March 31, 2023

మోదుగపూలు – 9

రచన: సంధ్యా యల్లాప్రగడ

మామిడిపల్లి వచ్చాక. ఊపిరి హాయిగా పీల్చినట్లు ఫీల్‌ అయ్యాడు వివేక్‌.
ఊరి నుంచి మామిడిపల్లి రాగానే రెండోరోజు రాము ఉన్నాడేమో అని వారింటికెళ్ళాడు.
రాము ఇంట్లోనే ఉన్నాడు. బుక్సు ముందరేసుకొని, చదువుతూ, రాస్తూ…
“ఎలా గడిచింది సిటీలో? రావాలనిపించిందా?” అడిగాడు స్నేహంగా చూస్తూ.
“ఆ! అస్సలు వెంటనే రావాలనిపించినా పనులు చూసుకువచ్చాను. అసలు ఉండలేకపోయాను బాబు ఆ పొల్యూషన్ లో. ఇన్ని రోజులు ఎలా ఉన్నానా అని నాకే వింతగా ఉంది” అన్నాడు వివేక్ నిజాయితిగా.
ఆశ్చర్యపోవటం రాము వంతైంది. అందరూ ఇక్కడ కామ్‌గా ఉంటుందని, సిటికీ పారిపోవాలనుకుంటారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మరి వింతేగా…
అదే మాట అన్నాడు “అందరూ ఈ నిశబ్ధం భరించలేమంటారు. నీవు వెరైటీగా చెబుతున్నావు” అని.
“ఏమో. నాకనిపించిన విషయం చెప్పాను. మేబీ నాలో ఉన్న గిరిజన రక్తం కావొచ్చు. లేదా నేను వెతుక్కుంటున్న నా మూలాలు కావచ్చు” అంటూ మళ్ళీ తానే “రాము నాకో ఆలోచన వచ్చింది… అసలు నాయన తన ఉనికిని దాచుకున్నాడంటే బహుశా వాళ్ళ తెగ నుంచి వెలి వేయ్యబడి ఉండాలి. లేదా ఆయన మీద కేసులేమైనా ఉండాలి. కేసులున్నాయేమో చూడాలంటే ఆయన అసలు పేరు తెలియాలి. గూడెం లో వెతకాలన్నా ఆయన పేరు కట్టు తెలియాలి, ఏమీ తెలియకుండా వెతకలేను. ఆయన ఫోటో చూపించి గూడేలాలో ముసలాళ్ళని అడిగాలి. ఏమంటావు?” అన్నాడు డీప్ గా చూస్తూ.
“అలాగే చేద్దాం. మా గైడ్ అప్రూవ్ చేస్తాడు నా వర్కును. ఇక నేను ఇక్కడ్నుంచే రాసుకోవచ్చు. లైబ్రరీలో పని ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ఆయనను మధ్యమధ్య కలిసి నా నోట్స్ చూపటమే. కాబట్టి మనము కలసి వెతకవచ్చు” ఎంకరేజింగుగా అన్నాడు రాము.
తల ఊపి సెలవు తీసుకున్నాడు వివేక్‌.

***

అతనికి ఆ రెండోరోజే ట్రైనింగని టీచర్లు అందరూ కరీంనగరు వెళ్ళాల్సి వచ్చింది.
వచ్చాక గూడేలకు వెళ్ళి పిల్లలను స్కూలుకు తీసుకురావలసిన పని పడింది.
అతను మామిడిపల్లి తప్ప మరో గూడేం చూడలేదు.
అడవిలో జీపు వెళ్ళిన మేర జీపులో వెళ్ళటం, జీపు వెళ్ళలేని చోటులకు నడచి వెళ్ళటం చేశారు.
అన్నీ యాబై, వంద గడపలు. కొన్ని అయితే కేవలం పది ఇరువై గుడిసెలు. అసలు గుడిసెలు కూడా లేని చోట్ల తడికలు పెట్టుకు, పైన తడికలు ఉంచుకు నివాసం. అవి పోతే మళ్ళీ తెచ్చుకు పెట్టుకోవటం. సంచారజాతుల తీరది. పేదరికం నడుమనున్నా హ్యాపిగా ఉన్నారంతా.
గిరిజనులకు పెద్ద హంగామాలు పోరు. ఆడంబరాలు ఉండవు. అవసరాలకు మించి వారు ఏదీ ఉంచుకోరు. గూడెం మధ్యలో నాలుగు తడికిల మధ్య ఒక కర్రో, రాయో ఉంచుతారు. అది వారి దేవుడు. సాయంకాలాలు రామభజన చేస్తారు. గిరిజనులకు సీతారాములు పరమ దేవుళ్ళు. హనుమంతుడు వారికి పరమ పూజ్యం. వారి గూడెం రక్షించేది హనుమంతులవారేనని నమ్మకం.
పిల్లలు మట్టిలో ఆడుకుంటారు.
చాలా మటుకు వారు వ్యవసాయము, గొర్రెల పెంపకము వంటివి చేస్తారు. అడవిలో ఉండే భిల్లులకు వేటనే ప్రధానం. భూమి త్రవ్వటం పాపమని భిల్లుల నమ్మకం. భూమి తల్లిని దున్నటమంటే తల్లిని గాయపర్చటమని నమ్ముతారు. కొందరు కేవలము అడవిలో పళ్ళు దుంపలు సేకరించి వాటిని సంతలో ఇచ్చి కావలసిన సరుకులు తెచ్చుకుంటారు. (బార్టర్ పద్ధతి)
వారు కటిక దారిద్యములో ఉన్నా స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు.
అడవి లోలోపలి గూడెలలో ఈ విషయాలను వివేక్‌ గమనించాడు. గిరిజనులలో మార్పులు కూడా వస్తున్నాయి. చాలామంది గిరిజనులు తమ పిల్లలు చదువుకోవాలని, వారు సాంఘికంగా పైకెదగాలని భావిస్తున్నారు. ఈ పాఠశాల చుట్టు ప్రక్కల ఆ మార్పు కూడా ప్రస్ఫుటంగా కనపడింది.
ఇలా పిల్లలను తేవటముతో పదిహేను రోజులు గడిచింది.
స్కూళ్ళు మొదలయ్యే సరికి ఏరువాక వచ్చింది.

****
ఏరువాక పండుగ భూమి పండుగ. అది రైతులకే కాదు గిరిజనులకూ, ఆదివాసులందరీకి ఎంతో ముఖ్యమైన పండుగ.
రాము, వివేక్‌ను తన ఇంటికి రమ్మని పిలిచాడు.
ఆ పండుగ మూడు రోజులు చేస్తారు.
తొలకరి జల్లులను స్వాగతిస్తారు అందరూ కలసి.
వివేక్‌ వెళ్ళే సరికే అందరూ కలసి నృత్యవేడుకలలో ఉన్నారు.
“అడవి తల్లికి దండాలో… మా తల్లి అడవికి దండాలో…
అడవి చల్లగుంటే అన్నానికి కొదవే లేదు
పంటలింటికి వస్తే… పండుగజేసుకుంటాము
జింబకు… జింబకు… జింబకు బాలా… జింబకు జింబకు జంబ”
పాట,.. ఆట… లయ… సంగీతం… అడవి బిడ్డలు అందరూ కలసి ఆడుతున్నారు.
ఆ రోజు అందరూ పాటలు పాడుతూనే ఉన్నారు. రేలా నృత్యాలు ఊరంతా కలిసి ఆడారు.
ఇది మూడు రోజుల పండుగలో తొలిరోజు గ్రామంలో నిత్యావసర వస్తువలు సేకరించి పురుషులు గ్రామశివారులోకి వెళ్ళి వంటలు చేసి, అక్కడే భోజనం చేస్తారు. ఆసమయంలో గ్రామంలోని మహిళలు గ్రామదేవత గద్దెను ముగ్గులతో అలంకరించి, ముగ్గు మధ్యలో ‘కోడిగుడ్డు’ను ఉంచుతారు. మగవారు గ్రామంలో ప్రవేశించగా, మహిళలతో కలిసి బాణాలు, అంబులు ధరిస్తారు. పాటలు, ‘రేలా’ నృత్యాలు చేస్తూ, గ్రామపెద్ద మహిళతో దేవత వద్ద వుంచిన కోటిగుడ్డును బాణంతో పగులగొట్టిస్తారు.
స్త్రీలందరూ కలసి ధింస్సా నృత్యము చేస్తారు. వారి పాటలలో వారి వంశ చరిత్రలను పాడుతూ ఆడుతూనే ఉంటారు. ఊరు మధ్యన పెద్ద మంట పెట్టి మగవారంతా కాళ్ళకు గజ్జలు కట్టి డ్రమ్ములు వాయిస్తూ తిరుగుతూ నృత్యము చేస్తారు. ఆ సాయంత్రము నాడు చేసే నృత్యానికి స్కూలు నుంచి టీచర్లు వచ్చి కలిశారు. అందరూ కలసి నృత్యములో జాయిన్ అయ్యారు. వివేక్‌ను కూడా లాగారు. రాము కూడా పంచె, పైన గులాబీ చొక్కా, నడుముకు పట్టీ, కాళ్ళకు గజ్జేలతో వారితో కలసి నృత్యం చేశాడు. అందరూ కలసి చాలా సేపు ఆడుతూనే ఉన్నారు. రాత్రి ఏ జాముకో ఆగిందది.
ఏరువాక పండుగ అలా చాలా సంభరంగా గడిచింది. ఆ పండుక దాటాక మళ్ళీ స్కూలు పాఠాలతో అంతా బిజీ అయ్యారు.
***
వానా కాలం అడవి తల్లి అందాలతో మెరుస్తోంది… వాగులు పొంగుతున్నాయి అందాలతో…
చిగురించిన కొత్త ఆకులు, పువ్వులతో మెరుస్తూ చూడటానికి అదో పువ్వులతో అలకరించిన బతకమ్మలా ఉంది. ప్రతి రోజూ ఎవో కొత్త సువాసనలు వస్తూనే ఉంటాయి.
టీచరు మిత్రుల ఉదయం కాలి నడకలో వారు ప్రతిరోజు కొక కొత్త పువ్వో ఆకునో చుస్తారు.
అడవి అందం ఎంత చూసినా తీరేది కాదు వివేక్‌కి. మోదుగపూల చెట్లు ఆకులు కనపడనంతంగా పూచి మత్తును విరజిమ్ముతుండేవి. వివేక్‌ లోని కవి ఎవో గీతాలు రాసేవాడు ఆ అడవి అందాలు చూసి.
ఒక పదిహేను రోజుల తర్వాత రాము వచ్చి కలిశాడు. తాను ఫీల్డ్ వర్కుకి అడవిలో తండాలు తిరుగుతున్నానని, కావాలంటే తనతో రావచ్చునని పిలిచాడు. ప్రతి శని,ఆది వారాలు వెళ్ళాలని వివేక్‌ అనుకున్నా… అలా కాదని వారం రోజులు సెలువు తీసుకోమని సలహా ఇచ్చాడు. రాముకు ఒక మోటారు బైకు ఉంది. దాని మీద వారు అడవి చుట్టు ముట్టి రావాలని నిశ్చయించారు. దీని మూలంగా ఎదైనా లింకు దొరికినా, దొరకకపోయినా ఆ ఏరియాతో పరిచయం కలుగుతుందన్న నమ్మకం కలిగింది వివేక్‌కి. రాజుసార్‌ పర్మిషన్‌ తీసుకు చెబుతానని అప్పటికి రాము దగ్గర సెలవు తీసుకున్నాడు వివేక్‌.
రాజు సార్‌తో రాము ప్రయాణం గురించి చెప్పాడు వివేక్.
“అడవి లోతట్టులో మనుషులను తినే తెగ ఉన్నారంటారు వివేక్. వెళ్ళటం రిస్కు అనుకుంటున్నా. నీకు సలహా ఇచ్చేది మాత్రం జాగ్రత్తగా ఉండమని. నీవు వారం రోజులు సెలవు తీసుకుంటానంటే నీ ఇష్టం. ఇప్పుడు పరిక్షలేవీ లేవు కాబట్టి సరే. నీవు మాత్రము జాగ్రత్తగా ఉండు” అని సలహా ఇచ్చాడు.
వివేక్‌కు చెప్పలేనంత ఎగ్జైట్మెంటు కలిగింది. అతను బ్యాగులో మరో డ్రస్సు పెట్టుకు రెడీ అయ్యాడు. రాము వచ్చిన వెంటనే అతని బండి మీద ఎక్కి బయలుదేరాడు.
వాళ్ళు కాలిబాటలా ఉన్న ఆ దారి గుండా ఆ అర్యణంలోకి ప్రయాణం చేశారు. దారిలో ఆ అడవి విశేషాలు అడుగుతూనే ఉన్నాడు వివేక్. వాళ్ళు రెండు గంటలు ప్రయాణించిన తరువాత దారి ఆగిపోయింది. బండి ఆపి దిగాడు రాము. వివేక్‌ చుట్టూ చూస్తూ “ఇక్కడ దారి ఎండ్ అయిందిగా… ఇప్పుడేదీ మార్గం” అన్నాడు బండి దిగి వళ్ళు విరుచుకుంటూ.
“ఇక్కడికి దగ్గరలో కిలోమీటరు దూరంలో ‘చెట్టుదేవర’ ఉంది. ముందు మనం దాన్ని చూసుకు వద్దాం రా” అంటూ అస్సలు దారిలేని ఆ చెట్ల మధ్య నడవటం మొదలెట్టాడు. అడవి అక్కడ మరింత దట్టంగా ఉంది. రాళ్ళ గుట్టలతో, గడ్డితో నడిచే దారి కనపడటంలేదు. ఎక్కడ పడితే అక్కడ మనిషి ఎత్తు పుట్టల విరివిరిగా కనపడుతున్నాయి. వాటి మధ్య అలవాటుగా చకచకా నడుస్తున్నాడు రాము.
అతని వెనుకనే వివేక్ నడుస్తూ “చెట్టు దేవర స్పెషల్ ఏంటి?” అన్నాడు.
“తినబోతూ రుచులెందుకు? కిలోమీటరు ఎంత సేపు నడక..” అన్నాడు వేగంగా కదులుతూ
పది నిముషాల తరువాత వారో ఖాళీ ప్రదేశం చేరారు. అక్కడ మధ్య పెద్ద చెట్టు తప్ప మరో మొక్క లేదు. ఆ చెట్టు చుట్టూ గట్టు కట్టి ఉంది. చెట్టు నుంచి నీరు ప్రవహిస్తూ ప్రక్కగా కాలువ గుండా ఆ నీరు కొద్దిగా దూరంలో ఉన్న చిన్న చెరువులాంటి దానిలోకి పడుతోంది. ఆ చెరువు దాదాపు నిండుగా ఉంది.
రాము ఆ చెట్టు దగ్గరకు చేరి దానిని చుట్టూ ప్రదక్షిణ చేసి చెట్టు నుంచి ప్రవహించే ఆ నీటిని తీసుకు త్రాగాడు. త్రాగి వివేక్‌వైపు చూసి “ఇదే చెట్టు దేవర. సర్వకాలాల్లో నీళ్ళు ప్రవహిస్తూ ఆ చెరువును నింపుతూ ఉంటుంది. ఈ చెట్టు నీరెలా ఇస్తుందో తెలియదు. దేవతావృక్షమని నమ్మకం. ఇది రెండు వందల సంవత్సరాల వృక్షము. ఇది మా దేవత. ఈ నీరు సర్వరోగాలకు మందు. ఇక్కడ మ్రొక్కి, ఈ నీళ్ళు త్రాగి ఏ పని మొదలుపెట్టినా మనకు విజయం తప్పక వస్తుంది. నీవు కూడా చెట్టుకు మొక్కి నీ పని కావాలని కోరుకో. పని జరిగాక మళ్ళీ వచ్చి మొక్కాలి” అంటూ వివరించాడు.
వివేక్ అతను చెప్పినట్లు చేసి, ఆ నీరు త్రాగాడు. అవి కొబ్బరి నీటిలా తీయ్యంగా ఉన్నాయి. రాము తనతో తెచ్చిన వాటర్‌బాటిల్లో నీరు నింపుకున్నాడు. వివేక్‌ అలాగే చేశాడు. ఇద్దరూ తమ పనులు విజయవంతమవ్వాలని కోరుకున్నారు.
“మాకు ప్రపంచం ఎండినా ఈ చెరువు ఎండదు తెలుసా?” అన్నాడు రాము.
“ఇది ఎవరు కనిపెట్టారో?” అడిగాడు వివేక్
“తెలియదు ఎన్ని తరాల ముందు వారు కనిపెట్టారో. నా చిన్నతనం నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉన్నాం. ఈ దేవర నీరు త్రాగుతూనే ఉన్నాం. ఇది టానిక్. ఏ జబ్బులను రానివ్వదు” చెప్పాడు రాము భక్తిగా.
“అవునా. కానీ ఆ నీళ్ళు బలే తీయగా ఉన్నాయిగా. కొబ్బరిబోండాంలా. ఇలా నీళ్ళిచ్చే చెట్ల గురించి నే వినలేదు, కనలేదు. ఇదే మొదటిసారి చూడటం. అడవిలో అణువణువునా వింతలే!” నవ్వాడు వివేక్.
“అదే మరి. ఆ నీటి ముందు కొబ్బరి బోండాం కూడా పనికిరాదు. మేము చాలా రెగ్యులర్ గా తెచ్చి పెట్టుకుంటాం. ఏ టైంలో ఏ అవసరమో అని. లేదా ఊర్లో పిల్లలకి ఎవరికైనా బాగోపోతే ఇవి ఇస్తే ఫట్టున తగ్గాల్సిందేగా” నవ్వుతూ బండిని సమీపించాడు.
ఇద్దరూ బండి ఎక్కి తూర్పు వైపుకు మర్లారు.

ఇంకా వుంది

1 thought on “మోదుగపూలు – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2022
M T W T F S S
« Mar   May »
 123
45678910
11121314151617
18192021222324
252627282930