April 23, 2024

అమ్మమ్మ – 34

రచన: గిరిజ పీసపాటి

పండుగ వెళ్ళిన ఐదు రోజులకే ఇంట్లో బియ్యంతో సహా సరుకులన్నీ నిండుకున్నాయి. వసంత చెల్లిని తీసుకుని వీళ్ళు నెలవారీ కిరాణా సరుకులు తీసుకుని షాపుకి వెళ్ళి ఐదు కేజీల బియ్యంతో పాటు, అవసరమైన సరుకులు ఇమ్మని అడిగింది.

తండ్రి ప్రతీనెలా ఆ షాప్ లోనే కిరాణా సామాను అరువుగా తీసుకొని జీతం రాగానే సొమ్ము చెల్లించేవాడు. డబ్బు తండ్రి కట్టినా సరుకులు మాత్రం పిల్లలే తెచ్చేవారు కనుక వసంత వెళ్ళి సరుకులు అడగగానే ‘పాత బాకీ తీరిస్తే గానీ అరువు ఇవ్వన’న్నాతను.

‘తండ్రి ఊరెళ్ళారని, రాగానే బాకీ తీర్చేస్తామ’ని అతడిని బతిమాలి సరుకులు తీసుకొచ్చింది. ఆ సరుకులను ఎంత పొదుపుగా వాడినా పట్టుమని పదిరోజులు కూడా రాకముందే మళ్ళీ నిండుకున్నాయి.

మళ్ళీ షాప్ కి వెళ్ళి ఆయనను సరుకులు ఇమ్మని ఎంత బతిమాలినా డబ్బు చెల్లిస్తే గానీ ఇవ్వనని తెగేసి చెప్పెయ్యడంతో తిరిగి ఇంటి ముఖం పట్టారు అక్కా చెల్లెలు. ఆరోజు, మర్నాడు కూడా పస్తు ఉన్నారు.

మర్నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో పెరటి గోడ వద్ద గాజుల శబ్దంతో పాటు “వసంతా!” అనే పిలుపు వినపడడంతో “ఎవరూ?” అంటూ వెళ్ళింది వసంత

“మధ్యాహ్నం మా ఆయన చెప్పారు నిన్న మీరు కిరాణా సామాను అరువు అడిగితే ఇవ్వనన్నానని. ఒకసారి ఇంటికి వస్తావా?” అంది ఆవిడ.

వీళ్ళ ఇంటి వెనుక వైపు ఇల్లే వాళ్ళ ఇల్లు కావడంతో “ఇప్పుడే వస్తానాంటీ!” అంటూ గిరిజను తీసుకుని వెళ్ళింది. ఇంటి బయట నిలబడి “ఆంటీ!” అని కేక వెయ్యగానే ఆవిడ బయటకు వచ్చి “ఈ బియ్యం పట్టుకెళ్ళు వసంతా! మీ పరిస్థితి నాకు తెలిసింది.”

“ఆయనకు వ్యాపారమే ముఖ్యం. సరుకులు ఇవ్వలేదని ఏమీ అనుకోకు. ఈ బియ్యానికి డబ్బు ఇవ్వక్కరలేదు. ఆయనకు తెలియకుండా ఇస్తున్నాను” అన్నారావిడ.

“వద్దాంటీ! మీరు మా పరిస్థితిని అర్థం చేసుకుని బియ్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. పస్తు ఉన్నా పరవాలేదు. కానీ, ఊరికే తీసుకోలేము. మరోసారి మీ మంచి మనసుకి” అంటూండగా గుండెల్లోని బాధ గొంతులోకి రాగా మరి మాట్లాడలేక ఆవిడకి నమస్కరిస్తూ వెనుతిరిగింది వసంత.

గిరిజ కూడా అక్కని అనుసరించింది. వీళ్ళు కాస్త దూరం వెళ్ళగానే “వసంతా ఆగు. ఒకసారి నా మాట విను” అంటున్నా ఆగకపోవడంతో “గిరిజా! నువ్వైనా ఒకసారి నా మాట విని, మీ అక్కని తీసుకురామ్మా!” అందావిడ. ఇంతలో ఆవిడ కేకలకి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు బయటకు వచ్చి చూడసాగారు.

“అక్కా! ఒకసారి ఏదో చెప్పాలనుకుంటున్నారు. మనం ఎలాగూ ఉచితంగా తీసుకోమని చెప్పేసాము కదా! అందరూ మనల్నే చూస్తున్నారు. ఒకసారి వెనక్కి వెళ్దాం పదక్కా” అనడంతో ఒకసారి చుట్టూ అందరినీ చూసి, వెనక్కి తిరిగింది వసంత.

ఇద్దరూ వెనక్కి వెళ్ళగానే ఆవిడ ఇంటి వరండాలోకి వెళ్ళి “లోపలికి రండి” అంది. వీళ్ళిద్దరూ లోపలకు వెళ్ళగానే “ఒక పని చెయ్యు వసంతా. మీరు బియ్యం కొనుక్కోగానే నా దగ్గర తీసుకున్న బియ్యం తిరిగి నాకు ఇచ్చెయ్యొచ్చు. ఇప్పుడు మాత్రం కాదనకు” అంటూ బియ్యం ఉన్న బేగ్ గిరిజ చేతిలో పెట్టింది.

సంశయంతో అక్క వంక చూసింది గిరిజ. “తీసుకో” అని చెల్లికి చెప్పి “మేము బియ్యం కొనుక్కున్న వెంటనే తిరిగి ఇచ్చేస్తాము. థాంక్యూ ఆంటీ. వెళ్ళొస్తాం” అంటూ ఇంటి దారి పట్టిన అక్కను బియ్యం బేగుతో అనుసరించింది గిరిజ.

ఇంటికి రాగానే తల్లికి విషయం చెప్పి, బియ్యం కొలిచింది. “మొత్తం పది పావులమ్మా!” అని తల్లికి చెప్తూనే గబగబా రెండు పావుల బియ్యం కడిగి, కుక్కర్ పెట్టింది. “మనకి డబ్బు ఎలా వస్తుంది వసంతా? తిరిగి ఆవిడకి బియ్యం ఇవ్వడం ఎలా? తీసుకోకుండా ఉండాల్సింది” అంది నాగ.

“జరిగింది చెప్పాక కూడా నువ్విలా అంటే ఎలా అమ్మా? ఏమో ఆ భగవంతుడు నాన్న మనసును మార్చి తిరిగి వచ్చేలా చేస్తాడేమో!” అంది వసంత.

అన్నం అయితే వండింది గానీ, కూరగాయలు, పప్పు ఏమీ లేకపోవడంతో “అన్నంలోకి ఏమీ లేవమ్మా! ఏం చేద్దాం?” అడిగింది తల్లిని.

“పచ్చిమిరపకాయలు ఉంటే రోట్లో దంచు వసంతా! ఆ కారంలో ఎప్పటిలాగే ఉప్పు కలుపుకుని తినేద్దాం” అంది నాగ. “అవే ఉంటే నిన్నెందుకు అడుగుతానమ్మా? నేనే దంచేస్తాను కదా. ఎండు కారం, ఉప్పు తప్ప అన్నీ నిండుకున్నాయి” అంది వసంత.

“ఇంకేం! అవి ఉన్నాయి కదా! వాటితోనే కానిద్దాం. అన్నాలు వడ్డించు. గిరీ! కంచాలు, మంచి నీళ్ళు పెట్టు. భోజనం చేద్దాం” అన్న నాగ మాటతో భోజనాలు సిద్ధం చేసారు అక్కా‌ చెల్లెలు.

అందరి కంచాలలో అన్నం వడ్డించి, కాస్త ఎండు కారం పొడి, ఉప్పు వేసింది వసంత. వేడి వేడి అన్నంలో ఆ ఎండు కారం, ఉప్పు కలుపుకుని కడుపు నింపుకున్నారు‌. ఆవిడ ఇచ్చిన బియ్యం అయిపోయేవరకు ఎండు కారం అన్నాన్నే అపురూపంగా తిన్నారు.

ఐదు రోజుల్లో ఆ బియ్యం నిండుకోవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చి, మళ్ళీ ముందు రోజు రాత్రి నుండి మంచి నీటితోనే కడుపు నింపుకోసాగారు.

ఆరోజు రాత్రి ఏడు గంటల సమయంలో కిరాణా షాపావిడ మేడ మీద ఒంటరిగా కూర్చున్న గిరిజను తమ ఇంటికి రమ్మని కేకేయడంతో అడుగుకి మూడేసి మెట్లు చెప్పున దూకుతున్నట్లు దిగి తల్లితోనూ, అక్క తోనూ ఆవిడ పిలుస్తున్న విషయం చెప్పింది.

“బియ్యం తిరిగి ఇమ్మంటారేమో. రెండు రోజులలో ఇచ్చేస్తామని చెప్పు” అని చెప్పి పంపారు. వాళ్ళింటికి వెళ్ళిన గిరిజ చేతిలో మరలా ఒక పేపర్ కవర్ నిండా పోసిన బియ్యం ఇచ్చి “మొన్న నేనిచ్చిన బియ్యం అయిపోయి ఉంటాయి కదా! మీకు డబ్బు అందితే ఆ బియ్యం తిరిగి ఇచ్చేవారు. అలా జరగలేదంటే మీకు డబ్బు అందలేదనేగా”

“మొత్తం కలిపి ఇచ్చెయ్యొచ్చు. తీసుకెళ్ళు. మా ఆయనకి మాత్రం విషయం తెలియనీయకండి.” అంటూనే తిరిగి “మీ నాన్నగారి విషయం ఏమైనా తెలిసిందా!?” అని అడిగిందావిడ. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపి “థాంక్స్ అంటీ!” అని చెప్పి ఇంటికొచ్చి అక్క చేతికి పేకెట్ ఇస్తూ విషయం చెప్పింది.

ఈసారి కేజీ బియ్యం ఇచ్చిందావిడ. “మరో రెండు రోజులు అన్నం తినొచ్చు కదమ్మా!” అన్నాడు ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకుని అప్పుడే లోపలికి వస్తున్న నాని.

ఇంతలో వీళ్ళ బంధువు కృష్ణమూర్తి గారు లోపలికి వస్తూ “చెల్లీ! కులాసాగా ఉన్నారా?” అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి “రా! అన్నయ్యా! మేం బాగానే ఉన్నాం” అంటూ ఆహ్వానించింది నాగ.

“పిన్ని దగ్గర నుండి ఉత్తరం వచ్చిందమ్మా!” అంటూ అమ్మమ్మ దగ్గర నుండి షాప్ అడ్రస్ కి వచ్చిన ఉత్తాన్ని కేష్ బేగ్ లో నుండి తీసి నాగ చేతిలో పెట్టాడాయన. “థాంక్స్ అన్నయ్యా!” అంటూ ఉత్తరం అందుకుని “బిజినెస్ ఎలా నడుస్తోంది?” అనడిగింది.

“బాగానే నడుస్తోంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ ‘మేడమ్ గారు రావట్లేదే’మని రోజూ అడుగుతుంటే వాళ్ళకు సర్ది చెప్పలేక నా తల ప్రాణం తోకకు వస్తోంది” అని “అయినా ఎన్నాళ్ళని ఇలా ఇంట్లోనే ఉంటావు? రేపటి నుండి షాప్ వచ్చెయ్. పనిలో పడితే కాస్త మరుపుగా ఉంటుంది”.

“అంతేకాక ఇంట్లో జరుగుబాటు కూడా చూడాలి కదా! పిల్లల ముఖాలు చూడు సరైన పోషణ లేక ఎలా పీక్కుపోయాయో. తిండి మానేసినా ఇంటద్దె అయినా కట్టాలి కదా! ఈ నీడ కూడా లేకపోతే ఆడపిల్లతో చాలా ఇబ్బంది పడతావు. ఆలోచించు. పిన్నికీ విషయం తెలుసా?” అని అడిగాడాయన.

“అమ్మకి ఈ విషయాలేవీ చెప్పలేదన్నయ్యా! ఈ వయసులో ఆవిడని బాధ పెట్టడం సబబా చెప్పు?” అని నాగ ఎదురు ప్రశ్న వేసేసరికి “అదీ నిజమేలే. నా మాట విని రేపటి నుండి నువ్వు యధావిధిగా షాప్ కి వచ్చేస్తూ ఉండు”.

“ఒక్కడినీ అన్ని పనులూ చూసుకోలేకపోతున్నాను” అని ఆయన అంటూ ఉండగానే, మృదువుగా వీధి తలుపు మీద వేళ్ళతో తట్టిన శబ్దం వినబడింది.

‘తలుపులు తెరిచే ఉన్నాయి కదా!’ అని అందరూ అటు చూసేసరికి గుమ్మం దగ్గర నిలబడి “మే ఐ కమిన్ మేడమ్!” అంటూ చిరునవ్వుతో కనిపించారు ఎమ్క్యూర్ ( Emcure) కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రసాద్ గారు.

“రండి రండి. కూర్చోండి” అంటూ ఆహ్వానించింది నాగ.

“మీరు షాప్ రావట్లేదు కదా మేడమ్! మీకు గాని, పిల్లలకి గానీ హెల్త్ బాగోలేదేమోనని చూద్దామని వచ్చాను” అన్నాడాయన వసంత తెచ్చిన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ.

“అటువంటిదేమీ లేదు ప్రసాద్ గారు. ఊరికే… కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉండి రాలేకపోతున్నాను” అంది నాగ తడబడుతూ.
ప్రసాద్ చాలా తెలివైనవాడే కాక మంచి వ్యక్తి కూడా. నాగ తడబాటుని కనిపెట్టి “ఎనీ ప్రాబ్లమ్ మేడమ్?” అని అడిగాడు.

“ప్రాబ్లమా!? హబ్బే! అదేమీ లేదు ప్రసాద్ గారూ!” అని నాగ అంటూ ఉండగానే “ప్రసాద్ మన కుటుంబం లోని ఒక మనిషిలాంటి వాడమ్మా! అతడి దగ్గర విషయం దాచాల్సిన అవసరం లేదు. అతను తప్పుగా అనుకు‌నే మనిషి కాడు. అర్థం చేసుకుంటాడు”.

“నాకు బయట కొంచెం పని ఉంది మరో రోజు ఖాళీ చూసుకుని తీరికగా వస్తాను.. ఒకసారి లోపలికి వస్తావా చెల్లీ!” అంటూ లోపలి గదిలోకి దారి తీసిన కృష్ణ మూర్తి గారి మాటలకు “ఇప్పుడే వస్తాను ప్రసాద్ గారూ” అంటూ లోపలికి వెళ్ళిన నాగ చేతిలో వంద రూపాయల నోటు పెట్టి “వచ్చే నెల నీ జీతంలో విరగ్గోసుకుంటాను. ఉంచు” అంటూ వెళిపోయారు.

***** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *