April 19, 2024

నీవే సఖుడౌ. . నిజముగ కృష్ణా!

రచన: G.S.S.కళ్యాణి

సుప్రియ, శ్రీరమణలు దాదాపు అయిదేళ్ల తర్వాత అమెరికానుండి ఇండియాకు ఒక నెలరోజుల కోసం వచ్చారు. శ్రీరమణ సుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే సుప్రియ మాటంటే శ్రీరమణకు వేదవాక్కు! సుప్రియ కోరిక ప్రకారం శ్రీరమణ ఇండియాలో ఉన్నన్నాళ్లూ తన అత్తగారింట్లో ఉండేందుకు అంగీకరించాడు. సుప్రియ, శ్రీరమణల చుట్టాలందరూ ప్రస్తుతం ఒకే నగరంలో ఉండటంతో వాళ్ళు ఒక పెద్ద కారును అద్దెకు తీసుకుని, గత పదిహేను రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం తమ బంధువుల ఇళ్లకు వెళ్లి వారిని పలకరించి వస్తున్నారు. ఒకరోజు సాయంత్రం బంధువుల ఇంటినుండి సుప్రియా, శ్రీరమణలు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా శ్రీరమణ జేబులోని మొబైల్ ఫోన్ గణగణమని మోగింది.
ఫోన్ చేతిలోకి తీసుకున్న శ్రీరమణ, “అబ్బ! మళ్ళీ వాడే! ఆ జిడ్డుగాడు!!”, అంటూ వస్తున్న ఫోనుకాల్ ను చిరాగ్గా కట్ చేశాడు.
“మనం ఇండియాకు వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను. ఆ అబ్బాయి దాదాపు ప్రతిరోజూ మీకు ఫోన్ కాల్ చేస్తున్నాడు! ఇంతకీ ఎవరండీ అతనూ??”, శ్రీరమణను ఆశ్చర్యంగా అడిగింది సుప్రియ.
“వాడా?? వాడు నా చిన్ననాటి స్నేహితుడు గోపాలకృష్ణగాడులే! మా సొంత ఊరు శివాపురంలో వాడు నాతో కలిసి తిరిగేవాడు. కొంచెం పెద్దవాళ్లమయ్యాక మా ఇద్దరికీ అభిప్రాయభేదాలొచ్చాయ్! ఎంత చదువుకున్నా పుట్టి పెరిగిన ఊరినే పట్టుకుని వేళ్ళాడాలన్నది వాడి సిద్ధాంతం. నేను అందుకు పూర్తి వ్యతిరేకం! వాళ్ళ నాన్న ఆ ఊరి వేణుగోపాలస్వామి గుడిలో పూజారి! అందుకే వాడు కూడా వాళ్ళ నాన్నలాగా పూజారిగా స్థిరపడతానని చెప్పి అలాగే చేశాడు. పైగా నన్ను కూడా మా నాన్నలాగా వ్యవసాయం చెయ్యమని సలహా ఇస్తూ ఉండేవాడు! నేనేమో మారుతున్న పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ జీవితంలో పైకి రావాలని కలలుగన్న వాడిని! అమెరికాలో స్థిరపడటం నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించాను! మా నాన్న చేత శివాపురంలోని ఇల్లూ, పొలం అమ్మించేసి ఈ నగరంలో ఇల్లు కొనిపించి, ఈ రోజు నేను సుఖంగా ఉంటూ, నా తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాను! ఆ కృష్ణగాడి ఫోన్ ఎత్తితే అక్కడకి వచ్చెయ్యమని గోల పెడతాడు! ఆ గోల భరించడం నావల్ల కాదు! “, అన్నాడు శ్రీరమణ.
“ఓహో! అలాగా!!”, అంది సుప్రియ.
మరుసటి రోజూ, ఆ పై రోజూ కూడా శ్రీరమణకి గోపాలకృష్ణనుండీ ఫోన్ కాల్స్ రావడం గమనించింది సుప్రియ.
ఆ తర్వాత ఒకసారి గోపాలకృష్ణనుండీ వస్తున్న ఫోన్-కాల్ ను కట్ చెయ్యబోతున్న శ్రీరమణతో, “ఆగండాగండి! ఇన్ని రోజులనుంచీ మీతో మాట్లాడాలని ప్రయతిస్తున్నాడు మీ స్నేహితుడు! ఒక్కసారి అతడిని పలకరించి ఫోన్ పెట్టేయండి! ప్లీజ్!”, అంది సుప్రియ.
భార్య మాట కాదనలేక ఫోన్ ఎత్తి, “హలో!”, అన్నాడు శ్రీరమణ.
“ఒరేయ్ రమణా! నేనురా! గుర్తుపట్టావా?? శివాపురంనుండీ గోపాలకృష్ణని! ఎలా ఉన్నావురా? మొత్తానికి నువ్వు చిన్నప్పుడనుకున్నట్లుగా అమెరికాలో స్థిరపడ్డావుగా?! అక్కడ బాగా సంపాదిస్తున్నావని విన్నాను. చాలా సంతోషం!”, అన్నాడు గోపాలకృష్ణ.
“ఆ! ఆ! బానే ఉన్నాలేరా! ఒక్క నిమిషం లైన్లో ఉండు!”, అని ఫోన్ లోని మ్యూట్-బటన్ నొక్కి, “చూశావా సుప్రియా? ఆ జిడ్డుగాడితో మాట్లాడమన్నావుగా? ఇప్పుడు చూడు! వాడు నేను అమెరికాలో ఉన్నానని కుళ్ళుకుంటున్నాడు!”, అన్నాడు శ్రీరమణ.
“పోనీలెండి! కాసేపు మాట్లాడండీ!”, అంది సుప్రియ.
“ప్చ్! తప్పదు!”, అంటూ మళ్ళా ఫోన్లో, “కృష్ణా! ఏమిట్రా విశేషాలూ? నువ్వు ఇంకా శివాపురంలోనే ఉన్నావా?”, అని గోపాలకృష్ణను అడిగాడు శ్రీరమణ.
“అవునురా! మా నాన్నగారు ఇప్పుడు బాగా పెద్దవారైపోయారు. అందుకని ఆయన ఉద్యోగం వదిలి ఇంట్లోనే ఉంటున్నారు. నేను మన వేణుగోపాలస్వామి గుడిలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నా!”, చెప్పాడు గోపాలకృష్ణ.
“మరి నీకు పెళ్ళీ. .గిళ్ళీ. . ఏమైనా జరిగిందా? అయినా, మనూళ్ళో నీకు పిల్ల దొరకాలిగా!!”, గోపాలకృష్ణ పెళ్ళి చేసుకోలేదన్న సమాధానం ఇస్తాడని ఊహిస్తూ అడిగాడు శ్రీరమణ.
“మా బంధువులమ్మాయిని పెళ్లి చేసుకున్నారా! ఆ కృషుడి అనుగ్రహంవల్ల నాకిప్పుడు నలుగురు పిల్లలు! నీ సంగతేమిటీ? ఎందరు సంతానం?”, అడిగాడు గోపాలకృష్ణ.
“అరేయ్ కృష్ణా! నేను పనిలో ఉన్నారా! మనం మళ్ళీ మాట్లాడదాం. ఉంటారా!!”, అంటూ ఫోన్ పెట్టేసి, “వీడు నిజంగా సంతాన గోపాలుడే సుప్రియా! మనకు పెళ్ళై ఏడేళ్లయినా సంతానం కలగలేదని వాడికి ఎవరో చెప్పుంటారు! వాడు గొప్పలు చెప్పుకోవడానికి నన్ను ఆ వివరాలన్నీ గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు! డబ్బు సహాయం కావాలేమో వాడికి! అందుకే నన్నొదలట్లేదు!!”, అన్నాడు శ్రీరమణ అసహనంగా.
“అతడి ఉద్దేశం తెలుసుకోకుండా అలా అనకండీ! ఓసారి పలకరించారుగా! ఇక మీ తప్పు ఉండదు!”, అంది సుప్రియ.
ఒక వారం గడిచాక శ్రీరమణకు ఫోన్లో గోపాలకృష్ణనుండీ శివాపురం రమ్మనమంటూ మెసేజీ వచ్చింది.
ఆ విషయం తెలుసుకున్న సుప్రియ, “ఒక్కసారి శివాపురం వెళ్ళొద్దామండీ! ఎంతైనా మీరు పుట్టిపెరిగిన ఊరు కదా! నాక్కూడా చూడాలని ఉంది!”, అంది శ్రీరమణతో.
భార్య కోరిక తీర్చడానికి కారులో శివాపురం బయలుదేరాడు శ్రీరమణ. ఊళ్లోకి ప్రవేశించగానే పాడుబడిన పెంకుటిళ్ళూ, బోసిపోయిన పశువుల కొట్టాలూ, శిథిలావస్థకు చేరుకున్న తన చిన్నప్పటి పాఠశాల, అక్కడక్కడ ఎండిపోయిన పొలాలూ కనిపించాయి శ్రీరమణకి.
“ఒకప్పుడు అందంగా ఉండే మా శివాపురం ఇప్పుడెలా తయారయ్యిందో చూడు! ఆ కృష్ణగాడు ఎంత బలవంత పెట్టినా ఒక గంటకు మించి ఇక్కడ ఉండేదేలేదు!”, అన్నాడు శ్రీరమణ సుప్రియతో.
“చూద్దాం లెండి! ఇంతకూ, మీరు అప్పట్లో ఉన్న ఇల్లు ఎక్కడుందీ?”, అడిగింది సుప్రియ ఆసక్తిగా.
“ఆగు! తీసుకెడతా!”, అంటూ కారును ఒక సన్నటి సందులోకి తిప్పాడు శ్రీరమణ.
అక్కడ కొంచెం ముందుకి వెళ్ళగానే సగం కూలిన ఇల్లొకటి కనపడింది. దాని గోడల పైన నాచు పట్టి, ఆ గోడలకున్న పగుళ్ళల్లో మొక్కలు పెరిగి ఉన్నాయి.
“ఇదే నేను పుట్టిన ఇల్లు!”, అన్నాడు శ్రీరమణ కారును ఆపుతూ.
సుప్రియ కారు దిగి ఇంటి వద్దకు వెళ్ళింది. శ్రీరమణకి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకురాసాగాయి. అతడి తండ్రి పెరట్లో మొక్కలకు చేసిన పాదుల ఆనవాళ్లు ఇంకా కనపడుతున్నాయి. శ్రీరమణ తల్లి ఎంతో ఇష్టంగా భక్తితో పెంచుకున్న తులసి తోట ఇప్పుడు ఎండిపోయి ఉంది! అది చూసిన శ్రీరమణకు ఒకింత బాధ కలిగింది. పరిసరాలను పరిశీలనగా చూస్తున్న శ్రీరమణకు ఇంటి పక్కనే ఉన్న ఒకప్పటి తమ పొలం పచ్చగా కళకళలాడుతూ కనిపించింది!
శ్రీరమణ మనసు ఆనందంతో ఉప్పొంగి, “సుప్రియా! అదే మా పొలం!! నేను చిన్నప్పుడు అందులో తెగ ఆడేవాడిని. దాన్నిప్పుడు ఎవరు కొనుక్కున్నారోగానీ చాలా శ్రద్ధగా వ్యవసాయం చేసుకుంటున్నట్టున్నారు!”, అన్నాడు ఉత్సాహంగా.
“నిజమేనండీ!”, అంది సుప్రియ చిరునవ్వుతో పొలంవంక చూస్తూ.
“సుప్రియా! ఇక వెడదాం రా!”, అంటూ వేణుగోపాలస్వామి గుడికి కారును పోనిచ్చాడు శ్రీరమణ.
ఆ గుడి బయట బక్కపీచులాంటి శరీరంతో, ఒకమాదిరి వస్త్రం కట్టుకుని ఉన్న ఒక వ్యక్తి శ్రీరమణకు కనిపించాడు. అతడి ఆహార్యం నిరుపేదవాడిలా ఉన్నప్పటికీ అతడి ముఖంలో జ్ఞానం మాత్రం దీపంలా వెలుగులీనుతోంది.
ఆ వ్యక్తి కారు వద్దకు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, “ఏరా రమణా! నీ కోసమే ఎదురు చూస్తున్నా! ప్రయాణం బాగా జరిగిందా? ఏమ్మా సుప్రియా? బాగున్నావా?”, అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు.
అప్పుడుగానీ శ్రీరమణకు ఆ వ్యక్తి గోపాలకృష్ణ అని తెలియలేదు!
“రండి!రండి! ముందు స్వామిని దర్శించుకుందురుగాని!”, అంటూ గోపాలకృష్ణ సుప్రియ, శ్రీరమణలను గుడిలోకి తీసుకెళ్లాడు.
వేణుగోపాలస్వామిది ఆరడుగుల విగ్రహం. కేవలం పువ్వులతోనే స్వామిని అలంకరించినప్పటికీ, ముగ్ధమనోహర రూపంతో చిరునవ్వులొలుకుతూ దర్శనమిచ్చాడు వేణుగోపాలుడు. స్వామికి నమస్కరించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు శ్రీరమణ, సుప్రియలు. గోపాలకృష్ణ వారివద్దకు వచ్చి శ్రీరమణతో తమ బాల్యానికి సంబంధించిన కబుర్లు మొదలుపెట్టాడు. శ్రీరమణకి కూడా చిన్నప్పటి విషయాలు నెమరువేసుకోవడం బాగుందని అనిపించింది.
అయితే, శ్రీరమణతో కబుర్లు చెబుతూ మధ్య మధ్యల్లో గోపాలకృష్ణ హడావుడిగా గుడి వెనుకకు పరిగెడుతూ వెళ్లి కొద్దినిమిషాల తర్వాత వెనక్కి రావడం శ్రీరమణకు కొంత చిరాకును కలిగించింది.
“చూడు సుప్రియా! మనం వాడి కోసమని అంత దూరంనుండీ కష్టపడి వచ్చామా? వాడేమో మనకన్నా ముఖ్యమైన పనేదో ఉన్నట్లు మాటిమాటికీ మాయమవుతున్నాడు! ఛ! ఇక వెళ్ళిపోదాం పద!!”, అంటూ లేచాడు శ్రీరమణ.
అంతలో, “ఒరేయ్ రమణా! ఇదిగో! వచ్చేస్తున్నానురా! ఎక్కడికి బయలుదేరావ్?”, అంటూ ఆయాసపడుతూ వచ్చాడు గోపాలకృష్ణ.
“ఇక మేము బయల్దేరతాము రా! ఆలస్యమవుతోంది!”, అన్నాడు శ్రీరమణ.
“రాకరాక మన ఊరికొచ్చావ్! మా ఇంట్లో భోజనం చెయ్యకుండా మీరు తిరిగి వెళ్ళేదే లేదు!”, అంటూ శ్రీరమణ చెయ్యి పట్టుకుని అతడు వద్దంటున్నా వినకుండా గుడి వెనుక ఉన్న తమ ఇంటికి తీసుకుని వెళ్ళాడు గోపాలకృష్ణ.
‘ఇన్నేళ్లల్లో కృష్ణగాడి ఇల్లు అస్సలు మారలేదు! అదే చిన్న ఇరుకైన ఇల్లు!!’, అని అనుకున్నాడు శ్రీరమణ.
“రా రా రమణా! ఇంట్లోకి రా! నువ్వు కూడా రామ్మా!!”, అంటూ శ్రీరమణ, సుప్రియలను ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించాడు గోపాలకృష్ణ.
ఇంట్లో పెద్దగా వస్తువులేవీ లేవు. ముందుగదిలో ఒకపక్క ఇద్దరు పసివాళ్లు ఉయ్యాలలో నిద్రపోతూ ఉన్నారు. మరోపక్క ఇద్దరు మూడేళ్ళ వయసున్న పిల్లలు ఆటవస్తువులతో ఆడుకుంటున్నారు. వాళ్ళు గోపాలకృష్ణను చూడగానే, “నాన్నా!!”, అని పరిగెత్తుకుంటూ వచ్చి అతడి కాళ్ళను చుట్టేశారు.
గోపాలకృష్ణ వారిని విడిపించుకుని శ్రీరమణ, సుప్రియలతో, “వంటగదిలోకి రండి! భోజనం చేద్దురుగాని!”, అన్నాడు.
శ్రీరమణ, సుప్రియలు గోపాలకృష్ణతో వంటగదిలోకి వెళ్లారు. గోపాలకృష్ణ వాళ్ళిద్దరికీ పీటలూ, విస్తళ్ళూ వేసి భోజనం వడ్డించాడు. ఆకలిమీద ఉన్న శ్రీరమణ సుప్రియలకు అన్ని పదార్ధాలూ నచ్చాయి. భోజనాలు ముగించి ముందుగదిలోకి వచ్చి కూర్చున్నారు అంతా.
“థాంక్యూ రా కృష్ణా! అన్ని పదార్ధాలూ చాలా రుచిగా ఉన్నాయి! ఇంతకీ ఇంత బాగా వంట చేసిన మీ ఆవిడ ఎక్కడ?”, అని అడిగాడు శ్రీరమణ.
“మా ఆవిడా?! ఆవిడని ఆ పరమాత్ముడు త్వరగా పిలిచేశాడురా! ఇదిగో నాకు ఈ పిల్లల బాధ్యతను ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది!!”, అన్నాడు గోపాలకృష్ణ బాధగా!
అది విని అవాక్కైపోయారు శ్రీరమణ, సుప్రియలు. అంతలో పసిపిల్లవాడి ఏడుపు వినపడటంతో ఉయ్యాల వద్దకు పరుగున వెళ్లి వాడిని చేతుల్లోకి తీసుకుని ఊరుకోబెట్టింది సుప్రియ.
“నేను ఇందాక నీతో కబుర్లు చెబుతూ వీళ్ళ కోసమే మాటిమాటికీ ఇటు రావలసి వచ్చింది!”, అన్నాడు గోపాలకృష్ణ.
విషయం అర్ధం చేసుకుని ఆపై తేరుకుని, “మరి మీ నాన్నగారూ?”, అని అడిగాడు శ్రీరమణ.
“ఇదిగో! ఇక్కడే పడక గదిలో ఉన్నారు! ఆయన మంచం దిగలేరు! ఆయన బాగోగులు కూడా నేనే చూసుకుంటూ ఆయనకు సపర్యలు చేస్తున్నాను! ఇంటిపనీ, బయట పనీ! ఏదో!! క్షణం తీరిక లేకుండా అలా గడిచిపోతున్నాయి రోజులు!”, చెప్పాడు గోపాలకృష్ణ.
అన్ని కష్టాలలో ఉంటూ కూడా తనను భోజనానికి పిలిచి ఆదరించడం శ్రీరమణకు ఆశ్చర్యం కలిగించింది.
“ఇంతకీ మీ ఆవిడకు ఏమైందీ?”, అడిగాడు శ్రీరమణ.
“మా ఆవిడకు మొదటి కాన్పులో కవలపిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టారు. నా ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇక చాలని నేను చెప్పాను! కానీ తను నాపైన అలిగి అన్నం మానేసింది. దాంతో నేను తన ఇష్టాన్ని కాదనలేకపోయాను! మూడు నెలల క్రితం రెండో కాన్పులో కూడా మా ఆవిడకు కవలలు పుట్టారు. ఈసారి ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల! కానీ కాన్పు కష్టం కావడంతో పిల్లలను కనగానే ఆవిడ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది!!”, అన్నాడు గోపాలకృష్ణ.
“అయ్యో! అలాగా!!”, అంటూ శ్రీరమణ కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
ఆ తర్వాత గోపాలకృష్ణ భుజంపై చెయ్యివేసి, “నువ్వు నా స్నేహితుడివి కాబట్టి చెబుతున్నాను! పిల్లలను కోసమన్నా నువ్వు రెండో వివాహం గురించి ఆలోచించకూడదా?”, అడిగాడు శ్రీరమణ.
“నాకు ఈ ఊళ్ళో గుడి పూజారిగా వచ్చే ఆదాయం చాలా తక్కువ! అందులోనే మా నిత్యావసరాలు కొనుక్కోవాలీ, మా నాన్నగారికి మందులు కొనాలీ, ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు కొన్ని డబ్బులు మిగుల్చుకోవాలి కూడా! మరొకరిని ఇంటికి తెచ్చి ఈ బీదరికంలో మగ్గమని చెప్పడం భావ్యం కాదు కదా?!”, అన్నాడు గోపాలకృష్ణ.
గోపాలకృష్ణ మాటలు విన్న శ్రీరమణకు అతడి పై జాలి వేసింది.
వెంటనే తన జేబులోంచీ కొంత డబ్బును తీసి గోపాలకృష్ణ చేతుల్లో పెడుతూ, “కాదనకురా!! ఏదో! నాకు తోచిన సహాయం!”, అన్నాడు శ్రీరమణ.
“నన్ను క్షమించరా! నేను అలా ఊరికే డబ్బులు తీసుకోను! నాకు ఆ నియమం ఉంది! ఏమీ అనుకోకు!”, అంటూ ఆ డబ్బును సున్నితంగా తిరస్కరించాడు గోపాలకృష్ణ.
‘వీడు అస్సలు మారలేదు!”, అనుకున్నాడు శ్రీరమణ.
“ఇక బయలుదేరదాం సుప్రియా! రా!”, అన్నాడు శ్రీరమణ.
సుప్రియ, తను ఎత్తుకున్న బాబును ముద్దాడుతూ, “అబ్బ! వీడెంత ముద్దుగా ఉన్నాడో కదండీ! అస్సలు దింపబుద్ధి కావడం లేదు!”, అంది.
“కానీ తప్పదు కదా! చీకటి పడుతోంది! మనం చాలా దూరం వెళ్ళాలి!”, అన్నాడు శ్రీరమణ.
సుప్రియ బాబును గోపాలకృష్ణకు ఇచ్చి శ్రీరమణతో కారు ఎక్కింది. ఇద్దరూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు.
“ఆ కృష్ణగాడి మంచితనం తెలియక వాడిని అనవసరంగా తిట్టుకున్నాను! పాపం! ఎన్ని కష్టాల్లో ఉన్నా వాడు ధర్మాన్ని విడిచి పెట్టట్లేదు! అది మనం మెచ్చుకుని తీరాల్సిన విషయం!”, అన్నాడు శ్రీరమణ.
“మీరు అతని మంచితనాన్ని కళ్లారా చూడాలనే నేను శివాపురం వెడదామని చెప్పాను!”, చెప్పింది సుప్రియ.
“ఏమిటీ? నీకు గోపాలకృష్ణ ముందే తెలుసా??”, కారును హఠాత్తుగా ఆపి సుప్రియను ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరమణ.
“మీకు ప్రతిరోజూ అతడినుండీ కాల్స్ రావడం, మీరతన్ని విసుక్కోవడం అవన్నీ చూసి ఒకరోజు మామయ్యగారిని అతడి గురించి చెప్పమని అడిగాను! మామయ్యగారు గోపాలకృష్ణ మంచితనం గురించీ, అతడి గొప్ప మనసు గురించీ నాకు చెప్పారు! మీరు అతడిని విడిచి ఇన్నేళ్ళైనా మీపై అతడికున్న అభిమానం అణుమాత్రం కూడా తగ్గలేదు! నగరం మోజులో మీరు మామయ్యగారి చేత పొలాన్నీ, ఇంటినీ, ఆయన ఇష్టంతో ప్రమేయం లేకుండా అమ్మించేశారు. కానీ మామయ్యగారికి వాటిపై విపరీతమైన మమకారం ఉంది! అవి ఆయన తాతలనుంచీ సంక్రమించిన ఆస్తులట కదా! మనం అమెరికా వెళ్ళిపోయాక మామయ్యగారు అప్పుడప్పుడూ ఇక్కడికొచ్చి తన బాధనంతా గోపాలకృష్ణతో చెప్పుకునేవారట! మామయ్యగారిని సంతోషపరచడానికి గోపాలకృష్ణ తనకున్న కొద్దిపాటి ఆస్తిలో కొంత ఖర్చు చేసి మామయ్యగారి పొలం కొని, తానే దాన్ని స్వయంగా సాగు చేస్తున్నాడట! గోపాలకృష్ణది ఎంత గొప్ప వ్యక్తిత్వం! అతడు మీ దగ్గర ఆ విషయాలేవీ ప్రస్తావించలేదు! అటువంటి స్నేహితుడు మీకు లభించడం మీ అదృష్టమండీ! ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఖండాలు దాటినా కన్న ఊరినీ, కన్న వారినీ పట్టించుకోకపోవడం సరికాదు కదా!”, అంది సుప్రియ.
అంతా విన్న శ్రీరమణకి నోటమాట రాలేదు.
తన తప్పును గ్రహించిన శ్రీరమణ కొద్దిగా ఆలోచించి, “నిజమే! నేనేనాడూ నాన్నగారి ఇష్టానికీ, ఆయన సంతోషానికీ ప్రాధాన్యతను ఇవ్వలేదు! కనీసం నా స్నేహితుడికన్నా ఎలాగోలా సహాయం చేస్తాను! అది నా బాధ్యత! నిరుపేదవాడైన ఆ కృష్ణ నాకు ఇంతగా సహాయపడుతూ ఉంటే, బోలెడు డబ్బు సంపాదించిన నేను, నా తండ్రికోసం నా ఊరికోసం ఇంతవరకూ ఏమీ చెయ్యకపోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది!!”, అని పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ కారును రివ్వున గోపాలకృష్ణ ఇంటికి పోనిచ్చాడు.
వెళ్లిపోయారనుకున్న శ్రీరమణ, సుప్రియలు మళ్ళీ వచ్చేసరికి, “ఏమైందీ? ఏమైనా మర్చిపోయారా? దారిలో ఏదైనా ఇబ్బంది కలిగిందా??”, అని వారిని కంగారుగా అడిగాడు గోపాలకృష్ణ.
“అవునురా కృష్ణా! నేను నిన్నొక విషయం అడగటం మర్చిపోయాను!”, అని శ్రీరమణ గోపాలకృష్ణ చేతులను తన చేతుల్లోకి తీసుకుని, “నీకు అభ్యంతరం లేకపోతే నీ పిల్లల్లో ఒకరిని నాకు దత్తత ఇస్తావా? మాకు పెళ్ళై ఏడేళ్లయ్యింది! మాకు ఇక పిల్లలు కలిగే అవకాశం లేదని డాక్టర్లు నిర్ధారించారు! దయచేసి నా ఈ విన్నపాన్ని ఒప్పుకుంటావారా?”, అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు శ్రీరమణ.
సుప్రియ శ్రీరమణ వంక ఆనందాశ్చర్యాలతో చూసింది. గోపాలకృష్ణ చిరునవ్వుతో తన తండ్రి సమ్మతి కోసం అతడి వంక చూశాడు. గోపాలకృష్ణ తండ్రి కళ్ళు ఆనందంతో మెరిశాయి. దత్తతకు ఒప్పుకోమని అన్నట్లుగా సైగ చేశాడు గోపాలకృష్ణ తండ్రి.
“అమ్మా సుప్రియా! ఇదిగోనమ్మా!! నా మూడు నెలల కుమారుడికీ నీకూ మధ్యన ప్రేమానుబంధం ఏర్పడటం ఇందాక నేను గమనించాను! ఇక వీడు నీ పిల్లవాడమ్మా! తీసుకో!!”, అంటూ మూడునెలల పసికూనను సుప్రియ చేతుల్లో పెట్టాడు గోపాలకృష్ణ.
శ్రీరమణ, సుప్రియల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సుప్రియ పిల్లవాడిని తన గుండెలకు హత్తుకుని వాడిపై ముద్దుల వర్షం కురిపించింది. ఆమె కళ్ళనుండీ ఆనంద భాష్పాలు జలజలా కారాయి.
“మీకేమిచ్చినా నా ఋణం తీరదు!”, అంది సుప్రియ గోపాలకృష్ణకు నమస్కరిస్తూ.
“నాదేముందమ్మా! అంతా ఆ శ్రీ కృష్ణుడి లీల!”, అన్నాడు గోపాలకృష్ణ వేణుగోపాలుడిని స్మరిస్తూ.
“దత్తత కార్యక్రమానికి ముహూర్తం పెట్టండి!”, అన్నాడు శ్రీరమణ హుషారుగా.
గోపాలకృష్ణ రెండు రోజులల్లో ఒక మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అంతా దాన్ని ఖాయం చేశారు. వేణుగోపాలస్వామి గుడిలో దత్తత కార్యక్రమం ఘనంగా జరిగింది.
కార్యక్రమం ముగియగానే శ్రీరమణ తన తండ్రితో, “నాన్నగారూ! మీ ఇష్టం ఏమిటో నేను ఏనాడూ అడగనందుకు నన్ను క్షమించండి! మన పొలాన్ని నేను గోపాలకృష్ణకి రెట్టింపు ధరను ఇచ్చి కొనాలని అనుకుంటున్నాను! అంతేకాదు! మన పాత ఇంటిని కూడా కొని, మరమ్మత్తులు చేయించి సిద్ధంగా ఉంచుతాను! ఇకపై మీరు నగరంలోని ఇంట్లో కానీ, ఇక్కడ కానీ, మీ ఇష్టానుసారం ఎక్కడకావాలంటే అక్కడ ఉండచ్చు! మన ఊరిలో కూడా నాకు చేతనైనంతలో అందరూ సుఖంగా బతకడానికి కావలసిన సదుపాయాలూ, సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాను. సరేనా?”, అని అడిగాడు.
అందుకు శ్రీరమణ తండ్రి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ, “తప్పకుండా రా అబ్బాయ్! అలాగే కానీ!!”, అని అన్నాడు.
అంతలో ఆ కార్యక్రమానికి వచ్చిన సుప్రియ తల్లిదండ్రులు గోపాలకృష్ణను పక్కకు పిలిచి, “బాబూ! మా రెండో కుమార్తె భావన భర్త అనుకోకుండా రెండేళ్ల క్రితం చనిపోయాడు! భావన మంచి తెలివైన పిల్ల! జీవితంలో తోడులేక రోజురోజుకీ నిరాశలో కూరుకుని పోతోంది. ఇప్పుడు భావనకు కావలసినది జీవితాంతం తనతో కలిసుండే ఒక తోడు! నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా?”, అని అడిగారు.
“నేను బీదవాడిని. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెను బాగా చూసుకోలేకపోతానేమో!”, అన్నాడు గోపాలకృష్ణ.
“బాబూ! నువ్వు పేదవాడివి కాదు! గుణసంపన్నుడివి! డబ్బుల విషయంలో నీకు ఎటువంటి భయమూ అక్కరలేదు! మా భావన భర్తకు కోట్ల ఆస్తి ఉంది. ఆమెకు అత్తమామలు గానీ, ఆమె భర్తకు తోబుట్టువులుగానీ లేరు. అందువల్ల భావన భర్త ఆస్తి మొత్తం చట్టరీత్యా భావనకు వచ్చింది. ఆ ఆస్తితో కనీసం మూడు కుటుంబాలు సుఖంగా బతకచ్చు. కాబట్టి ఆమెను పోషించడం నీకు బరువు కాదు! భావనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆమెను నీ పిల్లలకు తల్లిగా చేస్తే ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టినవాడివి అవుతావు!”, అన్నారు సుప్రియ తల్లిదండ్రులు.
గోపాలకృష్ణ తన తండ్రితో విషయం చెప్పి భావనతో పెళ్ళికి ఒప్పుకున్నాడు!
అక్కడే ఉండి అంతా గమనిస్తున్న శ్రీరమణ గోపాలకృష్ణ వద్దకు వచ్చి అతడిని ఆప్యాయంగా కౌగలించుకుని, “నువ్వు నా నిజమైన స్నేహితుడివిరా కృష్ణా!”, అన్నాడు.
“స్నేహితుడేమిటీ?! ఇకపై మనమంతా బంధువులం!”, నవ్వుతూ అంది సుప్రియ.
“మనందరికీ నిజమైన సఖుడూ, బంధువూ, అన్నీ ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడే!!”, అన్నాడు గోపాలకృష్ణ వేణుగోపాలుడికి నమస్కరిస్తూ.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *