March 29, 2024

మోదుగ పూలు – 8

రచన: సంద్యా యల్లాప్రగడ

వేసవి ఫైనల్‌ పరిక్షలు పూర్తి కావొచ్చినాయి.
పిల్లలను పరీక్షలకు సిద్ధం చెయ్యటంలో టీచర్లు తలమునకలయ్యారు.
పెద్ద పరీక్షలు అయ్యాయి పదో తరగతి పిల్లలకు. మిగిలిన వారికి కూడా పరీక్షలయినాయి.
ఆ సాయంత్రము టీచర్ల మీటింగు అయింది.
రాజు సార్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ” మనం ఇంక పదిహేను రోజులు సెలవులు తీసుకుందాం. పదిహేను రోజుల తర్వాత సారులందరు వెనక్కి వచ్చేయ్యండి. మనము పిల్లలను తీసుకురావాలి. మన జ్యోతి టీచరు పెళ్ళి చేసుకు వెళ్ళిపోతోంది కాబట్టి మనకు పని పెరగవచ్చు. టచ్‌లో ఉండండి. నేను ఇక్కడే ఉంటా కాబట్టి మీ విషయాలు చెబుతూ ఉండండి” అంటూ ముగించాడు.
“సమ్మర్ సెలవులు 15 రోజులేనా? పదిహేను రోజుల తర్వత కలిస్తే స్కూలు మళ్ళీ మొదలా” అడిగాడు వివేక్‌.
“స్కూలు మొదలవటానికి నెల రోజులుంది. మనకు ట్రైనింగు ఉంటుంది. పిల్లలు సెలవలకు ఇంటికి వెడితే అందరూ తిరిగి రారు. కొందరు డుమ్మా కొడతారు. తల్లితండ్రులలో ఒకరు పనికి పెడతారు. మనము ఆ లిస్టు చూసుకొని ఆ ఊరు పోయి ఆ పిల్లల్ని తీసుకురావాలి. ఇది ఈ మధ్య తగ్గింది కానీ మొదట్లో చాలా ఇబ్బందులుండేవిలే!” అంటూ నవ్వాడు రాజు.
“అవును. చాలా ఇబ్బందులు ఉండేవి. మేము వెళ్ళి తీసుకొస్తే తల్లితండ్రులు వచ్చి పట్టుకుపోయేవారు. మళ్ళీ తీసుకురావటం. ఇదే పనిగా ఉండేది. వాళ్ళతో మాట్లాడి, ఒప్పించి తీసుకొచ్చేసరికే తల ప్రాణం తోకకొచ్చేది. చిన్న పిల్లలను సండే సంతలో వాళ్ళ తల్లితండ్రులను కలిపించేవాళ్ళం. అదో ప్రాసెస్” అంటూ నవ్వాడు వీరన్నసార్.
గిరిజనలలో విద్యమీద అవగాహన లేని కాలములో వారు పిల్లలను బడికి పంపమన్నా పంపేవారు కారు. పనికి తీసుకుపోతే కూలీ వస్తుంది అన్న ఆలోచనతో, బడికి పంపకపోవటం, బడికి వెళ్ళినా తీసుకొచ్చేసెయ్యటం చేసేవారు. వారికి ప్రాధమిక విద్యను నిర్భంద విద్యగా కూడా చేసింది ప్రభుత్వము కొంతకాలం.
అందరు టీచర్లు చిరునవ్వులు కురిపిస్తూ, సెలవు తీసుకున్నారు.
చైతన్య సారు వచ్చి వివేక్‌ను ఉట్నూరు బస్సాండులో దింపిపోయాడు. ఆ కపుల్స్ గా ఉన్న టీచర్లు సెలవలకు కూడా సాధారణంగా ఎటూ వెళ్ళరు. వివేక్‌ హైద్రాబాదు బస్సు పట్టుకున్నాడు.

****

దాదాపు ఆరు నెలల తరువాత హైద్రాబాదు వెడుతున్నాడు వివేక్‌. పుట్టి బుద్ది ఎరిగిన నాటి నుంచి అతను పట్నంను, తల్లిని వదిలి అన్ని నాళ్ళు ఉండలేదు. మనస్సులో కొద్దిగా ఉత్సాహం వచ్చింది బస్సు ఎక్కాక.
బస్సు హైద్రాబాదు రాత్రి ఏడుకు చేరింది. ఇంటికెళ్ళేసరికే ఎనిమిది.
తల్లి, చెల్లెలు వివేక్‌ చూసి ఆనందంలో మునిగారు. చాలా కాలము తర్వాత అందరు కలసి ఆ రాత్రి భోంచేశారు.
మరుసటి ఉదయం మెలుకువ వచ్చేసరికే చాలా పొద్దుపోయింది. మొదట తను ఎక్కడ ఉన్నాడో తెలీలేదు.
ఇంటి బయట రోడ్డు మీద వెళ్ళే వాహనాల గొడవతో పూర్తిగా మెలకువ వచ్చింది. వివేక్ చెప్పాడని, తల్లీ, చెల్లీ వాళ్ళు ఆ బస్తీలోనే కొద్దిగ్గా పొడిగా ఉండే చోటికి మారారు. కాని మురికి, దుర్గంధము, దోమలు తగ్గలేదు. వివేక్‌కు ఊపిరిపీల్చలేనంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. పూర్వమతనికి ఆ వాతావరణంలో కాలుష్యం తెలిసేది కాదు. కానీ మామిడిపల్లి నుంచి వచ్చాక దూళి కణాల వలయాలు తన చుట్టూ ప్రాకుతున్నాయన్న ఫీలింగ్‌ తగ్గలేదు.
అతనికి అడవిలో ప్రశాంతమైన స్వచ్ఛమైన ఆ గాలి, వెలుతురు చాలా గుర్తుకు వచ్చాయి. స్కూలు పరిశుభ్రమైన వాతావరణం చాలా మిస్‌ అవటం మొదలెట్టాడు.
అడవి విలువ, పరిశుభ్రత విలువ పట్నం వస్తే గానీ తెలియలేదు. తనకే ఇలా ఉంటే, అన్ని సంవత్సరాలు అడవులో స్వేచ్ఛగా తిరిగిన తండ్రి ఎందుకు పట్నం వచ్చి ఇంతటి దుర్భలమైన దారిద్యంలో బ్రతికాడు? అన్న ఆలోచన అతనిని ఉక్కిబిక్కిరి చేసింది.
వివేక్‌ తల్లి పేరు నాగమ్మ. సన్నగా, పొట్టిగా ఉంటుంది. కనుముక్కు తీరుగా ఉంటుంది. బహుశా ఆమె వయస్సులో ఆమె తెగలో అందమైనది కావచ్చు. ఆమె పోలికలతో పుట్టిన వివేక్ చెల్లి పేరు లచ్చిమి.
లచ్చిమికి చదువు అంతగా అబ్బలేదు. పది చదివింది కష్టం మీద. బాల్య వివాహం చెడింది. ఎలాగైనా చదివించి టీచరు చెయ్యాలని వివేక్‌ గట్టి సంకల్పములో ఉన్నాడు.
అతను ఆ సెలవలో ఆమెతో ప్రైవేటుగా డిగ్రి కట్టించాడు. దానికి ట్యూషను కూడా పెట్టించాడు. చెల్లికి బ్యాంకులో అకౌంటు తెరిపించి ప్రతి నెలా డబ్బు అందులో వెయ్యగలనని చెప్పాడు. తల్లిని పనికి వెళ్ళవద్దన్నాడు కానీ, ఆమె గాని, చెల్లి గాని వినే పరిస్థితులలో లేరు. వాళ్ళు పని చేసి వచ్చే ఆదాయముతో కుదిరినంతగా బాగుండాలనే చూస్తారు. ఎవ్వరి మీదా ఆధారపడటము వారి లక్షణము కాదు.
మిత్రుడు వీరా వివేక్‌ను చూసి చాలా సంతోషించాడు. కానీ వివేక్‌లో మార్పు చాలా స్పష్టంగా గమనించాడు. వివేక్‌లో పెరిగిన ఆత్మవిశ్వాసం మిత్రుని సంతోషపెట్టింది.
కాని చాలా అన్యమస్కంగా ఉండటము గమనించి అడిగాడు “వచ్చినప్పట్నించి చూస్తున్నా… ఎక్కడో బుర్ర పెట్టి మాట్లాడుతున్నావు. లవ్వేమైననా?” అన్నాడు ఆటపట్టిస్తూ.
“ఏంది నీకు జోకా?” సీరియస్‌గా చూస్తూ అన్నాడు వివేక్‌.
“మరి ఏంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ…”
“అవును. నీకు చెప్పానుగా…నాయనెందుకు ఇలా చేశాడు? అడిగితే అమ్మ చెప్పదు” కొద్దిగ్గా విసుగ్గా అన్నాడు.
ఇద్దరూ క్యాంపస్‌లో వీరా రూమ్‌లో ఉన్నారు. క్యాంపస్‌లో వాతావరణం కొద్దిగా బెటర్ సిటీలో. హాస్టల్‌ బిల్లింగు చుట్టూ పెద్ద కానుక చెట్లు, అగ్నిపూల చెట్లు. పువ్వలతో నిండిన తంగేడు. కొన్ని క్రొటన్స్ తో పచ్చపచ్చగా ఉంటుంది. దుమ్ము తక్కువ. వివేక్‌కి అక్కడ కొద్దిగా ఊపిరిపీల్చగలుగుతున్నట్లు అనిపించింది. అందుకే వీరా రూమ్‌లో ఎక్కువ గడపాడా సెలవలు.

***

“నేను కూడా వస్తా. అడుగుదాం పెద్దమ్మని పద!” అంటూ వీరా, వివేక్‌ను బయలుదేరతీస్తాడు అతనింటికి.
ఇద్దరూ నాగమ్మ దగ్గర చేరారు.
అవీ ఇవీ ముచ్చటించాడు వీరా ముందు.
“పెద్దమ్మా! మన వివేక్‌లో చాలా ఛేంజ్‌ వచ్చింది కదా. ఊరికెళ్ళి వచ్చినప్పట్నుంచి”…
“అవును బిడ్డా! అది సరిలేదు..ఇది సరిలేదు అని గోల” అంది నాగమ్మ.
“అది సరే. వాళ్ళ నాయన గురించి…ఆయన ఊరేది. పెద్దలెవరని” అన్నాడు డైరెక్టుగా.
“అవును. చాలాసార్లు అడిగాడు. నాకు తెలియదు!“ అంది ఆమె.
“నీవు పెద్దనాన్నను ఎక్కడ కలిశావు? మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా?” అడిగాడు వీర
“జాతరల కలిశాము!” చెప్పిందామె.
“పెళ్ళి ఎక్కడయ్యింది?”
“ఈడనే!”
“పెద్దలెవరొచ్చి చేశారు?”
“ఎవ్వరూ లేరు బిడ్డా!”
“మీ పుట్టింటోళ్ళు ఎక్కడ పెద్దమ్మా?”
“మాది శ్రీశైలములో గూడం…”
“నీవు ఎందుకు ఎప్పుడు వెళ్ళలేదు… వీళ్ళను తీసుకుపోలేదు?”
ఆమె తల ఎత్తి వివేక్ ను చూసి “వీళ్ళ నాయన నన్ను నాగోబా జాతరల చూశాడు. వచ్చి పెండ్లి చేసుకుంటా నన్నాడు. మేము చెంచులము. వాళ్ళు కాదు… నన్ను మా ఊరుకొచ్చి తీసుకొచ్చుకున్నాడు. ఆయన పేరు గీరు అన్నీ మార్చిండు. ఎవ్వరికీ ఏమీ చెప్పవద్దన్నాడు. మీకు కూడా. నేను కట్టు గట్టినా. మరి నా ప్రాణం పోవాలి గాని నాకేమీ తెలవదు. మీరు ఏమైనా చేసుకోండి. వివేక్ జాబుకు పోయినప్పటి నుంచి ఇదే పెట్టిండు చెప్పమని? నాకు తెలవదు!!” అంది నాగమ్మ ఖచ్చితముగా.
చెంచులది ప్రత్యేకమైన వ్యవస్థ. వరుడికి కట్నం ఇవ్వరు. వధువుకు వోలి ఇచ్చే ఆచారం ఉంది. పెళ్ళిళ్ళలో ఆర్బాటాలు కనిపించవు. ఉన్నంతలో ఆడుతూ పాడుతూ సంతోషంగా జరిపిస్తారు. ఇంటిపేరు, గోత్రం పరిగణలోకి తీసుకుని ఆరుబయటే వివాహాలు చేసుకుంటారు. ప్రకృతి దగ్గరగా జీవించే వీరి మతాచారాలు కూడా ప్రకృతిలో ముడిపడి కనిపిస్తాయి. చెంచులు ఏ కార్యం తలపెట్టినా ముందుగా చెంచులక్ష్మిని పూజిస్తారు. ఆమెను శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. చెంచిత అంటే వేటకు గుర్తు. లక్ష్మి అంటే శాంతి. జీవనం కోసం వేట, శాంతియుత జీవనం అనే అద్భుత సందేశం ఇందులో ఇమిడి ఉంది. చెంచులు ఇతరులను గౌరవిస్తారు. సభ్యతగా నడుచుకుంటారు. అమాయకంగా నమ్మకంగా ఉంటారు. మాట ఇస్తే ప్రాణము పోయినా మాట తప్పరు. పాలన్నము పెట్టి చెంచులను లొంగ తీసుకోవచ్చని అంటారు.
ఆమెను ఇంక ఏమి అడిగినా చెప్పదని తెలిసింది వివేక్‌కు. ఇద్దరు మిత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. నడుస్తూ వచ్చి బస్సు ఎక్కి యూనివర్సిటిలో వీరా రూముకు చేరారు.
వివేక్‌ చాలా మౌనంగా ఉన్నాడు.
“నేను గ్రహించిన దాని బట్టి మా నాయన గిరిజనుడే. సందేహము లేదు. తన ఉనికిని దాచుకున్నాడంటే బహుశా వాళ్ళ తెగ నుంచి వెలి వెయ్యబడి ఉండాలి. లేదా ఆయన మీద కేసులేమైనా ఉండాలి. కేసులున్నాయేమో చూడాలంటే ఆయన అసలు పేరు తెలియాలి. గూడెంలో వెతకాలన్నా ఆయన పేరు కట్టు తెలియాలి ఏమీ తెలియకుండా వెతకలేను…” మనస్సులో మాటలు చెబుతున్నట్లుగా అన్నాడు.
వీరా భుజం మీద చెయివేసి ధైర్యం చెబుతూ “దొరికే టైం వచ్చినప్పుడు దొరుకుతుంది. నీవు అదే పనిగా వర్రీ అవకు. నీ రిసెర్చు గురించి ఆలోచించు” అంటూ సలహా ఇచ్చాడు.
“అవును అమ్మ ఎదో జాతర పేరు చెప్పింది” ఆలోచనగా అన్నాడు వివేక్‌.
“నాగోబా” చెప్పాడు వీరా.
“సరేరా! నేను రేపు వెళ్ళుతున్నా. నీవు కొంచం అమ్మ వాళ్ళని కలుస్తూ ఉండు.” చెప్పాడు వివేక్.
“సరేలేరా! నీవు చెప్పాల్నా. లక్ష్మికి చెప్పాను. ఎమైనా కావాలంటే ఫోను చెయ్యమని” ధైర్యం చెప్పాడు మిత్రుడు.
పదిహేను రోజులు గిర్రున తిరిగాయి. మామిడిపల్లి ప్రయాణమైనాడు. ముందే రాజుసార్‌కి ఫోను చేశాడు వస్తున్నట్లుగా. అతనికోసం జీపు వచ్చింది బస్టాండుకు. స్కూలు చేరిపోయాడు నడక కష్టం లేకుండా.

***

నాగోబా జాతర చాలా పెద్ద జాతర. ఈ జాతర పుష్యమాసంలో జరుగుతుంది. ఈ జాతరలో ముఖ్యంగా సర్పపూజ జరుగుతుంది. అమవాస్య రోజు సర్పాలు ఆడుతాయని నమ్మకం ఆదివాసులకు. ఆ సమయంలో కనుక పూజ చేస్తే వారిని నాగదేవత అనుగ్రహిస్తుందని నమ్మకం వారిది.
గిరిజనులలో గోండులకు నాగదేవత వంశ దేవత. గోండులలో ‘మేస్రం’ గోత్రం వారి దేవత నాగదేవత. నాగదేవతకు ఆదిలాబాదులోని ‘కెస్లాపూర్’ లో దేవాలయం ఉంది. ఈ కెస్లాపూర్‌ చాలా చిన్న తండా. కాని ఈ జాతర రోజున లక్షల మంది గిరిజనులు పలు చోట్ల నుండి ఈ జాతరకు వస్తారు. నాలుగురోజులు జరిగే ఈ జాతర పండుగ అతి పెద్ద ఉత్సవం.
నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమౌతాయని గిరిజనుల నమ్మకం.
ఈ జాతరకు ఒక కథ ఉంది. పూర్వం గోండు రాణికి కలలో సర్పం కనిపించి తను ఆమె కడుపున పుడుతున్నానని చెబుతుంది. అటుపై ఆమెకు సర్పము జన్మించింది. ఆ సర్పానికి తన తమ్ముడి కూతురుతో పెళ్ళి జరిపించింది రాణి. ఆ పెళ్ళికూతురు పామును బుట్టలో పెట్టుకొని గోదావరి నది వడ్డుకు వెడుతుంది. దారిలో రకరకాల ఇబ్బందులు వస్తాయి. సరే ఎలాగో కష్టపడి చేరిన కొత్త పెళ్ళికూతురు గోదావరిలో స్నానం చెయ్యగానే పాము అందమైన రాజకుమారునిగా మారిపోతుంది. ‘పేరు ప్రతిష్ఠలు కావాలా, సంప్రదాయం కావాలా’ అని అడుగుతాడు రాజకుమారునిగా మారిన సర్పరాజు.. పేరు కావాలంటుంది పెళ్ళికూతురు. దాంతో మాయమవుతాడు సర్పరాజు. అతని కోసము వెతికి కనపడక ఆమె గుండంలో దుమికి ప్రకృతితో కలిసిపోతుంది. సర్పము మాయమైన ఆ చోట ఒక రాయిగా వెలిసిందని నమ్మకం గిరిజనులకు. సాంప్రదాయం ముఖ్యమని వారి నమ్మకం. పెళ్ళైన జంటలను అక్కడకు తీసుకు వస్తారు.
నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు.
ఈ జాతరకు ముందుగా తమ కుల దైవమైన నాగును అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన వేడుకగా బయలుదేరి వెళతారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నది ఒడ్డు ఉన్న అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయి దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు.
జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల మాత్రమే వంట చెసుకుంటారు. గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతులు వారిగా వంటలు చేసుకుంటారు.
గుగ్గిల్ల గోత్రం వారు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేయడం ఆచారంగా వస్తోంది. గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయులమధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి! పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిల్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గోదావరి జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.
గోదావరిలో పవిత్ర జలం సేకరించిన తరువాత వారు పూజారి ఉన్న ఊరికి వచ్చి, పూజారితో కలిసి కేస్లాపూరు చేరుతారు. దారిలో ఇంద్రాదేవు అన్న దేవత ఉన్న ఊరులో ఆగి ఆ దేవత పూజలు కూడా చేస్తారు. ఇలా ఊరేగింపుగా వేడుకలతో వస్తూ, సరిగ్గా పుష్య అమావాస్య రోజున వచ్చి నాగబో దేవతకు అభిషేకం చేస్తారు.
ఈ జాతరకు ఎందరో తరలివస్తారు. ముఖ్యంగా చాలామంది తమ జోడును ఈ జాతరలో చూసుకుంటారు.
గిరిజనులకు నాగరికులకు మధ్య సమస్యలు మొదలయిన తరువాత ఈ జాతర చివరి రోజను దర్బారు ఏర్పాటు చేసి గిరిజన పెద్దలను కూర్చోబెట్టి సమస్యలను తీర్చే సంప్రదాయం మొదలెట్టారు.
నాగోబా జాతర గురించి విషయాలు వివేక్‌, చంద్రయ్యతాత దగ్గర్నుంచి సేకరించాడు. అక్కడ రకరకాలు జాతుల వారు వచ్చి తమ జోడును చూసుకుంటాయి కాబట్టి తండ్రి తన తల్లిని అక్కడ చూసి పెళ్ళి చేసుకొని ఉంటాడని గ్రహించాడు.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *