February 9, 2023

గృహస్థాశ్రమ ధర్మాలను వివరించిన “ఔర్వ మహార్షి “

రచన: శ్యామసుందరరావు

 

ఔర్వ మహార్షి  కధ మహాభారతము ఆదిపర్వంలోని చైత్ర రద పర్వము అనే ఉప పర్వంలో 79,80అధ్యాయాలలో 55 శ్లోకాల్లో ఉంది.

ఈ కథను వశిష్ఠుడు తన మనుమడైన పరాశరునికి చెబుతాడు.  ఆంధ్ర మహాభారతములో నన్నయ ఈ కథను ఆదిపర్వం సప్తమాశ్వాసములో 132 వచనము నుండి 149 వ వచనము వరకు 18 గద్య పద్యాలలో ఎటువంటి మార్పులు చేయకుండా చెప్పాడు.   ఈ కథ మొత్తము అనౌచిత్యమైన అంశాలతో కూడుకొని ఉంటుంది.   ఋషుల మహాత్యము చెప్పటానికే ఈ కథలోని వృత్తాంతాలను జానపద కట్టు కదల ప్రభావముతో పండిత కవులు కల్పించిన కథగా ఒక వాదన కూడా ఉంది

ఔర్వుడు ఋషులలో కోపిష్టివాడు, ఉగ్రుడిగా పేరు పొందినవాడు.    ఈయన విష్ణు, బ్రహ్మ, భృగు చ్యవన, అప్రవానుల వారసుడు.    భృగు వంశస్తులకు క్షత్రియులకు ఘోర సంగ్రామము జరిగే సమయములో ఈయన జన్మించాడు.   ఔర్వమహర్షి తండ్రి అప్రవానుడు, తల్లి ఋచి.    శ్రీవత్సస గోత్ర మూల పురుషుడైన వత్స మహామునికి ఔర్వుడు మనుమడు ఔర్వుని కుమారుడే  రుచికుడు, రుచికుని కుమారుడే జమదగ్ని ఔర్వ మహాముని జన్మ వృత్తాంతము మరియు అతని పేరు వెనకాల కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయి  మహాభారతము లో చెప్పినట్లుగా  పూర్వము కార్తవీర్యర్జునిడి తండ్రి కృత వీర్యుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు మునుల పట్ల ముఖ్యముగా భృగు వంశస్తుల పట్ల చాలా ఉదారంగా ఉంటూ వారికి భారీగా దానాలు చేస్తూ ఉండేవాడు.   ఆ మహారాజు దాతృత్వము వలన భృగు వంశస్తులు ధనవంతులు అయ్యారు.   రాజు మరణానంతరము అయన వారసులు ధనము లేని వారు అయినారు.  వారు బ్రాహ్మణులూ మోసము చేసి ధనము సంపాదించారని , అందుచేత వారు భృగు వంశస్తులను ధనము కోసము అర్ధించారు కానీ వారు నిరాకరించారు ఎందుచేతనంటే బ్రాహ్మణులకు ఇచ్చిన ధనాన్ని వెనుకకు తీసుకోరాదు అన్న ధర్మ సూక్షము ఉన్నది కాబట్ట భృగు వంశస్తులు వారి సంపదను అంటే బంగారాన్ని ఒక రహస్య ప్రదేశములో భూమిలో పాతి పెట్టారు.  ఈ విషయము తెలుసుకున్న క్షత్రియులు ఆశ్రమాలపై దాడి చేసే చాలా మంది భృగు వంశీయులను పిల్లలు ఆడవారు అనే విచక్షణ లేకుండా చంపారు. భృగు వంశస్తులు కూడా వీరత్వము కలిగినవారు అవటం వలన వారు కూడ యుద్దానికి తయారు అయినారు కానీ క్షత్రియులను ఎదుర్కోలేకపోయినారు.

ఈ పోరాటం జరుగుతున్నప్పుడు ఋచి అప్పుడే పుట్టిన బిడ్డను రక్షించుకోవటానికి తన తొడలో దాచుకుంది.  ఆ స్త్రీని చంపటానికి క్షత్రియులు దాడి చేసినప్పుడు ఆవిడ  తొడ నుండి శిశువు నెల మీద పడతాడు.  క్షత్రియులు ఆ శిశువును చంపాలని ప్రయత్నిస్తే ఆ శిశువు వెలువరించి దివ్య తేజస్సుకు  వారందరు  దృష్టిని కోల్పోతారు.   ఆ విధముగా శిశువు తొడలనుండి బయటపడ్డాడు కాబట్టి ఔర్వఅనే పేరుతో పిలవబడ్డాడు  (ఊరువు అంటే తొడ ఊరువు నుండి ఉత్పత్తి అయినా పదము ఔర్వ) వారందరును ఋచి దగ్గరకు వేల్లితాము తెలియక అజ్ఞానముతో తప్పుచేశామని క్షమించమని ప్రాధేయపడతారు అప్పుడు ఋచి ,”నేను ఏమి చేయలేదు మీ కళ్ళు పోవటానికి నా శిశువు యొక్క తేజస్సే కారణము. నాకు జన్మించిన శిశువు గర్భములోనే వేద వేదాంగాలను అభ్యసించిన గొప్ప తపస్సంపన్నుడు మీరు అతనినే వేడుకోండి”అని, ఔర్వునితో ,”నాయనా వారు తెలియక తప్పు చేశారు వారు చేసిన తప్పులకు వారు ప్రాయశ్చిత్త ము చెందుతున్నారు కాబట్టి వారిని క్షమించు,” అని  తల్లి కోరగా ఔర్వుడు ఆ రాజకుమారులందరిక్ దృష్టి వచ్చేటట్లు చేసాడు వారు ఆనందముగా ఔర్వుని నమస్కరించి వెళ్లిపోయారు.

ఔర్వుడు పెద్దవాడు అయినాక తనతండ్రి ఇతర బంధువులు రాజవంశీకుల వల్ల చంపబడ్డారని ఆగ్రహించి వారి మీద ప్రతీకారము తీర్చుకోవటానికి శక్తి పొందటానికి తపస్సు ప్రారంభించాడు ఈ ఘోర తపస్సుకు ప్రపంచమంతా అతలాకుతలం అయింది. అప్పుడు ఔర్వుని పితృదేవతలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి అతని ముందు ప్రత్యక్షమై “నాయనా నీ మనస్సు మార్చుకో క్షత్రియుల మీద నీకు కోపము వద్దు మేము వారి చేతిలో చనిపోవాలని మేమే  తీసుకున్న నిర్ణయము నిజముగా మాకు ధనము కావాలంటే మేము కోరినంత కుబేరుడి ఇస్తాడు మేము ఎక్కువకాలం జీవించి ఉండటం వలన విసుగు చెంది క్షత్రియుల చేతిలో చనిపోవాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే మేము స్వయముగా మరణిస్తే మేము స్వర్గాన్ని చేరము అందుచేత క్షత్రియుల చేతిలో చనిపోయినాము. ఇందులో వారి తప్పు ఏమిలేదు, వారి మీద నీ ఆగ్రహాన్ని తగ్గించుకో” అని పితృదేవతలు ఔర్వునికి హితవచనాలు చెప్పారు.   వీటిని విన్న ఔర్వుడు తన నిర్ణయాన్ని మార్చుకొని తన కోపాగ్ని తనను దహించి వేస్తుంది కాబట్టి ఆ కోపాగ్నిని అశ్వముఖ రూపములో సముద్ర జలాల్లో విడిచిపెడతాడు.   ఔర్వుడ్ కోపాగ్నిని “ఔర్వాగ్ని”అంటారు

ఔర్వ మహర్షి బ్రహ్మచర్యము తీసుకొని మళ్ళీ తపస్సు మొదలుపెడతాడు. ఈ తపస్సుకు లోకాలు గడగడ లాడతాయి. మహర్షులు దేవతలు, రాక్షసులు వస్తారు. మహర్షులు ఔర్వునితో,”కుమారా చిన్నతనంలోనే బ్రహ్మచర్యము స్వీకరించి వివాహము చేసుకోకపోతే భార్గవ వంశము అంతరించిపోతుంది కాబట్టి వివాహము చేసుకొని గృహాస్త్రశ్రమము స్వీకరించు” అని చెపుతారు. దానికి ఔర్వ మహర్షి చిరునవ్వుతో ” నాది వాన ప్రస్త ధర్మము, నాకు గాలి నీరే ఆహారము.  గృహస్థ ధర్మము కాదు, బ్రహ్మచర్యము వలన బ్రహ్మగతి ప్రాప్తిస్తుంది. సంతానమే ముఖ్యము అనుకుంటే నేను వివాహము లేకుండానే సంతానాన్ని పొందగలను”అని అగ్నిహోత్రములో తన కాలును పెట్టి దర్భతో గీరగా అయన కాలునుండి అగ్నిహోత్రుడే కొడుకుగా బయటకు వస్తాడు.   ఆ అగ్నిహోత్రుడు అంతకంతకు పెరిగిపోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఔర్వ మహర్శితో,”మహర్షి నీ కుమారునికి కావలసిన చోటు ఆహారము నేను ఇస్తాను అతనిని నాకు విడిచి పెట్టు,” అని అడుగుతాడు ఔర్వ మహర్షి అంగీకరించగా ఓర్వ మహర్షి కొడుకు రూపములో ఉన్న అగ్ని సముదరములోని ఔర్వగ్నితో కలిసి ప్రణయ కాలములో నేరుగా మారుతుంది అని బ్రహ్మ చెపుతాడు. వచ్చిన దేవతలు, మహర్షులు , రాక్షసులు అందరు వెళ్ళిపోతారు. కానీ హిరణ్యకశిపుడు మాత్రము ఆగి ఔర్వ మహర్షి సాష్టాంగ ప్రమాణము చేసి ఆయనను ప్రసన్నము చేసుకుంటాడు. ఔర్వ మహర్షి హిరణ్యకశిపునికి “విద్య మాని”(రాక్షస మాయ) అనే విద్యను చెప్పి ఆ విద్య హిరణ్య కశిపుని వంశస్తులకు మాత్రమే చెందుతుంది అని చెపుతాడు.

 

ఒకసారి ఔర్వ మహర్షి బ్రహ్మచర్య వ్రతములో ఉండగానే కందని అనే కుమార్తెను పొందుతాడు. కందని ఎంత అందముగా ఉంటుందో, మాట అంత కటువుగా ఉంటుంది. పెరిగి పెద్ద అయిన కందని దుర్వాస మహర్షి గురించి విని ఆయనతో వివాహము చేయమని తండ్రిని కోరుతుంది.   కూతురి కోరిక మేరకు ఔర్వ మహర్షి కూతురిని దుర్వాస మహర్షికి ఇచ్చి వివాహము చేస్తాడు. వివాహము అయినా కూడ కందని వైఖరిలో మార్పు రాదు. అందుచేత ఒకసారి ఆగ్రహించిన దుర్వాసుని తీక్షణమైన  చూపులకు కందని భస్మమవుతుంది. విషయము తెలుసుకున్న ఔర్వ మహర్షి, అవమానాలతో భాధపడేటట్లుగా జీవించమని దుర్వాసుని శపిస్తాడు.

అయోధ్య నగరాన్ని పాలిస్తున్న బాహురాజు  హైహయ వంశ రాజులో చేతిలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోయి గర్భవతి అయిన భార్యతో ఔర్వ మహర్షి ఆశ్రమములో తలదాచుకుంటాడు. సవతి భార్య చేసిన విషప్రయోగము వలన ఏడూ సంవత్సరాలు అయినా ఆవిడకు కొడుకు జన్మించడు. రాజు పెద్దవాడు అవటం వలన చనిపోతే రాజు భార్య భర్తతో సతీసహగమనం చేయాలనుకుంటే, ఔర్వ మహర్షి నీకు పుట్టబోయే కొడుకు గొప్ప చక్రవర్తి అవుతాడని చెప్పి ఆవిడ  ప్రయత్నాన్ని విరమింప జేస్తాడు. విషముతో కూడా బయటకు వచ్చిన పిల్లవాడికి ఔర్వమహర్షి సగరుడు అని నామకరణము చేసి వేదం విద్యలు, శాస్త్రాలు బోధిస్తాడు.  పెరిగి పెద్దవాడు అయిన సగరుడు తల్లిని వాళ్ళు ఇలా అరణ్యాలపాలు అవటానికి కారణము ఏమిటి అడిగి తెలుసుకొని తల్లి, గురువుల అనుమతితో హైహయ రాజులపైకి దండయాత్రకు బయలుదేరి వారందరినీ కాకుండా, ఇతర రాజులను కూడా జయిస్తాడు. వారందరు భయపడి వశిష్ఠుని శరణు  కోరుతారు. వశిష్ఠుడు సగరునికి నచ్చజెప్పి వారి వారి రాజ్యాలను ఇప్పిస్తాడు.

సగరుడు అయోధ్యరాజ్యానికి పట్టాభిషక్తుడై సుమతి , సుకేసి అనే ఇద్దరినీ వివాహమాడతాడు. వారికి సంతానము లేకపోవటంతో సగరుడు భార్యలతో ఔర్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయనకు సపర్యలు చేస్తూ ఉంటాడు. వారి సపర్యలకు  సంతుష్టుడైన ఔర్వ మహర్షి సగరుని భార్యలతో, మీకు “వంశాన్ని ఉద్ధరించే ఒక కొడుకు కావాలా? లేక సామాన్యులైన అరవై వేల మంది కొడుకులు కావాలా? అని అడుగుతాడు. సుకేసి ఒక కొడుకు చాలు అని అడుగుతుంది. సుమతి అరవై వేల  మంది  కొడుకులు కావాలి అని అడుగుతుంది.   మహర్షి వారు అడిగినట్లుగానే అనుగ్రహించాడు.  సగరుడు చాలా కాలము రాజ్యపాలన చేసినాక ఔర్వ మహర్షిని విష్ణుమూర్తిని పూజిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఔర్వ మహర్షి,”రాజా వర్ణాశ్రమ ధర్మాలను శ్రద్దగాపాటిస్తు ఇతరుల ధనాన్ని ఆశించకుండా అన్ని జీవులలో భగవంతుడున్నాడని నమ్మేవారిని, ఇతరురులను హింసించకుండా ఉండేవారిని విష్ణు మూర్తి ఇష్టపడతాడు”అని చెపుతాడు.   సగరునికి ఔర్వ మహర్షి గృహస్థ ధర్మాలను వివరముగా చెపుతాడు, అంటే గృహస్తు చేయకూడని పనులు చేయవలసిన పనులు అన్ని వివరిస్తాడు అలా గృహస్తు తన ధర్మాలను సక్రమముగా నిర్వర్తిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని చెపుతాడు. అలాగే శ్రాద్ధకర్మల గురించి కూడా సగరునికి వివరిస్తాడు. అవి నేటి మానవాళికి కూడ వర్తిస్తాయి వాటిని ఆచరించేవారు. సుఖశాంతులతో జీవిస్తారు సమాజములో అశాంతి ఉండదు.   ఔర్వ మహర్షి నిగ్రహము, అనుగ్రహము, బ్రహ్మచర్యము, మహాతపశ్శక్తి ఉన్నవాడు సమాజానికి గృహాస్థాశ్రమ ధర్మాలను తెలియజేసిన మహర్షి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *