా. కార్లో కూర్చో. మాట్లాడుకుందాం నెమ్మదిగా. రా” అన్నాను.
ఎన్నేండ్లుంటాయిప్పుడు సుభద్రకు. దాదాపు యాభై మూడుంటాయేమో. తనకిప్పుడు యాభై ఐదు.
ఒక సినిమా రీలులా గతం కళ్ళముందుకు వరదై ముంచుకొస్తున్న ఫీలింగ్.
“ఉహూ. ” అంది సుభద్ర.
“ఎందుకు”అన్నాను.
“కార్లో ఎక్కే స్థాయి కాదు నాది”అంది తలవంచుకుని.
“మన మధ్య స్థాయి ఏమిటి సుభద్రా. రా. డోంట్ వర్రీ కమాన్”అన్నాను.
కాని సుభద్ర రాలేదు. తలెత్తి “ఈ స్థాయీ భేదాలు. చదువుల తేడాలు. డబ్బుల హెచ్చుతగ్గులు ఇవే గదా మనుషులు ఎవరెక్కడుండాలో నిర్ణయించేవి”అంది. అని “నువ్వే బయటికొచ్చి ఇక్కడ నిలబడ్తే రెండు నిముషాలు మాట్లాడ్దామని ఎదురు చూస్తున్నా అప్పటినుంచి నువ్వు ఎ. టి. ఎం. నుండి వస్తావని.” సన్నగా పీలగా గొంతు.
అదే గొంతు. అదే జీర. అదే జీవం.
“రా సుభద్రా కార్లోకి. ఏమీ కాదు. ప్లీజ్”అన్నాను ప్రాధేయపూర్వకంగా. కానామె రాలేదు.
జ్ఞాపకాలు వర్షపు చినుకుల్లా కురవడం మొదలైంది.
ఆరవ తరగతిలో నేను. నాల్గవ తరగతిలో సుభద్ర. ఇద్దరమూ సంచుల్లో పుస్తకాలు పట్టుకుని ప్రక్కప్రక్కనే నడుస్తూ బడికి వెళ్ళడం. ఏండ్లకు ఏండ్లు కలిసి నడిచి, కలిసి తిరిగి, కలిసి ఆడుకుని, కలిసి కొట్లాడుకుని, కలిసే ఏడ్చి,
ఎన్నిసార్లు కొట్టానో నేను సుభద్రను. నెత్తిమీద. చింత బరిగెతో. వీపు మీద. చేతి వేళ్ళ వాతలు పడేట్టు.
పాపం ఒక్కనాడు కూడా వాళ్ళింట్లో చెప్పలేదు సుభద్ర.
“మా నాన్నకు చెప్తా”అని బెదిరించేది ఒట్టిగానే. కాని ఎప్పుడూ ఆ పని చేయలేదు. “చెప్పుకో పోవే” అని గదమాయించేవాణ్ణి.
ప్రతిరోజూ నాతోనే కలిసి తప్పనిసరిగా బడికొచ్చేది ఒక్కరోజుకూడా తప్పించకుండా. వాళ్ళింట్లో ఏదైనా ఫంక్షనైనా నా కోసమే అన్నీ వదులుకుని బడి పేరుమీద నా ప్రక్కనే ఉండేది.
ఏ జ్వరమొచ్చినప్పుడో సుభద్ర బడికి రాకుంటే సుభద్ర నా వెంటలేని లోటు చాలా స్పష్టంగా తెలిసేది. పిచ్చిగా మా ఇంటికి నాల్గైదు ఇండ్ల అవతలున్న వాళ్ళింటికి వెళ్ళి పొద్దంతా నేనూ అక్కడే సుభద్రతోపాటే కూర్చునేది. నొసలుపై చెయ్యిపెట్టి. తడుముతూ,
ఎందుకో. ఏమిటో. ఏదీ అర్థమయ్యేది కాదు.
నాకు నిక్కర్. పైన బుషర్ట్. సుభద్రకు పొడగాటి గౌను. లేకుంటే పొట్టి లంగా, చిన్న జాకెట్టు. సుభద్ర వాళ్ళమ్మ బీడీలు చేసేది. వాళ్ళ నాన్న సోమయ్య ఆజంజాహి బట్టల మిల్లులో వర్కర్

*****

మా నాన్న కూడా వర్కరే అదే మిల్లులో. వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు పనికి. ఒకరు ఎ షిఫ్టైతే. మరొకరు బి షిఫ్ట్.
చిన్ననాటి సాంగత్యాలు ప్రతి మనిషిపైనా ఎంతో ప్రభావంతంగా ఇనుమును నిప్పు అంటిపెట్టుకుని ఉన్నట్టున్నా అది ఫలానా అని అర్థం అయ్యీకాకా అంతా గుప్తంగా. అన్నీ రహస్యంగా. గుంభనంగా. గంపకింద కోడిపిల్లల్లా కదులుతూ,
హృదయం నిండా తేమ. మేఘంలో తడిలా.
ఒక రోజు. మధ్యాహ్నం ఇద్దరమే ఔసుల సాంబయ్య కూలిపోయిన మొండిగోడల ఇంటిప్రక్కనుండి వెళ్తూంటే “రమణా రమణా ఒక్క నిముషం. “అని నా చేయిపట్టి ఓ కూలిన గోడ చాటుకు లాక్కుపోయి. చటుక్కున తన చిట్టి జాకెట్టును ప్రక్కకు జరిపి “ఇక్కడ. చాతీమీద. ఎందుకో గడ్డలాగ వాపొచ్చి ఉబ్బుతోంది రమణా”అని అమాయకంగా, భయంగా చెప్పినపుడు. ,
అర్థంకాని పిచ్చి చూపులు చూస్తూ”అయ్యో. ” అని నేనుకూడా భయపడి,
సుభద్ర ముఖంలోకి చూచిన ఆ క్షణం. నవ్వొచ్చింది ఆ జ్ఞాపకానికి.
సరిగ్గా అదే సమయానికి. నేను సరే అని కారు దిగుతూ,
సుభద్ర ముఖంలోకి లిప్తసేపు చూస్తే, ఆమెకూడా ముసిముసిగా నవ్వుతూ,
“ఎందుకు నవ్వుతున్నావు. ?” అని నేనడుగుతే. “ఏదో జ్ఞాపకమొచ్చింది రమణా. క్షణకాలం వయసు వెనక్కి మళ్ళీ మళ్ళీ ఒక్కరోజన్నా ఆ బాల్యంలోకి వెళ్ళి. ప్చ్ ” అంది నిట్టూరుస్తూ.
ఇద్దరి మధ్య మంచు తెర. దట్టమౌతూ.
ఔను. తెరలే. మనుషుల మధ్య ఏర్పడుతూ. తొలగిపోతూ. ఒక్కోసారి తెర ముందుకు. ఒక్కోసారి తెర వెనక్కి.
ఐతే ప్రతి మనిషీ తనకు తాను ఒక రహస్యమై. ఎప్పుడూ ఎవరికీ తెలియక కేవలం తనకు మాత్రమే తెలిసిన మనిషిగా లోలోపల మిగిలిపోతూ,
అటువంటివే అవశేష జ్ఞాపకాలు మా మధ్య. ,
“మనం కలిసి ఎక్కడన్నా కూర్చుని ఒక టీ తాగుతూ మాట్లాడుకుంటే బాగుండు సుభద్రా”
“ఔను. కాని కుదరదుకదా. ”
“ఎందుక్కుదరదు. రా. నా కార్లో కూర్చో. అలా వెళ్ళి ఏదైనా మంచి హోటల్లో కూర్చుని.”
“వద్దు వద్దు. నేను కారెక్కను.”
“పోనీ. మా ఇంటికి వెళ్దామా”
“ఉహూ. అస్సలే వద్దు. అనుకోకుండా నువ్వు కలిసినౌ. అదే మహానందంగా ఉంది నాకు. చాలు. ఈ రోజు ఇక్కడుండి రేపు వెళ్ళిపోయేదానికి. ఎందుకిదంతా. ఐనా ఈ బంధాలన్నింటికీ అతీతమైపోయిన రమణా నేనిప్పుడు”
సుభద్ర ముఖం నిండా ఒట్టి శూన్యం. ఖాళీ.
ఇక వేరే మార్గం కనిపించలేదు. ఆమె ప్రక్కనే ఫుట్ పాత్ ఎక్కి నిలబడి. ,
చలి పెరుగుతోంది. పల్చగా జనం తిరుగుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే జె పి ఎన్ రోడ్ బోసిగా ఉంది.
మళ్ళీ ఒక జ్ఞాపకం తరుముకొచ్చింది.
ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం.
బడి ఎగ్గొట్టి. భయపడ్తున్న సుభద్రను నేనే బలవంతంగా ఒప్పించి మామిడికుంటలో చేపలు పట్టేందుకు వెంట తీసుకుపోయాను. వెంట పొడగాటి గాలం కర్ర. చిన్న ఇనుప కడ్డీతో పచ్చినేలను ఇద్దరమూ కలిసి తవ్వి ఒక రేకుడబ్బాలో జమచేసిన ఎర్రలు. వాటిపై చిలకరించిన నీరు. బురద. సన్నగా అప్పుడప్పుడు పడే చినుకులు. బాగా మబ్బుపట్టిన ఆకాశం.
ఒడ్డుపై కూర్చుని నేను గాలానికి ఎరను గుచ్చి చెరువులోకి విసరడం. చొప్ప బెండు నీటిపై తేలుతున్నంతసేపూ ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండడం. అప్పుడప్పుడు ఒక చేప పడి. పిచ్చి కేరింతలు. సంబరం. పడ్డ చేపను సుభద్ర ఒక పాత చీకిపోయిన బట్టపేలికలో దాయడం.
*****

ఓ అరగంట తర్వాత. వర్షం మొదలై. చిక్కగా చినుకులు. ,
అప్పుడు జరిగింది ఆ భయంకర ఘటన.
గాలం దిక్కు చూస్తున్న తన ప్రక్కనే ఎప్పుడు వచ్చి చేరిందో ఓ కట్ల పాము. చూస్తూండగానే నా తొడపై చటుక్కున కాటేసి జరజరా ప్రక్కనున్న పొదలోకి ఉరికింది.
నిక్కరు కిందినుండి. ఎర్రగా రక్తం. ధారగా కారుతూ. కాటు
ఇద్దరం భయభ్రాంతులమై. ,
ఏం చేయాలిప్పుడు. పాము కాటు. విషం. చెరువు ఒడ్డు. పైన జోరుగా వర్షం.
ఒకటే భయం. గజగజా వణికిపోతూ. ,
ఏమనుకుందో ఏమో సుభద్ర చటుక్కున వంగి నా తొడపై పాము కాటేసిన చోట కసుక్కున కొరికి రక్తాన్ని పుక్కిటినిండా పీల్చి తుపుక్కున బయటికి ఉమ్మేసింది. వెంటవెంటనే అలా మూడునాల్గుసార్లు రక్తాన్ని పీల్చి. ,
అప్పటి సుభద్ర ముఖం నాకిప్పటికీ జ్ఞాపకమే. మూతంతా ఎర్రగా రక్తం. జేవురించిన ముఖం. నన్ను కాపాడాలన్న దీక్ష. ధగ ధగా మెరిసే కళ్ళు.
మెల్లగా స్పృహ తప్పుతున్న మగత నాకు. ఎక్కడికో చీకట్లోకి జారిపొతున్న అనుభూతి. అంతే.
కళ్ళు తెరిచిన మర్నాడు. చుట్టూ మనుషులు. నాన్న. అమ్మ. సుభద్ర అమ్మా. నాన్న. ఎనకెవరెవరో.
“సుభద్రేది” అని మొట్టమొదటి మాట నా నోటినుండి.
“పాపం పోరి మాగ కాపాడింది కొడుకును పానానికి తెగించి.”అంటున్నారెవరో.
సుభద్ర ముఖంలోకి చూశాను. ఒట్టి నిర్మల నీలాకాశంలా. కళ్ళు ప్రేమను నింపుకుని. ఒక స్త్రీ. దేవత.
తర్వాత ఎన్నో జ్ఞాపకాలు. ,
సుభద్ర ఒకసారి మా ఇంట్లోని జామచెట్టెక్కి కింద పడడం. నేను అందుకునే లోపలే ఆమె చేయి విరగడం.
గిల్టీ నాలో. నన్ను పాముకాటునుండి రక్షించింది సుభద్ర. కాని నేను. ఉహూ.
” ఏం చేస్తున్నావ్ రమణా ఇప్పుడు” అంది.
తెప్పరిల్లి.,
“నేను బాగానే ఉన్నాను సుభద్రా. నువ్వే చెప్పు. ఆ పెళ్ళి తర్వాత ఇన్నాళ్ళనుండి ఎక్కడున్నావ్. ఎలా ఉన్నావ్. ఈ బీదరికమేమిటి. చిక్కిపోయినౌ బాగా. మీ ఆయనేమి చేస్తడు. పిల్లలెంతమంది.”
సుభద్ర ఏమీ మాట్లాడలేదు. ఒక శూన్యమైన చూపు చూచింది. ఆ చూపు. ఆ ముఖం. ఏముందందులో. సముద్రంలో ఉన్న లోతు తప్పితే.
చలి వణికించడం మొదలైంది.
“ఇప్పుడు నాలో కోటి జ్ఞాపకాలు వడగళ్ళవానలా కురుస్తున్నాయి సుభద్రా. ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు. సంతోషం. దుఃఖం. అన్నీ ఒక్కసారే నాలో సుళ్ళుతిరుగుతూ. ” ఉక్కిరిబిక్కిరైపోతున్నాను.
“రమణా. చాలా దూరం వచ్చినం మనం జీవితంలో. నాకనిపిస్తుంది. మనుషులు ఒట్టి నిమిత్తమాత్రులే అని. ఎవరెవరి జీవితంలో ఎప్పుడు ఏది జరుగాలో అప్పుడది జరుగుతూ పోతూనే ఉంటుంది. మనం కేవలం పాత్రలమంతే. నాటకం. ఇదంతా.”
నిశ్శబ్దం ఇద్దరిమధ్య.
చుట్టూ తేమ. సన్నని మంచు పొర. లోపలంతా తడి. హృదయంలో బయటికి కనబడని అగ్నితడి.
ఎక్కడినుండో ఓ కుక్కపిల్ల పరుగెత్తుకొచ్చి సుభద్ర చీర సింగులదగ్గర నిలబడింది తలెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ. తోకాడిస్తూ. ఎంత ముద్దొస్తోందో. షోకేస్ లోనుండి అప్పుడే ర్యాపర్ విప్పిన బొమ్మలా.
సుభద్రకు తను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పటి ఆ. తన జీవితాన్ని మలుపు తిప్పిన రోజు జ్ఞాపకమొచ్చింది.
ఆ రోజు,
ఇక తను బడికి పోవడానికి తయారౌతూండగా అమ్మొచ్చి”సుభద్రా. నువ్వీరోజు ఇంట్లోనే ఉండవే. వాళ్ళొస్తున్నారు”అంది.

*****

ఎవరువాళ్ళు. ఎందుకొస్తున్నారు. ఏం జరుగుతోందసలు. ఏదీ తెలియదు. కాని ఏదో జరుగుతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తూ. ,
సాయంకాలంలోగా జీవితం అంతా మారిపోయింది. పెళ్ళి చూపులు. అదే రోజు నిశ్చితార్థం. వారంలో పెళ్ళి. అని నిర్ధారణ.
అతను సూరత్ లోని బట్టలమిల్లులో నేతపని. గొట్టిముక్కుల రాజకొంరు.
తలపై పది కిలోల సుత్తితో కొట్టినట్టు. దిమ్మ తిరిగిపోయి,
ఎలా తెలిసిందో. సాయంత్రం రమణ తన ఇంటికి పరుగెత్తుకొచ్చి. ఒకటే ఏడుపు. “సుభద్రను నేనే పెళ్ళి చేసుకుంట. సుభద్ర నాకే కావాలె. “అని గొడవ.
అసలు పెళ్ళి అంటే ఏమిటో తెలియని పసి వయసు. ఇద్దరిదీ.
కేవలం స్నేహంవల్ల ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని పిచ్చి.
రమణ వాళ్ళమ్మొచ్చి రమణను రెక్క పట్టుకుని లాక్కుపొయింది. అంతే. తను గృహనిర్బంధం.
తంతు. పెళ్ళి.
సూరత్. వలస. బొంబాయ్. బీవండి. జోంప్డాపట్టీల్లో బతుకు. రేకు డబ్బాల్లో కాపురం.
రమణ తెగిపోయాడు.
తర్వాత పూర్తిగా కొత్త జీవితం. రాత్రి అతని నోటినిండా సార కంపు. ఓ నల్లని పంది పైబడి దాడిచేస్తున్నట్టు హింస.
పిలువకముందే పిల్లలు.
పిల్ల. మరో ఏడుకే ఒక పిల్లాడు. ఇద్దరూ మట్టిలో పాతి బయటికి తీసిన కట్టెబొమ్మల్లా. బతుకు పర్వతంకింద పాతుకుపోయి సమాధి ఐపోయినట్టు. దుఃఖం. నిశ్శబ్ద దుఃఖం.
ఒక ఏడు. రెండేండ్లు. కాలం పరుగు. ఇక్కడ నాన్న మరణం. అమ్మ తనతో బీమండీకి. మొగుడితో గొడవ. పొటీగా వాడి చెల్లెలు దిగుమతి. నిత్య పంచాయితీ,
ఏమిటీ జీవితం. ఎందుకీ జీవితం. అని నిరంతరం ప్రశ్నించే ఆగని కన్నీళ్ళు.
తనూ బట్టల మిల్లులో కూలీగా చేరి. వార్పింగ్ సెక్షన్. తలనిండా దూది పొర. బయటా. లోపలా.
ఇరవై ఐదేళ్ళలో. సార తాగీ తాగీ. రాజకొంరు దుర్మరణం. పోరి. సోని అనే కూతురు. ఒక తురక కుర్రానితో అహమ్మదాబాద్ కు లేచిపోవుట. రాజేశ్ ఖన్నా అని పేరుపెట్టుకున్న కొడుకు చెత్తపోరగాళ్ళతో రైలుపట్టాలపొంటి తిరిగీ తిరిగీ. ఏవేవో మత్తుమందులు తినీ తినీ. దొంగతనాలు చేసీ చేసీ. పోలీసు దెబ్బలకు అలవాటు పడీ పడీ. ఒక అప్పుడే తెల్లవారిన ఉదయం . రైలు పట్టాలపై శవమై. మార్చురీలో. ఒక అనాథ.
ఏమిటీ బతుకు. ఎందుకింత భయంకరంగా.
ఇప్పుడు. డెభ్బై దాటిన ముసలి తల్లి. చావుకోసం ఎదురుచూస్తూ తనతో. భారంగా . అంతకంటే హీనంగా ప్రతి క్షణం చస్తూ తను.
తన ఆడబిడ్డ మొగుడు చనిపోతే చూడ్డానికని. ఇప్పుడు వరంగల్ రావడం. గోవిందరాజుల గుట్ట దగ్గర వాళ్ళిళ్ళు. కొండి కొమ్మాలు.
ఎనిమిదిన్నరకు నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో. వెళ్ళాలి తను. మళ్ళి బీమండికి.
ఎక్కడికి. ఎక్కడికెళ్ళినా ఏముంది. ఎవరికోసం. ఎందుకు బతకాలి. చిక్కి శల్యమైపోయిన శరీరం నిండా ఒట్టి కన్నీళ్ళే.
అనుకోకుండా ఇక్కడ రమణ కనిపించి. లోపల ఏదో ఒక అడవి మంట అంటుకుని మండుతున్నట్టు. ,
“సుభద్రా. ” అన్నాను.
ఉలిక్కిపడి. “ఊ. “అని. తలెత్తి,
“నువ్వు బాగున్నావు కదా రమణా” అంది ఎక్కెక్కిపడి ఏడుస్తూ,
“చాలా బాగున్నా సుభద్రా. పెద్ద చదువులు చదివిన. డాక్టరేట్ చేసిన. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్స్ పాల్ గా పని చేస్తాన”
“చాలా సంతోషంగా ఉంది రమణా నాకీ రోజు. నిన్ను చూచిన తర్వాత. కలుస్తా మళ్ళీ . వెళ్ళిపోవాలె నేను. “అని ముతక చీరకొంగును భుజాలచుట్టూ సర్దుకుంది.

*****

ఎందుకో బయటికి చెప్పరాని దుఃఖం పొంగుకొచ్చి. చటుక్కున ఇంతకు ముందు డ్రా చేసిన ఐదువందల రూపాయల కట్టను ఆమె చేతికివ్వబోయి, “ఇదుంచుకో సుభద్రా ప్లీజ్. కాదనకు”. మాటలు పెగలట్లేదు
ఆమె సున్నితంగా నా చేతిని వెనక్కి జరిపి “వద్దు రమణా. నాకిప్పుడు ఏ డబ్బుతోనూ పనిలేదు. నేను వెళ్ళిపోవాలంతే”అని. అనూహ్యంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుని. మట్టపై సుతారంగా ముద్దుపెట్టుకుని. గిరుక్కున అటు తిరిగి ఆమె కళ్ళలోని నీళ్ళు నాకు కనబడకుండా,
అప్పటికే చీకటి పడింది.
నేనలా చూస్తూనే ఉన్నాను అప్రతిభున్నై. ,
వెళ్ళిపోతూనే ఉంది సుభద్ర. ఎడంగా. ఇంకా ఇంకా ఎడంగా. దూరంగా.
మంచుతెర ఇంకా చిక్కనైపోయింది. వరంగల్లులో అంత దట్టమైన పొగమంచు ఎప్పుడూ లేదు నాకు తెలిసి.
మంచుతెరలోకి క్రమంగా అదృశ్యమై. సుభద్ర. వెంట. ఆ చిన్న కుక్క పిల్లకూడా. ఆమెవెంటే. ,
చేతిని పులకింతగా చూసుకున్నాను. ఆమె ముద్దుపెట్టిన చోట.
ఎందుకో గుండెలనిండా ఆకాశమంత దుఃఖం.
ఎందుకు. ?

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *