March 29, 2024

*శ్రీ గణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా

31 వ పద్యం

వటువు ప్రయోగించెనపుడు
పటువున దంతమును పీకి పరిఘకు మారున్
మిటమిట లాడెను మోషకు
డటగొని శరణం బనన్ గజాననుడాపెన్
భావం: తండ్రి ఆదేశంతో గజాననుడు లేచి, తన దంతాన్ని విరిచి ఎలుకపై విసిరాడు. అది ఒక ఇనుప గదలా తగలగా ఎలుకకు ప్రాణాలు కళ్ళలోకి వచ్చినంత పనిఅయ్యింది. వెంటనే ఆ ఎలుక శరణు కోరింది. గజముఖుడు తన దాడిని ఆపి ఉపనయన కార్యక్రమం కొనసాగించెను

32 వ పద్యం

ఉపదేశమునందించగ
ఉపవీతునికై రహస్యమొప్పగ జేయన్
అపథమ్ముగ చెరలాడె మ
ధుపమ్మొకటి దుర్వినీత దుర్వహమతినిన్
భావం: తిరిగి ఉపనయన కార్యక్రమంలో కూర్చున్న వటువుకు గాయత్రీ మంత్రోపదేశం చేయాలి. ముసుగు వేసికొని కొడుకు చెవిలో తండ్రి మంత్రం చెప్పాలనుకునే సరికి ఒక తుమ్మెద పెద్దగా రొద చేస్తూ తిరగడం ప్రారంభించింది.

33 వ పద్యం

భృంగమ్మది ఝంకారము
భంగమ్మది మంత్రమునకు భండనమయ్యెన్
జంగమదేవర హుమ్మనె
భృంగిని కింకరుడు చేసె బృందారకుడున్

భావం: ఆ తుమ్మెద రొద మంత్రోపదేశానికి ఇబ్బంది కలిగిస్తుండగా శివునికి కోపంవచ్చి హుంకరించాడు. అంతేకాక ఆ తుమ్మెదను పట్టి, తన గణములలో నొకడిగా (భృంగి) గా మర్చివేశాడు.
భండనము: దుశ్చేష్ట
బృందారకుడు: వేలుపు, శ్రేష్ఠుడు

34 వ పద్యం

భిక్షకు పోయెను కపిలుడు
నక్షయముగ భిక్ష నిడిరి హరిహర బ్రహ్మల్
దాక్షాయణి దీవెనలిడె
సాక్షాత్తుగ విద్యలపతి సరగున నీవే
భావం: వటుడు భిక్షకు బయలుదేరాడు. విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు అసంఖ్యాకమైన వరాలను ఇచ్చారు. విద్యలకు అధిపతిగా తల్లి దీవించింది.

(ఉపనయన కార్యక్రమంలో భిక్ష స్వీకరించడం ఒక సంప్రదాయం. మంత్రోపదేశం పొందిన బ్రహ్మచారి ఆరోజు నుండి తగిన గురువుని వెదుక్కొని, విద్యాభ్యాసం చేస్తూ, తనకి సరిపడినంత ఆహారాన్ని మాత్రమే యాచించి పొందాలి. ఇవి బ్రహ్మచారి నియమాలు. నాలుగు వర్ణాశ్రమ ధర్మాలలో మొదటిది బ్రహ్మచర్యాశ్రమం)

35 వ పద్యం

సుముఖుండనుమతి కోరెను
అమరున మరి తపము జేయ నంబా శివులన్
కొమరుని డెందము నిడుకొని
సముచితముగ ననుమతిచ్చె సమధిక కూర్మిన్
భావం: మంత్రోపదేశమును, అధికమైన వరాలను పొంది, తేజంతో ప్రకాశిస్తున్న ఆ బాలుడు విద్యాసక్తుడై , తపస్సుకు పోవుటకు తల్లిదండ్రుల అనుమతి కోరాడు. (గజముఖుడు సుముఖుడు ఎలా అయ్యాడు? విద్య నేర్చుకోడానికి సుముఖంగా ఉన్నాడు కాబట్టి సుముఖుడు అయ్యాడు) శివుడు, పార్వతి ఎంతో ప్రేమగా తమ కుమారుని దగ్గరకు తీసుకొని, ఆశీర్వదించి, అనుమతిచ్చి పంపేరు

36 వ పద్యం

ఘోరాటవి నందడుగిడి
మోరుండలు శారికలును మురియుచు నుండన్
వీరుధములు చిక్కనబడ
పారంగతుడై తపమును ప్రారంభించెన్
భావం: అడవిలో ప్రవేశించి, హంసలు , గోరింకలు సందడి చేయుచుండగా, చిక్కనైన ద్రాక్షపొదలు అల్లుకున్న ప్రదేశంలో ప్రశాంతంగా తన తపస్సును ప్రారంభించాడు గజముఖుడు.

37 వ పద్యం

అచ్చర కన్నెలు చేరియు
ముచ్చట పడి చూసె విష్ణు ముప్పిరిగొనుచున్
వచ్చి తమ యాటపాటల
తుచ్ఛపు నటనల నదల్చె తుంటరి పనులన్
భావం: నీరు ప్రవహించే చోట మొక్కలు, వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం నీరు లభించే చోట పక్షులు నివసిస్తాయి. ఇవన్నీ ఉన్న ప్రదేశం ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. అప్సరసలను ఆకర్షించేవి కూడా ఇలాంటి ప్రదేశాలే. అలా ఆటాడుకోడానికి ఈ ప్రదేశానికి వచ్చిన అప్సరసలు తన తేజంతో విశ్వమంతా నిండి ప్రకాశిస్తున్న బాలుని చూసారు. అనేకభావాలు చుట్టుముట్టగా ఆబాలుని తపస్సు భంగం చేసి, తమవైపుకు తిప్పుకోడానికి అనేక ప్రయత్నాలు చేసారు.
విష్ణు: విశ్వవ్యాప్తమైనవాడు

38 వ పద్యం

ఈరూపున మోహించిరి
ఈ రోకున నా తపంబు నిటు భంగపడెన్
మారెద గుజ్జగు రూపున
ఏ రీతిగ నన్నుజూచి యిడుగడ పడగన్
భావం: నా ఈ రూపం చూసి కదా ఈ అప్సరసలు నా వైపు వచ్చారు. వారివలన నా తపస్సు భంగమయ్యింది. నేను కుబ్జ రూపంలో ఉంటే నావైపు ఎవరూ చూడరు. (అని అనుకొనిన వాడై.. తర్వాతి పద్యంతో అన్వయం)

రోకు: వికాసము, లావణ్యము

39 వ పద్యం

అని పలికె నేకదంతుడు
అనిశము మరి పెద్దబొజ్జ అనుకూలింపన్
అనపాయమైన రీతిని
అనఘుడు తపమాచరించె నమలిన భంగిన్
భావం: (పైపద్యం లో చెప్పినట్లుగా ) నేను ముద్దుగా ఉండటం వలన కదా మీరు నన్ను ఆటకు పిలిచారు, నేను అలా లేకుంటే నన్ను ఇష్టపడరు, నా ఏకాగ్రత చెడనివ్వరు అని పలికి, పెద్ద బొజ్జ కలిగిన కుబ్జ (పొట్టి, గుజ్జు) రూపాన్ని ధరించి, మరి ఎవ్వరూ భంగపరచని విధంగా ప్రశాంతంగా తన తపస్సును పూర్తిచేసుకున్నాడు.

అనిశము: ఎల్లప్పుడూ
అనఘుడు: పాపము చేయనివాడు
అనపాయము: అపాయము లేనిది
అమలిన: నిర్మలమైన.

40 వ పద్యం

తపమొనరించిన పిమ్మట
ఉపవనము విడిచి కరిముఖు డుప్పొంగెన్ శీ
ఘ్ర పద నిజగృహ జనితుడై
అపరాజిత త్రిపురహరులకంజలి చేసెన్
భావం: తపస్సు పూర్తిచేసుకుని వనమును విడిచిపెట్టాడు గజముఖుడు. తన ఇంటికి (కైలాసానికి) చేరి, పార్వతి , శివులకు నమస్కరించాడు.
తల్లికి మొదట వందనం. ఆమె అపరాజిత. అనగా ఓటమి లేనిది. తండ్రి త్రిపురాసురులను సంహరించినవాడు. (త్రిపురాసుర సంహారం ఒక విశిష్ట గాథ)
41 వ పద్యం

శాంభవి కొమరుని చూచుచు
డింభక లంబోదరమది డెందమునొచ్చెన్
సంభవమిది యెట్లనగా
రంభాదుల దంభమణచ రహియించెననెన్
భావం: లంబోదరము, గుజ్జు రూపము చూసిన పార్వతీదేవి, “నాయనా ఏమిటి ఈ అవతారం” అని అడుగగా, “తల్లీ రంభ మొదలైన అప్సరసల గర్వం అణచడానికి ఇలా తయారయ్యాను” అని చెప్పాడు.

42 వ పద్యం

మూషిక వాహుకు షణ్ముఖు
భాషణమున వాదమయ్యె పటలము కొరకై
రోషించి వెడలె స్కందుడు
భూషించెను గజముఖుండు భూతేశుమలన్
భావం: ఎలుకను ఎక్కి తిరిగే గజముఖునికి, ఆరుముఖాలు గలిగిన కుమారస్వామికి తండ్రి సైన్యం పై ఆధిపత్యం కొరకు వాదన జరిగింది. కుమారస్వామి రోషంతో కుమారస్వామి వెళ్లిపోగా, కరి వదనుడు తల్లిదండ్రులను కీర్తించెను.

(ఎన్నో ఏళ్ళు హాస్టల్ లో ఉండి చదువుకుని వచ్చిన కొడుకుని (అన్నని) తల్లిదండ్రుల దగ్గరే ఉండి చదువుకుంటున్న కొడుకు (తమ్ముడు) కొంచెం శత్రువుగా చూస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ వగైరాలు తనకే సొంతం అన్నకు ఏ హక్కు లేదన్నట్లు. ఇన్నాళ్లు తండ్రి సైన్యాన్ని చూస్తున్న కుమారస్వామికి, పెద్ద కొడుకుగా లంబోదరునికి ఆ సైన్యం పై ఆధిపత్యం కావాలనుకోవడం సహజమే. ఇద్దరూ ముల్లోకాలు చుట్టి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారిదే సైన్యమని నిర్ణయించుకుంటారు. కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరి వెళ్లగా, గజముఖుడు తల్లిదండ్రులను కీర్తించడం మొదలుపెట్టాడు)

43 వ పద్యం

తలిదండ్రులె నాకమ్ములు
వలసిన కైదండలిడుచు వాంఛితమొప్పన్
పలుకుచు పంచాక్షరములు
కొలిచె ఘను డపర్ణశివుల, కోర్కెలు తీరన్
భావం: తల్లిదండ్రులు ఉన్నచోటునే స్వర్గం ఉంది. చేతులు జోడించి, పంచాక్షరీ మంత్రం పలుకుతూ, తనకోర్కెలు తీరడం కోసం తల్లిదండ్రులకు పూజచేసాడు గజాననుడు.

44 వ పద్యం

హేరంబు కార్తికేయుల
చేరంబిలిచి హరిపంచె సేనల్ దండుల్
శూరులె తమతమ బలముల
నీరాజనమిడిరి సురలు నెయ్యము మీరన్
భావం: గజముఖ, షణ్ముఖ పోటీలో ఎవరు నెగ్గేరో సర్వవిదితమే. తల్లిదండ్రుల ప్రదక్షిణే ముల్లోకాలు అని తలచినవాడు గజముఖుడు. స్వయంగా చుట్టివచ్చినవాడు షణ్ముఖుడు. అందుచేత విష్ణువు శివుని గణాలకు అధిపతిగా గణపతిగా కరిముఖుని, దేవసైన్యానికి అధిపతిగా కుమారస్వామికి నియమించాడు. వీళ్ళ శౌర్యప్రతాపాలకు దేవతలందరూ హారతి పట్టారు.

హేరంబుడు: శౌర్యముచే గర్వించినవాడు
కార్తికేయుడు: కృత్తికా నక్షత్రం లో పుట్టినవాడు (కుమారస్వామి)

45 వ పద్యం

చతురాయనమః హరయే
కృతినే విభుధేశ్వరాయ కేదార సుతః
స్తుతి హర్షితాయ గదినే
గతిదాయ అజాయ జ్ఞాన గమ్యాయ నమః
భావం: సర్వకార్యములను సాధించుటలో నేర్పరి (చతురుడు) , విష్ణువుతో సమనమైనవాడు, అందమైన వాడు (హరయే), నెరవేరిన పని కలవాడు (కృతినే ), సర్వవ్యాపక మైనవాడు (విభుధేశ్వరాయ) , శివుని కుమారుడు (కేదార సుతః), స్తోత్ర పాఠాలకు ఆనందించేవాడు (స్తుతిహర్షితాయ), గద ను ధరించిన వాడు (గదినే), ఉపాయము సూచించేవాడు (గతిదాయ), త్రిమూర్తులు మరియు మన్మధునితో సమానమైనవాడు (అజాయ), జ్ఞానం ఇవ్వడమే గమ్యమైనవాడు (జ్ఞానగమ్యాయ) అయినటువంటి వినాయకునికి నేను నమస్కరిస్తున్నాను.
*శ్రీ వినాయక సహస్ర నామావళి నుంచి తీసుకొనబడినవి*

46 వ పద్యం

అకటా నవ్వెను చంద్రుడు
వికవికమని విఘ్నరాజు వేషము జూడన్
తికమకపడె భుక్తాయా
సకుడు గజముఖుడు నలిగెను శాంకరి వెరగున్
భావం: విఘ్నేశ్వరుడు భుక్తాయాసంతో ఆపసోపాలు పడటం గమనించిన చంద్రుడు వెటకారంగా నవ్వేడు. నేను ఆయాస పడితే చంద్రునికి ఎందుకు నవ్వొచ్చింది అని మొదట ఆశ్చర్యపోయాడు గణపతి. అంతలోనే అయ్యో నవ్వాడే అని బాధతో అలిగాడు.

(గజముఖుడు ను + అలిగెను = గజముఖుడు నలిగెను)
శాంకరి: శంకరుని కుమారుడైన గణపతి, కుమారస్వామి

47 వ పద్యం

నా సుతు జూచి ఎకసెకము
లౌ సోముని గనిన నింద లందెదరిదిగో
నా శాపమిదియనె గిరిజ
దాసోహంబనెను సోము దయజూపమనెన్
భావం: “నా కుమారుని చూచి వేళాకోళం చేస్తాడా చంద్రుడు, అతనిని చూసినవాళ్ళు నిందల పాలౌతారు. ఇదే నా శాపం ” అని పార్వతీదేవి శపించింది. చంద్రుడు అమృతానికి తోబుట్టువు. ఓషధులకు తన కిరణాల ద్వారా శక్తిని అందిస్తాడు. దేవతలకు తన వెన్నెల ఆహారమిస్తాడు. అలాంటి చంద్రుణ్ణి చూస్తేనే అపనిందలు కలుగుతాయంటే ఎలా? చంద్రుడు అమ్మను ప్రార్ధించాడు. దయ చూపించమన్నాడు.

పిల్లలు ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. *వ్యక్తి రూపాన్ని చూసి ఎప్పుడూ హేళన చేయకూడదు. ఎవరైనా పొరపాటున కిందపడినా, నడవడానికి అవస్థ పడుతున్నా, నడకలో తేడాలున్నా, వెక్కిరించడం, నవ్వడం, అనుకరించడం చేయకూడదు. అవసరమైతే సహాయం చేయాలి. ఈ మధ్య కాలంలో prank అను పేరిట కావాలని జనాలని హేళన చేస్తున్నారు. అది చాలా తప్పు. విపరీత పరిణామాలకు దారితీస్తుంది*

48 వ పద్యం

శాంతించెను దుర్గయపుడు
శాంతించెను లోకమాత శాపము బాపన్
చింతించకు ఱే వెల్గుడ
చింతగు భాద్రపదమందె చెల్లును చవితిన్
భావం: గణపతికి మాత్రమే తల్లిగా, తన కొడుకును వచ్చిన కష్టానికి కోపించి శపించిన పార్వతీదేవి చంద్రుని ప్రార్ధన కు కరిగింది. లోకంలోని జనులందరి తల్లిగా అందరి క్షేమాన్ని ఆలోచించి “బాధపడకు చంద్రా, ఒక్క భాద్రపద చవితి నాడు మాత్రమే ఈ శాపం పనిచేసేలా సవరిస్తున్నాను. మిగిలిన రోజుల్లో వర్తించదు” అని అభయం ఇచ్చింది అమ్మ.
ఱే వెల్గుడు: రాత్రి పూట వెలుగునిచ్చేవాడు , చంద్రుడు

49 వ పద్యం

ఓం గరుడధ్వజ వందిత
ఓం గణవందన గణాయ ఓం అగ్రణ్యే
ఓం గమ్యాయ నమః ఓం
గంగాదిక శుచి ప్రదాయ గహనాయ నమః
భావం: గరుత్మంతుడు ధ్వజంగా కలిగిన విష్ణువుచే స్తుతించబడిన వాడా, శివుని యొక్క గణములచే పూజించబడినవాడా, నీవే ఒక సమూహమైనవాడా, తొలి పూజలు అందుకునేవాడా, గమ్యము నీవైన వాడా, గంగ మొదలైన నదులకు శుచి కలిగించేవాడా (గణేశ విగ్రహాల, ఓషధుల నిమజ్జనం ద్వారా), సాధకులకు తప్ప ఇతరులకు నీ సూక్ష్మ తత్వము ఎరుగలేనిదగువాడా విఘ్నేశా నీకు నమస్కారము

(ప్రతి పదానికి అదే క్రమంలో అర్ధములున్నవి)

(శ్రీ వినాయక సహస్రం నుంచి గ్రహించబడిన నామములు)

50 వ పద్యం

మట్టిని చేసిన బొమ్మను
గట్టిగ నీ మనుజులంత, గణపతి గొల్వన్
చెట్టున పుట్టిన ఆకులె
పట్టున నీ పూజ సేయ పత్రుల పేరన్
భావం: గణపతి… మట్టితో నీ బొమ్మ చేస్తారు. చెట్లకు, మొక్కలకు ఉండే ఆకులను పత్రులని చెప్పి తెచ్చి ఈ మనుషులంతా పూజిస్తారు. ఎంత నిరాడంబరమైన పూజయ్యా నీది 🙏🏻

51 వ పద్యం

చల్లని దేవర గణపతి
పిల్లలు కనుగొని నుతింప విద్దెల నొసఁగున్
అల్లన పనులకు ముందుగ
ఎల్లరు పూజించుచుంద్రు ఎగ్గులు సైపన్
భావం: పిల్లలు చదువుల కోసం గణపతిని పూజిస్తే వాళ్ళకి చదువులనిస్తారు. పనులలో ఆటంకాలు తొలగడానికి అందరూ ముందుగా పూజించేది విఘ్నపతినే.

52 వ పద్యం

భారత రచనను వ్యాసుని
తారపు లేఖకునివై హితకరము నొప్పన్
సారపు ధర్మమును తెలిపి
మేరున నీతులు నుడువగ మేరువు నయ్యెన్
భావం: వ్యాసుడు మహాభారతం చెప్తూ ఉండగా, గణపతి రాసిపెట్టాడు. ఎన్నో ధర్మాలు, నీతులు మహాభారతం లో ఉండటం చేత ఎంతో ప్రసిద్ధి పొందింది.

మేరువు: గిరి శిఖరాలలో పెద్దది. అలా గొప్పదైనటు వంటిది.
మేరున: మర్యాదగా…, ఒక క్రమంలో..
తారపు : స్వచ్ఛమైన

53 వ పద్యం

క్షీర ఘటమునన్ జూచెను
శౌరి చవితి చంద్రునకట సైచెను నిందల్
మీరక యా శాపమునన్
పోరాటమునందు మణిని పోడుల గెలిచెన్
భావం: పాలకుండలో చవితి చంద్రుణ్ణి కృష్ణుడు చూశాడట. పార్వతీదేవి శాప ఫలితంగా శ్యమంతక మణిని అపహరించాడన్న అపనిందకు లోనైనాడు. ఆ నింద పోగొట్టుకోవడానికి శ్యమంతక మణిని వెతకడానికి వెళ్లి, జాంబవంతునితో యుద్ధం చేసి, మణిని, జాంబవతిని, సత్యభామలను పొందాడు. వినాయక చవితి నాడు చంద్రుని చూసిన ప్రభావం అలాంటిది. అందుకే ఆరోజు ఈ శ్యమంతకోపాఖ్యానం చెప్పుకుని, అక్షతలు తలపై వేసుకుంటే నీలాపనిందలు రావని పెద్దలు చెపుతారు.

54 వ పద్యం

కనిపించెడి దైవములని
కనిపెంచిన వారికెపుడు కరములు మోడ్తున్
జనులకు రుజువులు చూపిన
పనిచెఱుపుల దొరకు నేను ప్రణతుల నిడుదున్
భావం: తల్లిదండ్రులే కనిపించే దైవాలని, పంచాక్షరీ మంత్రం జపిస్తూ, పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి, పూజించిన గణేశుడు నిరూపించాడు. ఆ విఘ్నేశ్వరుని నేను నమస్కరిస్తున్నాను.
పనిచెఱుపుల దొర: విఘ్నములకు అధిపతి – గణపతి

55 వ పద్యం
ఒజ్జవు విద్దెల కెల్లను
గుజ్జగు రూపమున నేను గొల్తును నిన్నున్
బొజ్జకు నిండుగ కుడుములు
కజ్జూరమ్ములు చెఱుకులు ఘనముగ నిత్తున్
భావం: విద్యలకు అధిపతివైన నిన్ను నీవు ఇష్టపడిన గుజ్జు రూపంలోనే (కుబ్జ) పూజిస్తాను. కడుపునిండా కుడుములు, కజ్జూరం, చెరుకుముక్కలు మొదలైనవి పెడతాను

ఒజ్జ: ఉపాధ్యాయుడు

56 వ పద్యం

వానలు కురియుచు వచ్చెను
కానగ భాద్రపద మాస కళలును హెచ్చెన్
కూనలు కొలువగ వచ్చిరి
ఆనందము జాలువార నధినాయకునిన్
భావం: వానలు మొదలయ్యాయి. భాద్రపదమాసం వచ్చింది. మూడురోజులు గడిచిపోయాయి. చంద్రకళలు పెరిగాయి. పిల్లలందరూ ఆనందంగా వినాయకుని పూజచేయడానికి సిద్ధమవుతున్నారు

57 వ పద్యం

అటుకులు, కొబ్బరి, పప్పులు,
చిటిబెల్లము వెలగపండ్లు చేరువ చేర్చెన్
పటువున పందిళ్లు పరచి
విటపపు పత్రులును తెచ్చె విఘ్నేశునకున్
భావం: పిల్లలు పూజ మొదలెట్టారు సరే, వారి ఏర్పాట్లు ఏమిటో… అటుకులు, కొబ్బరి, పప్పులు (వేయించిన శనగపప్పు లేదా పోపువేసిన శనగలు) , బెల్లం, వెలగపళ్ళు తీసుకొచ్చిపెట్టారు. పందిళ్లు వేశారు. రకరకాల చిగుళ్లు, ఆకులు పూజకు తీసుకువచ్చారు.

విటపపు: చిగురించిన

58 వ పద్యం

నవరాత్రుల పూజసలుప
నవకిసలయ పల్లవములు ననముల కూర్చెన్
అవిరళముగ నీ ఘనతను
చవులూరగ పాడుకొనిరి చదువుల రేడా
భావం: తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుని పూజించడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు పిల్లలు. లేత చిగుళ్లు, పువ్వులు ఏరి తెచ్చుకున్నారు. విఘ్నేశుని ఘనతను ఒకరి తర్వాత ఒకరుగా కథలుగా చెప్పుకుంటున్నారు.

నవకిసలయ: కొత్తగా చిగురించుచున్న
పల్లవములు: చిగుళ్లు
అవిరళముగా: ఆగకుండా
చవులూరగ : రుచించునట్లు

59 వ పద్యం

అజ్ఞానపు తిమిరమ్మిది
సుజ్ఞానపు కాంతినిమ్ము సురమునివినుతా
అజ్ఞానము తొలగించగ
విజ్ఞానపు దానమొసగు విద్దెల రేడా
భావం: మా చుట్టూ అజ్ఞానమనే చీకటి ఆవరించి ఉంది. మంచి జ్ఞానమనే వెలుగును ప్రసాదించవయ్యా… దేవతలు, మునులచే కొలువబడేవాడా.. మా ఈ అజ్ఞానము పోయేలాగ విజ్ఞానాన్ని దానమివ్వు విద్యలకు అధిపతివైన విఘ్నేశ్వరుడా.

(దేవతలు మునులు కొలిచేవాడిగా.. ప్రాపంచిక ఆసక్తి తొలగించే ఆధ్యాత్మిక విద్యను, విద్యలకు అధిపతిగా పిల్లలకు అవసరమైన విద్యను కోరుకుంటున్నారు భక్తులు)

60 వ పద్యం

వేదము లైనను విద్యా
వాదములైనను స్వకార్య వాంఛితమయ్యున్
పేదలు మరి పెద్దలయిన
నీదుకొలుపు తొలిగజేయ నిర్ణయమందున్
భావం: వేదవిద్యలైనా, శాస్త్ర చర్చలైనా, సొంత పనులైనా, ఏదైనా సరే, పేదవారు, డబ్బున్నవారు అనే బేధం లేకుండా అందరూ మొదటగా నీ పూజనే చేస్తారు విఘ్నేశ్వరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *