February 27, 2024

మొసలి రామలింగేశ్వర ఆలయం “పవర”

రచన: రమా శాండిల్య

 

ఈ మధ్య నేను  ఒకరి ఇంటిలో జరిగే పౌర్ణమి పూజలు, అభిషేకాలు, హోమాలు చూసి రావటానికి తూర్పుగోదావరి  జిల్లాలోని కాకినాడకు వెళ్ళాను.

ఆ పూజలు, యాత్రలు అన్నీ అయి,  పిఠాపురం, ద్రాక్షారామం అన్నీ చూసేసాక,  బెంగుళూర్ తిరుగు ప్రయాణం అయ్యాను. నా ప్రయాణం రోజున ఉదయం మా అక్క, ఇక్కడికి దగ్గరలో ‘పవర’ అనే గ్రామంలో శివాలయం ఒకటి ఉంది. చూసి వద్దాము.” అన్నది.

సరే అనుకుని…  ఒక ఆటో మాట్లాడుకుని ,  సామర్లకోట మండలంలోని పిఠాపురానికి దగ్గరలో ఉన్న పవర అనే గ్రామంలో ‘మొసలి రామలింగేశ్వర స్వామి’ కొలువై ఉన్న ఆ దేవాలయానికి ప్రయాణమయ్యాము. వెయ్యి సంవత్సరాల పురాతన విగ్రహం ఇది.  పది సంవత్సరాల క్రితం, ఎండోమెంట్ శాఖ వారు…  శిథిలావస్థకు వచ్చిన ఆలయాలు బాగుచేసే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈ గుడిని కూడా చేర్చారు.   శిథిలమౌతున్న  ఆ గుడికి, వంశపారంపర్యంగా సేవ చేసుకుంటున్న ‘నాగప్రసాద్'(నాగ బాబు) గారిని అర్చకులుగా, EO గా నియమించి జీర్ణావస్థలో ఉన్న ఆ ఆలయాన్ని వృద్ధి చేయిస్తున్నారు.

ఆ ఆలయంలోని విగ్రహం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.

బాలా త్రిపుర సుందరీ సమేత మొసలి రామలింగేశ్వర స్వామి విగ్రహం. ఆ విగ్రహాన్ని చూస్తుంటే అచ్చు మొసలి ఆకారంలో, మొసలి కన్నులతో సహా అలాగే ఉంది.  ఈ ఆకారంలో ఉన్న శివలింగాన్ని ఎప్పుడూ చూడలేదు.

 

 

ఇక్కడి స్థలపురాణం:

 

వెయ్యి సంవత్సరాల క్రితం అక్కడంతా చెరువు ఉండేదట. దానినానుకుని పల్లెవాసులుండేవారట.

ఒక రోజు ఒక చిన్నపిల్లవాడు ఆడుకుంటూ చెరువులో పడిపోయాడట. ఆ పిల్లవాడి తల్లి ఆ చెరువు గట్టునే కూర్చుని శివుడిని ప్రార్థించిందట. దానికి శివుడు మొసలి రూపంతో ఇక్కడ మీతోనే ఉంటానని మాటిచ్చాడట. అలా మొసలిరూపంలో అక్కడ వెలసిన ఆ స్వామి  ఇప్పటికి పూజలందుకుంటున్నాడు.

చిన్న గ్రామంలో ఉన్న ఈ దేవాలయం చాలా బావుంది.

ఈ మధ్యే జరిగిన విశేషం, అక్కడి అర్చకులు చెబుతుంటే విన్నాను.

పిఠాపురం పురూహుతికా అమ్మవారి మెడలో సాలగ్రామ మాల ఒకటి ఉంటుంది. అలాంటి ఒక మాల ఇక్కడి బాలాత్రిపురసుందరి అమ్మవారికి చేయించి వేయాలని అర్చకుని కోరిక.

ఎవరో కాశీ వెడుతుంటే వారికి 108 సాలగ్రామాలు తేవాలని కోరాడట. వారు అవి తీసుకురావటం చూసి, వాటిలో ఒకటి రెండు సాలగ్రామాలు సరిగా లేవనిపించి, మాల తయారు చేయించకుండా అలాగే ఉంచేసాడట.

ఒక సోమవారం స్వామివారి విగ్రహానికి  ఏకాదశ రుద్రాభిషేకం చేసి, ప్రక్కన పళ్ళెంలో ఉన్న సాలగ్రామాలు శుభ్రపరచి అలంకరించాడుట.  అది చూసి వారి పెద్దబ్బాయి స్వామివారు చాలా అందంగా ఉన్నారని, ఒక వీడియో తీసి వారి చుట్టాలకు పోస్ట్ చేశాడట. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి చాలా మందికి తెలిసింది. ఆ సాలగ్రామాల మహిమ వలననే ఈ ఆలయ ప్రభావం బయటకు వస్తున్నది అని ఆ అర్చకుని భావన.

అలా అనుకోకుండా ఆ స్వామివారిని చూసి రావటమైంది.

కాకినాడ పిఠాపురం హైవే మీదనుంచి, ఆరు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి ఎడమ ప్రక్కన కొబ్బరి తోటలు, చేల మధ్యలో అందమైన  ప్రకృతి ఒడిలో  ఉన్న చిన్న గ్రామంలో ఊరి చివర ఉన్న ఆలయం. లోపలికి వెడుతుంటే, ఊరి గ్రామదేవత నూకలమ్మా విజయదుర్గ అమ్మవారు కొలువుదీరి ఉంటారు.

వెనుక శివపంచాయతనం అయిన గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, బాలాత్రిపురసుందరి, సూర్యనారాయణుడు, సమేతంగా మొసలిరామలింగేశ్వరుడు  కొలువై ఉంటాడు.

స్వామి వారి దగ్గరకు అడపా దడపా వెళ్ళేవారట భక్తులు. అలాంటిది ఇప్పుడు ప్రతి రోజు ప్రత్యేకంగా చాలామంది స్వామివారి దర్శనార్థం వస్తున్నారని చెప్పారు.

 

ఇక్కడ ప్రత్యేక పూజలు:

కార్తీకమాసం మొత్తం రుద్రాభిషేకం, గణపతి నవరాత్రులు,  సుబ్రహ్మణ్య  షష్ఠి, దేవీనవరాత్రులు,

వైశాఖ బహుళ ఏకాదశి స్వామివారి బ్రహ్మోత్సవం ఐదు రోజులపాటు నిర్వహిస్తారట. ఐదవరోజు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారట. ఆరవరోజు శ్రీ పుష్పయాగం, అన్నదానాలు ఉంటాయట.

శివరాత్రి రోజు ఉదయం నుంచీ అర్థరాత్రి లింగోధ్బవ కాలంవరకూ అభిషేకాలు చేస్తారట.

నాకు ఏమనిపించిందంటే, ఎంతటి భగవంతుడు కానీ, మాములు మనిషి కానీ సమయమే చూస్తుంది. ఈ సమయం వరకూ జీర్ణావస్థలో ఉన్న ఆలయం ఇప్పుడే బాగుచేసి పూజలు జరగటం అన్ని కూడా కాల మహిమే అనిపించింది.

ఆ ప్రక్కకు వెళ్ళినప్పుడు స్వామివారిని, అమ్మవారిని తప్పక దర్శించుకోవలసిన ఆలయం ఇది.

 

 

* * *

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *