March 29, 2024

తృప్తి

రచన: ఆచార్యులు జీ. వీ యస్

“కాఫీ తాగావురా రాఘవా?”…
పేపర్ చదువుతున్న నలభై ఏళ్ల కొడుకుని, వినిపించుకోలేదేమోనని ఇంకోసారి అడిగారు
ఉదయం పూట ఎండకోసం, వరండాలో స్తంభానికి జారగిలపడి కూర్చుంటూ రాఘవ అమ్మగారు ఎనభై ఏళ్ల తాయారమ్మగారు.
” ఆబ్బా! తాగానమ్మా ‘ …..
పేపర్ లోంచి తల బైట పెట్టకుండా బిజినెస్ వార్తలు చదువుతూ విసుగ్గా అన్నాడు
బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న రాఘవ.
ఏమిటో…
చిన్నప్పటినుంచి వీడికి చిరాకు, విసుగు ఎక్కువే, ఎవరి పోలికలు వచ్చాయో…
ఆ బ్యాంకులో కూడా అందరి మీదా ఇట్లాగే విసుక్కుంటాడో ఏమో, పిల్లాడు పుట్టినా కానీ వీడికి సౌమ్యంగా ఉండటం తెలియట్లేదు ఏమిటో… అనుకుంటూ
అంతలోనే తనే ‘అయినా కానీ వాడి విసుగులో తప్పేముంది పాపం. ఉదయం లేచిన దగ్గరనుంచీ ఈ పేపర్ చదివే పది నిమిషాలు తప్ప మిగిలిన సమయమంతా హడావుడే కదా.. పిల్లాడిని స్కూల్లో దింపి రావడం, స్నానం చెయ్యడం, దూరం నుంచే దేవుడికి సెల్యూట్ చెయ్యడం, ఈ లోపు ఎవరైనా ఫోన్ చేస్తే వారికి ఒక ప్రక్క సమాధానం చెప్తూనే, ఆదరాబాదరా నాలుగు ముద్దలు గొంతులో కుక్కుకోవడం,
ఈ మధ్యలోనే సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటికి తీసుకు రావలసిన లిస్టు చదువుతున్న భార్య మాటలు, మైండ్ కి కొన్ని ఎక్కించుకొని, కొన్ని వదిలేస్తూ, ఆఫీసుకి పరిగెత్తడం, అక్కడ అడ్డమైన చాకిరీతో అవస్థలు పడటం, అలసి పోయి ఈసురోమంటూ కాలీడ్చుకుంటూ ఇంటికి జేరటం ఇదే కదా, పాపం వాడి దినచర్య,
పేపర్ చదివే పదినిమిషాల అయినా ప్రశాంతంగా చదువుకోనివ్వకుండా, నా కాలక్షేపపు ప్రశ్నలతో వాడిని విసిగిస్తే చిరాకు రాదూ మరీ….’ అని సరిపెట్టుకుంటూనే,
ఒక్క పదినిమిషాలు నాతో కూడ ఆప్యాయంగా మాట్లాడితే బాగుణ్ణు అని ఆశపడుతూ
పోనీలే పాపం ఈ విధంగా అయినా వాడిని రోజూ చూస్తున్నాను, ఏదో యిల్లు సరిపోవడం లేదని ప్రక్క యింటిలో అద్దెకు వుంటున్నాడు, కానీ, పేపర్ చదవడంతో పాటు నన్ను కూడా రోజూ వచ్చి చూసి వెడుతున్నాడు కాబట్టి సరిపోతోంది. అదే వేరే వూరులో ఉద్యోగ్యం అయితే ఈ మాత్రం అవకాశం కూడా వుండదు కదా, వాడికీ మనసులో ప్రేమ వుంటుంది, కానీ అస్తమానం బయట పడడు,
కోడలు మాత్రం, ఆటొచ్చి ఒక్కసారి, ఇట్టొచ్చి ఒక్కసారి, అత్తయ్యగారు, అత్తయ్యగారు, అంటూ ఒక్కక్షణం వదలదు కదా.. అని తృప్తిగా అనుకున్నారు మనసులో రాఘవ అమ్మగారు తాయారమ్మ గారు…..
ముప్పై ఏళ్ళ తర్వాత….
“ఏరా నాన్నా ఆఫీస్ పనిలో ఉన్నావా ” అంటూ
కరోనా పుణ్యమా అని ఇంటిలోంచే laptap లో ఆఫీస్ పనిచేస్తున్న కొడుకుని పలుకరించబోయారు డెబ్బై ఏళ్ళ రాఘవ
” అవును డాడీ” అంటూ, ఏమిటీ ? అన్నట్టు ఒక్కసారి తలప్రక్కకు తిప్పి, మరల laptap లో దూరిపోయాడు, software ఉద్యోగి, రాఘవ కొడుకు.
ఏమిటో వీడు, వీడి software ఉద్యోగం, అస్తమానం ఆ laptap ముందేసుకూర్చుంటాడు, అది వదిలితే సెల్ ఫోన్, సెల్ ఫోన్ వదిలితే లాప్ టాప్, ఏదైనా పలకరిస్తే చిరాకు, విసుగు, అన్నీ నా పోలికలే వచ్చినట్టున్నాయి అని అనుకుంటూ,
అంతలోనే ‘అవునులే పాపం, ఇంత కష్టపడకపోతే ఈ రోజుల్లో సంసారాలు జరగడం కష్టమే, మాలాగా వీళ్ళకి పెన్షన్లు ఏవీ ఉండవు, అంతకంటేకూడా మాలాగా అరవై సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే ఓపిక వీళ్ళకి అస్సలు ఉండదు. ఈ రోజు కష్టపడితేనే రేపు నిశ్చింతగా ఉండేది, ఒంట్లో ఓపిక వుండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలిగా మరి.
మునపటిలాగా వీళ్ళకి తాతల నాటి ఆస్తిపాస్తులేమీ లేవు, అంతా రెక్కల కష్టం మీదే ఆధారం వెధవది, రెండు నిమిషాలు ఫోన్ మాట్లాడితేనే మాకు తలకాయ వాచిపోతుంది, అటువంటిది అస్తమానం ఆ ఫోన్ తోనే పని చెయ్యాలంటే పాపం పిల్లలు ఎంత నలిగిపోతున్నారో, ఏదో ఆఫీసు పనిలో అలసిపోయి చిరాకే కానీ, నేనంటే ఎంత ప్రేమో, ప్రేమని వ్యక్తం చెయ్యడం మాత్రం చేతకాదు పిచ్చి వెధవకి,
అయినా ఎదురెదురుగా వుంటున్నపుడు అస్తమానం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు ఏమి వుండవు కదా’ అని సానుభూతితో నిట్టూరుస్తూ…
ఇంకా నయం ఉద్యోగం కోసం ఏ విదేశాలో వెళ్ళిపోకుండా, ఇక్కడ నన్ను కనిపెట్టుకుని, నా మంచీ చెడు చూస్తూ కళ్ళెదుటే తిరుగుతున్నారు, నా కొడుకు కోడలు. ఇది చాలదూ ఈ వయస్సు లో నాకూ… తృప్తి గా అనుకుంటూ
అప్రయత్నంగా అలమారలో ఉన్న అమ్మ ఫోటో పై చూపు సారించాడు రాఘవ.
ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చింది అప్రయత్నంగా కళ్ళు రెండూ చెమర్చాయి రాఘవకి
” అమ్మా, నాగురించి కూడా ఇట్లాగే తృప్తి పడుతూ, సరిపెట్టుకున్నావమ్మా , అప్పుడు ” అనుకుంటుంటే
ఒక్కసారిగా రాఘవ గుండె తెలియని బాధతో మెలికలు తిరిగింది…..

********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *