June 14, 2024

తాత్పర్యం – అంటుకున్న అడవి

రచన: – రామా చంద్రమౌళి

డాక్టర్ పుష్ప ఆ వేసవి కాలపు సాయంత్రం తన ఇంటి బాల్కనీలో కూర్చుని . . ఎదుట అస్తమిస్తున్న సూర్యుణ్ణి తదేకంగా చూస్తోంది దాదాపు పది నిముషాలనుండి.
ఆమె హృదయం అంటుకున్న అడవిలా . . మధ్య మధ్య ఘనీభవించిన మంచు మైదానంలా ఉంది. మనిషి మనోస్థితి ఎప్పటికప్పుడు మారుతూ క్షణ క్షణం. . విస్ఫోటిస్తూ,
కింది అంతస్తు వాకిట్లోనుండి మొలిచి ఏపుగా ఎదిగిన టేకు చెట్టు తన విశాలమైన పచ్చని ఆకులతో. . విస్తరించి. . చల్లగా గాలి. . అప్పటిదాకా వీచిన వడగాలిని తరిమేస్తూ. . ప్రక్కనే విప్పిన గొడుగులా కొమ్మలను చాచి పచ్చని బాదాం చెట్టు.
పరివర్తన.
ఉండి ఉండి చటుక్కున ప్రక్కనున్న టాబ్ ను చేతిలోకి తీసుకుని రాయడం ప్రారంభించిందామె . . కవిత్వం.

వేసవి వడగాలివై వస్తావు నువ్వు
చేతులను చాచి విస్తరిస్తాను నేను
బీజం కోసం వేచిఉన్న భూమిలా
ఏదో పరిమళ దాహం . . నైరూప్యమై. . ఆవరిస్తూ

నువ్వు తాగుతున్న టీ కప్పును లాక్కుని
ఒక సిప్ ను ఆస్వాదిస్తూ
నీ కన్నుల్లోకి చూస్తానుకదా
కోటి వసంతాలను తొడుక్కుని చిరు పక్షుల గుంపులు
నాలోనుండి కెరటాల్లా విస్ఫోటిస్తూ
ఏదో మానవ పరిమళం నీదీ నాదీ
ఒక సంగమ కాంక్షతో మూడవ పరిమళం కోసం పలవరింత

చినుకులు అతిథిలా కురియడం ప్రారంభం కాగానే
తడుస్తూన్న భూమి నుండి. . అరోమా. . జీవ పరిమళం
మనసునిండా. . దాహం
ఎడారిలా పరుచుకుంటూ –

ప్రతి జీవినీ దాని శరీర పరిమళాన్ని బట్టి చాలా ఖచ్చితంగా గుర్తించవచ్చు. . వ్రేలి ముద్రలకన్నా ప్రభావవంతంగా.
‘ అరోమా ట్రీట్ మెంట్ ‘ ఇప్పుడిప్పుడే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రం. ‘ సంగీత చికిత్స ‘ కూడా.
ఒక మంచి సువాసననో, ఒక రసస్ఫోరకమైన సంగీత శకలమో అనుభవం లోకొచ్చినప్పుడు . . పశు పక్ష్యాదులతో పాటు. . మనుషులూ పరవశంతో పరిసరాలను మరిచి కరిగిపోవడం తెలుసు మనకు. . ఏమిటది. ?
పుష్ప కళ్ళు మూసుకుంది.

మనిషికి ఆకలి. . దాహం. . దుఃఖం. . కోపం. . ఆవేశం వంటి అతి సహజ భౌతిక లక్షణాలతో పాటు సెక్స్. . శృంగారం. . భావప్రాప్తతతో కూడిన సుఖ లాలసత కూడా ఒక సహజమైన, అనివార్యమైన అవసరమే కదా. ఈ వయసుతో పాటు పొంగుతూ వయసుతోపాటే కుంగుతూ ఒక అప్రత్యక్ష ప్రభావాన్ని చూపగల మానవ శరీర జన్యువులే మనిషి యొక్క సకల శృంగార చర్యలనూ, స్పందనలనూ, ప్రకోపాలనూ శాసిస్తున్నపుడు వ్యక్తి ఒట్టి నిమిత్తమాత్రుడే కదా. ఐనా ఈ నిప్పులాంటి నిశ్శబ్దంగా దహించే కోరిక లోపలి నరనరాల్లో జరజరా పాములా పాకుతూ, అగ్ని. . మౌనాగ్ని. . హిమాగ్ని. ,
ప్రక్కనున్న మొబైల్ మోగింది. . ఒక చిన్న శబ్ద శకలంతో. ఏదో మెసేజ్. అందుకుని చూచింది. వాట్స్ అప్ సందేశం. శంకరం నుండి. ఒక ప్రొఫెసర్ అతను యూనివర్సిటీ లో. . హైస్కూల్ లో, ఇంటర్ లో క్లాస్ మేట్ తనకు. ఎంసెట్ తర్వాత అతను ఏదో జంతుశాస్త్రం వైపు. . తను మెడిసిన్ వైపు. . దారులు మారి. . మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత. . మొన్న జగదాంబ సెంటర్ లో కనబడ్డప్పుడు. . ఆశ్చర్యం.
ఇంటర్ లో ఉన్నప్పుడు. . ఈ శంకరమే ప్రేమ లేఖ రాశాడు తనకు. ఐ లవ్ యూ అని. దాన్ని ప్రిన్స్ పాల్ కు చూపించి గొడవ చేసింది తను. పెద్ద ఇష్యూ ఐందది. తర్వాత ఓ వారం రోజులు అతన్ని కాలేజ్ నుండి బహిష్కరణ. వెంటనే ఏడాది పరీక్షలు రావడం. . బిజీ బిజీ. . ఆ తర్వాత సెలవులు. . వేసవి. . కోచింగ్ లు. . ఎం సెట్. . మెడికల్ సీట్ రాగానే. . వరంగల్లుకు పరుగు కాకతీయ మెడికల్ కాలేజ్ లో చేరడానికి.
శంకరం ఏమయ్యాడో తెలియదు. మరిచేపోయింది తను.
యం బి బి ఎస్ తర్వాత. . పి జి. . గైనకాలజీ. . ఉస్మానియాలో. అటు పరుగు. వెంటనే పెళ్ళి. నిరంజన్ తో. నిరంజన్ ఒక సైంటిస్ట్. నానో టెక్నాలజీలో డాక్టరేట్. నిరంతరం ఒకటే పరిశోధనలు. రాత్రింబవళ్ళు. . చుట్టూ ఉన్న ప్రపంచం తెలియని తనదైన ఒక పిచ్చి లోకం. అందులోనే నిద్ర. . అందులోనే మెలకువ. అందులోనే తిండి. . అందులోనే దివారాత్రాలు పరిశోధనలు. . జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒకటే తిరుగుళ్ళు. . సెమినార్స్. . పేపర్ ప్రజంటేషన్స్. . డిస్ కషన్స్. . చర్చలు. బయట పత్రికల, జర్నల్స్ ప్రశంసలు.
తన ప్ర్రక్కన ఒక యవ్వనవతియైన భార్య ఒకతుందన్న స్పృహ ఉండదు. ఆమె పట్ల భర్తగా తన విద్యుక్త ధర్మ నిర్వహణ. . ఒక మగవాడిగా ఆలనా పాలనా . . కొంత శృంగార అభిరుచి. . ఉహూ. . ఇవేవీ లేవు.
ఒకటి. . రెండు. . మూడేళ్ళు.
సిస్టం ఈజ్ పారలైజ్డ్.
అప్పటికే తనకు ప్రభుత్వ గైనాకలజిస్ట్ గా ఉస్మానియాలో ఉద్యోగం వచ్చి. . . నాలుగేళ్లు జరిగి. . ట్రాన్స్ ఫర్. . టు వైజాగ్. . కింగ్ జార్జ్ హస్పిటల్.
ఒక నిప్పు ప్రతిష్టితమైంది. ఎన్నడూ ఆరని నిప్పు. కణికలా నిత్య ప్రజ్వలితంగా గుండెల్లో దివారాత్రాలు దహించే నిత్యాగ్ని. . శృంగారాగ్ని.
ఒక వస్తువు మనకు దొరకడం లేదనప్పుడు మనిషికి ఆ వస్తువుపై ఇంకా ఇంకా ఆసక్తి, దాన్నే పొందాలన్న ఆరాటం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. నిరంజన్ అసలు ఏమిటి. అతనికి ఇంత అందమైన భార్య ఎదుట ఉన్నా అతి సహజమైన సెక్స్ పట్ల ఎందుకు ఆసక్తి లేదు. లోపమా ఏదైనా. ఆ లోపం ఎలాంటిది. శారీరకమైందా. మానసిక మైందా.
ఒక గైనకాలజిస్ట్ గా అధ్యయనం చేసింది తను.
నిజానికి మనుషుల యొక్క సకల శారీరక, మానసిక, ప్రవర్తనా చర్యలను శాసించేవి ఆ వ్యక్తియొక్క జన్యువులే. జీన్స్ అనబడే భగవత్ నిర్మిత వ్యవస్థే ఆన్ని శారీరక హృదయానుగత అనుభవాలనూ, అనుభూతులనూ సృష్టిస్తుంది. నిర్వహిస్తుంది. . నియంత్రిస్తుంది. డోపమైన్ డి 4 అన్న న్యూరో ట్రాన్స్ మిట్టర్ డోపమైన్ సర్క్యూట్స్ ద్వారా ఎప్పటికప్పుడు మెదడు తో అనుసంధానమౌతూ సెక్స్ ప్రతిఫలనాలను ప్రసాదిస్తూంటుంది. పురుషుల్లో ఐతే టెస్టో స్టిరాన్ హార్మోన్స్. . స్త్రీలలో ఐతే ఈస్ట్రోజెన్ హార్మోన్స్ తమ తమ స్రావాలతో వాటి సమర్థతను బట్టి సెక్స్ సామర్థ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ స్రావాల శాతాన్ని బట్టీ, నిరంతరతను బట్టి , దీర్ఘతను బట్టీ స్త్రీలు పురుషులు తమ తమ పార్శ్వ, లేదా పూర్ణ స్త్రీత్వాన్నీ, పూర్ణ పురుషత్వాన్ని పొందుతారు. ఈ భౌతిక నిర్మాణం లో ఏదైనా ప్రకృతిసిద్ధ లోపం గనుక ఏర్పడినట్లైతే ఇక ఆ మనిషి అందుకనుగుణంగానే లోపభూయిష్టమై అసహజ ప్రవర్తనతో ప్రవర్థిల్లుతాడు. స్త్రీలు కూడా అంతే. . తక్కువ శృంగారేచ్ఛ. మితిమీరిన శృంగారేచ్ఛ. . అంతా యాంత్రిక నియంత్రణలే. ఈ గ్రంథుల సమర్థత, స్రావ సామర్థ్యం బట్టి అదృష్టం. అంతే.
కొన్ని పరీక్షల ద్వారా తాను తెలుసుకున్నది. . నిరంజన్ లో. . ఏదో హార్మోన్ లోపముందని. ఒక గైనకాలజిస్ట్ గా దానికి తగిన చికిత్సను సూచించినప్పుడు. . అతను ఏనాడూ సహకరించలేదు. పైగా ఎంతో నిర్లిప్తతను వెలిబుచ్చాడు. అనాసక్తతను ప్రదర్శించాడు. నిర్వేదం ఆవహించిన ఋషిలా ఒక శూన్యమైన నవ్వు నవ్వి అక్కడినుండి నిష్కృమించాడు.
తన జీవితం ఇక శాశ్వతంగా అడవిగాచిన వెన్నెలేనా. ఎంతో కలలుగన్న తన సకల శృంగారేచ్ఛలన్నీ ఎడారిలో వసంతాలేనా. . ఈ అందం. . ఈ సౌందర్యం. . ఈ తన శారీరక ముగ్ధ మనోహర దివ్యత్వమంతా వృధాయేనా.
వీటికతీతంగా. . అతి సహజంగా తన కోరుకుంటున్న మాతృత్వమో. . తను తల్లి కావడమో. . అదెలా. ?
అందుకే. . ఏదో జాతీయ సెమినార్ లో పాల్గొనేందుకు అర్జంట్ గా గంట క్రితమే ఢిల్లి వెళ్ళేందుకు వైజాగ్ ఏర్ పోర్ట్ కు బయల్దేరిన నిరంజన్ లేని ఈ సమయాన్ని ఎంచుకుని . . ఎంతో ధైర్యంగా. . సాహసంతో. . శంకరాన్ని ఆహ్వానించింది తను.
శంకరం మొన్న జగదంబ సెంటర్ లో అనూహ్యంగా తారసపడ్డప్పుడు అతనే గుర్తుపట్టి పలకరించాడు. . కాఫీ తాగుదామని పిలిచాడు. డాల్ఫిన్ కు వెళ్ళారిద్దరూ. ఒక పావుగంట. అదీ ఇదీ మాట్లాడుకుంటున్న తరుణంలో అతనే అన్నాడు చటుక్కున “పుష్పా ఐ స్టిల్ లౌ యూ” అని.

తను అడుగలేదు. . నీకు పెళ్లైందా. . పిల్లలెందరు. . ఏ ఏజ్ వాళ్ళు. . నీ భార్య ఏమిటి. . అని.
జన్యు నియంత్రణలో బానిసగా ప్రవర్తించవలసిన ఒక స్త్రీగా . . అకస్మాత్తుగా లోలోపల విజృంభించిన సెక్స్ తుఫాన్ లో. . ఒక కాగితపు ముక్కలా కొట్టుకుపోతూ,
“శంకరం. . రేఫు సాయంత్రం ఏడు గంటలకు దొండపర్తి లోని మా ఇంటికు కాఫీ కోసం రారాదు ” అని ఆహ్వానించింది. అడ్రస్ ఉన్న తన విజిటింగ్ కూడా ఇచ్చి. . ఒక అయస్కాంత చూపుని విసిరింది.
ఒక్కోసారి ఒక చూపే వంద పేజీల సంభాషణను నెరుపుతుంది.
శంకరం సరే నన్నాడు.
ఇప్పుడు శంకరం రాకకోసమే ఎదురుచూపు.
డాక్టర్ పుష్ప. . తన ఐపాడ్ లో మరో కవిత్వ వాక్యాన్ని రాసుకుంది.
ఉరుములూ మెరుపులూ ఎప్పుడొస్తాయో తెలియదు
తలుపులను తెరుచుకుని వసంతాలు
ఒక్కోసారి అదృష్టమై వర్షిస్తాయి.
చీకటి పడ్తోంది. లేచి బాల్కనీలో నుండి. . లోపలికి హాల్లోకి వస్తూ బెడ్ రూంలోకి తొంగి చూచింది. లోపల మంచం మల్లెలను కప్పుకుని వెన్నెల తిన్నెల్లా ఉన్నయి. గాలి నిండా కునేగా పర్ఫ్యూం. మత్తు.
ఫోన్ మ్రోగింది. ఆతురతగా ఎత్తింది శంకరమనుకుని. నిరంజన్. అదిరిపోయింది. . ” ఫ్లైట్ అరగంట లేట్ ‘ అని పేట్టేశాడు.
సరిగ్గా అప్పుడే బయట కార్ ఆగిన చప్పుడు. చకచకా ఉరికింది. శంకరమే. శరీరం నిండా వేయి ఓల్టుల విద్యుత్తు.
శంకరాన్ని వెంత తీసుకుని. . మెట్లెక్కుతూ,
శంకరంలో అదే ఉత్సాహం. . అదే ఆకర్షణ. . అదే మగతనం. . టెస్టొస్టిరాన్ రిచ్. . తను ఈస్ట్రోజెన్ రిచ్.
పైకొచ్చి. . హాల్లో కూర్చుని. . కొంచెం ముచ్చట,
ఇంట్లో ఎవరూ లేకుండా ఏర్పాటు చేసుకుంది తను. ఇప్పుడంతా లైన్ క్లియరే.
“తప్పు చేస్తోందా తను ”
ఏ వందవసారో. . ఈ ప్రశ్న పొద్దటినుండి. తప్పొప్పులు అన్నీ సాపేక్షాలు. ఒట్టి నిర్వచితాలు. తనొక విధి వంచిత. స్వయం న్యాయంకోసం పరితపిస్తోంది. . ఇది తప్పెలా ఔతుంది. భర్తగా నిరంజన్ ఇవ్వలేనిదాన్ని తను శంకరం నుండి పొందబోతోంది. అంతే.
సర్ది చెప్పుకుంది పుష్ప. ధైర్యం తెచ్చుకుంది.
“కాఫీని మా బెడ్ రూంలో తాగుదాం రా శంకరం అంది” ప్రక్కనున్న శయన మందిరంలోకి అతన్ని తీసుకుపోతూ.
శంకరం కు అంతా అర్థమౌతోంది. అతను ఇక విజృంభించబోయే తుఫానులా ఆయత్తమౌతున్నాడు.
ఇద్దరూ మెట్లెక్కి వెళ్తూండగా ఎదుట వాచ్ కనబడింది ముప్పావు గంటయ్యింది తనొచ్చి అనుకున్నాడు శంకరం. బెడ్ రూంలో కూర్చుని. . ఎదుట మంచంపై పుష్ప ఆసీనురాలౌతూండగా. . కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కి పడ్డారిద్దరూ. ఆమె గబ గబా బైటికి పరుగెత్తుకొచ్చి, శంకరం కూడా హాల్లోకి అడుగులేస్తూ,
ఎదురుగా. . గుమ్మంలో నిరంజన్ చేతిలో బ్రీఫ్ కేస్ తో.
“ఏమైంది. . ఫ్లైట్. . ” ఏదో అనబోయింది. . తత్తరపడ్తూ.
“ఐ డ్రాప్డ్ మై ప్రోగ్రాం. . ఇది చూడు. . ” అని ఒక కవర్ ను అందించాడామెకు.
భార్యను తీసుకుని బెడ్ రూం వైపు నడుస్తూ,
మధ్యలో అవాక్కై బిక్కమొగంతో చూస్తున్న శంకరాన్ని పరిచయం చేద్దామని పుష్ప ప్రయత్నించింది. నిరంజన్ పట్టించుకోలేదు. బెడ్ రూంలోకి వెళ్ళాడు. శంకరం దిక్కు నిస్సహాయంగా చూస్తూ పుష్ప అతని వెంట వెళ్ళింది.
” ఇది. . నేను గత ఏడాదిగా పూణాలో ఉన్న ప్రభుత్వ అనాథ శరణాలయం నుండి మనం కోరుకున్న పిల్లాడిని దత్తత తీసుకోడానికి ప్రయత్నిస్తున్న బాపతుకు సంబంధించి లీగల్ గా అనుమతినిస్తూ వచ్చిన లెటర్. . మనం రేపు ఉదయం పూణా వెళ్తున్నాం. . గెట్ రెడీ. . ” అంటున్నాడు. . కోట్ విడిచి టై లూజ్ చేసుకుంటూ.
అవాక్కై.. కంగు తింటున్న పుష్ప సర్దుకెనేంతలొ నిరంజన్ అన్నాడు. . ” మనిషిని జన్యువులే కదా మనిషి ప్రవర్తనను నియంత్రించేవి. . టెస్టో స్టిరాన్ మగాడి మగతనాన్ని. . ఈస్ట్రోజెన్ ఆడవాళ్ళ ఆడతనాన్ని. . ఊ. . ఐతే. . ఒక మగాదిలో ఎందుకు తగినంత టెస్టొస్టిరాన్ సృష్టించబడలేదు. . అదే విధంగా ఒక స్త్రీలో ఎందుకు ఈస్ట్రోజెన్ తగినంత స్రవించడంలేదు. . దానికి కారకులెవ్వరు. మనం కారణాలను కనుక్కోగలిగాం కాని. . ఆ కారకాల మూలాలను కనుక్కోలేకపోతున్నాం. సముద్రంలో ఉపతితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయని సాటిలైట్ల ద్వారా కనుక్కుని ఒహో అని మురిసిపోతున్నాం కాని. . అసలు ఆ ఆవర్తనమో. . తుఫానో. . సుడిగుండమో, సునామో ఎందుకు ఏర్పడ్తోందో తెలుసుకోలేకపోతున్నాం. అది సృష్టి. . అది భగవంతుడు.
మనిషి సృష్టి చేతిలో. . సో కాల్డ్ భగవంతుడి చేతిలో కీలు బొమ్మ.
కమాన్. . రేపటి నుండి. . నువ్వు ఒక దేవుడిచ్చిన కొడుక్కి తల్లివి. ఎ మథర్. అన్నీ సెక్స్ లోనే ఇమిడిలేవు పుష్పా. . సెక్స్ కంటే అతీతమైన , పరమమైన, మహత్తరమైన జీవితం ఉంది. . తెలుసుకోవాలి. . అంతే. . కమాన్. . ” అని హాల్లో ఉన్న శంకరాన్ని కలుసుకునేందుకు కదిలాడు.
వెనుక డాక్తర్ పుష్ప నడుస్తోంది.
అప్పుడామె నిర్వికారంగా. . మేఘాలు చెదురుతున్న ఆకాశంలా ఉంది.

*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *