April 20, 2024

వనితా ! ఓ వనితా !

రచన :ముక్కమల్ల ధరిత్రీ దేవి

వందనం ! నీకు వందనం !
అవనిని సాటి లేనిది నీ ఘనత
ధన్యమగు నీ చరిత
ధరణిలో తిరుగు లేనిదట !
నీకు సరి లేరెవరన్నది
జగమెరిగిన సత్యం !
అవధులెరుగని సహనం నీ సొంతం
అంతులేని ఆత్మవిశ్వాసం నీ ఆయుధం !
ఆకాశమే హద్దుగా సాగుతోందిగా నీ పయనం !
ఇంట ఊడిగం చేస్తావు
బయట ఉద్యోగం చేస్తావు
రెండు పడవల ప్రయాణం
నీకు మాత్రమే సాధ్యం
నీ ప్రతిభకదో తార్కాణం !
అలసట దరిజేరనీయవు
అసలు విరామం కోరవు
“అష్టావధానులు సైతం అచ్చెరువొందే
నీ చేతల చాతుర్యం !!
అనితరసాధ్యం! అది నీకే చెల్లు !
లాలిస్తూ పిల్లల్ని, సేవిస్తూ పెద్దల్ని
మెప్పించే ధన్యజీవివి !
పతిదేవునికి నీవొక దేవతవే !
సహచరిగా నీ పాత్ర అమోఘమే !
అంతేనా ! నిరంతరం నీ వాళ్లకు
సేదదీర్చే చల్లని నీడవి !
ఇంటికి దీపమై విరాజిల్లే నువ్వు
నడిచే వెలుగుల దివ్వెవు !
ప్రతి ఇంటా ప్రతి మహిళా
కొలువు దీరియున్న
మహాలక్ష్మియే నంట !
నీవు నడయాడే నట్టింట
సిరుల వర్షం కురియునంట !
మహిళాదినోత్సవాలు నీ గుర్తింపునకే !
నిను కొనియాడగ కొలమానం వేరే గలదా?
నీ విలువ వర్ణింప మాటలు సరిపోవునా !
అందుకే, వనితా, ఓ వనితా !
అందుకో, వందనం ! అభివందనం 🙏

**************

1 thought on “వనితా ! ఓ వనితా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *